ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలు. ఇవాళ ఒక్కరోజే కాదు , ప్రతి రోజు మనదే. ప్రత్యేకమైనదే. మనచేతిలో ఉన్నదే. దానిని అందంగా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం మనచేతిలో ఉంది. కుటుంబంతో పాటు మనగురించి కూడా ఆలొచించి అద్భుతాలు సాధించగలం అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోండి. నిజంగా మనం గొప్పవాళ్లం. ఎవరితో పోల్చుకోవద్దు. పోటీ వద్దు. మన టాలెంట్ మనం గుర్తిస్తే చాలు. ఎవరో మనను గుర్తించాల్సిన పనిలేదు. అవసరం లేదు. ధృడ విశ్వాసంతో మీ ప్రయాణం సాగించండి. దారికడ్డం వచ్చే పిచ్చి (గజ్జి) కుక్కలు, చీడ పురుగులను పట్టించుకోకుండా ముందుకు అడుగులేయండి. విజయం మీదే.. ఎక్కడైనా..ఏ. ఆర్. రెహ్మాన్ ఆస్కార్ అవార్డు సాధించినప్పుడు మనందరికీ ఎంతో గర్వంగా అనిపించింది. దేశమంతా పండగ చేసుకున్నారు. అతని తోడుగా ఉన్న తల్లి కూడ గర్వంతో పులకరించిపోయింది అని చెప్పక తప్పదు. అలాగే అతని భార్య అందరికంటే ఎక్కువగా గర్వపడి ఉండొచ్చు. నా భర్త ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అది నాకూ కూడా సంతోషం. నాకే వచ్చినంత ఆనందంగా ఉంది అనుకొని ఉండొచ్చు కదా. భర్తను ప్రేమించే, గౌరవించే ప్రతి భారతీయ నారి ఇలాగే అనుకుంటుంది. కాని... ఇక్కడ పరిస్థితి రివర్స్ చేస్తే... భార్య ఇలాగే పెద్ద పేరు తెచ్చుకుంటే భర్త కూడా గర్వపడతాడా ??? నాకైతే డౌటే.
పూర్వకాలంలో మగాళ్లు అంటే పని చేయాలి, ఇల్లు నడిపించే బాధ్యత అతనిదే, భార్య అంటే ఇల్లు, వంట, పిల్లలు, కుటుంబ సభ్యుల గురించి చూసుకోవాలి అని నియమం ఉండేది. ఆడవాళ్లు గడప దాటి బయటకొచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం భార్యా భర్తలు ఇద్దరూ పని చేయకుంటే తప్పేట్టు లేదు. ఇంతవరకు ఓకే.
ఈ రెండువేల సంవత్సరాలలో ప్రపంచ ప్రసిద్ధులైన వ్యక్తుల లిస్ట్ తయారు చేస్తే... అందులో ఆడవాళ్లు ఎంత మంది ఉంటారు. 1901 నుండి ఇస్తున్న నోబుల్ బహుమతుల్లో ఎంత మంది స్త్రీలు ఆ అవార్డు పొందారు?. నాటక రచయితలు, సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, పాటల రచయితలు, సైంటిస్టులు .. అందరూ ఎక్కువగా మగవాళ్లే. స్త్రీలు చాలా చాలా తక్కువ. ఎందుకని. స్త్రీలలో జీనియస్సులు లేరా. వాళ్లు ప్రతిభాపాటవాలు లేవా?
ఈ జీనియస్ అనబడే వ్యక్తికి చెమ్మగిల్లే హృదయం ఉండాలి. కంట తడిపెట్టగలిగే మెత్త్తటి మనసుండాలి. ఈ గుణాలు ఆడవాళ్లలో సహజంగానే ఉంటాయి. అందుకే ప్రతి స్త్రీలో ఒక జీనియస్ ఉంటుంది. కాని అది పైకి కనపడదు. అది పైకి రావాలంటే , పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలంటే ఆ ప్రతిభకు మెరుగులు దిద్దాలి. ప్రాక్టీసు చేయాలి. ఇలా తమ సమయాన్ని ఎక్కువగా దీనికే వినియోగిస్తే మరి ఇంట్లో వంటెవరు చేస్తారు?, భర్తను, పిల్లలను ఎవరు చూస్తారు? ఇంటి భాద్యతలు సరే సరి. పైగా ఈర్ష్యా అసూయలతో పాటు పురుషాధిక్య సమాజంలో స్త్రీ ఓ తెగించి ఓ అడుగు ముందుకేయాలంటే ఎన్నో అడ్డంకులు, వాదాలు , వివాదాలు. తనో జీనియస్, తనలో కూడా టాలెంట్ ఉంది అని నిరూపించుకోవడానికి అనుక్షణం ఎన్నో విషయాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. సహజంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే స్త్రీ ఇటువంటి గొడవలు లేకుండా ఉండాలని అందుకుంటుంది. అందుకే సాధారణంగా ఎక్కువ మంది స్త్రీలు తమలో నిభిడీకృతమైన శక్తిని గురించి ఆలోచించరు, జీనియస్‌లుగా ఉండడానికి ప్రయత్నించరు.
1968 లో బార్రన్ ఇలా అన్నాడు... సృష్టించడం అన్నది కళాకారులు మాత్రమే చేయగలరు. వాళ్ల రాతలతోనో, చేతలతోనో, గీతలతోనో.. ఈ విధయమైన సృజనాత్మకత స్త్రీలలో లోపించింది. రిస్క్ ఎందుకని ప్రకృతి డివిజన్ ఆఫ్ లేబర్ క్రింద మగవాళ్లు ఐడియాలని, పెయింటింగ్‌లని , సాహిత్య, సంగీత సంస్థల్ని, దేశాల్ని, మతాల్ని, స్త్రీలు తరాల్ని సృష్టించేట్టుగా ఏర్పాటు చేసింది.
అయితే ఫ్రాయిడ్ ప్రకారం పుట్టుకతో ఆడవాళ్లు ఇన్‌ఫీరియర్ కాదు. సామాజిక బంధాలు, కమిట్‌మెంట్స్ వాళ్లని ఓ మెట్టు తక్కువగా చేసింది. ఈ కంచెల్ని చేధించిన వాళ్లు, తప్పించుకున్నవాళ్లు, మగలక్షణాలున్న ఆడవాళ్లుగా మిగిలిపోతున్నారు. ఒక స్త్రీ నిజమైన స్త్రీత్వం గల మనిషిలాగానైనా ఉంటుంది. లేదా క్రియేటివ్ జీనియస్‌గా ఉండిపోతుంది. ఈ రెండు ఒకే స్త్రీలో ఉండడం చాలా అరుదు. ఆడవాళ్లలో జీనియస్సులు లేరని కాదు. ఎక్కువగా వాళ్ల తెలివితేటలు అణచివేయబడతాయి. ఐనా కూడా కొందరు స్త్రీలు ఈ ఆటంకాలు చేధించుకుని విజయాలు సాధిస్తున్నారు తానొచ్చినా, ఇతరులను నొప్పించని రీతిలో.
మన దేశంలో స్త్రీకి స్వంత అభిమతం, వ్యక్తిత్వం, సృజన ఉండకూడదని , చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్దాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలని రూల్ పెట్టేస్తారు. ఇంకా నయం నేటి తరం పురుషులు మారుతున్నారు. స్త్రీలను గౌరవించి, వారి ప్రతిభని వెలికితీయలనే కోరిక కాకున్నా కుటుంబాన్ని నడపడానికైనా వారిని ఉన్నత చదువులు , ఉద్యోగాలకు అనుమతిస్తున్నారు. ఇక్కడ ఉద్యోగం ఒక అవసరం గానే ఉండిపోతుంది. కాని స్త్రీలలోని అసలైన టాలెంట్ బయటకు రావడం అరుదనే చెప్పవచ్చు.
ప్రతి వ్యక్తిలోనూ జీనియస్ ఉంటాడు . పురుషులు తాము అనుకున్నది చేయగలుగుతారు. కాని స్త్రీలు మాత్రం ఎక్కువగా కుటుంబానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. సంసారం, ఇంటిపని, వంటపని, పిల్లల పని ఆడవాళ్లని పీల్చి పిప్పి చేస్తాయి. ఇలా నాలుగు గోడల మధ్య బందీ ఐన జీవితం జీనియస్సులని ఎలా ప్రసాదిస్తుంది. మగవాళ్లు ఇవన్నీ పట్టించుకోకుండా తమ కార్యక్రమాలు చేసుకోగలరు కాబట్టే జీనియస్సులు అయ్యే అవకాశం ఎక్కువ. ఆ అదృష్టం ఆడవాళ్లకు లేదుగా. ఇప్పుడు ఉద్యోగం చేసే స్త్రీ ఐనా ముందు ఇంటిపని, పిల్లల పని మొత్తం పూర్తి చేసుకున్న తర్వాతే ఉద్యోగానికెళ్ళాలి. వచ్చిన తర్వాత మళ్లీ ఇంటిపని తప్పదు. ఎంత చేసినా ఏవో వంకలు. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే సంపాదిస్తున్నానని గర్వమా అంటారు. కాని మగవాడికి అలాంటి టెన్షన్స్ ఉండవే.
కుటుంబ విషయాలకు సంబంధించినత వరకైతే ఆడవాళ్లకు ఎక్కడికెళ్లినా కుటుంబం నుండి ఎటువంటి అభ్యంతరం, అడ్డంకి ఉండదు. కాని తన కిష్టమైన పనుల కోసం బయటకు వెళ్లాలంటే మాత్రం సవాలక్ష ప్రశ్నలు, అడ్డంకులు. భావాలు, ఆలోచనలు, ఊహలు ప్రయాణించినట్టుగా తాము కూడా ప్రయాణించే రోజు ఇంకా రాలేదు మహిళలకు. మగవాళ్లు తమ భార్యలను ప్రోత్సహిస్తారు ఆమే విజయాలకు ఆనందిస్తారు. కాని అది కొంతవరకే.. ఆమె విజయాలు, పేరు ప్రఖ్యాతులు ఎక్కువైనా, తమ కంటే అధికమనిపించినా వాళ్లలోని ఇగో నేనున్నానంటూ బయటకొస్తుంది. ఇక్కడ ఈర్ష్య మొదలవుతుంది. అప్పుడు వాళ్లను అణగదొక్కాలని ప్రయత్నిస్తారు. కుటుంబంలో అల్లకల్లోలం భరించలేని స్త్రీలు తప్పనిసరై తలవంచుతారు. అలా కాకుండా ధైర్యంగా మొండికేస్తే తెగించింది, మగరాయుడు, ఇలా ఎన్నో పేర్లు పెడతారు. ఇంట్లోనించి వెళ్లిపొమ్మంటారు. నీకు నీ సంసారం ముఖ్యమా నీ టాలెంట్ ముఖ్యమా తేల్చుకో అని అల్టిమేటం జారీ చేస్తారు. ఉదా.. భర్తకు ఎప్పుడైనా ఎక్కడికెళ్లాలన్నా ఎంచక్కా వెళుతున్నా అని చెప్పేసి వెళ్లిపోతాడు. కాని భార్య వెళ్లాలంటే కుదురుతుందా? లేదు. తను బయటకెళ్లాలంటే ముందు భర్త అనుమతి తీసుకోవాలి. తను లేని లోటు తెలీకుండా ఇంట్లో అన్నీ అమర్చి (కొన్ని గంటలకోసమైనా) బయటకెళ్లాల్సి వస్తుంది. కాని ఆ భర్త, నువ్వ్వెళ్లవోయ్, నేను చూసుకుంటాను అనే రోజు వస్తుందా.. అలా ఉంటే ఇంకా ఎంతో మంది జీనియస్సులు తయారవుతారు అన్నది లక్షలవరహాల మాట.
నేను ఈ విషయాలన్నీ ఊహించి రాసినవి కావు. సంవత్సరాలుగా ఎంతో మంది స్త్రీలను చూసి తెలుసుకున్న నిజాలు. అలా అని అందరు మగవాళ్లు ఇలాగే ఉండరు. భార్యను తనకిష్టమైన చదువులు , ఉద్యోగాలకు ప్రోత్సహిస్తూ, ఇంటిని పిల్లలను చూసుకునే భర్తలు కూడా ఉన్నారు. కాని చాలా తక్కువమంది.. భర్త విజయాలకు పొంగిపోని భార్య ఉంటుందా. ఎప్పుడు కూడా మా ఆయన బంగారం అనుకుంటుంది. కాని అలాగే భార్య విజయాలకు కూడా భర్తలు గర్వపడతారా అన్నదే నా సందేహం???