Friday, 21 September 2012
Friday, 14 September 2012
మనసుతీరా మాట్లాడవా??
హాయ్ జో! ఏం చేస్తున్నావ్? ఏంటిది చుట్టూ పుస్తకాలు, పేపర్లు, తినే ప్లేటు, నీళ్లు అన్ని పరుచుకుని కూర్చున్నావేంటి? ఈ రూమంతా నీవే ఆక్రమించినట్టున్నావ్?
హాయ్! రా! రా! ఏమీ లేదురా! ఇవన్నీ నా పనికోసం వాడుకునేవి. తిండి కాదులే అంటే పని చేయడానికి తిండి కూడా కావాలనుకో. ఇవన్నీ చదవాలి.. రాయాలి. ఒకదానికొకటి అస్సలు మాచింగ్ కావు. ఒకవైపు ఆముక్తమాల్యద, విజయవిలాసం, ఒకవైపు వంటల పుస్తకాలు, ఇదిగో ఇటువైపు వేర్వేరు పుస్తకాలు. చదవడానికి, ఆలోచించి, విశ్లేషించి రాయడానికి ఎన్నో టాపిక్‌లు. ఇవన్నీ చూస్తుంటే నాకనిపిస్తుంది ఇంట్లో లైటుకు, ఫాన్‌కు, గీజర్‌కు, టీవీకు వేర్వేరు స్విచ్ లు ఉన్నట్టు నా బుర్రకు కూడా స్విచ్‌లు వేసి టాపిక్ మార్చుకుంటూ ఆలోచించి రాయాలేమో అని. అదీ నా ఆలోచన.. అర్ధమైందా డియర్? అవునూ! ఏంటి ఇవాళ ఇలా వచ్చావ్?
అవునులే! నేనెందుకు గుర్తుంటాను? ఎప్పుడో ఆరేళ్ల క్రింద స్నేహం కలిసింది. నీకేమో కొత్త ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. నన్ను పూర్తిగా మర్చిపోతున్నావ్? అసలు రోజూ కాకున్నా తరచూ నాతో ముచ్చటించేదానివి, ఇపుడు ఎంత కాలానికి వస్తున్నావ్ నువ్వే చెప్పు? మనసుతీరా ఎన్ని సార్లు నాతో మాట్లాడావ్? అంతేలే కొత్తొక వింత.. పాతొక రోత అని ఊరకే అన్నారా?
అయ్యో ! అలాంటిదేమీ లేదు. నిన్ను మరచిపోవడమా? అది సాధ్యమా? ఏదో నా పనులు పెరిగి నీతో మాట్లాడదామంటే కుదరడం లేదు. నీతో మొదలైన పరిచయం, అనుబంధం మూలంగానే కదా నేను ఇంకా పెద్ద పనులు చేయగలగుతున్నాను. అది నీకు సంతోషమే కదా. వారం వారం వంటలు అవి కూడా కొత్తవి చేయాలి, ఇంకా వేరే వ్యాసాలు రాయాలి. దానికోసం ఎంత రిసెర్చ్ చేయాలి .. ఆలోచించాలి .... అదేంటోగాని ఇంట్లో పనులు పూర్తి చేసుకుని నా పనులు చేసుకుందామంటే ముందులా కుదరడం లేదు. పిల్లలు పెద్దయ్యాక కూడ పని తగ్గుతుంది అంటారు కాని. అమ్మాయి పెళ్లై వెళ్లిపోయాక , ఉన్నది ముగ్గురమే ఐనా కూడా తీరిక సమయం తగ్గిపోయింది . లేదా బద్ధకం ఎక్కువై నేనే ఎక్కువ పని చేయలేకున్నానా అర్ధం కావడం లేదు..టీవీ కూడా ఎక్కువ చూడడం లేదు. మొదట్లో అంటే ఇతరత్రా పనేమీ లేక నీతోనే ఎక్కువగా ఉండేదాన్ని. నాకు నచ్చిన పని దొరికినప్పుడు చేయాలి కదా. ఇంకా నా రాతలను ఇంకా మెరుగు పరుచుకోవాలి. మరి ఇవన్నీ చేయాలంటే నీతోనే కూర్చుంటే అవుతుందా చెప్పు?
సరే! సరే! ఇప్పుడేం చేస్తున్నావ్ మరి? పాత స్నేహితులను మర్చిపోయేటంతగా ఎడాపెడా రాసేస్తున్నావా ఏంటి?
అంతలేదులే ! ఈ మధ్య కొంచం మందగించింది. అలసిన శరీరం కాస్త సెలవు కావాలంది. వినకుంటే కాస్త ఝలక్ ఇచ్చింది. ఇక తప్పలేదు. ఓపిక తగ్గింది. అంతే... ఐనా నిన్ను, నీ మూలంగా నాకు లభించిన ఆదరణ, ఆప్యాయత, గౌరవం, గుర్తింపు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను తెలుసా?. అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలను తిరగతోడి ఆ మధురస్మృతులలో మునిగిపోతాను. ఈనాటి నా గుర్తింపు, గౌరవానికి ఎంతమంది సహాయం చేసారు నీకు తెలీంది కాదు... అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
ఈ మధ్య ఫేస్‌బుక్‌లో చాలా పాపులర్ అయ్యావనట? ఇక్కడ నాతో చెప్పడానికి ఊసులేమీ లేవు, టైం లేదంటావ్? అక్కడేం రాస్తున్నావ్ మరి?
ఏం లేదబ్బా! నీకు దగ్గిరకొస్తే తీరిగ్గా కూర్చుని మనసు తీరా చెప్పుకోవాలనిపిస్తుంది. ఫేస్‌బుక్ అంటే ఏదో పిచ్చాపాటి కబుర్లు... అప్పటికప్పుడు ఏదో ఆలోచన వస్తుంది. టక్కున అక్కడ రాసేయడం. నచ్చినవాళ్లు లైకుతారు. లేదంటే కామెంటుతారు. అలా కొంచం టైం పాస్ ఐపోతుంది. ఇక నా వంటలు, వ్యాసాలు కూడా అక్కడ పంచుకుంటాను. నాకొచ్చింది ఈ వంటలు, రచనలే కదా. అలా ఎందుకు చేస్తున్నానంటే దానివలన మరికొంతమంది పరిచయం అవుతారు. మరి కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. లేదా చెప్పొచ్చు. నేను రాసిన ఎన్నో విషయాలు ఎంతో మంది తమతో అన్వయించుకుంటారు తెలుసా?? అలాగని ఎప్పుడూ అక్కడే ఉండను. నా పని చేసుకుంటూనే ముచ్చట్లు అన్నమాట. హే! నీకో విషయం చెప్పనా? మధ్యే ఫేస్ బుక్ మూలంగానే నలభై ఏళ్ల క్రిందటి స్నేహితులు కలిసారు తెలుసా?? ఇలా జరుగుతుందని అస్సలంటే అస్సలు ఊహించలేదు. ఇంకా నాలుగైదు సార్లు వంటల పోటీలలో బహుమతులు కూడా వచ్చాయోచ్!!
అసలు నువ్వు నెట్‌కి వచ్చినప్పటినుండి కొత్తది ఏది దొరికినా అందిపుచ్చుకుని దాన్ని నీ మంచికి, నీ లాభానికే ఉపయోగించుకుంటావు కదా?
మరే! అనుభవం మీద చెప్తున్న మాటలు ఇవి.. ఈ అంతర్జాలం అనేది పదునైన కత్తి లాంటిది. దానితో గాయం చేయవచ్చు, ప్రాణాలు తీయవచ్చు, ప్రాణాలు పోయవచ్చు... మరీ టూ మచ్ అయిందంటావా? ఏం లేదు.. కత్తితో పీక కోయచ్చు. ఆపిల్ కోసుకోవచ్చు. కేక్ కూడా కట్ చేయొచ్చు కదా. అలా మంచి, చెడు అనేది ప్రతీ చోటా , ప్రతీ పనిలో ఉంటుంది. మనకు కావలసిన మంచి కోసం మన ప్రయత్నాలు సరైన దారిలో నిర్దేశించుకుని సాగిపోవాలి. నేను చేస్తున్న పని అదే. ఈ తెలుగు బ్లాగులైనా, వెబ్ సైట్ ఐనా, ఫేస్‌బుక్ఐనా నాకు ఉపయోగపడే విధంగా చేసుకున్నాను. ఈ దారి కూడా సవ్యంగా ఉండదు. ప్రారంభంలోనూ, మధ్యలో కూడా ఒడిదుడుకులు, ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని సరైన రీతిలో ఎదుర్కొంటూ మన పని మనం చేసుకుంటూ పోవడమే మంచిది అని నా అభిప్రాయం. నా విజయ రహస్యం కూడా ఇదే మరి... ఎవరికోసమో మనం మారే పని లేదు. మనకోసం ఎవరో మారే పని లేదు. ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి, మనకు నచ్చినట్టుగా సరైన దారిలో వేళ్లడమే మేలు.
ఊరికే పలకరిద్దామని వస్తే అందరికీ పనికొచ్చే మంచి విషయాలు చెప్పావు కదా. అందుకే నిన్ను జ్యోతక్కా అంటారు..:) నువ్వు ఇంకా ఇంకా గుర్తింపు పొందాలి. సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సరే మరి నే వెళ్తా. నీ పని చేసుకో. తీరిక ఉన్నప్పుడు నా దగ్గరకు రా. చాలా రోజులుగా నువ్వు నా దగ్గరకు రాకున్నా ప్రియ చెలివి కదా అని నేనే వచ్చా. వస్తా మరి..
హే! ఆగు! ఇవాళ నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. ఈ రోజును నేనెప్పుడూ మర్చిపోలేదు. మరచిపోయే అవకాశమే లేదు... నా పుట్టినరోజుతో పాటు ఈ రోజు కూడా నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను. ఎందుకంటే నాలోని మరో జ్యోతికి జన్మనిచ్చింది నువ్వే కదా..
Happy Birthday JYOTHI"
స్టోరీ అర్ధం కాలేదా? ఇవాళ నా బ్లాగు "జ్యోతి" ఆరవ వార్షికోత్సవం అన్నమాట. అందుకే నా బ్లాగుతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టాను. ఇక్కడకు రావట్లేదని నా మీద అలిగింది కదా ...నిజం చెప్పాలంటే ఈ బ్లాగు మూలంగానే నాలోని నాకే తెలియని మరో జ్యోతి బయటకొచ్చింది. దీనికి ఎంతో మంది ఆత్మీయ మిత్రుల సహకారం ఉంది. అది నేను ఎప్పటికి మరచిపోలేను. ఒక్కో మెట్టు ఎక్కుతూ అందుకుంటున్న చిన్ని చిన్ని విజయాల వేళ అందరినీ గుర్తు చేసుకుంటాను. ఇంతకు ముందులా తెలుగు బ్లాగుల్లో ఎక్కువ పాల్గొనడం లేదు. దానికి పాత కొత్త బ్లాగర్లందరూ క్షమించాలి. ఇతరత్రా పనులు పెరిగిపోవడం వల్ల ఇటు రావడం తగ్గిపోయింది. ఇంకా ఏముందిలే తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, చేయడానికి అనుకున్నప్పుడల్లా కొత్త పని నా ముందుకు వస్తుంది. కాదనలేను. నచ్చినపని ఎప్పుడూ కష్టం కాదుగా.. అంతే కాక అవకాశాలు అన్నివేళలా రావు. వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. ఏమంటారు??
ఈ సందర్భంగా ఒక శుభవార్త మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గత నెలలో నేను కొత్త ఉద్యోగంలో చేరాను. అది తెలుగుకు సంబంధించిందే. ఈ కొత్త బాధ్యతవల్ల నా రాత పని కూడా తగ్గింది. నా టైమ్ ని కాస్త ప్లానింగ్ చేసుకోవాలి.. ఇది నాకు వచ్చిన , నచ్చిన పని. ఎక్కడ? ఏమిటీ? అంటారా??... ఇప్పుడే కాదు కొద్ది రోజుల్లో తప్పకుండా వివరంగా చెప్తాను. అంతవరకు సస్పెన్స్....
ఓ సారి గతం తిరగేసుకుందామా??
ప్రధమ వార్షికోత్సవం
ద్వితీయ వార్షికోత్సవం
తృతీయ వార్షికోత్సవం
చతుర్ధ వార్షికోత్సవం
రాసింది జ్యోతి at 05:53 36 వ్యాఖ్యలు
వర్గములు నా మనోభావాలు, సాహిత్యం
Sunday, 2 September 2012
విజయ విలాసము - కొత్త బ్లాగు
నరనారాయణులలో ఒకడైన అర్జునుడు మహావీరుడు. శ్రీకృష్ణుడి సహాయంతో ఎన్నో విజయాలు సాధించాడు. అందుకే విజయుడైనాడు. అర్జునుడు గెలుచుకున్నా, తల్లి ఆదేశం ప్రకారం ద్రౌపదిని వివాహమాడిన పాండవులు తమలో తాము ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ద్రౌపతి ఒక్కొక్కరి వద్ద ఒక్కో సంవత్సరం ఉండేటట్టుగానూ. ఆ సమయంలో మిగిలినవారు వారి ఏకాంతతకు భంగం కలిగించరాదని, ఒకవేళ అలా భంగం కలిగించితే వారు ఒక సంవత్సరకాలం దేశాటన చేయ్యాలని నియమం. ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుని గోసంరక్షణార్ధం అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించి అన్నగారైన ధర్మరాజు మందిరంలో ఉన్న తన శస్త్రాస్త్రాలను తెచ్చుకోవడానికి వెళ్ళక తప్పలేదు. నియమ భంగం చేస్తాడు. నియమోల్లంఘన జరిగింది కాబట్టి అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరతాడు. ఆ క్రమంలో ముగ్గురు కన్యలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. .. ఈ విజయుడు విలాసాలను అందంగా మలిచిన కావ్యం "విజయ విలాసం" ఈ శృంగార ప్రబంధాన్ని రచించినవాడు రఘునాధ మహారాజు ఆస్థానంలోని చేమకూర వేంకట కవి. ఇది ఒక చమత్కారమైన గ్రంధం. ఇందులో ఉన్న సొగసును చూసిన ఒక రసికుడు చేమకూర మంచి పాకాన పడింది అన్నాడంట. ఇంటిపేరు నసగా ఉన్నా కవిత్వం పసగా ఉందని కొందరన్నారు.
1600 నుండి 1630 వరకు తంజావూరును పాలించిన పండితకవి రఘునాధనాయకుడు. శ్రీకృష్ణదేవరాయలు తర్వాత అంతటివాడేకాక అంతకు మించినవాడు, ఆంధ్రభోజుడని పేరుపొందాడు. శత్రువులను నిర్మూలించడంలోనూ, జనరంజకంగా రాజ్యాన్ని పాలించడంలోనూ, రసహృదయులు మెచ్చునట్టుగా సంస్కృతం, తెలుగు రెండింటిలో భావకవిత్వం చెప్పగల ప్రతిభాశాలి. అంతే కాకుండా కొత్త కొత్త రాగాలను, తాళాలను కనిపెట్టి వాటిని వీణ మేళవింపుతో సంస్కరించగల సంగీతశాస్త్ర నిపుణుడు. బహుముఖ ప్రజ్ఞానిధి. సూర్యవరప్రసాధియైన చేమకూర వేంకటకవి ఈ రఘునాధమహారాజు కొలువులో ఉండేవాడు. ఆ రాజు సాంగత్యం వల్ల కావ్య రచన చేయాలన్న తలంపుతో విజయవిలాసం, సారంగధర చరిత్రము రచించాడు.
విజయవిలాసం ప్రబంధం శృంగార ప్రధానమైన కావ్యం అని చెప్పవచ్చు. విజయుడి విలాసాలను అందమైన చమత్కారాలతో వర్ణించాడు కవి. ఉలూచి, చింత్రాంగద, సుభద్ర లను వలచి, వలపించుకుని వివాహం చేసుకున్నాడు విజయుడు. ఈ మూడు వివాహాలను కొందరు స్వర్గ, మర్త్య, పాతాళలోకాల కన్యల వివాహాలుగా భావించారు. ఉలూచి పాతాళకన్య, చిత్రాంగద మర్త్య కన్య. సుభద్ర అవతారపురుషులైన కృష్ణ, బలరాముల సోదరి కాబట్టి దేవకన్య అనవచ్చు. భారత కథలోని ఈ అంశాన్ని అందంగా మలచిన కావ్యమే విజయవిలాసం.. అద్భుతమైన వర్ణనలు, యమకములు, అలంకారములు ఈ రచనలో కోకొల్లలు..
ఈ విజయవిలాసాన్ని బ్లాగీకరించాలని చేసిన చిన్న ప్రయత్నమే ఈ విజయవిలాసం బ్లాగు. సులువైన బాషతో, వీనులవిందు చేసే శ్రవ్యకాలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చింది. ఈ మహత్తర ప్రయత్నానికి కలిసి పని చేస్తున్నవారు .. రాఘవ, గిరిధర్, సనత్ శ్రీపతి, నారాయణస్వామి (కొత్తపాళి). జ్యోతి.. మరి వెళదామా విజయ విలాసాన్ని ఆస్వాదించడానికి..
విజయ విలాసము : http://vijayavilaasam.blogspot.in/
రాసింది జ్యోతి at 15:00 0 వ్యాఖ్యలు
వర్గములు సాహిత్యం
Saturday, 1 September 2012
మాలిక పదచంద్రిక - 7 ఫలితాలు..
మాలిక పత్రికలో సత్యసాయి కొవ్వలిగారు తయారుచేసిన పదచంద్రిక - 7 కు నలుగురు సమాధానాలు పంపారు. కౌస్తుభ అవసరాల, తన్నీరు శశి, రవి env, భమిడిపాటి సూర్యలక్ష్మి.... వీరిలో కౌస్తుభగారు ఒక తప్పు, శశి మూడు తప్పులు చెప్పారు. రవి, సూర్యలక్ష్మిగారు పంపిన సమాధానాలు అన్నీ సరైనవే. ప్రకటించిన బహుమతి వెయ్యి రూపాయలు వీరిద్దరికి సమానంగా ఇవ్వబడుతుంది.. విజేతలకు అభినందనలు...
రాసింది జ్యోతి at 17:01 0 వ్యాఖ్యలు
వర్గములు మాలిక