ఈ ప్రకృతి మన కోసమే
ఉదయాన్నే లేలేత భానుడి కిరణాల స్పర్శ తనువంతా ఎంత ఉత్తేజం నింపుతుందో కదా! అలసిన శరీరాన్ని, మనసుని నిన్నటి రేయి తన మాయాజాలంతో మటుమాయం చేస్తే.. కొంగొత్త ఉత్సాహం నరనరానా నిండేలా సూర్యోదయం అందించే అనుభూతిని వర్ణించడానికి మాటలు తమ వల్ల కాదంటూ చేతులెత్తేయవూ..? వెన్నెల రాత్రులూ స్పందించే హృదయాలను ఎంత మైమరిపింపజేస్తాయో కదా! కలత చెందిన మనసూ, అలా వెన్నెల వైపు చూస్తే క్షణాల్లో స్వాంతన లభించడం కొందరికి అనుభవైకవేద్యమే. అంతెందుకు పూలకుండీలో విచ్చుకున్న గులాబీ కూడా మనకోసమే ఎదురు చూస్తున్నట్లు చిరునవ్వుతో పలకరిస్తుంటే అదేమీ పట్టనట్లు సాగిపోతే ఆ బాధతో అది ముడుచుకుపోదూ..? గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని చూడండి... అవి ఏ రకంగానూ మనకు ఉపయోగపడకపోయినా తమ పచ్చదనంతో మనలో ఆశల్ని చిగురిస్తాయి. ప్రకృతి ఎప్పుడూ మనల్ని వెన్నంటే ఉంటోంది... కానీ దాన్ని ఆస్వాదించగలిగే రసహృదయమే మనిషిలో కొరవడుతోంది. జీవితంతో పోరాడడానికి మనసుని రాయిచేసుకుని సహజస్పందనలను నిర్ధాక్షిణ్యంగా తొక్కిపెట్టే మనకు ప్రకృతి గురించి ఆలోచించే తీరికెక్కడిది. మన బాధలను, బడలికలను ఉపశమింపజేయడానికి అది స్నేహహస్తం దాచినా అందుకునే మనసెక్కడుంది మనలో! ఇరుకు గదుల్లో, ఏసి చల్లదనానికి అలవాటు పడిన ప్రాణం శీతాకాలపు సహజసిద్ధమైన చల్లదనంలో ఉన్న స్వచ్ఛతని ఎక్కడ గుర్తించగలుగుతుంది? జీవించడానికి, జీవితంలో మన ఉనికిని నిలబెట్టుకోవడానికి పరిగెడుతున్నాం మనం! ఆ హడావుడిలో ప్రకృతిని ఆస్వాదించగలిగే తీరుబడి కూడానా! అలా కుండీ నుండి పరిమళాలను వెదజల్లే మల్లె వాసనల్ని ఆఘ్రాణించవచ్చునన్న ఆలోచనే మనకెప్పుడూ కలగదు. పచ్చదనాన్ని నింపుతూ అల్లుకున్న మనీప్లాంట్ ని చూడమంటే .. "ఇంకేం పనిలేదా" అని మొహం చిట్లించుకుని మన పనిలో పడిపోయే బాపతు మనం! ఇంకెక్కడి రసాస్వాదన? ఈ ప్రకృతి మన కోసమే, మనతో మమేకమై ఉంది. ఈ బిజీ జీవితాల్లో దాని విలువని మనం గుర్తించలేకపోతున్నాం. ఇంటి ముందు చిన్నపాటి గార్డెన్ ఉన్నా దాన్ని పెకలించి మరో గది వేసి ధనార్జన చేద్దామన్న స్వార్ధం మనల్ని కమ్ముకుంటోంది. మనకు ఆహ్లాదం పంచడానికే పచ్చదనాన్ని కప్పుకుని సింగారించుకునే మొక్కలే కాదు సూర్యోదయపు కిరణాల స్పర్శా, చంద్రుడి వెన్నెలా.. చల్లదనంతో గమ్మత్తైన అనుభూతిని కలిగించే మంచుబిందువులు, వర్షపు చినుకులూ.. కిలకిలమంటూ పలకరించే పిట్టలూ, ఏవీ మనల్ని కదిలించలేకపోతున్నాయి. మన చుట్టూ అదో ప్రపంచం ఉందన్న విషయమే ఎప్పుడో బాల్యంలోనే మర్చిపోయాం. మన పలకరింపు కోసం ఆర్తితో చూసే ప్రకృతిని ఆస్వాదిస్తే బాగుంటుంది కదా!!
మీ
నల్లమోతు శ్రీధర్.