Thursday, 31 December 2009

సర్వేజనా: సుఖినోభవంతు ...


ఈ జీవితం పారే సెలయేరు లాంటిది. అది అలా సాగిపోతూనే ఉంటుంది. ఈరోజు కొత్త ఐనది కొద్ది కాలం తర్వాత పాతబడిపోతుంది. వచ్చే సంవత్సరం మీకందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మీకో చిన్ని కానుక. సృష్టిలో అందాన్నంతా తన మందహాసంలో దాచుకున్న ఆ శ్రీనివాసుడు మిమ్ములను కాపాడుగాక. ఈ చిత్రంపై క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. తిరుమల రాయడు అందనివాడైనా ఈ గోవిందుడిని మీ దగ్గరే బంధించుకోండి.

Get this widget | Track details | eSnips Social DNA



Lets hope for the Best and Be prepared for the Worst...
తెలుగు బ్లాగ్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మన రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల వల్ల ఏర్పడిన కోట్లాది రూపాయల నష్టానికి మీవంతు సాయం చేయడానికి తయారుగా ఉండండి.ఖర్చులు తగ్గించుకోక తప్పదు.. ఎందుకంటే ఆ నష్టాన్ని మనమే కదా పూడ్చాల్సింది..

Tuesday, 29 December 2009

తర్కమా.. సత్యమా? (కంప్యూటర్ ఎరా జనవరి 2010 ఎడిటోరియల్)

ప్రతీ ఆలోచనకూ, సూచనకూ, నమ్మకానికీ, భావోద్వేగానికీ ఒక కారణం కావాలి. అప్పుడే అది చెల్లుబాటవుతుంది. తర్కానికి నిలవనిదే, ఓ బలమైన కారణం లేనిదే దేన్నీ అంగీకరించనంత జఠిలమైపోతున్నాం. ప్రతీదీ నిరూపితం, ప్రదర్శితం అయితే తప్ప మన బుర్రకు ఎక్కదు. అయితే జీవితంలో ఎన్నో సత్యాలు ఛాయామాత్రాలుగానే మనకు తారసపడతాయి తప్ప మనల్ని నమ్మించి ఒప్పించగలిగినంత బలమైన ఆధారాలతో ప్రతీదీ చోటుచేసుకోవాలంటే కష్టం. సత్యాల్లోని అస్పష్టతని గ్రహించలేకా, ఒకవేళ గ్రహించినా జీర్ణించుకోలేకా తర్కంతో తోసిపారేస్తుంటాం. తర్కాన్ని ఎంతగా వంటపట్టించుకున్నామంటే.. తిమ్మిని బమ్మి చేసైనా మన వాదనని నెగ్గించుకుని గర్వించేటంత! లాజిక్‌ మనుషుల్ని ఇట్టే ఒప్పిస్తుంది.. కానీ ఆ ఒప్పుకోలులో సంతృప్తి ఉండదు. మనసులో ఏ మూలనో ఆ వాదన సమంజసమైనది కాదని పురుగు తొలుస్తూనే ఉంటుంది. కానీ ఆ అస్పష్టతకు ఒక రూపం ఇచ్చి లాజిక్‌ని నిర్మించినంత బలంగా ఎదురు నిలపగల ఆలంబన దొరకదు. అందుకే ఎదుటి వ్యక్తుల లాజిక్‌తో కూడిన వాదనల ముందు అసంతృప్తిగానే మౌనంగా తలదించుకుంటాం..!



వాదనల్లో ఓడిపోయినంత మాత్రాన సత్యాలు అసత్యాలైపోవు. బుద్ధి చేసే తార్కిక విశ్లేషణల జల్లెడకు దొరకని అంశాలెన్నో మనసుని తాకుతూనే ఉంటాయి. అందుకే ఎంత ప్రాక్టికల్‌గా ఆలోచించే వారైనా కొన్ని క్షణాలు ఆలోచనలో పడతారు. ఆ ఆలోచన బుద్ధి నుండి కలిగే విశ్లేషణ కాదు. బుర్రని శూన్యంగా చేసి మనసు చప్పుడులను వినే ప్రక్రియ. ఇంత తతంగం ఏదీ చోటుచేసుకోలేని పై పై స్థాయిల్లోనే మన ఆలోచనా స్రవంతి సాగుతుంటే లోపం మనలోనే ఉన్నట్లు! ప్రమాదం ఏమిటంటే మితిమీరిన తర్కం అహాన్ని పెంచుతుంది. ప్రతీదీ తెలుసునన్న మిడిసిపాటుతనానికి గురిచేస్తుంది. ఆ ధోరణి అందరి బుర్రల్ని ఆలోచింప చెయ్యగలుగుతుంది తప్ప మనసుల్ని స్పృశించలేదు. కారణం అసలు సత్యమేమిటన్నది అందరి మనసుల్లో అస్పష్టంగానైనా కదలాడుతూనే ఉంటుంది. దేన్నయినా మూర్ఖంగా వాదించే తత్వం వదిలేయాలి. లేదంటే అందరూ మనల్ని అంగీకరిస్తున్నట్లు భ్రమింపజేస్తూనే మనల్ని తమ పరిధి నుండి బహిష్కరిస్తుంటారు. తర్కం వల్ల మరో ప్రమాదమూ పొంచి ఉంటుంది. తర్కం ప్రతీ మనిషికీ ఉండే సౌకుమార్యపు మనసుని పట్టించుకోదు. మొండిగా వాదించడమే దాని గమ్యం. ఆ వాదనలో నోటి నుండి ఎన్నో అపశ్రుతులు జాలువారుతుంటాయి. అవి నేరుగా ఎదుటి వ్యక్తి మనసుని గాయపరుస్తుంటాయి. గాయపడిన మనసు జీవితాంతం మనల్ని విశ్వసించదు. అందుకే తర్కాన్ని నమ్ముకుని మాటని నెగ్గించుకుని అందరిలో గొప్పగా చెలామణి కావడం కోసం మనసుల్ని, మనుషుల్ని దూరం చేసుకోవడం తగదు. వ్యక్తుల మధ్య నమ్మకం, బంధాలకు బలాన్ని చేకూర్చేది ఒకవేళ అసత్యమైనా ఫర్వాలేదు గానీ.. ఒకరినొకరు ఒప్పించుకునే క్రమంలో మనసుల్ని గాయపరుచుకోవడం మాత్రం అభిలషణీయం కాదు. మనం ముఖ్యం.. వాదన కాదు!!



మీ
నల్లమోతు శ్రీధర్

Sunday, 27 December 2009

ఎందుకు? ఏమిటి? ఎలా??


ఎందుకు? ఏమిటి? ఎలా? ఈ డైలాగు వినగానే మీకు ఎవరు గుర్తొస్తారో నాకు తెలుసు? కాని నేను అడిగేది వేరు. గత రెండు మూడు నెలలుగా ఎంతో మంది బ్లాగర్లు తమ బ్లాగు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఒకసారి గత స్మృతులను నెమరేసుకుంటున్నారు. బహు బాగు. ఎలాగూ ఈ సంవత్సరం ఐపోవచ్సింది. ఒక్కసారి మన బ్లాగు అనుభవాలు, అనుభూతులు గట్రా మాట్లాడుకుందామా? ఐతే..

మీరు బ్లాగు ఎందుకు మొదలెట్టారు?

బ్లాగు రాయడం వల్ల మీరు నేర్చుకున్నది ఏమిటి?

బ్లాగు వల్ల ఎలా లాభపడ్డారు? బాధపడ్డారు?

ఇలా మీరు బ్లాగు మొదలెట్టినప్పటినుండి బ్లాగు ఏ ఉద్దేశ్యంతో మొదలెట్టారు. అది నెరవేరిందా.. మీ బ్లాగు గురించి మీరు ఏమనుకుంటున్నారు. దాన్ని ఎలా తీర్చి దిద్దాలనుకుంటున్నారు వగైరా చెప్పండి. ఇది చెప్పడానికి బ్లాగు మొదలెట్టి సంవత్సరాలే కానక్కరలేదు. నెల రోజుల క్రింద ప్రారంభించినవారు కూడా తమ అనుభవాలు రాయొచ్చు. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పొచ్చు. ఒక్కటి మాత్రం నిజం. ఇక్కడ అంటే తెలుగు బ్లాగ్లోకంలో సాయం అడిగితే తప్పక అందుతుంది. నేను అలా అడిగి నేర్చుకున్నదాన్నే. అడగందే అమ్మైనా పెట్టదు మరి..

Friday, 25 December 2009

ఆ పాత మధురం - మల్లీశ్వరి

తెలుగువారు ఎప్పటికి మరువని మధురమైన ఆణిముత్యం "మల్లీశ్వరి" . బి.ఎన్.రెడ్డి దర్శకత్వం, కృష్ణశాస్త్రి రచన, రామారావు, భానుమతిల నటన. సాలూరి వారి సంగీతం వెరసి ఒక అద్భుతమైన దృశ్యకావ్యం ఈ చిత్రం. ఆ మహానుభావులకు ప్రతీ తెలుగువాడు రుణపడి ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా విడుదలై యాభై ఏళ్ళు కావొస్తున్నా ఇప్పటికీ నిత్యనూతనంగా, సంగీత సాహిత్యాల అందాల భరిణగా ఉంది. ఈ సినిమా పాటలు పైన ఐపాడ్ నొక్కి వినండి..

సమీక్ష ఇక్కడ చదవండి. ఆస్వాదించండి. ఆనందించండి .. ఈ సంవత్సరాంతపు క్లాసిక్ సినిమా సమీక్ష ...

Wednesday, 23 December 2009

పకోడీ పద్యాలు


ఇందాక చల్లగా ఉంది కదా ఎదైనా చేద్దామా అని ఆలోచించి పాలకూర పకోడీలు చేసాను. అవి తింటూ , మొన్న పుస్తక ప్రదర్శనలో కొన్న పుస్తకాలు బయటికి తీసి ఒక్కోటీ తిరగేస్తుంటే అనుకోని విధంగా చిలకమర్తివారి పకోడీ పద్యాలు కనపడ్డాయి. ఇంకేముంది . పకోడీలు తింటూ , పకోడీ పద్యాలను ఆస్వాదిస్తూ పండగ చేసుకున్నాను. మరి ఆ పకోడీలను అదేనండి పకోడీల్లాంటి పద్యాలను మీతో పంచుకోవద్దూ!!

వనితల పలుకుల యందున
ననిమిషలోకమున నున్నదమృతమటంచున్
జనులనుటెగాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!

ఓ పకోడీ! స్త్రీల మాటల్లోనే అమృతం ఉందని ఈ లోకంలోని జనులంటారేగాని తెలుసుకుంటే నీలోనే అమృతం వుంది.



ఆకమ్మదనము నారుచి
యాకరకర యాఘుమఘుమ మాపొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు నిజము పకోడీ!

ఓ పకోడీ! ఆ కమ్మదనము, ఆ రుచి, ఆ కరకర ధ్వనులు, ఆ ఘుమఘుమలు, ఆ చక్కదనము, వడుపు, నీకే తగును గానీ మరెందులోనూ లేవు ఇది నిజము.



నీకరకర నాదముబు
మాకర్ణామృతము నీదు మహితాకృతియే
మాకనుల చందమామగ
నేకొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!

నీ కరకర శబ్దాలే మా వీనులకు విందులు. నె సుందరమైన రూపమే మా కనులకు చందమామ. నిన్ను గురించి నేను గొప్పగా చెపుతుంటాను పకోడీ.


ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలుపిండివంటలెల్లను హా! నీ
ముందర దిగదుడుపునకవి
యందును సందియము కలుగదరయ పకోడీ!

పరమాన్నము, రకరకాల పిండివంటలు ఎందుకు? నీ ముందు అవన్నీ నిస్సందేహంగా దిగదుడుపే. వాటికన్నా నీవే గొప్ప పకోడీ.


ఆరామానుజు డాగతి
పోరునమూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడుగాక య
య్యారే నిను గొనిన బ్రతుకడటనె పకోడీ!

లక్ష్మణుడు మూర్చపోయినపుడు హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తెచ్చాడు గానీ నిన్ను తీసుకపోయి వుంటే బ్రతుకడంటావా పకోడీ!


పురహరుడు నిన్ను దినునెడ
కరుగదె యొక నన్నెనలుపు గళమున మరిచం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు యుండగలదె పకోడీ!

పరమేశ్వరుడు నిన్ను తినివుంటే ఆయన కంఠంలోని నలుపు పోయేది కదా! అలాగె చందురుడు నిన్ను తిని వుంటే ఆయనపై వున్న మచ్చలు ఇన్నాళ్లు వుండేవా పకోడీ!


కోడిని దినుటకు సెలవున్
వేడిరుమును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడివల దాబదులు గప
కోడిందిను మనుచు జెప్పెకూర్మి పకోడీ!!

పూర్వము బ్రాహ్మణులు కోడిని తినేటందుకు అనుమతించమని బ్రహ్మను వేడుకోగా మీకు కోడి వద్దుగాని దాని బదులు పకోడీ తినమని చెప్పాడట. ఆ విధంగా వచ్చిందే " పకోడీ" మనకు అంటున్నారు చిలకమర్తివారు హాస్యానికి..

Tuesday, 22 December 2009

కృష్ణ జ్యోతి - పిచ్చాపాటి


"హాయ్ జో"

"హాయ్! ఏవరు? నేను నీకు తెలుసా? నువ్వు నాకు తెలుసా?"

"తెలుసు. నేనంటే నీకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం"

"ఇష్టమా? ఇంతవరకు నిన్ను చూడలేదు. ఏంటి? తిక్కగా ఉందా. అసలు ఎందుకొచ్చావ్?"

"అదేంటి? నువ్వే నా గురించి ఈ మధ్య తరచూ కలవరిస్తున్నావ్. ఏదో పలకరిద్దామని వస్తే ఇలా అనడం ఏం బాలేదు జ్యోతి "

"ఇది మరీ బావుంది. నువ్వెవరో తెలీకుండా నీ గురించి కలవరించడమేంటి?"

"సరే! నేనే చెప్తా విను.. ఓ నాలుగు నెలల క్రింద నీ బ్లాగులో దశావతారాల గురించి రాసావా? మళ్లీ ఈమధ్యే కృష్ణచైతన్య అని రాసావు. అందుకే వచ్చానమ్మా...నేనే ఆ కృష్ణుడిని అంటే ఇప్పటికైనా నమ్ముతావా తల్లీ"

"సరే నమ్ముతానుగాని నువ్వంటే నాకిష్టం.. నేనంటే నీకిష్టం అంటున్నావ్? అదెలా??

hmmm. నాకు తెలుసుగా నువ్వు ఏదీ అంత ఈజీగా ఒప్పుకోవని.. సరే విను..నా నెమలిపించంలోని రంగులంటే నీకు చాలా ఇష్టం కదా. మరి నువ్వు ఎప్పుడు చెప్పే పాట విరించినై నా వేణుగానం కాదా ?? అవునూ! వారం రోజులనుండి చూస్తున్నా. ఎందుకలా దిగులుగా ఉన్నావ్?

"ఏంటో! ఎప్పుడూ ఈ పోరాటమేనా? కష్టాలేనా? స్తిమితంగా ఉందామంటే కుదరదే? ఏ గొడవ, టెన్షన్ లేకుండా ఉండే రోజు రాదా?

"అంటే నీ ఉద్ధేశ్యం? కష్టాలు నీ ఒక్కదానికే ఉన్నాయా? ఎప్పుడూ అవే తలుచుకుంటూ అలా బాధపడుతూ ఉంటావా? "అంటే నీకు బాధపడ్డం ఇష్టమా? లేదు అంటే ఎందుకు దానికంత ప్రాధాన్యం ఇస్తావ్? నీ జీవితం ఇక్కడితో ఆగిపోదుగా? కష్టాలు కొలిమిలో కాగితేనే కదా మనిషి నిగ్గుదేలేది, సుఖాలను అనుభవించేది. ఎప్పుడూ సుఖాలు కావాలంటే వాటి విలువ తగ్గిపోతుంది. బోర్ కొడుతుంది. చీకటి ఉంటేనే కదా వెలుతురు విలువ తెలిసేది."

"సరేగాని నాదో డౌట్ . ఎందుకు మంచి పనికి ఎప్పుడూ విమర్శలు ఉంటాయి. ఎందుకు ఈ అసూయలు, ద్వేషాలు, అవమానాలు సహించాలి?

"పిచ్చిదానా! అన్నీ సానుకూలంగా జరిగిపోతే వాటి మజా ఉంటుందా చెప్పు? ఒక్కటి గుర్తుపెట్టుకో! కమలం బురదలో, మురికిలో పెరుగుతుంది కదా. ఐనా ఆ వాసన దానికి అంటుతుందా? లేదే? పైగా బురదలో పెరిగినా మధురమైన రంగు, సువాసనలతో అందాలు ఒలికిస్తుంది కమలం. అలాగే మనకు ఎదురయ్యే బాధలు, అవమానాలు అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని విజయులై నిలవాలి ఆ కమలంలా!”

“సరేలే? చెప్పడానికేంటి బానే చెప్తావ్? అనుభవించేవాళ్లకు తెలుస్తుంది. ఐనా ఆడాళ్ల కష్టాలు ఎప్పటికి తీరేను? ఎక్కడ చూసినా అడ్డంకులే. అణచివేతలే? అందుకే అప్పుడప్పుడు నామీద నాకే కోపమొస్తుంది."

"ఇదిగో ఇక్కడే నాకు మండేది. మీ ఆడాళ్లున్నారే! ఎప్పుడూ మొగుడికి. అత్తామామలకి సేవలు చేయాలి అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆరాటపడిపోతుంటారు. తమ గురించి , తమలోని శక్తిసామర్ధ్యాలను గురించి ఆలోచించరు. మా రుక్మిణీ, సత్యలను చూడు. రుక్మిణి ఎంత ధైర్యంగా నన్ను రమ్మని, వచ్చి తీసికెళ్లు అని కబురంపింది. ఆమె అన్నతో యుద్ధం చేసేటప్పుడు తానే రధసారధి అయ్యిందా లేదా? ఇక సత్యకి నేనే లోకం. కాని అలిగినా ఆమెకు ఆమే సాటి, యుద్ధం చేసి రాక్షసుడిని చంపినా ఆమే సాటి. అలా ఉండాలి."

"అందుకేనా సత్యతో తన్నులు తిన్నావ్? ఐనా అదేం అలక. నువ్వేంటి? సర్వాంతర్యామివి. లోకనాయకుడివి భార్యకు దాసుడవైపోయావు. లాలించి, బ్రతిమాలుతావేంటీ? కాళ్లు మొక్కితే ఎంత పొగరుగా తన్నింది? మరీ అంత గర్వమా?

"హ. హా... హా.. జ్యోతి.. ఆలుమగల మధ్య ఇలాంటి సరసాలు, ప్రణయకలహాలు, అపార్థాలు, అలకలు ఉండాల్సిందే కదా. అవే కదా భార్యాభర్తల మధ్య ప్రేమను పెంపొందింపచేస్తాయి. ఏ భార్య , తన భర్తను అవమానించాలని అనుకోదు. కాని ఈ చిన్ని చిన్ని అలకలే వారిని మరింత దగ్గర చెస్తాయి "

" అలాగైతే మరి నువ్వేంటి పదహారు వేలమంది గోపికలతో రాసలీలలు సాగించావ్? ఇంటినిండా పాడి పెట్టుకుని ఈ వెన్న దొంగతనాలేంటీ?

"అమ్మడు!! నేను ప్రతి గోపికతో ఉన్నాను అన్నది వాస్తవం. కారణం ప్రతి జీవిలోనూ ప్రాణం ఉంది. దాని స్వభావం అందరిలోనూ ఒక్కటే. అంచేత "ప్రాణం" అన్న "భావన" ఒకటే అయినా, ప్రతి జీవిలోనూ అది ఉంది. అలాగే పరమాత్మ భావన కూడా. రాసలీల పరమార్థం ఇదే. ఇక ఆ పాలు వెన్న మొదలైనవి జీవుల గుణాలు. వాటిని హరించి వాళ్ళకి మోక్షమివ్వడానికే నేను దొంగతనం చేసింది. అనుమానం తీరిందా?"

"తీరింది కాని.. చివరిగా.. నేను నీకు ఎటువంటి పూజలు చేయలేదు. నీ గురించి ఎక్కువ ఆలోచించలేదు.. మరి నేనంటే నీకెందుకు ఇష్టం ?"

"నాకు కావలసింది పూజలు, నైవేద్యాలు కాదు. ప్రేమ. అది నీ దగ్గర ఉంది. అందరిని ప్రేమించడం, అడిగినవారికి కాదు, లేదు అనకుండా సాయం చేయడం ముఖ్యంగా మాట సాయం.. ఇవే నువ్వు నాకిచ్చే నైవేద్యాలు, అర్చనలు, హారతులు.. అది చాలు నాకు. అందుకే ఎప్పుదూ నిన్ను కనిపెట్టుకుని ఉంటున్నాను. ఒక్కసారి ఆలోచించు. రెండు మూడు సార్లు నువ్వు ఈ జీవన పోరాటంలో విసిగిపోయి .. నేను బ్రతికి వేస్ట్ , ఎప్పుడూ కష్టాలే అని చావాలి అనుకున్నప్పుడు మంచి స్నేహితులను ఇచ్చానా? వాళ్లు నీకు ధైర్యాన్ని ఇచ్చి మనసు మార్చారా లేదా? వాళ్ల పేర్లు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అది నేను కాదా? అవునూ? నువ్వేంటి? కృష్ణచైతన్య పేరు అంటే చాలా ఇష్టం. మావారికి ఆ పేరు లేదు. అందుకే కొడుకుకు పెట్టుకున్నా అన్నావ్. మీ ఆయన పేరేంటమ్మా??

"హి . హి.. హి.. సరే . మనస్పూర్తిగా నమ్ముతున్నా. నువ్వు నాకు స్నేహితుడిలా, గురువులా వెన్నంటి ఉన్నావని. నిన్ను విసిగించినందుకు సారీ. దండన ఇస్తావా ?"

" సరే .. ఇక నేను వెళ్తాను. ఒకటి అడుగుతా. నీకెంతో ఇష్టమైన , నీ స్నేహితులు కానుకగా ఇచ్చిన "ముద్దుగారే యశోద" అర్ధం చెప్పు.

ముద్దుగారే యశోద ముంగితి ముత్యము విడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంతనింత గొల్లెతల అరచేతి మానికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడులోకాల గరుడపచ్చపూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల నందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలక్షుడు

కాళింగుని తలలపైన కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాల జలనిధిలోన పాయని దివ్యరత్నము
బాలుని వలె తిరిగి పద్మనాభుడు.

ఈ కీర్తనలొ నవరత్నాలను పొదిగాడు అన్నమయ్య. బాలకృష్ణుడుగా నువ్వు యశోద ముందు అందమైన ముత్యం వంటివాడివే మరి. వంకలు పెట్టడానికి వీలు లేని మహిమలు చూపిన దేవకీ సుతుడివి . మరి గోపికలకేమో తామరపువ్వు వంటి కెంపు రంగు కల అరచేతిలో మాణిక్యం అయ్యావు కదయ్య నల్లనయ్య. దుష్టుడైన కంసుని హతమార్చడానికి కఠినమైన వజ్రంలా మారావు. మూడులోకాలలో కాంతులనిచ్చే మరకతానివి కాగా . రుక్మిణీదేవి పెదవి రంగులో ఉండే పగడం, గోవర్ధపర్వతాన్ని చిటికెనవేలితో ఎత్తే సమయంలో గోమేధికం వంటి గట్టిదనం కలిగి ఉన్నావు. నిత్యంగా ఉండే శంఖచక్రాల మధ్య వైడూర్యంలా మెరిసిపోతావు. కాళిందుని తలలపై నర్తించువేళ పుష్యరాగం వలె ప్రకాశించావు. ఏడుకొండలపై వెలసిన వేంకటేశ్వరుడిలా నువ్వు కూడా ఇంద్రనీల వర్ణం వాడివి కదా. నీవు నవరత్నాల వలే ప్రకాశించడమే కాదు క్షీరసాగరంలొ ఉన్న దివ్యరత్నానివి ఐనా బాలునివలె అమాయకంగా మా అందరిని సంతోషపెట్టిన పద్మనాభుడివి దేవా!


" చాలా సంతోషం .. జ్యోతి. ఇక నేను వెళతానమ్మా!! నువ్వు దిగాలుగా కూర్చుంటే కావాలని వచ్చి డిస్టర్బ్ చేసాను. ఇదిగో వెళ్లే ముందు నీకో సర్ప్రైజ్.. ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం నీకే కాదు. నాకు కూడా వచ్చామ్మాయ్!!.. ఈ బుట్టలో ఏమున్నాయో చెప్పు? అన్నీ నీకు చాలా ఇష్టమైనవే "

" ఏమున్నాయేంటీ? నువ్వే చెప్పు. ఐనా నాకు చాలా ఇష్టమైనవి నాకు తప్ప ఎవరికీ తెలీదుగా?"

" నీకు ఇష్టమైన తెలుపు, పసుపు, ఆకుపచ్చ సంపెంగలు, చమేలీ పూలు, అడుగున పూతరేకులు, బంగారంకంటే ఎక్కువగా ఇష్టపడే ఘంటసాల, రఫీ పాటలు.. చాలా? మరో ముఖ్య విషయం."

Happy Birthday Jyothi

Bye







-->

Monday, 14 December 2009

వెచ్చదనపు స్పర్శ - ప్రమదావనం

అసలే చలికాలం. బాగా చలిగా ఉంది. స్వెట్టర్ వేసుకోవడం మర్చిపోవద్దు. చలికి బయట తిరగొద్దు. ఉలెన్ బ్లాంకెట్ కప్పుకోండి. చెవులలో దూది పెట్టుకోండి. మఫ్లర్ కట్టుకోండి.. ఇలా ప్రతి ఇంట , ప్రతి చోట ఈ కాలంలో వినిపించే, పాటించక తప్పని మాటలు కూడా.


కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికి అవసరం. కాని ఎందరో అభాగ్యులకు ఇది అందని ఫలమే.. కూడు ఎలాగో దొరికినా, గూడు లేకున్నా ఎక్కడ కాసింత జాగా దొరికితే పడుకుంటారు.. కాని గజ గజ వణికించే చలిలో దుప్పటి లేకుండా పడుకునే వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తారు. హృదయాన్ని కదిలించే ఈ దృశ్యాన్ని చూసి, చలించి, వారికి ఇతోదికంగా సహాయం చెయాలని ప్రమదావనం సంకల్పించింది. ఐతె ఎవరు వారు? ఎచటి వారు? అనే వివరాలు అడగకుండా, చెప్పకుండా నిశ్శబ్దంగా సహాయం చేయాలని నిర్ణయించాము. పదివేల విలువైన ఉలెన్ రగ్గులు కొని నిన్న అంటే ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాము. ఆదివారం ఉదయం నేను , మా అబ్బాయి , వాడి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. ఉదయం మూడుగంటలకు బయలుదేరి ఫుట్ పాత్ ల మీద, దుకాణాల ముందు చలికి ముడుచుకుని పడుకున్నవారికి నిద్రాభంగం కలగకుండా దుప్పట్లు కప్పేసి వచ్చేసాము. ఒకటి రెండు చోట్ల మాత్రం కొందరు మేల్కొన్నారు. ఈ దుప్పట్ల ఎవరికి బడితే వాళ్లకి ఇవ్వలేదు. ఎక్కువగా ముసలివాళ్లు, పిల్లలు, ఆడవాళ్లకే ప్రాధాన్యం ఇచ్చాం. చాలా మంది కనీసం కప్పుకోవడానికి బట్ట లేక ప్యాకింగ్ చేసే ప్లాస్తిక్ సంచుల దుప్పటి కప్పుకున్నారు. మూడు నాలుగు చోట్ల హటాత్తుగా వెచ్చగా అనిపించిందేమో రగ్గు కప్పగానే భయంతో గబుక్కుని లేచారు. మళ్లీ పడుకున్నారు. చాలా మందికి తమకు రగ్గులు ఎవరు కప్పారో కూడా తెలీదు. మేము శబ్దం లేకుండా వెళ్లిపోయాము మరి.. ఈ కార్యక్రమం కోసం సుమారు ఇరవై కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది. హిమాయత్ నగర్, నెక్లేస్ రోడ్, సోమాజీగుడా, బేగంపేట్, అమీర్ పేట్, పంజగుట్ట, ఎస్.ఆర్.నగర్, మాసబ్ ట్యాంక్, మెహదీ పట్నం, ఆసిఫ్ నగర్, లంగర్ హౌజ్, ఖైరతాబాద్, చింతల్ బస్తీ, బషీర్ బాగ్.. ఇలా తిరిగి తెల్లవారుతుండగా ఆరుగంటలకు ఇంటికి తిరిగి వచ్చేసాం. అదేంటో !! అంత పొద్దున్నే లేచి అన్ని గంటలు బయట తిరిగినా బాధించని చలి , ఇంటికి రాగనే నేనున్నానంటూ కమ్మేసింది. :)

నేను గమనించిన మరో ముఖ్యవిషయం ఏంటంటే???ఇన్ని గంటలు తిరిగాము, ఇంతమందికి (సుమారు ఎనబై ఐదు) రగ్గులు కప్పి వెళ్లిపోయాము. ఒక్క పోలీసు కనబడలేదు., అడ్డగించలేదు. ఇలా తసమదీయులు బాంబులు గట్రా సులభంగా పెట్టే చాన్స్ ఉందికదా?? లేక మా మొహాలకు అంత సీన్ లేదనుకున్నారా? అప్పటికి మావారు భయపెట్టారు. వాతావరణం బాలేదు. తీవ్రవాదులనుకుంటారేమో . జాగ్రత్త! అడ్రస్ అడిగితే నా కార్డు ఇవ్వు అని ఇచ్చారు. దాని అవసరం పడలేదులెండి..

వితరణ నాదైనా. సంకల్పం ప్రమదావనం సభ్యులదే .. జయహో ప్రమదావనం.

Saturday, 12 December 2009

మీ విజయగాధను పంచుకోండి..





బ్లాగులు అనేది మన భావవ్యక్తీకరణకు ఒక వేదిక అనేది అందరికీ తెలిసిన , అనుభవమైన విషయమే. తెలుగు బ్లాగర్ల దినోత్సవ సందర్భంగా జరిగే వేడుకలలో పాలు పంచుకోండి. హైదరాబాదులో జరిగే సమావేశం, పుస్తక ప్రదర్శనలో జరిగే e తెలుగు స్టాలు నిర్వహణలో పాల్గొనండి.

ఈ సమావేశాలు హైదరాబాదులోనే కాదు తెలుగు బ్లాగర్లున్న ప్రతీ ప్రాంతంలో జరుపుకోవచ్చు. చెన్నైలో ఎవరైనా తెలుగు బ్లాగర్లు, చదువరులు ఉన్నారా? ఐతే ఒక్కసారి ఇక్కడ లుక్కేయండి..

e తెలుగు స్టాలులో మీ బ్లాగు గురించి ప్రచారం చేసుకోవచ్చు. ప్లేకార్డులు పెట్టుకోవచ్చండోయ్ !!
మీ బ్లాగు వివరాలు బ్లాగు గుంపులో జరిగే చర్చలో ఇవ్వండి. వాటిని ఈ స్టాలులో ప్రదర్శిస్తారు.

ఇక ఈ బ్లాగుల వల్ల అందరూ కాకున్నా చాలా మంది ఎంతోకొంత లాభం పొందారు అనుకుంటా. రచనా శైలీ, కొత్త కొత్త మిత్రుల పరిచయాలు, అనుబంధాలు , ఆత్మీయతలు, వగైరా .. ఇలా జాలంలో తెలుగు వల్ల, బ్లాగుల వల్ల మీకు కలిగిన సంతోషం, లాభం, విజయం ఏదైనా పంచుకోండి.. ఎలా అంటే ?? ఇలా చూడండి..

ఇవాళ సాయంత్రం కూడలి కబుర్లలో సమావేశానికి వస్తున్నారు కదా. రండి ,, బ్లాగు మిత్రులతో పరిచయాలు పెంచుకోండి..

Thursday, 10 December 2009

ప్రపంచ తెలుగు బ్లాగర్ల సమావేశం



ప్రతి సంవత్సరం డిసెంబరు నెల రెండవ ఆదివారం తెలుగు బ్లాగర్ల దినోత్సవం గా జరుపుకుంటున్నాము. హైదరాబాదులో ఉన్నవారు ఈ ఆదివారం జరిగే సమావేశంలో పాల్గొనవచ్చు. కాని దేశ విదేశాల్లో ఉన్న ఇతర బ్లాగర్లు కలవడం ఎలా అనే దానికి ఒక పరిష్కారం ఉంది. అదే ఆన్ లైన్ సమావేశం. కూడలి కబుర్ల గదిలో. ఎల్లుండి శనివారం 12.12.2009 రోజు ఈ సమావేశం నిర్వహించబడుతుంది. తెలుగు బ్లాగు రాసే ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం. రండి. కొత్త , పాత అనే తేడా లేకుండా కాస్సేపు ముచ్చటించుకుందాం. చర్చించుకుందాం. సందేహాలు తీర్చుకుందాం. అందరికీ ఇదే సాదర ఆహ్వానం.


వేదిక : కూడలి కబుర్లు - http://chat.koodali.org/
తేది : శనివారం 12.12.2009
సమయం : సాయంత్రం ఆరు గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం )

Monday, 7 December 2009

తాడేపల్లిగారికి జన్మదిన శుభాకాంక్షలు


కలగూరగంపతో మనకందరికీ సుపరిచితులైన తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జగన్మాత కరుణ మీపై , మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను.


తాడేపల్లి గారు రాసే టపాలతో అందరికీ ఒకలాంటి భయం, బెరుకు ఉండేది. కామెంటాలంటే కూడా జంకే.. కాని గత సంవత్సరం జరిగిన బ్లాగర్ల దినోత్సవం, పుస్తకప్రదర్శనలో కలిగిన తాడేపల్లిగారి పరిచయం మరువలేనిది. ఆయన రాత మాత్రమే కాస్త ఘాటుగా ఉంటుంది .కానీ మాట మొదలెడితే అలా వింటూ ఉండిపోవాల్సిందే. ప్రతీ విషయానికి సమాధానం ఉంటుంది. ఏదీ కాదనలేము. పుస్తక ప్రదర్శనలో ఎంతో మందికి తెలుగు గురించి విడమరిచి చెప్పారు. బ్లాగు గుంపులో సహాయం చేయడానికి ముందుంటారు. కాని తన గురించి మాత్రం "నేను తప్ప పుట్టాను ' అంటారు. అయినా కాని అందరికి ఎన్నో విషయాల్లో సహాయం చేసే తాడేపల్లిగారికి బ్లాగర్లందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పద్యం రాసింది చింతా రామకృష్ణగారు. వారికి ధన్యవాదాలు.

Thursday, 3 December 2009

బస్సు ముచ్చట్లు వినరండి







అమ్మల్లారా! అయ్యల్లారా!!
ఆర్.టీ.సీ ప్రయాణీకుల్లారా!
పిల్లల్లారా!! పెద్దల్లారా!!
అప్పుడప్పుడు మమ్మల్ని తగలపెట్టే కార్యకర్తల్లారా!!
అందరికీ దండాలు. శతకోటి దండాలు..



నన్ను గుర్తుపట్టారా?? నేను మీ నిత్యజీవితంలో భాగమైన ఆర్.టీ.సీ బస్సును. మీ తాత, ముత్తాతల నుండి ఎన్నో తరాలను చూసినదాన్ని. ముందు ముందు ఎన్నో తరాలను చూడాల్సి ఉంది. రోజూ ఎన్నోరకాల మనుష్యులు . అన్నీ బాగుంటే నేను మీ ముందుకెందుకొస్తాను? ఏదో నా కష్టాలు, ఆవేదనను మీతో పంచుకుందామని వచ్చా. కాస్త తీరిక చేసుకుని వినండి..


ఇందుగలడందులేదన్నట్టు ప్రతీ చోటా అవినీతి, నిర్లక్ష్యం. చూసి నేను ఏమీ చేయలేక మౌనంగా నడుస్తున్నాను. టికెట్ల రిజర్వేషన్లలో వింతలు, గందరగోళాలు. నాకు బస్సు వాసన పడదు నాయనా కాస్త కిటికీ పక్క సీటివ్వమంటే ఇంజను దగ్గర సీటిస్తారు. బస్సెక్కి ఏదైనా అడిగితే డ్రైవరు, కండక్టరు మమ్మల్ని కాదు అన్నట్టు ముచ్చట్లలో ఉంటారు. అయ్యా నాకు నడుమునొప్పి ఉంది కాస్త బస్సు మధ్యలో సీటివ్వు ..చచ్చి నీ కడుపున పుడతాను అంటే కక్షకట్టినట్టు వాళ్లకు బస్సు వెనకాల టైరు దగ్గర సీట్ ఇస్తారు. ఇక వాళ్ల బాధ ఎముకల డాక్టరే చెప్పగలడేమో?? మరో వింత సంగతి చెప్పనా... ఈ రిజర్వేషన్లలో పెళ్లైనవారికి కూడా విసిరేసినట్టు అక్కడోటి, ఇక్కడోటి సీట్లిచ్చి తాత్కాలిక విడాకులిచ్చేస్తుంటారు. అలాగే తాత్కాలిక ద్వితీయ వివాహాలు కూడానండోయ్.. ఆర్ధం కాలేదా?? భార్యకు ఒకదగ్గర, భర్తకు ఒక దగ్గర సీట్ ఇస్తారు. ఫ్రయాణం తప్పనిసరై ఇలా అడ్జస్ట్ అవ్వక తప్పదు.


బస్సు స్టార్ట్ అయ్యాక ఇక డ్రైవరు అర్జునుడి రధాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడిలా ఫీలవుతాడు. బస్సు అతని చేతిలో కీలుబొమ్మ కావలసిందే. అతనికిష్టమున్నప్పుడే, ఇష్టమున్నచోటే ఆగుతుంది. బయలుదేరుతుంది. సాధారణంగా సిటీబస్సులు స్టాపుల్లో తప్ప డ్రైవరుకు నచ్చినచోట మాత్రమే ఆపబడుతుంది. నోరెత్తడానికి వీలులేదు. అందుకే చాలా మంది బస్ స్టాపుల కంటే జంక్షన్ల వద్ద ఎక్కువ నిలబడతారు ఎక్కడానికి. కొన్ని రూట్లలో ఒక బస్సులో పదిమందికంటే ఎక్కువ ఉండరు. మరో రూట్లో ఒక బస్సులో నాలుగు బస్సుల మంది ఉంటారు. సగం మంది మనుష్యులు బస్సును గబ్బిలాలలా పట్టుకుని వేళాడుతూ ఉంటారు. ఈ కుర్రాళ్లకి ఈ సాహసాలు వాళ్ల జీవన నౌకాయానం లో పనికొస్తాయేమో.. ఇక్కడ నాకు అస్సలు అర్ధం కాని సంగతేంటంటే ... ఆర్.టీ.సి కి లాభాలు వస్తున్నాయి. బస్సులు ఎక్కడానికి ప్రయాణీకులు ఉన్నారు. మరి బస్సులు పెంచడానికేం మాయరోగం?. ముఖ్యంగా శివార్లలోని కాలేజీ పిల్లలలకు. అవినీతిపరులకు ఆదాయం కూడా ఉంటుందిగా మరిన్ని బస్సులు వేస్తే.. అర్ధం చేసుకోరూ!!!



సిటీ బస్సులలో ప్రయాణీకులు ఎక్కువసేపు కలిసి ఉండరు. కొద్ది దూరానికే దిగిపోతారు. విడిపోతారు. కానీ ఊర్లలో తిరిగే బస్సులలో ఎన్నో పరిచయాలు, అనుబంధాలు , స్నేహాలు కూడా. బస్సెక్కి లగేజీ సీటుపైన పైన పెట్టి హాయిగా కళ్లు మూసుకుని మధురస్వప్నాలలో తేలిపోదామనుకునేవారికి అప్పుడప్పుడు .. ఆ బ్యాగులు ధభీమని నెత్తిమీదొచ్చి పడి భయంకరమైన వాస్తవ ప్రపంచంలోకి తీసుకొస్తాయి. ఇక మరి కొందరు తమ పిల్లల పెల్లి సంబంధాల నుండి పక్కవూరి సర్పంచ్ రాసలీలలు కూడా తీవ్రంగా చర్చిస్తారు. మధ్యలో డ్రైవరూ, కండక్టరూ తమ వంతు మాట సాయం చేస్తుంటారు. పాపం .. ఉన్నమాట చెప్పాలి. ఊర్లలోని బస్సులు ఎక్కదంటే అక్కడ ఆపుతారు. భలే ముచ్చటేస్తుంది. కొండరు డ్రైవర్లు మార్గమధ్యంలో బస్సులను బస్ స్టేషన్లలోకంటే కాకా లేదా డాబా హోటళ్ల దగ్గర ఎక్కువసేపు నిలుపుతారు. అక్కడ వాళ్ల లాభం వాళ్లు చూసుకోవద్దా?? దిగిన ప్రయాణీకులు అందరూ ఎక్కారా లేదా అని కూడా చూసుకోకుండా కదిలి వెళ్లిపోతారు.


ఇలా చెప్పుకుంటూ పోతుంటే అంతా బాగానే ఉంటుంది. కాని వాస్తవంగా జరగే విషయాలు కూడా చేప్పుకోవాలిగా.. రోజూ వేలమందిని వారి గమ్యాలకు చేరుస్తామా?..ఈ బస్సులు ఉన్నది మీకోసమే కదా? కాని ఎన్నోసార్లు రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకోసం మా అద్దాలు పగలగొడతారు. నిప్పంటిస్తారు. ఇదేనా మా నిస్వార్ధ సేవకు ప్రతిఫలం. నోరులేదు , మాట్లాడలేమనే కదా ప్రతి గొడవకి మమ్మల్నే బలిపశువులను చేస్తారు. మరి ఆ రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు మాత్రం మేమే కావాలి?? అప్పుడు వారందరిని మా బస్సు కిందే వేసి తొక్కేయాలనిపిస్తుంది. మమ్మల్ని వాడుకుని వదిలేయరు కాని కాల్చేస్తారు..



మీరైనా మమ్మల్ని కాపాడరూ? మరీ భద్రత లేని బ్రతుకైపోయింది.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008