అనగనగా అప్పుడెప్పుడో కొత్తపాళిగారు ఐడియాలు ఇచ్చి కథ రాయండర్రా అని చెప్పేవారు గుర్తుందా??? కథ ఎలా రాయాలో తెలీకున్నా ప్రయత్నిస్తే పోయేదేముంది అని నేను రాసాను. బహుమతి రాకున్నా తిట్లు మాత్రం పడలేదు. నయం. గత అక్టోబర్ లో ఇచ్చిన ఒక వినూత్న ఫాంటసీ కథ పోటీకోసం నేను రాసిన కథ నిన్నటి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం లో ప్రచురించబడింది. నేను ఊహించింది వాస్తవం అయ్యే చాన్స్ లేకపోవచ్చు కాని ఇలా జరిగితే బావుంటుంది కదా అనే చిన్ని ఆలోచన ఈ కథ రాయడానికి ప్రేరణ కలిగించింది. అంతకు ముందు రెండు సార్లు కథలు రాసినా, ఈ సాంకేతిక, ఫాంటసీ విషయాలు నా తలకేక్కేవి కావులే అని ముందు ఊరుకున్నాను. కాని కొత్తపాళిగారి ఐడియాతో పాటు తాడేపల్లి గారి వ్యాఖ్య కూడా నన్ను ఈ కథ రాయడానికి ఉత్సుకత కల్పించింది.
ఇదే అంశం మీద మరికొందరు బ్లాగర్లు రాసిన కథలు కూడా చదవండి..
ఇంత మంచి ఐడియా ఇచ్చి, కథ ఎలా రాయాలో మెళకువలు చెప్పిన కొత్తపాళిగారికి నా ఈ మొదటి కథ గురుదక్షిణగా సమర్పిస్తున్నాను....
"షాలినీ! వంటైందా? ఆఫీసుకు లేట్ అవుతుంది. రోజూ పొద్దున్నే అరుస్తూ ఉండాలి. ఒక్క పని టైం మీద చేయవు?. పెళ్ళిచూపుల్లో మీవాళ్ళు "మా అమ్మాయి వంటలు బాగా చేస్తుంది, ఇల్లు చక్కగా ఉంచుకుంటుంది. అని తెగ కోతలు కోసారు. చదువు, అందం, కుటుంబం, అన్నీ చూసి పెళ్ళి చేసుకుంటే నా బ్రతుకు ఇలా తెల్లారింది. రోజూ లేట్ అవుతుంది.ఆఫీసులో తిందామంటే అదో అడ్డమైన గడ్డి. ఖర్మ . ఖర్మ.."
" ఇదేంటి ! ఈ సోఫా కవర్లు ఇంకా మార్చలేదు. ఆ టివి మీద దుమ్ము కనపడటంలేదా? ఇంట్లో ఉండి ఏం చేస్తావ్ పొద్దంతా. టీవీ చూడటం తెలుసు ఆ దుమ్ము దులపడం రాదా? ప్రతీది చెప్పాలి. " అని విసుక్కుంటూ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు రమేష్.
"అవును ! ఖర్మ గాక మరేంటి? మీరేమో అన్నీ తెలుసుకుని, చూసి పెళ్ళి చేసుకున్నారు మరి నాకలా లేదే. అమ్మానాన్న చూసి నచ్చికట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేసారు. తప్పదురా భగవంతుడా అని సర్దుకుపోతున్నా కూడా రోజూ ఏదో ఒక తప్పు వెతకడం. ఏ పని చేసినా వంకలు పెట్టడం. నాకు నచ్చిన మొగుడిని వెతుక్కుంటే ఈ బాధ ఉండకపోను. జీవితాంతం ఇలా సర్దుకుపోతుండాల్సిందేనా..??" అని తనలో తానే గొణుక్కుంటు ఇల్లు సర్దడం మొదలుపెట్టింది షాలిని.
************
"హాయ్! మీనా! ఎలా ఉన్నావు? ఏంటి నీకు పెళ్ళి చూపులు జరిగాయంట . అబ్బాయి ఎలా ఉన్నాడు. సంబంధం కుదిరిందా?
" అబ్బాయి బానే ఉన్నాడు. ఇంకా ఏమీ అనుకోలేదే రాజీ! ఆ మధ్యవర్తి చెప్పింది చూస్తే అన్నీ బాగానే ఉన్నాయనిపిస్తుంది. కాని ఎన్ని నిజమో , ఎన్ని అబద్ధమో? నాకేమీ పాలుపోవటం లేదు. నాన్నగారేమో! అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు. చెడు అలవాట్లు లేవు. ఒప్పుకుంటే మంచిది అంటున్నారు. నాకేమో భయంగా ఉంది. సంపాదన బానే ఉన్నా. చెడు అలవాట్లు లేవు అనగానే ఎలా నమ్మేది ఈ రోజుల్లో? తర్వాత బయటపడితే నా బ్రతుకు తెల్లారిపోతుంది కదా? నా అంత నేనుగా అతని గురించి తెలుసుకోవాలంటే కష్టం కదా? పెళ్ళి అంటే రిస్క్ తీసుకోవాల్సిందేనా.?"
" అవునే మీనా! పెళ్ళి ఒక రిస్కే. మనచేతిలో ఏది ఉండదు. అన్నింటికి అడ్జస్ట్ కావాల్సిందే. నాకు రోజు ఈ గొడవ తప్పడంలేదు. నేనేమో ఉద్యోగం నిర్వహణలో రోజూ ఎందరితోనో మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడైనా అర్జెంట్ పని ఉండి ఎవరైనా ఇంటికి కాల్ చేస్తే మా ఆయనతో చచ్చే గొడవ. నేను తెచ్చే జీతం కావాలి కాని నేను మగాళ్ళతో ఫ్రీగా మాట్లాడొద్దు అంటాడు. నాకు ముందే ఈ సంగతి తెలిసుంటే అస్సలు పెళ్ళి చేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఏమీ చేయలేను " అంది రాజీ.
*************
"అబ్బబ్బా! రోజూ ఈ ఆఫీసు, ఇంటిపనితో చచ్చిపోతున్నాను. ఆ పనిమనిషి సరిగ్గా రాదు. ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ అని ఎప్పుడు తింటానో. ఎప్పుడు ఇంటికొస్తానో కూడా తెలియటంలేదు. ఆఫీసు పనయ్యాక, ఇంటికెళ్ళే ఓపిక కూడ ఉండదు ఐనా వెళ్ళి మళ్ళీ ఇంటిపని చూడాలి. క్రష్ నుండి పాపను తీసికెళ్ళి వంట చేసి ఇల్లు సర్దుకోవాలి. అయన ఒక్క పనిలో సాయపడరు. ఏమంటే నా బిజినెస్ టెన్షన్స్ నాకున్నాయి అంటారు. . ఉద్యోగం, ఇంటిపనితో ఒళ్ళు హూనమైపోతుంది ." అనుకుంటూ వంట చేస్తుంది కావ్య.
"ఏమోయ్! వంట ఐందా. ఆకలి దంచేస్తుంది. ఇంకా ఎంత సేపు?" అవునూ. వచ్చే నెల్లో ప్లాస్మా టీవీ కొందామా?" అడిగాడు భర్త రాజు.
" ఆ వచ్చే ! ఐపోయింది !. అందంగా ఉన్నాడు, మంచి బిజినెస్ ఉంది అని పెద్దలు చెప్తే , పెళ్ళి చేసుకుని ఇప్పుడు అనుభవిస్తున్నాను. తను సంపాదించేది సరిపోదన్నట్టు నన్ను కూడా ఉద్యోగం చేయిస్తున్నారు. ఏమంటే అన్నీ ఆడంబరంగా ఉండాలి అంటారు. . బజారుకెళ్ళి నచ్చిన చీరో,నగో కొనుక్కునే అవకాశం ఉంది కాని నచ్చిన మొగుడిని వెతుక్కునే అవకాశం ఆ భగవంతుడు ఆడవాళ్లకు ఇవ్వలేదు " అనుకుంటూ భర్తకు , కూతురుకి భోజనం పెట్టసాగింది కావ్య.
***************
"ఒసేయ్ ! కనకమ్మా! ఎక్కడ చచ్చావే? తొరగా నాకు అన్నం పెట్టు. థూ నీయమ్మ. ఎప్పుడు చూసినా చారు,పచ్చడి మెతుకులే . సంపాదించినదంతా ఏం చేస్తున్నావే?" మొగుడికి కమ్మగా వండిపెడదామన్న బుద్ధి లేదు?" తాగి వచ్చిన మొగుడి అరుపులు విని కోపంతో రెచ్చిపోయింది కనకమ్మా. "ఏంట్రా? తాగి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నావ్?, సంపాదించినదంతా తాగుడుకు, మట్కాలకు పెట్టేస్తావ్ సిగ్గులేని జన్మ.ఇంకా నీకు కోడికూర, చాపల పులుసు పెట్టాలా ? పెట్టింది తిను. అదే ఎక్కువ. చేసుకున్నందుకు జన్మంతా భరించక తప్పదని ఊరుకున్న. లేకుంటే ఎప్పుడో తన్ని తగలేసేదాన్ని. నువ్వు ఇలా
తాగుబోతువని తెలిసుంటే చావనైనా చచ్చేదాన్ని కాని,నిన్ను చేసుకునేదాన్ని కాదు" అని మొగుడిని తిట్టి వెళ్ళి పడుకుంది కనకమ్మ.
ఇలా చాలా మంది మహిళలు తమకు నచ్చని, తమ అభిరుచులకు అనుగుణంగా లేని భర్తలతో వేగలేక, విసిగిపోయి కనీసం తమ కూతుళ్ళకైనా ఇలాంటి పరిస్థితి రాకుండా ఏదో ఒకటి చేయాలి అని నిశ్చయించుకుని , ఆ కాలనీలో ఉన్న అరుణక్కను కలిసారు. ఆవిడ ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. వాళ్ల గోడు విన్న అరుణక్క " ఎందుకు మీరు అంత ఖంగారు పడతారు. ఐపోయిందేదో అయింది. మీలాంటి పరిస్థితి మీ కూతుళ్ళకు రాకుండా ఉండేలా మీరు ప్రయత్నించొచ్చు. ఇన్నేళ్ళు మీ మొగుళ్ళ కోసం మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం అలా ఎన్నో నోములు , వ్రతాలు చేస్తున్నారు కదా. అలాగే ఈ సమస్య కోసం కూడా ఆ లక్ష్మీదేవిని ప్రార్ధించి వ్రతం చేయండి. మనస్పూర్థిగా చేస్తే ఆ అమ్మవారు తప్పకుండా మీ కోరిక తీరుస్తుంది. ఒక వ్రతం ఉంది, దాని పేరు " మై చాయిస్" అంటే మీకు నచ్చిన మగాడినే మీరు మొగుడిగా చేసుకోండి" అని ఆ వ్రతానికి కావల్సిన పూజసామగ్రి, వ్రతవిధానం వగైరా అన్నీ చెప్పింది.
ఇంత మంచి వ్రతం గురించి తెలుసుకున్న అందరు ఆడవాళ్ళూ తమ స్నేహితులకు మొబైల్, SMS, Orkut ద్వారా చెప్పుకుని అందరు కలిసి ఒకే రోజు. ఒక మినీ హాలులో వ్రతం చెసారు. అంతమంది ఆడాళ్ళు కలిసి " ఈ మొగుళ్ళతో వేగలేము తల్లీ ? " అని మొరపెట్టుకుంటే ఆ తల్లి ఊరుకుంటుందా ??..
******
అల వైకుంఠపురములో శేషశయనుడై అరమోడ్పు కనులతో చిరునవ్వు చిందిస్తున్న శ్రీహరిని చూచి లక్ష్మీదేవి
"స్వామీ!" అని గోముగా పిలిచింది.
"ఊ! చెప్పు దేవి!"
"స్వామీ! వింటిరి కదా! నా భక్తురాళ్ల మనోవేదన. దానికి పరిష్కారం లేదా? భక్తపరాయణుడు కదా? దీనికి పరిష్కారం చూపలేరా?"
" అదే ఆలొచిస్తున్నా దేవీ! మీ భక్తురాళ్లకు ఆవేదన ఉండుట మాకుకూడా సంతోషము కాదు."
అంతట అయ్యవారు బ్రహ్మను పిలిచి " కుమారా! త్వరగా ఈ సమస్యను తీర్చే ఉపాయం ఆలోచించు. లేకుంటే పుట్టగతులుండవు. లేడీ కస్టమర్ల సమస్యలు వెంటనే తీర్చాలి . జాగ్రత్త. " అని హెచ్చరించాడు . అప్పటికే దివిలో కూడా అంతా కంప్యూటరైజ్డ్ ఐపోయింది. ముఖ్యంగా బ్రహ్మ తన సృష్టి కార్యకలాపాలు అన్నీ టైం మీద చెసుకోలేకపోతున్నానని ఒక సూపర్ కంప్యూటర్ ఏర్పాటు చేసేసుకున్నాడు. తీవ్రంగా ఆలోచించి ఉన్నవాళ్లని మార్చడం వీలు కాదు అని, పుట్టబోయే ప్రతి అబ్బాయికి ఒక విచిత్రమైన చిప్ ఏర్పాటు చేసాడు. ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాక , ఎవరైనా అమ్మాయి అతడిని మెచ్చి తన భర్తగా చేసుకోవాలని అనుకుంటే ఆ అబ్బాయి గుణగణాలు, చదువు, ఉద్యోగం, జీతం, బ్యాంక్ బాలన్సు, అప్పులు, మొదలైన వివరాలన్నీ ఆ అబ్బాయి నుదుటిలో LED డిస్‌ప్లే లో కనిపిస్తాయి. వాటి ఆధారంగా అతడిని పెళ్ళి చేసుకోవాలో , వద్దో అని అమ్మాయి నిర్ణయించుకోవచ్చు.
పాతికేళ్ళ తర్వాత...
పెళ్ళిచూపులు జరుగుతున్నాయి.
" అమ్మాయిని తీసుకురండి." పెళ్ళికొడుకు తండ్రి అన్నాడు. అమ్మాయి వచ్చి అందరికి నమస్కరించి కుర్చీలో కూర్చుంది. "రాజారాంగారు! మీకు తెలియనిదేముంది. మా అమ్మాయి ఇంజనీరింగ్ చేసి పెద్ద కంపేనీలో ఉద్యొగం చేస్తుంది. పాతికవేల జీతం. అందుకే కట్నం ఇవ్వదలుచుకోలేదు. నా దగ్గరున్న ఆస్థి పిల్లల చదువులకే పెట్టుబడి పెట్టాను. తన జీతమే మీకు కట్నం అనుకోండి. కానీ అమ్మాయికి నచ్చితేనే ఈ పెళ్ళి ముచ్చట్లు ముందుకు కదిలేది." అని మెల్లిగా చెప్పాడు పెళ్ళికూతురు తండ్రి సుబ్బారావు. పెళ్ళికూతురు తల ఎత్తి అబ్బాయిని చూసింది. "పర్లేదు, బానే ఉన్నాడు. మంచి ఫ్యామిలీ, పెద్ద ఉద్యోగం అని తెలిసింది. ఇతడిని చేసుకుంటే బానే ఉంటుందా?" అని అనుకుంది. అప్పుడు విచిత్రంగా ఆ అబ్బాయి నుదురుమీద ఒక LED స్క్రీన్ ప్రత్యక్షమైంది. అందులో " చదువు-పి.జి, ఉద్యోగం మేనేజర్, జీతం - యాభైవేలు, అప్పులు లేవు, ఆస్థి - ఒక ఫ్లాట్, బైకు, బ్యాంకు బ్యాలన్సు - పది లక్షలు, సిగరెట్ మాత్రం అప్పుడప్పుడు తాగుతాడు. బుద్ధిమంతుడు , కాని చాలా మెతక మనిషి. అమ్మ చేప్పిందే వేదం అతనికి " అని కనిపించింది. " అన్నీ బానే ఉన్నాయి. అమ్మ చెప్పినట్టు వినేవాడైతే నేను చెప్తే వినేలా చేయడం అంత కష్టమేమీ కాదు " అనుకున్న అమ్మాయి లోపలికి వెళ్ళి తల్లికి ఓకె అని చెప్పింది. కట్నకానుకలు లేకుండా మరుసటి నెలలోనే వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది.
లత, రామకృష్ణలు మంచి స్నేహితులు. కాని పెళ్ళి గురించి ఆలోచించలేదు. ఒకరోజు వాళ్లిద్దరు గుడిలో కలుసుకున్నారు. "లతా! మనం ఒకరికొకరు బాగా అర్ధం చేసుకున్నామనుకుంటా.నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. మన పెద్దలకు చెప్పి పెళ్ళి చేసుకుందాము. ఏమంటావు?" లత కొద్ది సేపు ఆలోచించింది పాప్‌కార్న్ తింటున్న రామకృష్ణను తదేకంగా చూసింది. అప్పుడు అతని నుదురుపై LED స్క్రీన్ కనిపించింది. అందులో అతని జీతం - 15,000, ఆస్థి - ఒక ఇల్లు, అప్పులు - 50,000, బ్యాంకు బ్యాలన్సు - 4000, ఇద్దరు చెళ్ళెల్లకు చేయాల్సిన పెళ్ళిల్లు, ఆడంబరాలంటే ఇష్టం లేదు. భార్య కూడా పనిచేస్తే తనకు కష్టాలు కాస్త తగ్గొచ్చు ఉన్నదాంట్లోనే సర్దుకుపోయే భార్య కావాలి " అని కనిపించింది. అప్పుడు లత " నేను చేసిన డిగ్రీకి ఏముద్యోగం వస్తుంది. నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఆఫీసులో, ఇంట్లో చేయడం నా వల్ల కాదు. పైగా ఇన్ని బాధ్యతలు. అమ్మో నావల్ల కాదు." అని అనుకుని "సారీ రామకృష్ణ ! నేను పెళ్ళి గురించి ఇంకా ఏమీ ఆలొచించలేదు. మావాళ్ళు ఒప్పుకుంటారనుకోను. పెద్దలను ఎదిరించడం నాకిష్టం లేదు. మనం మంచి
స్నేహితుల్లా ఉందాము" అని లేచి వెళ్ళిపోయింది.
*******
అక్కడ స్వయంవరం జరుగుతుంది. అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి కదా. అమ్మాయిలు తాము కోరుకున్న లక్షణాలు గల అబ్బాయిలను వారి నుదుటిపై కనపడే LED స్క్రీన్‌ల పై చూసి మెచ్చేసారు. అబ్బాయిలకు తమకు అమ్మాయి నచ్చినా , అమ్మాయికి తాను నచ్చుతానో లేదో అన్న టెన్షన్ ఉంది. చివరికి సగం అబ్బ్బాయిలను ఏ అమ్మాయి నచ్చలేదు. అందరూ పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారే. కాని అమ్మాయిలకు వాళ్ళు తగినట్టుగా లేరు మరి.
రాజేంద్ర ఒక పెద్ద కంపెనీలో సిఏ గా పని చేస్తున్నాడు. అతడిని పెళ్ళి చేసుకోవాలని వచ్చిన గీతకు " చదువు సి.ఎ. పెద్ద కంపెనీలో ఉద్యోగంకారు, ఇల్లు, ఆస్థి గట్రా బాగానే ఉన్నాయి. కాని అనుమానం ఎక్కువ. తన భార్య ఉద్యోగం చేయకూడదు. ఇంట్లోనే ఉండి అందరిని బాగా చూసుకోవాలి. " అని కన్పించింది. అది చూసిన గీత ఇలాంటి అనుమానం మొగుడు నాకొద్దు అంటూ చీకొట్టింది అందరి ముందు. అది చూసిన ఏ అమ్మాయి అతని వైపుకు రాలేదు. చాలా సేపు చూసి వాళ్లు అవమానంతో ఇంటికెళ్ళారు. దారి పొడుగునా అతని తల్లితండ్రులు రాజేంద్రను బాగా తిట్టారు. అతడు ఏమీ చెప్పలేక తల దించుకున్నాడు.
చైతన్య గవర్నమెంట్ ఉద్యోగి. అతను కూడా స్వయంవరానికి వచ్చాడు. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్న లీల అతడిని చూసి పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించగానే " ప్రభుత్వ ఉద్యోగం, పదివేల జీతం. ఇంకా లంచం తీసుకునే అలవాటు కాలేదు. ఎప్పుడైనా ఫ్రెండ్శ్ తో కొద్దిగా తాగడం అలవాటు. భార్య ఉద్యోగం చేసినా , చేయకున్నా ఇష్టమే. అప్పులేమీ లేవు. కానీ జీతంతోనే ఇల్లు గడిపే పొదుపరి భార్య కావాలి" అని కనిపించింది. లీల " ఈ కాలంలో ఇంతకంటే మంచి మొగుడు ఎక్కడ దొరుకుతాడు. పైగా పర్మనెంట్ ఉద్యోగం. నాకిష్టముంటే ఉద్యోగం చేస్తాను.లేకుంటే మానేయొచ్చు" అనుకుని వెంటనే పెళ్ళికి ముహూర్తం పెట్టించమంది.
అలా ఆ స్వయంవరంలో సగంమంది అబ్బాయిలు మాత్రమే అమ్మాయిలకు నచ్చారు.
ఇలా ఎన్నో చోట్ల ఇలాంటి సంస్యలు తలెత్తాయి. ఎందరో అబ్బాయిలు పెళ్ళి కాకుండా మిగిలిపోతున్నారు. అంతా గోల గోలగా ఉంది. తమ అందాలు మెరుగులు దిద్దుకోవచ్చు, జీతం అంటే కష్టపడి పెంచుకోవచ్చు. లేదా వేరే బిజినెస్సులో సంపాదించుకోవచ్చు. కాని ఈ గుణగణాలు ఎలా మార్చుకోవడం. అని ఒకటే దిగులు పట్టుకుంది అబ్బాయిలకు , వారి తల్లితండ్రులకు. అసలు ఇలా అబ్బాయి గుణగనాలు ఎలా తెలిసిపోతున్నాయి అని ఆ పిల్లల తల్లితండ్రులు విచారించారు. దీనికి కారణం ఆ అమ్మాయిల తల్లులు చేసిన "మై చాయిస్ " వ్రతం అని తెలిసింది.
దానికి విరుగుడు కనుక్కోవాలని అబ్బాయిలు (ముఖ్యంగా అమ్మాయిలకు నచ్చనివాళ్ళు) వాళ్ల తల్లితండ్రులు కలిసి ఇంటర్నెవట్లోు వ్రతాలు గురించి వెబ్సైట్లన్నీ వెతికారు. కాని ఒక ఆన్ లైన్ గురువు ఆషాఢభవభూతి గురించి తెలిసింది. అందరు ఆ స్వామిని కలుసుకోవాలని తగిన ఫీజ్ క్రెడిట్ కార్డుతో కట్టి తమ సమస్యను వివరించారు." స్వామీ ! పాతికేళ్ళ క్రితం "మై చాయిస్" అనే వ్రతం చేసి అమ్మాయిలు తమకు నచ్చిన, కావల్సిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. అసలే అమ్మాయిలకు కొరత ఎక్కువగా ఉంది. పైగా ఈ పద్ధతి వచ్చి ఎంతో మంది అబ్బాయిలు పెళ్ళీకాకుండా ముదిరిపోతున్నారు. మీరే పరిష్కరించాలి." అని మెయిల్స్ పంపారు. దానికి సమాధానం వారం రోజులకు అందరికి ఒకే విధమైన సమాధానం వచ్చింది. "ఎందుకర్రా! అలా బాధపడతారు. ఏళ్ళ నుండి అమ్మాయిలకు తమ నచ్చినట్లుగా జీవితభాగస్వామిని ఎంచుకునే అవకాశం లేకుండింది. పెద్దలు ఎలా చెప్తే అలా ఒప్పుకుని ఎదురు మాటాడక, తల వంచి తాళి కట్టించుకున్నారు. . ప్రేమించి చేసుకున్నా, ఆ తర్వాత అబ్బాయిల అసలు రంగు బయటపడి బాధపడ్డ అమ్మాయిలెందరో. అందుకే వాళ్లు ఎంతో నిష్టతో వ్రతం చేసి ఆ వరం తెచ్చుకున్నారు. అబ్బాయిలను కూడా అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారో అలా తయారవ్వమనండి. లేదా అబ్బాయిలను కూడ వ్రతం లేదా హోమం చేయమనండి. తప్పేముంది?" అని కుండ బద్దలు కొట్టినట్టుగా ఉంది ఆ మెయిల్.
అది చూసి అబ్బాయిలు " ఇప్పటికిప్పుడు మా గుణాలు మార్చుకోవాలంటే అయ్యే పనా? ఆ వ్రతమేదో చేసేస్తే పోలా?" అని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆ ఆన్లైగన్ గురువు ఆషాడభవభూతి ఆశ్రమానికి వంద డాలర్ల ఫీజు కట్టారు. అది కాస్త ఎక్కువే ఐనా తమ పెళ్ళికోసం తప్పదు అనుకుని వేలమంది ఆ ఫీజ్ కట్టేసారు. రెండురోజుల తర్వాత "చేంజ్ మి" వ్రత విధానం గురించిన మెయిల్స్ వచ్చాయి అందరికి. దాని వివరాలు ఇలా ఉన్నాయి.
" చేంజ్ మి" వ్రతం" ఎంతో కాలంగా పెళ్ళికాని అబ్బాయిలకు ఓక గొప్ప వరం. ఇందులో ఫీజ్ కట్టి చేరిన వారికి ప్రపంచంలోని 21 హిందూ దేవాలయాలో,చర్చిల్లో, మసీదుల్లో ప్రవేశం కల్పించి గుర్తింపు నంబరు ఇవ్వబడింది. ప్రతి అబ్బాయి 108 రోజుల పాటు , రోజూ ఉదయం స్నానం చేసి శుచిగా, ఈ ప్రార్ధనా స్థలాల్లో ఆన్లైబన్ పూజలు చేయాలి. వీరందరికి ప్రత్యేక సర్వర్ ఏర్పాటు చేయబడి. వారి పూజకు ఆటంకము లేకుండా ఏర్పాట్లు చేయబడ్డాయి. చివరి రోజు కొత్తగా పెళ్ళైన అబ్బాయికి తమ శక్తానుసారంగా భోజనం , బట్టలు పెట్టి సత్కరించి, అతని ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ పూజ నిష్టగా చేస్తే అది ముగిసేసరికి అమ్మాయిలకు నచ్చని గుణాలన్నీ మాయమవుతాయి. ఇది నిజము. తప్పక జరుగుతుంది.
ఏముంది. పెళ్ళికాకుండా ఉండే కంటే ఈ వ్రతం చేయడం ఉత్తమమని తలిచి మంచి రోజు చూసుకుని అబ్బాయిలందరూ తమ స్నేహితులను కూడగట్టుకుని వ్రతం చేసి చివర్లో భారీ హోమం మొదలుపెట్టారు. " చేంజ్ మీ " . ఉధృతంగా జరిగిన ఆ వ్రతం, హోమం ధాటికి ఇంద్రుడి పీఠం కదిలింది. బ్రహ్మకు దిక్కు తోచలేదు. కంఫ్యూటర్లో వైరస్ వస్తే ఎలాగో దాన్నీ తీసేయొచ్చు. ఇప్పుడు ఈ మనుష్యుల తల రాతలు ఎలా మార్చేది అని మూడు తలలు పట్టుకుని కూర్చున్నాడు. ఎప్పుడు పితృదేవుల నుండి పిలుపు వస్తుందో అని భయపడుతూ. దేవతలందరూ కలిసి అయ్యవారి దగ్గరకు పరిగెత్తారు. అమ్మవారు
సంగతి తెలుసుకుని ముసిముసి నవ్వులు. జరిగిన సంగతి తెలుసుకున్న అయ్యవారు వెంటనే విరించిని పిలిచాడు. "ఏంటబ్బాయ్! ఈ గోల ఏంటి? అప్పుడేమో అమ్మాయిల వ్రతం, ఇప్పుడు అబ్బాయిల వ్రతం,హోమంతో ముల్లోకాలు దద్దరిల్లేలా చేస్తున్నారు. నీ సృష్టికార్యక్రమంలో ఈ అవకతవకలేంటి? అసలే నువ్వు సూపర్ కంప్యూటర్ వాడుతున్నావు." అని అడిగాడు. "తండ్రీ! నేను అదే చూస్తున్నా. అసలే నెట్ ప్రాబ్లం. ఇప్పుడేదైనా మార్పులు చేద్దామంటే వైరస్ అంటుకున్నట్టుంది. నా కంప్యూటర్ సతాయిస్తుంది. నాకేమీ పాలుపోవటంలేదు. మీరే ఏదో దారి చూపండి ప్రభూ!!" అని మొరపెట్టుకున్నాడు విరించి.
అప్పుడు అయ్యవారికి తప్పనిసరై దివినుండి భువికి ఆన్ సైట్ రాక తప్పలేదు..
శ్రీమతి మాటవిని అమ్మాయిల గురించి ఆలొచించి తీసుకున్న నిర్ణయం అబ్బాయిలకు సంకటంగా మారింది కనుక, దానిని మార్చక తప్పదనుకుని ఆ వ్రతం చేసుకున్న అబ్బాయిల అవలక్షణాలు (ముఖ్యంగా తమ భార్యలను బాధించేవి) , మారేటట్టుగా చేసి , "హతోస్మీ!" అనుకుంటు వెళ్ళి శేషతల్పముపై నిదురించాడు. కాని శ్రీలక్ష్మి మొహంలో మందహాసం ఇంకా పెరిగింది సంతోషంతో. ఎలాగైతేనేమి. మొదటి వ్రతంవల్ల అమ్మాయిలకు తమకు నచ్చిన వరుడిని పెళ్ళిచేసుకునే అవకాశం. రెండో వ్రతం వల్ల భార్యలను బాధించే లక్షణాలు అబ్బాయిలలో మాయమవడం.
ఎంతవారలైనా కాంతదాసులే కదా! :)