మనుషుల్ని కాదు.. మనసుల్ని గెలుద్దాం.. సెప్టెంబర్ 2010 కంప్యూటర్ ఎరా సంపాదకీయం
ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి మనకు దగ్గరవ్వాలంటే ఎన్నో మనస్తత్వ విశ్లేషణలు, నిజనిర్థారణలూ అవసరం అవుతున్నాయి. అదే కొద్దిగా తేడా వస్తే చాలు.. ఎలాంటి సంజాయిషీలూ, క్షమించడాలూ లేకుండా క్షణకాలంలో వారికి దూరమైపోతున్నాం. ఓ మనస్పర్థ వస్తే చాలు.. తప్పయినా ఒప్పయినా మనం అనుసరించే పద్ధతే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతున్నాం. అందుకే మనసుల మధ్య ఏర్పడే అగాధాన్ని పూడ్చుకోవాల్సింది పోయి మొండిపట్టుదలతో బింకంగా హఠమేస్తున్నాం.. ‘మనకేం అవసరం.. వస్తే వాళ్లే వస్తారులే’ అన్న అహం కమ్ముకుపోతుంది. అంతా సక్రమంగా ఉన్నప్పుడు ఆ ఇద్దరూ ఒకరికొకరు ఎంతో సాయం చేసుకుని ఉంటారు. ఓ చిన్న అపార్థం బుర్రని తొలవడం మొదలు.. ‘వాళ్లు మనకు చేసిందానికన్నా మనం వాళ్లకు ఎంతో సాయం చేశామని.. మనం లేనిదే వాళ్లకు జరుగుబాటు కాదని’ గత జ్ఞాపకాలను ప్రేమతో మానేసి ద్వేషంతో గుర్తుకుతెచ్చుకుంటాం. గతంలో అవతలి వారి చిరునవ్వులకు పులకించిపోయిన మనసు కాస్తా ద్వేషంతో ఆ జ్ఞాపకాలు గుర్తుకువచ్చినప్పుడు ఆ నవ్వులనే గుర్తు చేసుకుని మరీ చిటపటలాడుతుంది.
హ్యూమన్ సైకాలజీ, బాడీ లాంగ్వేజ్‌లు, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో మనుషుల మనసుల్ని త్వరగా గెలవగలిగే మెళుకువలు అలవర్చుకుంటున్నాం. కానీ అందులో ఎక్కడా చిక్కదనం లేదు. ఫైవ్‌స్టార్ హోటల్‌లో రిసెప్షనిస్ట్ నవ్వుకీ మన నవ్వుకీ తేడానే లేదు. రెండు నవ్వులూ అరక్షణమే విచ్చుకుంటాయి. అంతలోనే మూసుకుపోతాయి. కృత్రిమ హావభావాలతో కూడిన అచ్ఛమైన ప్రొఫెషలిజం! ఇంత సులభంగా మనుషులకు దగ్గరవగలిగే మనం, ఇంత సులభంగా మనల్ని మనం మార్కెట్ చేసుకోగలిగే మనం.. గాఢమైన అనుబంధాలను ఎందుకు పెనవేసుకోలేకపోతున్నాం? అందమైన చిరునవ్వులు, పొందికైన మాటలూ, ముచ్చటగొలిపే ముఖకవళికలు, ఆకర్షణీయమైన ఆహార్యం.. అన్నీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని మరీ నేర్చుకుంటున్నాం. ఎందరినో పరిచయం చేసుకుంటున్నాం, సాన్నిహిత్యం పెంచుకుంటున్నాం, అనుబంధపు మాయమాటలతో ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నాం.. రైలు ప్రయాణంలో స్టేషన్ వస్తే దిగిపోయే ప్రయాణీకుల్లా అంతే అవలీలగా తప్పుకుపోతున్నాం. మరో రైలు, మరో మజిలీ, మరికొన్ని స్నేహాలూ.. జీవితం సాగిపోతూనే ఉంటుంది. కొత్త మనుషులు కలుస్తూనే ఉంటారు. అవసరాలు తీర్చేసుకుని ఏదో ఒక సాకుతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని దూరమవుతూనే ఉంటారు. స్నేహంలో అవసరాలు ఒక భాగం మాత్రమే.. అవసరాలు తీర్చుకోవడానికే స్నేహం ముసుగు వేసుకోవలసి వస్తే ఆ అవసరాలు తీరగానే ఆ స్నేహానికి నూకలు చెల్లినట్లే! అందుకే మనుషుల్ని ప్రేమిద్దాం, అభిమానిద్దాం, సహకరించుకుందాం.. అంతే తప్ప మనుషుల్ని జీవితంలో పైకెదగడానికి పావులుగా వాడుకునే నైపుణ్యతలు ఎన్ని అలవర్చుకున్నా మనసులో స్వచ్ఛత లేనప్పుడు ఆ అనుబంధాలకు బలమెక్కడ?
మీ
నల్లమోతు శ్రీధర్