Monday, 30 June 2008
Friday, 27 June 2008
మహిళలకు మాత్రమే ప్రవేశం...
మహిళా బ్లాగర్లకొక శుభవార్త.
బ్లాగు అగ్రిగేటర్ జల్లెడలో మహిళా బ్లాగర్ల కోసం ఒక ప్రత్యేకమైన ప్రాంగణం ఏర్పాటు చేయబడింది. అందులో కేవలం మహిళా బ్లాగులు (మహిళలు రాసే బ్లాగులు. తప్పుగా అర్ధం చేసుకోకండి) చేర్చబడతాయి. ఈ ప్రాంగణానికి వెళ్లడానికి తయారు చేయబడిన బొత్తాము మీ బ్లాగులలో పెట్టుకోవడానికి ఈ క్రింది కోడ్ ని మీ బ్లాగులో పెట్టండి. దాన్ని నొక్కితే అది నేరుగా మహిళా బ్లాగుల విభాగానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు సుమారు పాతిక మంది ఉన్నా మహిళా బ్లాగర్లు ఇంకా పెరగాలని ఆశిస్తూ...
<a href="http://jalleda.com/jcustcat.php?catid=7">
<img border="0" src="http://www.jalleda.com/images/jmahila.png" alt="మహిళా బ్లాగర్లు "/>
</a>
ఈ పై డబ్బాలోని కోడ్ మీ సైడ్ బారులో అతికిస్తే మీకు క్రింద చూపిన విధంగా అందమైన బొత్తం ప్రత్యక్ష్యం అవుతుంది. దానిని నొక్కితే మీ చదువరులు నేరుగా మహిళా బ్లాగర్ల వర్గానికి వెళ్తారు.
రాసింది జ్యోతి at 19:38 12 వ్యాఖ్యలు
వర్గములు కబుర్లు
అమ్మ - సంకలనం
జాన్ హైడ్ కనుమూరి గారు తయారు చేసిన సంకలనం..
ఇందులో కొందరు బ్లాగర్లు అమ్మ పై రాసిన వ్యాసాలూ పొందుపరచబడ్డాయి.
నెనర్లు జాన్ గారు, చాలా శ్రమ తీసుకుని ఈ సంకలనాన్ని తయారు చేసారు.
రాసింది జ్యోతి at 12:32 8 వ్యాఖ్యలు
వర్గములు తెలుసుకుందాం
Wednesday, 25 June 2008
నేటి మహిళకు మేటి కంప్యూటర్..
ఇది మహిళా బ్లాగర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్న మహిళలకు కూడా. సాధారణంగా అందరి ఇళ్ళల్లో కంప్యూటర్ స్టడీ రూంలో కాని, హాల్ లో కాని ఉంటుంది. మగాళ్ళకు వంటింట్లో పని ఏముంటుంది . హాయిగా కంప్యూటర్ ముందు కూర్చుని మనం చేసిచ్చే పకోడీలు, టీ, కాఫీలు లాగిస్తూ తమ పని చేసుకుంటారు. మహిళలకు అలా వీలు కాదుకదా?
ఎలా మరి???
పర్లేదు మనకోసం కూడా కిచన్లో పెట్టుకునే కంప్యూటర్ వచ్చింది. హాయిగా వంట చేస్తూ పాటలు వినొచ్చు, సినిమాలు చూడొచ్చు. లేదా కేబుల్ చానెళ్ళు. ఇక కూరలు ఉడికేలోపు కంప్యూటర్ మీద ఏదైనా రాసుకోవచ్చు. ఇలా అక్కడే మొత్తం ప్రపంచాన్ని చుట్టి రావొచ్చు. అన్నం ఉడికేలోపు ఒక ముఖ్యమైన మెయిల్ చదివి రిప్లై ఇచ్చేయొచ్చు. వంటిల్లు సర్దుతూనే ఆన్‌లైన్ బిల్లులు కట్టేయొచ్చు.
అలాగే వంట అయ్యాక పాత్రలతొ పాటు మరకలు పడిన (పప్పు, కూరలు లాంటివి పడకుండా ఉంటాయా) కీబోర్డ్ ని కూడా కుళాయి క్రింద పెట్టేసి హాయిగా కడిగేయొచ్చు. నిజం.. ఏమి కాదు . వాటర్ ప్రూఫ్. ఇంకా ఆశ్చర్యపరిచే సంగతి.. ఇది వైర్‌లెస్ సిస్టం. మనం గిన్నెలో కూర కలుపుతూనే అక్కడినుండి కదలకుండానే సిడి మార్చొచ్చు..
భలే ఉంది కదూ..
కాని దీని ధర $1595.99 మాత్రమే.
కాని ఒక విశేష సూచన. భర్తలూ మీ క్రెడిట్ కార్డులు జాగ్రత్త. మీ ఆవిడ ఈ టపా చూడకుండా జాగ్రత్తపడండి. తర్వాత మీ ఇష్టం..నన్ను అనొద్దు మరి..
దీని వివరాలు ఇక్కడ చూడండి.
రాసింది జ్యోతి at 20:23 1 వ్యాఖ్యలు
వర్గములు కబుర్లు
ప్రమదావనంలో విశిష్ట వ్యక్తి ....
ఆదివారం 22.6.08 నాడు జరిగిన ప్రమదావనం సమావేశానికి తమ వ్యక్తిగత పనుల వల్ల ఎక్కువమంది సభ్యులు రాలేకపోయారు. మూడు వారాలుగా నెట్‌వర్క్ సతాయిస్తున్న తెరెసా ఈసారి మాత్రం వచ్చారు కాని ఆవిడ అంకోపరి తరచూ తంతూ ఉండింది. ఐనా స్నేహితులతో ముచ్చట్లు ఎలా వదలబుద్ధి అవుతుంది. జ్ఞాప్రసూనగారు , వరూధిని వచ్చారు. చివర్లో పద్మ గారు వచ్చారు. అవిడ మోహనరాగాలు అనే బ్లాగు రాస్తారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉంటారు. వృత్తి బ్రాహ్మిణి. ఈ సమావేశం కోసం అలారం పెట్టుకుని మరీ నిద్ర లేచి వచ్చేసారు. పరిచయాలు, ముచ్చట్లు అవి అవుతుండగానే వరూధినిగారిని ఉష్ష్ణపీటం పై కూర్చోబెట్టడం జరిగింది. ఈ రోజు వరూధినిగారిలోని ఒక విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలిగాము. ఆవిడ భర్త ప్రముఖ బ్లాగరు, వికిపీడియన్ ఐనా ఆ వివరాలేమీ చెప్పకుండా , సరిగమలు బ్లాగు మొదలెట్టి తనకంటూ ఒక గుర్తింపు లభించాకే ఆవిడ పేరు వివరాలు మనందరికి తెలిసాయి. హ్యాట్స్ ఆఫ్ వరూధినిగారు. ఆవిడ కోరికపై ఆ వివరాలు నివేదికలో ఇవ్వడం లేదు. చివర్లో వరూధినిగారు ఒక సూచన చేసారు. ప్రమదావనం వారానికొకసారి కాకుండా నెలకు రెండుసార్లు పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ముఖ్య అథితిగా బ్లాగర్లనే కాకుండా, బయటివారిని అంటే తమ తమ వృత్తులలో పేరు సంపాదించినవారిని పిలిస్తే బావుంటుంది అన్నారు. ప్రయత్నించాలి.
రాసింది జ్యోతి at 19:47 0 వ్యాఖ్యలు
వర్గములు సమావేశం
Monday, 23 June 2008
హ్యాపీ బర్త్ డే విహారి .....
బ్లాగ్లోకంలో నవ్వుల పువ్వులు పూయిస్తున్న భూపతి విహారికి జన్మదిన శుభాకాంక్షలు...
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా ఉండాలని ఈ అక్క దీవెనలు...
రాసింది జ్యోతి at 19:45 11 వ్యాఖ్యలు
వర్గములు శుభాకాంక్షలు
Sunday, 22 June 2008
ఆహా ఏమి రుచి !!!
ఇప్పటిదాకా నాకు వచ్చిన వంటలు బ్లాగులో పెట్టుకున్నా, కొన్ని దిన పత్రికలో ప్రచురించబడ్డాయి అని చెప్పుకుని మురిసిపోయాను. అలాగే మావారు నాకు వంటలో సాయం చేయరు. రోజు వంట చేయడం విసుగొస్తుంది అని ఈ మధ్యే సుజాతగారి బ్లాగులో చెప్పాను కదా. నా బాధ చూసో, మిగతా బ్లాగర్ల సానుభూతి చూసో దివినున్న నల భీములకు నా మీద జాలి కలిగిందో ఏమో. నిన్నరాత్రి మావారు చికెన్ తెచ్చి నేనే వండుతా అన్నారు. అంతకన్నా భాగ్యమా అనుకుని సరే చేయండి అన్నా. ఐతే అన్ని రెడీగా పెట్టు వస్తున్నా అన్నారు. హమ్మా! అన్ని రెడీ చేస్తే నేనూ చేయగలను . అన్నీ చేసుకోండి. కావాలంటే కళ్ళలో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు తరిగి పెడతా అన్నా. సరే నాకు రాదా ఏంటి అని రంగంలోకి దిగారు. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉండిందో. పెళ్ళయిన పాతికేళ్ళకి నా ముందు వంట చేస్తుంటే రాదేంటి. ఇంతకూ ముందు రెండు సార్లు పప్పు చేసారు. అది నన్ను తిట్టుకుంటూ (బాగా చేయటంలేదు అని). సరే అన్ని చేసుకుంటూ పసుపు ఇవ్వు, కారం ఇవ్వు అంటే, ఎప్పుడో ఒకసారి వంటింట్లోకి వస్తే ఎలా? ఏవి ఎక్కడున్నాయో తెలిదు. తీసుకోండి అని చూపించా. సరే అని తీసుకుని ఎలాగైతేనేమి చికెన్ కూర వండేసారు. నేను ఏదైనా చెప్పబోతుంటే , నువ్వు ఊరుకో ఇన్నేలయింది నీకు ఏమి రాదు అన్నారు. నాకేం పోయింది అని ఇంచక్కా మల్లెపూలు గుచ్చుకుంటూ ఉన్నాను. చివరలో కుక్కర్ మూత పెట్టమంటే కూడా అది మాత్రం నేనెందుకు మీరే పెట్టుకోండి అన్నా. (ఎలాగు సందు దొరికింది . వంటింట్లో అడుగు పెట్టారు. అలాగే కంటిన్యూ చేయిస్తే నాకే లాభం అని అనుకుని కాస్త వెన్న రాయడం మొదలుపెట్టా) ఇన్నేళ్ళకు నా ముందు మీరు వంట చేసి చూపెట్టారు. అలాగే పిల్లలను పట్టుకుని ప్రతి ఆదివారం చేయొచ్చుగా అన్నా. ఏమిటి ఆదివారం సెలవు సినిమా చూసి అడుగుతున్నావా అంటే కాదు మిగతా పనులు నేను చేసుకుంటా. వంట పని ఒక్కటి మీ ముగ్గురు కలిసి చేయండి, నేను ఎలాగున్నా నోరు మూసుకుని తినేస్తా అని చెప్పా. ఓయస్ ! అలాగే మా అబ్బాయికి కూడా వంట నేర్పిస్తా అన్నారు. వాడికి అసలే బద్ధకం. చూద్దాం. ఆ పని చేయండి అని ఊరుకున్నా. ఇక మెల్లిగా ప్రతి ఆదివారం నలభీముల్ని నిద్ర లేపాలి. ఎన్ని రోజులు చేస్తారో చూడాలి. మాటలకైతే కోటలు దాటుతాయి. ఏదైతేనేమి రుచి అదిరింది అనుకోండి.. నేను చేసిన ఒకే పని ఏంటంటే పైన కాస్త కొత్తిమిర చల్లి వడ్డించడం..
ఆయన ఇచ్చిన సలహా.. నేను చేసిన చికెన్ కూర ఫోటో తీసి నీ బ్లాగులో పెట్టుకో . మిగతావారు నేర్చుకుంటారు అన్నారు. అసలు ఈ ప్రయోగానికి కారణం తెలుసా?? ఈ మధ్య నేను శ్రద్ద పెట్టి వండడంలేదు. చెప్పి చెప్పి విసిగిపోయారు. లాభం లేదని తనే రంగంలోకి దిగారు. ఆయన వంట చేస్తున్నంత సేపు తెరేస, వరూధిని గార్లను గుర్తు చేసుకున్నా. కాని అలాంటి అవసరం లేకుండా కిచెన్ కౌంటర్ , గోడలు నీట్ గానే ఉన్నాయి.
మావారు వంట చేయలేదని కంప్లెయింట్ చేసిన దాన్ని , ఆయన చేసింది కూడా చెప్పాలి కదా.
రాసింది జ్యోతి at 13:26 10 వ్యాఖ్యలు
వర్గములు కబుర్లు
Saturday, 21 June 2008
సొగసు చూడ తరమా ? కామెంట్ ప్లీజ్.....
ఒక ముఖ్య గమనిక : ఇవి నేను ఎవరి ఆల్బం నుండి తీసుకున్నవి కావు. గూగుల్ గ్రూపు లో వచ్చిన ఫార్వర్డ్ మెయిల్.. పైగా ఇది చాలా రోజులనుండి అంతర్జాల విహారం చేస్తుంది..
రాసింది జ్యోతి at 16:33 16 వ్యాఖ్యలు
వర్గములు సరదా
Tuesday, 17 June 2008
ప్రమదావనం లో కిరణాల వెల్లువ…
ఆదివారం 15.6.08 జరిగిన ప్రమదావనంలో మూడు వైపులా కిరణాలే. ఈ రోజు హాట్ సీట్ మీద కూర్చున్న నిషిగంధ అసలు పేరు కిరణ్మయి.కొత్తగా వచ్చిన ఇద్దరు సభ్యులు .. కాంతి కిరణ్ - కౌముది పత్రిక co-editor. మరొకరు హైదరాబాదుకు చెందిన కిరణ్ లక్ష్మి. Medical Transcription చేస్తారు. మాలతిగారు, జ్ఞానప్రసూనగారు కూడా సమయానికే వచ్చేసారు. ఆ తర్వాత మనసులో మాట సుజాత గారు చేరారు. నేనే అరగంట లేట్.
నిషిగంధ ఒక చిన్న సైజు రచయిత్రి. కవితలు , కథలు రాస్తుంటుంది.అసలు సిసలు బెజవాడ అమ్మాయి. ఇప్పుడు నివాసం అమెరికాలో.
సుజాత : మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎక్కడ పని చేస్తున్నారు ?
పెళ్ళి కాకముందు అమ్మా, నాన్నా, నేను, తమ్ముడు. పెళ్ళయ్యకా భర్త . యునివర్సిటీ ఆఫ్ మయామీలో సిస్టం అనాలిస్ట్. ఫ్లోరిడాలో నివాసం.
కాంతి : రచనలు ఎప్పుడు మొదలు పెట్టారు?మీకు అసలు రచన చేయాలని ఎందుకు అనిపించింది? మొదటి రచన ఎప్పుడు?
రాయడం ఎప్పటినుంచో కాని నెట్‌లో పబ్లిష్ అవడం 2005 నుండే. మొదటి రచన 8th లో అండీ.. అమ్మా వాళ్ళు ఊరు వెళ్తే ఇంట్లో నేను తమ్ముడే ఉన్నాం.. అప్పుడు ఒంటరితనం మీద రాసాను. మొదలు పెట్టాను కాని వాటిల్లో అంత పరిణితి లేదు. స్కూల్లో ఎప్పుడూ కవితల పోటీలో నేనే ఫస్ట్.
జ్యోతి : వర్కింగ్ వుమెన్ , టీనేజి కుర్రాళ్ళకి ఏమి చెప్పాలనుకుంటున్నావు?
ఉద్యోగం చేసే మహిళలు,, దేనిని కోల్పోవద్దు. మీకోసం కూడా జీవించండి. ఇక టీనేజి వాళ్ళకైతే స్నేహాన్ని ఆస్వాదించండి,జీవితాన్ని తెలుసుకోండి.
జ్యోతి : నీకు లభించిన విజయాల్ని ముందుగా ఎవరితో షేర్ చేసుకుంటావ్?
ముందుగా మావారితో,తర్వాత తమ్ముడితో, ఆ తర్వాత అమ్మతో.
జ్యోతి : జీవితంలో నువ్వు ఏమైనా సాధించగలిగాను అనుకుంటున్నావా. ఏంటది. నీకు నచ్చిన ప్రదేశం, దేశం ?
నిజంగా ఐతే నాకింకా ఆ ఫీలింగ్ కలగలేదు.ఇంకా ఏమీ సాధించలేదు అనుకుంటున్నా. నాకు నచ్చిన దేశం మన దేశమే. ఎంత అందమైన ప్రదేశం చూసిన మన దేశం మీద దిగినప్పుడు ఇచ్చిన అనుభూతి ఇవ్వదు.
జ్యోతి : మీ ఆయన కాక ఇంకా ఎవరైనా అబ్బాయి ILU అన్నాడా? లవ్ అంటే భయమెందుకు? లవ్ అనగానే శారీరక ఆకర్షణ తప్ప వేరే అర్ధం , ఉండదా?
అన్నారు కొంతమంది. ఒకప్పుడు బానే ఉండేది.కాని ఇప్పుడు ఎంజాయ్ అనిపించటంలేదు.
జ్ఞానప్రసూన : ప్రేమించడం తేలిక, ప్రేమించబడడం కష్టం.
జ్యోతి : జీవితమంటె నీ ఉద్దేశ్యం. వచ్చే జన్మ గురించి ఆలోచిస్తావా? నీ జీవితంలో నువ్వు idol గా ఎవ్వరినైనా అనుకుంటావా?
జీవితమంటే ఆనందంగా ఉండడం,ఎవ్వరినీ నొప్పించకుండా ఉండడం, మన పరిధిలో సహాయం చేయడం.వచ్చే జన్మ మీద అంత నమ్మకం లేదు. నా జీవితంలో idol అంటె నా తమ్ముడు. ఇప్పుడు నేనున్న enjoy this moment కి ఇన్స్పిరేషన్ అతనే. జీవితంలో చూడాల్సింది మనకంటే అదృష్టవంతుల్ని కాదు, మనకంటే దురదృష్టవంతుల్ని అని చెప్పింది తనే.
జ్యోతి : మీ ఆయన ఒకరోజు వచ్చి ,నేను ఇంకో అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను. కలిసి ఉంటాము.నిన్ను కూడా ప్రేమగా చూసుకుంటాను అంటే ఏమంటావు? అడ్జస్ట్ ఐపోతావా? పోట్లాడుతావా , తంతావా? కోపం రాదా అలా చేసినందుకు. నిజమైన ప్రేమ అని త్యాగం చేస్తావా? అతడిని వదిలేస్తే ఆ తర్వాత నీ సంగతి??
మీ ఇద్దరు ఉండండి .నా దారి నాకుంది అంటాను. నాకు కోపం రాదు. మన వెనుక తెలీకుండా చేస్తే కోపమొస్తుంది. సగం ఇష్టపడుతూ నాతో ఉండడం కంటే పూర్తి ఇష్టంతో ఇంకో ఆమెతో ఉండడమే మేలు కదా.
జ్యోతి : నిషి నువు చాలా భయపడ్డ సంఘటన!!
మా నాన్నగారి మరణం. మూడు రోజులు హై ఫీవర్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయారు. ఆరోజే చనిపోయారు.H2B జాండీస్ అన్నారు.
సుజాత కూడ హైదరాబాదు వచ్చేసారు. ఇంకో సుజాత వచ్చే వారం వస్తున్నారు. జ్ఞానప్రసూన గారు కూడా హైదరాబాదే. సుజాత అప్పుడన్నారు "అందరూ హైదరాబాదు వాసులైపోతున్నారు. ఒకసారి హగ్గులిచ్చేసుకోండి. ఒకసారి మనమంతా కృష్ణకాంత్ పార్క్ బదులు I Maxలో కలుద్దామా వెరైటీగా. " నేనన్నా" కాస్ట్లీ అవుతుందేమో. మరి ఎవరిని బక్రా చేద్దాము?" సుజాత " ఎందుకు మా శ్రీని కార్డు పట్టుకొస్తా గీకడానికి" అంది… పాపం శ్రీనివాస్.
జ్యోతి : నిషి ఒకరోజు నీకు నెట్ లేదు. బ్లాగులు రాయలేవు. ఏం చేస్తావు?నువ్వు ఈ ప్రపంచానికి ఏమైనా ఇవ్వగలను అనుకుంటున్నావా?ఇంకో పదేళ్ళ తర్వాత నువ్వు ఎలా ఉంటావు. చెప్పగలవా?
ముందు అయ్యో అనుకుంటా.ఆ తర్వాత మొక్కల్లో గడిపేస్తా. లేదా ఏదో సినిమా చూస్తా.నేను నిజంగా ఈ ప్రపంచానికి ఏదైనా ఇవ్వగలను అంటే నా సమయం.అది కూడా అవసరమైనవాళ్ళకే.పదేళ్ళ తర్వాత కూడా ఇప్పటిలాగే ఉంటాను. ఎందుకంటే పదేళ్ళ క్రింద ఎలా ఆలోచించానో ఇప్పుడు అలానే ఉన్నాను కాబట్టి.
ఆ తర్వాత కిరణ్ లక్ష్మి ని బుల్లి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆవిడ భర్త రవిశంకర్ గారు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి బృందంలో వేణువు వాయిస్తారు.బహుశా చాలా మంది చూసి ఉంటారు బాలు గారి ప్రోగ్రాముల్లో. కొద్ది సేపు అంతాక్షరి ఆడుకుని , నిషి చేపల వేటకు వెళుతుందని తెలిసి మా ముచ్చట్లు వంటల మీదకు మళ్ళాయి.అప్పుడు నేను కొన్ని త్వరగా అయ్యే వంటకాలు చెప్పాను. కంచి పులిహోర, టొమాటో పచ్చడి.. అల్లం వెల్లుల్లి కారం.ఏ కూరగాయలైనా ఫ్రై చేసి వేయడానికి ఒక మసాలా పొడి చెప్పాను. అలాగే వంటలు అదిరిపోవడానికి కొన్ని చిట్కాలు. అప్పుడే రాధిక, వరూధిని వచ్చారు.నేను బత్తీబంద్ కోసం వెళ్ళడానికి రెడీ అయ్యా.
ఆ తర్వాత మాలతి గారు వచ్చారు. రాధిక,మాలతి,ప్రసూన గారు ముచ్చట్లేసుకుని ఎలా కలవాలని అనుకున్నారు.
ఇంతే సంగతులు
ఇక వచ్చే వారం ప్రమదావనం షడ్రుచుల ఘుమఘుమలతో అదిరిపోవాలి. అన్నీ వంటలు, చిట్కాలు మాత్రమే మాట్లాడుకుందామా??
రాసింది జ్యోతి at 21:13 32 వ్యాఖ్యలు
వర్గములు సమావేశం
Monday, 16 June 2008
అల్లంత దూరానా ఆ తారక....
ఎవరేమనుకుంటే నాకేంటి. నేను అనుకున్నది నేను చేస్తాను అనుకుని నిన్న రాత్రి 7.30 నుండి 8.30 వరకు మా ఇంట్లో బత్తీబంధ్ పాటించా. మనస్పూర్థిగా సుమా!.
ప్రమదావనంలో చర్చను 7.25 కి వదిలేసి సిస్టమ్ ఆఫ్ చేసి, ఇంట్లో అన్ని లైట్లు ఆఫ్ చేసి (ఇంట్లో పిల్లలు లేరు కూడా), మావారు ఏదో డ్రాయింగ్స్ చేసుకుంటున్నారని ఆయన దగ్గర ఒక ట్యూబ్‌లైటు ఉంచేసి బాల్కనీలో చాప వేసుకుని పడుకున్నా. చల్లని పిల్ల గాలులు వీస్తున్నాయి. ప్రశాంతంగా ఆకాశంలో తారల కోసం వెతుక్కుంటూ మనసులో పాత మధురాలను గుర్తు చేసుకున్నాను. నిజంగా ఎంత హాయిగా ఉండిందో ఆ నిశ్శబ్దం. అలా ఆకాశంలో తారలను చూస్తుండగా ఒక బ్రహ్మాండమైన (తిక్క) ఆలోచన వచ్చింది. అది నా బుర్రలో లాక్ చేసి పెట్టేసా. ఎప్పుడు బ్లాగుతానో??. అలా ఆలోచిస్తుండగానే ఆ చల్ల గాలికి నిద్ర పట్టేసింది. 9 గంటలకు పిల్లలు వచ్చి , ఏంటి ఇల్లంతా చీకటిగా ఉండి "మమ్మీ" అని అరుస్తూ అన్ని రూములు వెతికారు. చివరగా బాల్కనీలోకి వచి "ఎంటీ? డాడీతో గొడవైందా ఇలా పడుకున్నావ్" అన్నారు. అదేం లేదు అని లేచి వచ్చి మళ్ళీ ఇంటిపనిలో పడ్డా.
కాని గత పదిహేను రోజులుగా బత్తీబంధ్ బ్లాగు నిర్వహిస్తున్న కొత్తపాళీగారికి నా అభినందనలు. కృతజ్ఞతలు.ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న బ్లాగర్లను కోరి(పోరి), బత్తీబంద్ అనగానే ఏదో ఒక గంట దీపాలార్పేయడం కాదు, గ్లోబల్ వార్మింగ్ మీద ఆలోచించడానికి మనందరిని కదిలించారు.ఎవరి శైలిలో వారిని రాసేలా ప్రోత్సహించారు. రోజు కొక బ్లాగరు రాసిన టపాను ప్రచురించి, అది చాలదన్నట్టు అందరిని ఒకే వేదిక మీద సమావేశపరిచి చర్చించారు. ఇలాంటి ఉపయోగకరమైన మరిన్ని కార్యక్రమాలు మనమందరం కలిసి నిర్వహిద్దాం.
ఈ కార్యక్రమం ఒక్క రోజుతో ముగించకుండా, కనీసం మన ఇంటిలో జరిగే దుర్వినియోగం గురించైనా ఆలోచించాలి. నేను ఇన్ని రోజులు మా పిల్లలను లైట్లు, ఫాన్లు ఆఫ్ చేయరని అరుస్తూ ఉండేదాన్ని. కాని ఇప్పుడు కాస్త కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.ముఖ్యంగా మా అబ్బాయి. అలా ఆఫ్ చేయకుండా వదిలేస్తే ప్రతి నెల కరెంట్ బిల్లు వాడినే కట్టమని చెప్పా. అప్పుడు కాని తెలిసిరాదు. హన్నా.
రాసింది జ్యోతి at 14:20 6 వ్యాఖ్యలు
వర్గములు కబుర్లు
Thursday, 12 June 2008
SATURDAY NIGHT FEVER
తిన్నామా , పడుకున్నామా , తెల్లారిందా!!!!!!!!!!!
అర్ధం కాలేదు కదా!!
మనకు నచ్చిన విషయమో, పుస్తక సమీక్షో, రాజకీయ సంచలనాలో, సంగీతమో, ప్రేమకథో టక్కున మన బ్లాగులో రాసేసుకుంటున్నాము. ఆ తర్వాత కామెంట్లకు ఎదురుచూపులు. అయితే గియితే సంతోషం. లేకుంటే కొద్దిగా వాడి వేడి చర్చలు.. ఇంతేనా మన బ్లాగర్ల పని. మరి ఏం చేయాలి అంటారా?? కాసింత కళాపోసన చేద్దామా??....
గత శనివారం కొత్తపాళీగారి ఆధ్వర్యంలో గ్లోబల్ వార్మింగ్ పై కూడలి కబుర్లలో జరిగిన సమావేశానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే బ్లాగర్లందరూ ప్రతి శనివారం సాయంత్రం ఇలా కలిసి , సరదాగా అప్పుడప్పుడు సీరియస్ విషయాలు చర్చించుకుంటే బాగుంటుంది అనే ఓ చిన్ని ఆలోచనకు రూపమే ఈ SATURDAY NIGHT FEVER .
భారతదేశంలో ఉన్నవారికి సాయంత్రం మరి మాకు కాదుగా అని అమెరికావాసులు అంటారా. కానీ ఎలాగూ మీకు సెలవే కదా. ఇక్కడున్నా అక్కడున్నా మీరు భారతీయులే కదా అందుకే ఈ సాటర్‌డే నైట్ ఫీవర్ అన్నది. మనకంటూ ఒక వేదిక ఉన్నప్పుడు దానిని సద్వినియోగపరుచుకుంటే తప్పేంటి? దీని కోసమై వీవెన్‌తో మాట్లాడి అనుమతి తీసుకోవడం జరిగింది . ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు బ్లాగర్ల సమావేశం జరుగుతుంది. కాని ప్రతీ వారం ఒకో విషయంపై ఆధరపడి ఉంటుంది.(theme based meeting).
ఈ శనివారం (14.6.08) విషయం.... అంతులేని అంతాక్షరి (non -stop antakshari)..
కొత్త బ్లాగర్లందరూ తమకు వచ్చే సందేహాలు, సమస్యలు (బ్లాగులకు సంబంధించినది) సీనియర్లతో చర్చించాలనుకుంటె చెప్పండి. ఆ పైవారం పెట్టుకుందాం. ఇంకా ఎలాంటి విషయాలు మనం ముచ్చటించుకోవచ్చో ఆలోచించండి. ముఖ్యంగా యువ బ్లాగర్లు మీ అవిడియాలు చెప్పండి.
కాని ఒక ముఖ్యగమనిక. ఈ సమావేశాల్లో తెలుగు మాత్రమే రాయాలి. నో ఇంగిలిపీసు. రాకుంటే నేర్చుకోండి. అంతాక్షరిలో ఇంగ్లీషులో పాటలు పాడితే(రాస్తే) అవి అంగీకరించబడవు. తెలుగు పాటలు తెలుగులోనే రాయాలి. లేఖినిలో రాసినా సరే (కాని కాపి పేస్ట్ చేయాల్సి వస్తుంది ), బరహ, అక్షరమాల (నేరుగా రాసేయొచ్చు ) వాడినా సరే . మీ ఇష్టం. ఈ కబుర్లు చాట్ రూం మంటనక్కలో తెరవండి. వేగంగా ఉంటుంది. టైమవుట్స్ రావు. అందుకు మంటనక్కను దింపుకుని దానికి తెలుగు నేర్పి ఉంచుకోండి మరి.
చాలా చాలా ముఖ్యమైన గమనిక:
ఈ సమావేశాల నివేదిక మాత్రం ఇవ్వబడదు. తెలుసుకోవాలంటే పాల్గొనాల్సిందే. లేదంటే మీరే ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కోల్పోతారు అని మాత్రం చెప్పగలను. సంగీత ప్రపంచానికి స్వాగతం...
రాసింది జ్యోతి at 16:13 1 వ్యాఖ్యలు
వర్గములు కబుర్లు