Wednesday, 30 April 2008

పుణుకులు

1.

ఒక రోజు ఒక తెలుగువాడు, జేమ్స్ బాండ్ కలిసి ఒకే విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరూ అమెరికావెళుతున్నారు.

తెలుగువాడు : "మీ పేరు ఏంటి?"

జేమ్స్ బాండ్: " బాండ్. జేమ్స్ బాండ్."

తెలుగువాడు: "ఒహో ! బాగుంది."

జేమ్స్ బాండ్: "మరి మీ పేరు ఏంటి?"

తెలుగువాడు: "నా పేరు సాయి. వెంకట సాయి ... శివ వెంకట సాయి... లక్ష్మీనారాయణ శివ వెంకట సాయి...శ్రీనివాసుల లక్ష్మీనారాయణ శివ వెంకట సాయి.... రాజశేఖర శ్రీనివాసుల లక్ష్మీనారాయణ శివ వెంకట సాయి.... సీరారామాంజనేయుల రాజశేఖర శ్రీనివాసుల లక్ష్మీనారాయణ శివ వెంకట సాయి... బొమ్మరాజు సీతారామంజనేయుల రాజశేఖర శ్రీనివాసుల లక్ష్మీనారాయణ శివ వెంకట సాయి..."

జేమ్స్ బాండ్ ఎప్పుడో మూర్చపోయాడు.

2.

ఒక సెలవు రోజు లింగం మావా ఊరికే ఏదో ఒక సందేహం అడుగుతూ అందరిని విసిగిస్తున్నాడు. అప్పుడతడి భార్య పిలిచి గదిలో ఒక వృత్తం గీసి అతడిని అందులో నిలబెట్టి ఒక పని చేయమంది . పని ఎప్పటికి పూర్తి కాదు. ఏంటా పని?

వృత్తం యొక్క దిక్కులు లెక్కపెట్టమంది.

3.

ఒక వ్యక్తి హైదరాబాదులో లక్డీకాపూల్ లో బస్సెక్కాడు. కండక్టర్ వచ్చి ఎక్కడికెల్లాలి అంటే ఎపుడు అమ్మాయి రాని నగరం అని చెప్తాడు. అదేక్కడుంది. మన బ్లాగర్స్ కొందరు ఆ చుట్టుపక్కలే ఉంటారు. నగరం దగ్గరే ఇంకో నగరం ఎప్పుడు మగవాళ్ళకు చాలా మర్యాద చేస్తుందంట. ఎంటవి ???

Tuesday, 29 April 2008

జలకాలాటలలో ...


సాధారణంగా నాకు నీలాకాశం, నీరు అంటే ఇష్టమే. కాని ఈత నేర్చుకోలేదు. అస్సలు నేర్చుకుంటా అని కూడా అడగలేదు మా అమ్మా నాన్నని, అది మగవారికే అవసరం అనో, మనకేదైనా ఐతే మగవాళ్ళే చూసుకుంటారు అనవసరంగా ఎందుకు కష్టపడడం అనో నేర్చుకోలేదు. కాని నాకు గుర్తున్నంతవరకైతే మా ఇల్లు చాలా ఎత్తులో ఉండేది. ఎంత భారీ వర్షమొచ్చినా ఇంటిముందు నీరు నిలవదు. అలాగే హైదరాబాదులొ వరదలొచ్చే ప్రమాదం అస్సలు లేదు. ఇంకెందుకు ఈత నేర్చుకోవడం అని నా ఉద్దేశ్యం చిన్నప్పుడే. దాని అవసరం కూడా పడలేదు ఇంతవరకు.

ఇక నేను మొదటిసారిగా నీళ్ళలో దిగింది అంటే మహానందిలోని పుష్కరిణిలో. అదికూడా స్వచ్చంగా అడుగున ఉన్న రాళ్ళు కూడ క్లియర్‌గా కనిపిస్తుంటే పర్లేదు అని.ఈత అనేకంటే హాయిగా ఆ నీళ్ళలో నడిచాను అని చెప్పొచ్చు. మరి సినిమాల్లోలాగా నీళ్ళలో దిగగానే ఈత కొడుతూ పాట పాడతారా? . అరగంట తర్వాత కాని కొట్టుకుపోతానేమో అనే భయం పోలేదు. కాని అక్కడికి మళ్ళీ నాలుగైదు సార్లు వెళ్ళినా నీళ్ళలో దిగలేదు. మావారు పిల్లలు నీళ్ళలో ఉంటే నేను పైనే కూర్చున్నా. పవిత్రమైన తిరుపతి పుష్కరిణిలో కూడ నేను అస్సలు దిగలేదు.అంతమంది దిగి స్నానాలు, బట్టలు ఉతికిన నీళ్ళు అందులోనే .. బాబోయ్. కనీసం నీళ్ళు కూడా నెత్తిన చల్లుకోలేదు ఇంతవరకు మావారు తిట్టినా సరే.

నా కల:

పైన చిత్రంలో ఉన్నట్టు కొండల నడుమ ఎటువంటి శబ్ద కాలుష్యం లేని చోట, చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఒక చిన్ని ఇల్లు.ఇంటివెనక ఒక ఈత కొలను. ఎండాకాలంలో చల్లగా, చలి,వాన కాలంలో గోరువెచ్చగా ఉండే నీళ్ళు.హాయిగా పాత పాటలు వింటూ ఒక్కదాన్నే ఈత కొడుతూ, పక్కనే ఓ షాంపేన్ బాటిల్, వేయించిన జీడిపప్పు పెట్టుకుని సిప్ చేస్తూ (మావారికి చెప్పకండే) ఎంజాయ్ చేయాలని నా తీరని (అస్సలు తీరే చాన్సే లేని) కోరిక. కలలోనే కదా నో ప్రాబ్లం.

వాస్తవం :

హైదరాబాద్ మహానగరంలో ఉన్న నీటి సమస్య తెలియనిదెవరికి. రోజుకు అరగంట వచ్చే నీళ్ళతో ఎన్ని అవసరాలు తెర్చుకోవాలి. అప్పుడే బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు కడుక్కోవడం, ఇంకా పట్టిపెట్టుకోవడం.. హాయిగా స్నానం చేసే అదృష్టం కూడానా. బకెట్ నీళ్ళతో స్నానం పూర్తి చేసుకోవాలి. అదే ఈతకొలను, వానజల్లు అనుకుంటూ. ఐనా " జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా! అహ ఏమి హాయిలే హలా" అనుకుని ఎంజాయ్ చేస్తూ ఆల్ హ్యాపీస్.

Monday, 28 April 2008

ఇంట్లోనే గ్రంధాలయం

నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేసింది మా అమ్మే. క్లాసు పుస్తకాలే కాకుండా తప్పనిసరిగా చందమామ కొనేది పేపర్‌తో పాటు. ముందు సింగిల్ పేజీ కథలు చదువుతూ మెల్లిగా సీరియల్స్ చదివేదాన్ని. పాత పేపర్లవాడు వచ్చినప్పుడు చందమామల్లోని సీరియల్ కథలన్ని కట్ చేసి ఇస్తే అమ్మ ఒక పుస్తకంలా కుట్టి పెట్టేది. అలాగే పుస్తక ప్రదర్శనలు జరిగినప్పుడు కథల పుస్తకాలు, రష్యన్ పుస్తకాలు కూడా. స్కూల్లో ఎలాగూ ఇంగ్లీషు పుస్తకాలే ఉంటాయని ఎక్కువగా తెలుగు పుస్తకాలే కొనేది అమ్మ. కాస్త పెద్దయ్యక illustrated weekly of india, Readers Digest. ఇలస్ట్రేటెడ్ వీక్లీ లో చాలా మంచి మంచి వ్యాసాలు వచ్చేవి. అవి కత్తిరించి, నా పేరు, క్లాస్ పేరు రాసి స్కూల్ నోటీస్ బోర్డులో పెట్టడం పెద్ద ఘనకార్యం (అది నా సొంతమైనట్టు , లేదా నేను అంత మంచి వ్యాసాలు చదువుతున్నట్టు బిల్డప్ అప్పుడు). ఇక ఇంటిదగ్గర ఒక ప్రభుత్వ లైబ్రరీ ఉండేది. సెలవులు వచ్చాయంటే చాలు పొద్దున్నే పదిగంటలకే తలుపులు తీసేవరకు ఎదురుచూసి అందులో దూరడం. అక్కడ ఇచ్చేది రోజుకు రెండే పుస్తకాలు. అక్కడ తెచ్చుకున్న పుస్తకాలు గంటలో చదివెయ్యడం. తెల్లారితే కాని వేరే పుస్తకాలు ఇవ్వరు. ఏం చేయాలి అని అద్దెకిచ్చే షాపులు వెతకడం. నేను మా తమ్ముడు సాయంత్రం వెళ్ళి ఎక్కువగా జానపద పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళం. అప్పుడప్పుడు ఆర్చీస్, ఫాంటమ్,రిచీ రిచ్ కామిక్స్. కాని అప్పట్లో జానపద కథలంటే భలే పిచ్చి ఉండేది. పుస్తకం ఒక్క రూపాయే కాని చదవడానికి చాలా సమయం పట్టేది. తొందరగా ఐపోదు. బుల్లి నవల లాంటివి. ఇప్పుడొస్తున్నాయో లేదో. ఇక ఊర్లకెళ్ళినా , పుస్తకాల దుకాణం కనిపిస్తే చాలు, ఎదో ఒక పుస్తకం కొనడం.ఆఖరుకు మేమున్న హోటల్లో ఐనా సరే.



అలా పెద్దవుతున్న కొద్దీ పెద్ద పెద్ద పుస్తకాలు. వార పత్రికలు.ఇంట్లో స్వాతి, మంత్లీ, యువ, చందమామ, సెలవుల్లో బాలమిత్ర, బాలజ్యోతి,ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పుస్తకాలు కొనేది అమ్మ. అవి చదవడం మొదలుపెట్టాను. అలాగే నవళ్ళు. కాని డిగ్రీ కొచ్చేవరకు కూడా కామిక్స్ తెగ చదివేదాన్ని. ముఖ్యంగా అమర్ చిత్ర కథ పుస్తకాలు.నా దగ్గర ఎప్పుడు రెండు రూపాయలున్నా ఒక పుస్తకం కొనేయడం. అలా పది, ఇరవై పుస్తకాలు కలిపి బైండింగ్ చేయించుకుని ఎప్పుడంటే అప్పుడు చదువుకోవడం. ఎవరికన్నా ఇస్తే ,మర్చిపోకుండా వెనక్కి తీసుకునేదాన్ని. నవళ్ళు అంటే తెగ పిచ్చిగా ఉండేది. చిన్న చిన్నకథలకంటే నవళ్ళు ఎక్కువగా చదివేదాన్ని. లైబ్రరీకెళితే సన్నగా ఉన్న నవళ్లు కాకుండా లావుగా ఉన్నవి చూసి తీసుకునేదాన్ని. ఎక్కువ సేపు చదవొచ్చని. కాని అది ఇంటికి తెచ్చుకున్నాక , పూర్తి అయ్యేవరకు దాన్ని వదలక పోవడం. తినేటప్పుడు కూడా చేతిలో పుస్తకం ఉండేది. మా ఇంటి దగ్గర ఉన్న అద్దె లైబ్రరీ సరిపోదన్నట్టు , నా స్నేహితురాలి ఇంటి ప్రక్కన ఉన్న లైబ్రరీనుండి కూడా నవళ్ళు తెచ్చుకోవడం. ఒకేసారి పది పుస్తకాలు తెచ్చుకుని వారం లోపే ఇచ్చేయడం. అప్పట్లో యద్ధనపూడి, మాదిరెడ్డి, ఆర్. సంధ్యాదేవి నవళ్ళు ఎక్కువగా చదివేదాన్ని.ముఖ్యంగా సంధ్యాదేవి నవల్స్. ఎందుకంటే అందులో హీరో గురించి చాలా బాగా రాసేవారు . ప్రతి నవల్లొ అతని పేరు కృష్ణతో ఉండేది. ఇక అవి చదివి కలల్లోకి వెళ్ళిపోవడం. పెళ్ళయ్యాక కూడా ఈ అలవాటు మానలేదు. కలలు కాదు పుస్తకాలు చదవడం. మావారు కూడా అభ్యంతరం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు కొనడం మొదలుపెట్టా. ఎప్పుడు పుస్తక ప్రదర్శనలకు వెళ్ళినా ఒక నవలో , వంటల పుస్తకమో తప్పకుండా కొనడం. ఊరికే పుస్తకాలు కొని, చదివాక ఏం చేస్తావ్ అని మావారంటే.. దాచుకుంటా ఐనా నేను చీరలడిగానా, సొమ్ములడిగానా అని దబాయించేదాన్ని. పుట్టింట్లో ఉన్న పుస్తకాలన్ని తెచ్చేసుకుని ఒక అల్మైరాలో పెట్టుకున్నా.



అప్పుడే విజయవాడ లోని ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వారి ఇంటింట గ్రంధాలయం పథకంలో చేరి నెలకో పుస్తకం కొనడం మొదలుపెట్టా . మావారు తిట్టినా సరే . నా దగ్గర ఉన్న డబ్బులిచ్చేదాన్ని. పాతిక రూపాయలకు ఒక నవల ఇంటికే వస్తుంటే ఇంకా కావల్సిందేముంది. ఇది చాలదన్నట్టు ఇంటి దగ్గరున్న అద్దె లైబ్రరీలో మావారికి తెలీకుండా నవళ్ళు తెచ్చుకోవడం( ఆయన ఆఫీసుకు వెళ్ళాక తెచ్చుకోవడం). ఆ లైబ్రరీలో తెలుగు పుస్తకాలు తీసుకునేది నేనే ఎక్కువ. కొన్ని నెలలకు ఆ షాపు యజమాని కొత్త నవళ్ళు తీసుకునేటప్పుడు ఏవి కొనాలో తెలీక (అతను ముస్లీమ్, తెలుగురాదు )నాకు ఇచ్చి అందులొ మంచివి సెలెక్ట్ చేసిమ్మనేవాడు. ఇంతమంచి అవకాశం ఎవరొదులుకుంటారు. ఒకేసారి పది పదిహేను కొత్త నవళ్ళు. సరే అని తెచ్చుకుని అన్నీ చదివి , అందులో మంచివి అంటే అందరూ ఆసక్తిగా చదువుతారు అనేవి సెలెక్ట్ చేసిచ్చేదాన్ని. ఇలా ఓ సంవత్సరం గడిచింది. నా పుస్తకాలను నా పట్టుచీరలకంటే జాగ్రత్తగా చూసుకునేదాన్ని. పిల్లలు , మావారు మొత్తుకున్నా సరే.. అప్పుడప్పుడు దుమ్ము దులపడం. కలరా ఉండలు వేయడం, అందులోనుండి కొన్నిపుస్తకాలు తీసి మళ్ళీ చదువుకునేదాన్ని. కాని నా లైబ్రరీని మాత్రం చుట్టాలెవరికీ చూపించేదాన్ని కాదు . నా పుస్తకాలు తీసికెళ్ళి తిరిగి ఇవ్వలేదు మరి. ఇలా పుస్తకలు కొంటూ కొంటూ , వందల కొద్ది ఉండేవి. పుస్తకాలు పాడైపోతున్నాయని పంచిపెట్టేసాను. మళ్ళీ మొదలెట్టాలి. కాని ఇప్పుడు చందమామలు, నవళ్ళ మీద అంత ఆసక్తి లేదు. వయసును బట్టి అభిరుచి మారుతుందేమో?? అలాగని స్తోత్రాలు, భజన పుస్తకాలు చదవాలని కాదు.

మన వాళ్ళంతా బ్లాగుడుకాయలే !. ( చిత్రాలు )













Sunday, 27 April 2008

ఆంధ్రజ్యోతి లో బ్లాగు భారతం




మనవాళ్లంతా బ్లాగుడుకాయలే !
- జ్యోతి వలబోజు


కాఫీ తాగారా?
'తాగాం'
పేపర్‌ చదివారా?
'చదివాం'
టీవీ చూశారా?
'చూశాం'
అన్నం తిన్నారా?
'తిన్నాం'
మరి ... బ్లాగారా?
'లేదే...'
... అయితే ఆలోచించాల్సిందే! బ్లాగడం ఇప్పుడో నిత్యావసరం. అందులోనూ తెలుగువారికి అన్నంలో ఆవకాయంత అత్యవసరం!
ఆలస్యమైపోయినా ఫర్లేదు ... పదండి ... బ్లాగేద్దాం!్ల


రాజకీయాలంటేనే చిర్రెత్తుకొస్తోందా? ఖద్దరోళ్లను చూస్తే కత్తి తీయాలనిపిస్తోందా?
'హ్యాపీడేస్‌' చూశాక కాలేజ్‌ డేస్‌ కళ్లముందు తిరుగుతున్నాయా?
లొలి ముద్దు, తొలి ప్రేమ, తొలి ఉద్యోగం, తొలి పెళ్లి చూపులు ... అబ్బా, ఒకటే గుర్తుకొస్తున్నాయా?
.... అవన్నీ మనసులోంచి తన్నుకురావడానికి తహతహలాడుతున్నాయా?
.... ఆ కబుర్లన్నీ ఎవరితో అయినా చెప్పాలనుందా, మనసు విప్పాలనుందా?
మీ స్టోరీలు వినే ఓపిక ఎవరికుంది మహాప్రభో!
పోనీ .... ఏ కథో, నవలో రాస్తే ....
ప్రచురించడానికి పత్రికలవాళ్లకి ఎన్ని దమ్ములుండాలి!
అదృష్టంకొద్దీ ప్రచురించినా .... ఎడిటింగ్‌లోనే సగం విషయం ఖూనీ!
ఎందుకన్ని ఇబ్బందులు. మీ ఆలోచనల్ని, మీ సంఘర్షణల్ని, మీ ముచ్చట్లని మీరే రాసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. మీ ఇష్టం వచ్చినంత రాసుకోండి. మీ ఇష్టం వచ్చినప్పుడు రాసుకోండి.
బ్లాగే మీ వేదిక. మీరే ఓ సంపాదకుడు.
అది చదివి తమ అభిప్రాయాల్ని పంచుకోడానికి, ప్రశంసించడానికి, విమర్శించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు.
ఇటీవలి కాలంలో మీలాంటి వాళ్లంతా బ్లాగాధిపతులైపోతున్నారు. అది లక్షాధికారులైపోయేంత కష్టం కూడా కాదు. కరెన్సీతో పనే లేదు. మీ వృత్తి ఏదైనా కానివ్వండి. మీ ఉద్యోగం ఏదైనా కానివ్వండి. ఇంజినీరు, డాక్టరు, సైంటిస్టు, జర్నలిస్టు, గృహిణి, విద్యార్థి .... మీరు ఎవరైనా కావచ్చు. మనసారా బ్లాగడానికి ఇవేవీ అడ్డంకి కాదు.

బ్లాగాలని ఉందా...
అదెంతసేపు? మహా అయితే ఐదు నిమిషాల పని.
http://www.blogger.com
http://www.spaces.live.com
http://blaagu.com
http://sulekha.కం/బ్లాగ్స్

ఈ బ్లాగు హోస్టింగ్‌ సైట్లలో ఎక్కడికెళ్లినా సులభంగా పనైపోద్ది. ఇంకేముంది, మీకు తోచినప్పుడల్లా రాసుకుంటూ పోవడమే. ఒక్కో వ్యాసాన్ని టపా లేదా జాబు అంటారు. జాబు రాసి పబ్లిష్‌ చేయగానే అది తేదీ, సమయం తదితర వివరాలతో ఒక పద్ధతి ప్రకారం బ్లాగులో కనిపిస్తుంది. దీనికి బొమ్మలు, సంగీతం, వీడియో ... వగైరావగైరా మసాలా జోడించి మరింతమంది చదువరుల్ని ఆకట్టుకోవచ్చు. ఇదంతా పెద్ద కష్టమైన పనేం కాదు. పర్సులోంచి పైసా తీయాల్సిన పని కూడా లేదు. హాయిగా తెలుగులో రాసుకోడానికి అవసరమైన సాధన సంపత్తి నెట్‌లోనే దొరుకుతోంది. ఇంగ్లిష్‌ కీబోర్డు మీద టైప్‌ చేస్తుంటే ... తెలుగు అక్షరాలు తెరమీద ప్రత్యక్షమవుతుంటాయి.

ఇవన్నీ తెలుగు తలుపులే ....
లేఖిని -http://lekhini.org
బరహ - http://baraha.com
అక్షరమాల- http://aksharamala.com

బ్లాగోతం ...
ఇప్పుడున్న తెలుగు బ్లాగుల్లో రాజకీయాలు, సామాజిక అంశాలు, సినిమా, హాస్యం, వార్తలు, సాంకేతిక విషయాలు, వంటలు, కవితలు, పాటలు ... ఇలా పలు విషయాలు చోటుచేసుకుంటున్నాయి. బ్లాగుల నిర్వహణలో మహిళలూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. కాలక్షేపం కబుర్లతో సరిపుచ్చుకోకుండా, చక్కటి విశ్లేషణలనూ అందిస్తున్నారు. చాలామంది బ్లాగర్లు తమ ఆలోచనల్ని, జ్ఞాపకాల్ని రాసుకోడానికి దీన్నో డైరీలా వాడుకుంటున్నారు. చిన్నప్పటి ఆటలు, పాటలు, అల్లరి, తొలి ప్రేమ, తొలి ముద్దు ... అన్నీ ఇక్కడ రాసుకుంటున్నారు. చదివిన వారు కూడా సందర్భోచితంగా స్పందిస్తున్నారు. తమ అనుభవాల్నీ పంచుకుంటున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, దుబాయి, అమెరికా, జర్మనీ, లండన్‌, ఆస్ట్రేలియా, అనకాపల్లి, చీరాల ... ఒకచోటనేమిటి, ప్రపంచమంతా మన తెలుగు బ్లాగర్లున్నారు. భాషాభిమానమే వీళ్లందర్నీ దగ్గర చేసింది.

బ్లాషావేత్తలు ...
'ఎవరో ఒకరు పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్‌' అన్న సంగతి మన బ్లాగర్లకు బాగా తెలుసు. అందుకే వీరలెవల్లో బ్లాషోద్యమానికి నడుంకట్టారు. ఏకంగా పదకోశం తయారు చేసే పనిలోపడ్డారు. ఇప్పటికే కొన్ని మాటలు బ్లాగర్ల నోళ్లలో నానుతున్నాయి కూడా.
రాసినవాడు ... బ్లాగరి.
రాసింది ... బ్లాగోతం.
ప్రహసనం లాంటిదే బ్లాహసనం.
రాజకీయాలు ఇక్కడ బ్లాజకీయాలు.
ఆశ ... బ్లాశ. ఫోటో ... బ్లోటో.
.. ఇలా అంతా బ్లాగ్మయమే!

బ్లాగెదనొక్కింత కొత్త ...
మనం ఎంతైనా ఇరగదీయొచ్చు. తిక్కనగారికి తిక్కరేగేలా పద్యాలు అల్లొచ్చు. శ్రీశ్రీ గారికి చిర్రెత్తుకొచ్చే పొయిట్రీ రాయొచ్చు. కానీ ఏం లాభం? ఎవరో ఒకరు చదవాలిగా! మనమేం రాశామో, ఎలా రాశామో నలుగురూ మాట్లాడుకోవాలి. అప్పుడే మనలోని కవిగారి కడుపునిండుతుంది. ఇందుకూ తగిన ఏర్పాట్లున్నాయి.
మన బ్లాగు గురించి నలుగురికీ తెలియడానికి, మనం కొత్తకొత్త టపాలు పెట్టగానే ... ఆ సంగతి తెలుసుకుని అంతా ఆ బ్లాగులోకి వెళ్లి చదువుకోడానికి 'బ్లాగు అగ్రిగేటర్‌' సహకరిస్తుంది. ఇక్కడ మనం వందలాది బ్లాగుల్ని చూసుకోవచ్చు. నచ్చిన బ్లాగులోకెళ్లి చదువుకోవచ్చు. మన అభిప్రాయాల్ని నిస్సంకోచంగా బ్లాగేయొచ్చు!
మీరు టపా రాయగానే కింది అగ్రిగేటర్లలో మీ బ్లాగు పేరుతో సహా ప్రత్యక్షమైపోతుంది (అయితే ముందుగా ఇక్కడ రిజిస్టరు చేసుకోవాలి). అక్కడికి వచ్చినవారు ఆ తీగ పట్టుకుని మీ బ్లాగులోకి వచ్చేస్తారు. మీరు రాసిందంతా చదువుకుంటారు. నచ్చిందా .... మీ అభిమానులైపోతారు. నచ్చకపోతే కటీఫ్‌!
http: //koodali.org
http: //thenegoodu.com
http: //telugubloggers.com
http: //jalleda.com


బ్లాగుంపులో గోవిందయ్యలు!
కవులకేనా అరసాలు, విరసాలు, సరసాలు అంటున్నారు బ్లాగరులు. అనడమేమిటి, తమకంటూ ఓ గూగులు గుంపును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ చౌరస్తాలోనే కలుసుకుని కబుర్లు చెప్పుకుంటారు. సలహాలు ఇచ్చిపుచ్చుకుంటారు, టెక్నాలజీని పంచుకుంటారు, సందేహాలు తీర్చేసుకుంటారు, సరదాగా జోకులేసుకుంటారు. చివర్లో బైటూ ఛాయ్‌ కొట్టేసి బాయ్‌బాయ్‌ చెప్పుకుంటారు. కొత్తగా బ్లాగులు పెట్టేవారి కోసం ఓ వీధి బడి కూడా ఉంది. ఆసక్తి ఉంటే పలకాబలపం పట్టుకెళ్లి అక్షరాలు దిద్దుకోవచ్చు. మొహమాటమెందుకు, ఓ సారి వెళ్లిరండి ...

బ్లాగు గుంపు
http: // groups.google.com/group/తెలుగుబ్లాగ్

సాంకేతిక సహాయం
http://computerera.co.in/చాట్

బ్లాగర్ల కబుర్ల కూడలి
http://chat.koodali.org

బ్లాగర్ల సంఘం వర్థిల్లాలి
తెలుగు బ్లాగర్లు ఎవరికి వారే యమునా తీరే అని కాకుండా సమష్టిగా పనిచేస్తున్న అంశాలు కూడా ఉన్నాయి. వందలాదిగా ఉన్న అందరి బ్లాగులనూ గుర్తు పెట్టుకుని రోజూ తెరిచి చూడడం శ్రమతో కూడుకున్న పని. తెలుగు బ్లాగర్లు తమ తమ బ్లాగుల్లో రాసే కొత్త జాబులన్నిటినీ ఎప్పటికప్పుడు ఒకేచోట చదవగలిగితే బాగుంటుందని ఒక బ్లాగరి (చావా కిరణ్‌)కి వచ్చిన ఆలోచనను ఇంకొక బ్లాగరి (వీవెన్‌) అమలుచేయగా ఏర్పడిందే కూడలి. తెలుగులో రాయడానికి బ్లాగరులు, వికీపీడియాలు అందరూ వాడే లేఖినిని అభివృద్ధి చేసింది కూడా ఈ బ్లాగర్లే.

హైదరాబాద్‌లో ఉన్న తెలుగు బ్లాగర్లు కొందరు ప్రతి నెలా ఒక ఆదివారం రోజు సమావేశమై ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తికి గల అవకాశాలను, అవరోధాలను గుర్తిస్తున్నారు. కంప్యూటర్లు మరింత సులభంగా తెలుగును అర్థం చేసుకోవడానికి అవసరమైన అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడానికి మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇంటర్నెట్లో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆన్‌లైన్‌ విజ్ఞాన సర్వస్వం వికీపీడియా (http://te.wikipedia.org) నిర్మాణంలో చురుగ్గా పాల్గొంటున్నదీ తెలుగు బ్లాగర్లే.
వీళ్ళంతా కలిసి 'మీ కంప్యూటర్‌కు తెలుగు నేర్పడం ఎలా?' అనే పుస్తకం కూడా ప్రచురించారు.

బ్లాగానుబంధం...
ఒకటి మాత్రం నిజం. తెలుగు మీద ఉన్న విపరీతమైన అభిమానం, తమకు తెలిసిన విషయాల్ని నలుగురితో పంచుకోవాలన్న ఆరాటం ... ఎంతోమంది కొత్త బ్లాగర్లను తయారుచేస్తోంది. మొదట్లో వీళ్లలో ఎవరికీ ఎవరితో ముఖపరిచయం కూడా లేదు. ఒక్కొక్కరూ ఒక్కో ప్రాంతంలో, ఒక్కో దేశంలో ఉంటున్నవారు. అయినా అందరూ బ్లాగుల కూడళ్లలో కలుసుకుంటున్నారు. అనుబంధాల్ని బలోపేతం చేసుకుంటున్నారు. తమకు తోచిందేదో బ్లాగుతున్నారు. 'బ్లాగు... బ్లాగు' అన్న మెప్పూ పొందుతున్నారు. ఇక్కడ మనం సగర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే మన బ్లాగుల్లో అశ్లీల, అనాగరిక ధోరణులు ఇప్పటిదాకా లేనే లేవు. వివాదాలూ తక్కువే. అప్పుడప్పుడూ వాడివేడి చర్చలు జరిగినా అవన్నీ ఆరోగ్యకరమైన ఆలోచనలే.

ఆలస్యమెందుకు, కోరస్‌గా పాడదాం రండి...
చెయ్యెత్తి జైకొట్టు బ్లాగోడా...!
భవిష్యత్తంతా మనదే బ్లాగోడా...!

కవితలు

అందమైన మహిళలు రాసే అందమైన కవితలు ... ట్యాగ్‌లైన్‌ బావుంది కదూ! ఈ బ్లాగులోని కవితలు నిజంగానే బావుంటాయి ... చదవగానే మనసుకు హత్తుకుంటాయి.

రాధిక 'మనసు భాష' చదవండి...
ఏకాంత వనంలో
ఆమె-నేను
మౌనం గలగలా
మాట్లాడేస్తుంది
మనసులు ఏమి అర్థం చేసుకున్నాయో
కన్నులు ఏమి భాష చెప్పుకున్నాయో
చిత్రంగా...
చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకున్నాయి.

స్నేహమా...
http://www.snehama.blogspot.com
దోస్తానా చిరునామా ఇది. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. పాత జ్ఞాపకాల్ని నెమరేసుకోవచ్చు. చెప్పేదేముంది, మీ ఇష్టం, మీ నేస్తాల ఇష్టం!

జ్యోతి
http:// jyothivalaboju.blogspot.com
ఇది నాదే. హైదరాబాద్‌లో గృహిణిగా ఉంటూ అందరితో బోలెడు కబుర్లు చెపుతుంటాను. చాలామంది ప్రేమగా నన్ను జ్యోతక్కా అంటుంటారు.

జానుతెనుగు సొగసులు

http://janatenugu.blogspot.com
ప్రవాసాంధ్రులు వంశీ మాగంటి బ్లాగిది. దీన్ని ఒట్టి బ్లాగు అనడం కంటే, విజ్ఞాన ఖని అంటేనే బావుంటుంది. ఇందులో సంగీతం, సాహిత్యం, జానపదం ... ఇంకా చాలా పనికొచ్చే సమాచారం ఉంటుంది.

షడ్రుచులు
http://shadruchulu.blogspot.com
తెలుగులో మొట్టమొదటి వంటల బ్లాగు ఇది. ఇందులో దాదాపు 300కి పైగా శాకాహార, మాంసాహార వంటకాలున్నాయి. తక్కువ మసాలాలతో, తక్కువ సమయంలో చేసుకోగల కూరలు, స్వీట్లు, అల్పాహారాలు, పొడులు ... వగైరా వగైరాల వివరాలున్నాయి. దేశవిదేశాల్లోని తెలుగు వారికి బాగా పనికొస్తుందీ బ్లాగు.

కొత్తగా గరిట పట్టుకొన్నవారే కాదు, తలపండిన మామ్మలు కూడా రిఫరెన్సు కోసం అప్పుడప్పడూ చూడాల్సిన బ్లాగిది.

విహారి
http://blog.vihari.net

తెలుగు బ్లాగ్లోకానికి ఆస్థాన విదూషకుడనే బిరుదున్న విహారి సృష్టించిన పక్కా నవ్వుల ప్రపంచమిది. మీ మనసు బాగోలేనప్పుడు ఈ బ్లాగును పూటకు ఓసారి వేసుకోండి, అంతా సర్దుకుంటుంది.

రెండు రెళ్లు ఆరు
http://thotaramudu.blogspot.com
చెన్నైకి చెందిన గౌతమ్‌ రాసే ఈ బ్లాగులోని ప్రతి టపా చదివిన వారిని నవ్వించకమానదని బల్లగుద్ది చెప్పొచ్చు. వాస్తవంగా జరిగిన సంఘటనలకు సున్నితమైన హాస్యాన్ని జోడించి రాస్తారు రచయిత.

అంతరంగం
http://blog.charasala.com

అమెరికాని, ఆంధ్రాని ఆవకాయతో కలిపి తింటున్నామా అనిపించేంత చక్కగా తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు ప్రసాద్‌ చరసాల. క్రమంతప్పకుండా ఎన్నో అపురూపమైన టపాలు రాస్తారాయన.

అప్పుడు ఏం జరిగిందంటే...

http://kranthigayam.blogspot.com

క్రాంతి ఈమధ్యే మొదలుపెట్టారు దీన్ని. చక్కటి, చిక్కటి హాస్యం ఆపకుండా చదివిస్తుంది. ఈ అమ్మాయి చెప్పే కబుర్లు ఎవరినైనా నవ్వించి తీరతాయి. మీ పెదాల మీద చిరునవ్వుకు నాదీ భరోసా.

పాటల పందిరి
పాత పాటలంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. ఆపాత మధురాల్ని ఆస్వాదించాలనుకునేవారి కోసం ఈ బ్లాగుల్లోని ఆడియో, వీడియో టపాలు సిద్ధంగా ఉన్నాయి.

సత్యం శివం సుందరం
http://satyamsivamsundaram.blogspot.com

గీతలహరి
http://geetalahari.blogspot.com

ఆణిముత్యాలు
http://geetalu.blogspot.com

కలగూరగంప
http://www.tadepally.com
మంచి సమాచారం, విమర్శనాత్మక ధోరణి కలగలసిన బ్లాగు ఇది. తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం పక్కా తెలుగులో పలకరిస్తారిందులో. ఇందులోనే రైతుల ఆత్మహత్యల మీద ఓ వ్యాసముంది. 'రైతుల ఆత్మహత్యలకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. నాకు తెలిసింది మాత్రం ప్రధానంగా చిన్న కమతాల సమస్య. ఎక్కడ రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నా నేను అతని అప్పుల కంటే భూమి వివరాల్నే శ్రద్ధగా చూస్తాను. వాళ్లంతా ఐదెకరాల లోపు చెలికల్ని సాగు చేస్తున్నవారే' అంటారు రచయిత.


సాలభంజికలు

http://www.canopusconsulting.com/salabanjhikalu/
తెలుగు సాహితీ వైద్యం చేసే అతి కొద్ది బ్లాగుల్లో నాగరాజు పప్పు నిర్వహించే సాలభంజికలు ఒకటి. అత్యున్నత ప్రమాణాలు దీని సొంతం. ఈ బ్లాగులో నాగరాజు 'వాక్యం రసాత్మకం కావ్యం' అంటూ ప్రాచీన కవిత్వం దగ్గర నుంచి, ఆధునిక కవిత్వం వరకూ గల భిన్నమైన పద్ధతుల గురించి చర్చించారు. ఓసారి రచయిత 'మావయ్యా కవిత్వం రాయడం సులువా, కథలు రాయడం సులువా' అనడిగితే 'రాయడం వరకూ అయితే కవిత్వమే సులువు' అని చెప్పారట ఓ పెద్దమనిషి. భలే చమక్కు కదూ!

చదువరి
http://chaduvari.blogspot.com
ఒరిజినాలిటీ అడుగడుగునా ఉట్టిపడే తెలుగు బ్లాగుల్లో ఇదొకటి. ముక్కుసూటిగా మొట్టికాయలేస్తూ అందరికీ సుపరిచితమైంది. చదువరిగా బ్లాగర్లందరికీ తెలిసిన హైదరాబాద్‌వాసి శిరీష్‌ తుమ్మల నిర్వహిస్తున్నారు దీన్ని. రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు, రాజకీయ పరిణామాలు ఎక్కువగా చర్చకు వస్తుంటాయి.


ఇ-పుస్తకం ... మీ పుస్తకం!
బ్లాగులు ఈ కాలానికి ప్రతీకలు. తెలుగు బ్లాగులు రాసిలోనే కాదు, వాసిలోనూ ఎక్కువే. తెలుగంటే ఈ తరానికి ఉన్న అభిమానాన్ని తెలుసుకోవాలంటే ఓసారి బ్లాగుల వైపు చూస్తే అర్థమవుతుంది. చక్కని పద్యాలు, కథలు, వ్యాసాలు, చతుర్లు, చమక్కులు ... అన్నీ బ్లాగులలో ఉంటాయి. అలాంటివి కొంతమందికే ఎందుకు, అందరికీ చేర్చాలనే ఆలోచనే ఈ బ్లాగు పుస్తకానికి నాంది. బ్లాగరులు సమష్ఠిగా రాయడమే కాదు, కలిసి పని చేయగలరని చెప్పడానికి ఈ పుస్తకమే నిదర్శనం. చక్కని టపాలు స్వీకరించి, వాటిని కూర్చి, ముఖ చిత్రం తయారు చేసి, అందంగా ఫార్మాటు చేస్తే వచ్చిన పుస్తకం ఇది. బ్లాగర్ల గురించి, తెలుగు బ్లాగుల గురించి అందరికీ తెలియజేసి తెలుగులో రాయడానికి ప్రేరేపించడమే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం. ఈ బ్లాగు పుస్తకంలో హాస్యం, కవిత, కథ, రాజకీయాలు, సినిమా, సాంకేతికం, అనుభవాలు, వ్యాసం, ఆలోచన అనే వివిధ విభాగాల్లో అందరి ఆదరణ పొందిన వ్యాసాలు సుమారు 260 పేజీల్లో పొందుపరిచాం. ఇది తెలుగువారికి ఇవ్వగల ఒక అందమైన బహుమతి అని చెప్పవచ్చు. ఈ ఇ-పుస్తకాన్ని

http://employees.org /praveeng/telugubolgbook/telugublogbook.pdf నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Friday, 25 April 2008

పురాణాలు ఎం చెప్తున్నాయి ???

నేను చదివిన కొన్ని పురాణగాధలు, కథలు బట్టి నాకు కలిగిన కొన్ని సందేహాలు ఇవి.


రాముడు సకల గుణాభిరాముడు. అందరు అతడిని ఆదర్శంగా తీసుకోవాలి అంటారు కదా. ఏంటా ఆదర్శాలు? ఒకటే బాణం, ఒకటే మాట, ఒకే పత్ని.కాని అతను చేసిన పెద్ద తప్పు మాత్రం ఎవరూ ఎత్తి చూపరు. భార్యను అనుమానించడం.ఒకటి కాదు రెండు సార్లు. అదేంటంటే దానికో పిట్టకథ చెప్తారు. కొత్తపెళ్ళికూతురైనా కూడ భర్తతో వనవాసం చేసింది. పదమూడేళ్ళు కలిసి అడవుల్లో తిరిగారు. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిన సంవత్సరం తర్వాత చెరనుండి విడిపించబడింది.సీతారాములు విడిపోయి చాలా బాధపడ్డారు . వీరుడిలా రాముడు వెళ్ళి రావణాసురుడిని చంపి, తన భార్యను విడిపించాడు.కాని అగ్నిపరీక్ష ఎందుకు చేయించాల్సి వచ్చింది? లోకానికి సీత పతివ్రత, అగ్నిపునీత అని నిరూపించడానికి అంటారు. అస్సలు సీత మీద అనుమానం ఉంటే భర్తకు ఉండాలి.లోకానికెందుకు నిరూపించాలి. అలాగైతే రాముడు ఎలాంటి పరీక్ష ఇవ్వక్కరలేదా. అతను కూడా భార్యకు దూరంగా ఉన్నాడు కదా. మరి సీత ఎందుకు అనుమానించలేదు. సరే తర్వాత తన రాజ్యానికి వెళ్ళాక కొంత సమయం గడిచాకా ఎవడో చాకలోడు తాగి అన్నాడని , నిండు గర్భిణి ఐన సీతను అడవిలో వదలి రమ్మని లక్ష్మణుడికి చెప్పాడు. ఇదేనా పతి ధర్మం. అందునా ఏకపత్నీవ్రతుడు ..భార్యను అనుమానించి పంపడమెందుకు, మళ్ళీ ఆవిడకోసం బాధపడడమెందుకు. పైగా కాంచనసీతను పెట్టుకుని యాగం చేసాడని పొగుడుతారు. తన భార్య ఎలా ఉందో తెలుసుకున్నాడా అస్సలు. సరే.. పిల్లలతో యుద్ధం చేసిన తర్వాత నిజం తెలిసింది. వాళ్ళు తన పిల్లలే అని. సీతను కలుసుకున్నాడు. కాని అభిమానవంతురాలైన సీత తల్లి ఒడికి చేరుకుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని అబ్బాయిలకు చెప్తారే కాని భార్యను అనుమానించడం కూడ ఆదర్శమేనా? కట్టుకున్న భార్య శీలాన్ని అనుమానించడం అనేది ఎంత అవమానకరమో మగాళ్ళకు అర్ధమవుతుందా? మహాతల్లి ఎంతలా బాధపడిందో కథ రాసినవాళ్ళకు తెలుసా?


ఇక మహాభారతానికి వస్తే..


ఎవరు బుద్ధిమంతులు కారు.భార్య ఉన్నా కూడా, ఆవిడను రాజభవనంలో ఉంచి వెళ్ళిన ప్రతీ ఊరిలొ పెళ్ళి చేసుకోవడం. పాండవులు కూడా ద్రౌపది కాకుండా వేరే భార్యలు ఉన్నారు. కాని తన ప్రమేయం లేకుండా ఐదుగురికి భార్య ఐన ద్రౌపదిలా మళ్ళీ ఎవరికీ బహు భర్తృత్వం ఉండకూడదని ధర్మరాజు శాపం ఇచ్చాడంట. నిజమో కాదో తెలీదు. మగవాళ్ళు తమ మానాన తాము ఇష్టమున్నట్టు పెళ్ళిల్లు చేసుకోవడం. కాని మొదటి భార్య మనోభావాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకున్నారా? తన భర్తను ఎంతమంది స్త్రీలతో పంచుకోవాలో ఆమెకే తెలీదు. ఆమె మాత్రం పతివ్రతలా వంచిన తల ఎత్తకుండా ఉండాలి. అలా అని ఆవిడ కూడ ఎక్కువమందిని పెళ్ళి చేసుకోమని కాదు.



పెద్దలు చెప్పే నీతులన్నీ ఆడాళ్ళకేనా? కుమారీ శతకంలో పెళ్ళి కాబోయే అమ్మాయికి ఎన్నో నీతులు చెప్పారు. చివరకు భర్త చనిపోతే ఆవిడ కూడా సహగమనం చేయాలని. మరి ఆవిడ పిల్లల గతేంటీ? మరి కుమార శతకంలో భార్యను ఎలా చూసుకోవాలి అని మాత్రం చెప్పలేదు. సమాజంలో ఎలా ఉండాలో మాత్రమే చెప్పారు?



ఇదంతా నేను ఏదో పండితురాలిని అని తప్పులు ఎత్థి చూపడంలేదు.పిల్లలకు మంచి విషయాలు చెప్పాలంటే పురాణాలే ఉదాహరణగా చెప్తాము కదా? మరి వాటిల్లోని మంచి కంటే చెడు త్వరగా గ్రహించుకుంటారు? అలాంటప్పుడు వీటిని మార్గ దర్శకాలుగా ఎవరికైనా ఎలా చెప్పగలము.మనలాగా పిల్లలు చెప్పినవన్నీ సరే అని తలాడించి ఒప్పుకోవడం లేదు. అందులోని తప్పొప్పులు ఎత్తి చూపించి సమాధానం అడుగుతున్నారు మరి?

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008