Tuesday, 8 April 2008

స్నేహం


స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్నేహం ఉండకూడదా??. ముఖ్యంగా పెళ్ళయిన వారి మధ్య వారి స్నేహం , వారి వ్యక్తిగత సంబంధానికి ఎటువంటి ప్రతిబంధకం కానంతవరకు. ఎటువంటి ఆకర్షణ లేకుండా ఆడ మగ స్నేహితుల మధ్య ఆత్మీయమైన అనుబంధం ఉండకూడదా? తప్పనిసరిగా వారి మధ్య ఏదో ఒక వరుస ఉండాలా (అన్నా, అక్కా లాంటివి) ??? ఇటువంటి పవిత్రమైన అనుబంధం సమాజం అంగీకరిస్తుందా ??

మంచి బహుమతి ............

అంతర్జాలంలో గత సంవత్సరంగా దేదీప్యమానంగా వెలుగుతున్న తెలుగు బ్లాగులలోని మంచి టపాలను సేకరించి ఒక పుస్తకంగా తయారు చేసిన ప్రవీణ్ కు ,దీనికి అందమైన ముఖచిత్రాన్ని ఇచ్చిన వీవెన్ కు అభినందనలు. ఈ బ్లాగు పుస్తకం ప్రతి ఆరునెలలకు ఒకసారి తయారు చేస్తే బావుంటుందేమో. అది ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు మరికొందరు బ్లాగర్లు కలిసి ఈ పని చేయగలరనుకుంటున్నా. ఆశకు కూడా అంతు ఉండాలంటారా. ఈ బ్లాగు పుస్తకం దించుకుని మీ స్నేహితులకు ఒక వినూత్నమైన బహుమతిగా పంపండి( పంచండి ).


Monday, 7 April 2008

సర్వధారి నామ సంవత్సర రాశిఫలాలు

.మా ఇంటి సింహద్వార స్వాగత తోరణం.


బ్లాగ్మిత్రులందరికీ సర్వదారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఇది సర్వధారి నామ సంవత్సరం. చంద్రుడు రాజు. సూర్యుడు మంత్రి. ఈ సంవత్సరం అందరికి శుభకరముగా ఉన్నది. దేశ పరిస్థితులు ఆర్ధికంగానూ, రాజకీయంగానూ సంతోషజనకంగానే ఉన్నాయి.

మేష రాశి:

ఆదాయం - 4, వ్యయం - 2 , అదృష్ట సంఖ్యలు - 1, 2, 3.

వ్యాపారస్తులకు, విద్యార్థులకు, రైతులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. పెద్దవారికి యాత్రలు చేసే అవకాశము మెండుగా ఉన్నది. చెడు గ్రహ ప్రభావములు అధిగమించుటకు ఈ రాశివారు దుర్గాదేవిని పూజించుట మంచిది.

వృషభ రాశి :

ఆదాయం -8, వ్యయం - 11, అదృష్ట సంఖ్యలు - 6, 5, 8

ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడూ కొన్ని అడ్డంకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడ తలెత్తవచ్చు. ఈ సమస్యలు అధిగమించడానికి గురు, శని, రాహు గ్రహాలకు శాంతి చేయించాలి.

మిధున రాశి :

ఆదాయం - 11, వ్యయం - 8, అదృష్ట సంఖ్యలు - 1, 6

ఈ సంవత్సరం నవంబరు వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత సాధారణంగా ఉండవచ్చు. ఇనుము, సిమెంట్, వ్యవసాయం లో ఉన్న వ్యాపారస్తులకు శుభంగా ఉంటుంది ఈ సంవత్సరం. రైతులకు , కొత్త దంపతులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పెళ్ళికాని అమ్మాయిలకు జీవితభాగస్వామి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా ఎక్కువ శుబపరిణామాలకు ఈ రాశివారందరు దుర్గా సప్తశతి పూజ చేయడం మంచిది.




. ఉగాది పూజ సామగ్రి .



కర్కాటక రాశి :


ఆదాయం - 5, వ్యయం - 8, అదృష్ట సంఖ్య- 2

ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మనశ్శాంతి కరువవుతుంది. వ్యాపారంలో నష్టం రావొచ్చు. అనవసరమైన ఖర్చులు ఎక్కువవుతాయి. ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలు అధిగమించడానికి కేతు, రాహు మరియు శని పూజలు చేయాలి.

సింహ రాశి :

ఆదాయం - 8, వ్యయం -2, అదృష్ట సంఖ్యలు -2, ,

ఆర్ధికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా అంత చెప్పుకోదగ్గ మార్పులు ఉండకపోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. చుట్టాలతో విభేదాలు రావొచ్చు. వీటన్నింటిని అధిగమించడానికి లక్ష్మీ పూజ చేయాలి.


కన్య రాశి :

ఆదాయం - 11,వ్యయం -8, అదృష్ట సంఖ్యలు - 1, 6

ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆర్ధికంగా చెప్పుకోదగ్గ మర్పులు ఉండవు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మామూలుగా ఉంటుంది. బంధువులతో తగాదాలు రావొచ్చు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనడానికి లక్ష్మీ పూజ చేయించాలి.




..ఉగాది వేళ మా ఇంట కొలువైన దేవతలు..


తులా రాశి :

ఆదాయం -8 వ్యయం - 11, అదృష్ట సంఖ్య - 9

వ్యాపారులకు ఇది చాలా అనుకూలమైన సంవత్సరం. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా మంచి సమయం. ఉద్యోగులు మంచి గుర్తింపు, లాభాలు అందుకుంటారు. విద్యార్థులు తాము కోరిన ఉన్నత విధ్యలకొఱకు మంచి కాలేజీలలో సీట్లు సంపాదిస్తారు. కళాకారులు, విజ్ఞానవేత్తలకు మంచి శుభ సమయం. భర్తలు తమ భార్యలపై ప్రేమ వర్షం కురిపిస్తారు. కాని ఆదాయం కంటే వ్యయం ఎక్కువ. ఈ రాశివారు లక్ష్మీ నారాయణ జపం చేస్తే మంచిది.


పృశ్చిక రాశి :


ఆదాయం -14, వ్యయం - 2, అదృష్ట సంఖ్య -9

ఇది చాలా మంచి సంవత్సరం . ఆస్తిపాస్తులు రెట్టింపు కావొచ్చు. వివాహితులు సంతోషంగా ఉంటారు. పిల్లలకు కూడా అనుకూలమైనది. ఇరుగుపొరుగు వాళ్ళు కూడా సహాయకరంగా ఉంటారు. కొత్త మదుపు పెట్టడానికి, ప్రమోషన్లకు, కొత్త వ్యాపారాలకు అనుకూలమైనది. కళాకారులు, ప్రావీణ్యము ఉన్నవాళ్ళు గుర్తింపు పొందుతారు.

ధనుస్సు రాశి :

ఆదాయం -2, వ్యయం -11, అదృష్ట సంఖ్య - 3

ఇది చాలా గడ్డు సమయం.అష్టమ శని వల్ల ఆరోగ్య సమస్యలు రావొచ్చు. చాలా కష్టతరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు కలిగే అవకాశం చాలా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆర్ధిక ఇబ్బందులు కూడా ఉంటాయి. వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. విద్యార్థులకు తమ పరీక్షలు గట్టెక్కాలంటే చాలా శ్రమించాల్సి వస్తుంది. పెళ్ళికాని అమ్మాయిలకు సరియైన జోడి కుదిరే అవకాశం లేదు. ఈ రాశి వారు దాన దర్మాలు చేస్తు , గురు జపం చేయాలి.





. ప్రసాదాలు - ఉగాది పచ్చడి, బొబ్బట్లు, మామిడికాయ పులిహోర.


మకర రాశి :

ఆదాయం - 5, వ్యయం - 5, అదృష్ట సంఖ్య - 8

దొంగతనాలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాసి వారు చాలా జాగరూకతతో ఉండాలి. ఉద్యోగులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారంలో మదుపు చేయడానికి ఇది మంచి సమయం. సాంకేతిక విషయాలు చదివే విద్యార్థులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా ఉపయోగకరమైనది. ఇరుగుపొరుగు వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మనశ్శాంతికోసం శ్రీ కృష్ణుడి పూజ జరిపించాలి.



కుంభ రాశి :

ఆదాయం - 5, వ్యయం - 5, అదృష్ట సంఖ్య - 8

ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు గుర్తింపు పొందుతారు. రైతులకు మొదటి పంట సంతృప్తికరంగా ఉంటుంది. రెండవ పంట మామూలుగా ఉంటుంది. కొత్త ఆస్తులు సమకూర్చుకుంటారు. పోటి పరీక్షలు రాసే వారికి విజయం లభిస్తుంది. కంట్రాక్టర్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. కొత్త ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైనదీ సంవత్సరం. దానధర్మాలు చేయాలి. రాహు, కేతు, శని గ్రహాలకు పూజలు చేస్తే మంచిది.

మీన రాశి :

ఆదాయం - 2, వ్యయం -6, అదృష్ట సంఖ్య 3

ఈ సంవత్సరం చాలా పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. కాని అదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేతినిండా డబ్బు ఉంటుంది. కొత్త ఇల్లు నిర్మాణానికి, వ్యాపారాభివృద్ధికి అనుకూలమైనది ఈ సంవత్సరం. చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. స్త్రీలు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. దుష్టగ్రహ దోష నివారణకు సూర్య నమస్కారాలు చేయాలి.




ఈ రోజు భోజనం లోకి పులిహోర, బీరకాయ పెసరపప్పు కూర, పాలక పనీర్, టొమాటో పప్పు,
ములక్కాడల రసం , టొమాటో పచ్చడి, పెరుగు, వడియాలు.. అంతే


రాశి ఫలాలు చదువుకున్నారుగా... ఇవి దైవజ్ఞ శర్మగారు రాసినవి. ఈ రాశిఫలాలు ఇంకా సవివరంగా రాసి త్వరలో నైమిశారణ్యం లో పెడతాను. అందాకా మా పండగ స్పెషల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఎప్పుడూ నెట్ లో చిత్రాలు పెడతాను కదా. ఈసారి మా ఇంట్లో చేసినవే ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనతో ఇలా ప్రయత్నించా అన్నమాట. ఎవరూ తిట్టకుండా ఉంటే ఇలాగే కంటిన్యూ ఐపోతా. లేకపొతే గూగులమ్మకి జై ...

Saturday, 5 April 2008

వాలు జడ _ మల్లెపూల జడ


" ఓ వాలు జడ!! మల్లె పూల జడ !! సరసాల జడ !! సత్యభామ జడ



అందమైన భామను అందునా బాపు బొమ్మను వాలు జడ లేకుండా ఊహించుకోగలమా?? ఐనా ఈ రోజుల్లో అమ్మాయిలకు చదువుతో పాటు బద్ధకం కూడా ఎక్కువైంది. ఫ్యాషన్ వెర్రి ఎక్కువైంది. పొడుగు జడల అమ్మాయిలు కనపడడమే అరుదైపోయింది. గుర్రం తోకలా ఒక రబ్బర్ బ్యాండ్ కట్టి వదిలేస్తారు తమ బెత్తెడు జుట్టును. ఈ జడలోని అందాలు, అది చేసే ఆగడాలు ఈనాటి అమ్మాయిలు తెలుసుకోలేకుండా ఉన్నారు. వాలు జడతో వయ్యారంగా కొట్టినా అది తన మీద ప్రేమే అనుకుని వెంట పడతారు కుర్రాళ్ళు. ఇక కొత్త కాపురంలో వాలు జడ అప్పుడప్పుడు సరసానికి, చిలిపి యుద్ధానికి కూడా సై అంటుంది. నాగుబాములాంటి జడలు ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి. అంత ఓపిక ఎవరికుంది. ఆ వాలు జడని ఇక పూలతో అలంకరిస్తే. దాని సౌందర్యం ఆస్వాదించేవారికే తెలుస్తుంది . పెళ్ళిలోకూడా పూలజడ వేసుకోవడం బరువైపోతుంది ఈ నాటి అమ్మాయిలకు. ప్చ్…..




ఈ సోదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా?? చిన్నప్పుడు వేసవి వచ్చిందంటే చాలు మల్లెపూలు, పూల జడ అలవాటు. పూలజడ వేసుకోవడం పెళ్ళితోనే అంతమైనా ఆ మధుర జ్ఞాపకాలు ప్రతి వేసవిలో వెంటాడుతూనే ఉంటాయి. అలా అని ఇప్పుడూ వేసుకోమని అనకండి. ఒక్కతే కూతురుగా పుట్టడంలో ఉన్న మజానే వేరు. అన్ని రాజభోగాలే. అమ్మ చేసే అలంకారాలు అన్నీ మనకే. చెప్పొద్దు కాని మా అమ్మ నాకు చిన్నప్పటినుండి గురువులా అన్నీ నేర్పేది. ముఖ్యంగా తెలుగులో చదవడం, ఏదైనా నేర్చుకోవడం. వంట దగ్గర అంటే కాస్త కాస్త సాయం చేయడం వరకే. మార్కెట్లో కనబడిన కొత్త డిజైన్ ఫ్రాకులు, డ్రెస్ లు కుట్టేది . మల్లె పూలు మొదలయ్యాయంటే చాలు కనీసం మూడు నాలుగు సార్లైనా పూల జడ వేసుకోవాల్సిందే. కొన్నది కాదు. విస్తరాకు మీద కుట్టి జడకు అతికించింది కాదు. అచ్చంగా నా జడకు డైరెక్టుగా కుట్టాల్సిందే.పూలజడ వేసుకునే రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండేది. త్వరగా వంట పని, ఇంటీ పని పూర్తి చేసుకుని అమ్మ హోల్‍సేల్ మార్కెట్టుకు వెళ్ళి గట్టివి, పెద్దవి అయిన మల్లె మొగ్గలు ఓ అరకిలో, కనకాంబరాలు, దవనం, కొనుక్కుని వచ్చేది. ఇక మా అమ్మ స్నేహితులు వచ్చి , ముచ్చట్లాడుకుంటూ చీపురు పుల్లలకు మొగ్గలు గుచ్చి ఇస్తే సవరం పెట్టి గట్టిగా అల్లిన నా జడకు కుట్టడం. ( నా జడ కూడా బారుగా నడుము వరకు ఉండేది లెండి.) నేను అసహనంతో కదిలితే ఓ మొట్టికాయ వేయడం. అటు ఇటూ తిరిగే మా తమ్ముళ్ళు నన్ను ఏదో ఒకటి అంటూ గేళి చేయడం. కనీసం మూడు గంటలు కూర్చుంటే కాని జడ పూర్తయ్యేది కాదు. ఇక సాయంత్రం , పట్టులంగా వేసుకుని, అమ్మ నగలు పెట్టుకుని ఫోటో స్టూడియోకెళ్ళి వెనకాల అద్దం పెట్టి మరీ ఫోటో దిగడం. (అద్దం ఉన్న స్టూడియో కోసం తిరిగేవాళ్ళం ) అదో ముచ్చట. నా పుట్టినరోజునాడు కూడా పూల జడ వేసుకోవాలి. లేదా స్కూలుకు బోలెడు మల్లెపూలు పెట్టుకుని వెళ్ళాలి అనీ చాలా కోరికగా ఉండేది. కాని డిసెంబర్ లో చామంతి పూలు వచ్చెవి. దానితో పూలజడ అంటే చచ్చిపోను బరువుతో. అందుకే నా పుట్టినరోజును హాయిగా ఎండాకాలంలో ఎందుకు రాదో అని తిట్టుకునేదాన్ని చిన్నప్పుడు. ఆ పూలవాసన మూడు నాలుగు రోజుల వరకు వెంట్రుకలను వదిలేది కాదు



.



పెద్దయ్యాక అంటే ఇక పెళ్ళిలోనే పూలజడ వేసుకోవడం. ఎంగేగ్‍మెంట్ కి మా నాన్న రెడీమేడ్ పూలజడ తెప్పిస్తా అంటే కూడా , మా అమ్మ తనే పూలజడ కుట్టింది. అంత బిజీలోనూ, ఇంటినిండా చుట్టాలున్నా కూడా. ఇక పెళ్ళిలో ఐతే పొద్దున్న ఒక డిజైను , రాత్రికి ఒక డిజైను పూలజడ . ఓహ్. ఆ ఆనందమే వేరు. అప్పుడప్పుడు పెళ్ళి ఫోటోలు చూస్తుంటే అప్పటి ఆ మల్లె పూల పరిమళం అలా లీలగా తేలి వస్తుంది. ఇక చివరిగా నేను పూలజడ వేసుకున్నది శ్రీమంతానికే. ఇక మళ్ళీ నేను పూలజడ కుడతానో లేదో అని అమ్మ తన ఇష్టంతో పూలు తెచ్చి మరీ వేసింది. అలా నాకు అలవాటై మా అమ్మాయికి , మాకు తెలిసినవాళ్లకి కూడా పూల జడ వేసేదాన్ని. కాని ఈ కాలంలో అది కరువైపోయింది, బరువైపోయింది.. Old is Gold అని ఆ పూలజడ , పట్టు పరికిణీ, బుట్ట చేతుల జాకెట్టు వేసుకున్న అమ్మాయిలను చూసే రోజు వస్తుందంటారా??

Thursday, 3 April 2008

జల్సా .........ఆ ఆ ఆ ఆ ఆ ?????????


ఇది నా అభిప్రాయం కాదు. మా అబ్బాయి చెప్పాడు. నేనేం చేయను. పాటలు అదిరిపోయాయని నిన్న మొదటి రోజు మార్నింగ్ షో కి వెళ్ళాడు.

థియేటర్ లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే "చెత్త సినిమా అస్సలు బాలేదు , దరిద్రంగా ఉంది" అన్నాడు.

సాయంత్రం ఇంటికొచ్చాక సినిమా ఎలా ఉందిరా అంటే "అసలు నాకు అర్ధమైతే కదా" అని పడుకున్నాడు.

ఇవాళ పొద్దున్న మళ్ళీ అడిగా ఎలా ఉంది అని.. " చీ ! చెత్త సినిమా ఒక్కటీ అర్ధం కాలేదు కాని తలనొప్పి మాత్రం వచ్చింది" అన్నాడు.

సరే అని పడుకుని లేచాక సాయంత్రం అడిగా సినిమా స్టోరీ చెప్పరా నా బ్లాగులో రాయాలి అని. "థు !! అసలు సినిమా కథ అంటూ ఉంటే కదా. ఒక్కటీ అర్ధం కాదు. పాటలు బానే ఉన్నాయి కదా అని వెళ్ళా. థియేటర్ నుండి పారిపోవాలనిపించింది. కాని వంద రూపాయల టికెట్ పెట్టా కదా చూద్దాం బావుంటుందేమో అని అలాగే కూర్చున్నా. ఇంతవరకు ఇంత చెత్త సినిమా చూడలేదు. ఇలా భయంకరమైన తలనొప్పి తెచ్చుకోలేదు. మళ్లీ అడిగావంటే ఆ సినిమా టికెట్ తెచ్చి నిన్ను తీసికెళ్ళి థియేటర్ లో కూర్చోబెడతా" అన్నాడు మా ప్రబుద్ధుడు.

నేను అంత రిస్క్ తీసుకోవడం అవసరమా ????

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008