Monday, 3 October 2011

నవరాత్రులు - నవదుర్గలు

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు తొమ్మిదిరోజులు శరన్నవరాత్రులుగా వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులలోని అమ్మవారిని మొదటి మూడు రాత్రులు దుర్గగా, తర్వాతి మూడురాత్రులు లక్ష్మిగా, చివరి మూడు రాత్రులు సరస్వతిగా పూజిస్తారు. శుభ, నిశుంభ, మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించడానికి అవతరించిన దుర్గాదేవి తొమ్మిదిరోజులు వేర్వేరు రూపాలు ధరించింది. అందుకే ఈ నవరాత్రులలో ఆలయాలలో అమ్మవారికి ప్రతీరోజు ఒక్కో అలంకారం చేస్తారు. అలాగే రోజుకో రకం నైవేద్యం సమర్పిస్తారు. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి.




వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్


వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్


1. శైలపుత్రి: నవరాత్రులలో మొదటిరోజు పాడ్యమినాడు అమ్మవారిది శైలపుత్రి అవతారం. పర్వతరాజు పుత్రిక పార్వతిగా జన్మించిన సతీదేవి శంకరుడిని సేవించి వరిస్తుంది. శైలపుత్రి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ధరించి ఎద్దుపై స్వారీ చేస్తూ ఉంటుంది. పాడ్యమినాడు పెసరపప్పు, జీలకర్ర, మిరియాలతో చేసే పులగం లేదా కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పిస్తాతారు.



దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా


దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా


2. బ్రహ్మచారిణీ: రెండవరోజు విదియనాడు అమ్మవారిది బ్రహ్మచారిణిగా అవతారం. బ్రహ్మచారిణి అంటే తపమాచరించినదని అర్ధం. కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్ని ధరించిన ఈ తల్లి ఉమ, తపచారిణిగా కూడా పిలువబడుతుంది. విదియనాడు పెరుగుతో చేసిన దద్ధ్యోజనం నైవేద్యం చేస్తారు.


పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా


ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా


3. చంద్రఘంట: దుర్గాదేవి మూడో అవతారం చంద్రఘంట.. తన నుదుటిపై అర్ధచంద్రుడిని ఘంటాకారంగా కలిగి ఉంటుంది కాబట్టి చంద్రఘంటగా పిలువబడుతుంది. పది చేతులతో, మూడు కన్నులతో పులిని అధిష్టించిన అమ్మవారు ఎనిమిది చేతులలో జపమాల, బాణం, ఖడ్గం, శ్వేతపద్మం, కమండలం, త్రిశూలం, ధనుస్సు, గద ధరిస్తే, మిగిలిన రెండు చేతులు వరాలిచ్చే, చెడును ఆపే ముద్రలతో ఉంటాయి. ఈ రోజు బెల్లంతో చేసిన గుడాన్నం నైవేద్యంగా పెడతారు.

'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ


దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '

4. కూష్మాంఢ : నాలుగవ రోజైన చవితినాడు అమ్మవారిని కూష్మాండగా అలంకరిస్తారు. అష్టభుజాలతో అలరారే ఈ తల్లి కమలం, ధనుస్సు, బాణం, కమండలం, కలశం, జపమాల, గద, చక్రం మొదలైనవి ధరించి సింహవాహినిగా ఉంటుంది. అంధకారంలో మునిగిపోయిన విశ్వాన్ని తన వెలుగుతో సూర్యకిరణాలవలే ఎల్లెడలా కాంతిని నింపింది కూష్మాండ దేవి. ఈ రోజు అమ్మవారికి చేసే అన్నం ప్రసాదాన్ని నూనెతో కాక నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు.



సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా


శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '

5. స్కంద : ఐదవ రోజైన పంచమినాడు అమ్మవారు స్కందాదేవిగా సాక్షాత్కరిస్తుంది. దేవతల సైన్యాధిపతియైన స్కందుడు లేదా సుబ్రహ్మణ్యాన్ని పిల్లవాడిగా తన ఒడిలో ఉంచుకుంటుంది. సింహాన్ని స్వారీ చేస్తూ, నాలుగు చేతులు, మూడు కళ్లు కలిగిన తల్లి రెండు చేతులలో కమలాలను , మరో రెండు చేతులు అభయం, రక్షణ ఇస్తున్నట్టుగా ఉంటాయి. స్కందమాతను పూజిస్తే ఎంతటి మూర్ఖుడైనా మహా పండితుడు అవుతాడంట. మహా కవి కాళిదాసు స్కందమాత ఆశీస్సులతోనే రఘువంశ మహా కావ్యం, మేఘదూతం రచించాడు. పంచమినాడు పాలు, బియ్యం కలిపి చేసిన పాయసాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.


'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా


కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '

6. కాత్యాయిని : ఆరవరోజైన షష్టినాడు అమ్మవారు కాత్యాయినిగా కొలువై ఉంటుంది. కాత్యాయన మహారుషి జగన్మాతను తన కూతురిగా పొందాలని తపస్సు ఆచరించాడు . అతని భక్తికి మెచ్చిన దుర్గామాత యమునా నదీ తీరాన అతని కుమార్తె కాత్యాయినిగా జన్మిస్తుంది. నాలుగు చేతులు, మూడు కళ్లతో ఉండే కాత్యాయిని ఒక చేత ఖడ్గం, ఒకచేత కమలం, రెండు చేతులతో అభయముద్ర కలిగి సింహాన్ని అధిష్టించి ఉంటుంది. షష్టినాడు పులిహార నైవేద్యంగా సమర్పిస్తారు.


'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా


లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ


వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా


వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '


7. ఏడవరోజు దుర్గామాత కాళరాత్రిగా రూపం దాల్చి ఉంటుంది. కాళరాత్రివలె నల్లగా ఉండి, అస్తవ్యస్తమైన కురులతో, మెరుపుతీగను హారంగా ధరించి భయంకరంగా ఉంటుంది . నాలుగు చేతులు, మూడు కళ్ళు కలిగి రెండు చేతులలో ఆయుధాలు, మిగిలిన రెండు చేతులతో అభయం, రక్షణ ఇస్తూ నాసికాలనుండి అగ్నిజ్వాలలను వెదజల్లుతూ ఉంటుంది. గాడిదను వాహనంగా కలిగిన ఈ తల్లి తనను శరణువేడినవారికి అభయాన్నిస్తూ శుభంకరి అని కూడా పిలువబడుతుంది. సప్తమినాడు పులిహోర, పాయసం నైవేద్యంగా సమరిపిస్తారు.




'శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః


మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'


8. ఎనిమిదవ రోజైన అష్టమినాడు దుర్గాదేవి మహాగౌరీగా పూజింపబడుతుంది. అనితర సాధ్యమైన తపస్సు ద్వారా నల్లని తన మేని ఛాయను మార్చుకుని ధవళ కాంతులతో ప్రకాశించిన దుర్గాదేవి స్వరూపం మహాగౌరి. తెల్లని చంద్రకాంతితో విరాజిల్లే ఈ తల్లి నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఒక చేత త్రిశూలం, ఒక చేత కమండలం, ఒక చేత అభయం, ఒకచేత రక్షణ ఇచ్చే ముద్రలు కలిగి ఎద్దుపై స్వారీ చేస్తుంది. సప్తమినాడు పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.




'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి


సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ


9. తొమ్మిదవ రోజైన నవమి నాడు అమ్మవారిని సిద్ధిధాత్రిగా అలంకరిస్తారు.. అష్ట సిద్ధులతోపాటు మోక్షసిద్ధిని కలిగించే అమ్మరూపం సిద్ధిధాత్రి’. పరమశివుడు మహాశక్తిని పూజించి అష్టసిద్ధులను పొందాడని దేవీ పురాణం చెబుతుంది. ఆ శక్తి అతని శరీరంలో సగభాగమై అర్ధనారీశ్వరుడిని చేసింది. చతుర్భుజాలతో భక్తుల పూజలందుకుంటుంది. ఈమె కమలాసనయై. మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది. రుషులు, మునులు, సిద్ధులు, దేవతలు కూడా సిద్ధిధాత్రిని పూజిస్తారు. నవమి నాడు బెల్లంతో చేసిన పరమాన్నం, దధ్యోదనం, పాయసం, పులిహోర చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

Sunday, 2 October 2011

సంగీత (రాగ) లహరి - 1





ఈ నెలలో కొన్ని ప్రత్యేకమైన టపాలు రాయాలనుకుంటున్నాను. అవి సంగీతానికి సంబంధించినవి. మామూలుగా మధురమైన పాటలను ఆస్వాదించడం, మళ్లీ మళ్లీ వినడం చిన్నప్పటినుండి అలవాటు.. రాగాలు అవీ అంతగా తెలీదు. కాని కర్నాటక సంగీతంలో రాగాల ఆధారంగా తయారైని సినిమాపాటల గురించి తెలుసుకోవాలి, రాయాలి అని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇది ఇప్పటికి కుదిరింది. ఈ రాగాల పాటలు రాయడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఎప్పుడో రెండు తక్కువ ముప్పై ఏళ్ల క్రింద వదిలేసిన వీణ మళ్లీ తెచ్చుకున్నాను. మరి దానికోసం సంగీతం గురించి తెలుసుకోవాలిగా.. ఇంటో విషయం చివరలో చెప్తాను. ఈ పాటల గురించి ఏడాది క్రింద రహ్మతుల్లాగారు చెప్పారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. సంగీతానికి సంబంధించిన వివరాలను రాఘవ ఇస్తున్నాడు. తప్పులుంటే చెప్పండి. మరిన్ని విషయాలు , వివరణలు కాస్త చెప్పుదురూ... .. ఇది ఒక టపాలా కాకుండా సీరీస్ లా రాద్దామని అనుకుంటున్నా.. ...



భారతీయ సంగీతంలో కొన్ని స్వరాల సమూహము రాగం. ఈ రాగ సృష్టి సంగీత ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు సంబంధించిన మూల భావాలు సామవేదంలో ఉన్నట్లు సంగీతకోవిదులు చెబుతారు. మన సంప్రదాయ సంగీతములోని రెండు స్రవంతులకు కూడా రాగమే అధారం. రాగమేళకర్త ప్రణాళికననుసరించి రాగాలను 12 చక్రాలుగా వర్గీకరిస్తారు. ఇందు నేత్ర అగ్ని వేద బాణ ఋతు ఋషి వసు బ్రహ్మ దిశ రుద్ర ఆదిత్య అని పేర్లు. ఒక్కొక్క సమూహాంలో ఆఱు మేళకర్త రాగాలు ఉంటాయి. వానిని జనక రాగాలు అంటారు
ఆరోహణ, అవరోహణలను బట్టి రాగాలను రెండుగా విభజించారు. జనక రాగాలు, జన్య రాగాలు.

జనక రాగాలను మేళకర్త రాగాలు, సంపూర్ణ రాగాలు అంటారు. ఇవి 72 ఉన్నాయి. మేళకర్త రాగాల నుండి పుట్టినవి ఈ జన్య రాగాలు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు.

ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలు ఉంటాయి.
ఆరోహణ, అవరోహణలోని సప్తస్వరాలు క్రమ పద్ధతిలో వరుస మారకుండా ఉంటాయి.
ఆరోహణలో ఏఏ అంతర గాంధారాది క్రమం ఉంటే, అవరోహణలో కూడా అదే క్రమం ఉంటుంది.


అన్ని రాగాలు కాకున్నా కొన్ని ముఖ్యమైన రాగాలు ముందు ఎంచుకున్నాను. ఆడియో లేదా వీడియో ఏది వీలైతే అది పెడతాను..

ఆనందభైరవి



సువ్వీ కస్తూరిరంగ - చిల్లరకొట్టు చెట్టెమ్మ
పిలచిన మురళికి - ఆనందభైరవి
పలుకే బంగారమాయెరా - అందాల రాముడు
పలుకే బంగారమాయెరా - శంకరాభరణం
ఆనందభైరవి--22వ మేళకర్త ఖరహరప్రియ జన్యం. వక్రం. భాషాంగం. రక్తిరాగం. మూర్ఛన సగ2రి2గ2మ1పద2పస - సని2ద2పమ1గ2రి2స. కాకలినిషాద, అంతరగాంధార, శుద్ధదైవతములు అన్యస్వరాలు. కాకలినిషాదప్రయోగం నేడు వినబడటంలేదు. అత్యంతప్రాచీనమైన రాగాలలో ఒకటి. జానపదుల పాటలలోనూ వినబడుతుంది. జావళీలూ, పదాలూ, లాలిపాటలూ, పెళ్లిపాటలూ ఈ రాగంలో అధికం. ఈ రాగాన్ని సాధారణంగా నెమ్మదిగా పాడుతారు. అందువలన నృత్యానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాగాన్ని మంద్రస్థాయి నిషాదంకంటె క్రింద పాడకూడదని, సంగీత త్రిమూర్తులలో శ్యామాశాస్త్రిగారు ఈ రాగాన్ని పునరుద్ధరించారనీ అంటారు. త్యాగరాజు ఈ రాగాన్ని కూచిపూడి భాగవతులకు వదిలివేసారనీ ఐతిహ్యం కూడా ఉంది. రీతిగౌళ ఆనందభైరవికి కొంచెం దగ్గరగా ఉండే రాగం.


ఆభేరి





మధురం మధురం సమయం - భార్యాభర్తలు
నా కంటి పాపలో నిలిచిపోరా - వాగ్దానం
నిండు చందమామ - బంగారు తిమ్మరాజు
ఒకటే హృదయం కోసము - చదువుకున్న అమ్మాయిలు
రారా కౌగిలి చేర - పిడుగు రాముడు

అభేరి-- 20 మేళకర్త నఠభైరవి జన్యం. ఉపాంగం. మూర్ఛన సగ21పని2 - సని22పమ12రి2. నగుమోము గనలేని నా జాలి తెలసి అన్న త్యాగరాజకృతి రాగంలోదే. ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపిన మల్లీశ్వరి చిత్రంలోని ఆకాశవీథిలో హాయిగా ఎగిరేవు పాట కూడా ఇదే రాగంలో ఉంది. హిందూస్థానీ సంప్రదాయంలో దీనికి భీంపలాస్ అని పేరు. కర్ణాటకసంప్రదాయంలోనే దీనికి కర్ణాటకదేవగాంధారి అని మరో పేరు ఉంది.


ఇంకా ఎన్నో రాగాలు మరెన్నో సినీ గీతాలు ముందు ముందు...

Friday, 30 September 2011

చిత్రకల్పన చాటువులు

చిత్రకల్పన చాటువులు

ఒక నంబర్ మనసులో అనుకోండి. దానికి అది కలపండి, ఇది తీసేయండి అని ఆ నంబర్ చెప్పేస్తారు. ఆ ఆట గుర్తుందా. మీరు ఆడారా?? అలాంటిదే తెలుగు సాహిత్యంలో కూడా ఉంటే ఎలా ఉంటుంది?? మన మనసులో అనుకున్నది అవతలి వ్యక్తి చెప్పేస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అదెలా? అంటే...అలా చెప్పే మాయమంత్రం ఉందని చెప్పేయొచ్చు.ఇవి మెదడుకు వ్యాయామాన్నిచ్చి, బుద్ధికుశలతను పెంచే మెళకువలు మాత్రమే. అలాంటి ఒక ప్రక్రియ గురించి తెలుసుకుందాం..

ఇది దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి పద్యం..

సీ.
1. అరిభయంకర చక్రకరి రక్షసాగర
చాయ శ్రీ కర్బుర సాటియుగళ

2. నాళీక సన్నిభ నయన యండజ వాహ
వాణీశ జనక వైభవ బిడౌజ!

4. రాజీవ మందిరా రమణ బుధద్రక్ష
వరజటి స్తుత శౌరి వాసుదేవ!

8. భూరి కృపాకర బొబ్బిలి పురపాల
పాప భుజంగమ పరమ గరుడ

16. దోష శైలేశ శశిద్రక్ష ద్రుహిణ హేళి


ఇప్పుడు తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో ఏదైనా ఒకటి మనసులో తలుచుకోండి.. తర్వాత పైన పద్యంలో ఆ అక్షరం ఏయే పాదాలలో ఉందో చెప్పండి చాలు.. మీరు అనుకున్న అక్షరం నేను చెప్తాను..
అ, ఙ్, ఞ్, మాత్రం వదిలేయండి. న - ణ, ల - ళ, ర - ఱ లకు తేడా ఉండదు..

ఇదెలా అంటే క్రింద 1 నుండి 2 వరకు సెలెక్ట్ చేసి చూడండి..



1. పరిష్కార వాక్యం ఇది..
అన్నయ్య తోటి విస్సాప్రగడ కామరాజు భాషించు హేళి దాక్షిణ్యశాలి

అ - 1
న్న - 2
య్య - 3
తో - 4
టి - 5
వి - 6
స్సా - 7
ప్ర - 8
గ - 9
డ - 10
కా - 11
మ - 12
రా - 13
జు - 14
భా - 15
షిం - 16
చు - 17
హే - 18
ళి – 19
దా – 20
క్షి - 21
ణ్య- 22
శా - 23
లి - 24


ఎదుట వ్యక్తి తలుచుకున్న అక్షరం ఉన్న పాదాల నంబర్లను కూడగా వచ్చిన నంబరును ఈ వాక్యంలో చూసుకుని దానిపక్కన ఉన్న అక్షరం చెప్పండి అంతే...ఉదా... ఎదుట వ్యక్తి 'ర' అనుకున్నాడనుకోండి. అది 1, 4, 8, పాదాలలో ఉంది. ఆ నంబర్లను కూడితే 13 వస్తుంది. పైన పైన పరిష్కార వాక్యంలో 13 పక్కన ఉన్న అక్షరం ర... ఈజీగా ఉంది కదా..
2.

Thursday, 22 September 2011

పూవై విరిసిన పున్నమివేళ



మానవుడు రోదసిలోకి నిరంతర ప్రయాణం సాగించినా, అందాల చందమామను చేరి పరిశోధనలు జరిపినా ఇంకా ఎన్నో సృష్టిరహస్యాలు అర్ధం కాకుండా మిగిలిపోతున్నాయి. ప్రకృతిలోని కొన్ని వింతలు ఆశ్చర్యంలో పడేస్తే, కొన్ని ప్రశ్నార్ధకాలుగానే మిగిలిపోతున్నాయి. అలాటి ఒక అద్భుతం బ్రహ్మకమలం. కేదారేశ్వరుడికి ప్రీతికరమైన ఈ పుష్పాలు హిమాలయాల్లోనే ఎక్కువగ పూస్తాయని అంటారు కాని ఇపుడు దేశవ్యాప్తంగా కొందరి ఇళ్లల్లో విరబూస్తున్నాయి బ్రహ్మకమలాలు. ఇవి అసలైన బ్రహ్మకమలాలు అవునో కాదో కాని అరుదైన జాతికి చెందిన అద్భుతమైన పుష్పం అని చెప్పవచ్చు. ఈ పువ్వు సంవత్సరానికి ఒకేసారి పూస్తుంది. అది కూడా రాత్రి ఎనిమిది తర్వాత విచ్చుకోవడం మొదలై పన్నెండు వరకు పూర్తిగా విచ్చుకుని అందాలతో బాటు సుగంధాలు వెదజల్లుతుంది. కాని సూర్యోదయానికి ముందే అస్తమిస్తుంది. మామూలుగా ఇది ఒకే పువ్వు పూస్తుంది కాని కొందరి ఇళ్లల్లో మాత్రం 6 - 10 పూలు కూడా విరబూస్తాయి. ఆ రోజు వాళ్ల ఇంట్లో పండగ వాతావరణం.. చూసినవారికి అద్భుతమే..


ఈ మొక్కలోని చిన్న ఆకును తెచ్చి మట్టిలో పాతితే దానినుండి మరో మొక్క మొదలవుతుంది. క్రమంగా ఆకులు దళసరిగా మారి అందులోనుండే మరిన్ని ఆకులు పుట్టుకొస్తాయి. ఇంకా ఈ మొక్క నాటిన రెండేళ్ల తర్వాతే పూత మొదలవుతుంది. బలిష్టమైన అకుల మీదనుండే బ్రహ్మకమలం మొగ్గ వేస్తుంది. వారం రోజుల్లో పెరిగి పెద్దదై విరబూస్తుంది. సుమారు ఎనిమిది గంటలనుండి పువ్వు విచ్చుకోవడం మొదలవుతుంది. అర్ధరాత్రి పన్నెండు వరకు పూర్తిగా విచ్చుకుని అద్భుతమైన సువాసనను వ్యాపింపచేస్తుంది. తెల్లవారేసరికి పూర్తిగా ముడుచుకుపోతుంది. ఈ పువ్వు జీవితకాలం చాలా తక్కువ.. ఈ బ్రహ్మకమలం పువ్వులు ఎక్కువగా జూన్ నుండి ఆగస్ట్ వరకు విరబూస్తాయి. లేదా మరో నెల వరకు..

ఎడారిమొక్కగా పిలవబడే బ్రహ్మకమలం మొక్కను వృక్షశాస్త్రంలో కాక్టస్ జాతికి చెందినదని గుర్తించారు. ఈ పువ్వును తెలుగు, సంస్కృత బాషలో బ్రహ్మకమలమని, హిందీలో నిషాగంధి అని, ఇంగ్లీషులో క్వీన్ ఆఫ్ నైట్స్ అని వ్యవహరిస్తారు. బ్రహ్మకమలం పుష్పాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పంగా గుర్తించింది. 1982లో భారతీయ తపాలా శాఖ హిమాలయ పుష్పాల మీద విడుదల చేసిన స్టాంపులలో బ్రహ్మకమలాన్ని కూడా చేర్చింది. బ్రహ్మకమలం దేవతాపుష్పంగానే కాకుండా ఓషధీ మొక్కగా కూడా ఉపయోగిస్తున్నారు. దీని వేరును గాయాలు మానడానికి వాడతారు అలాగే పక్షవాతానికి కూడా ఇది మంచి మందు అంటారు వైద్యులు.

ఇంత అరుదైన, అద్భుతమైన పువ్వు మొన్న పున్నమి నాడు మా ఇంట్లో కూడా విరబూసింది. అసలు పువ్వులంటే మక్కువలేనివారు ఎవ్వరు ?? బజారులో కొన్న కిలోల పువ్వుల కన్నా మన ఇంట్లో పూసిన రెండు మూడు పువ్వులు మనకు అపూర్వమే కదా. అవి మొగ్గలా మొదలై పువ్వుగా మారడం చూస్తుంటే కలిగే ఆనందం అంతులేనిది. అలాంటిది ఒక అద్భుతమైన పువ్వు విరబూయబోతుంది అంటే ఎంత ఆత్రుత.. మూడేళ్ల క్రింద సత్యవతిగారిని అడిగితే ఈ మొక్క ఇచ్చారు. ఇక అప్పటినుండి ఎప్పుడు బ్రహ్మకమలాన్ని చూస్తానో అనుకుంటూ ఉండేదాన్ని. బ్లాగుల్లో , టీవీలో ఈ పువ్వులను చూస్తుంటే ఇంకా అత్రుత ఎక్కువైపోయేది. ఇన్నేళ్ళైనా ఇంకా పువ్వు రావడం లేదని నిరాశపడడం, మళ్లీ ఎదురుచూడం అలవాటైపోయింది. కాని మొన్న పున్నమికి వారంరోజుల ముందు మొగ్గ కనిపించగానే ఎంత ఆనందమో.
రోజూ పొద్దున్నే ఆ మొగ్గని చూడడం. ఎంత పెరిగిందా? ఎప్పుడు విచ్చుకుంటుందా? అని అనుకుంటూ ఫోటోలు తీసుకుని భద్రపరుచుకోవడం. ఇలా చివరికి పున్నమి రోజు విరబూస్తుంది అనుకునేంతగా ఎదిగింది ఆ మొగ్గ. ఆకుమీద పెరిగిన ఆ పువ్వు అడుగు పొడవున్న కాడతో ఉంది. ఎక్కడ బరువుకు పడిపోతుందో అని ఆ కాడను ఒక రాడ్ పెట్టి దారంతో కట్టాను. ఆరోజు విరబూస్తుందో మరునాడో అని రాత్రి ఏడుగంటలవరకు సందిగ్ధంగానే ఉండింది. మొదటిసారి కదా.. ఇక ఎనిమిది నుండి మెల్లిగా విచ్చుకుంటున్న పువ్వును చూస్తుంటే మాత్రం అద్భుతం అనిపించింది. పది నిమిషాలకోసారి ఇంటి వెనకాల కెళ్లి పువ్వును చూడడం. ఫోటో తీసుకోవడం. అప్పుడు ఎటువంటి వాసనలు రాలేదు. ఇదేంట్రా మంచి సువాసన వస్తుందని చెపారు కదా అనుకుంటుండగా. రాత్రి పదకొండు నుండి మెల్లిగా సువాసనలు మొదలయ్యాయి. ఆకాశాన నిండుగా వెలుగుతున్న ఆ పున్నమి చంద్రుడికి ధీటుగా స్వచ్చమైన తెలుపులో , ముట్టుకుంటే మాసిపోతాయేమో అన్నంత మృదువైన రెక్కలతో బ్రహ్మకమలం పూర్తిగా విరబూసింది. అరచేయి వెడల్పులో ఆ పువ్వును చూస్తుంటే చెప్పలేని ఆనందం. ఉద్వేగం.ఆ భావన మాటలలో చెప్పలేను. కవి హృదయం కావాల్సిందే ఆ అందాలు వర్ణించడానికి .. ఆ పువ్వు తెల్లవారేవరకు ఉండదని తెలుసు అందుకే దాన్ని ఫోటోలలో బంధించి ఉంచాను. రాత్రి పన్నెండున్నరకు పువ్వును కోసి దేవుడి దగ్గర పెట్టి పడుకున్నాం. పొద్దున్న చూస్తే ముదుచుకుపోయి వాలిపోయింది..

మళ్లీ వచ్చే ఏడాదే విరబూస్తుందని తెలిసినా ఇంకా ఆశతో రోజూ చూస్తున్నా ఇంకో మొగ్గ కనిపిస్తుందేమో అని...

Tuesday, 20 September 2011

మాలిక పత్రిక పోటీలు

మాలిక శ్రావణ పౌర్ణిమ సంచికలో ప్రకటించిన రెండు పోటీలు గుర్తున్నాయా??? ఒకటి పదచంద్రిక. ఈ పదచంద్రికను తప్పులు లేకుండా పూరించినవారికి వెయ్యి రూపాయలు బహుమతి.. ఇప్పటివరకు కంది శంకరయ్య, నేస్తం, భమిడిపాటి ఫణిబాబు, భమిడిపాటి సూర్యలక్ష్మి, ఎన్నెల ఈ పదచంద్రిక పూరించి పంపారు. ఈ పదచంద్రిక పంపడానికి ఇవాళే ఆఖరు తేదీ . ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా పంపండి మరి..


మరో పోటీ.. ఈ సంచికలో ఒకే రచయిత రాసిన రచనలు ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయి ఆ రచయిత ఎవరు? ఆ రచనలు ఏమిటి? ఇవి సరిగ్గా చెప్పగలిగితే ఐదు వందల రూపాయల నగదు బహుమతి ఉంది.

మీ సమాధానాలను ఈ రోజు రాత్రి పన్నెండులోగా editor@maalika.org కి పంపండి..

ఆలసించిన ఆశాభంగం..

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008