Saturday, 28 February 2015

మాలిక మహిళా ప్రత్యేక సంచిక - 1


మాలిక మార్చ్ 2015 సంచికను ప్రత్యేకంగా మహిళా రచయితలకు మాత్రమే కేటాయించినట్టు మీకు తెలిసినదే కదా.
కాని...
50 కి పైగా ఉన్న వ్యాసాలను ఒకేసారి ప్రచురించడం సాధ్యమైనా చదివేవాళ్లకు చాలా కష్టం కదా. అందుకే ఈసారి మాలిక పత్రిక నాలుగు భాగాలుగా నాలుగు వారాలు వస్తుంది. ప్రతీ ఆదివారం ఒకో భాగం.. కలగూరగంపలా కాకుండా ప్రతీ భాగంలో ఒకో ప్రత్యేకత..
మరి రేపటి అంటే మొదటి ఆదివారం మార్చ్ 1 నాడు విడుదలయ్యే మొదటి భాగంలో అంశాలు ఇలా ఉన్నాయి..
కవితలు:
1. సిరి వడ్డే
2. మెరాజ్ ఫాతిమా
3. అజంతా రెడ్డి
4. వనజ తాతినేని
5. వారణాసి నాగలక్ష్మి
6. బులుసు సరోజినిదేవి
7. విశాల దామరాజు
8. ఉమాభారతి
సంగీతం:
1. జయలక్ష్మి అయ్యగారి
2. భారతి
3. నండూరి సుందరీ నాగమణి
కార్టూన్స్:
1. శశికళ
3. సునీల
పెయింటింగ్స్:
1. సువర్ణ భార్గవి
ఈ వారం స్పెషల్:
1. నవీన TV9
2. లాంతరు వెలుగులొ... ఆర్టిస్ట్ సరస్వతితో ప్రత్యేక ఇంటర్వ్యూ..

Friday, 27 February 2015

ధీర 1 - మాలిక పత్రిక మార్చ్ మహిళా స్పెషల్




నేనో మామూలు అమ్మాయిని.. వరంగల్ నగరంలో పుట్టి పెరిగాను. అక్కడి బెస్ట్ కాన్వెంట్ లో చదువుకున్నాను. కాని నేను జీనియస్ ని కాదు. పెద్ద పెద్ద కోరికలు లేవు. ఏదో సాధించాలనే అభిలాష అస్సలు లేదు.. అలా చేయమని కూడా ఎవరూ బలవంత పెట్టలేదు. స్కూలు, ఇంటర్, డిగ్రి, పిజి (యావరేజి మార్కులే) అయ్యాక టీచర్ గా ఉద్యోగం చేసాను. తర్వాత ఏముంది . పెళ్లి.. కొత్త వాతావరణం. కొత్త మనుషులు... అంతా కొత్త కొత్తగా .. అత్తామామలు, కుటుంబ సభ్యులు.. పిల్లలు..
హాయిగా గడిచిపోతోంది జీవితం....
కాని... ఆ తర్వాత నా భర్త చేసిన harassment (?) కారణంగా నేను మారాను.. నా ఆలోచనలను మార్చుకున్నాను.. పి.హెచ్.డి. చేసి ఇప్పుడు 3000 పైగా ప్రొఫెషనల్స్ ని ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగాను..నా ధీసిస్ ని ఒక జర్మనీ పబ్లిషర్ పుస్తకంగా తీసుకువస్తామని మాటిచ్చారు..
ఆనాటి సాదా సీదా అమ్మాయినుండి ... నేటి అసాధారణ యువతిగా ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా ఎదగడం మధ్య ఎంతో సంఘర్షణ, సర్దుబాట్లు, తోడ్పాట్లు ఉన్నాయి..
నా మాట ఒక్కటే...
ఒక విత్తుని భూమిలో నాటగానే మొక్కగా ఎదగదు. దానికి సరైన మట్టితో పాటు, గాలి, నీరు, వెలుతురు, వాతావరణం, జంతువులనుండి రక్షణ మొదలైనవన్నీ ఉంటేనే ఆ విత్తనం ఒక ఫలవంతమైన వృక్షంగా ఎదుగుతుంది.. ....
కలుద్దాం...
మాలిక తరఫున పరిచయమవుతున్న మొదటి ధీర..
విరసీ మురిసిన సుమం.... శిరీష...

Thursday, 26 February 2015

చిత్రకారిణితో స్పెషల్ ఇంటర్వ్యూ...





దుష్టశిక్షణ, శిష్టరక్షణకై నారాయణుడు నరుడై భువిలో ఎన్నో అవతారాలు ఎత్తాడు. అన్నింటిలో కృష్ణావతారం చాలా విశిష్టమైనది. చిన్నతనంలోనే ఎన్నో మాయలు చేసి , మానవుల మాయలను తొలగించి , దుష్టశిక్షణ చేసాడు. ఒక తల్లికి ముద్దుబిడ్డగా, గొల్లభామల మనసుదోచే అల్లరికన్నయ్యగా, ఒక గురువుగా, హితునిగా, ప్రభువుగా, తండ్రిగా ఎన్నో రూపాలలో అలరించాడు.మానవుడిగా ఉంటూ ప్రతీ మానవుడిలో ఉండవలసిన సద్గుణాలను తనలోనే చూపాడు. 

దేవుడనేవాడు ఎక్కడో లేడు ప్రతీమానవుడిలో ఉన్నాడు అని నిరూపించిన కృష్ణుడిని తన గీతలలో, రంగులలో బంధించి అందమైన చిత్రాలను సృష్టిస్తున్న శ్రీమతి సరస్వతితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మార్చ్ మాలిక సంచికలో.....

Tuesday, 24 February 2015

మాలిక మహిళా ప్రత్యేక సంచిక .. మార్చ్ 2015





మాలిక మాసపత్రిక ఇంతకు ముందు ప్రకటించిన విధంగా మహిళా ప్రత్యేక సంచికగా వెలువడుతోంది.. కథలు, కవితలు, వ్యాసాలు, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతం, యాత్ర, కార్టూన్లు, ఇంటర్వ్యూలు, గేయాలు, సమీక్షలు, పరిచయాలు,సీరియల్స్ ఉంటాయి..అందరూ మహిళలే.. మరి ఈ సంచికలో తమ రచనలను అందించినవారు..


కొండవీటి సత్యవతి, వనజ తాతినేని, బులుసు సరోజిని, సిరి వడ్డే, అజంతా రెడ్డి, అల్లూరి గౌరీలక్ష్మి, మెరాజ్ ఫాతిమా, సి.ఉమాదేవి, సుభద్రవేదుల, మాలాకుమార్, పిఎస్ఎమ్ లక్ష్మి, లక్ష్మీ రాఘవ, నాగజ్యోతి రమణ, డి.కామేశ్వరి, శారదా శ్రీనివాసన్, జ్వలిత, మణి కోపల్లె, సుగుణశ్రీ, సంధ్యారాణి, గౌతమి, మధు అద్దంకి, లలితారామ్, బాలా మూర్తి, జగద్ధాత్రి, విశాల దామరాజు, దుర్గప్రియ, శైలజామిత్ర, హైమవతి ఆదూరి, లక్ష్మీదేవి, జయలక్ష్మీ అయ్యగారి, కృష్ణవేణి చారి, మాలతి నిడుదవోలు, మన్నెం శారద, అంగులూరి అంజనీదేవి, హేమ వెంపటి, మణి వడ్లమాని, పొత్తూరి విజయలక్ష్మి, డా.సీతాలక్ష్మి, వేణి మాధవి,  ఉమాభారతి, సువర్ణ భార్గవి, డా. జయశ్రీ, డా.జానకి., అజితా కొల్లా, రాధ మండువ, వారణాసి నాగలక్ష్మి, స్వాతీ శ్రీపాద, రజనీ శకుంతల, బలభద్రపాదుని రమణి, సరస్వతి, భారతి, జి.ఎస్.లక్ష్మి, శశికళ, సునీల, విశాలి.... ధీర (?) షీతల్ (Tv9)



మరో ప్రత్యేకత కూడా ఉంది. కాని కాస్త సస్పెన్స్...

Thursday, 12 February 2015

రౌడీయే కాని మంచోడే...




ఇవాళ ఒక వ్యక్తికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకోవాలని ఉంది..

మా పరిచయమే పెద్ద గొడవతో మొదలైంది. ఆరేళ్ల క్రింద అనుకుంటా తెలుగు బ్లాగుల్లో నన్ను అంతమొందించాలని వచ్చాడతను..నా మీద చాలా ఆరోపణలు, కోపం పెట్టుకున్నాడు. కాని నేను ఇదీ సంగతి నాయనా... నువ్వునుకునేవి నిజం కావు అని చెప్తే అర్ధం చేసుకుని శత్రువుల లిస్టునుంఢి నన్ను తీసేసాడు. పరిచయం పెరిగి నమ్మకమైన స్నేహంగా మారింది.. టెక్నికల్ గా ఎటువంటి సందేహమున్నా తీర్చేవాడు.. అలా సాగిపోతుండగా ఒకనాడు నేనో పత్రిక మొదలెట్టాలనుకుంటున్నాను. కాస్త సాయంగా రావా అన్నాడు... సరే కాని నాకు ఈ టెక్నికల్ విషయాలు, పత్రికల సంగతి తెలీదు. ఆర్టికల్స్ కరెక్షన్స్, టైపింగ్ లాంటివి చేసిపెడతాను అన్నా.. నాకు నచ్చకుంటే మాత్రం ఉండను అని ఖచ్చితంగా చెప్పేసా.. సరే అని ఒప్పుకున్నాడు.. పని మొదలైంది.. త్రైమాసిక పత్రిక ... మెల్లిమెల్లిగా పత్రిక పనిలోని లోతుపాట్లు తెలుస్తున్నాయి. నేర్చుకుంటున్నాను. అతని సాయం మెల్లిగా మెల్లిగా తగ్గించుకుంటూ చివరికి అతని సాయం లేకుండానే మొత్తం పత్రికను నిర్వహించే స్థితికి వచ్చాను . అఫ్కోర్స్ అతని సాయం ఉందనుకోండి.. కాని ఇక్కడ అతని కుట్ర నాకు అర్ధం కాలేదు.. పాపం వర్క్ లో బిజీగా ఉంటాడు కదా పని తగ్గిద్దాం అని చేస్తుంటే మెల్లిగా మొత్తం పత్రిక నాకు అప్పగించి నువ్వే చూసుకో. నా సాయం కావాలన్నప్పుడు మెసెజ్ పెట్టు చాలు అన్నాడు.. సరేలే మంచిదే కదా అనుకున్నా.. ... అలా నన్నునమ్మి పత్రికను నా చేతిలో పెట్టి దాన్ని అభివృద్ధి చేయడం కాదు. నన్ను నేను ఎన్నో రెట్లు మెరుగుపరుచుకుంటూ సాహితీరంగంలో ఎంతో ఉన్నతంగా ఎదిగేలా చేసాడు.. ఈ పత్రిక అదేనండి మాలిక లేకుంటే నేను మామూలు బ్లాగర్ గా , కథారచయిత్రిగా మిగిలిపోయేదాన్నేమో...

బ్లాగు అంటే నా స్వంతం కాబట్టి ఏధైనా పిచ్చి రాతలు, వాగుడు రాసుకోవచ్చు కాని పత్రిక అనేది ఒక బాధ్యత... పదిమందిలో జవాబు చెప్పుకోవాలి. అందుకే నా రాతల ప్రయాణం కూడా దిశ మార్చుకుంది. అప్పటికే నాకు పరిచయమున్నవారితో రాయమని అడుగుతూ, రాయాలనుకున్నవారిని రాయమని ప్రోత్సహిస్తూ వస్తున్నాం.. మాలిక పత్రిక ఏ ఒక్క వర్గానికి అంకితం చేయలేదు.. ఇది అందరికీ సమానంగా ఆహ్వానం పలుకుతుంది అని మీకు ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది. మాలిక పత్రిక ద్వారా చేసిన అద్భుతమైన ప్రయోగం "అంతర్జాల అష్టావధానం " ఆలోచన నాదైనా టెక్నికల్ సాధ్యాసధ్యాల సంగతి చూసుకుంది మాత్రం మాలిక టెక్నికల్ హెడ్.. ఇక్కడ లైవ్ గా అష్టావధానం జరుగుతుంటే అమెరికాలో అప్పుడే తెలవారుతున్న వేళ, సెలవు రోజైనా లేచి అవధానాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసాడు తను.. రెండువైపులా మేమిద్దరం కలిసి పనిచేయడం వల్ల మొదటిసారే ఈ ప్రయోగం అద్భుతంగా విజయం సాధించింది.. ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.. అలాగే నేను పత్రికకు సంబంధించి ఎటువంటి కొత్త ఆలోచనైనా, ప్రయోగమైనా Go Ahead అంటూ వెన్ను తట్టి, ప్రమాదాలు ఉండే అంశాల గురించి హెచ్చరిస్తూ ఉంటాడు.. ఎందుకంటే ఆల్రెడీ మాకిద్దరికీ తెలుగుబ్లాగుల్లో జరిగిన ఎన్నో గొడవల అనుభవం ఉంది.. తను ఎంతో నమ్మకంగా అప్పచెప్పిన మాలిక పత్రిక ఈనాడు నాకు ఎంతోమంది ప్రముఖుల పరిచయాన్ని కలిగించింది. సాహితీరంగంలో ప్రయోగాలు చేయడానికి వేదికగా నిలిచింది.. ఎంతో పేరును కూడా సంపాదించి పెట్టింది. నాకు గుర్తింపుగా మారింది.....

పత్రిక సాయం అని చెప్పి మొత్తం నామీద పెట్టావు ఇలాగైతే నిన్ను అడ్మిన్ గా తీసేస్తా అంటే ఇంకా మంచిది ఆ పని చేయి. నేను ఇంకో పని చేసుకుంటా అంటాడు... తను చెప్పిన ఒక మాట ఎప్పటికీ మర్చిపోలేను. గుర్తు చేసుకుంటూనే ఉంటాను.. ఎవరేమీ అన్నా, అనుకున్నా డోంట్ కేర్. యూ కీప్ మూవింగ్ అండ్ రైటింగ్.. చివరికి నీదే గెలుపు అన్నాడు కొన్నేళ్ల క్రింద.. ఆ మాట ఈనాటికీ అన్వయించుకుంటూ ఉంటాను.. మార్చడానికి వీలు లేదు మరి..

ఇంకా అతనెవరో చెప్పలేదు కదా.. అతనే తెలుగు బ్లాగుల్లో మలక్ పేట్ రౌడీగా చాలా చాలా పేరు పొందిన Bhardwaj Velamakanni...


భరద్వాజ్
ప్రతీ సంవత్సరం నా పుట్టినరోజు సమయంలో నాకంటే ఎక్కువ నా కుటుంబ సభ్యులే నువ్వు పంపే కేక్ కోసం ఎదురు చూస్తుంటారు.. అలవాటైపోయింది మరి.... నువ్వేమో Surprise చేద్దామని పుట్టినరోజునాడు అందేలా కేక్ ఆర్డర్ చేస్తే ఆ సైట్ సచ్చినోడికి తొందరెక్కువ. ఒకరోజు ముందే డెలివర్ చేస్తాడు.. smile emoticon
థాంక్ యూ బ్రదర్.. (ఫోటో చూసి భయపడకండి.. మంచోడే)

Monday, 9 February 2015

ధీర....




ధీర ...

ప్రముఖ మహిళలు అంటే ఎవరు??? తరచూ పేపర్లలో, టీవీ చానెల్స్ లో, పత్రికలలో హెడ్ లైన్స్ లో ఉండేవాళ్లా??? లేదా సినిమా, టీవీ యాక్టర్లు, యాంకర్లు, బిజినెస్ ప్రముఖులు, రచయిత్రులా???  మిగతా స్త్రీలల్లో ప్రముఖులెవ్వరూ లేరా. వారినుండి మనం తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన, స్ఫూర్తి, సాయం పొందవలసిన విషయాలేమీ ఉండవా???  మరి పైన చెప్పిన మహిళలు ఆకాశం నుండి ఊడిపడలేదు కదా. వారు కూడా సామాన్యులనుండి ఎంతో కష్టపడి  అసామాన్యులుగా ఎదిగారు..  మొదటి మెట్టునుండి ఎవరూ కూడా ఒకేసారి చివరి మెట్టు మీదకు ప్రాకి సింహాసనం మీద కూర్చోలేరు.. ఎవరైనా ఎత్తి కూర్చోబెట్టినా తొందరగా క్రింద  పడతారు కూడా..

పతివ్రతలు అంటే ఎవరు అంటే.... సీత , సావిత్రి, అనసూయ అని లిస్ట్ చదవేముందు నేను మా అమ్మా, బామ్మ అని ఎంతమంది చెప్తారు.. ప్రపంచంకంటే ముందు మన చుట్టూ చూసుకోవడం మంచిది.. ఎన్నో వింతలు, విశేషాలు, ప్రముఖులు, పెద్దవారు ఉంటారు.. ఏధైనా సాధించాలంటే మగవారికంటే ఆడవారికే ఎక్కువ శ్రమ, ఆటంకాలు, ఇబ్బందులు ఉంటాయి.. ఇది అందరికీ తెలుసు.వివరాలడగొద్దు..

సంగతేంటంటే....

మాలిక పత్రిక మార్చ్ నుండి ఒక కొత్త శీర్షిక ప్రారంభిస్తుంది... ధీర...

ఈ శీర్షికన మాలిక పత్రికలో  వీలైనప్పుడల్లా సామాన్యులలోని ప్రముఖ మహిళలను గురించి పరిచయం చేయబడుతోంది.. ఇందులో పెద్ద చదువులు, పదవులు ఉన్నవారే కాదు. ఎన్నో ఆటంకాలను, సమస్యలను ఎదుర్కొని తన పిల్లలను ఉన్నత స్థానంలో నిలపడానికి శ్రమించిన ఒక తల్లి కావొచ్చు. ఇంట్లో ఇబ్బందులు ఎన్నున్నా ధైర్యంగా ముందుకు సాగిన ఒక అమ్మాయి కావొచ్చు. ఒక ఉద్యోగి, ఒక డాక్టరు .... ఇలా ఎవరైనా గొప్ప మహిళ అనిపిస్తే వారిని పరిచయం చేయండి.. ఇది ఆడవాళ్లే రాయాలని రూలేమీ లేదు. ఎవరైనా రాసి పంపొచ్చు... అలాటి స్ఫూర్తిదాయకమైన మహిళల గురించిన మంచి విషయాలు కనీసం ఒకరిద్దరినైనా ఆలోచింప చేస్తే ఎంతో మేలు... ఈ మహిళలు తెలుగువారు, భారతీయులే కానక్కరలేదు. ఎవరైనా సరే.. ....

మీ రచనలు పంపవలసిన చిరునామా:   editor@maalika.org

Saturday, 7 February 2015

మాలిక పత్రిక మహిళా స్పెషల్ సంచిక...




మార్చ్ 8 .. మహిళా దినోత్సవం సంధర్భంగా మాలిక పత్రిక ఒక ప్రత్యేక సంచికగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను.. (క్షమించాలి నాకు ఈ దినాల మీద అంతగా సదభిప్రాయం లేదనుకోండి)..
ఈ సంచికలో అందరూ మహిళల రచనలే ప్రచురించబడతాయి..
ఈ మహిళా స్పెషల్ సంచిక కోసం మహిళలనుండి రచనలను ఆహ్వానిస్తున్నాను.
 ఏం రాయాలంటే... మీ ఇష్టం.. కధ, కవిత, యాత్ర, వ్యాసం, విశిష్ట రచన, వ్యక్తులు, పుస్తకాలు, సినిమాలు, పాటలు, సంఘటనలు, ఏదైనా మంచి టాపిక్...

ఈ నెల పన్నెండు లేదా పదిహేను వరకు మీ రచనలు పంపవలసిన చిరునామా:

editor@maalika.org or jyothivalaboju@gmail.com

On the Occasion of Women's Day in March, I would like to make my magazine Maalika a Women's Special issue..

I invite all women to write for this issue.. You can write of any special person , artist,music, literature, topic, poem, story, book, writer, incident or anything related to women... You can send ur articles in English also...

Hurry up Gals.... Lets make a big HUNGAMA ...

తెలుగు మహిళా బ్లాగర్లు - Tv9 నవీన





తలుచుకుంటే సాధించలేనిది లేదు ...

నేటి మహిళలు మారుతున్న సాంకేతిక విజ్ఞనాన్ని కూడా అందిపుచ్చుకుని తమ చదువుతో, వయసుతో నిమిత్తం లేకుండా పిల్లల సహాయం, తోడ్పాటుతో తమని తాము మెరుగుపరుచుకుంటూ, తమ ఆలోచనలను విస్తృత పరుచుకుని, అక్షరరూపమిచ్చికాగితం మీద కలాన్ని పరిగెత్తించినంత సులువుగా కీబోర్డ్ మీటలను టకటకలాడిస్తూ ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. 


అంతర్జాలం ద్వారా, బ్లాగుల ద్వారా ప్రపంచాన్ని పరిచయం చేసుకుని తమ ముంగిట్లో తీసుకురావడమే కాక తామే ప్రపంచానికి పరిచయమయ్యారు తెలుగు మహిళా బ్లాగర్లు. 


ప్రముఖ యాంకర్ ఝాన్సీ Tv9 చానెల్ లో నిర్వహిస్తున్న నవీన కార్యక్రమంలో తెలుగు మహిళా బ్లాగర్లతో చర్చా కార్యక్రమం షూటింగ్ 
జరిగింది.. — 

 Gouri Lakshmi Alluri, Kamala Paracha, Subba Lakshmi G, Uma Devi, Subhadra Vedula, Anchor Jhansi, Mani Kopalle, Psm Lakshmi and Renuka Ayola.

Friday, 6 February 2015

అక్షర సాక్ష్యం - రంగనాధ్




ప్రముఖ నటులు రంగనాధ్ గారు నటుడిగా ఎంత ప్రసిద్ధులో కవిగా కూడా సుప్రసిద్ధులే..రంగనాధ్ గారి "అక్షర సాక్ష్యం" పుస్తకం నుండి వారి కవితలు మాలిక పత్రికలో ఫిబ్రవరి సంచికనుండి ప్రచురించబడుతున్నాయి. త్వరలో రంగనాధ్ గారి కథలు కూడా మాలికలో ప్రచురించడానికి ఆయన అంగీకరించారు..

నా.. మాట

అనుభవాల హారం జీవితం
అంతరంగ సంపద అనుభూతులు!
అబ్బుర పరచే విశేషాలు
క్షోభకు గురిచేసే విషాదాలు
భయపెట్టే నిజాలు - కలవరపెట్టే యిజాలు
బాధపెట్టే నైజాలు - అర్ధం లేని ఆవేశాలు
స్వార్ధపూరిత వేషాలు- ఉద్ధరింపుల మోసాలు

అంతరంగంలో
అల్లకల్లోలం సృష్టిస్తుంటే...
సంపూర్ణ మానవత్వాన్ని
ఆహ్వానిస్తూ -
సమసమాజ నిర్మాణాన్ని
ఆకాంక్షిస్తూ -
తన బాధను, భావాలను
వ్యక్తపరుస్తూ -
సౌభ్రాతృత్వపు న్యాయస్థానంలో
కవి చెప్పేదే...
'అక్షరసాక్ష్యం'

e క్రేజీ రైటర్స్ ... ఆంధ్రజ్యోతి నవ్య


 
 
అంతర్జాలం పుణ్యమా అంటూ పలువురు సామాన్య మహిళలు రచయిత్రులయ్యారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, అంకితభావం ఉంటే చాలు అయిదు పదుల వయసుదాటినా కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని నేర్చుకొని బ్లాగులు నిర్వహిస్తూ రచయిత్రులుగా ఎదిగి పలు పుస్తకాలు రాశారు. అలా రచయిత్రులుగా మారిన బ్లాగర్‌ల విశేషాలు...

జ్యోతి వలబోజు... 2006వ సంవత్సరం వరకు సాధారణ గృహిణి. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగానే పెళ్లి కావటంతో చదువుకు అర్ధాంతరంగా బ్రేక్‌ పడింది. ఆపై ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనపాలనతో పాటు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ పనులతో ఇంటికే పరిమితమయ్యారు. తీరికవేళల్లో టీవీ సీరియళ్లకు అతుక్కుపోయేవారు. పిల్లల చదువులు అయిపోయి వారికి పెళ్లిళ్లు అయి బాధ్యతలు తీరాక, భర్త సలహాపై ఆమె కంప్యూటర్‌ నేర్చుకున్నారు. ఆపై ఆమెకిష్టమైన అంశాలపై తెలుగులో పలు బ్లాగులు ఏర్పాటు చేసుకొని, నెటిజన్లతో భావాలను పంచుకునే వారు. అలా బ్లాగులు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లతో జత కలిసిన జ్యోతి తనకిష్టమైన తెలంగాణ ఇంటి వంటలపై రెండు పుస్తకాలను రాసి రచయిత్రిగా మారారు. ‘‘మా అమ్మమ్మ ఇంట్లో చిన్ననాటి నుంచి నేర్చుకున్న వివిధ వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ వంటకాలతో ‘తెలంగాణ ఇంటివంటలు’ పేరిట రెండు పుస్తకాలు రాసి, విడుదల చేశాను. అయిదు నెలల్లోనే నా పుస్తకాలు రెండోసారి ముద్రణకు నోచుకోవటం నాకెంతో సంతోషాన్నిచ్చింది. నా పుస్తకాలకు నేను డీటీపీ చేసుకోవటంతోపాటు ఫ్రూఫ్‌, కవర్‌పేజి డిజైన్‌లను కూడా నే నే చేసుకున్నా. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయటంతోపాటు ఇతర రచయిత్రుల పుస్తకాలను ముద్రించేందుకు జేవీ పబ్లిషర్స్‌ పేరిట పబ్లికేషన్‌ను ఆరంభించా’’నంటారు జ్యోతి.

ఎన్నెన్నో బ్లాగులు

జ్యోతి వలభోజు ‘జ్యోతి’ పేరిట మొదట బ్లాగును ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకోవటం ఆరంభించారు. అలా తన కిష్టమైన వంటలు, పాటలు, ఆధ్యాత్మికం, ఫోటోలు, పజిల్స్‌, ఇలా ఒకటేమిటి? పలు అంశాలపై పలు బ్లాగులకు శ్రీకారం చుట్టారు. ‘పొద్దుగడి’, ‘జగన్నాటకం’, ‘అన్నపూర్ణ కుకరీ బ్లాగ్‌’, ‘హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌’, ‘విజయవిలాపం’, ‘నైమిశారణ్యం’, ‘జడ శతకం’, ‘షడ్రుచులు’,  ‘గురవాయణం’, ‘చైత్రరథం’,  ‘అముక్తమాల్యద’ వంటి బ్లాగులతో తనకంటూ స్నేహితులను ఏర్పరచుకున్నారామె. బ్లాగులే కాదు వివిధ కథలతో ‘మాలిక’ పేరిట ఆన్‌లైన్‌ మాసపత్రికను ఏర్పాటు చేశారు. రేపటి గురించి చింత లేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేయడం అంటే నాకెంతో ఇష్టమంటున్న జ్యోతి మధురమైన ఆ పాత హిందీ, తెలుగు పాటలు వినడం, స్నేహం చేయడం, మనసులోని ఆలోచనలను రాతలుగా నిక్షిప్తం చేయడం అంటే ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

జ్యోతిలాగే మరెందరో..

జ్యోతిలాగే మరికొంతమంది రచయిత్రులు బ్లాగులు నిర్వహిస్తూ పుస్తక రచనలకు శ్రీకారం చుట్టారు. జ్ఞాన ప్రసూన ఎనిమిది పదుల వయసులో ఉండి ‘సురిచి’ పేరిట బ్లాగు నిర్వహిస్తూ పుస్తకరచనలు చేశారు. ఇలా మాలాకుమార్‌ సైతం బ్లాగర్‌ నుంచి రచయిత్రిగా ఎదిగారు. బ్లాగులు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల ద్వారా ఇలా నిత్యం తమ భావాలను పంచుకోవటమే కాదు... బ్లాగర్లు మరికొందరు ప్రముఖ రచయిత్రులతో కలిసి ‘ప్రమదాక్షరి’ పేరిట ఓ ఫేస్‌బుక్‌ గ్రూపుగా ఏర్పడటం విశేషం. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న పుస్తకప్రదర ్శనలో పాఠకులను కలిసేందుకు వారిలో కొందరు.. మహిళా రచయిత్రులు కదిలివచ్చారు. ఈ పుస్తకప్రదర్శనలో 24 మంది ర చయిత్రులు తాము రాసిన పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ స్టాల్‌ను పుస్తకాల అమ్మకాల కంటే పాఠకులతో ముఖాముఖి, పరిచయాలు, ఇతర రచయిత్రులతో పరిచయాలు, పలకరింపులతో సందడి నెలకొంది. మహిళా రచయిత్రులే నిర్వహిస్తున్న ఈ స్టాల్‌లో పుస్తకాలు విక్రయించటమే కాదు నచ్చిన రచయిత్రితో ఓ పలకరింపు, ఓ ఫోటోగ్రాఫ్‌, ఓ ఆటోగ్రాఫ్‌ ఇస్తూ పాఠకులను ఆకట్టుకుంటున్నారు.
నవ్య డెస్క్‌


ఎనిమిది పదుల వయసులో...

‘‘నా పేరు జ్ఞాన ప్రసూన. మాది హైదరాబాద్‌. నా ఇద్దరు కుమారులు కెనడాలో స్థిరపడటంతో ఓసారి వారిని చూసేందుకు అక్కడకు వెళ్లి ఆరునెలలున్నాను. అక్కడ ఇంట్లో అందరూ ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లడంతో నేనొక్కదాన్నే ఇంట్లో ఉండాలంటే బోర్‌గా ఉండేది. అప్పుడు నా మనవళ్ల సాయంతో పాత ల్యాప్‌టాప్‌ తీసుకొని నేర్చుకోవటం ఆరంభించాను. అలా 80 ఏళ్ల వయసులో కంప్యూటర్‌ నేర్చుకొని.. తెలుగులో బ్లాగు ఏర్పాటు చేసుకొని నా భావాలను వ్యక్తికరించేదాన్ని. దీంతోపాటు ఫేస్‌బుక్‌లో మహిళా రచయిత్రులతో ఛాటింగ్‌ చేస్తున్నాను. ‘గుడిగంటలు’ పేరిట పుస్తకం రాశాను. నాకు హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్నందువల్ల హిందీ భాష నుంచి తెలుగులో అనువాద రచనలు చేస్తున్నాను. ఎంత వయసు వచ్చినా ఖాళీగా ఉండకుండా నచ్చిన రచనలు చేస్తుండటం నాకెంతో ఆనందాన్నిస్తుంది. లలిత కళల వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది..’’

పువ్వులు చెప్పే శుభాకాంక్షలు


 పువ్వులు చెప్పే శుభాకాంక్షలు

జ్యోతి వలబోజు

నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మ వంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి మా
ప్రాణము తీతువా యనుచు బావురుమన్నవి క్రుంగిపోతి నా
మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై



మల్లెలు - గులాబీలు.... బంతి - చామంతి, కనకాంబరం - సంపెంగ, కార్నేషన్స్ - డాలియా,, లిల్లీ –గ్లాడియోలస్, .. ఇలా చెప్పుకుంటూ పోతే పూలల్లో ఎన్నో వర్ణాలు. ఎన్నో అందాలు, ఎన్నో సుమధుర సోయగాలు.. అన్నీ నయనానందకరమే.. మానసికోల్లాసమే.
ప్రకృతి మనకిచ్చిన అందమైన, రంగురంగుల బహుమతులు ఈ పువ్వులు. కాసిన్ని నీళ్లు, కాస్త ఎండ, కాస్త ప్రేమ ఇస్తే చాలు మధురమైన సువాసనను, పులకింపజేసే అందమైన సొగసులతో మనలను నిత్యం అలరిస్తాయి, సంతోషాన్నిస్తాయి... అందుకే భారతదేశమైనా, ప్రపంచంలో ఏ దేశమైనా పువ్వులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పువ్వుల వ్యాపారం ఒక పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది.. అసలు మనకు పువ్వులు అంటే ఎప్పుడు అవసరం పడుతుంది. గుర్తొస్తుంది. పండగలు, పూజలు, పెళ్లి పేరంటాలు, పుట్టినరోజు, పెళ్లిరోజులు ... కాని ఇలా ప్రత్యేకమైన రోజులకు మాత్రమే కాకుండా ప్రతీ చిన్న సంతోషసమయానికి, పలకరింపులకు కూడా పూలను పట్టుకెళుతున్నారు. ఎందుకంటే ఈ పువ్వులు ఇచ్చే ఆనందం అనంతమైనదని అందరికీ తెలుసుకదా..
ఇటీవలి కాలంలో పువ్వులను అలంకరణకే కాకుండా ఎవరినైనా పలకరించడానికి వెళ్లినప్పుడు, ఆహ్వానించేటప్పుడు ఈ పూలుబుకేలు ఇవ్వడం సర్వసాదారణమైపోయింది.. పది రూపాయిలనుండి రెండు, ఐదువేలవరకు కూడా పలికే ఈ పూలబుకేలు ఆయా సందర్భాలను బట్టి, ఇచ్చేవాళ్ల ఆసక్తి, తాహతును బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరోజు లేదా మూడురోజులకంటే ఎక్కువ నిలవ ఉండని ఈ పూలకి ఇంత ఆదరణా, ఖర్చా అనుకోవచ్చు కాని ఆ పూలను వాటి అలంకరణను చూడగానే ఆ ఖర్చు సంగతే మర్చిపోతాం..
ఇక ఈ పూలబుకేల గురించి వివరాల్లోకి వెళితే....
కొన్ని రకాల పువ్వులును, ఆకులను కలిపి అందంగా అలంకరించితే అది బుకేలా తయారవుతుంది. ఈ బుకేలను చేతికి ఇవ్వొచ్చు, ఇంట్లో కాని ఆఫీసులో కాని అలంకరణకు ఉపయోగించవచ్చు. మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్య ఖర్చుకు వెనుకాడకుండా ఈ అలంకరణకు పువ్వుల వినియోగం చాలా పెరిగిపోయింది. ఈ బుకేల ఆకారం, స్టైల్ ని బట్టి, వాడిన పువ్వలను బట్టి క్రిసెంట్, నొస్ గే, కాస్కేడింగ్ బుకేలని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఈ బుకేలను ఎక్కువగా పుట్టినరోజు, పెళ్లిరోజులాంటి సంధర్భాలలో ఎక్కువగా ఇస్తారు. అలాగే పెళ్లిళ్లలో హాలు, కళ్యాణమంటపం అలంకరణకు కూడా ఎన్నోరకాల పువ్వులను విరివిగా ఉపయోగిస్తున్నారు. సాంప్రదాయకంగా, ఆధునికంగా చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలలో తయారుచేసిన బుకేలను గృహాలంకరణలో , ఆపీసుల్లో ఉపయోగిస్తారు. ఆయా ప్రాంతపు ఆచారవ్యవహారాలకు, సంధర్భాలకు అనుగుణంగా ఈ పువ్వుల ఎంపిక ఉంటుంది.
అలంకరణకు పువ్వులను ఉపయోగించడం ఈనాటి కళ కాదు శతాబ్దాల క్రితం అంటే 2500BC నుండి ఈజిప్టులో మొదలైందని చెప్పుకుంటారు. అప్పట్లో పవిత్రమైన కమలాలను ఎక్కువగా ఉపయోగించేవారట. ఇకెబానా గురించి కొత్తగా చెప్పేదేముంది. 1445 నుండి జపానులో ఈ పూల అలంకరణ ఇకెబానా ప్రాచుర్యంలో ఉందంటారు. కాలక్రమేణా ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ పూల అలంకరణం, అమరిక భౌద్ధ మునుల ద్వారా జపాన్ కు వచ్చింది. వారు చైనాలో ఉన్నప్పుడు ఈ కళను గురించి తెలుసుకున్నారంట. ప్రాచీన చైనా దేశంలో పూలఅలంకరణ ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తూ, ప్రతీ జీవం విలువైనదే అని తెలుసుకుని, గౌరవిస్తూ కట్ చేసిన పువ్వులను తక్కువగా, జాగ్రత్తగా ఉపయోగించేవారట. భౌద్ధులలో ఇప్పటికీ ఈ పువ్వల సమర్పణ ఒక సంప్రదాయకమైన ఆచారంగా కొనసాగుతుంది.
ఐరోపాలో ఈ కళ డచ్ దేశీయులలో మొదలైందంటారు. 18వ శతాబ్దంలో ధనవంతులు, రాజకుటుంబీకుల గృహాలను అలంకరించడానికి పువ్వలను ఉపయోగించేవారు. వేర్వేరు రుతువులకు, సంధర్భాలకు వేర్వేరు పువ్వులను వినియోగించేవారట. తెల్లని ప్లమ్ బ్లాసమ్ పుష్పాలను వింటర్ కి, పీచ్, చెర్రీ బ్లాసమ్ పుష్పాలను స్ప్రింగ్ కి, తామరపువ్వులను సమ్మర్ కి, క్రిసాంతిమమ్ పువ్వులను ఫాల్ సీజన్ కు ఉపయోగిస్తారు. ఇక కొన్ని సందర్భాలలో ఇప్పటికి ప్రత్యేకమైన పూల అలంకరణ ఉంటుంది. క్రిస్టియన్ పెళ్లిలో వధువు తన చేతిలో "tussie-mussie" లేదా nosegay అని పిలువబడే పూల బుకే పట్టుకుని ఉంటుంది. ఇది వారి ఆచారం. కోన్ లా తీర్చిదిద్దే ఈ పూలబుకేలో ప్రత్యేకమైన పువ్వులు, ప్రత్యేకమైన అలంకరణ వారి ప్రత్యేకమైన నమ్మకానికి ఆధారంగా వాడతారు. మరో ఆసక్తికరమైన విషయం ఉంది. పెళ్లిమంటపంలోకి వచ్చేవరకు


వధువు ఈ బుకేని (nosegay.)ని పట్టుకుని వస్తుంది. కార్యక్రమాలు మొదలైనప్పుడు వధువు వెంట ఉంటే చెలికత్తె లేదా స్నేహితురాలికి ఇస్తుంది. వివాహతంతు ముగిసిన తర్వాత ఈ బుకేని తన భుజాలమీదుగా వెనక్కి విసిరేస్తుంది. అక్కడ నిలబట్టి పెళ్లికాని అమ్మాయిలలో ఎవరు పట్టుకుంటే వాళ్లదే తర్వాత జరగబోయే పెళ్లి అంటారు.
రాయలవారి కాలంలో పుష్పలావికల గురించి విన్నాం కదా. పూలబుకేల వినియోగం విస్తృతంగా పెరిగిపోవడంతో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ పుష్పాల పరిశ్రమ Floristry గా విలసిల్లుతుంది. ఇందులో అవసరమైన పువ్వలు పెంపకం, వ్యాపారం మాత్రమే కాకుండా వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలు, వివిధ సంధర్బాలకు అనువైన, అందమైన అలంకరణలు, ప్రదర్శన, అమ్మకాలు, వాటి డెలివరీ లాంటి ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉంటాయి. హోల్సేల్ వ్యాపారులు వేర్వేరు పువ్వులను రిటైల్ వ్యాపారులకు అమ్ముతారు. వారు వివిధ అలంకరణలతో బుకేలను తయారుచేసి అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. చిన్న చిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్లు మొదలైన చోట ఈ పూలబుకేలను అమ్మకానికి పెడతారు.
ఫ్రోరల్ డిజైన్ లేదా ఆర్ట్ కి ఫ్రోరిస్ట్రి ఒకటే అనుకుంటారు కాని రెండింటికి చాలా తేడా ఉంది. కట్ చేసిన పువ్వులు, ఎండిన లేదా తాజా ఆకులు, అలంకరణకు ఉపయోగించే ఇతర పదార్ధాలతో సందర్భానికి అనుగుణంగా అలంకరించడం ప్లోరల్ ఆర్ట్ అంటారు. పువ్వులతో మొదటినుండి అంటే పెంపకంనుండి పని చేస్తూ వాటిని రిటైయిలర్ కు అమ్మేవరకు బాధ్యత తీసుకునేవారు ఫ్లోరిస్టులు అని పిలువబడతారు.ఇందుకోసం వివిధ పుష్పాల గురించి సరైన అవగాహనం వాటి పెంపకం, రక్షణ గురించిన సమాచారం మాత్రమేగాక వాటిని తాజాగా నిలవ ఉండేలా చూడడం మొదలైనవి విషయాలలో సమర్ధులై ఉండాలి. వివిధ సంధర్భాలకు వేర్వేరు పువ్వులు, బుకేల తయారి గురించి కూడా సరైన అవగాహన ఉండడం చాలా అవసరం. ప్రస్తుతం ఈ పూల వ్యాపారం చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. ఎటువంటి విద్యార్హతలు అవసరం లేని ఈ వ్యాపారం మూలంగా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. వివిధ కార్యక్రమాలు, మీటింగుల కోసం, సెంటర్ పీసెస్, స్వాగతద్వారం, రిసెప్షన్ టేబుల్స్, పెళ్లి మంటపం, వేదికలు. బిజినెస్ మీటింగులు, గెట్ టుగెదర్లు ... ఇలా అన్ని సందర్భాలలో పూల అలంకరణ అవసరం ఉంటుంది . ఇందుకు వేర్వేరు అలంకరణతో పాటు వేర్వేరు పువ్వలను ఉపయోగిస్తారు. ఇతర ప్రాంతాలు,రాష్టాలు, దేశాలనుండి కూడా పూలను దిగుమతి చేస్తున్నారు. ఈ పూల బుకేలు, అలంకరణలకు ప్రాంతాలవారిగా, దేశాలవారిగా వేర్వేరు పేర్లు ఉన్నాయి. ఆయా సంప్రదాయాలు, అందుబాటులో ఉన్న పూలని బట్టి ఎవరి స్టైల్ వారిదే.. ఉదాః ఇకెబానా, ఇంగ్లీష్ గార్డెన్, మాడర్న్, యూరోపియన్,
మొదలైనవి.
కాలానుగుణంగా లభించే పువ్వలును అందిస్తారు ఫ్లోరిస్టులు. మీకు తెలుసా? విభిన్నమైన సంప్రదాయాలలో ఈ పువ్వులకు వేర్వేరు అర్ధాలున్నాయట. అలాగే ఆయా సమయాలకు వినియోగించే పువ్వులు కూడా. బ్రిటన్, కామన్వెల్త్ దేవాలలో పాప్పీస్ అనే పువ్వులను యుద్ధంలో అమరులైన సైనికులకోసం ఉపయోగిస్తారంట. అలాగే పువ్వుల రంగులకు కూడా వేర్వేరు అర్ధాలున్నాయి. కొన్ని ప్రేమ, స్నేహం,సంతోషానికి ప్రతీకగా భావిస్తే కొన్ని చావు, విషాదాలకు అనుగుణంగా ఉంటాయంట. అందరికీ తెలిసిందే.. ఎర్రగులాబీలు ప్రేమకు చిహ్నం అంటారు. అలాగే పసుపు గులాబీలు/ పువ్వులు స్నేహానికి ప్రతీక అంటారు. తెలుపు పువ్వులు మాత్రం గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఆసియా ప్రాంతంలో ఈ శ్వేతపుష్పాలను చావు, విషాద సంధర్భాలకు వాడితే. యూరోపియన్ దేశాలలో పవిత్రత, అమాయకత్వానికి ప్రతీక అంటారు.
ప్రపంచవ్యాప్తంగా హోల్సేల్ పూల మార్కెట్లు, వేలం వేసే మార్కెట్లు చాలా ఉన్నాయి. అన్నింటికంటే పెద్దది హాలెండ్ లోని ఆల్సమీర్. తర్వాత దుబాయి ఫ్లవర్ సెంటర్, జపాన్ లోని ఓటా ప్లవర్ మార్కెట్. ఉత్తర అమెరికాలో మియామి పువ్వులకు ప్రధాన కేంద్రం అంటారు. ఇక్కడ అన్ని దేశాలనుండి పువ్వలను దిగుమతి చేసుకుంటారు. చాలామంది స్థానిక హోల్సేల్ వ్యాపారులు ఇక్కడినుండి కొనుగోలు చేసి తమ ప్రాంతాలలో చిన్న చిన్న షాపులవాళ్లకు అమ్ముతారు. న్యూయార్క్, బోస్టన్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్ణియా, కెనడాలోని టోరంటో, మాంట్రియల్, వాంకోవర్లో కూడా ఈ హోల్ సేల్ పూలవ్యాపారులున్నారు.
ఒక పువ్వుల/ఫ్లోరిస్ట్ దుకాణం నిర్వహించడానికి తగిన స్థలం ఎంపిక చేసుకోవాలి. తయారీకోసం, ప్రదర్శనకోసం ఉంచడానికి తగినంత స్థలం ఉండాలి. రోడ్డు పక్కన ఉండే ఫ్లోరిస్టులకు చిన్న చిన్న బుకేలతో పని అయిపోతుంది కాని పెద్ద బుకేలకు మాత్రం ఒక షాపులాంటిది తీసుకోవాలి. ఈ ఖరీదైన పువ్వులు తాజాగా ఉండడానికి వేడి తగలకుండా చల్లగా ఉంచాలి. కస్టమర్స్ చూడడానికి అద్దం షోకేసులు ఉండాలి. వాటిని చల్లగా ఉంచడానికి ఏ.సి , కూలర్ / చిల్లర్ లాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. తాజాగా లేకుంటే ఎవరు కొంటారు. అన్ని ప్రాంతాలకు అనువైనవి గులాబీలు, ట్యూలిప్స్, కార్నేషన్స్, ఆర్కిడ్స్, లిల్లీలు మొదలైన పువ్వులు..కొన్ని షాపుల్లో ఈ పువ్వులను మరింత అందంగా, స్పెషల్ గా గిఫ్ట్ పాక్ చేయడం, పూలు, పళ్లు, చాక్లెట్లు లాంటివి కూడా కలిపి అందంగా పాక్ చేసి కూడా ఇస్తారు.
ఈ పూలబుకేలను ఎక్కువగా క్రిస్మస్, వాలెంటయిన్ డే, మదర్స్ డే, ఈస్టర్, అడ్వెంట్, ఆల్ సోల్స్ డే, పెళ్లిళ్లు, చావులకు ఉపయోగిస్తారు. అలాగే పుట్టినరోజులు, యానివర్సరీలు, రిటైర్మెంట్ పార్టీ, గెట్ వెల్ అంటూ వివిధ సందర్భాలకు తగినట్టుగా అందం కోసం , ఆనందం కోసం వినియోగిస్తున్నారు. పది రూపాయిలకే ఒక్క గులాబీ పువ్వును కూడా కొన్ని ఆకులను కలిపి అందంగా పాక్ చేసి ఇస్తారు. అలాగే ఖరీదైన పువ్వులతో చేసే బుకేలు వేలల్లో కూడా లభిస్తాయి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడినుండైనా ఎక్కడికైనా ఎప్పుడైనా అందమైన బుకేలను పంపించవచ్చు. ఎలా అంటారా .. ఆన్లైన్లో... ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా ఈ పూల బుకేల వ్యాపారం వ్యాపించింది. ఆన్లైన్ ద్వారా కాని, ఫోన్ ద్వారా కాని ఇల్లు కదలకుండా ఆర్డర్ చేస్తే చాలు మీరు చెప్పిన సమయానికి ఆ పూలు అవతలివారికి అందుతాయి. సో సింపుల్...

Monday, 2 February 2015

మాలిక పత్రిక ఫిబ్రవరి 2015 సంచిక విడుదల

పాఠకులను అలరించడానికి , కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ కొత్త కొత్త రచనలకు అందిస్తున్న మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక విడుదలైంది.. ఈసారి  మరిన్ని విశేషమైన వ్యాసాలు మీకోసం అందిస్తున్నాము...

వచ్చేనెల మాలిక పత్రిక ప్రత్యేక సంచికగా విడుదల అవుతోంది..

మరి ఈ నెల పత్రికలోని వ్యాసాలు, కథలు, కవితలు, పద్యాలు ఏమేమున్నాయో చూద్దాం..

 01. తంగిరాల వెంకట సుబ్బారావు (ఇంటర్వ్యూ)
 02. పద్యమాలిక 5
 03. పద్యమాలిక 4
 04. పద్యమాలిక 3
 05. RJ వంశీతో అనగా అనగా
 06. అక్షర సాక్ష్యం - 1
 07. జై జై గణేశా
 08.  పరంపర, ఎటు (సమీక్ష)
 09. పిడికెడు పక్షి - వినీలాకాశం
 10. వసంతము
 11. వ్యాకరణ దీపము
 12. మాయానగరం 11
 13. మీ ఇంటికి వరండా ఉందా?
 14. Dead People dont speak..
 15. వెటకారియా రొంబ కామెడియా 6
 16. ఆరాధ్య 5
 17. శ్రీముఖ లింగేశ్వరం

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008