Monday, 30 April 2012

టోరిలో (నా) బ్లాగు ముచ్చట్లు

మొన్న శనివారం అంటే ఏప్రిల్ 28 వ తేదీన తెలుగువన్ రేడియో టోరిలో RJ జయ పీసపాటి షోలో నన్ను అతిధిగా పిలిచారు. ఇందులో ఎక్కువగా నా బ్లాగు ప్రస్థానం,  తెలుగు బ్లాగుల గురించి పరిచయం చేయడం, కొత్త బ్లాగర్లకు కొన్ని సలహాలు వగైరా మాట్లాడటం జరిగింది..ఆ నాటి కబుర్లు మీకోసం..

Wednesday, 25 April 2012

‘గూగులమ్మ’ తోడుగా.. ‘నెట్టింటి’ వంటలు!




‘గూగులమ్మ’ తోడుగా.. ‘నెట్టింటి’ వంటలు!

నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ , ఇంటర్నెట్ లేని జీవనం ఊహించుకోవడం కూడా కష్టమేమో.  ఇంతటి అద్భుతమైన సాధనాన్ని కనిపెట్టిన మానవుడే నేడు దాని సహాయం లేకుండా రోజు కూడా గడవని స్థితికి చేరుకున్నాడంటే దీని శక్తిని మనం అంచనా వేయగలమా? ఇంతవరకూ మానవుడు ఆవిష్కరించిన మరే యంత్రమూ కంప్యూటర్ చూపినంత ప్రభావాన్ని చూపలేదంటే అతిశయోక్తి కాదు. సాఫ్ట్‌వేర్ కంపెనీలూ, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్లు, కాలేజీల్లోనే కంప్యూటర్ వాడతారు అనుకుంటే పొరబాటే.. అక్కడినుండే మొదలైనా నేడు కంప్యూటర్ నెట్టుతో సహా మన నట్టింట్లోకే వచ్చేసింది. అది చదువుకునే , ఉద్యోగం చేసేవాళ్లకు మాత్రమే ఉపయోగపడడం లేదు. రిటైర్ అయిన వాళ్లు, గృహిణులు కూడా సులువుగా కంప్యూటర్ ఉపయోగించగలుగుతున్నారు. ఎన్నో విషయాలు ఇంట్లో ఉండే నేర్చుకుంటో తమలోని  ఆలోచనా శక్తి, పరిశీలనా శక్తి పెరుగుతోంది. నేడు కంప్యూటర్ ప్రవేశించని రంగమంటూ లేదు. ఉదయం నిద్రలేవగానే చూసే న్యూస్‌పేపరు నుండి విద్యాలయాలు, ఆఫీసులు, పోస్టాఫీసు, రైల్వేస్టేషను ఎక్కడికి వెళ్ళినా మనకు తెలియకుండానే మన పనులు అన్ని కంప్యూటర్ ద్వారా జరుగుచున్నాయి.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ దేశమైనా, ఏ  ప్రాంతమైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఆడవాళ్లైనా, మగవాళ్లైనా అందరికీ కావాల్సింది, ఇష్టమైంది రుచికరమైన భోజనం, వంటకాలు.. ప్రాంతాలు, దేశాల వారిగా ఈ రుచులు మారుతుంటాయి. కాని దేనికదే ప్రత్యేకమైంది అని చెప్పుకోవచ్చు... మామూలుగా పప్పు, కూరలు, వేపుళ్లు చేసుకుంటాం. అప్పుడప్పుడు కొన్ని స్వీట్లు, తినుబండారాలు వగైరా. మరికొన్ని వంటల గురించి తెలుసుకోవాలంటే మార్కెట్లో ఎన్నో వంటల పుస్తకాలు దొరుకుతున్నాయి. టీవీ చానెళ్లలో కూడా ప్రతీ రోజూ మధ్యాహ్నం వంటలప్రోగ్రాములు ప్రసారం అవుతాయి. పైగా పోటీలు లక్షలు, కోట్లలో బహుమతులు. అవి అందరికి లభించవనుకోండి. కాని  ఇప్పుడు ఈ వంటలు అంతర్జాలంలో కూడా విస్తృతంగా రాజ్యమేలుతున్నాయని చెప్పవచ్చు. ఇంట్లో కూర్చునే ఎంతో సులువుగా, కానీ ఖర్చు లేకుండా, తమ మాతృభాషలోనే బ్లాగులు, వెబ్ సైట్లు ప్రారంభించి తమకు తెలిసిన వంటలు ఫోటొలతో సహా వివరంగా రాసుకుంటున్నారు .   ఆ వంటలన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడినుండైనా చూడొచ్చు. అనకాపల్లిలో ఉన్న అరుణ రాసిన బొబ్బట్ల గురించి అమెరికాలో ఉన్న అనుపమ చూసి నేర్చుకుని తయరు చేసుకోవచ్చు.. అలాగే గుజరాతీ స్పెషల్ డోక్లా కూడా ఉప్మా చేసినంత సులువుగా చేయొచ్చు.   ఇంతకు ముందులా అమ్మకు ఫోన్ చేసి ఈ వంట ఎలా చేయాలి?. ఆ మసాలాలో ఏమేం దినుసులు వేయాలి అని అడిగి ఫోన్ బిల్లు పేలిపోయేలా చేసే అవసరం లేదు. అలా కంప్యూటర్ తెరిచి అంతర్జాలంలో కావలసిన వంటకం గురించి గూగులమ్మని అడిగితే ఎన్నో బ్లాగులు, సైట్ల లింకులు దొరుకుతాయి. హాయిగా చదువుకుని చేసుకోవచ్చు. ఇంతకు ముందు వంట రాని అబ్బాయిలు, అమ్మాయిలు, కొత్తగా పెళ్లైన వారు సరియైన తిండి లేక బెంగపడిపోయేవారు. వాళ్లకేమో వంట రాదు. అమ్మ కూడా దగ్గర్లో లేదు. పరాయి ఊరు, పరాయి దేశం. సరుకులు తెచ్చుకుని చేసుకుందామన్నా ఎలా చేయాలో తెలిదు. ఫోన్ చేసి ఎంతసేపని మాట్లాడతాం?. ఎన్ని వంటల పుస్తకాలని కొంటాం అని దిగులుపడేవారు. కాని ఇప్పుడీ అవస్థలు ఉండవు. దిబ్బరొట్టైనా, అరిసెలైనా, రాగి సంకటి ఐనా, సర్వపిండి ఐనా నెట్‌లో సరియైన కొలతలతో, ఫోటోతో సహా వివరాలు లభిస్తున్నాయి.

ఈ బ్లాగులు నిర్వహించడం చాలా సులువు, వెబ్ సైట్లకు మాత్రం కొంచం ఖర్చు అవుతుంది. అందుకే ఈనాడు మన దేశీయులు నిర్వహిస్తున్న వందల బ్లాగులు భారతీయ రుచులను సవివరంగా అందిస్తున్నాయి అది కూడా అందమైన ఫోటోలతో. ఇక ఆ సరుకులు తెచ్చుకుని వండుకోవడమే. తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ, మార్వాడీ,  సింధీ, పంజాబీ,  బెంగాలీ ఇలా ఎన్నో ప్రాంతాల రుచులను సులువుగా నేర్చుకోవచ్చు. టమాటా సాస్ నుండి తందూరీ చికెన్ వరకూ, పాకం ఉండలనుండి పిజ్జాలవరకూ ఎన్నో వంటకాలు అలా నేర్చుకుని చేసుకోవచ్చు. కొన్ని బ్లాగులలో వంటలతో పాటు పోటీలు కూడా పెడుతుంటారు. గెలిచినవాళ్లకు వంటల పుస్తకలు లేదా ఉపయోగకరమైన వస్తువులను బహుమతులుగా పంపిస్తారు.  మరికొన్ని బ్లాగులలో వంటలు ఫోటోలు, వివరణతో మాత్రమే కాక వీడియోలు కూడా తయారు చేసి చూపిస్తున్నారు.  ప్రపంచంలోని అన్ని దేశాల వంటకాలను మీరు ఏ కోర్సు చేయకుండా, ఏ పుస్తకమూ కొనకుండా ఇంట్లో కూర్చునే నేర్చుకోవచ్చు. ఈ బ్లాగులు, సైట్లు నిర్వహించేవారు ఎక్కువగా మహిళలే కావడం విశేషం. ఎంతైనా ఆకలి తెలిసిన అమ్మే కదా అన్నపూర్ణ. ఎంత కాదనుకున్నా రుచికరమైన వంటలు చేయడంలో, నేర్చుకోవడంలో ఆడవాళ్లు  ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.  వంట చేయడంతోపాటు ఎన్నో చిట్కాలు వాళ్ల సొంతం కదా.

సాధారణ మహిళలే కాక సంజీవ్ కపూర్, తరలా దలాల్ లాంటి పాకశాస్త్ర నిపుణులు కూడా వంటకాల సైట్లు నిర్వహిస్తున్నారు. అలాగే వీడియోలు కూడా. ఈ బ్లాగులలో వంటలు మాత్రమే కాక ఆరోగ్యానికి సంబంధించిన వంటకాలు, పళ్లు, కూరగాయల పోషకవిలువలు, పిల్లలకు పెద్దలకు, వివిధ వ్యాధిగ్రస్తులకు ఇవ్వవలసిన ఆహారం వంటి ఎన్నో విషయాలను కూడా ఈ బ్లాగులు, సైట్ల ద్వారా అందిస్తున్నారు. వాహ్ రె వాహ్ అంటూ ఎన్నోరకాల వంటల వీడియోలు మాత్రమే అందించే సైటు ఉంది. కాని దాదాపు ఎక్కువ సైట్లు, బ్లాగులు ఇంగ్లీషులోనే ఉన్నాయి. ప్రాంతీయ బాషల్లో కూడా ఉన్నాయి , ముందు ముందు అవి కూడా పెరగొచ్చు. మన తెలుగులో కూడా రుచికరమైన  వంటలు అందించే బ్లాగులు ఉన్నాయి.  కొంతమంది ఉల్లి, వెల్లుల్లి లేని వంటలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు.. తెలుగు వారి వంటలను ఇంగ్లీషులో అందించే వెబ్ సైట్లు ఎన్నో ఉన్నా  అచ్చమైన తెలుగులో అందించే ఒకే తెలుగు వెబ్ సైట్  షడ్రుచులు.    ఈ వంటల బ్లాగుల గురించి ఎలా తెలుస్తుంది?. ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఏమేం రాసారో ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? అచ్చంగా వంటల బ్లాగులన్నీ ఒక్క చోట చూపించే ఆగ్రిగేటర్ లేదా సంకలిని ఉంది. అదే http://foodworld.redchillies.us/ ..  ఈ బ్లాగులు రాసేవారందరూ ఒకరికొకరు వ్యక్తిగతంగా పరిచయం లేకున్నా వంటల ద్వారా స్నేహితులుగా మారుతున్నారు. పలకరించుకుంటూ తెలిసినవి, తెలియనివి పంచుకుంటారు.  అప్పుడప్పుడు కలుస్తుంటారు కూడా..

ఈ వంటలు బ్లాగుల ద్వారానే కాకుండా ఈనాడు విరివిగా వాడుతున్న ఫేస్‌బుక్ లో కూడా వంటల పేజీలు, గ్రూపులు ఎన్నో ఉన్నాయి. తమ వంటకాలను ఈ పేజీలు, సమూహాల ద్వారా పంచుకుంటూ చర్చించుకుంటారు ఆహార ప్రియులు, పాకశాస్త్ర  ప్రియులు.. అంతే కాక ఆహార సంబంధిత వస్తువులను తయారు చేసే సంస్థలు, గృహోపయోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు కూడా వెబ్ సైట్లు , ఫేస్‌బుక్‌లో పేజీలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు పోటీలు పెట్టీ అందమైన బహుమతులు అందిస్తున్నారు ఈ కంపెనీలవాళ్లు. దీనివలన ఎంతోమందికి ప్రోత్సాహకరంగా ఉంటోంది. వంటలు పంచుకుంటూ, నేర్చుకుంటూ, తెలియనివి తెలుసుకుంటూ, పోటీలలో పాల్గొంటూ తమలోని ఉత్సాహాన్ని, కుతూహలాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇదంతా జరిగేది కానీ ఖర్చు లేకుండా. ప్రతీ ఇంట్లో కంప్యూటర్, నెట్ కనెక్షన్ ఎలాగూ ఉంటుంది. దాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చన్నమాట.
కొన్ని ముఖ్యమైన, ప్రాచుర్యం పొందిన వంటల బ్లాగులు, వెబ్ సైట్లు మీకోసం.. ఇంతకు పదింతల బ్లాగులు, సైట్లు మీకు జాలంలో లభిస్తాయి.. ఓపికగా వెతకాలి.. చదవాలి..చేయాలి... తినిపించాలి. అన్నదాతా సుఖీభవా అనేలా చేయాలి.



Tuesday, 24 April 2012

లయ తప్పిన గుండెకు అండగా


లయ తప్పిన గుండెకు అండగా

అందమైన చిన్న కుటుంబం. భార్యా, భర్త, ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగిపోతున్న సంసారనావ అనుకోకుండా ఒక సుడిగుండంలో చిక్కుకుంది. ఆ సంసారానికి మూలస్తంభమైన ఇంటి ఇల్లాలు ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. దాంతో ఆ కుటుంబమే అతలాకుతలమైంది. ఆస్త్రేలియాలోని మెల్‌బోర్న్ లో ఉంటున్న మారీ భర్త, కొడుకు,కూతురితో సంతోషంగా ఉంటుంది. 2007లో ఒక రోజు కూతురితో ఏదో విషయమై వాగ్యుద్ధం జరిగింది. మరునాడు నిద్ర లేస్తూనే మారీ కుప్ప కూలిపోయింది.. ఆమె క్రమంగా నీలంగా మారిపోవడం చూసాడామె భర్త. వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి అది వచ్చేలోగా CPR పద్ధతితో గుండెను తిరిగి కొట్టుకునేలా చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. సుమారు అరగంట పట్టింది ఆమెలో కదలిక తేవడానికి. హాస్పిటల్ తీసికెళ్ళేలోపు మరో రెండు సార్లు ఆమె గుండె ఆగి, ఆగి మళ్లీ కొట్టుకుంది. హాస్పిటల్‌లో డాక్టర్లు కూడా పదిశాతం మాత్రమే ఆశ ఉందని చెప్పారు. కాని మారీలోని పోరాట పటిమ, బ్రతకాలనే కోరిక గాఢంగా ఉండడమో, దేవుని అనుగ్రహమో ఆరు వారాల తర్వాత మారీ ఇంటికి తిరిగి వచ్చింది కాని ఆమె జీవితం ముందులా లేదు. ఆ తర్వాత ఎన్నో సార్లు సుస్తీ అయింది. దానివల్ల ఆమె కాళ్లు దెబ్బతిన్నాయి . ఊతకర్ర లేకుండా నడవలేకపోయేది. ఇంతకుముందైతే ఎవరి మీదా ఆధారపడకుండా జీవితం సాఫీగా గడిచిపోయేది కాని ఇపుదు ప్రతీదానికి ఒకరిమీద ఆధారపడక తప్పలేదు. రాన్రానూ ఆమె పరిస్థితి దిగజారి చివరికి వీల్ చెయిర్ తప్పనిసరి అయింది..

ఇదంతా ఎందుకు జరిగింది అంటే .. ఎందుకో మరి ఆమె గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. లయబద్ధంగా లబ్ డబ్ అనే గుండె లయ తప్పింది. దీనినే Arrhythmia అంటారు. అంటే లయబద్ధంగా కొట్టుకునే గుండె అతివేగంగానూ, అతి నెమ్మదిగానూ కొట్టుకుంటుంది. దానివల్ల రక్తప్రసరణలో కూడా లొపం ఏర్పడడంవల్ల మిగతా అవయవాలు, నాడీమండలం మొత్తం దెబ్బతింటుంది. ఒక్కోసారి ఇది అంత ప్రమాదకరం కాకపోవచ్చు కూడా అలా అని నిర్లక్ష్యం చేయరానిది. మారీకి కూడా ఇలాగే జరిగింది. ఆమె హృదయపు అస్తవ్యస్త స్పందన వల్ల మారీ శరీరంలోని మిగతా అవయవాలు కూడా దెబ్బతినడం ప్రారంభించాయి. గుండె సక్రమంగా పనిచేయడానికి పేస్ మేకర్ అమర్చారు. కాని ఆమె జ్ఞాపకశక్తి క్షీణించడం మొదలైంది. ఆమె దాదాపు 50 కిలోల బరువు తగ్గిపోయింది.. చర్మసంబంధ వ్యాధులు కూడా మొదలయ్యాయి. కాని డాక్టర్లు కూడా ఈ విషయంలో ఇంకేమీ చేయలేమని చేతులెత్తేసారు. మారీకి వచ్చిన అరుదైన వ్యాధి వంశపారంపర్యంగా వచ్చిందేమో అనుకుంటే ఆమె తలితండ్రులెవరో తెలీదు. ఆమెను చిన్నప్పుడే దత్తత ఇచ్చారు. ఆమె అస్సలు నడవలేకున్నా అదృష్టవశాత్తు తన చేతులను ఉపయోగించుకుని కంప్యూటర్ వాడకం నేర్చుకుంది. ఇప్పుడు ఆ కంప్యూటరే ఆమెకు జీవితంగా మారిపోయింది. కంప్యూటర్లో గేమ్స్ ఆడుతూ, వంటల గురించి చదువుతూ ఉంటుంది. కాని అవి మరునాటికి గుర్తుండవు. కాని ఇలా ఎక్కువ సమయం కంప్యూటర్ మీద గడపడంవల్ల తన జబ్బుకు సంబంధించిన విషయాలమీద ధ్యాస ఉండదని అంటుంది మారీ.

ఇంత బాధలో ఉన్న మారీని ఆమె భర్త పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆమెను దగ్గరుండి చూసుకోవడానికి ఆమె భర్త ట్రెవర్ తన ఉద్యోగం వదిలేసాడు. కదిలితేనే నొప్పితో విలవిలలాడిపోవడం, మతిమరపు కూడా రావడం వల్ల ట్రెవర్ ఆమెను పసిబిడ్డలా చూసుకోక తప్పలేదు. ఆమెకోసం తన జీవనశైలినే మార్చుకున్నాడు. ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. మారీ కోసం ఇంట్లో కూడా చీకటి గదిలో ఉండాలి. దీనివల్ల తాను నష్టపోయిందేమి లేదని, మారీ కోసం నేర్చుకుంటూ ఎన్నో కొత్త కొత్త వంటల ప్రయోగాలు చేసి నైపుణ్యం సాధించానని, తనకు ఇష్టమైన చిత్రలేఖనాన్ని కొనసాగించానన్ని ట్రెవర్ అంటారు. అంతే కాక తన చిత్రాలతో ఒక ప్రదర్శనలో కూడా పాల్గొంటున్నానని చెప్పారు. 28ఏళ్ల సాహచర్యంలో తన సహచరిని ఎలాగున్నా ప్రాణంలా చూసుకుంటానని ట్రెవర్ అంటున్నారు.

Sunday, 22 April 2012

కలుసుకుందాం రండి....


ఎప్పుడు తిని తొంగుంటే ..... అన్నట్టు ఎప్పుడూ ఇల్లు, పిల్లలు, వంట అనుకోకుండా అప్పుడప్పుడు తమకంటూ ఒక సమయం పక్కకు తీసిపెట్టుకుని ఇష్టమైన పనులు చేయాలి అనుకున్న ప్రమదావనం సభ్యులు చాలా రోజులైంది మనం కలిసి ఓ సారి సమావేశం అవుదాం అని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఐతే మంచిది అంటే అబ్బా ఆదివారమా?? ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది కదా నాకు వీలు కాదు అని నేనంటే గయ్యిమన్నారు. మాకు మాత్రం పనుండదేంటి?? అదేం కుదరదు రావాల్సిందే అన్నారు. సరే కానివ్వండి అని ప్లానింగ్ మొదలెట్టాం. ఒక్కోరు ఒక్కో పని నెత్తినేసుకున్నారు. హైదారాబాదులో ఉన్న మహిళా బ్లాగర్లను, ప్లస్సర్లకు ఫోన్లు, మెయిల్స్ ద్వారా పిలుపులు వెళ్ళాయి. భోజనాల మెనూ డిసైడ్ అయింది. అందరు తమ ఇంట్లో నోటీస్ ఇచ్చేసారు ఆదివారం మాది . గెట్ టుగెదర్ ఉంది. లంచ్ పార్టీ. మీ సంగతి మీరు చూసుకోండి అని భర్త, పిల్లలకు చెప్పేసి పన్నెండుగంటల వరకు ఈరోజు మాలాకుమార్ గారి ఇంట్లో అందరు చేరుకున్నారు తమ వంతు వంటకంతో..

ఎంత మంది వచ్చారంటే మొత్తం పదమూడు మంది అయ్యారు. కొందరు వేరే ఊర్లో ఉంటున్నాం అన్నారు. ఊర్లో ఉన్నవారు వేరే పనుందన్నారు. ఇక వచ్చింది ఎవరెవరంటే సుజాత వాళ్ల అమ్మాయి సంకీర్తన , సి.ఉమాదేవి , జి.ఎస్.లక్ష్మి , స్వాతి చక్రవర్తి, అన్నపూర్ణ, సుజ్జి, వరూధిని, జ్ఞానప్రసూన, ఫై.ఎస్.ఎం.లక్ష్మి, మాలాకుమార్ (హోస్ట్), జ్యోతి, రమణి వాళ్ళ అమ్మాయి మౌనిక, ..చివరిలో కలసిన మంథా భానుమతి... సుజాత గారు వేరే పనుందని తొందరగా తినేసి వెళ్ళిపోయారు. అంతవరకూ మేము కోక్, చిప్స్, మంచింగులతో పరిచయాలు చేసుకున్నాం. ముందుగా జ్ఞానప్రసూనగారు అందమైన కవిత రాసుకొచ్చారు. అది   సురుచి బ్లాగులో చూడొచ్చు. చిట్టీలు వేసి మిస్ గెట్ టుగెదర్ గా వరూధినిగారిని ఎన్నుకున్నాం. జ్ఞానప్రసూనగారు వరూధినిగారికి చిన్నదే అయినా అందమైన గిఫ్ట్ ఇచ్చారు. అలా సమయం గడిచింది తెలియలేదు. అందరూ తెచ్చిన డబ్బాలు టేబిల్ మీద పెట్టుకుని ఒక్కోటి ఎవరెవరు తెచ్చారు అనుకుంటూ తీరిగ్గా భోజనాలు కానిచ్చాం. రోజూ ఇంట్లో వాళ్లకు అడిగి వడ్డించడం అలవాటైన మాకు ఇలా తీరిగ్గా కూర్చుని తినడం అరుదైన విషయమే మరి.. భోజనాలు అయ్యాక కొన్ని గేమ్స్ ఆడుకున్నాం. చివర్లో అంతాక్షరి కూడా. సాయంత్రం కావస్తుంటే టీ తాగేసి. ఫోటోలు దిగేసి, మాలగారి ఇంటి వెనకాల ఉన్న ఉసిరి చెట్టు దులిపి కొన్ని కాయలు తీసుకున్నాం. మిగిలిన వంటకాలను ఎవరికీ కావలసినవి వాళ్ళు పంచుకుని ఇంటి దారి పట్టాం.ఇది చదువుతుంటే చాలా సింపుల్ గా ఉంది కదా. కాని మేమంతా ఫుల్లుగా ఎంజాయ్ చేసాం. త్వరలో మళ్ళీ మరొకరి ఇంట్లో కలవబోతున్నాం.



అవునూ ఇవాళ మా స్పెషల్స్ చెప్పలేదు కదూ..
పాలక్ పూరి,
వెజ్ బిర్యాని
క్యారట్ పెరుగు పచ్చడి
చోలే
ఆవడలు
పూర్ణాలు
పులిహోర్ విత్ బోల్డు జీడిపప్పులు
నాలుగు రకాల పచ్చళ్ళు ( రెండు కొత్తావకాయలు, దోసావకాయ, పుదీనా పచ్చడి)
సాంబార్
మజ్జిగపులుసు విత్ బజ్జీలు
కోక్ విత్ చిప్స్
మూడు రకాల స్వీట్లు (మైసూర్ పాక్, కాజాలు, మిల్క్ మైసూర్ పా )


ఏడాదిన్నర క్రితం జరిగిన మా సమావేశం వివరాలు మరోసారి చూస్తారా?

Wednesday, 18 April 2012

ఎపుడు పిలుపు వినపడదో - దేవులపల్లి కృష్ణశాస్త్రి


భావకవిత్వాన్ని ఉద్యమంగా తీర్చిదిద్దిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలు చూస్తే ఆయన సౌందర్య ప్రస్థానంలో శాశ్వతమైన స్వేచ్చ కోసం, నిర్మలమైన ప్రేమ కోసం తపన పడ్డారని తెలుస్తుంది. ప్రకృతి ప్రీతి, మానవత, భక్తి, ప్రణయం, దేశభక్తి మొదలైన అంశాలెన్నో ఆయన కవిత్వంలో స్థానం కల్పించుకుని మానవ విలువల్ని ఆవిష్కరించాయి అని అందరమూ ఒప్పుకోక తప్పదు.

కృష్ణశాస్త్రిగారు చివరి రోజుల్లో తన గొంతు పోగొట్టుకున్నారు. దానికి ఆయన బాధపడ్డా. క్రుంగిపోకుండా మరిన్ని రచనలు చేసారు. భుజానికి ఒక జోలె తగిలించుకుని అందులో కొన్ని పేపర్లు పెట్టుకుని తన మనసులోని భావాలను ఆ కాగితంలో రాసి చూపించేవారు. ఆ సమయంలో రాసిన ఒక గీతం ఇది.


ఈ గీతాన్ని అందించి, పాడి వినిపించినవారు శ్రీ ఏం.ఎస్.రావుగారు. ఆయన MLN Music Academy ద్వారా ఎంతో మంది ఔత్సాహికులకు సంగీత శిక్షణ ఇస్తున్నారు. అంటే కాదు ఈటీవీలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి పాడుతా తీయగా కార్యక్రమానికి Music Associate గా పని చేస్తున్నారు.




ఎపుడు పిలుపు వినపడదో
అపుడు అడుగు పడదు

ఎచటికో పయనమెరుగక
ఎందుకో వైనమందక //ఎపుడు//

చిరిగిన నా జోలెలోన
వరమేదీ అగపడదు
బిగిసి ఏకతార గొంతు
పెగలనే పెగలదు
అపుడేదో మనసులోన
అదే తపన తపన //ఎపుడు //

ఆగి ఆగి సాగి సాగి
అదే నడక నడక
ఆగి ఆగి మ్రోగి మ్రోగి
అదే పిలుపు పిలుపు
తెమలనీవు నా జాతర
తెలవారదు కృష్ణరజని //ఎపుడు//


అలసినప్పుడు కాస్త ఒదిగి
నిలువనీ నీ పిలుపు విన
అంతలోనే నేతి గరిగి
అంతులేని దారినీ
అదే నడక నడక
ఏదో ఆశవిడక // ఎపుడు //

Tuesday, 10 April 2012

సేవే ధ్యేయం... నృత్యం మార్గం


సేవే ధ్యేయం.. నృత్యం మార్గం


ప్రవాస భారతీయుల పిల్లల్లో కళల పట్ల ఆసక్తిని పెంచుతూ, సాంస్కృతిక వికాసానికి తనదైన శైలిలో కృషి చేస్తూ ప్రముఖ నృత్యకళాకారిణి ఉమాభారతి ఎందరి నుంచో ప్రశంసలు అందుకుంటున్నారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవన విలువల్ని వ్యాపింపజేయడంలోనే తనకెంతో ఆనందం లభిస్తోందని ఆమె అంటారు. అమెరికాలో ఉంటున్న ఈమె సాధారణ గృహిణిగా కనిపించినా, కళల ప్రస్తావన వస్తే ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారు. తండ్రి ఉద్యోగరీత్యా చెన్నైలో ఉన్నపుడు కొద్ది కాలం సినిమాల్లో పనిచేసినప్పటికీ, వివాహం అనంతరం ఈమె భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. సినిమా నటిగా తన ప్రస్థానం తక్కువ కావడంతో ఆ రంగంలో అంతగా గుర్తింపు రాలేదని బాధపడక, నాట్యరంగంలో సేవలందిస్తునే ఉన్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’లో ప్రేక్షక జనాదరణ పొందిన ‘ఆడవె అందాల సురభామిని’ పాటలో ఊర్వశిగా ఉమాభారతి నటించారు. మేజర్ సత్యనారాయణ, శారద దంపతులకు 1958లో జన్మించిన ఈమె అయిదేళ్ల ప్రాయం నుంచే నృత్యరీతులను అభ్యసించారు. పధ్నాలుగేళ్ల వయసులో హైదరాబాద్‌లో ఆరంగేట్రం చేసి, సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేతుల మీదుగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ బిరుదును అందుకున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రముఖ నృత్య శిక్షకుడు డాక్టర్ వెంపటి చినసత్యం వద్ద నాట్యంలో మెలకువలు నేర్చుకున్నారు. చిన్న వయసులోనే నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘సుడిగుండాలు’ సినిమాలో బాలనటి పాత్రలో మెప్పించారు. ప్రముఖ కవి దాశరథి నవలకు చిత్రరూపమైన ‘చిల్లరదేవుళ్లు’లో కథానాయికగా నటించారు. నటిగా, నర్తకిగా, డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఉమాభారతి సామాజిక సేవా రంగంలోనూ విశేష సేవలందిస్తున్నారు. ఈమె అసలు పేరు ఉమా మహేశ్వరి. అయితే, ‘సుడిగుండాలు’ చిత్రంలో నటించినపుడు ఆ చిత్ర దర్శకుడు ఈమె పేరును ఉమాభారతిగా మార్చారు.



అమెరికాలో స్థిరపడిన అనంతరం ప్రవాస భారతీయుల పిల్లల కోసం సంగీత అకాడమీని ప్రారంభించి, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పదిమందికీ తెలియజేయాలని పరితపిస్తున్నారు. ‘అర్చన ఫైన్ ఆర్ట్సు అకాడమీ’ని స్థాపించి నృత్య తరగతులను నిర్వహిస్తున్నారు. ఏటా వేసవిలో రంగస్థల కళలు, నృత్యం, మేకప్, అలంకరణ తదితర అంశాల్లో ప్రవాస భారతీయుల పిల్లలకు తర్ఫీదునిస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల పిల్లలకు మన కళలను నేర్పించడం అంత సులువు కాదని ఉమాభారతి అంటారు. కేవలం నాట్యం నేర్పడమే తన ఉద్దేశం కాదని, సామాజిక సమస్యలను ఆధారం చేసుకుని వాటి పట్ల పిల్లల్లో కళల ద్వారా అవగాహన కల్పించడం తన ధ్యేయమని ఆమె చెబుతుంటారు. ప్రవాస భారతీయుల పిల్లలు ఎదుర్కొనే సమస్యలపై తన కుమార్తె శిల్పతో కలిసి ‘ఆలయ నాదాలు’ అనే డాక్యుమెంటరీని నిర్మించారు. భారతీయ కళలు, సంస్కృతిని అర్థం చేసుకోవడంలో పిల్లల అవస్థలు, పెద్దలతో ఘర్షణలు వంటి విషయాలను ఈ డాక్యుమెంటరీలో హృద్యంగా చిత్రీకరించారు. వివాహ వ్యవస్థపై అవగాహన కోసం ‘కన్య’ పేరిట డాక్యుమెంటరీ నిర్మించారు. ఆలయ నిర్మాణాలకు నిధులు సేకరించేందుకు కూడా ఈమె సేవలందిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో గణేష్ ఆలయ మండపాన్ని పునర్నిర్మించేందుకు నాట్య ప్రదర్శనలిచ్చి నిధులు సేకరించారు. హైదరాబాద్‌లో విద్యాసంస్థలు, గ్రంథాలయాల నిర్మాణానికి, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా బాధితుల సహాయార్థం నిధులు సేకరించి ఇచ్చారు. నృత్యం, సామాజిక సేవతో పాటు సాహితీరంగంలోనూ కృషి చేస్తున్నారు. ఈమె రచించిన కవితలు, కథలు పలు వెబ్ పత్రికల్లో వచ్చాయి. ఎన్నో అవార్డులు పొందినా, కళాకారిణిగా తన ప్రయాణం ఇంకా సుదీర్ఘమైనదని ఈమె చెబుతుంటారు.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008