ఈ బిజీ బిజీ లైఫ్ లో ఆహారం మీద శ్రద్ధ తీసుకోవడం తగ్గుతుంది. అందుకే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఓట్స్ ను మీ బ్రేక్ ఫాస్ట్ లో తప్పక చేర్చుకోండి. మరి అవి ఎలా తయారు చేసుకోవాలి అంటారా? ఐతే ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ఓట్స్ వంటకాలుచూసి నేర్చుకోండి. చాలా ఈజీ..
కల్లా కపటం తెలీని అమాయకపు బాల్యం. అమ్మ కథలు చెప్తూ బతిమాలి పెట్టిన బువ్వ తిని, బుద్ధిగా స్కూలు పాఠాలు చదువుకుంటూ గడిచిపోయిన అందమైన పసితనం అది. శనివారం సగం దినం స్కూలు అంటేనే ఆ రోజు సగం, మరునాడు ఆదివారం మొత్తం పండగలా గడిచిపోయేది. కాదంటారా? ఆదివారం రాత్రి అవుతుంది అంటేనే గుండెల్లో గుబులు మొదలు. అమ్మో! రేపు స్కూలుకెళ్లాలి.. మళ్లీ సెలవులు ఎప్పుడొస్తాయో?. ఎప్పుడు వాన పడుతుందా? అని ఎదురుచూడడం. ఆ వాన కూడా స్కూలుకు వెళ్లకముందే రావాలి. రాత్రి రావొద్దు. అలా వస్తే తెల్లారేసరికి తగ్గిపోతుందిగా. మనం నిద్ర లేవకముందు మొదలై స్కూలు ఇంటర్వెల్ లేదా లంచ్ బెల్ వరకు పడితేచాలు. ఆతర్వాత మనం బయటకు వెళ్లి ఎంచక్కా ఆడుకోవచ్చుగా. వానలో ఆడుకోవాలని ఉన్నా అమ్మ వెళ్లనివ్వదుగా. తన పని చేసుకుంటూనే పిల్లలవైపు ఓ కన్నేసి ఉంచుతుంది. తగ్గినతర్వాత పాత నోట్ బుక్కులనుండి పేజీలు చింపుకుని బయటకు పరుగు. ఇంటి ముందు పారుతున్న నీటిలో పడవలు చేసి అవి వెళుతున్నంతసేపు చూడడం. అప్పుడప్పుడు స్కూలు స్క్రాప్ బుక్ లో బొమ్మల కోసం కొన్న రంగుల పేపర్లు దాచుకుని వాటితో పడవలు చేసి వదలడం భలేగా ఉండేది. రంగు రంగు పడవలు మనముందు నీటిలో కదులుతున్నట్టు, మనం దానికి ఓనరైనట్టు.. మమూలు పడవ చేయడం అందరికీ వచ్చు. అది మునిగిపోకుండా చేయాలి. అదో ఆర్టు. మళ్లీ కత్తి పడవ చేయడమంటే పేద్ద ఘనకార్యం అన్నమాట. కాగితం పడవలు నీటిలో ఎంతవరకు వెళతాయో అంతవరకు వాటి వెనకాలే అడుగులేయడం. చివరికి అవి ఎక్కడో మునిగిపోయేసరికి దిగాలు పడి , వెనక్కు పరిగెత్తుకురావడం గుర్తు లేనిదెవ్వరికంటా?. అప్పుడు వానలో, నీళ్లలో ఆడడం తప్ప వేరే ధ్యాస లేదు. తడిస్తే జలుబు చేస్తుందని అమ్మ భయం. అమ్మకు తెలీకుండా ఒక్కసారి వానలో తడిచేసి జ్వరం తెచ్చుకుంటే ఎంత బాగుండు అని కోరుకున్న రోజులెన్నో. స్కూలు వెళ్లే పనుండదు మరి.. జ్వరం వస్తే అమ్మ దేనికీ తిట్టదు. రాజమర్యాదలు. కదా.. :)
నిన్న
ప్రకృతి , ఇంకా చెప్పాలంటే ప్రతీది అందంగానే గడిచిపోయిన కాలం. వానచినుకులతో అల్లరి తప్పనిసరి. మండువేసవి దాటి తొలకరి వాన వచ్చే సమయంలో ఉండే ఆనందమే వేరు. ఇపుడు అమ్మ ఏమన్నా మనకు అంత భయం లేదుగా. వానలో తడిస్తే జ్వరం వచ్చినా డాక్టర్ ఉన్నాడు. మందులు ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనిపించే మధురమైన ఉరకలు వేసే యవ్వనం. విశాలంగా ఉన్న నీలి ఉద్యానవనంలో తెల్లని మబ్బుల తునకలు అలా తేలిపోతుంటే వాటితో పాటు పరుగుతీయాలనిపిస్తుంది. ఇక సరసన కోరిన చిన్నవాడుంటే చిలిపి ఊహలు, తరగని ఊసులు.. చెలికాని తోడున్నన్నదన్న ధీమాతో ప్రతి చెట్టు, ప్రతి పువ్వు అందంగా కనిపిస్తుంది. అలరిస్తుంది. మాతో పోటీగా హొయలు కురిపించగలవా అని సవాలు కూడా చేస్తాయి. ఆ చినుకులతో మొదలయ్యే చిరు చలి కూడ వెచ్చగా మారుతుంది. వర్షపు జల్లు కూడా ముత్యాల తలంబ్రాలుగా మారతాయి. కాదంటారా??
నేడు..
జీవితపు చివరి అంకం. బ్రతుకుపోరాటంలో ఎన్నో ఎదురీతలు. ఆటుపోట్లు. అలసినా ఆపలేని ప్రయాణంలో ఎందరో జత కలిసినా చివరిదాకా తోడుండేది ఎవరూ లేరు. ఎవరి జీవితం వారిది. అందరూ మనవారే. అందరికి మనం ఏమీ కాము. ఇప్పుడు మనకు కొత్త జీవితమేముంది. మనసు అల్లకల్లొమైంది. కానిఈ ప్రకృతి నా బంధువైంది. జడివాన తనువును, మనసును చల్లబరచడానికి కృషి చేస్తుంది. చిరు జల్లులలో కన్నీరు కలిసి వరదలా పారింది. మసకబారిన పొగమంచు ఓదారుస్తూ కౌగలించుకుంది..అదే పెనుచీకటిగా మారిపోతే ఎంత బాగుంటుంది. ఆ చీకటిలో ఎంత హాయి, వెచ్చదనం,ఆప్యాయత ఉంది. నన్ను నన్నులా అక్కున చేర్చుకుంటుంది. అందరిలా నను ఎప్పటికీ వీడిపోనంటుంది.ఒకోసారి అందులో ఐక్యమైపోవాలని ఉంటుంది. మరు నిమిషం ఆ చీకటిని చీల్చుకుని నాకు నేనే వెలుగునవ్వాలని ఉంటుంది. ప్రజ్వరిల్లి జగమంతా వెలుగు నింపాలని ఉంది. ఆ జ్వాలలోనే జ్వాలనై కరిగిపోతే ఎంత బావుండు..
నాడైనా , నేడైనా నాకున్నది ఓకే కోరిక.. ఈ వాననీళ్లు కాస్త గోరువెచ్చగా ఉంటే ఎంత బాగుండు? హాయిగా వానలో కూర్చోవచ్చు. ఆడొచ్చు.జలుబు రాదు, జ్వరం కూడా రాదు. వానపడుతుంటే మధ్యలో పెద్ద గొడుగు క్రింద కుర్చీ వేసుకుని కూర్చొని పాత పాటలువింటూ, వాన హోరును ఎంజాయ్ చేస్తూ రకరకాల ఐస్ క్రీములు, వేడి వేడి జిలేబీలు తినాలని ఆశ. ప్చ్..
కథాజగత్ కధలపోటి లోని పంతుల జోగారావుగారు రాసిన ధిక్కార స్వరం నాకు చాలా నచ్చింది. దాని గురించి కొన్ని మాటలు.
అనువుగాని చోట అధికులమనరాదు అనే నానుడి అందరికీ తెలిసిందే. కాని ఎప్పుడూ పరిస్థితులకు, వ్యక్తులకు భయపడి అణగిమణగి ఉండడం కూడా మంచిది కాదు. ఇది జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు కాని, ఉద్యోగంలో నిత్యం ఎదురయ్యే సమస్యలు కాని అవసరమైనప్పుడు మనలోని ఆలోచనలను, ఆవేశాన్ని బయటకు ధైర్యంగా చెప్పాలి తప్పదు. లేకుంటే అందరు మనని చేతకానివాడనుకుని పెత్తనం చెలాయిస్తారు. అలా అని ప్రతీసారి ధిక్కార స్వరంతో మాట్లాడం కూడా మంచిది కాదు. ఈ కథలో వామనరావు పరిస్థితి అంతే. మధ్యతరగతి మనిషిగా ఇంట్లో, బయటా,ఆఫీసులొ ప్రతీ చోట అతనికి సమస్యలే. ధైర్యంగా తన మనసులోని భవాలను మాటలుగా గట్టిగా చెప్పలేడు. ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. మనం ఎప్పుడూ తగ్గి ఉండాలి.అవతలివాళ్లు పెద్దవాళ్లు .ఎదిరించరాదు.వాళ్లు ఏదైనా చేయగలరు.మనం ఏదంటే ఏమవుతుందో? అనే సవాలక్ష సందేహాలు,భయాలు అతడిని ప్రతీ విషయంలో కృంగదీస్తాయి. ఎప్పటికీ అలా పిరికివాడిగా, భయస్తుడిగానే ఉండిపోతాడు. అతని మనుగడ కూడా అసంతృప్తిగా, నిస్సహయతగా గడిచిపోతుంది. అతని కూతురు వామనరావుకి పూర్తిగా వ్యతిరేకం. తనకు జరిగిన అన్యాయానికి బాధపడి , నిరాశ చెందక ఒంటరిగా అందరినీ కలిసి ఒక ఉద్యమం లేవనెత్తి తన స్వరాన్ని అందరికీ వినిపించింది. తండ్రి అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపిస్తుంది. తాను తన కూతురిలా ఎప్పుడూ ఎదిరించి, తన స్వరాన్ని వినిపించలేకపోయినా జరిగిన సంఘటన అతనికి సంతోషాన్నిస్తుంది. తప్పు చేయనప్పుడు,అన్యాయం జరిగినప్పుడు ధిక్కారంగా, ధైర్యంగా మాట్లాడంలో తప్పేమి లేదు. మనసులోని కుమిలిపోతుంటే ఆ వ్యధ అందరికి తెలిసేది ఎలా? అతని అభిప్రాయం అర్ధమయ్యేది ఎలా?
ఈ కథలో రచయిత చెప్పదలుచుకున్నది నీతిసూత్రం లా అనిపిస్తే అది చాలా తప్పు అని నేనంటాను. ఎందుకంటే ప్రతి మనిషి సర్వస్వతంత్రుడు. మంచిని సమర్ధించి, చెడును,అన్యాయన్ని ఎదిరించే అధికారం, హక్కు అందరికీ ఉంది. పిరికివాడు, తప్పు చేసినవాడే మరొకరికి భయపడతాడు. పెద్దవాళ్లను గౌరవించాలి, ఆదరించాలి.కాని అవసరమైన వేళలో ఏ విషయం మీదైనా తమ ధిక్కార స్వరం అందరూ ఉపయోగించాల్సిందే.. తమకు నచ్చని విషయాల గురించి ఎలుగెత్తి చెప్పాలి అన్నామాట అక్షరాలా ఆచరణీయమైనది. అనుసరణీయమైనది అని ఒప్పుకోక తప్పదు కదా.
భర్తకు ఇష్టమైన వంటకాలు తయారుచేసి అతనికి కొసరి కొసరి వడ్డించడం ప్రతీ ఇల్లాలికి ప్రియమైన పని. అతను తృప్తిగా భోజనం చేస్తే సంతోషిస్తుంది. శ్రీ వేంకటేశ్వరుడికి ఇందిరాదేవి ప్రేమతో కొసరి కొసరి వడ్డిస్తున్న దృశ్యం చూసిన అన్నమయ్య మా ఇందిరాదేవి ప్రేమతో వడ్డిస్తుండగా చక్కగా ఆరగించవయ్యా స్వామి అంటున్నాడు. ఆ స్వామికి వడ్డించిన వంటకాలు ఏంటయ్యా అంటే నేతి పాయసాలు, అప్పాలు, వడలు, చక్కెర రాసులు, మిరియపు తాళింపు పెట్టిన కమ్మని కూరలు, పచ్చళ్లు, పిండివంటలు, పాలు , పెరుగు మొదలైనవి. అంటే ఆ కాలంలో స్వామివారికి ఈ వంటకాలు నిత్యం నివేదించేవారేమో.
ఇక్కడ అమ్మావార్లు స్వామివారికి ప్రీతికరమైన వంటకాలు వడ్డించి, మధురమైన మాటలు తమ నవ్వులతో జతచేసి పతికి విందు చేస్తున్నారు. మనం పప్పు +ఆవకాయ, పప్పన్నం + అప్పడం .. ఇలా రెండు మూడు వంటకాలు కలిపి తింటుంటాం కదా. అలాగే అన్నమయ్యా శ్రీనివాసుడిని కూడా పిండివంటలను పొడిబెల్లంతో కలిపి, మీగడపెరుగు ఆవకాయ కలిపి ఆరగించవయ్యా వేంకటగిరివాసా అని నివేదన చేస్తున్నాడు.
చాలా పాత సినిమా పాట అచ్చంగా లేటెస్ట్ సినిమాలో వింటే ఎలా ఉంటుంది. బావుంటుంది .కాని ఇది ఊహ కాదు నిజమే. ఈ మధ్య మా పిల్లలు పొంమగల్ వందాల్ అనే పాట తరచూ వింటుంటే మ్యూజిక్ అది బానే ఉంది అనుకున్నా. నిన్న అనుకోకుండా దాని లిరిక్స్ నాలుగు లైన్లు బజ్ లో పెడితే దానికి ఒరిజినల్ వేరే పాట ఉందని తెలిసింది. యూ ట్యూబ్ లో వెతికితే రెండూ దొరికాయి . విని చెప్పండి ఏది బావుందో.