Monday, 31 May 2010

భావోద్వేగాలు

                   

ఓ శుభవార్త తెలియగానే ఆనందం, ఆలోచనలు భవిష్యత్ వైపు సాగినప్పుడు తెలీని దిగులూ, మనసు గాయపడిన క్షణం ఆక్రోషం.. ఇలా ప్రతీ భావోద్వేగమూ మనసులోనే సిద్ధంగా ఉంటుంది. తటస్థించే అనుభవానికి తగ్గ భావోద్వేగం మనలో వెన్వెంటనే  పెల్లుబుకుతూ కొంతసేపు ఉక్కిరిబిక్కిరి చేసి గమ్మున సర్దుకుంటుంది. మంచిదైనా, చెడ్డదైనా ఓ సంఘటన జరిగిన వెంటనే మదిలొ వేగంగా జరిగే సంఘర్షణ తాలూకు వ్యక్తీకరణలే మన భావోద్వేగాలు.  ప్రతీ భావోద్వేగమూ దాని తీవ్రత కొనసాగినంత సేపూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పనిలో పనిగా మనసులో ఏ మూలనో ఆ సంఘటన తాలూకు గాఢతని మరువలేని జ్ఞాపకంగా నమోదు చేసి.. తీవ్రత తగ్గిన వెంటనే దూదిపింజెలా ఎగిరిపోతుంది. భావోద్వేగాల మర్మాన్ని గ్రహిస్తే అవి మనపై స్వారీ చేసే ముందే వాటి తీవ్రతని కట్టడి చేసుకోగల విజ్ఞత  అలవడుతుంది. ఏ ఆనందానికైనా, ఆవేశానికైనా, విచారానికైనా కల్లోలితం అయ్యే ఆలొచనా ప్రవాహమే మూలం. వాటిని వీలైనంత వేగంగా స్థిరత్వం వైపు మళ్లిస్తే ఆ భావోద్వేగపు గాఢత క్షీణించిపోతుంది. మిన్ను విరిగి మీదపడ్డా మౌన ప్రేక్షకుల్లా చూస్తుండిపోయే నైపుణ్యత అలవడుతుంది. మన ఆలోచనలు నిరంతరం జరిగిపోయిన జీవితాన్నీ, ముందు భవిష్యత్తునీ, వర్తమానపు అనుభవాలనూ, బలంగా నాటుకుపోయిన జ్ఞాపకాలనూ మనసు పొరల్లోంచి వెలికి తీసి వాటిని చిక్కుముళ్ల్లుగా పెనవేసి కుదురుగా ఉన్న మనసుని కూడా ఆందోళనపరుస్తుంటాయి.


ప్రతీ భావోద్వేగమూ తాత్కాలికమే. అవసరం అయిన దానికన్నా దాన్ని మరింత విశ్లేషించి, సంఘటనలు, ఆలోచనల్ని క్లిష్టతరం చేసుకుని ఆ ఉద్వేగాన్ని సులభంగా వదిలిపెట్టకుండా మనసుని కుళ్లబెట్టుకుంటూ ఉంటాం.  ఈ క్షణం మన మానసిక స్థితి అస్థిరంగా ఉంటే దాన్ని స్థిరపరుచుకోవడం మన చేతుల్లో ఉన్న పని. కానీ ఆ కిటుకుని గ్రహించలేక పాటించలేకపోతున్నాం. సమస్యల్లో ఉన్న స్థితిలో మనమూ సమస్యలో కూరుకుపోయి బయటపడే మార్గాన్ని ఆలోచించడం మనేసి సమస్యని పెద్దది చేసుకుంటూ ఉంటాం. అలాగే ఆవేశం కట్టలు తెంచుకుంటే దానికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించి, మరోసారి ఆ పరిస్థితి తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తల వైపు దృష్టిని నిమగ్నం చేయకుండా వీలైనంత ఆవేశాన్ని వెళ్లగక్కుతుంటాం. ఇలా భావోద్వేగం యొక్క మూలాల్ని గుర్తించి వాటిని సరిచేసుకునే మార్గం ఒకటుంటే.. ఏకంగా భావోద్వేగం మనపై స్వారీ చేస్తున్నప్పుడు దాని నుండి బయటపడడానికి మరెన్నో మార్గాలున్నాయి.




 ఒక భావోద్వేగాన్ని పరిసరాలపై వెదజల్లడం  మన ఉనికిని, మనం ఆశిస్తున్న గమనింపుని పొందడానికి సులువైన మార్గం అనే దురభిప్రాయం బాల్యం నుండి మనకు ఉగ్గుపాలతో అలవర్చబడింది. ఉదా. కు.. మనం ప్రదర్శించిన ఆవేశానికి ఆశించిన స్థాయి స్పందన దాన్ని ఎవరిపై ప్రదర్శించామో వారి నుండి లభిస్తే మన అహం సంతృప్తిపడుతుంది. ఎంత ఆవేశపడినా దాన్ని పట్టించుకునేవారు లేనప్పుడు కాసేపు మనసు రగిలిపోతుంది. మెల్లగా నిస్సహాయత ఆవరిస్తుంది. దిగులు మొదలవుతుంది. చివరకు బేలగా మారిపోతాం. ఇది ఒక ఆవేశమనే భావోద్వేగపు పరిణామక్రమమే. ఇలా ప్రతీ భావోద్వేగానికీ కొన్ని బలమైన కారణాలు, అంచనాలూ, పర్యవసనాలూ ఉంటాయి.  వాటన్నింటినీ విశ్లేషించి మన చిత్తం చేసే చిత్రాల్లో ఎంత విచిత్రం దాగుందో అర్ధం చేసుకోగలిగితే ఆ మాయ నుండి అవలీలగా బయటపడగలం !

మీ నల్లమోతు శ్రీధర్

Thursday, 27 May 2010

వయసైపోయింది...

నలభై దాటగానే చాలామంది అనే మాట పెద్ద వయసు వచ్చేసింది. అప్పటికి పిల్లలు కాలేజీలలోకి వచ్చేస్తారు లేదా మన అవసరం అంతగా ఉండదు వాళ్లకి. చిన్నగా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. డాక్టర్లు కూడా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక జారీ చేస్తారు. ఒక్కో వయసులో ఒక్కో రకమైన పనులు చేయాలని మనని మనమే నియంత్రించుకుంటాం. అది ఆహారమైనా, దుస్తులైనా, ప్రవర్తన ఐనా ఇప్పుడు ఇలా ఉండాలి అని అందరూ అంటుంటే మనం కూడా ఓహో అలాగే ఉండాలి. లేకుంటే సమాజం వెక్కిరిస్తుంది. చుట్టాలు ఆడిపోసుకుంటారు అనుకుని వయసుతో పాటు మనసుని కూడా మనమే ముసలిదాన్ని చేసేస్తాం. అదే కాక ఈ జీవన ప్రయాణంలో కుటుంబ నిర్వహణ కోసం పని చేయడం అత్యవసరమై మిగిలిన విషయాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వం. ముఖ్యంగా మనకు ఇష్టమైనవి. ఇంటద్దె కట్టాలి.పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి, వాళ్లకు మంచి ఉద్యోగాలు రావాలి, పెళ్లిల్లు చేయాలి అనే కోరికలు ప్రతీ తల్లితండ్రులను పూర్తిగా ఆక్రమించేసుకుంటాయి. దీనికోసమే అహర్నిశలు ఆలోచిస్తూ , పని చేస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు సెటిల్ అయ్యాక ఆలోచించడానికి , చేయడానికి ఓపిక ఉండదు మానసికంగా ఐనా, శారీరకంగా ఐనా. అప్పుడు కూడా పిల్లలు , వాళ్ల పిల్లల గురించే శ్రమ పడతారు.


ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటుంది. మన జీవితం మనదే. పిల్లల జీవితం పిల్లలదే. వాళ్లకు అవసరమైనంతవరకు మన చేయూత నివ్వాలి. తర్వాత వాళ్లని స్వతంత్రులను చేసి వదిలేయాలి. మనం వాళ్ల మీద భారం కాకూడదు. వాళ్ల జీవితంలో అడ్డు కాకూడదు. అలా అని పిల్లలను వదిలేయాల్సిన పని లేదు. బాధ్యతలు తగ్గించుకోవాలి. వయసు అనేది మన శరీరానికే వచ్చింది. కాని మనసుకు కాదు. అది మనం ఎలా ఉండాలని అనుకుంటే అలా ఉంటుంది. అలా మలుచుకోగలం కూడా. శారీరకంగా అలసిపోయి ఇక మనమేం చేయలేము అనుకునేవారు ఎందరో. అలాగే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాములే? ఇప్పుడు కొత్తగా నేర్చుకుని ఏం చేయాలి? అని అంటారు. కాని తీరిగ్గా కూర్చుని మనగురించి ఆలోచిస్తే ఎన్నో చేయగలం. అవి శారీరక శ్రమ కలిగించని పనులు కూడా ఉంటాయి. అందులొ లలితకళలు, చదవడం, రాయడం, సహాయం చేయడం మొదలైనవి. కాలేజీ చదువులు, పోటీ పరీక్షలు, సంసార ప్రయాణంలో మనమే మర్చిపోయిన ఇష్టాలెన్నో.. వాటిని పునరిద్ధరించుకుని మళ్లీ మొదలుపెట్టడంలో తప్పు లేదు. ఇలా చేయడంవల్ల ఎవరో నవ్వుతారు, వెక్కిరిస్తారు అనుకోవడం వృధా. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ ఏడుస్తారు. నవ్వేవాళ్ల నాపచేనే పండుతుంది .. తెలుసు కదా. మీకే తెలియని , మీకు ఇష్టమైన పనులు చేయండి. వీటికి ఖర్చు స్వల్పమే కాని దానివలన లభించే ఆనందం,సంతృప్తి అనంతం.


ఇదంతా స్వానుభవంతో చెప్పిన మాటలు .. అర్ధంకాలేదా?? ఐతే క్లుప్తంగా నా కథ చెప్పనా? చదువుకుంటుండగానే పెళ్లి ఐంది. మావారు ఇంకా చదువుకోమన్నారు కాని పిల్లల చదువులు, పెంపకం, వాళ్ల పరీక్షలు, సంసారంలో వేసే మునకలు ఇలా జీవితం గడిచిపోయింది. నేను మావారు మా సర్వశక్తులు పిల్లల చదువులు , ఫీజులు, ఎంట్రెన్సుల మీద పెట్టాం. అదృష్టం కొద్ది పిల్లలు మంచి నడవడికను అలవరుచుకున్నారు. చెడు తిరుగుళ్లు అలవాటు చేసుకోక చదువుల మీద శ్రద్ద పెట్టి మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మాకు ఎక్కువ శ్రమ లేదు. మావారు తనకిష్టమైన జ్యోతిష్యం చదువుకుందామని కాలేజీలొ చేరారు.తన పనితో పాటు చదువు కూడా కొనసాగించారు. నేను ఇంటిపని, పిల్లల పని తర్వాత కుట్లు అల్లికలు, టీవీ సీరియళ్లు. వేరే వ్యాపకం అంటూ లేదు. ఏం చేయాలో తెలీదు. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా అనాసక్తి. ఈ వయసులొ నేర్చుకోవడం సాధ్యమా? నేర్చుకున్నా ఏంచేస్తాం? ఉద్యోగాలు చేయాలా? అని టీవీ సీరియళ్లు దాదాపు అన్నీ చూసేదాన్ని. అలా టైం వేస్ట్ చేస్తున్న నన్ను చూసి మావారు కంప్యూటర్ భాగాలు వివరించి నెట్ ఎలా వాడాలో, గూగుల్ సెర్చింగ్ ఎలా చేయాలో నేర్పించారు. మా అబ్బాయి మెస్సెంజెర్ అదీ చూపించాడు. అలా మెల్లి మెల్లిగా ఆసక్తి పెరిగింది. ఇంట్లో వాళ్లు, దగ్గరి చుట్టాలు తప్ప ఎక్కువగా పరిచయాలు లేని (చెప్పాలంటే నేనే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదన్నమాట) నాకు జాలంలో కొత్త పరిచయాలు ఎన్నో విషయాలు తెలియచేసాయి. పిల్లల కోసం కోర్సులు, కాలేజీలు వెతుకుతూ తెలుగు గురించి శోధించాను. అసలు కంప్యూటర్లో తెలుగు రాయాలని ఎంతో ప్రయత్నించాను. మావారు శ్రీలిపి లాంటి సాఫ్ట్ వేర్ తెచ్చారు కాని అదంతా తికమకగా ఉండేది. బ్లాగు గుంపులో చేరి ఒక్కొటొక్కటిగా నేర్చుకున్నా. కొత్తలో ఏదైనా ఆసక్తిగానే ఉంటుందికదా.పైగా ఇంట్లో కూర్చునే ఎంతోమంది తెలుగువారితో మాట్లాడడం.. ఇలా గడిచిపోతుండగా..


ఒకానొక సమయంలో జీవితం స్తంభించినట్టైంది. నేను చేయాల్సిన పనేమి లేదు. పిల్లలు సెటిల్ ఐపోయారు. వాళ్ల జీవితం వాళ్లది నా అవసరం లేదు. మరి నేను ఏం చేయాలి? ఎందుకు చేయాలి? ఎవరికోసం చేయాలి అనే ఆలోచన తప్ప వేరే లేదు. తెలియని అయోమయం. శూన్యం ఆవరించింది. నా భావనలు ఒక ఫ్రెండ్ తో పంచుకున్నాను. నా పరిస్థితి నాకే అర్ధం కాలేదు కాని అతనికి అర్ధమైంది. ఇల్లలికిన ఈగ కథ చెప్పాడు. ఒక ఈగ ఇల్లు శుబ్రంగా ఉండాలని ఎప్పుడూ ఇల్లంతా అలుకుతూ ఉండేదంట. అలా ఆలుకుతూ అలుకుతూ తన పేరే మరచిపోయింది. అలాంటి ఒక ఇల్లాలి కథను (పి.సత్యవతిగారు రాసింది)ఉదహరించాడు. ఏదో చేయాలనే తపన నాలో ఉంది. కాని వయసైపోయింది అనే కారణంతో దాన్ని అణచిపెడుతున్నాను. నాకంటూ ఒక వ్యాపకం, జీవితం సృష్టించుకోవాలి. అది కుటుంబానికి అతీతంగా వెళ్లడం కాదు. అప్పుడు మొదలైంది నాలో సంఘర్షణ. నిజంగా నాకు కావలసిందేమిటి. నాకంటూ ఇష్టాలు లేవా? కొత్త విషయాలు నేర్చుకోలేనా అని చాలా అలోచించాను. పత్రికలకు రాయడం మొదలుపెట్టాను. వీలైనంత ఎక్కువ చదవడం, రాయడం , సాంకేతిక విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇలా కొత్త కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు లభించే ఆనందం, సంతృప్తి వెలకట్టలేనివి. మాటల్లో చెప్పలేనివి. దానికితోడు మావారు,పిల్లల ,ప్రోత్సాహం, సహకారం కూడా చాలా ఉంది. అలాగే మిత్రుల తోడ్పాటు నన్ను ఈనాడు ఇలా నిలబెట్టింది. అందుకే అంటాను తెలుగు బ్లాగుల వల్ల నాకంటే ఎక్కువగా ఉపయోగపడింది ఎవరూ లేరని. నాకు ఇష్టమైన ఏ విషయాన్నైనా అనుకున్న వెంటనే ఎటువంటి ఆంక్షలు, హద్దులు లేకుండా రాయగలుగుతున్నా. దీనివలన రాత (తలరాత కాదు, చేతిరాత ) మారింది. ఇప్పుడు చెప్పండి వయసైపోయింది శరీరానికా? మనసుకా?


ఇదంతా చెప్పింది నన్ను మెచ్చుకోవడానికి కాదు. సొంత డబ్బా కొట్టుకోవడానికి కాదు. నాలాంటి మహిళలు, పురుషులు ఎంతో మంది ఉన్నారు. మీ ఇంట్లోనే ఉండొచ్చు. వారిని ప్రోత్సహించి వారికిష్టమైనవి నేర్చుకునే అవకాశం కలిపించండి. నాకు అలా కుటుంబ సభ్యుల సహకారం దొరుకుతుంది కాబట్టే ఇన్ని బ్లాగులు రాయగలుగుతున్నా, వివిధ పత్రికలకు వ్యాసాలు ఇవ్వగలుగుతున్నా. అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రాములు కూడా.నాకంటే మావాళ్లే ఎక్కువ సంతోషిస్తారు. అందుకే నేను ఎప్పుడూ నొక్కి వక్కాణిస్తాను.

మావారు బంగారు కొండ
పిల్లలేమో వజ్రాలు

మరి నేనో?? ప్లాటినం.. (ఎందుకో చెప్పుకోండి) అప్పుడప్పుడు ఎవరికి వారు ఇలా డబ్బా కొట్టుకోవాలి. లేకుంటే లైఫ్ బోర్ గా ఉంటుంది. ఔనంటారా?కాదంటారా??

Wednesday, 26 May 2010

నాన్నమ్మ చెప్పిన కథ...

వేసవి అనగానే గుర్తొచ్చేది అమ్మమ్మ, నాన్నమ్మ, కథలు, బోలెడు ఆటలు, నో చదువులు . మా చిన్నప్పుడు టీవీలు , కంప్యూటర్లు , వీడియో గేమ్స్ లేకున్నా వేసవి సెలవులను మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. సెలవులు మొదలు కాగానే మా పెదనాన్నగారి దగ్గర ఉండే నాన్నమ్మ వచ్చేది. అమ్మమ్మ వచ్చి ఉండడం తక్కువ. కూతురింట్లో ఉండకూడదంట. నాన్నమ్మ వచ్చిందంటే పిల్లలకు పండగే. ఆమెకు సినిమాలంటే చాలా ఇష్టం. రోజూ చూడమన్నా చూసేది. ఒక్కడాన్ని పంపలేక నన్ను తోడుగా పంపేది అమ్మ. ఇంటికి దగ్గరే థియేటర్. అలా తనతో కలిసి ఎన్నో జానపద, భక్తి సినిమాలు చూసాను. టికెట్ ఎంతని యాభై పైసలే. పొద్దంతా మా ఆటలు, బొమ్మలపెళ్లిల్లు అయ్యాక రాత్రి నాన్నమ్మ వెంటపడేవాళ్లం కథ చెప్పమని. అడిగిన వెంటనే చెప్పేది కాదు. రాత్రికి తొందరగా తినేసాక చెప్తాను అనేది. కథ కోసం మేమూ తొందరగా తినేసి, నాన్నమ్మను కూడా తొందరగా తినమని సతాయించేవాళ్లం. ఇక పక్కలు పరుచుకుని అందులో కూర్చుని కథలు వినేవాళ్లం. నిజంగా అమ్మమ్మలు, నాన్నమ్మలు కథలు ఎంతా బాగా చెప్పేవారో? వాళ్లు చెప్తుంటే ఆసక్తిగా వినడమే తప్ప పిల్లలు మధ్యలో ఒక్క ప్రశ్న కూడా అడిగేవారు కాదు. అంతగా లీనమయ్యేవారు. అమాయకమైన, కల్మషం లేని బాల్యం. ఏది చెప్పినా నమ్మేస్తుంది కదా. పన్ను ఊడిపోయి నొప్పితో ఏడుస్తుంటే ఆ బాధ మరిపించడానికి మట్టిలో ఊడిపోయిన పన్ను పాతిపెడితే డబ్బులచెట్టు మొలుస్తుందని అమ్మ చెప్తే నిజమని నమ్మి ఏడుపు ఆపి ఆ పన్ను తీసికెళ్ళి మట్టిలొ పాతిపెట్టడం. చెట్టు మొలిచిందా లేదా అని రోజూ చూడడం... పదిరోజులు అలా చూసి మర్చిపోవడం. పుస్తకాలలో నెమలి ఈక పెడితే అది పిల్లలు పెడుతుంది. ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది , బోలెడు డబ్బులు ఇస్తుంది అంటే కష్టపడి. స్నేహితులకు లంచాలు ఇచ్చి నెమలిఈక సంపాదించి పుస్తకంలో పెట్టుకుని అదో అదృష్టరాయిలా అపూర్వంగా చూసుకోవడం. జానపద సినిమాలు చూసి, అమ్మమ్మ చెప్పిన కథల్లోని రాజకుమారులను తలుచుకుని టవల్ తీసుకుని భుజాల మీదుగా కట్టుక్కుని చీపురు పుల్లలతో కత్తి యుద్ధం చేయడం... ఎప్పటికీ మరచిపోలేని మధురమైన జ్ఞాపకాలు కదా.

ఈ సోదంతా ఎందుకు గుర్తొచ్చింది అంటే కల్పన అమ్మ చెప్పిన కథలు రాయండర్రా అంటే ఒక్కసారి బాల్యంలోకి వెళ్లిపోయా. ఎన్నో కథలు చెప్పించుకున్నాకాని ఒక్క కథ మాత్రం మొత్తం గుర్తుంది. నాన్నమ్మ లేనప్పుడు అమ్మని కథలు చెప్పమంటే ఇంటిపనికే తీరడంలేదు అని పుస్తకాలు కొనిచ్చేది. చదవమని ప్రోత్సహించేది. పుస్తకాలు అంటే అస్సలు వెనుకాడేది కాదు అమ్మ. నాన్నమ్మ చెప్పిన చిక్కుడు కథ గుర్తొస్తే నవ్వొస్తుంది. అప్పుడు ఏ కథ విన్నా, చదివినా, సినిమా చూసినా అన్నీ నిజంగానే జరిగాయి అని పూర్తిగా నమ్మేదాన్ని. అందరూ అంతేనేమో. ఈ కాలం పిల్లలే హైటెక్ ఐపోయారు. అంత సులువుగా ఏదీ నమ్మరు. నాన్నమ్మ చదువుకోలేదు. కాని ఆమె చెప్పిన కథ పాతికేళ్ల తర్వాత మా పిల్లలకు కథల పుస్తకాలు కొంటుంటే అదే కథను ఇంగ్లీషులో చూసాను.

అప్పటి కథలేమో కాని ఎలా చెప్పేవారంటే పిల్లలు అల్లరి చేసినా, అన్నం తినకున్నా, చెప్పింది వినకున్నా అన్నీ ఆ కథలో చేర్చేసి అలా చేస్తె ఇలా అవుతుంది అని నీతి చెప్పేవారు. భలే ఉంది కదా.. ఇక కథలోకి వస్తే... అనగనగా ఒక అల్లరి పిల్లవాడు. అమ్మ ఉంది కాని నాన్న లేడు. చదువుకోమంటే ఎప్పుడూ ఆడుతూ ఉండేవాడు. ఒకసారి స్కూలుకెళ్లకుండా గోళీలాడుతున్నాడని వాడిని తల్లి బాగా కొడుతుంది. అప్పుడు వాడు కోపంతో వాళ్లింట్లో ఉన్న చిక్కుడు తీగ ఎక్కి పైకి వెళ్లిపోయాడు. ఎంత పైకి పోయాడు అంటే పైన మరో లోకం దగ్గరకు. అక్కడ పెద్ద పెద్ద ఇల్లు, పూల తోటలు, చెట్లు, కొలనులు ఉన్నాయి. ఆ పిల్లాడి పేరేంటి? అంటే శంకర్ అనుకోండి. శంకర్ అలా పైకి వెళ్లి అటు ఇటూ తిరుగుతుండగా ఒక పెద్ద కోట కనిపిస్తుంది. అందులోనుండి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. వాడు లోపలికి వెళ్లి చూస్తే ఒక అమ్మాయి చినిగిన బట్టలు వేసుకుని , బక్కచిక్కిపోయి (సరిగ్గా అన్నం తినకుంటే అలా అవుతారన్నమాట) పని చేస్తూ ఉంటుంది (చదువుకోకపోతే ఇలాగే వేరేవాళ్ల ఇంట్లో పని చేయాల్సి వస్తుంది).. శంకర్ ఆ అమ్మాయిని "ఎవరు నువ్వు? ఎందుకు నువ్వు పని చేస్తున్నావు? నీకు ఎవరూ లేరా? " అని అడుగుతాడు. ఒక రాక్షసుడు తనను ఎత్తుకొని వచ్చి ఇక్కడ బంధించాడు. మొత్తం పని చేయించుకుంటాడు అని చెప్తుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. రోజు శంకర్ మధ్యహ్నం సమయంలో పైకి వెళ్లి ఆ అమ్మాయితో ఆడుకుని ఆ అమ్మాయి రాక్షసుని గదినుండి తీసుకువచ్చి ఇచ్చిన పళ్లు, కొత్త బట్టలు తీసుకుని కిందకు వస్తాడు. తల్లి ఇవన్నీ ఎక్కడివి అని అడిగితే జరిగింది చెప్తాడు. ఇలా కొంత కాలం జరుగుతుంటుంది. ఆ అమ్మాయి కూడా సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఆమెను కిందకు తీసుకు వచ్చి తల్లికి చూపిస్తాడు. ఆమె ప్రేమగా మాట్లాడి భోజనం పెడుతుంది. పైన రాక్షసుడి తిరిగి వచ్చి అమ్మాయి లేకపోవడం చూసి కోపంతో అరుస్తాడు. ఎక్కడికి పోయింది అని వెతుకుతూ చిక్కుడు తీగను చూస్తాడు. అతని అరుపులు కింద ఉన్నవాళ్లకు వినిపిస్తాయి. రాక్షసుడు గట్టిగా అరుస్తూ చిక్కుడు తీగను పట్టుకుని కిందకు దిగుతుంటాడు. అది చూసి భయపడుతున్న శంకర్ ని చూసి అతని తల్లి గొడ్డలి ఇచ్చి ఆ చిక్కుడు తీగను కొట్టేయమంటుంది. అతను అలాగే చేస్తాడు. ఆ రాక్షసుడు అంత పైనుండి పడి తల పగిలి చనిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయిని వాళ్ల తల్లితండ్రుల దగ్గరకు చేరుస్తాడు శంకర్.. ఇది కథ.

ఈ కథ చెప్తుంటే నేను, మా తమ్ముళ్లు సీరియస్సుగా వినేవాళ్లం. అందులో ఒక్క సందేహం వచ్చేది కాదు. అసలు చిక్కుడు తీగ ఎలా ఉంటుందో తెలిస్తే కదా. దాన్ని పట్టుకుని ఎక్కవచ్చో లేదో తెలిసేది. ఒహో ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటుందేమో అని అనుకునేవాళ్లం. మన ఇంట్లో కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది. హాయిగా పైకి వెళ్లేవాళ్లం. అని అనుకునేవాళ్లం. తర్వాతెప్పుడో అమ్మ ఇంట్లో చిక్కుడు పాదు వేసింది. దానికి పందిరి కూడా కట్టింది. చిక్కుడుకాయలు పెద్దగా బానే వచ్చేవి కాని మాకు ఒకటే సందేహం ఈ తీగ ఇంత సన్నగా ఉంది దాన్ని పట్టుకుని పైకి ఎలా వెళతారబ్బా? అని. పాతికేళ్ల తర్వాత అనుకుంటా మా పిల్లలకోసం ఒక పుస్తక ప్రదర్శనలో కథల పుస్తకాలు చూస్తుంటే ఇంగ్లీషులో ఇదే కథ కనిపించింది. ఆశ్చర్యమేసింది.. నేను చిన్నప్పుడు విన్న కథ కదా అని.

అదో అందమైన బాల్యం. తిరిగిరాదు. మరపురాదు..

ఎందుకో గూగులమ్మని ఈ కథ గురించి అడిగితే ఇది ఇచ్చింది.. మీరు ఓ లుక్కేయండి..

Wednesday, 19 May 2010

జామాత దశమగ్రహ:

పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు. రెండు కుటుంబాలు, రెండు వంశాల శాశ్వత కలయిక. ఎక్కడో పుట్టి , ఎక్కడో పెరిగిన అమ్మాయి, అబ్బాయి పవిత్రమైన వివాహబంధంలో ఒక్కటవుతారు. అటువంటప్పుడు కోడలు, అల్లుడు గురించి ఎన్నో సర్దుబాట్లు, సమస్యలు. ఆరోపణలు తప్పవు కదా. కోడలంటే అత్తవారు చెప్పినట్టు చేయాలి కాబట్టి ఆరోపణలు ఉన్నా తక్కువే అని చెప్పవచ్చు. కాని అల్లుడు విషయంలో మాత్రం అలా కాదు. ఇప్పుడు అల్లుడు ఎందుకు గుర్తొచ్చాడు అనుకుంటున్నారా? అబ్బే!! నాకు అల్లుడు రావడానికి టైముంది కాని అప్పుడెప్పుడో అల్లుళ్లైనవాళ్లు, మొన్న మొన్న అల్లుళ్లైనవాళ్లు, ఇపుడు కాబోయే అల్లుళ్లు, కొన్నేళ్ల తర్వాత కాబోయే అల్లుళ్లు. అందరికీ ముందుగా అభినందనలు. ఇక అసలు విషయానికొద్దాం. కోడలు మా ఇంటి మహాలక్ష్మి, గృహలక్ష్మి అది ఇదీ అంటారు. కాని అల్లుడంటే అంత మంచి అభిప్రాయం లేదు చాలామందికి. ఎప్పుడూ కట్టుకున్న ఇల్లాలిని, అత్తవారిని పీక్కుతింటాడు అనుకుంటారు. ఇప్పుడే కాదు పురాణకాలం నుండి అల్లుడిని ఆడిపోసుకునేవాళ్లే... కవులైనా , సామన్యులైనా.. పాపం అల్లుడిని దశమగ్రహం అని కూడా అంటారు. మనకు ఉన్నవి నవగ్రహాలే. కాని ఈ అల్లుడు పదో గ్రహమెందుకయ్యాడు?

అల్లుణ్ని దశమ గ్రహమంటూ ఒక కవి ఇలా అన్నాడు.

సదా వక్రః సదా క్రూరః సదా పూజా మపేక్షతే
కన్యా రాశి స్థితో నిత్యం జామాతా దశమో గ్రహః 11

సూర్యుడు తప్ప మిగతా గ్రహాలన్నీ ఎప్పుడూ శుభమే కలుగచేస్తూ అప్పుడప్పుడు మాత్రమే వక్రిస్తాయి. కాని జామాత అంటే అల్లుడు మాత్రం ఎప్పుడూ వక్రంగానే ఉంటాడు. గ్రహాలన్నింటిలోకి శనిగ్రహమంటే చాలా మందికి భయం. ఎందుకంటే అతను ఒక్కోసారి క్రూరంగానూ, ఒక్కోసారి శుభకరంగానూ ఉంటాడు. ఈ అల్లుడున్నాడే ఎపుడూ క్రూరంగానే ఉంటాడు. అతనికి అత్తవారంటే అస్సలు మర్యాద, జాలి , దయ ఉండదు. అంతేనా!! నవగ్రహాలకి నిర్ణీతమైన సమయాల్లో పూజలు చేయాల్సి ఉంటే అల్లుడికి మాత్రం నిత్యమూ పూజ జరగాల్సిందే. మర్యాదలు చేయాల్సిందే అతడికి అల్లుడొచ్చినా సరే. గ్రహాలన్నీ తమ సంచారంలో రాశులు మారుతూ ఉంటాయి. కాని అల్లుడెప్పుడూ కన్యారాశి( కూతురు) లోనే ఉంటాడు. అత్తవారింటిలోని వారందరిని చులకన చేస్తుంటాడు. అందుకే అల్లుడు నవగ్రహాలకంటే భిన్నమైన దశమగ్రహం అయ్యాడన్నమాట. ఈ మాట అనేవారికి అల్లుడి మూలంగా ఎన్ని అవస్ధలు పడితే ఇంత మాట అంటారు.

అంతే కాదు అల్లుడు మరింత అభాసుపాలయ్యాడు. ఎంతవరకు అంటే పద్యకవి బ్రహ్మం తన సరస్వతీ శతకంలో అల్లుణ్ని నల్లి(మత్కుణం) అంటూ తన కసిని వెళ్లగక్కారు.

వరకట్నంబని మామ నెత్తురును ద్రావంగోరు పైశాచికో
దరు నల్లున్ దశమ గ్రహంబనుట సార్ధంబౌను, యోచించినన్
నరరూపాకృతి మత్కుణంబనుటయే న్యాయంబుగా దోచెడిన్
వరగల్ క్షేత్ర సరస్వతీ! భగవతీ! నాగేశ్వరీ! భారతీ!


వరకట్నము కోసం పిల్లనిచ్చిన మామను పీక్కుతిని, నెత్తురు త్రాగే పిశాచమువంటి అల్లుడు దశమగ్రహమనడం సమంజసమే. అసలైతే మనుష్యుల రక్తాన్ని పీల్చే నల్లి (మత్కుణము) మానవాకారంలో అల్లుడై మమ్మల్ని దోచుకుంటున్నాడు అని ఆ కవి తన ఆక్రోశాన్ని ఇలా వెళ్లగక్కాడు. ఇలా పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అది కావాలి ఇది కావాలి అని అస్తమానం అత్తమామలను సతాయించేవాళ్లు ఎందరో ఉన్నారు .. ఇలా అనడం సబబే మరి. ఐనా వాళ్లు మాత్రం ఏం చేస్తారు?? కూతురి కోసం భరించక తప్పదు.


కాళ్లకూరి నారాయణరావుగారి "వర విక్రయం"నాటకంలో అల్లుడు అనేవాడు ఎలాంటివాడో చెప్పారు. ఎలాగంటే...

అప్పొసంగిన వాడును, అల్లు, డద్దె
యింటి యజమానుడు, జీతమిచ్చువాడు
కుల వినోదియు, పన్నులు కూర్చువాడు
పుస్తె కట్టని మగలె పో పురుషులకు !!



మగవాళ్లకు మగవాళ్లు పుస్తెలు కట్టడమేంటి? విడ్డూరంగా ఉందే! మొగుళ్లంటే బాధలుపెట్టేవాడు, విసిగించేవాడు అన్నమాట. అప్పు ఇచ్చినవాడు, అల్లుడు, అద్దె యింటి ఓనరు, పన్నులేసేవాడు, కుల వినోది .. వీళ్లందరూ మగాళ్లకే తాళికట్టని మొగుళ్లు. అలా ఉంటాయి మరి వాళ్లు పెట్టే బాధలు. అనుభవించివాడికే తెలుస్తుంది.

అంతే కాదండోయ్.. నా కూతురిని పెళ్లి చేసుకోమని అడిగిన తండ్రికి ఆ అల్లుడి కోరికలు ఇలా ఉంటాయి. ఇవి పెళ్లితో ఆగవు. తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటాయి. అల్లుడి కోరికలు తీర్చడమే అత్తవారి కర్తవ్యం , బాధ్యత అన్నట్టు.

నీటైన యింగ్లీషు మోటారు సైకిలు
కొనిపెట్ట వలెనను కూళయొకడు
రిస్టువాచియు, గోల్డు రింగును, బూట్సును
సూట్లు గావలెనను శుంఠయొకడు
బియ్యే బియెల్ వరకయ్యెడు ఖర్చు భరింప
వలెనను దరిద్రుడొకడు
భార్యతోడను చెన్న పట్టణంబున నుంచి
చదివించవలెనను చవటయొకడు
సీమ చదువులు చాల సింపులు నన్నట
కంపవలయు ననెడి యజ్ఞుడొకడు
ఇట్లు కొసరు క్రింద నిష్టార్ధముల్ వరుల్
దెలుపుచున్నవారు తెల్లముగను!!


ప్రస్తుతం పెళ్ళిళ్ల వ్యాపారంలో ఇవన్నీ తప్పనిసరి ఇవ్వవలసిందే. చదువును బట్టి ఒక్కో రేటు. లేటెస్టు మోటారు సైకిలు, రిస్టు వాచీ, బంగారు ఉంగరం, రెండువేలకు తగ్గని బూట్లు, పెళ్లి తర్వాత అతని చదువుకయ్యే ఖర్చు, లేదా విడేశాలకు భార్యతో పాటు వెళ్లడానికి కూడా మామ పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఆడపిల్లను కని పెళ్లి చేయాలంటే ఈ ఖర్చు పెట్టడం అమ్మాయి తండ్రికి తప్పదు అని వారి భావన. వీళ్లను కూళ (క్రూరుడు), శుంఠ, దరిద్రుడు, చవట, అజ్ఞాని.. ఏ పేరు పెట్టి పిలవాలో అర్ధం కాదు.

అప్పిడినవాని నధికారి నతిశయించి
అల్లు రొందించు బాధల నెల్లగాంచి
అడలి నిజముగా హరిహరులంతవారు
కూతులం గంటయే మానుకొన్నవారు!!


అప్పిచ్చినవాడికంటే ఎక్కువగా వేధిస్తున్న అల్లుళ్లను చూసి భయపడి శివకేశవులే కూతుళ్లను కనడం మానుకున్నారంట. ఇక సామాన్యమానవుల బాధలు చెప్పతరమా? ఈ బాధలకేనేమో ఆడపిల్లలు వద్దు అని పురిట్లోనే మృత్యువు ఒడికి చేరుస్తున్నారు. పుట్టకముందే చంపేస్తున్నారు

ఇంకా ఈ అల్లుడి గురించి బద్దెన కవి సుమతీ శతకంలో ఏమన్నాడయ్యా అంటే..

అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్
పొల్లున దంచిన బియ్యము
తెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!!


గొల్లవాడి పాండిత్య జ్ఞానము, ఆడదాని యందు నిజము, పొల్లులో దంచిన బియ్యము. తెల్లని కాకులు ఎలా ఉండవో అదే విధంగా అల్లునిలో మంచితనము కూడా ఉండదు అని నొక్కి వక్కాణించారు. నిజమేనంటారా? ఆ బాధ తెలిసినవాళ్లు ఔననే అంటారు. ఇంకేం చేస్తారు?

ఇక అత్తవారింట్లోనే తిష్ట వేసిన అల్లుడి పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే?

శ్వశుర గృహ నివాశః స్వర్గతుల్యో నరాణాం
యది భవతి వివేకః పంచభి షడ్ దినై ర్వా
దధి మధు ఘ్రుతలోపో మాసమేకం నరాణాం
తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగః !!



అల్లుడనే కాదు ఎవరింటికైనా వెళ్లి రోజుల తరబడి కదలకుండా అక్కడే ఉండి ఇంటివారిని ఇబ్బంది పెడితే వారు మాత్రం ఏం చేస్తారు. తన్ని తగలేయకముందే మనమే బయటపడాలి. ఇక అల్లుడి సంగతికొస్తే మామగారిల్లు స్వర్గం లాంటిదైనా సరే ఇంటికొచ్చిన అల్లుడు ఐదారు రోజులకంటే ఎక్కువ ఉంటే పరిస్థితులు , ఆదరణ , కుటుంబ సభ్యుల ప్రవర్తన మారుతూ ఉంటాయి. మొదట్లో పంచభక్ష్యాలతో భోజనం పెట్టినా క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. పాలు, పెరుగు,నెయ్యి , స్వీట్లు..నెమ్మదిగా ఒక్కోటి మాయమవుతూ ఉంటాయి. అది తెలుసుకుని ఇంకా కదలకుంటే చెప్పుదెబ్బలు కూడా తప్పవంట. ఆ మామకు ముక్కు మీద కోపముంటే ఈ మర్యాద కూడా తప్పక జరుపుతాడు.


అల్లుడు బహుమానస్తుడు
అల్లునకొక పనియు చెప్పనైనం గానీ
చెల్లును మూడు పనులకై
ఇల్లలుకను, పేడచేయు, నెంగిళ్లెత్తన్!!


అత్తింట్లో తిష్ట వేసిన అల్లుడిని తమకనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చంటాడు ఒక కవి. ఐనా ఎంత అల్లుడైతే మాత్రం ఎన్ని రోజులు కూర్చోబెట్టి మేపుతారు. అల్లుడికి అస్సలు పని చేప్పము కాని. మామకు ఎంత ఒళ్లు మండితే ఇంటల్లుడిని ఇల్లు అలకడానికి, పేడ చేసి, ఎంగిళ్లు ఎత్తడానికి.. ఇలా మూడు పనులకు వాడుకోవచ్చు అని చెప్తాడు. ఆ అల్లుడి స్వయంకృతాపరాధమే కదా.

ఒకసారి అవధానాల్లో కూడా ఈ అల్లుడి ప్రసక్తి వచ్చిందంట. మహావధానులు శ్రీ మిన్నికంటి గురునాధ్ శర్మగారు ఒక సభలో తన కిచ్చిన "అల్లుడయ్యెదన్ మగడనయ్యెద నే మనుమడనయ్యెదన్ " అనే సమస్యని అత్యంత మనోహరంగా పూరించారు. ఒకే వ్యక్తి అల్లుడు, మగడు , మనుమడు ఎలా అయ్యాడు అనుకుంటే...

ఎల్లసురల్ వినంగ హరి యిట్లనె - భూసుత సీతబొందితిన్
నీళ్లను మునిగినట్టి ధరణీ సతిఁ గౌగిట గ్రుచ్చి యెత్తితిన్
తల్లికి తల్లియౌ సతి నెదన్ ధరియించితిగాన భూమికిన్
అల్లుడనయ్యెదన్ మగడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్ !!


రామావతారంలో విష్ణువు భూమిపుత్రిక సీతకు "భర్త " కాబట్టి భూమికి అల్లుడైనాడు. వరాహవతారంలో హిరణ్యాక్షుని చంపి సముద్రజలాలనుండి భూమిని తన కోరలతో పట్టి ఉద్ధరించాడు కాబట్టి ఆ భూమికి మగడు అయ్యాడు . ఆ విధంగా విష్ణువు పాదాల నుండి ఉద్భవించిన గంగ భూమికి కూడా కూతురయ్యింది. ఈ బంధం ఇంకా ఉంది... గంగ సముద్రునికి భార్య ఐనందున సముద్రుడి నుండి పుట్టిన లక్ష్మీదేవికి తల్లి కాబట్టి భూమికి మనవరాలు అయ్యింది కదా. మనవరాలి భర్త కాబట్టి విష్ణువు భూమికి మనవడు అయ్యాడు. తికమకగా ఉందా? అంటే శ్రీమహావిష్ణువు భూమికి --- భూమిని చేపట్టి మగడు, భూపుత్రికను పెళ్లాడి అల్లుడు, లక్ష్మిని మనువాడి మనవడు అయ్యాడు. భలే ఉంది కద. మరి అవధానమంటే ఇలాగే ఉంటుంది. అందునా అల్లుడు..

ఇదంతా చదువుతుంటే మగవాళ్లందరికీ కోపమొస్తుంది కదా.. ఆగండాగండి.. అందరు అల్లుళ్లు ఇలా ఉండరు. అత్తామామలను తమ తల్లితండ్రులుగా భావించి, గౌరవించేవాళ్లు ఉన్నారు. కాని చాలా మంది అల్లుడు అనగానే భార్యవైపు వారిని చులకన చేయడము, తమ కావలసిన వస్తువులను ఇవ్వడం అత్తామామల కర్తవ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు. తాను చెప్పినట్టు భార్య, ఆమె పుట్టింటివారు వినాలి అంటారు. దానికి అతడి తల్లి తండ్రులు, తోడబుట్టినవారు కూడా ఆజ్యం పోస్తున్నారు. దీనివలన ఆ కుటుంబం అప్పులపాలైనా సరే అడిగినవి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ధనదాహానికి ఎంతోమంది అమ్మాయిలు బలయ్యారు. అవుతున్నారు. ఈ వరకట్న సమస్య ఎంత దారుణంగా, నీచంగా మారిందంటే అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను ఆ అగ్నికే ఆహుతి చేస్తున్నారు. భార్య తన అత్తామామలను తన తల్లితండ్రులుగా భావించి, సేవించాలని అనుకునే మగవాడు . తన అత్తామామలను కూడా తన తల్లితండ్రులలాగే భావించాలని అనుకోడు. నేటి యువత మాత్రం మెల్లిగా మారుతున్నారనుకోండి. అసలు ఇలా భార్యలను వేధించే కొడుకును అతని తల్లితండ్రులు కూడా కట్టడి చేసి అదుపులో పెట్టాలి. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ఒక ఇంటికి ఇల్లాలిగా పంపించి, అల్లుడి చేతిలో బాధలు పడే దురదృష్టవంతులైన తల్లితండ్రులెందరో ఈ రోజుల్లో?

అందుకే అల్లుళ్లూ కాస్త ఆలోచించండి.

ఈ టపా కోసం తన విద్యార్థులు మనోజ్ఞ, నవ్య లతో ఆడియో చేయించి ఇచ్చిన భారతి ప్రకాష్ గారికి , రాఘవ గారికి ధన్యవాదాలు..

Monday, 17 May 2010

రోదసిలో రియల్ ఎస్టేట్



అంతర్జాలంలోని కొన్ని ప్రముఖమైన, ఉపయుక్తమైన వెబ్సైట్ల పరిచయం ఈ రోజు సాక్షి పత్రికలోని
సాహిత్య విభాగంలో ..

Saturday, 8 May 2010

భారతీయ విలువలు..

రోజూ మనం ఎన్నో సంఘటనలు చూస్తుంటాం, వింటుంటాం, చదువుతుంటాం. కాని వాటికంత ప్రాముఖ్యత ఇవ్వం. ఎందుకంటే అది మనకు సంబంధించింది కాదు కాబట్టి. దాని గురించి మనకు ఆలోచించే అవసరం , సమయం లేదు కనుక ఆ సంఘటనలను త్వరగానే మర్చిపోతాము. కొన్ని కథలు మనను కదిలిస్తాయి, కొన్ని కలవరపరుస్తాయి మరి కొన్ని ఆలోచింపచేసి మనం మర్చిపోయిన విషయాలను గుర్తు చేస్తాయి. అటువంటి కథ ఒకటి కొంత కాలం క్రింద చదవడం జరిగింది. అది చదివి చాలా కాలమైనా ఆ సమయంలో ఆ కథలో చెప్పిన విషయం కాని సంఘటనలు కాని నాకు ఎదురు కాలేదు. అందుకే అంతగా పట్టించుకోలేదు. కాలక్రమేనా ఎదురైన సంఘటనలు మళ్లీ ఆ కథను గుర్తు చేసుకోమన్నాయి. అది కొత్తపాళీగారు రాసిన Indian Values. మీరు చదివేసి రండి. నా అనుభవం , అభిప్రాయం చెప్తాను.



అమ్మాయ్! ఏంటలా మగరాయుడిలా తిరుగుతావ్? కాస్త నిదానంగా, ఒద్దికగా ఉండడం నేర్చుకో. చూసినవాళ్లు ఏమంటారు? ఆడపిల్లలంటే ఎలా ఉంఢాలి.. భారతీయ మహిళవి ఇలాగేనా ఉండేది. అమ్మాయిలంటే ఒదిగి , ఎదురు మాట్లాడకుండా ఉండాలి. పదిమందిలో గట్టిగా నవ్వరాదు. పెద్దవాళ్ల ముందు గొంతు పెంచి మాట్లాడరాదు. తెలిసిందా? లేదంటే కన్నవాళ్లని అంటారు?మీ పిల్లకు ఏం నేర్పించారు? అని. ఈ మాటలు దాదాపు ప్రతీ ఆడపిల్లకు చిన్నప్పటినుండి నూరిపోస్తున్న మాటలు.. అమాయకంగా, హద్దులు ఎరుగక ఆడుతూ పాడుతూ ఉన్న అమ్మాయికి ఎప్పటికప్పుడు అడ్డగిస్తూ ఉంటారు. ఈ హద్దులు, విలువలూ అంటూ స్త్రీని జీవితాంతం ఒక అదృశ్య చట్రంలో బంధించాలని చూస్తుంది ఈ సమాజం.



కాని మహిళా చైతన్యం కొత్త మలుపులు తిరుగుతుంది. వివిధ రంగాలలో మగవారితో సమంగా పోటీ పడుతూ అభివృద్ధిపధం వైపు దూసుకెళ్తున్నారు. ఈ వికాసక్రమంలో స్త్రీలు ప్రశ్నించడం , నిర్ధిష్టంగా వ్యవహరించడం నేర్చుకున్నారు. ఈ అనూహ్యమైన మార్పు చదువుకున్న మహిళలలోనే కాక గ్రామీణ మహిళలలో కూడా స్పష్టంగా కానవస్తుంది. కాని కొన్ని విషయాల్లో మాత్రం మార్పు ఇంకా రాలేదు అనిపిస్తుంది. అభివృద్ధి, స్వేచ్చ, మార్పు మహిళను ఉన్నతురాలిగా చేసినా కొన్ని విషయాల్లో ఆమెని స్త్రీగా భారతీయ విలువలు , మోరల్ వాల్యూస్ అంటూ ఆంక్షలు పెడుతుంది సమాజం. విద్య, ఉద్యోగ రీత్యా మహిళలు మగవారితో కలిసి పని చెయాల్సి వస్తుంది. వారితో స్నేహంగా ఉండక తప్పదు. ఆ మగవారిలో కూడా ఎటువంటి దురుద్ధేశ్యాలు ఉండవు. తోటీ విద్యార్థినిగా, సహోద్యిగిగా ఆ స్త్రీకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కాని కొందరు ప్రబుద్ధులు, ప్రబుద్ధురాళ్లు మాత్రం ఇది ఆమె విచ్చలవిడితనంగా భావిస్తారు. ఒక మగవాడితో కాస్త చనువుగా, నవ్వుతూ మాట్లాడిందీ అంటే చాలు దానికి చిలువలు పలువలుగా కథలు అల్లుతారు. ఎవరెవరితో తిరుగుతుందో అని వాళ్లకు వాళ్లే ఊహించేసుకుంటారు. ఈ మాటలు అబ్బాయిలకు ఉండవండి మరి.. అదృష్టవంతులు ....



ఈనాడు చదువుకున్న ప్రతీ అమ్మాయి ఉద్యోగం చేస్తానంటుంది. లేదా విదేశాలకెళ్లి పై చదువులు చదువుతా అంటుంది. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన నన్ను కలిచివేసింది. ఎంత చదివినా, ఎంత కష్టపడినా సమాజం మారదు. కొందరు మనుష్యులు అస్సలు మారరు అనుకున్నా. బాగా చదువుకున్న ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది.. అబ్బాయి కూడా అమెరికాలొ చదువుకుని వచ్చాడు. ఆస్థిపరులే. కట్నకానుకల బేరం కుదిరింది. కాని అమ్మాయికి డాక్టర్ తో టెస్టులు చేయించాలి అన్నారు. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. మాది గౌరవమైన కుటుంబం. అందుకే తప్పదు అంటారు ఆ అబ్బాయి తల్లి . డాక్టరైన అక్క.. ఇది ఆ అమ్మాయికి ఎంత అవమానం. ఎవరో తెలీనివారికోసం తన శీలపరిక్ష చేసుకోవాలా?? పెళ్లయ్యాక ఇలాగే ఎప్పటికప్పుడు పరీక్షకు సిద్ధపడాలా?? .. అంతే వెంటనే ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.. నేనైతే పదిమందిలో ఆ అబ్బాయికి కూడా డాక్టరు పరీక్షలు చేయించమనేదాన్ని. ఎయిడ్స్ లాంటివి లేవని నమ్మకమేంటి అని.. అంత కోపమొచ్చింది.. ఇలాంటి ఆలోచనలున్న అబ్బాయిలు, తల్లితండ్రులు ఉన్నారు ఈ సమాజంలో.. ఉద్యోగినులైన స్త్రీలకు కూడా ఈ తరహా వేదింపులు తప్పడం లేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలైనప్పుడు పని భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు టంచనుగా ఇంటికి రావాలి. భర్త, పిల్లలను, అత్తామామలను చూసుకోవాలి. లేట్ ఐతే ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎవడితో తిరుగుతుందో అంటారు.. ఇది నిజం..



ఇంతకీ భారతీయ విలువలు అంటే ఏంటి?? ఎవరైనా కాస్త చెప్తారా?? ఈ విలువలు అమ్మాయిలకేనా? అబ్బాయిలకు కూడా ఉన్నాయా? (కుమారీ శతకంలో భర్త చనిపోతే భార్య కూడా సర్వం త్యాగం చేసి అతనితో పాటు సతీ సహగమనం చేయాలని ఉంది. మరి అతనివల్ల పుట్టిన పిల్లల గతి ఏంటీ?? వాళ్లనేం చేయాలి చెప్పలేదు. కుమార శతకంలో మాత్రం ఇలాంటి విషయాలు చెప్పలేదు మరి..)) ఈ విలువలను నిర్దేశించింది ఎవరూ? ఎందుకు?? నిజంగా నాకు తెలీదు.. అమ్మాయిలెప్పుడు నిండా కొంగు ముసుగేసుకుని, బుర్ఖా వేసుకుని ఉండాలా?? అలాంటప్పుడు అసలు ఆడపుట్టుకే ఎందుకంట??

Friday, 7 May 2010

ఆముక్తమాల్యద

ఆముక్తమాల్యద గ్రంధం సామాన్య పాఠకులకు కొరుకుడు పడదు. అంత సులువుగా అర్ధం కావు అని ఒక భావన ఉంది. కాని కొద్దిగా కష్టపడితే అది నారికేళ పాకం లాంటిదే అని అర్ధమవుతుంది. ఇది నా స్వానుభవం మీద చెప్తున్న మాట. ఆముక్తమాల్యద మొదలుపెట్టినది మొదలు నా బ్లాగులో వివరణలతో ఇచ్చాను. కాని ఈ ఆముక్తమాల్యద కోసమే విడిగా ఒక బ్లాగు ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఊహ వచ్చిన వెంటనే కామేస్వరరావుగారితో సంప్రదించి ఆయన సహకారంతో బ్లాగు నిర్వహించవచ్చు అని ఆముక్తమాల్యద అనే బ్లాగును మొదలుపెట్టేసాను. ఈ రచనలోని పద్యాలకు తమ స్వరాన్ని అందించడానికి చదువరి, రాఘవ అంగీకరించారు. ఈ మహామహులతో కలిసి తలపెట్టిన ఈ మహా కార్యాన్ని మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఈ బ్లాగులోని రచనలకు మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియచేయగలరు.

ఈ ప్రభంధ కృతికర్త ఆంధ్రభోజుడు శ్రీ కృష్ణదేవరాయలను స్మరిస్తూ , ఆ ఏడుకొండలవాడు శ్రీనివాసుడి ఆశీర్వచనాలతో మొదలుపెడుతున్న ఈ బ్లాగు నిర్విఘ్నంగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ బ్లాగు నిర్వహణకు తోడ్పడడానికి వెంటనే అంగీకరించిన భైరవభట్ల కామేశ్వర రావుగారికి, పద్యాలను తమ స్వరంలో శ్రవ్యకాలుగా మార్చి ఇవ్వడానికి ముందుకొచ్చిన చదువరి, రాఘవ గారికీ ధన్యవాదాలు...


ఆముక్తమాల్యద.. http://amuktamalya.blogspot.com/

Wednesday, 5 May 2010

పాట (పాత) బంగారం...

ఈరోజు వందల్లో టీవీ చానెళ్ళు ఉన్నాయి. ప్రతీ అంశానికి పదుల్లో చానెళ్ళు. అలాగే మ్యూజిక్ చానెళ్ళు. ఈరోజు యువతరానికి మ్యూజిక్ అంటే అర్ధం లేని పాటలు పాడుతూ, చెవులు బద్దలు కొట్టే (శృతి, లయ లేని ) సంగీతం. అందులో మ్యూజిక్ వీడియోలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కొత్త ఆల్బమ్స్ వచ్చినా తిన్నదరక్క పాత పాటలను కూడా రీమిక్స్ పేరుతొ ఖూనీ చేస్తున్నారు.. ఏమంటే మీకు టెస్ట్ లేదు అంటారు ... కాని ఎప్పటికీ గుర్తుండేవి ,మళ్ళీ మళ్ళీ వినాలనిపించే వీడియోలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి ఫాల్గుని పాఠక్ పాటలు. చూడటానికి అబ్బాయిలా ఉన్నా తియ్యని మధురమైన స్వరం ఆమెది. దానికితోడుగా ఇచ్చే వీడియోలు కూడా సున్నితంగా , సహజంగా ఉండేవి.. ఎన్ని సార్లు విన్నా, చూసినా అలా నిలబడిపోవాల్సిందే.. కొన్ని చూడండి.

యాద్ పియా కి ఆనెలగీ



అయ్యోరామా...




మేరీ చూనర్ ఉడ్ ఉడ్ జాయే..



ఓ పియా...




పల్ పల్ తీరే యాద్ సతాయే...



మై తేరీ ప్రేమ్ దీవానీ...





సావన్ మే...




మైనే పాయల్ హై ఝన్కాయి...

Tuesday, 4 May 2010

నాపై ఎందుకింత ప్రేమ??


 


సంతోషంగా ఉన్నవేళ
నన్ను స్పృశించ సాహసించవు
సమూహంలో ఉండగా
నన్ను పలకరించ భయపడేవు.....

కాస్త దిగులుగా ఉన్నంతనే
నేనున్నానంటూ తడిమేస్తావు
ఒంటరిగా బెదిరి ఉన్న సమయాన
జడివానలా, జలపాతంలా కమ్మివేస్తావు....

నా మనసులో , భావనలలో
అలుముకుని, అల్లుకుపోయిన దుఃఖమా!
ఆనందంలో పలకరించేవు, ఆవేదనలో తోడుండేవు
ఎంత అణచిపెట్టినా, అడ్డు చెప్పినా కంటి కొనలో నిలిచేవు...

ఉప్పెనలా నన్ను చుట్టేసి
భావోద్వేగపు వెల్లువను శాంతపరిచేవు
తుఫానులో చిగురుటాకులా నన్ను వణికించే
దుఃఖమా? నాపై ఇంత ప్రేమ ఎందుకమ్మా???

Monday, 3 May 2010

జయహో ప్రమదావనం





ఈరోజు ఈనాడు వసుంధరలో ఆన్లైన్ స్నేహం, ఆపన్నులకు సాయం అనే శీర్షికలో మహిళా బ్లాగర్ల ప్రమదావనం గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రమదావనం గతంలో చేసిన సహాయ కార్యక్రమాల వివరాలు మరోసారి. ఈ సేవాస్ఫూర్తి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రమదావనం సభ్యులకు, మా కార్యక్రమాలకు సహాయం చేస్తున్నవారికందరికీ అభినందనలు, ధన్యవాదాలు..

ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న కొందరు మహిళలు ఊరికే బ్లాగులు రాయడం వరకే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నారు. అదే ప్రమదావనం అనే గూగుల్ గుంపు. ఎక్కడెక్కడి మహిళా బ్లాగర్లు అప్పుడప్పుడు సరదాగా కలిసి కబుర్లు చెప్పుకోవటానికి, బ్లాగులకు, కాని సాంకేతికమైన సలహాలకి, సందేహాల నివృత్తికి, ఇంకా సభ్యులకి ఏవైనా సలహాలు కాని సంప్రదింపులు కాని అవసరమైతే సహాయ పడటానికి ఏర్పడ్డ ఓ వేదిక. అప్పడప్పుడు వివిధ ప్రదేశాలలో ఉన్న మహిళా బ్లాగర్లందరూ తమ ఇంటినుండే ఒకే సమయంలో సమావేశం ఏర్పాటు చేసుకుని కబుర్లు, ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతుంటారు.



ఈ ప్రమదావనం సభ్యులు బ్లాగులు రాసుకోవడం, కబుర్లాడుకోవడం వరకే కాక సమాజానికి తమవంతు చిన్ని సాయమైనా చేయాలనే కోరికతో సహాయ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సహాయ కార్యక్రమాలు ఒకటి రెంఢు సార్లు కాకుండా క్రమం తప్పకుండా నిర్వహించాలనే దృడసంకల్పంతో ఉన్న ప్రమదావనం సభ్యులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకోసం అందరూ స్వచ్ఛందంగా ధనసేకరణ చేస్తున్నారు. ఒకరికొకరు ముఖపరిచయంలేకున్నా కూడా ఎవరికి వీలైతే వారు ఈ బాధ్యతని నెత్తికెత్తుకుని విజయవంతంగా పూర్తిచేస్తున్నారు. మరికొందరికి స్పూర్తినిస్తున్నారు.



ప్రమదావనం సహాయకార్యక్రమాల వివరాలు....

మొదటి కార్యక్రమం

అంకురం


రెండవ కార్యక్రమం..

యామిని


మూడవ కార్యక్రమం..

ఆత్మీయ స్పర్శ


నాలుగవ కార్యక్రమం..

నన్ను బ్రతికించండి...


ఐదవ కార్యక్రమం...

వరదబాధితులకు ఐదువేలు విరాళంగా పంపడమైంది..



ఆరవ కార్యక్రమం....

వెచ్చదనపు స్పర్శ


లింకు పనిచేయని పక్షంలో ఇది ఉపయోగపడుతుంది..

ఆన్‌లైన్‌ స్నేహం... ఆపన్నులకు సాయం
మాజంలో మనమూ ఒకరం... మన వంతుగా సమాజానికి ఏదో ఒకటి చేద్దాం. రోజులో కొంత సేపు.. వారానికో గంట.. ఇలా అనుకునే గృహిణులు, మహిళలు ఇప్పుడు ఆన్‌లైన్‌ బాటపడుతున్నారు. స్నేహ బృందాలుగా ఏర్పడి... ఆపన్నులకు ఆసరాగా నిలుస్తున్నారు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో... కమ్యూనిటీలనే అందుకు వేదికలుగా మలుచుకుంటున్నారు. క్షణం తీరిక లేనిజీవితాల్లోనూ సేవకు సిద్ధమనే వారితో 'వసుంధర' ముచ్చటించింది.
అందరూ నడిచే ఆ రహదారికి పక్కగా ఓ పాఠశాల. పేరుకే చదువుల నిలయం. కానీ సౌకర్యాల లేమి. ఉపాధ్యాయుల కొరత. దాంతో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితి అటుగా వచ్చీపోయే వారందరికీ తెలిసినదే. అయినా ఎవరూ చొరవ చూపింది లేదు. కానీ ఓ రోజు అకస్మాత్తుగా ఆ స్కూలుకి చేరుకున్న కొందరు అమ్మాయిలు పరిస్థితుల్ని గమనించారు. స్కూలు పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు బాధ్యత తీసుకున్నారు. స్వల్ప కాలంలోనే సకల సౌకర్యాలు సిద్ధం చేశారు. టీచర్లు, నెల జీతాలు, పిల్లలకు మంచి నీటి వసతి వంటివి కల్పించి, దాన్నొక చక్కటి విద్యాకేంద్రంగా మలిచారు. ఇన్ని ఏర్పాట్లు చేసిన ఆ బృందం పేరు అభిలాష. ఆ స్కూలు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉంది. ఆన్‌లైన్‌లో పరిచయమై... స్నేహ బృందంగా ఏర్పడి... అభాగ్యులకు ఆసరాగా నిలవాలన్న సదాశయంతో అడుగులు వేస్తున్న బృందాల్లో అదొకటి. ఈ రకంగా ఏర్పాటవుతోన్న ఆన్‌లైన్‌ కమ్యూనిటీ బృందాల్లో విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులు... ఇలా అన్ని వర్గాల వారూ ఉన్నారు.

తలా కొంత.. ధైర్యం నింపేంత!
ఆర్కుట్‌, ఫేస్‌బుక్‌, యాహూ, గూగుల్‌ గ్రూప్స్‌, ఇండ్యారాక్స్‌.. సోషల్‌ కమ్యూనిటీ సైట్‌ ఏదైనా కానివ్వండి.. అవి టీనేజీ స్నేహాలకే పరిమితం అనుకుంటే పొరబాటు. వీటినే తమ సదాశయాలకు వేదికలుగా మలుచుకుని ఇంతింతలుగా సేవని విస్తృతం చేస్తున్నారు. ఒక్కరుగా సేవా మార్గంలో నడవడం, ఆపన్నులను చేరుకొని సాయం అందించడం సులువైన విషయం కాదు. ఇక్కడే ఆన్‌లైన్‌ పరిచయాలూ అందుకు ఉపకరిస్తున్నాయి.

మనసుంటే తోటి వారికి ఏదో రకంగా సాయపడొచ్చు.. అది డబ్బు రూపంలోనే కానవసరం లేదు.. అని నిరూపిస్తున్నాయి ఆన్‌లైన్‌ స్నేహ లు. తోటివారిని ఆర్థికంగా ఆదుకోవడం, కనీస సౌకర్యాలు కూడా లేనివారికి అవి అందించడం, కష్టకాలంలో నీడ నివ్వడం... మనసుకు ఊరట కల్పించడం, నవ్వులు మృగ్యమైన వారి మోముల్లో సంతోషాలు పంచడం ఇలాంటివే మేము చేస్తుంటాం. వీటన్నింటికి డబ్బే ఉండాలనేం లేదు కదా.. చేయాలన్న తపన ఉంటే చాలు అంటారు నెల్లూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌ ప్రశాంతి. యాహూ గ్రూప్స్‌లో 'బర్డ్స్‌ ఆఫ్‌ సేమ్‌ ఫెదర్స్‌', 'టు మేక్‌ ఎ డిఫరెన్స్‌' పేర్లతో ప్రత్యేక బృందాల్ని నిర్వహిస్తున్న ప్రశాంతి ఏమంటున్నారంటే.. 'డబ్బు అవసరమైతే సభ్యులందరికీ సమాచారమిచ్చి, వచ్చిన మొత్తంతో పాఠశాలల్ని దత్తత తీసుకున్నాం. గదులు, వసతులు, పుస్తకాలు అన్నీ సమకూర్చాం. పేదలకు ఆరోగ్య చికిత్సలు, ఈ వేసవిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. డబ్బు అందించలేని వారు ఇటువంటి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటారు. వృద్ధాశ్రమాలకు వెళ్లి వారితో ఆడుకోవడం, అనాథ పిల్లల్ని, వికలాంగుల్ని కలిసి మాట్లాడటం, ఆత్మవిశ్వాసం అందించడం చేస్తుంటాం' అని చెప్పుకొచ్చారు.

కలసి చేసే సాయం..
ఓ మంచి పని చేసే యత్నంలో అందరి మనోభావాలు తెలుసుకొని అడుగేస్తే ఫలితాలు బావుంటాయి. ఈ సమస్యను అధిగమించడం కోసం ఏం చేస్తారో వివరించారు గూగుల్‌ గ్రూప్స్‌లో 'ప్రమదావనం' బృందంతో సేవా కార్యక్రమాలు చేస్తోన్న గృహిణి జ్యోతి వలబోజు. 'ప్రతి ఒక్కరి అభిప్రాయానికీ విలువిస్తాం. బాగున్న ఆలోచనకు మద్దతిస్తాం. పేరుకు ఆన్‌లైన్‌ ఫ్రెండ్సే అయినా ఎక్కువ మంది సభ్యులుండేది హైదరాబాద్‌లోనే. అందుకే తరచూ కలుస్తుంటాం. ప్రతీ కార్యక్రమానికి ప్రణాళిక వేసుకుంటాం. కర్నూలు వరద బాధితులకు సాయం, వృద్ధాశ్రమాల్ని సందర్శించి అవసరమైనవి సమకూర్చడం, రోడ్డుపక్క ఎండకి వానకి చలిలో గజగజలాడే వారికి దుప్పట్ల పంపిణీ.. లాంటివన్నీ అలా చేసినవే. ఏ ఒక్కరికీ భారం కాకుండా పనుల్ని పంచుకుంటాం' అంటారు.







అనురాగాల మాలిక
సమాజంలో కష్టాలని, కన్నీళ్లని కొంతైనా దూరం చేయగలిగితే చాలనే సద్భావంతో ఆన్‌లైన్‌లో కలిసి... సేవతో సాగుతోన్న బృంద సభ్యుల మధ్య చక్కని అనుబంధం పెనవేసుకుపోయింది. ఒక బృందం అంటే ఒక కుటుంబం అన్నట్టు మెలగుతారు. 'అభిలాష' బృందం సభ్యురాలు, ఇంజినీరింగ్‌ విద్యార్థిని తేజస్విని ఏమంటుందంటే 'అక్కా, చెల్లి, అన్నా అని ఆత్మీయంగా పిలుచుకునే పిలుపులే కాదు.. వీటన్నింటిని మించిన సేవాభావం మా అందరినీ ఏకతాటిపై నడిపిస్తోంది. తరచూ కలుస్తూ ఉంటాం. ఒకరి కష్టాలు ఇంకొకరం తెలుసుకుంటాం. ఎవరైనా మూడీగా కనిపిస్తే.. 'ఊర్కోరా.. కష్టాల్లో ఉన్నవారందర్నీ గట్టున పడేస్తున్నాం, నిన్ను పడేయలేమా' అంటూ ఊరటనందిస్తాం.. అంత చనువు మాకు' అని ఆ అనుబంధాల తీరుని వివరించారు. యువ బృందంగా పేరొందిన అభిలాషలోని అమ్మాయిలు స్వైన్‌ఫ్లూ సమయంలో మందుల పంపిణీ చేశారు. వికలాంగుల్ని ఆదుకోవడంలో ముందుంటారు. 'పండుగలకు, పుట్టిన రోజులకి పాఠశాలలు, వృద్ధాశ్రమాలకు వెళతాం. ఆ రోజంతా అక్కడి వారితో గడుపుతాం. మాకు తోచిన సాయం అందించి వస్తాం. త్వరలో మా బృందం తరఫున ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధిచేయాలనే ఆలోచనలో ఉన్నాం' అని తెలిపారు దాన్లో సభ్యురాళ్లు సుప్రియా రెడ్డి, స్రవంతి. మీరూ ఇలాంటి వారితో జత కట్టాలంటే నచ్చిన సోషల్‌కమ్యూనిటీ వెబ్‌సైటులో మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోండి. ఆ తరవాత కమ్యూనిటీలను ఎంచుకొని వాటిలో సభ్యులుగా చేరిపోవచ్చు.

Saturday, 1 May 2010

ప్రశంసిద్దాం.. మే నెల 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్

మనం కష్టపడి ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్ని మన కోసమూ,మరికొన్ని మన వారి కోసమూ, ఇంకొన్ని సమాజం కోసమూ!! ప్రతీ మనసూ ఎంతటి కష్టానికైనా ఓర్వగలుగుతుంది. ఆ కష్టాన్నిగుర్తించే సాటి మనసు తోడు ఉన్నంత వరకూ!! మనం చేసే కర్మలు భౌతికమైనవైనా, మానసికమైనవైనా అవి కోరుకునేది కొద్దిపాటి స్పందనను. ఓ మంచి పనికి ఓ చిరునవ్వుతో సత్కారం లభిస్తే పొంగిపోని అల్పసంతోషులు ఉండరేమో. శ్రమించి సాధించిన విజయానికి నాలుగు ప్రోత్సాహకరమైన మాటలు ఆయుష్ష్యుని పోస్తాయి. కానీ ఈ మెచ్చుకోళ్లు, ప్రోత్సాహాలు, చిరునవ్వుతో పలకరింపులు ఎదుటి వ్యక్తి నుండి ఆశిస్తాం తప్ప మనమెప్పుడూ ఇతరులకు అందించాలన్న స్పృహను నిలుపుకోం. మనౌషులకు మధ్య సంబంధాలు బలపడాలంటే తాళం వేసిన మనసుని కొద్దిగా తెరిచి నిజాయితీతో అవతలి మనసుకి గాలం వేయడం ఒక్కటే మార్గం. ఓ మంచి పని చేస్తే చిన్న కితాబు అవతలి వారిలో నూతనోత్సాహాన్నినింపుతుంది. మనం నింపిన ఆ పాజిటివ్ ఎనర్జీ ఎన్నాళ్లకైనా మనల్ని చూస్తే వారికి గౌరవం ఏర్పడేలా ఓ స్థిరమైన ముద్రని కలిగిస్తుంది. అందుకే మన విజయాల్ని డప్పులు కొట్టుకోవడమే కాదు మనసు పెట్టి అవతలి వారి విజయాల్నీ, సంతోషాల్నీ, మంచి పనుల్నీ గమనిస్తూ భేషజాలకు పోకుండా ప్రశంసించగలిగితే ప్రపంచం మొత్తం మన ముందు దాసోహం అవుతుది. కారణాలేమైనా మన మనసుల్లో కుంచితత్వం మేటవేసుకుపోతుంది.


ప్రతీ పనిలోనూ లోపాలను భూతద్ధం వేసుకుని చూసి పుల్లవిరుపుగా విమర్శించడానికి అలవాటు పడిపోయాం. ఎదుటి వ్యక్తి శ్రమలో చిత్తశుద్ధిని గ్రహించడం మానేసి లోపాలను మాత్రమే చూపించడం ద్వారా వారి శ్రమకు మనం ఇస్తున్న విలువ ఎంత? ఒక మనసుని మన కుంచిత స్వభావంతో గాయపరచడం వల్ల జరిగే నష్టానికి మనం బాధ్యత వహించగలమా? మనిషిని ప్రశంసించడం చేతకాకపోతే ఫర్వాలేదు గాని ఎక్కడ ఎవరిలో ఏ లోపాలు కనిపిస్తాయా అని డేగకళ్ళతో అన్వేషించే నీచమైన స్వభావాన్ని వీడకపోతే ఏ అనుబంధమూ మనతో రాదు. ' శ్రేయస్సు కోరి లోపాలు చెప్తున్నాం' అంటూ లోపలి ఉద్ధేశం కుత్సితమైనదైనా కొందరు నివురుగప్పిన నిప్పులా వ్యవహరిస్తుంటారు. నిజాయితీతో ఆత్మీయుల ఉన్నతిని కాంక్షిస్తూ లోపాలను సున్నితంగా ఎత్తిచూపితే నష్టం లేదు గానీ ఎలాగైనా ఎదుటి మనిషి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కాంక్షతో వేలెత్తి చూపితేనే మనలోని పైశాచికత్వం మనకే వెగటు పుట్టించేది!! ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కారు.. పుట్టింది మొదలు పోయేవరకు అందరూ పరిపూర్ణత కోసం విభిన్న మార్గాలలో ప్రయత్నాలు చేస్తూ జీవనం సాగించే వారే.. ఆ ప్రయాణంలో చేతనైనంత మానసికంగ, నైతికంగా మనుషులకు మనం బాసటగా నిలువగలిగితే మనమూ మోక్షం వైపు నడవగలుగుతాం. మన దృష్టి ఎప్పుడూ మనల్ని విడిచి ఎదుటి వారి లోపాల వైపే సారించబడి ఉంటే మనిషిగా పతనం అవుతాం. అందుకే విమర్శించడం మానేసి మనలాంటి ప్రతీ మనిషినీ ప్రశంసించడం మొదలుపెడదాం.

మీ నల్లమోతు శ్రీధర్...

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008