Thursday, 31 January 2008

పుణుకులు

1. స్నేహితుడు..

"ఏరా సంతోష్ ! అలా ఊరికే కూర్చునే బదులు నీ స్నేహితుడు శేఖర్‍తో బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చుగా" అని అమ్మ అంది.

"ఆడుకోవచ్చు కాని, ఎదుటివాడు పాయింట్లు సాధించినపుడు అతడు తొండి చేస్తున్నాడని ఊరికే గొడవ చేస్తుంటే ఎవరు మాత్రం ఆడతారు?"

"అవును . అదీ నిజమే. ఎవరాడతారు?"

"అందుకే శేఖర్ నాతో ఆడడం లేదు మరి." అన్నాడు సంతోష్.



2. లింగం మావ కంఫ్యూటర్ చిక్కులు

అందరూ కంఫ్యూటర్ కొంటున్నారని లింగం మావ కూడా కంప్యూటర్ కొన్నాడు. అది తెచ్చినవాళ్ళు అన్నీ అమర్చి వెళ్ళిపోయారు. ఒకరోజు ఏదో ప్రాబ్లం వచ్చిందని లింగం మావ ఆ కంపెనీ కాల్ సెంటర్ కి ఫోన్ చేసాడు.

"హలో ! చెప్పండి , మీకు ఎటువంటి సహాయం కావాలి?"

"నా కంప్యూటర్‍తో ప్రాబ్లం వచ్చింది. ఎంత టైప్ చేసినా ఒక్క అక్షరమూ కనపడడం లేదు."

"మీరిప్పుడు కంప్యూటర్ ముందే ఉన్నారా? మౌస్‍తో కర్సర్‍ని కదిలించండి."

"అలాంటిదేమి కన్పించడం లేదు"

"కంప్యూటర్ వెనుక వైర్లన్నీ ఒకసారి తీసి మళ్ళీ పెట్టండి "

"ఇక్కడంతా చీకటిగా ఉంది"

"లైటు వేసుకొని చూడండి"

"అయ్యో! ఇక్కడ గంట నుండి కరెంట్ లేదండి. కొవ్వొత్తి పెట్టుకున్నాను.ఇంకో విషయం ఇక్కడ సిడి డ్రైవ్ పని చేయటం లేదు. ఏం చేయను?

"ఆ సిడి డ్రైవ్ లో ఉండే చిన్న హోల్‍లో పిన్నుతో కదిలించండి. సిడి ట్రే బయటికి వస్తుంది.అందులో సిడి పెట్టాలి "

"ఏది నేను టీ కప్పు పెట్టిన ప్లేటా"

"???????? ... పెట్టేయ్ ఫోన్ !!"



3. ఒక రకమైన కర్రలతో నోరూరించే పులుసులు, కూరలు చేసుకోవచ్చు.

ఏంటా కర్రలు?

Saturday, 26 January 2008

పేపర్ కటింగ్స్ .. మళ్ళీ మళ్ళీ పలకరించే స్మృతులు...

DSC00048 ముప్పై ఐదేళ్ల క్రిందటి పేపర్ కటింగ్స్ తో బైండ్ చేసి పెట్టుకున్న పుస్తకం. నా అపురూపమైన ఖజానా

 

కొన్ని పదార్థాలు వేడివేడిగా వున్నప్పుడు తింటేనే మజాగా ఉంటుంది. వార్తలూ అంతే ! ఒక రకంగా చెప్పాలంటే న్యూస్ పేపర్ అనేది వేడి వేడి పకోడీలుంచిన ప్లేటు వంటిదన్నమాట. టీయో , కాఫీయో ఒక చేత్తో పట్టుకుని మరోచేత్తో పేపర్ చదువుతూ దినచర్య మొదలెట్టేవారు కోకొల్లలు. ముందుగా ముఖ్య వార్తలు, సంచలన వార్తలు, సినిమా, స్పోర్ట్స్ చదివేసి తర్వాత తీరిగ్గా మొదటి పేజీ నుండి చివర్లో ఇచ్చే సంతాప సందేశాలు కూడా చదవితే గాని పేపర్ చదివిన తృప్తి ఉండదు.

కాని పత్రికల్లో ఒక్క న్యూసే ఉండదు. వ్యాఖ్యలు, వార్తల వెనుక అసలు సిసలు కథలు, వివిధ అంశాలపై ఆయా రంగాల్లో నిపుణులైన వారి విశ్లేషణలు, అపురూపమైన ఫోటోలు, రాజకీయాలపై గిలిగింతలు పెట్టే కార్టూన్లు, ప్రభావితం చేసే సంపాదకీయాలు, ఇలా ఎన్నో విషయాలు నిండిన దినపత్రికలు పుష్పక విమానాలు. పూలు సాయంత్రానికి వాడిపోవచ్చు. కాని మన మనసుని దోచుకున్న వాటి పరిమళం అంత త్వరగా మనల్ని వీడిపోదు. అలాగే ఒక పత్రిక జీవితం ఒక్కరోజైనా, నలిగిపోయి జీవం కోల్పోయినా కూడ మనల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుని , దాచుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. వార్తా పత్రికల్లో వచ్చే అనేక ఆసక్తికరమైన విషయాల్ని అలా చదివేసే వదిలేయకుండా, అవసరమైనపుడు మళ్ళీ రిఫర్ చేసుకోవాలనుకున్నపుడు వాటిని కత్తిరించి దాచుకోవాలి.

DSC00046
జూన్ 2001లో నేపాల్ యువరాజు  చేసిన మారణహోమం

పత్రికల్లో వచ్చే వివిధ విషయాలు, అవసరమనిపించినవి సంక్షిప్తంగా డైరీలో రాసుకోవడం కొందరి అలవాటు. కొన్ని అంశాలు మొత్తంగానే భవిష్యత్తులో ఉపయోగపడేవి కావచ్చు. అన్నీ రాసుకోవడం అయ్యే పని కాదు. ఇలాంటి సంధర్భాల్లో నచ్చిన అంశాన్ని కట్ చేసి దాచుకోవడం ఒక్కటే దారి. "అవుటాఫ్ సైట్ , అవుటాఫ్ మైండ్" అన్నారు కదా! ఒకసారి మనకి నచ్చిన సంగతుల్ని భద్రపరచుకోవడానికి బద్ధకిస్తే, ఆ విషయాలు మర్చిపోతాము. మళ్ళీ అదే విషయాలు పొందడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. ప్రతీ దానికి మార్కెట్ కెళ్ళి పుస్తకాలు వెతికి కొనలేము కదా!.

కొంతమంది మరీ ముఖ్యమనుకున్న విషయాల్ని ఫోటోకాపీ చేసి పెట్టుకుంటారు. కొంతమంది కటింగ్స్ ని పుస్తకాలుగా కుట్టి దాస్తారు. కొందరు ఫైల్ చేస్తారు. కొందరు తెల్లకాగితాలపై ఈ కటింగ్స్ ని అతికించి బుక్స్ గా చేసుకుంటారు. పేపర్ కటింగ్స్ సేకరించే హాబీ, మానసికానందాన్నే కాక మానసిక వికాసానికి దోహదం చేస్త్తుంది. పిల్లలకు ఈ అలవాటు చేయడం వల్ల వారికి ప్రోజెక్ట్ వర్క్స్ కోసం, పోటీ పరీక్షలకు పనికొచ్చే ఎన్నో విషయాలు తెలుస్తాయి. దీని వల్ల పిల్లల్లో విషయసేకరణ, వ్యక్తీకరణ, అలవడుతుంది. ఏళ్ళ తరబడి ఈ కటింగ్స్ ని సేకరించగలిగితే , ఒక మినీ లైబ్రరీ మన చెంత ఉన్నట్టే. ఏ విషయం మీదైనా సమగ్రంగా మాట్లాడాలన్నా, రాయాలన్నా, ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

 

DSC00043 2001సెప్టెంబరు 11 న అమెరికాపై జరిగిన దాడి...

ఒకప్పుడు ఆంగ్లపత్రికల్లో ముఖ్యంగా ఆగిపోయిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి పత్రికల్లో ఎన్నో అపురూపమైన వ్యాసాలు, ఫోటొలు వచ్చేవి. అయితే పత్రికా ప్రచురణలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న సాంకేతికాభివృద్ధి కారణంగా తెలుగు పత్రికల్లో సైతం ఎన్నో ఉపయుక్తమైన వ్యాసాలు, ఫోటోలు వస్తున్నాయి. వీటిని భద్రపరుచుకుని, అప్పుడప్పుడు చూసుకుంటుంటే చాలా థ్రిల్లింగ్‍గా ఉంటుంది. కోన్నేళ్ల తర్వాత ఈ పేపర్ కటింగ్స్ ని తిరగేస్తుంటే పాతమిత్రుల్ని అనుకోకుండా కలిసినంత ఆనందంగా ఉంటుంది. నాకూ ఈ అలవాటు చిన్నప్పటినుండి ఉంది. మంచి వ్యాసాలు, వంటలు, కుట్లు అల్లికలు, సీరియల్ కథలు, మొదలైనవి తర్వాత చదూకోవచ్చు అనే ప్రతి పేపర్ కటింగ్ ని జాగ్రత్త పరిచి పుస్తకాలు బైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ అలవాటు మా నాన్నగారి నుండి వచ్చింది. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాను.

ఎన్నో వందల గ్రంధాలు ఒక్క ఇ బుక్‍లో ఇమిడిపోయే ఈ రోజుల్లో ఇంకా ఈ పేపర్ కటింగ్స్ ఎందుకంటారా? ఎన్ని స్టార్ హోటల్స్ ఉన్నా, ఇంటి వంట రుచి తగ్గిపోతుందా? సాటివస్తుందా??

తరాల అంతరాలు

నిన్నటి తరానికి, నేటి తరానికి ఆలోచనా విధానంలో గానీ, వ్యవహార శైలిలో గానీ, జీవితం పట్ల ఉన్న దృక్ఫధంలో గానీ, ఎంత వృత్యాసం! ముందు తరం లక్ష్యాలు పరిమితంగా ఉండేవి. అవకాశాలూ ఆ స్థాయిలోనే ఉండేవి. పెళ్ళి చేసుకుని , నాలుగురాళ్ళు సంపాదించుకోవడం …… హాయిగా కాలం గడపడం వరకే దాదాపు వారి ఆలోచనలు లిమిట్ అవుతాయి. నేడో.. జీవితంలో సాధించవలసిన లక్ష్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అప్పటితరం ’ఫీల్ గుడ్’ గా ఏ ఆర్ధిక ఉన్నతిని భావించేదో అంతకన్నా పదిరెట్లు సంపాదించినా కోరికలను తీర్చుకోలేనంత కన్ష్యూమబుల్స్ ప్రస్తుతం మార్కెట్లో వెల్లువెత్తుతున్నాయి. ఏ కోరికనీ అణచుకోలేని ప్రస్తుత తరం వాటన్నింటినీ చేజిక్కించుకోవడానికి కాలంతో పాటు పరుగులు పెడుతుంది. అప్పటి తరం, ఇప్పటి తరం తాము ఆనందం అనుకునే దానిలో ఆనందాన్ని పొందుతూనే ఉన్నారు. అయితే అభిరుచులు, ముందున్న అవకాశాల్లోనే వృత్యాసం ఉంది. ఫ్రెండ్స్ తో జాలీగా వీకెండ్స్ గడిపే కుర్రాళ్ళని మునుపటి తరం మందలిస్తుంటుంది.. అలా తిరిగితే చెడిపోతారు. … అనేది అప్పటి అనుభవాలు వారికి నేర్పిన పాఠం. అందుకే వారు తమకు అపసవ్యంగా అనిపించిన పిల్లల ధోరణుల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే యువతలో తాము వేలెత్తి చూపించే అంశాలుగా భావించిన వాటిని వేలెత్తి చూపుతున్నారు కాని… తమ రోజులతో పోలిస్తే తమ పిల్లలు ప్రస్తుతం చూపిస్తున్న ప్రతిభాపాటవాల్ని చాలా తక్కువమందే గుర్తిస్తున్నారు. మునుపటి తరం చదువుకునేటప్పుడు కెరీర్ గురించి తమ పెద్దల వద్ద ప్రస్తావించాలన్నా భయపడేవారు. మరి ఇప్పటి పిల్లలు తమ లక్ష్యాలను నిర్భయంగా పెద్దలతో పంచుకోవడంతోపాటు వాటిని నెరవేర్చుకోవడానికి కావలసిన వనరులను, సమాచారాన్ని సైతం ఎవరి సాయం లేకుండా సమకూర్చుకుంటున్నారు కాబట్టి… అప్పట్లో తమలో నాటుకుపోయిన ముద్రని ఇప్పటి తరంపై రుద్దడం పెద్దలకు ఏ మాత్రం భావ్యం కాదు !!!!

నల్లమోతు శ్రీధర్

Sunday, 20 January 2008

ఆహా (ర) పద్యాలు....

కాదేదీ కవితకనర్హం అన్నట్టు మన కవులు కూరగాయలు, వంటకాలమీద కూడా అవలీలగా పద్యాలల్లేసారు. కొన్ని తమాషా పాటలు, పద్యాలు చూద్దాం....



"వెల్లుల్లి బెట్టి పొగిచిన

పుల్లని గోంగూర రుచిని పొగడగ వశమా?


మొల్లముగ నూనె వేసుకు

కొల్లగ గువ్వలచెన్నా !!"




తానేమీ తక్కువ అంటూ సుబ్బారావు కవిగారు ఉల్లిపాయ దండకమే రాశారు.



"ఓ యుల్లిపాయా! నమో యుల్లిపాయా!


నినుం బూజగావింతు నీ వాసనల్లేక


నే కూరయుం గూడ నేదో మరో మట్టి


దిన్నట్టుగా దోచు.. మా కాంక్షలందీర్చవే


పూర్వకాలంబులో రీతిగా కూరలన్నింటికిన్


కొత్త టేస్టుల్ ప్రసాదించి మా జిహ్వకుం దృప్తి చేయంగదమ్మా!


నమస్తే నమస్తే నమస్తే నమః"



ఓ కొంటె కవి



"కాచీ కాచీ ములక్కాయా, కాయనే పొట్టి కాకరీ


కాయనాం, వంగపింజనాం కూరానాం గుజ్జు పచ్చడి !!"


అంటు దొరికిన కూరగాయల్ని పచ్చడి చేసేశాడు.



ఇక తిరుపతి కవులు మాత్రం తక్కువ తిన్నారా


పచ్చిమిరపకాయ మీదా పద్యం రాసి దణ్ణం పెట్టేసారు.



"ఎద్దాని సంబంధ మెలిమి గల్గిన మాత్ర


కూరలెల్లను మంచి గుణము గనునా


కొత్తిమిరిని నూరుకొని తిన్న నెయ్యది


కంచె డన్నము తినగలగ జేయు


ఎద్దాని శిశుజాల మెరుగక చేబట్టి


కనులు నల్పిగ మంట గలుగ జేయు


ఎద్ది తా క్రమముగా నెదిగి పంపిన మీద


జోటి కెమ్మోవితో సాటి యగునా


నూరి దేనిని పుల్లనై మీరు మెంతి


పెరుగుతో గూర్ప స్వర్గము నెరుగజేయు


నరులకెల్లను నా పచ్చి మిరపకాయ


మహిత భక్తిను నేను నమస్కరింతు !!"

Thursday, 17 January 2008

మాటే మంత్రమో...

"మాట" ఎంతో శక్తివంతమైనది. ఒకే మాట వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు అర్ధాలను
ధ్వనిస్తుంటుంది. మనం మాట్లాడే మాటని ఎదుటివారికి ఇష్టమైన అర్ధంతో ధ్వనింప
చేయలేకపోతే ఆ మాట నిస్సారమైనట్లే లెక్క. స్నేహాలు, శత్రుత్వాలు, నమ్మకాలు,
సందేహాలు, ఇష్టాలు, నిష్టూరాలు, ప్రేమలు, ఏహ్యాలు వంటి భావోధ్వేగాలన్నీ మన
మాటల ద్వారానే సృష్టింపబడుతూ ఊంటాయి. ఏ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలన్నది మన
మనసులో ముందే ప్రోగ్రామ్  చేసుకుని ఉంటాము. అయితే అలా
ప్రవర్తించేటప్పుడు మాటల్లొ హెచ్చుతగ్గులు ఒక్కోసారి విపరీత పరిణామాలకు దారి
తీస్తుంటాయి. వాక్కుపై నియంత్రణ కలిగిన వ్యక్తి ప్రపంచాన్ని జయించినట్లే అంటుంటారు.
అందుకే పరిణతి కలిగినవారెప్పుడు గంభీరంగా, గుంభనంగా ఎంతవరకు అవసరమో
అంతవరకు మాత్రమే  ఆచీ తూచి మాట్లాడుతూంటారు.తాము మాట్లాడిన
మాటలు ఎలాంటి ఫలితాలు అందిస్తాయో అంచనా వేయగలుగుతారు.తాము ప్లాన్డ్ గా
మాట్లాడడమే  కాకుండా ఎదుటివ్యక్తుల మాటల ఆధారంగా  వారి
మనసుల్ని అవలీలగా చదివేయగలుగుతారు. మనం మాట్లాడే మాటకు మొహంలో
కన్పించే భావం జీవాన్ని పోస్తుంది. మాట సున్నితమైనా భావం కఠినంగా గోచరిస్తే
మాత్రం ఫలితం తారుమారవడం ఖాయం. మాటనీ, భావాన్నీ సమన్వయపరచుకుని
ఒకేలా ధ్వనింప చేయగలిగితే అవి ఎదుటి వ్యక్తుల మనసుల్ని హత్తుకు పోతాయి.
మాటలపై నియంత్రణ కోల్పోతే ఎన్నో అనుబంధాలను కోల్పోవలసి వస్తూంది.
అందుకే  వీలైనంతవరకూ మన నోటి నుండి వెలువడే ధ్వనిపై 
ఓ కన్నేసి ఉంచి నిబద్ధతతో మాట్లాడడం అన్ని విధాలా శ్రేయస్కరం !!...

 

నల్లమోతు శ్రీధర్.

Wednesday, 16 January 2008

మా ఇంట సంక్రాంతి సంబరాలు...

వరూధినిగారు పల్లెటూరి సంక్రాంతి అనుభవాలు చెప్పారు. నాకు పల్లెటూరి అనుభవం లేదు కాని పట్నం కబుర్లు చెప్తాను. నా చిన్నప్పుడూ సంక్రాంతి పండగంతా నాదే. మామూలుగా ఇంటి పని చేయని నేను సంక్రాంతి నెలరోజులు మాత్రం ముగ్గులు పెట్టేదాన్ని, పెళ్ళయ్యేవరకు కూడా. పండుగ నెలరోజుల ముందునుండే రకరకాల ముగ్గులు కలెక్ట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, స్నేహితుల వద్ద కూడా నేర్చుకోవడం ఇలా సరదాగా గడిచేది. రోజూ ఎనిమిదివరకు లేవని నేను ఆ నెలరోజులు చలి ఉన్నా కూడా ఐదింటికే లేచి, శుభ్రం చేసిన వాకిలిలో రోజుకొక ముగ్గు వేయడమంటే భలే సరదాగా ఉండేది. చీకటిగా ఉన్నా భయమేసేది కాదు ఆ రోజుల్లో. అప్పుడప్పుడూ నేను ప్యాంటు షర్టు వేసుకుని ముగ్గు వేస్తుంటే అందరు వింతగా చూసేవారు. ముఖ్యంగా పాలకోసం వెళ్ళే మగవారు. ఆడవాళ్ళు మాత్రం అటుగా వెళ్తూ ఆగి ముగ్గులోని చుక్కలు , డిజైను చూసి వెళ్ళేవారు. పైగా ఇరుగు పొరుగు ఆడవాళ్ళు కూడా పోటీలు పడి ముగ్గులు వేసేవారు. ఏడింటికి ముగ్గు పూర్తి చేసి అప్పుడూ వేరేవాళ్ళు ఏ ముగ్గు వేసారా అని చూసుకోవడం. మా ఇంటి పై బాల్కనీ నుండి ఎదురింటి వాకిలిలోని ముగ్గును చూసి నేర్చుకోవడం. స్నానాలు, టిఫిన్లు అయ్యాక అమ్మ చేసిన పిండి వంటలు తీసుకుని తమ్ముళ్ళతో కలిసి డాబాపై పతంగులు ఎగరేయడం.ఇవి నా పనులు పండుగ రోజు. ఆ రోజుల్లో పతంగులు చాలా హుషారుగా ఎగరేసేవారు. ఆకాశం నిండా రంగు రంగు పతంగులు, అరుపులు , పిల్లలందరు డాబాలపైనే ఆ రోజంతా. ఇంకా పతంగులకు రక రకాల తోకలు కత్తిరించి పెట్టడం. కనుమ రోజు నేను మా తమ్ముళ్ళుకలిసి మిగిలిన పతంగులు , దారం ఎందుకు మళ్ళీ ఏడాదిదాకా దాచిపెట్టడం అని అన్నీ ఎగరేసి దారం తెంపేయడం. ట్రేసింగ్ పేపర్‍తో లాంతరు తయారు చేసి అందులో చిన్ని క్యాండిల్ పెట్టి కనుమ రోజు రాత్రి మిగిలిన వాటిలో పెద్ద పతంగు తీసి దానిని కొద్ది దూరం ఎగరేసి ఈ లాంతరులో కొవ్వొత్తి వెలిగించి దారానికి కట్టి దాన్ని కూడా ఎగరేసి అది ఆకాశంలో పైకి వెళ్ళాక దారం తెంపేసేవాళ్ళం. అది కంటికి కనిపించే వరకు చూసికాని క్రిందకు దిగేవాళ్ళము కాదు. ఆ రోజుల్లో సరదాలే వేరు.

ఇప్పుడూ మా ఇంటిలోని సంక్రాంతి విశేషాలు చూద్దామా!


ముందులా ప్రతీ రోజు రకరకాల ముగ్గులేయకున్నా పండుగ మూడు రోజులు మాత్రం మా వాకిలి నిండిపోవాల్సిందే.


గొబ్బెమ్మలు, నవధాన్యాలు, రేగుపళ్ళు,జీడిగింజలు,చెరకు,సెనగ,క్యారట్ ముక్కలతో ముగ్గు ఎంత అందంగ ఉంది కదా..


ఇంటి వాకిలి ముందు గొబ్బెమ్మల మధ్య పాలు పొంగించడం మా కుటుంబ ఆచారం. ఆ పాలు పొంగిపోయే దిక్కును బట్టి ఈ సంవత్సరమంతా ఎలా గడుస్తుందో అని లెక్కలేస్తారు పెద్దలు. గత సంవత్సరం, ఈ సంవత్సరం మా పాలు ఈశాన్యం దిక్కుగా పొంగిపోయాయి. మంచిదే..


పాలు పొంగించడం అయ్యాక పూజ చేసుకుని, పిండివంటలు చేసాను. స్వీట్లు ఒక రోజు ముందే చేసినా, హాట్లు మాత్రం ఇవాళే.. సంక్రాంతికి తప్పనిసరిగా చేసే నువ్వుల లడ్డులు, అరిసెలు, మరమరాల ఉండలు. నేను చేసే నువ్వుల లడ్డులు తినాలంటే మాత్రం దంతాలు చాలా గట్టిగా ఉండాల్సిందే. అంత తేలిగ్గ విరగవు. అది ఎవరిమీదైనా విసిరికొడితే దెబ్బ తగలడం ఖాయం. మరి నువ్వుల లడ్డులు అంటే అంత గట్టిగా ఉండాలి . అప్పుడే అవి పర్‍ఫెక్ట్ అన్నమాట. మొత్తం కొరికి తింటే మజా ఉండడు. చిట్టెలుకలాగా కొంచెం కొంచెం కొరికి తినాలన్నమాట.


హాట్ల విషయానికొస్తే పప్పు చెక్కలు, కారప్పూస, మరమరాలతో మిక్చర్.


మధ్య మధ్యలో మావారికి పిల్లలకు గారెలు , సాంబార్


చివరిగా మీకు, పండగ స్పెషల్స్ తిని భుక్తాయాసం రాకుండా రమణీయప్రియదూతిక ఇచ్చే కప్పురవిడెం లాంటిది కాకపోయినా , మస్త్ - జబర్‍దస్త్ హైదరాబాదీ స్పెషల్ "కలకత్తా రామ్‍ప్యారీ పాన్".

ఇంకా ఆయాసంగా ఉంటే " హాజ్‍మోలా జిందాబాద్"

పండుగలకు ఇలాటి స్పెషల్స్ చేసుకోవడం గొప్పేమీ కాదు. నేను ఇక్కడ ఎక్కువ పీకిందేమీ లేదు. కాని షడ్రుచులు బ్లాగు రాసే నాకు నిజంగా అన్ని వంటలు చేయడం వచ్చా , లేక ఊరికే పుస్తకాలనుండి చూసి రాస్తున్నానా అని చాలా మంది అనుమానం. అందుకే ఇలా ఫోటోలు తీసి పెట్టాను సరదాకి..

పైన పెట్టిన పోటోలలోని ముగ్గులు, పిండివంటలు అన్నీ నేను చేసినవే, కొన్నవి కావు( ఫోటోలో వాటి అవతారం చూస్తే తెలీటంలా) మావారు ఇందులో చిటికెనవేలి గోరు కూడ పెట్టలేదు. నిజ్జంగా నిజం. కాదంటే వై. ఎస్.ఆర్ తెలంగాణా ఇచ్చినంత ఒట్టు..

Monday, 14 January 2008

మకర సంక్రాంతి శుభాకాంక్షలు



మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Saturday, 12 January 2008

భోగి పండుగ శుభాకాంక్షలు

కోడిగుడ్డు తంటసం


తంటసం అంటే చిమ్మట. వెంట్రుకలను లాగటానికి వాడేది. నున్నగా ఉండే కోడిగుడ్డుపై లాగటానికేమీ లేదు. మనకు కనిపించకపోయినా, ఏమో ఉండకపోతుందా అన్న అనుమానంతో ప్రయత్నించే ప్రబుద్ధులూ లేకపోలేరు. ఏమీ లేని చోట ఏదో ఒకటి చేసి సంపాదిద్దామనే వాళ్ళు ఎంతోమంది. కోడిగుడ్డు వెంట్రుకలు లాగి దానితో కుచ్చుల జడ వేసేవాళ్ళున్నారంటారు. సాధారణంగా ఈ బాపతు అనుమానంతో బతికే రకం. ఎవరినీ నమ్మరు, దేన్నీ నమ్మరు.. ఫలితం ఉండ దని చెప్పినా వినరు. ప్రయత్నం మానరు. వృధా శ్రమ అని దీనర్ధం.

గొంతెమ్మ కోరిక

తీరని, అసాధ్యమైన కోరికలను గొంతెమ్మ కోరిక లంటారు కుంతీదేవికి తెలుగు పేరు గొంతి.
అమ్మ శబ్దం చేర్చి గొంతెమ్మ అన్నారు. అటు పాండవులు ఇటు కర్ణుడూ అంతా బతికి
వుండాలని ఆమె కోరుకున్నది . పాండవుల్లో ముఖ్యంగా అర్జునుడు భారత యుద్ధంలో
గెలవాలనుకోవటం బాగుంది. కాని తానే తన కొడుకని ఆఖరి క్షణం వరకు చెప్పక దాచి,
కర్ణార్జునుల్లో ఎవరో ఒకరు మాత్రం బ్రతుకుతారనే నిర్ణయానికి వారిద్దరూ వచ్చిన తర్వాత
ఇద్దరూ బ్రతకాలని కోరుకోవటం సాధ్యమయ్యే పని కాదు. అలా వీలుకాని, ఎన్నటికీ తీరని
కోరికలను గొంతెమ్మ కోరికలంటారు.

Wednesday, 9 January 2008

ఆంధ్రాంగ్ల పద్యాలు

ఆంధ్రాంగ్ల భాషా సమ్మేళనంలో పుట్టిన కొన్ని చమత్కార పద్యాలు చూద్దాం.

కనులంజూడదు భార్యయేనియును నీకాల స్థితింబట్టి జ
ర్మను తైలమ్ము జపాను సబ్బమెరికా క్రాఫున్ వియన్నాసులో
చనముల్ స్వీడను చేతి బెత్తమును స్విట్జర్లాండు రిస్ట్ వాచి ఫా
రెను డ్రెస్ ఫ్రెంచ్ కటింగు మీసాలును ఫారిన్ ఫ్యాషనే లేనిచోన్ !!


రచన : మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారు.

ఇన్సూర్ లేని లైఫును
సెన్సార్ కానట్టి ఫిల్ము సీక్రెట్ ట్రూతున్
వైన్సర్వు కానట్టి ఫీస్టును
విన్నే లేనట్టి టీము వేస్టుర బ్రదరూ !
లైఫన నౌవెడే ససలు రైటని చెప్పగలేము బెడ్డులో
నైఫును బోలెడెత్తు ప్రతి నైటును డేయును ఫాలోయవ్వగా
వైపును సన్సు డాటరుల ప్రాపరు రక్షణ నిల్లు దేరు ఫోర్
లైఫుకు ఇన్సు్‌రెన్సు బహుళంబుగ ఫ్రాంప్టు ప్రొటెక్షనిచ్చెడిన్ !!


రచన : ఇలపావులూరి సుబ్బారావుగారు.


రామ ది కింగ్సు సన్ను వితు లక్ష్మణ ఎండ్ వితు సీత క్రాస్డు దీ
ఫేమసు దండకాసు బిగు ఫీల్డుసు మోస్టు లెబోరియస్లి దెన్
కేము విరాధ విత్తు హిజు క్రూయలు వర్డ్సు - బివేరు ఫూల్సు నో
టైము టు లూ జయాము వెరిటరిర్డయి వాంట్మయి బ్రేకు ఫాస్టు సూన్ !!


రచన : విశ్వనాధ కవిరాజుగారు...

అర్ధం కాలేదు కదా
ఈ పద్యాన్ని ఇంగ్లషులో రాసుకుని చదివితే త్వరగా అర్ధమవుతుంది. కాని అది పద్యం కాదు. ప్రయత్నించండి.

Tuesday, 8 January 2008

చెప్పుకోండి చూద్దాం...



powered by ODEO



ఈ పాటలో రీనా అని ఎన్నిసార్లు అన్నారో లెక్కపెట్టండి. ... అంత కష్టమేమి కాదు..

Sunday, 6 January 2008

భక్తి తత్వం సంక్లిష్టం !

భగవధ్యానం, దేవాలయ దర్శనం, ఉపవాసాలు మేలు చేస్తాయని భావిస్తూ చాలామంది వాటిననుసరిస్తూ ఉంటారు. భగవధ్యానంలో భగవంతునిపై నిశ్చలంగా మనసు లగ్నం చేసి ధ్యానిస్తేనే అత్మసాక్షాత్కారమవుతుంది. ఊరికే గుడులు తిరిగినంత మాత్రాన, ఓ నమస్కారం పడేసి వచ్చినంత మాత్రాన ఫలితం శూన్యం. భక్తుడి దృక్కోణంలో చూస్తే భగవంతుడి రూపానికి ప్రాధాన్యత లేదు. కేవలం నిరూపమైన భగవత్ భావననే, భక్తితత్వాన్నే భక్తుడు మనసా వాచా కర్మణా కలిగి ఉండాలి. అయితే నిరాకారుడైన భగవంతుడిని ధ్యానించడం సాధారణ మానవుల వల్ల కాదు. అందువల్లే గుడుల్లో విగ్రహాలు ప్రతిష్టించి భగవంతుడికి ఓ రూపం ఇచ్చి ఆ రూపం పైనైనా భక్తుడు మనసు లగ్నం చేసేలా ఏర్పాటు చేసారు. కాని దేవాలయ దర్శనం కూడా ఈ రోజుల్లో అలంకారప్రాయమవుతోంది. దేవాలయాల్లో భగవత్ స్వరూపం ముందు అణువణువూ భక్తితో నిండిపోయి ఇహం మర్చిపోయే భక్తులు ఎంతమంది ఉన్నారు? ఆ కొద్ది సమయం పాటైనా మనల్నిమనం మర్చిపోకపోతే దేవాలయాలనెందుకు దర్శించడం? ఇకపోతే, కడుపు నిండితే మనసు నిండా ఆలోచనలు, కోరికలు ముప్పిరిగొంటాయి. ఖాళీ కడుపు ఏకాగ్రతతో ఎంతో అనుకూలిస్తుంది. భగవత్ ధ్యానంలో పూర్తి ఏకాగ్ర చిత్తంతో ఉండాలన్న తలంపుతోనే ఉపవాసం ఉండి దేవుడిని ధ్యానించాలని సంప్రదాయం పెట్టారు. కానిఇ దైవభక్తి కన్నా వళ్ళు తగ్గాలన్న కాంక్ష అధికంగా ఉండి ఉపవాసాలు చేస్తున్న నేటి రోజుల్లో ఇంకా భగవంతుడెక్కడ గుర్తుకొస్తాడు? భగవంతుడిని కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా కమర్షియల్ ఏంగిల్‍లో చూసినంత కాలం మన కోరికల సాఫల్యం కోసం కపట భక్తిని మనం అనుసరిస్తూనే ఉంటాం. ఆత్మ సాక్షాత్కారం మాత్రమే మన ప్రధానమైన లక్ష్యం అయినప్పుడు మాత్రమే నిజమైన భగవత్ భావనను మనం అనుభూతి చెందగలుగుతాం.


నల్లమోతు శ్రీధర్

Friday, 4 January 2008

సాంకేతిక నిపుణులకు సాదర ఆహ్వానం


కంప్యూటర్ పై కూర్చున్నప్పుడు ఎన్నో సందేహాలు, సమస్యలు. అవి తీర్చాలంటే నిపుణులు కావాలి. వారిని ఎలా పట్టుకోవడం. కంప్యూటర్ వాడేవారందరు నిపుణులు కారుగా నాలాగా. నాకు వచ్చే ఎన్నో సమస్యలు, సందేహాలకు వీవెన్ కాని సుధాకర్ కాని ఓపికతో చెప్పేవారు. కాని నాకు అర్ధమవ్వడానికి కొంచం ఎక్కువ సమయం తీసుకునేది. అలాంటప్పుడు వాళ్ళే నా సిస్టంలోకొచ్చి ఆ ప్రాబ్లం తీర్చేస్తే బావుండు అనుకున్న సందర్భాలెన్నో. అది వీలు కాదుకదా.. కాని మూడు నెలల క్రింద శ్రీధర్ చెప్పిన Team Viewer పద్ధతిలో అది సాధ్యమే అనిపించింది. అంతవరకు పిక్చర్ crop చేయడం తెలీదు. కాని శ్రీధర్ ఈ కొత్త పద్ధతిలో ఒక్క రెండు నిమిషాలలో ఎలా చేయాలో చూపించాడు. కంప్యూటర్ వాడేవారందరికి ఎన్నో సందేహాలు, సమస్యలు రావడం సహజం. వాటన్నింటి గురించి నిపుణులతో అడిగి తెలుసుకోవడానికి పనికొచ్చే వేదిక "కంప్యూటర్ ఎరా కూడలి". శ్రీధర్ ఆలోచన, వీవెన్ కృషి కలిసి ఇది ఏర్పడింది. ప్రారంభించిన మొదటి రోజే ఎంతొమంది సమస్యలు తీర్చబడ్డాయి. నేను కనీసం ఆరుగురికి ఆ రోజు తెలుగులో రాయడం ఎలాగో చెప్పాను. వాళ్ళకు ఎంత సంతోషమో. ఎంతోమంది తెలుగు వాళ్ళకు కంప్యూటర్‌లో తెలుగులో రాయడం తెలీదు. అలాగని ఇంగ్లీషులో మాట్లాడుకోలేక తెలుగునే ఇంగ్లీషులో రాసుకుంటున్నారు. కాని ఇప్పుడు వాళ్ళు బరహ గురించి తెలుసుకుని హాయిగా తెలుగులో రాసుకోవడం మొదలెట్టారు. సాంకేతిక నిపుణులు, అంతో కొంతో కంప్యూటర్ ఉపయోగంపై అవగాహన ఉన్నవాళ్ళు ఈ చాట్ రూం ని ఉపయోగించుకోవాలి. ఇందుకు మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పని లేదు. మీకు వీలైన సమయంలోగాని, లేదా చాట్ రూం తెరిచి ఉంచుకుని , మీ పని చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అవసరమొచ్చినప్పుడు వారికి సహాయం చేయవచ్చు. ఏదైనా సమస్య పరిష్కారం కానప్పుడు, లే్దా అర్ధం కానప్పుడు TeamViewer తో వాళ్ళ సిస్టంలోకి వెళ్ళి అసలు సమస్యను చిటికెలో సాల్వ్ చేయవచ్చు. రోజు వీవెన్, శ్రీధర్ చేసేదే. ఇందులో ప్రసాద్‌గారు, శ్రీనివాస్‌గారు, మొదలైన వారు తమ వంతు సాయం తమకు వీలైన సమయంలో చేస్తూనే ఉన్నారు. నేనైతే ఓ పదిమందికి తెలుగు రాయడం నేర్పించి ఉండవచ్చు. మనకొచ్చింది అంతేగా.. తమ సమస్యలతో ఈ చాట్ రూంకి వచ్చి అవి నిమిషాల్లో తీర్చుకుని , వాళ్ళు కూడా మిగతావాళ్ళకి సహాయం చెయ్యడానికి పూనుకున్నవాళ్ళు గిరిచంద్, సీతారాం. ఇలాగే ఇంకా ఎందరో సాంకేతిక నిపుణులు కాస్త సమయం వెచ్చించి ఈ చాట్ రూంలో సహాయం చెయ్యండి. దీనికోసం TeamViewer మీ సిస్టమ్‍లో ఇన్‌స్టాల్ చేసుకోండి. వేరేవాళ్ళను మీ సిస్టంలోకి అనుమతించడం అనేది మీ అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. ప్రమాదమేమీ లేదు. పని పూర్తవ్వగానే కనెక్షన్ కట్ చేయొచ్చు. వివిధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఈ రూమ్ లో తరచూ కొద్ది సమయం గడుపుతూ... తమ నాలెడ్జ్ ని ఇతరులతో షేర్ చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా సహాయపడండి. మంటనక్కలో నాకు వచ్చిన తెలుగు ఫాంట్ సమస్యని వీవెన్ Team Viewer సాయంతో ఐదు నిమిషాల్లో పరిష్కరించగలిగాడు. నాలాటి సమస్య ఇంక ఎంతోమందికి వచ్చింది. నేను ఇదే పద్ధతిని వాళ్ళకూ చెప్పాను.

నాకు తెలిసి ఇంతవరకు కంప్యూటర్ కూడలి చాట్‌లో పరిష్కరించబడిన సమస్యలు...
డ్రైవ్ పై డబుల్ క్లిక్ చేస్తుంటే డ్రైవ్ కంటెంట్స్ చూపించబడడానికి బదులు సేర్చ్ బాక్స్ వస్తోందని ఒకతను డౌట్ అడిగితే నేరుగా అతని సిస్టమ్ లోకే టీమ్ వ్యూయర్ ద్వారా ప్రవేశించి రన్ కమాండ్ బాక్స్ లో చిన్న కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా పరిష్కరించడం జరిగింది. అలాగే టీమ్ వ్యూయర్ ద్వారా ఇన్ స్ర్కిప్ట్, బరహ, మాడ్యులర్, ఏపిల్ యూనీకోడ్ లేఅవుట్లని కాన్ఫిగర్ చేసిపెట్టడం దాదాపు 15 మంది వరకూ చేయడం జరిగింది. ఇప్పుడు వారందరూ స్వచ్చమైన తెలుగులో టైప్ చేయగలుగుతున్నారు. Core2Duo, DualCoreలకు మధ్య వ్యత్యాసం ఏమిటి, Win98, XPలకు మధ్య తేడా, వర్డ్ లో బరహతో తెలుగు రావట్లేదు వంటి అనేక సందేహాలకు అక్కడిక్కడే సమాధానాలు చెప్పడం జరిగింది.

రండి ,, మీకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో సహాయపడండి..

Tuesday, 1 January 2008

నూతన సంవత్సరవేళ విజయోత్సవం



అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఈ సంవత్సరం కూడ అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఒక చిన్ని శుభవార్త. పదిహేను నెలల క్రింద మొదలు పెట్టిన నా బ్లాగు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో ఈ రోజుకు మొత్తం ఆరు బ్లాగులు కలిపి 1500 టపాలు పూర్తయ్యాయి. కావాలంటే లెక్కెట్టుకోండి. ఐతే ఏంటి గొప్ప అంటారా.. ఏమీ లేదు. ఇంకో క్లాసు పాసయ్యా అంతే..ఈ బ్లాగు సరదా కోసమే ఉంది. అంత పనికొచ్చేవి ఇరగదీసే టపాలంటూ ఏమీ లేవు. అది నాకూ తెలుసు. కాని గీతలహరి, నైమిశారణ్యం, షడ్రుచులు బ్లాగులలో అందరికీ ఉపయోగపడే టపాలు రాసా.

జ్యోతి 1 264
జ్యొతి 2 51

షడ్రుచులు 360

గీతలహరి 400

నైమిశారణ్యం 50

Health 75

Annapoorna 300




ఇక నా బ్లాగు గురించి, నా టపాల గురించి కొంతమంది శ్రేయోభిలాషులకు కొన్ని సందేహాలు ఉన్నట్టున్నాయి. అవి తీర్చడం అవసరం అని భావించి చెప్తున్నాను. ముందుగా ఒక్క విషయం.. నేను నా బ్లాగులు నాకోసమే మొదలెట్టాను. ఎవరి కోసమో, ఎవరు చెప్పినట్లో నేను వినాల్సిన పనిలేదు. ఇష్టమున్నవాళ్ళు చదవండి. బాగున్నా , బాగోలేకపోయినా పర్లేదు. ఎవరి అభిరుచి, ఎవరి తలతిక్క వారిది. ఒకె.నా బ్లాగులన్నింటిలో (సేకరణలైనా) నేను తప్ప ఇతరులెవరూ రాసే ప్రసక్తే లేదు. నేను ఆ అధికారం ఎవరికీ ఇవ్వలేదు. ఒక్క గీతలహరిలో రవి వైజాసత్యకి ఇచ్చా కాని అతను నాలుగు వీడియో పోస్టులు తప్ప రాసిందెమీ లేదు) నేను ఇతరుల రచనలను నా స్వంతమని కొందరనుకుంటున్నారు. ముఖ్యంగా నల్లమోతు శ్రీధర్ సంపాదకీయాలు. అవి శ్రీధర్ రాసినవే. కాని అతను రాసిన మంచి విషయాలు అందరితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో అతని అనుమతితోనే నా దగ్గరున్న పాత సంచికల నుండి నాకు నచ్చినవి రాస్తున్నాను. ఈ వివరాలు ఆ సంపాదకీయాలు చదివే బ్లాగర్లందరికీ తెలుసు అది నా సొంతం కాదని, నేను అలా ఎప్పుడూ చెప్పుకోలేదని. అనానిమస్ గా మంచి వ్యాఖ్యలు రాస్తే పర్లేదు. తల తిక్క వ్యాఖ్యలు రాస్తేనే మాకు నచ్చనిది. ఇలాటివాటిని నియంత్రణలో పెట్టుకోవచ్చు. కాని ఒకరిద్దరి తలకు మాసిన వెధవలకోసం(అనుచిత వ్యాఖ్యలు రాసే అనానిమస్) అందరి వ్యాఖ్యలను ఆపి పెట్టడం సమంజసం కాదని నేను కామెంట్ మాడరేషన్ పెట్టలేదు.

చివరిగా ఒక హెచ్చరిక: నా బ్లాగులో ఎవైనా సందేహాలుంటే మర్యాదగా వ్యాఖ్య రాయండి. కాని నా బ్లాగులో వ్యాఖ్యలు రాసే మిగతా బ్లాగర్ల గురించి నీచంగా మాట్లాడితే ఊర్కునేది లేదు. అసలే నేను హైదరబాదు పాతబస్తీలో పుట్టి పెరిగిన దాన్ని. తెలంగాణా , ఉర్దూ తిట్లన్ని కలిపి దండకం చదివానంటే(రాసానంటే) బాగోదు..

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008