Wednesday, 30 September 2009

ఏది మంచి ఏది చెడు..?

మనం కోరుకున్నవి సాకారమైతే మంచి జరిగిందని, కోరుకోనిదేదైనా తటస్థిస్తే చెడు జరిగిందని అపోహ పడుతుంటాం. ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా అది మనల్ని ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని జరగదు. అంతెందుకు మన జీవితాన్ని ప్రభావితం చేసేవిగా మనం భావించే పెళ్లి, పిల్లలు పుట్టడం, ఆత్మీయులకు దూరం కావలసి రావడం వంటివన్నీ మనకెంత ముఖ్యమైనవిగా తోస్తాయో 'నేను' అనే వలయాన్ని ఛేధించుకుని ఆవలి నుండి చూస్తే మనతోపాటే ఆయా సంఘ టనల వల్ల ప్రభావితం అయ్యే జీవితాలు ఎన్నో! పెళ్లనేది జరిగితే అది కేవలం ఇద్దరి వ్యక్తులకే పరిమితమైన సంఘటన కాదు. దాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఇరువర్గాల కుటుంబ సభ్యుల్లోనూ అంతర్లీనంగా కొద్ది సర్ధుబాట్లు చోటుచేసుకుంటాయి. ఆ కొత్త దంపతులు, ఆ కొత్త బంధాలు మరిన్ని అనూహ్యమైన సంఘటనలకు దారితీస్తాయి. ఈరోజు మనకు డబ్బు వచ్చిందంటే అది మరొకరి చేతుల నుండి పోబట్టే! ఈ క్షణం మనకు ఎదురైయ్యే ఆనందాలు, విషాదాలు అన్నింటికీ తీగలాగితే వెనుక మనకు తెలియని ఎన్నో అంశాలు చిక్కుముళ్లుగా ముడిపడి ఈ క్షణాన్ని మన కళ్లెదుట నిలుపుతాయి. గతం తాలూకు మేళవింపుగా, భవిష్యత్‌ తాలూకు నిర్ణయాత్మకశక్తిగా మాత్రమే 'ఈ క్షణం' నిర్మితమై ఉంటుంది. అందుకే ఈ క్షణం మనం అనుకున్నది జరిగినంత మాత్రాన సంతోషించడం, కష్టం కలిగితే కుంగిపోవడం అనాలోచితమైన వ్యక్తీకరణలు.



జీవితం అంటేనే ఓ గొలుసుకట్టు అనుభవాల సమాహారం. ఈ క్షణం మనం ఆస్వాదించేదీ, కుంగదీసేదీ గతం తాలూకు చిహ్నం కావచ్చు, భవిష్యత్‌లో పూర్తి విభిన్నమైన అనుభవాన్ని మిగల్చడానికి ఆదిబిందువు కావచ్చు. అన్నింటికీ మించి ఇప్పుడు తటస్థించిన అనుభవం ఏదైనా కావచ్చు, అది మనకు మాత్రమే మంచి జరిగింది, మనకు మాత్రమే చెడు జరిగింది అని నిర్థారణకు రావడం హాస్యాస్పదమే. మన ప్రమేయం లేకుండా గడిచిపోయే జీవితంలో కేవలం మనం పాత్రధారులం మాత్రమే. మన పనిని చిత్తశుద్ధితో చేసుకుంటూ కర్మయోగిగా ముందుకు సాగాల్సిన వాళ్లమే తప్ప సంఘటనల వెనుక కార్యాకారణ సంబంధాలను అన్వేషించడానికి పూనుకుంటే ఏదో ఒక దశలో ఏ సంఘటన యొక్క ఆద్యంతమూ మనకు ఊహకు అందదు. అలా పూనుకోవడం వృధా ప్రయాసే అవుతుంది. సృష్టి లయబద్ధంగా ఎన్నో జీవితాల్ని ప్రభావితం చేస్తూ తన ధర్మం పాటిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని క్షణాలు కొందరికి సంతోషదాయకమైనవి అయితే మరికొన్ని క్షణాలు మరికొందరికి నిరాశనే మిగుల్చుతాయి. ఈ క్షణం ఇలాగున్నంత మాత్రాన ప్రతీ క్షణమూ ఇలాగే ఉంటుందని నిర్థారణకు రావడం అపరిపక్వమైన ఆలోచనాసరళి! అలాగే ఏది ఎవరికి మంచో, ఎవరికి చెడో తెలుసుకోగలిగిన స్థూలదృష్టి మనకు లేనప్పుడు.. చిత్తశుద్ధిగా మనం చేసేదంతా మంచికే అనుకుని మౌనంగా పనిచేసుకువెళ్లడమే ఉత్తమం.

- మీ
నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఏరా అక్టోబర్ - 2009 మాసపత్రిక ఎడిటోరియల్

Monday, 28 September 2009

విజయదశమి శుభాకాంక్షలు

అమ్మలగన్నయమ్మ ఆ జగజ్జనని సదా అనుగ్రహించుగాక.అందరికి దసరాపండగ శుభాకాంక్షలు..



యా దేవీ సర్బభూతేషు విష్ణుమాయేతి శబ్దితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు చేతనే త్యభిధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 
యా దేవీ సర్బభూతేషు నిద్రారూపేణ  సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు క్షుధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు చాయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు తృష్ణారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు లజ్జారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు శాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు కాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు లక్ష్మిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు  వృత్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు స్మృతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు భూతానాం రూపేణ సంస్థితా 
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  

Saturday, 26 September 2009

బతుకమ్మ ..







పండగ అనగానే పూజలు, కొత్తబట్టలు, పిండివంటలు . ఇవేకాదు. ప్రతి పండగకు ఒకో అర్ధం, పరమార్ధం ఉంటుంది. అలాగే తెలంగాణాలో జరిగే ఒక ప్రముఖమైన, విశిష్తమైన , ఆడపిల్లలకు చాలా ఇష్టమైన పండగ బతుకమ్మ పండగ. తెలంగాణా ప్రాంత సంస్కృతి , సంప్రదాయాలను కళ్లముందుంచే పండగ ఇది.


నా చిన్నప్పుడు ఉన్న సందడిలో సగం కూడా ఇప్పుడు కనపడటంలేదు. అసలు ఈ బతుకమ్మ ఆడటం , వినాయకచవితి నుండి మొదలయ్యేది. పేడతో గొబ్బెమ్మలు చేసి వాటికి పసుపు, కుంకుమ , పూలు పెట్టి ప్రతి రోజు కల్లాపు జల్లి, ముగ్గు పెట్టిన వాకిట్లో ఈ గొబ్బెమ్మలు పెట్టి , చుట్టుపక్కల ఉన్న పిల్లలు, పెద్దలు, అందరు ఆడవాళ్లు కలిసి ఆడేవారం. అందరికి ప్రతిరోజు అదో ఆటవిడుపులా ఉండేది. ఆడవాళ్లకు కాస్సేపు ముచ్చట్లు వేసుకోవడానికి, పిల్లలకు ఆడుకోవడానికి, తర్వాత అమ్మ పెట్టే అటుకులు, పుట్మాలు,బెల్లం ప్రసాదం తినడానికి. నాకు ఇప్పటికి అర్ధం కాదు. ఈనాటి పిల్లలకు అస్సలు తీరిక సమయం దొరకడంలేదు. బతుకమ్మ పూలు అని ఉండేవి. ఇప్పటికీ అవి ఎక్కడైనా కనపడితే మనసు బంగారు బాల్యంలోకి వద్దన్నా పరిగెడుతుంది. బతుకమ్మ ఆడటం ఐపోయాక ఆ గొబ్బెమ్మలు తీసి గోడకు కొట్టి అదే ముగ్గుపై ఒప్పులకుప్ప ఆడటం ..ఒహ్!! ఒక అందమైన జ్ఞాపకం.



తర్వాత మహాలయ అమావాస్య (పెత్తరమాస) నుండి చిన్న బతుకమ్మ మొదలవుతుంది. ఈరోజు నుండి బతుకమ్మను పూలతో పేరుస్తారు. గునుగు పూలు, తంగేడు, బంతి, చామంతి మొదలైన పూలతో రోజుకో డిజైనులో అమ్మ పేరుస్తుంటే పక్కన కూర్చుని వింతగా చూసేవాళ్లం. అమ్మకు పక్కనే కూర్చుని ఆకులు, పూలు కత్తిరించి ఇవ్వడం అప్పుడప్పుడు సలహాలు ఇవ్వడం పెద్ద గొప్పలా ఫీలవ్వడం. బతుకమ్మ మొత్తం పేర్చాక ఓ సారి చూసుకుని దేవుని ముందు పెట్టేది అమ్మ. అదేంటో అప్పుడు అమ్మలందరికీ ఓపిక ఎక్కువేమో అనుకుంటాను ..ఎన్ని పనులు చేసేవారో?? ఈ గునుగు పూలు చివర్లు కత్తిరించడం , రంగు నీళ్లలో ముంచి వేర్వేరు రంగులతో తయారు చేసుకునే వాళ్లం. సాయంత్రం కాళ్లు చేతులు కడుక్కుని మంచి బట్టలు వేసుకుని , దేవుడి ముందు దీపం పెట్టి, పసుపు గౌరమ్మ పెట్టి అప్పుడు బతుకమ్మను వాకిట్లో ఆడుకోవడానికి తీసుకొచ్చేది. బతుకమ్మని ఎప్పుడు కూడా ఒక్కటే చేయరు. పక్కన చిన్న బతుకమ్మ ఉండాల్సిందే . అంటే తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని తప్పనిసరిగా ఉండాలనేవారు పెద్దలు. మెల్లిమెల్లిగా చుట్టు పక్కల ఉన్నవాళ్లు అందరు వచ్చి ఇంటి ముందు గుండ్రంగా తిరుగుతూ లయబద్ధమైన చప్పట్లతో , గొంతెత్తి పాడుకుంటూ బతుకమ్మ ఆడతారు. కాస్త నడవలేని , ముసలమ్మలు పక్కన కూర్చుని గొంతు కలిపేవారు. "ఏం పిల్లలో ఏమో? పాటలు రావు. మా కాలంలో ఐతేనా" అంటూ ఒకదాని తర్వాత ఒకటి అలా పాటలు రాగయుక్తంగా జాలువారేవి. ఇక అక్కడినుండి పక్కింటికెళ్లి వాళ్ల వాకిట్లో ఆడాల్సిందే. అలా గుంపు పెద్దదవుతుంది. ఆ రంగులు, వయ్యారాలు , అందాలు ఆడవారికే సొంతం కాదా?? చివరిగా దుర్గాష్టమి లేదా సద్దుల బతుకమ్మ రోజు ఇది ముగుస్తుంది.



దసరా అంటేనే బతుకమ్మ పండగ . ఆడవాళ్లకు సొంతమైన పండగ. పూజలు ఎలాగూ ఉంటాయి. సద్దుల బతుకమ్మ రోజు చాలా పని ఉంటుంది. రెండు మూడు రకాల సద్దులు అంటే ప్రసాదాలు, అవి ధధ్యోధనం, పులిహోర, మలీద అనే లడ్డూలు చేయడం తప్పనిసరి. మామూలుగా చపాతీలు చేసి వాటిని ఎర్రగా కాల్చి , చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లం, యాలకుల పొడి వేసి రోట్లో బాగా దంచి ఉండలు కడతారు. ఆరోగ్యపరంగా కూడా ఇవి చాలా మంచివి అంటారు. ఈ నైవేద్యాలు బతుకమ్మకు సమర్పించి , కాలనీలో అందరూ ఒకేచోట చేరి మధ్యలో తమ బతుకమ్మలను పెట్టి చుట్టూ చేరి పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడతారు. ఇవి ఆలాంటిలాంటి పాటలా? నీతికథలు, జానపద కథలు, కొత్త పెళ్లికూతురుకు చెప్పే విషయాలు, కిటుకులు, ఆడవారి కష్టాలు .. ఇలా ఎన్నో ఉంటాయి. ఇక్కడ ఒకరికొకరు పరిచయం, బంధుత్వం ఉండాల్సిన పని లేదు. అందరూ ఒకటే. బతుకమ్మని మధ్యలో పెట్టి మిగతావారితో జత చేరి ఆడడమే. ఇందులో మగవారికి అస్సలు ప్రవేశం లేదు. సద్దుల బతుకమ్మ రోజు పట్టుచీర కట్టి, నిండుగా పూలు, నగలు ధరిచి బతుకమ్మలను పట్టుకుని మహిళలు గుంపులుగా వెళుతుంటే పండగ శోభంతా వీధుల్లోనే కనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి కాదేమో.. ఈ ఆటపాటలలో చీకటి పడిండి కూడా తెలియదు. అలిసిపోతే తప్ప. చివరిలో ఒకరికొకరు పసుపు,కుంకుమలిచ్చుకుని బతుకమ్మలను నీటిలో వదుల్తారు. కూతురిని అత్తవారింటికి పంపినట్టుగా భారంగా ఇంటికి తిరిగివస్తారు. రాత్రికి అవే ప్రసాదాలు . తెల్లారితే మళ్లీ పండగ పనులు మొదలు. బతుకమ్మ కోసం మరో ఏడాది ఆగాల్సిందే..

Wednesday, 23 September 2009

మామ .. చందమామ ..


ఈరోజు పిల్లలను రాముడు, శూర్పణఖ, భేతాలుడు ఎవరు అని అడిగితే తెల్లమొహం వేస్తారు. అదే స్పైడర్ మాన్, పవర్ రేంజర్స్, బ్యాట్ మాన్ , హ్యారి పోటర్ గురించి అడిగితే ఒక్క లైన్ పొల్లుపోకుండా చెప్పేస్తారు.అవే వింతలు, అద్భుతాలు, మనమూ చిన్నప్పుడే చదివేసాం అంటే నమ్ముతారా?? నమ్మరు.కాని చందమామ పత్రికలో మనం నేర్చుకున్న కథలు, పురాణాలు, జాతక కథలు మర్చిపోగలమా? పుస్తకం రాగానే ఇంట్లో ఎవరు ముందు చేజిక్కించుకుంటారా అని గొడవ జరగని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో? చేతికందిన పుస్తకాన్ని గంట,రెండు గంటలలో పూర్తి చేసి నెల రోజులు ఆగాలంటే కోపం, అసహనం. పతికలో వచ్చిన భేతాళ కథలు, జానపద కథల్లోకి మనమూ దూరిపోయి ఆ పాత్రలతో పాటు కథను ఆస్వాదించడం. నచ్చిన సీరియల్లు కత్తిరించి జాగ్రత్తగా అమ్మ బీరువాలో దాచి చివరలో అమ్మను మస్కా కొట్టి బైండింగ్ చేయించుకోవడం ..ఇప్పటికీ మర్చిపోలేని ,మధురమైన అనుభూతి...

ఈ ముచ్చట్లన్ని ఇప్పుడెందుకు అని అనుకుంటున్నారా?? చందమామతో నా అనుబంధం మీతో పంచుకోవాలని..
నిజంగా ఈరోజు పిల్లలను చూస్తె జాలేస్తుంది. ఆటలు, పాటలు, పుస్తకాలు లేకుండా క్లాసు పుస్తకాలు, ర్యాంకులు, కోచింగులతో అమూల్యమైన బాల్యాన్ని నిస్సారంగా మరమనుష్యుల్లా గడిపేస్తున్నారు.

Monday, 21 September 2009

దేవుడిని చూడడానికి డబ్బులా???




దేవా అన్నా.. అల్లా అన్నా... జీసస్ అన్నా... ఏ మతస్థులైనా ఆ సర్వేశ్వరుడు తమ గోడు వింటాడు, తమని ఆదుకునేవాడు అని మనస్పూర్తిగా నమ్ముతారు. కాని ...

ఆ దేవుడిని చూడడానికి డబ్బులు ఎందుకివ్వాలి. ఈ నియమం పురాణాలనుండి లేదు కదా. మసీదుల్లో కాని, చర్చిల్లో కాని ఇలా దేవుని దర్శనం చేసుకోవడానికి డబ్బులు , టికెట్లు ఉంటాయా?? మరి మన గుళ్ళలోనే ఈ విధానం ఎందుకు? గుడిని అభివృద్ది చేయడానికా. ప్రసాదాల కోసమా. దేవుని పేరు చెప్పి మధ్యవర్తులు (ఇందులో చాలా మంది మహానుభావులు ఉన్నారు) తినడానికా.. ఆ టికెట్లు లేకుంటే ఆ దేవదేవుని దర్శించలేమా. అర్హత లేదా. కాస్త ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేవాలయాలన్నింటిలో ఇలా తప్పనిసరి టిక్కెట్లు పెడుతున్నారు. మామూలు దేవాలయాలు ఎన్నో ఆదరణ లేక , దీపం కూడా పెట్టె దిక్కులేకుండా ఉన్నాయి.

తిరుపతి లో శ్రీనివాసుడికి డబ్బులకు కొదవా?? మరి ఆ దేవుని దర్శనంలో వేరు వేరు రూపాలలో టిక్కెట్లు ఎందుకు? సెల్లార్, అర్చనానంతర ఇలా.. ఒక్కో టిక్కెటు ఒక్కో ధర. ఆ దేవుని ఎలాగైనా చూడాలనే కోరికతో జనాలు కూడా విపరీతంగా టిక్కెట్లు కొంటున్నారు. ఇపుడు సెల్లార్ టికెట్ వంద రూపాయలు, అర్చనాంతర దర్సనం రెండు వందలు టిక్కెట్లు తీసేసి ఒకే టిక్కెట్ మూడు వందలు చేసారు. అది కూడా కొంటారు. భక్తులను ఇలా దోచుకోవడం ఎందుకు? తిరుమలకు నిధుల కొరతా?? పంతులు , దేవస్థానం వారి చేతిలో యాభై , వంద పెడితే మరి కొంచం సేపు గర్భగుడిలో నిలబడనిస్తారు. ఐదు వందలు మనవి కాదనుకుంటే ప్రసాదాలు మన రూముకే తెచ్చి ఇస్తారు. తిరుమల అంటేనే దోపిడీ అనేట్టుగా తయారైంది. అలా నోట్లు వెదజల్లలేని వాళ్ల సంగతి ఏంటి??


అందుకే నాకనిపిస్తుంది. కొన్నేళ్ళు దాటితే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టు తిరుమల వెళ్లి చూడు అన్నట్టు అవుతుందేమో. ధర్మదర్శనం ఉంది కదా అంటారా?? ప్చ్..

శ్రీనివాసా !! నీ దగ్గరకు రాలేని పేదవాళ్ళం. నువ్వే రావయ్యా!!!

Wednesday, 16 September 2009

ఆడపిల్లంటే అంత అలుసా???




ఆడది ఆదిశక్తి అనే మాట ఎంతవరకు సత్యం? ఇంతగా అభివృద్ధి చెందిన ఆడదాన్ని అమ్మలా పూజించే మన దేశంలో ఒకేరోజు సుమారు నలబై మంది ఆడపిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు ..ఇది నిజమేనా?నమ్మశక్యమేనా ? వాళ్ళకు అంత కష్టమేమి వచ్చింది? అందరూ చిన్నపిల్లలు స్కూలు దాటి అప్పుడే కాలేజిలోకి వచ్చిన అమ్మాయిలు.

రాజమండ్రి లూతరన్ కాలేజీలోని అమ్మాయిలు తమ కాలేజీ కరస్పాన్డెంట్ చేసే లైంగిక వేధింపులు భరించలేక సుమారు నలబై మంది అమ్మాయిలు బాధతో పురుగుల మందు తాగి ,బ్లేడుతో చేతిపై కోసుకుని జీవితం చాలించాలని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి కారణం తండ్రిలా చూసుకోవాల్సిన కరస్పాండెంట్ చేసే వేధింపులు.. అవి ఎంత తీవ్రంగా , భరించలేకుండా ఉంటే ఆ సుకుమారులు అలా చేసారు. ఎంత కాలంగా ఆ వేధింపులు తట్టుకున్నారో వారి ఏడుపులు వింటుంటే తెలిసిపోతుంది. చదువు మీద మక్కువతో ,ఎంతో డబ్బు వెచ్చించి కాలేజిలో చేరితే ఇదా ఫలితం..

కాని ఇలా బాధతో ఆత్మహత్యలకు పాల్పడే బదులు అమ్మాయిలు మానసిక స్థైర్యం తో , అందరు కలిసి ఎదిరించి ఆ దుర్మార్గునికి తగిన గుణపాఠం చెప్పాలి. కాని చాలా సందర్భాలలో అలాటి వాళ్లు అధికారులు, రాజకీయ పలుకుబడి కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్లకు చట్టం, న్యాయం తొందరగా శిక్ష వేస్తుందా. అంత వరకు ఆ నిందితుడు డబ్బులు వెదజల్లి న్యాయాన్ని కొనేసి , బెయిల్ తెచ్చుకుని ఇంటికి చేరతాడు. ప్రతీది ఇలా ఏళ్ల తరబడి న్యాయానికి ఎదురుచూడాల్సిందేనా??? ప్రజలు .లేదా బాధితులు శిక్షించలేరా?? ఈ మధ్యే ఒక పోలీసు ఒక మహిళను నడిరోడ్డుపై వేదించి ఆమె తిరగబడితే చంపడానికి ప్రయత్నించాడు. అడ్డు వచ్సినవాళ్ళతో తన్నులాటకు దిగాడు. ఇక ఎవరు సామాన్య ప్రజలను రక్షించేది??

Monday, 14 September 2009

అసాధ్యమే సుసాధ్యమైన వేళ - వార్షికోత్సవ వేళ



ఎందుకో ఈ మధ్య నా ఆలోచనలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. తీరిక లేకుండా సాగిపోతున్న నా దినచర్యలో ఒక్కసారి ఆగి "నేనేంటి??" అన్న ఆలోచన చేయడం మొదలైంది. నేను ఎప్పుడు కూడా గతం గురించి కాని, వర్తమానం గురించి కాని చింతించలేదు. ఈ రోజు మాత్రమే నా చేతిలో ఉంది. దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అనుకున్నాను. వేదాంతం మొదలెట్టా అనుకుంటున్నారా? అసలు సంగతి తెలుసుకోవాలంటే రంగు రంగుల రింగులు తిప్పుకుంటూ మూడేళ్లు వెనక్కి వెళ్లిపోదాం పదండి. నా జీవితంలో అసాధ్యం అనుకున్నవి నిజంగా సాధ్యమయ్యాయి.. అవేంటంటారా??



చిన్నప్పటినుండి నేను ఎవరితో ఎక్కువ కలవను..ఎక్కువ కల్పించుకుని మాట్లాడను. స్కూలు, కాలేజీ ఇల్లు అంతే నా లోకం. సినిమాలు , షికార్లు అన్నీ అమ్మతోనే.. స్కూలు స్నేహితులు స్కూలులోనే, కాలేజీ స్నేహితులు కాలేజీలోనే దూరమయ్యారు. ఆ చదువు కూడా నేను సీరియస్సుగా చదవలేదు. చదవాలి కాబట్టి చదివాను. ఒక లక్ష్యం, కెరీర్ అనే ఆలోచనే లేదు. అదేంటో?? కడుపులో చల్ల కదలకుండా రోజులు గడిచిపోతున్నాయి. మంచి సంబంధం అని పెళ్లి చేసేసారు. చదువు కొండెక్కింది (పావురాల గుట్ట కాదండోయ్).. సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు, వాళ్ల చదువులు, ఆరోగ్యం, పరీక్షలు ఇదే నాకు ముఖ్యంగా ఉండింది. అప్పుడప్పుడు కుట్లు , అల్లికలు మామూలే. కాని మూడేళ్ల క్రింద నేను ఎన్నో సార్లు తీవ్రంగా ఆలోచించాను. నేనేంటి? నా జీవితం ఇలాగే గడిచిపోవాలా? పిల్లలు ఉద్యోగాల్లో చేరి, పెళ్లిల్లయ్యాక వాళ్లకు, వాళ్ల పిల్లలకు సేవలు చేయడము, టీవీ చూడడము, అందరి బాగోగులు చూడడమేనా నా పని. వేరే ఏమీ చేయలేనా? నా గుర్తింపు ఏంటి? అసలు నేనేమి చేయగలను? ఉద్యోగం చేయాలంటే పెద్ద చదువులు లేవు. పాండిత్యము లేదు. ఇప్పుడు చదువుకుని మాత్రం ఏం చేయాలి ?? చదివినదంతా టైం పాస్ పుస్తకాలే. సస్పెన్స్ నవళ్లు, వార పత్రికలు .. పుట్టింటివైపు, అత్తింటివైపు పండితులనదగ్గవారు లేరు. కాస్తైనా నాకు ఉందేమో అనుకోవడానికి. నేను ఎప్పటికీ ఫలానా వారి కూతురు, భార్య, తల్లి అని అనిపించుకోవాలా? ఎప్పుడు వారి మీద ఆధారపడాలా?? ఇలా సమాధానం లేని ప్రశ్నలెన్నో ??



అనుకోకుండా కాదు కాని పిల్లల కోసం, పిల్లల సాయంతో కంప్యూటర్ నేర్చుకున్నారు. మావారు కూడా నాతో టీవీ చూడ్డం తగ్గించాలని కంప్యూటర్ గురించి చెప్పేవారు. కాని అప్పట్లో నెట్ లో ఉండే స్త్రీలపై మంచి అభిప్రాయం లేదు. చాట్ రూంలు ఐతే మరీ ఘోరం. నా అదృష్టం కొద్ది మస్తీ గ్రూపు, తెలుగు బ్లాగు గుంపులో పడి బ్లాగులో తేలాను. నిజంగా చెప్పాలంటే ఈ తెలుగు బ్లాగు వల్ల నాకంటే ఎక్కువ ప్రయోజనం పొందింది, సద్వినియోగపరుచుకున్నది ఎవరూ లేరనుకుంటా. తీరిక సమయాన్ని నెట్ పై వినియోగించి నేను పొందిన లేదా సాధ్యం చేసుకున్న కలలు చెప్పనా.. నవళ్లు, వార, మాస పత్రికల పిచ్చి చాలా ఉండేది. మాట్లాడుకోవడానికి ఒక్క ఫ్రెండ్ కూడా లేరు మరి. అప్పుడు పెద్ద పెద్ద రచయిత్రులు రాసిన కథలు, సీరియళ్లు చూసి అలా రాయగలగడం పూర్వ జన్మ సుకృతం. వాళ్లు చాలా పెద్దవాళ్లు . అని అనుకునేదాన్ని. అప్పుడు కల్పన రెంటాల అనే పేరు తరచూ మంచి మంచి వ్యాసాలు ,కథలలో చూసేదాన్ని. ఎందుకో గాని ఆ పేరు మీద ఒకలాంటి అభిమానం మొదలైంది. ఎంత మంచి (గొప్ప రచయిత్రి) కదా. అసలు వీళ్లు ఇంత ఈజీగా ఎలా రాయగలుగుతారు అని ఆశ్చర్యపోయేదాన్ని. కాని అదే కల్పన రెంటాలా హాయ్! నాకు సాయం చేస్తారా? అని నాకు మెయిల్ పెడితే నేనేమైపోవాలి? నాకింత అదృష్టమా?నా అభిమాన రచయిత్రి నాకు మెయిల్ చేయడమా? అని ఉబ్బి తబ్బిబ్బైపోయాను. వెంటనే స్నేహం చేసేసాను. పది నిమిషాల్లో నువ్వు అనుకునేంతగా పరిచయం పెరిగింది. ఇప్పుడు తను నాకున్న కొద్దిమంది ఆత్మీయ స్నేహితుల్లొ ఒకరు. థాంక్ యూ కల్పన..మరో వింత ఏంటంటే...కంప్యూటర్ ఎరా పత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్. అతను కూడా నేను అభిమానించే వ్యక్తుల్లొ ఒకరు. (నేను అంతర్జాలానికి రాకముందునుండే) అతని రచనలు, మొత్తం పత్రికను ఒక్కడే రాయడం, సహయ కార్యక్రమాలు చదువుతుంటే చాలా సంతోషమేసేది. పేజీ తిరగేస్తే అతని పరిచయ భాగ్యం కలిగి, అతని బ్లాగు మొదలెట్టి అతనితొ కలిసి నిర్వహించడం అంతకంటే అద్భుతమైన వింత నేను అభిమానించే పత్రికలో నేనే కవర్ స్టోరీ రాయడం. నేను నా జీవితంలొ మరచిపోలేని రోజు , బిజీగా నాకున్న శక్తి మొత్తం వినియొగించిన రోజు అంటే ఈనాడులో వికీ, బ్లాగుల వ్యాసం వచ్చిన రోజు. నిజంగా ఆ రోజు ఒకేసారి నేను మూడు చోట్ల చాటింగ్ చేయాల్సి వచ్చింది. కూడలి కబుర్లు, జిమెయిల్, కంప్యూటర్ ఎరా చాట్ రూం. ఒక చోట కబుర్లు , ఒక చోట అభినందనలు, ఒకచోట తెలుగు పాఠాలు . సునామీ అనుకోండి. రాత్రికి నా కుడిచేయి పనిచేయలేదు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే గాని మరుసటిరోజు ఇంటి డ్యూటీలో పడలేదు. చాట్ రూం లో మూడురోజుల్లో కనీసం 200 మందికి తెలుగు స్థాపించడం ,రాయడం చెప్పడం జరిగింది. నేనొక్కదాన్నే కాదు . మరికొందరు బ్లాగర్లు పాల్గొన్నారు.కాని అదో వింత అనుభూతి. శారీరక అలసట నిచ్చినా మానసిక సంతృప్తి నిచ్చింది.




బ్లాగు నుండి వెబ్ పత్రిక పొద్దులో నా పేరు అచ్చులొ మొదటిసారి చూసుకున్నప్పుడు కలిగిన ఆనందం చెప్పలేను. నేను కూడా రాయగలనా అనుకున్నా. అలాగే దినపత్రికలలో తరచూ వచ్చే వ్యాసాలు దానికింద నా పేరును పదే పదే చూసుకునేదాన్ని. ఇది నేనేనా? ఒకప్పుడు కల్పన పేరు చూసి నా పేరు కూడా ఇలా అచ్చులో చూసుకోగలనా అన్న ఆలోచన ఇప్పుడు సఫలీకృతమై కళ్ల ముందు కనపడుతుంది. అది ఆనందమా? ఆశ్చర్యమా?, గర్వమా? అర్ధం కాలేదు. ఇది ఏ పోటీలో ప్రైజు వచ్చింది కాదు. అస్సలు నేను రాయగలను అన్న ఆలోచన కూడా లేకుండా ఇలా పత్రికలలో రాస్తున్నాను అంటే ఇంకా నమ్మలేకున్నాను. ఎందుకంటే నేను నేర్చుకుంది అల్పం. నేర్చుకోవాల్సింది అనల్పం. నిరంతర విద్యార్థినే అనుకుంటాను ఎప్పటికప్పుడు. ఒకసారి మా చుట్టాలమ్మాయి బిజినెస్ లో పేరు సంపాదించింది అని పేపర్లో ఫోటో వేసారు. అందరూ ఎంత గొప్పగా చెప్పుకున్నారో.మనకా రాత ఎక్కడిది. అంట్లు తోముకుంటూ, బట్టలు కుట్టుకుంటూ ఉండేవాళ్లకి అంత అదృష్టమా అని లైట్ తీసుకున్నాను . కానీ అదీ సంభవమైంది కూడా. (అలాగే బానే దిష్టి కొట్టిందనుకోండి).. అన్నిటికంటే నాకు దొరికిన అపురూపమైన వరం, "స్నేహం." అసలు నాకు జీవితంలో స్నేహితులు లేరు, ఏదైనా ఆలోచనలు పంచుకోవాలన్నా, చర్చించాలన్నా ఎవరూ లేరు,నాకు నేనే మాట్లాడుకోవడం. కాని ఇప్పుడు .. నాలా ఆలోచించి, నాతో చర్చించి, నా తప్పులు ఎత్తి చూపే ప్రియమైన స్నేహితులు ఉన్నారు. ఇంతకంటే విలువ కట్టలేని , తరగని నిధి ఉంటుందా??




ఇక బ్లాగుల విషయానికొస్తే ఈ బ్లాగు రాసుకునేది నాకోసం. ఇది నా అంతరాత్మ. నా మనసులో కదలాడే ప్రతీ ఆలోచనను ఇక్కడ పొందుపరచి , అందరితో పంచుకుంటున్నాను. మిగతా బ్లాగులైతే నాకోసం, అందరికోసం.. బ్లాగు గుంపు నుండి బ్లాగుకు, బ్లాగు నుండి పత్రికలకు, పత్రికల నుండి సొంత వెబ్ సైట్.. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సాగుతున్న నా బ్లాగు ప్రయాణం రేపు ఏటు పోతుందో? ఏమో?? బ్లాగు రాతల వల్ల , పండితులైన ఇతర బ్లాగర్ల పరిచయ భాగ్యం వల్ల అప్పుడప్పుడు సాహిత్యంలో కూడా తప్పటడుగులు వేస్తున్నాను. ఇక్కడో ముఖ్య విషయం చెప్పాలి..అన్ని బ్లాగులు చదవకున్నా, ఎన్ని బ్లాగులు చదివినా .. కొన్ని బ్లాగులంటే నాకు చాలా భాయం. సాధ్యమైనంతవరకు ఆ వైపు వెళ్లకుండా జాగ్రత్తపడతాను. కవితలు, రాజకీయాలు, పద్యాలు.. అయ్యబాబొయ్! అసలు కవితలే అర్ధం కావు, చదవని నేను చిన్ని ప్రయత్నం చేసాను. పర్లేదు.. ముందడుగు వేయొచ్చు అన్న ధైర్యం వచ్చింది.


నాకు ఉన్న మరో కల.. సహాయం చేయడం. అది చేయాలని ఉన్నా నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది అని బాధపడేదాన్ని.కాని ప్రమదావనం సభ్యులతో చేరి కొన్ని సహాయ కార్యక్రమాలు చేయడం వల్ల ధన్యురాలనయ్యాను. థాంక్ యూ ప్రమదల్లారా..



చివరిగా ఎంత వద్దనుకున్నా ఈ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను.. నేను నిజ జీవితంలో కాని, బ్లాగుల్లో కాని ఎవరిని ద్వేషించలేదు. నాకు నచ్చకుంటే దూరం ఉంటాను కాని వాళ్ల మీద ద్వేషం, అసూయ పెంచుకోలేదు ఎప్పుడు .. కాని ఒక్క వ్యక్తిని మాత్రం అసహ్యించుకుంటున్నాను నాతో చనువుగా , స్నేహంగా ఉంటూ, నా మీద నీచమైన రాతలు రాసి , అల్లకల్లోలం సృష్టించి ఏం సాధించారో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. పైగా ఇంత జరిగినా సిగ్గులేకుండా చిలకపలుకులు పలుకుంటే అసలు ఏమనాలో కూడా అర్ధం కావట్లేదు. ఊసరవెళ్లి రంగులు మారుస్తుంది అంటే ఇలాగే కామోసు.. కాని ఇలాంటి ఎదురు దెబ్బలే మంచి పాఠాలు నేర్పాయి. అందుకే నేను నా ముందు వచ్చిన ప్రతి అడ్డంకిని అడ్డుగా కాకుండా మెట్టుగా భావించి దానిని ఎక్కి సాగిపోతున్నాను మరింత ఆత్మవిశ్వాసంతో.. ఒకప్పుడు నేనేంటి అనుకున్నదాన్ని,, ఇది నేనేనా అని ఆశ్చర్యపోతున్నాను. గతమంతా ఒక్కసారి తలుచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంత ఆత్మీయత ఏర్పడింది ..



ఈరోజు నా బ్లాగు మూడవ వార్షికోత్సవం. మొత్తం అన్ని బ్లాగులకు కలిపి వీక్షకులు లక్షన్నార, టపాలు రెండువేల పైనే ఉన్నాయి. ఇదంతా నా స్వార్జితం..:) కాదా మరి... నాకు ఇంత మంచి మిత్రులు, అభిమానులు, గౌరవం ఇచ్చిన తెలుగు బ్లాగ్లోకానికి నా తరఫున చిరు కానుక.. బ్లాగ్ గురువు..


ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త విజయాన్ని సాధించుకుంటూ వచ్చాను. గత సంవత్సరం అను సాధించాలి అనుకున్నా.దాని పట్టు పట్టేసాను. సొంత వెబ్ సైట్ మొదలెట్టి మంచి స్పందన, ఆదరణ సంపాదించాను .. నా విజయంలో పాతిక శాతం మావారికి, పాతిక నన్ను ప్రోత్సహించే నా పిల్లలు, మిత్రులకు, మిగతా యాబై శాతం నాకేనండి. ఎప్పుడు కూడా నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకోలేదు. ఎదురొచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని, కష్టపడి విజయం సాదిస్తూ వచ్చాను. కాని మొదటిసారి ఒక లక్ష్యం నిర్దేశించుకుని వెళుతున్నాను.. దానివైపు పరిశ్రమించాలి. మీ దీవెనలు కావాలి..
బ్లాగ్ మిత్రులందరికీ మనఃపూర్వక నమస్సుమాంజలి..

Thursday, 10 September 2009

ష'డ్రుచో'పేతమైన సాహితీ విందు...





రెండేళ్లక్రింద నేను , కొత్తపాళీగారు కలిసి పొద్దుకోసం రాసిన షడ్రుచుల సాహిత్యానికి మరికొన్ని పద్యాలు జోడించి పత్రికలకు పంపగా ఆంధ్రప్రభలో మృగశిర కార్తె రోజు సాహిత్య విభాగంలో ప్రచురించబడింది. ఈ వ్యాసాన్ని కష్టపడి, ఇష్టపడి కొత్తపాళీగారి సహకారంతో రాసాను. ఈ వ్యాసం మూలంగానే నాలో సాహిత్యాభిలాష మొదలైంది.. ఈ వ్యాసం రాయడానికి ప్రోత్సహించిన త్రివిక్రమ్ కి ధన్యవాదాలు. ఈ వ్యాసానికి సంబంధించి అన్ని హక్కులు కొత్తపాళీగారు నాకు అప్పుడే ఇచ్చేసారు కాబట్టి పత్రికలో నాపేరుతో పంపించాను.. ఈ వ్యాసం కోసం నవ్వుటద్దాలు, ఆముక్తమాల్యద, శ్రీనాధుని చాటువులు మొదలగు పుస్తకాలనుండి పద్యాలు సేకరించబడ్డాయి..


"ఆకలి రుచెరుగదు” అని సామెత చెప్పిన మన పూర్వులే “పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ” అని కూడా శలవిచ్చారు. కోటి విద్యలూ కూటికోసమే అయినా రుచి లేని కూడు ఎవరికి మాత్రం ఇష్టం చెప్పండి? మామూలు మానవమాత్రుల సంగతే ఇలాగుంటే నిజంగానే మరి కోటి విద్యలు నేర్చిన మహా విద్వాంసులు, స్తుతమతులైన ఆంధ్ర కవులు , మన తెలుగు కవిధూర్జటుల సంగతి వేరే చెప్పాలా?

అప్పడుపు కూడు భుజించుటకన్న సత్కవుల్ హాలికులైన నేమి?” అని తృణీకరించటం పోతనగారికి చెల్లింది గానీ .... హాలికులైనా, (శ్రీశ్రీ మాటల్లో) ఆల్కహాలికులైనా మన కవులు “భోజనం దేహి రాజేంద్ర, ఘృతసూప సమన్వితం” అంటూ తమ కవిత్వంలో భోజనానికి పెద్దపీటే వేశారు. అంతేనా! మనవాళ్ళు సుష్టుగా భోజనం చెయ్యడంతో తృప్తిపడి ఊరుకోలేదు. ఏ రుచి ఎలా వస్తుందీ అని వంట మీద కూడా తమ దృష్టిని నిలిపారు.


పదనుగ మంచి కూర నలపాకము జేసిననైన గాని నిం పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా

అని భాస్కర శతకకారుడు ఉప్పుని ఆకాశానికెత్తితే, అన్నన్నా అంటూ కొరవి గోపరాజు గారు

గరిత లేని యిల్లు దొర లేని తగవును
చింత
పండు లేని వింత చవియు
చనువులేని
కొలువు శశిలేని రాత్రియు
ముక్కులేని
మొగము నొక్క రూపు

ఇలా చింతపండుని సింహాసన మెక్కించారు.

ఇక కవిసార్వభౌముడైన శ్రీనాథుడు వీటన్నటినీ వదిలి పెట్టి ఏకంగా నరమాంసం ఎలా వండాలో చెప్పాడు చక్కటి చంపకమాలలో తన హరవిలాసం కావ్యంలో భక్త శిరియాళుడి కథ చెబుతూ.

మిరియము నుల్లియున్ బసుపు మెంతియు నింగువ జీరకర్ర
ర్కరమును
చింతపండును గరాంబువు కమ్మని నేయి తైలమున్
పెరుగును
మేళవించి కడుపెక్కు విధంబుల పాక శుద్ధి వం
డిరి
శిరియాళునిం గటికి డెందమునం దరలాక్షులిద్దరున్ !!


అంటూ బ్రహ్మాండంగా వర్ణించేశాడు.


కొండవీటి సీమలో సకల వైభోగాలనుభవించిన శ్రీనాథుడు విధి వశాత్తూ దేశాటనం చెయ్యవలసి వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన్ని అన్నిటికన్నా బాధించింది ఆయా సీమల వింత రుచులు, భోజనపు అలవాట్లు. ఆయన హాస్యమూ, అపహాస్యమూ, కోపమూ .. అన్నీ మంచి రసవంతమైన పద్యాలుగా జాలువారాయి - ఎంతైనా కవిసార్వభౌముడు కదా! పల్నాటి సీమని చూసి


రసికుడు పోవడు పల్నాడు” అని మొదలెట్టి, “కుసుమాస్త్రుండైన (మన్మథుడైనా) జొన్న కూడే కుడుచున్”అని నొసలు చిట్లించాడు. చల్లా యంబలినీ ఉడుకు బచ్చలి శాకాన్నీ తట్టుకోలేక పూతన చన్నుల విషాన్ని పీల్చేసిన బాలకృష్ణుణ్ణే సవాలు చేశాడు, దమ్ముంటే ఇది తినమని. ఒకసారి ఖర్మకాలి ఎవరో అరవాయన ఈయన్ని భోజనానికి పిలిచాడు. దానికిదీ పర్యవసానం!

తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు చారు
చెవులలో
పొగవెళ్ళి చిమ్మిరేగ
పలు
తెరంగులతోడ పచ్చళ్లు చవిగొన్న
బ్రహ్మరంధ్రము
దాక పారునావ
యవిసాకు
వేచిన నార్నెల్లు పసిలేదు
పరిమళమెంచిన
పండ్లు సొగచు
వేపాకు
నెండించి వేసిన పొళ్ళను
కంచాన
గాంచిన కక్కు వచ్చు
అరవ
వారింట విందెల్ల నాగడంబు
చెప్పవత్తురు
తమ తీరు సిగ్గులేక
చూడవలసెను
ద్రావిళ్ళ కీడు మేళ్ళు !!


అంటూ అసలే భోజన ప్రియుడైన శ్రీనాధుడు అలవాటు లేని తమిళుల భోజనంపై అనాసక్తతను తెలియచేశాడు.

ఇక చివరికి గౌడ డిండిమ భట్టుని జయించటానికి కర్ణాటక రాజ్యానికి వెళ్ళినప్పుడు వడ్డించిన నువ్వులపొడి ఘాటు భరించలేక చేతులెత్తేసి

వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్థ వడ్డింపగా ..
చల్లా
యంబలి ద్రావితిన్ ..
తల్లీ
కన్నడ రాజ్యలక్ష్మీ! దయ లేదా! నేను శ్రీనాథుడన్ !”


అని మొరబెట్టుకున్నాడు, పాపం. ఆ మొరలో కూడా ఎంత గీర!!


పల్నాటి సీమలో పర్యటించేటప్పుడు శ్రీనాధుడు అక్కడి ప్రజల ఆహారపుటలవాట్ల గురించి వివరించాడీ చాటువులో. సర్వం జొన్నమయం పల్నాటిసీమలో.


బానెడు జొన్న వంటకము,పంటెడు బాలును, మేటి చారు, యెం
తేనియు
బుల్లగూర,కడు దేరిన మజ్జిగ పెద్ద చెంబెడున్
బూనిచి
కమ్మ చౌదరులు బొఱ్ఱలు పెంచుక కొండవీటిలొ
గానరు
కుంభకర్ణ,గజకర్ణ,హిడింబ, బకాసురాదులన్!!


జొన్నకలి, జొన్నయంబలి
జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్
సన్నన్నము
సున్న సుమీ పన్నుగ పల్నాటిసీమ ప్రజలందఱకున్



పల్నాటి సీమలో నీటివనరులు తక్కువగా ఉన్నాయి. అందుకే వర్షాధార పంట అయిన జొన్నలే పల్నాటి ప్రజలకు ముఖ్య ఆహారము అని శ్రీనాధుడు ఈ పద్యంలో వివరించాడు. జొన్నకలి, జొన్నయంబలి , జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలే తప్ప సన్న బియ్యమన్నం పల్నాడు ప్రజలకు తెలీదు అని శ్రీనాధుడు చెప్పాడు.


పల్నాటిసీమలోని జొన్నన్నములో ఏదో విశేషముందేమో అందుకే శ్రీనాధుడు ఆ గరళకంఠుడికి ఇలా “ హరా! గరళము మ్రింగినానని గర్వించకు. ఒక్కసారి పల్నాడుకు వెళ్లి ఆ జొన్న మెతుకులు తిని చూడు , నీ బిరుదు వదులుకుంటావేమో! “అని సవాలు చేసాడంట.


గరళము మ్రింగితి ననుచున్
బురహర
! గర్వింపబోకు, పో పో పో, నీ
బిరుదింక
గానవచ్చెడి
మెఱసెడి
రేనాటి జొన్న మెతుకులు దినుమీ!


ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో తిన్నడి ఎంగిలి మాంసము తిన్న శివుణ్ని ఇలా ప్రశ్నిస్తాడు. ఆ చమత్కారం తిలకించండి.


నీకున్ మాంసము వాంఛయేని కఱవా ! నీ చేత లేడుండగా
జోకైనట్టి
కుఠారముండ ననల జ్యోతుండ నీరుండగా
పాకం
బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపకా బోయ చే
చే
కొంటెంగిలి మాంసమిట్లు దగునా ? శ్రీకాళహస్తీశ్వరా!!


లేడి, దాన్ని చంపడానికి గొడ్డలి, ఆ మాంసం ఉంచటానికి గిన్నెలాంటి పుర్రె , ఉడికించటానికి నీరు,నిప్పు - అన్నీ నీ దగ్గరే వున్నాయి కదా ఆ బోయవాడి ఎంగిలి మాంసమెందుకు తిన్నావని ధూర్జటి ప్రశ్న . ఇలా వెక్కిరిస్తున్నట్టు చేసే పొగడ్తని నిందాస్తుతి అంటారుట.


ప్రబంధకవులిలా రెచ్చిపోతుంటే పదకవులా ఊరుకునేది ?


తెవులు బడిన వాడు తినబోయి మధురము
చవిగాక
పులుసులు చవిగోరినట్లు” –

అని
ఉపమించాడు పదకవితా పితామహుడు. జ్వరమొచ్చిన వాడికి తియ్యటి పాయసం ఎలా సహిస్తుంది - వాడి నోటి చేదుకి వాడు పులుసుల్నే కోరుకుంటాడు. అట్లాగే తియ్యటి నీ నామాన్ని మరచి మేము ఈ సంసార లంపటాన్ని కోరుకుంటున్నాము ప్రభో అని తాళ్ళపాక అన్నమయ్య రోగనిర్ధారణ చేశాడు.



ఇదే ధోరణిలో భద్రాచల రామదాసు “శ్రీరామ నీనామ మేమిరుచిరా” అని పాడాడు. అంతే కాదు, “పాలు మీగడలకన్నా, పంచదార చిలకల కన్నా” అని కొసరు వేశాడు. త్యాగరాజ స్వామి ఇంకో మెట్టు పైకెక్కి “స్వరరాగలయ సుధారసమందు వరరామ నామమనే ఖండ శర్కర మిశ్రము చేసి భుజియిం“చమన్నారు.



ఆగండాగండి, వడ్డించాల్సిందింకా చాలా ఉంది, అప్పుడే స్వీట్లలోకి రావట్లేదు. “ఆహార వ్యవహారాల్లో” అంటాం కదా .. అక్కడ కూడా ఆహారందే అగ్రతాంబూలం. అసలు విషయమేవిటంటే వంట, భోజనం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అంతర్గత భాగాలు. మన ప్రాంతం, కుటుంబ ఆచారాలు, మన స్థితిగతులు - ఇవన్నీ మన ఆహారపు అలవాట్లని ప్రభావితం చేస్తాయి. ఆముక్తమాల్యదలో గోదాదేవి తండ్రియైన విష్ణుచిత్తుడు అనుదినం వైష్ణవులకు భోజనాలు పెడుతూ వారి సేవచేస్తుంటాడు. ఆ భోజన వైభవం వర్ణించటానికి రాయలవారికి ఒక పద్యం చాలక ఏకంగా నాలుగు పద్యాల్లో వర్ణించాడు. వానాకాలంలో కట్టెలు మండవనీ, పొగరాకుండా వంట చేసేందుకు స్త్రీలు ఎండు కొబ్బరిడెక్కల్ని ఉపయోగిస్తారనీ రాయలవారికెలా తెలిసిందో! ఇంతకీ ఏమి వడ్డించారయ్యా అంటే



“…….. ……. ……. కలమాన్నము , నొల్చిన ప్రప్పు , నాలుగే న్బొగిపిన కూరలున్ , వడియముల్, వరుగుల్, పెరుగున్, ఘృతప్లుతిన్.”


వరి అన్నం , పొట్టుతీసి వొండిన పప్పు, నాలుగైదు పోపు వేసిన కూరలు .. ఇలా .. పెరుగుని కూడా నేతిలో ముంచారా ఏవిటని సందేహం వెలిబుచ్చితే,”ఆ మాత్రం ఇంగితం ఉండక్కర్లేదూ! పెరుక్కి ముందు వాటికి మాత్రం ఆ చివరి ఘృతాన్ని అన్వయించుకోవా”లని శలవిచ్చారు మా ఆచార్యులవారు. సరే కానివ్వండి. పోపంటే గుర్తొచ్చిందండీ .. ఇటీవలి కవి మన కరుణశ్రీ గారు అన్నారు –“అమ్మ నీచేతి తాలింపు కమ్మదనము - భరతదేశాన ఘుమఘుమా పరిమళించె



పోపు లేనిదేమి వంటండీ ? ఆఖరికి చారు పెట్టుకున్నా అందులో పోపు వేసుకోవాలి కదా. అందుకే కాబోలు ఎవరో అన్నారు - పోపు పెడితే పొలిమేర దాకా ఘాటు రావాలి అని. ఎట్లాగూ ఈ కాలపు కవులని కూడా తల్చుకున్నాం కదా, కాసేపు అవధానాల్లోకి తొంగి చూద్దాం . ఈ అవధానపు పృఛ్ఛకులుంటారే .. వాళ్ళకి నిజంగానే “కాదేదీ కవితకనర్హం” అనిపిస్తుంది కాబోలు. తిరుపతి వెంకట కవులంతటి వాళ్ళని పట్టుకుని చిలకమర్తి వారు పకోడీ మీద పద్యం చెప్పమన్నార్ట - వీళ్ళేనా తక్కువ తినేది?


శనగపిండి ఉల్లిపాయ చిన్ని మిర్పకాయలన్
జునిపి
అందు అల్లమంత దొనిపి ముద్దచేసినన్
అనల
తప్తమైన నేతియందు వైచి వేచినన్
జను
పకోడి అనెడు పేర చక్కనైన ఖాద్యమౌ !!


దోరగా వేగిన చిట్టిపకోడీ లాంటి పద్యం మనముందుంచారు .


ఒక గడుగ్గాయి పృఛ్ఛకుడెవరో దత్తపది అనే అంశంలో “అంబలి, చింతకాయ , కూరగాయ, పాల నేతి ” ఈ నాలుగు తెలుగు మాటల్ని ఉపయోగించి సంస్కృత శ్లోకంలో శ్రీకృష్ణుణ్ణి స్తుతించమంటే అవధానిగారి సమాధానమిది.



అంబలి ద్వేషిణం వందే (అం + బలి = బలిని అణచినట్టి)
చింతకాయ
శుభప్రదం (నిను చింతించువారికి శుభాలనిచ్చేటి)
కూరగాయ
కృతత్రాసం ( కు+ఉరగాయ = చెడ్డపాముని, కాళీయుణ్ణి మర్దించిన)
పాలనేతి
గవాం ప్రియం !! ( అవుల్ని కాయటం ఇష్టమైన శ్రీకృష్ణునికి వందనం!!)



అని చెప్పి ఊరుకున్నారు. తుమ్మల సీతారామమూర్తి కవిగారి 'సంక్రమణ లక్ష్మీ' విందు భోజనపు పిలుపు చూద్దామా. నోరూరించే ఈ సీస పద్యం తిలకించండి.


సీ. లేగటిపాలలోః గ్రాగి మాగిన తీయ
తీయ
కప్పురభోగి పాయసంబు
చవులూరు
కరివేప చివురాకుతో గమ
గమలాడు
పైరవంకాయ కూర
తరుణకుస్తుంబరీ
దళమైత్రిమై నాల్క
త్రుప్పుడుల్చెడు
నక్కదోసబజ్జీ
క్రొత్త
బెల్లపుః దోడి కోడలై మరిగిన
మదురు
గుమ్మడి పండు ముదురు పులుసు



తే
.గీ. జిడ్డు దేఱిన వెన్నెల గడ్డ పెరుగు
గరగరిక
జాటు ముంగాఱు జెఱకురసము
సంతరించితి
విందుభోజనము సేయ
రండు
రండని పిలిచె సంక్రమణలక్ష్మి.



అంటూ సంక్రాంతి రోజుల్లో దొరికే పదార్ధాలతో విందుభోజనం చేసేందుకు సంక్రాంతిలక్ష్మి పిలుస్తున్నదని రాశారు.

ఇక మన సినీకవులు కూడా పాటలను ఘుమఘుమలాడించారు. అందులో మరిచిపోలేనిది
"వివాహ బోజనంభు , వింతైన వంటకంబు." ఆ పాట వింటుంటే నోరూరని తెలుగువాడు ఉన్నాడంటే అతిశయోక్తి అనుకోవచ్చు.



తృప్తిగా వడ్డించినట్టే లేదు, ఇంకా రుచి చూడవలసినవి చాలా ఉన్నాయి , మీరేమో అప్పుడే భుక్తాయాసం అంటూ చెయ్యి కడుక్కోవడానికి లేస్తున్నారు. సరే కానివ్వండి . ప్రస్తుతానికి “రమణీప్రియ దూతిక యిచ్చే కప్పురపు విడెం” ఉంటే గాని పద్యం పలకదన్న పెద్దన గార్ని తల్చుకుని శలవు పుచ్చుకుంటాం.



జ్యోతి వలబోజు

Wednesday, 9 September 2009

ప్రేమ ఎంత మధురం...



ప్రేమ అనేది అర్ధం చెప్పలేని అనుభూతి .. ఇది యవ్వనంలో ఉన్నవారి మధ్యే కాదు ఎవరికైనా కలుగుతుంది. సృష్టిలోని ప్రతి వస్తువు, మనిషిని ప్రేమించగలగడం అనేది ఒక అద్భుతమైన వరం. కాని నేటి యువతరానికి ప్రేమ అంటే ఆకర్షణ, శారీరక సంబంధం అనుకుంటారు, అలనాటి పాత తరంలోని వారికి ప్రేమ అంటే ఒక బూతు మాట, అక్రమ సంబంధం అంటారు.కాని ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, లవ్ అనేది అనిర్వచనీయమైనది. దానికి పరిమితులు,హద్దులు ఉండవు..
ఇక వయసులో ఉన్నవారు ప్రేమలో పడితే వాళ్లకు అన్నీ అపురూపమే. చెలి/చెలికాడు తోడుంటే ప్రకృతి ఆంతా రమణీయమే..



అసలు అమ్మాయిలు చాలా అమాయకులు. బుద్దిగా చదువుకుంటూ ఉంటారు.కాని తెలివైన అబ్బాయిలు చదువుకున్న అందమైన అమ్మాయిని మాటల్లో పెట్టి ,ప్రేమ బుట్టలో పడేస్తారు. అన్ని సుగుణాలు ఉన్న ఆ ఇంతిని తెలివిగా ప్రేమించి, తమని ప్రేమించేలా చేసుకుని జీవిత భాగస్వామిని చేసుకుంటారు. ఇది నిజం.. ఆ ప్రేమ కలకాలం చెక్కు చెదరకుండా ఉంటే ఎంతో మేలు .. అదే నిజమైన ప్రేమ, ఆకర్షణ కాదు. అసలు ఆ అమ్మాయి ఒప్పుకోవడానికి మొదట్లో కాస్త తటపటాయిస్తుంది. ఆ అబ్బాయి ఎందువల్ల గొప్పవాడు అని ఆలోచిస్తుంది. పాపం అబ్బాయి తను ఎంత గాడంగా ప్రేమించేది తెలియజేయడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది.. తప్పదు కదా..


ఈ సోదంతా ఎందుకు అంటారా??


సాధారణంగా నాకు పాత పాటలే ఇష్టం.మంచి సాహిత్యం,సంగీతం, స్వర మాధుర్యం ఉంటాయని. ఇప్పుడు వస్తున్నా పాటల్లో అన్నీ గానా బజానాలు, చెవులు దద్దరిల్లే సంగీతం, అర్ధం కాని సాహిత్యం లేదా అర్ధమంటూ లేని సాహిత్యం. కొన్ని పాటలు వింటే మనసు పులకరిస్తుంది. ఉల్లాసంగా , ఉత్సాహంగా ఉంటుంది. మరి కొన్ని పాటలు వింటే చిరాకు, కోపం వస్తుంది.వాటికంటే రైల్లో పిల్లలు పాడే పాటలు మేలు అనిపిస్తుంది. కాని ఈ మధ్య ఒక పాట నాకు తెగ నచ్చేసింది. లేటెస్ట్ సినిమా "మగధీర"లోని పంచదారా బొమ్మ.. సినిమాలోని మిగతావిషయాలు పక్కన పెడితే ఈ పాటలో సాహిత్యం, సంగీతం , నూతన గాయకుడి స్వరం చాలా బావున్నాయి. సినిమా కూడా సినిమాలా చూస్తె పర్లేదనుకోండి.


ఈ పాటలో ప్రియుడు చేసిన అల్లరికి ప్రేయసి అలిగి ముట్టుకోవద్దంటే అతడు గోముగా బ్రతిమాలతాడు.



పంచదారా బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా
మంచుపూలా కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకే రావొద్దంటే
యేమవుతానమ్మా
నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువ్ అందకపోతే వృధా యీ జన్మ



పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే
పసిడిపువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట
ఈ పువ్వు చుట్టు ముళ్లంటా
అంటుకుంటే మంటే వొళ్లంతా



తీగపైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంటా .. ఉరుము వెంట వరదంటా
నే వరద లాగా మారితే ముప్పంటా
వరదైనా వరమని వరిస్తానమ్మా
మునకైనా సుఖమని వుడేస్తానమ్మా
నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువ్ అందకపోతే వృధా యీ జన్మ



గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఊపిరయ్యింది నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలోని గొప్ప
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకు నాపైన
వెలుగు దారి చూపింది చినుకు లాలి పోసింది
వాటితోటి పోలిక నీకేలా



అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ
నువ్ అందకపోతె వృధా యీ జన్మ


ఆ ప్రియుడికి ఎంత ధీమానో ఈ అందాల గుమ్మని పొందేటందుకే పుట్టి తను దక్కకుంటే తన జన్మ వృధా అంటున్నాడు. అమ్మాయి మాత్రం తక్కువ తిందా. ముందు హెచ్చరిస్తుంది పువ్వు లాంటి నా చుట్టూ ముల్లుంటాయి. అవి అంటుకుంటే ఒళ్ళంతా మంటలు జాగ్రత్త అని. నువ్వు నన్ను మెరుపు తీగ అంటున్నావు. బావుంది. కాని మెరుపు వెంట ఉరుము, దాని వెంట వరద రాక తప్పదు కదా.నేను వరదలాగా మారితే నీకే ముప్పు అని వారిస్తుంది. అబ్బాయ్ ఊరుకుంటాడా? నువ్వు వరదైనా వరంగా భావించి అందులో మునిగిపోతాను అంటాడు. ఇంకా ముట్టుకోవద్దని దూరంగా వెళుతున్న భామని గోముగా అడుగుతున్నాడు. "గాలి, నేల, చినుకు , వెలుగు నిన్ను తాకితే లేనిది నేను తాకితే తప్పా?" గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపించింది, వెలుగు దారి చూపింది,చినుకు స్నానం చేయించింది.వీటన్నింటికంటే నువ్వేంటి గొప్ప. వాటితో నీకెందుకు పోలిక అని ఎదురు ప్రశ్నించింది. ఇక్కడ అతను చెప్పిన మాట మాత్రం అద్భుతమైనది.. ప్రతి అమ్మాయి ఇలాంటి మాటనే తన ప్రేమికుడి నుండి కోరుకుంటుంది కదా.. " అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా".. ఇదే ధైర్యం, రక్షణ, ప్రేమ ప్రతి స్త్రీ తన భాగస్వామినుండి కోరుకుంటుంది. పంచభూతాలకంటే ఎక్కువగా తోడుండే వ్యక్తి జీవిత భాగస్వామి కదా.. అది ప్రేమ, ఆప్యాయత,అనురాగాలతో నిండి ఉండేలా చూసుకోవడం మన బాధ్యత..

ఈ పాటలో నటీనటులకు నేను ప్రాధాన్యం ఇవ్వడంలేదు. సంగీతం, సాహిత్యం, గాయని, గాయకుల స్వర మాధుర్యం..

చిత్రం : మగధీర
గానం : అనుజ్, రీటా
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి

Monday, 7 September 2009

అలిగిన వేళనే చూడాలి...

అలక ఆడవారికి సొంతం , అందం కూడా. అలక అనేది అందరిమీద పనిచేయదు కదా. తనవాల్లపైనే ఎవరైనా అలిగేది. ఆ అలక ముద్దుగా అందంగా ఉంటేనే బాగుంటుంది. శృతి మించితే గొడవలైపోతాయి. చిన్నపిల్లల అలక అందరికీ ముద్దుగానే ఉంటుంది. అమ్మ కాదు అన్నా అలిగిన బాబును చూసి ఎవరైనా తీర్చడానికి ముందుకొస్తారు. కాస్త పెద్దయ్యాక పిల్లలు అవి కావాలి ఇవి కావాలి అని అలుగుతారు. తిండి మానేస్తారు. పెళ్ళయ్యాక అంటే... అలగడం ఆలి ధర్మం, హక్కు కూడా. అది భర్తా మీద ఐతే చెల్లుబాటవుతుంది. పెళ్ళయిన కొత్తలో అంటే అలిగిన భార్యను మురిపించి లాలించి అడిగినవి ఇస్తారు భర్త మహాశయులు. తర్వాత అస్సలు పట్టించుకోరనుకోండి. అది వేరే సంగతి.. ఇక అలిగిన ఇల్లాలు ఎం చేస్తుంది. ఒక్కసారి పాత సినిమాలలోని సత్యభామని గుర్తు తెచ్చుకోండి. మరీ అంత భారీ సీను ఉండదనుకోండి. అలక పానుపు , అలక మందిరాలు లేకున్నా కూడా అప్పుడప్పుడు ఈ అలకలు భలే ముద్దుగా ఉంటాయి. భార్య అలిగితే ఎం చేస్తుంది.. పుట్టింటికి వెళుతుంది. మరి భర్త అలిగితే.. బార్ కే వెళ్తాడా , స్నేహితుల ఇంటికి, లేదా క్లబ్బుకు వెళతాడా. ఎన్నిరోజులు, ఇంటికి రాక తప్పదుగా. అయినా ఆడవారి ఐ ఎస్ ఐ మార్కు అభిప్రాయం ఏంటంటే.. మగవాళ్ళకి అందంగా ,గోముగా అలగడం రాదు అని. ఐతే గీతే కోపం తెచ్చుకుని మాట్లాడ్డం మానేస్తారు. ఇంట్లో వాళ్ళ మీద (భార్య మీద ఎక్కువగా) అరుస్తారు.. అలకలో మెళకువలు ఆడవారికే సొంతం కదా.. ఇక్కడ ఒక్క మాట చెప్పకుండా ఉండలేను. గుండమ్మ కథలో అలిగిన ఎన్టివోడు భలే అందంగా ఉంటాడు కదా.. అందుకే సావిత్రమ్మ అంటుంది " అలిగిన వేళనే చూడాలి .. గోకుల కృష్ణుని అందాలు "

మీ వారు (ఆవిడ ) అలిగితే ఎం చేస్తారు? సరదాగా చెప్పుకోండి చూద్దాం..

ఈ విషయం మీద ప్రమదావనంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. మీరేమంటారో చూద్దామని అడుగుతున్నాను..

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008