Saturday, May 31, 2008

హృదయ సౌందర్యానికి ప్రతిబింబం " స్నేహం " ..

ఎడారిలాంటి జీవితగమనంలో ఒయాసిస్సులా భగవంతుడు మనకు ప్రసాదించిన అనుబంధమే

స్నేహం. మనసు కలత పడినప్పుడు కమ్మని మాటలతో స్వాంతన చేకూర్చాలన్నా.. మన

ఆనందాన్ని మనకన్నా ఎక్కువ ఆనందించాలన్నా..తుంటరి చేష్టలతో ఉడికించాలన్నా మన

తప్పొప్పులను నిర్మొహమాటంగా మన ముందు పరచాలన్నా స్నేహితులను మించిన

అత్యద్భుతమైన అనుబంధం ఏదీ కానరాదు. అనుక్షణం మనల్ని కనిపెట్టుకుని ఉండడానికి

స్నేహితులను సృష్టించాడా భగవంతుడు అనిపిస్తుంది మనసు మూగబోయేటంత గొప్ప

స్నేహం రుచి చూసినప్పుడూ !.. అన్ని మానవ సంబంధాల మాదిరిగానే స్నేహమూ సాంద్రతని

కోల్పోవడం మనందరినీ కలవరపరిచే విషయం.ఉరుకులు పరుగులతో ... జీవనభారంతో అలసిసొలసిన హృదయాలు కమ్మని స్నేహాన్నికూడా

ఆస్వాదించగలిగిన అదృష్టానికి సైతం నోచుకోలేకపోతున్నాయి. జీవనవిధానంతో పాటే స్నేహానికీ

నిర్వచనం మారిపోయింది. ఆర్ధిక సంబంధాలు, అవసరాల ఆధారంగా తాత్కాలికమైన స్నేహాలే

మాటల కోటలు దాటి నిజమైన స్నేహాలుగా చలామణి అవుతున్నాయి. పోటీ ప్రపంచంలో

ఆర్ధికంగానూ, సామాజికంగానూ ముందుకు దూసుకువెళ్ళాలనే తపనతో నాలికపై నర్తించే

లౌక్యపు మాటలతో అదే నిజమైన స్నేహమని భ్రమిస్తూ, భ్రమింపజేసుకుంటూ , ఆత్మవంచన

చేసుకుంటూ సాగించే స్నేహాలు అవసరం తీరగానే దూదిపింజల్లా మటుమాయమవడం అందరికీ

అనుభవైకవేద్యమే. నిష్కల్మషమైన స్నేహం పంచే మాధుర్యం జీవితన్ని మైమరపింపజేస్తుంది.

వ్యక్త పరచడానికి భాష కూడా చాలనంత గొప్ప అనుబంధం స్నేహం. గొప్ప స్నేహితులు పంచే

ఆత్మీయతను చూస్తే .. మన ఆత్మ మననుండి వేరుపడి మన మనస్సుని ఆహ్లాదంలో

ముంచెత్తడానికి స్నేహితుల తనువులోనికి పరకాయ ప్రవేశం చేసిందా అనిపిస్తుందిమన కష్టంలో తల్లడిల్లుతూ, మన ఆనందంలో ఉప్పొంగిపోతూ మనమే తామై, తామే మనమై

ప్రజ్వల్లించే అటువంటి గొప్ప హృదయాల్లో ఎన్ని జన్మలెత్తినా ఒదిగిపోయి సేదదీరాలనే అనిపిస్తుంది.

అంతటి హృదయసౌందర్యం కలిగిన స్నేహితులను పొందడం నిజంగా పూర్వజన్మ సుకృతమే.

అపూర్వమైన ఆత్మీయతానురాగాలను పంచే స్వచ్చమైన స్నేహాన్ని పదికాలాల పాటు

పదిలపరచుకోకపోతే జీవితాంతం వగచినా ప్రయోజనముండదు. గొప్ప స్నేహన్ని పొందడాన్ని

మించిన జీవితంలో మరేది ఉండదేమో! ఆస్థులు, అంతస్థులు,భజనలు చేసే మందీ మార్బలం

లేకపోయినా.. ఒక్కడంటే ఒక్క స్నేహితుడు మోరల్‌గా అందించే సహకారం మన వెంటే ఉంటే

ప్రపంచాన్ని జయించవచ్చు. జీవితపు ప్రతీ మజిలీలో మనకు బాసటగా నిలిచే స్నేహతత్వాన్ని

ఎల్లప్పుడూ స్వచ్చమైన మనసుతో పరిరక్షించుకుందాం.నల్లమోతు శ్రీధర్ ..

Friday, May 30, 2008

నమ్మకాలు - నిజాలు


సోమవారం శివుడు, మంగళవారం దుర్గామాత, ఆంజనేయుడు, బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వేంకటేశ్వరుడు. ఇలా మనం పూజలు చేస్తుంటాము. అందరికి ఏదో ఒక నమ్మకము ఉంటుంది. అలా చేస్తే వాళ్ళకు అన్ని శుభాలే జరుగుతాయని గట్టిగా నమ్ముతారు. పాటిస్తారు కూడా. అది వారి జాతక ప్రభావమో, యాద్రుచ్చికమో చాలా సార్లు అవి నిజమవుతాయి.

నా విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. నేను దుర్గామాతను మనస్పూర్తిగా నమ్ముతాను. నేను ఏ పని చేసినా ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకుని , ఆ పని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి తగిన ధైర్యాన్ని కోరతాను. ప్రతి మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెడతాను. ఎన్నో క్లిష్టమైన సమస్యలు తీరాయి కూడా . ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో. అలా అని అమ్మా నీదే భారం అని గాలిలో దీపం పెట్టను. కాని ఎప్పుడు నాకు సంబంధించిన శుభవార్తలు కాని, నాకు సంతోషం కలిగించే సమాచారం కాని మంగళవారం రోజే తెలుస్తుంది.

ఇలా మీకు కూడా జరుగుతుందా?????

Tuesday, May 27, 2008

చదువుకున్న పశువులు ...


ఇదేంటీ అనుకుంటున్నారా? ఇంతకంటే మంచి పేరు నాకు తట్టడం లేదు మరి. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయక తప్పడం లేదు. అమ్మాయిలు కూడా ప్రతి రంగంలోనూ అబ్బాయిలతో సమానంగా సై అంటున్నారు. చదువుకునేటప్పుడు ఎలాగూ అబ్బాయిల వేధింపులు తప్పవు. కాని ఉద్యోగంలో చేరాక అందరూ ఒక భాధ్యతాయుతమైన పదవిలో ఉండి పనిచేస్తారు. అక్కడ అల్లరి వేషాలకు తావుండదు. కాని ఇది కూడా అసంభవమే. ఎందుకంటే లైంగిక వేధింపులు అనేవి మహిళలకు ఎక్కడైనా తప్పేటట్టు లేవు. ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం కత్తి మీద సాములా మారింది.ఏరోజు ఏం జరుగుతుందో తెలీదు. రోడ్ల మీదే పని పాటాలేనివాళ్ళు వేధిస్తారు అనుకుంటే పొరపాటే. చదువుకుని , ఒక గౌరవమైన పదవిలో ఉండి కూడా మహిళలను లైంగిక వేదింపులకు గురిచేసేవాళ్ళు ఎందరో ఉన్నారు.


ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నాలుగు నెలలక్రిందే ఉద్యోగంలో చేరిన మా అమ్మాయికి ఇలాంటి అనుభవం కలిగింది. ఆ వెధవకు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఒకసారి ఎదో పని మీద మా ఇంటికి వస్తే టీ ఇచ్చి మాట్లాడాను కూడా. మా అమ్మాయి ఎంతలా బాధపడిందో కళ్ళారా చూసాను కాబట్టి ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. అంత మంచి ఉద్యోగం వదులుకోలేదు. తన పనేదో తను చేసుకుంటుంది. అయినా అతను అలా ప్రవర్తించినందుకు నిజంగా షాక్ అయ్యింది. ఇలాంటి సమస్యే రమణిగారికి కలిగింది. కాని తను సమయస్పూర్థిగా తప్పించుకుంది.నేను మా అమ్మాయికి ఒకటే చెప్పాను " ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకు ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది.ఏడిస్తే పని కాదు. ధైర్యంగా ఉండాలి.వెళ్ళి ధైర్యంగా దులిపేయ్. మళ్ళీ అలా చేస్తే మా మమ్మీ వచ్చి వాళ్ళావిడతో వచ్చి మాట్లాడుతుందంటా" అని చెప్పమన్నా. ఇందులో నా ప్రమేయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తనకు ఇది మొదటిసారి. ఇక్కడ ముందు తనకు ధైర్యం కావాలి. ఇంట్లోవాళ్ళు ఇలాంటి విషయాల్లో తోడుగా ఉంటే ఎంతో ధైర్యం వస్తుంది. తర్వాత వాళ్ళే ఎలాంటి సమస్య అయినా ఎదుర్కొంటారు.


ఆడవాళ్ల మీద వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే చదువు,సంధ్య సంస్కారం లేని వాళు చేస్తున్నారనుకుంటే పెద్ద పెద్ద కంపెనీల్లో , ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న చదువుకున్న పశువులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అసలు వీళ్ళు ఏమనుకుంటారు. తమ జల్సాల కోసమో, టైం పాస్ చేయడానికో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా? ఉద్యోగం చేసే మహిళలకు ఎన్ని తిప్పలో ఒక్కసారైనా ఆలోచిస్తారా? Do they think working women are available?ఇలాంటి పశువులను రోజు చూడక తప్పదు. కాని వాళ్ళ నుండి తమను తాము రక్షించుకుంటూ ఉండాలా? నేను చెప్పేది ఒక్కటే . "అమ్మాయిలూ! ముందు మీరు ధైర్యంగా ఉండండి.ఆత్మవిశ్వాసం ఉంటే మీరు ఎటువంటి సమస్యనైనా సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. కాని కొన్ని జాగ్రత్తలు పాటించండి. అది మీకోసమే. చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆకతాయిలను ఎదుర్కోవడానికి తయారు చేసిన పెప్పర్ స్ప్రే లాంటివి కొనుక్కుని ఎప్పుడు మీ బ్యాగులో ఉంచుకోండి. ఇకా ఆఫీసుల్లో ఇలాంటి పసువులు కనుక తగిలితే , అధికారులకు చెప్పే కంటే ముందు మిగతా ఆడవాళ్ళను కలుపుకుని వాడికి మర్చిపోలేని శాస్తి చేయండీ. అందరు కలిసి తన్నండి, వీలైతే మొత్తం ఆఫీసు స్టాఫ్ ముందు. తర్వాతే అధికారులకు ఫిర్యాదు చేయాలి.మీలో ఒకరు ఎప్పుడు ఇలాంటివి గమనిస్తూ ,అలా ప్రవర్తించివాళ్లను హెచ్చరించి, వినకుంటే ఉతికేయాలి. ఇది సినిమా సీను లా అనిపిస్తుంది కదా. లేదు మూడు నెలల క్రింద హైదరాబాదులో జరిగింది. హాస్టల్లో ఉండే అమ్మాయికి ఒకడు ఊరికే ఫోన్ చేసి సతాయిస్తుంటే ఒక అమ్మాయి తన స్నేహితురాళ్లతో కలిసి వాడిని పిలిపించి అందరూ కలిసి బాగా తన్ని పోలీసులకు పట్టించారు. So nothing is impossible , if ur brave to handle the situation ...

ఇంతకూ ముందు ఒక బ్లాగులో ...ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, వేధింపులకు కారణం వారి వేషదారణ అని చర్చ జరిగింది. కాని మా అమ్మాయి ఎప్పుడూ పంజాబీ డ్రెస్సులు వేస్కుంటుంది. రమణి గారు నిండుగా చీరలోనే ఆఫీసుకు వెళ్తారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది..

Monday, May 26, 2008

ప్రమదావనం - 3

ఆలస్యంగా మొదలైనా అందరు భామలు రాకున్నా ప్రమదావనం మూడవ సమావేశం (25.5.08) సరస సల్లాపాలతో , సీరియస్ చర్చలతో జరిగింది.


హాజరైన ప్రమదలు:


జ్యోతి

జ్ఞాన ప్రసూన

సత్యవతి

తెరెస

స్వతి

సుజాతశ్రీ

రమణి

స్వాతి చక్రవర్తి


అందరూ ఆలస్యమైందా అనుకుంటూ ఒకరివెనకాల ఒకరు వచ్చేసారు. పాపం ఇద్దరు సుజాతలతో చిక్కే వచ్చింది. మనందరికోసం సుజాత (మనసులో మాట ) తన పేరుని మరోసారి మార్చుకున్నారు .ఈసారి జ్ఞానప్రసూనగారు భేషైన సలహా ఇచ్చారు.ఎంతైనా అనుభవజ్ఞులు కదా. సుజాతా శ్రీనివాస్ అని మరీ పొడుగు పేరు కాకుండా నాజూగ్గా సుజాతశ్రీ అని పెట్టుకోమన్నారు. అందరికి నచ్చింది. సత్యవతి గారు రెండు రోజుల క్రింద హటాత్తుగా చనిపోయిన తన స్నేహితురాలు డా.భార్గవీరావు గారి గురించి చెప్పారు. భార్గవిగారు రచయిత్రి, అనువాదకురాలు,, ఇంకా నిజాం కాలేజీలో ఇంగ్లీషు ప్రొఫెసర్.


ఇక్కడ ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. రోజు సత్యవతిగారు కొండేపూడి నిర్మలగారిని ప్రమదావనానికి ఆహ్వానించారు.కాని ఎందుకో ఆవిడ రాలేదు. ఆవిడ కూడ బ్లాగరే కదా. ఏంటో మరి ఇప్పుడు రాయడం లేదు. సత్యవతి గారు తన భూమిక పత్రికతో పాటు భూమిక హెల్ప్ లైన్ అని బాధిత మహిళల కోసం సహాయ కార్యక్రమం విజయవంతంగా నడిపిస్తున్నారు.


ఈసారి అందరు కలిసి నన్ను హాట్ సీట్ మీద కూర్చోబెట్టారు. నాకేంటి భయం ఓకే అన్నా. చూద్దాం ఎవరు గెలుస్తారో అని.

సుజాతశ్రీ, రమణి , సత్యవతి , తెరెసా కలిసి నా బాల్యం , ప్రేమ కథ అడిగారు.


జ్యోతి : ఏముంది. అందరిలాగే నార్మల్. కాని ఒక్క కూతురిని అవ్వడం తొ కాస్త గారంగానే పెరిగాను. పుట్టింది , పెరిగింది అంతా హైదరాబాదు పాతబస్తీ. చిన్నప్పుడు అందరితో కలిసేదాన్ని కాదు. తక్కువ మాట్లాడేదాన్ని. నాకు గర్వం అనే పేరు కూడా ఉండేది. చిన్నప్పటినుండి అమ్మాయిల స్కూలు, కాలేజీలు. అల్లరి లాంటివి లేవు. ఇలా అంతర్జాలానికి వచ్చాకే అల్లరి మొదలైంది. బ్లాగు గుంపులో మొదట్లో ఎక్కువ అల్లరి చేసింది నేనే.. అందరికీ తెలుసు. గుంపులో కాదు నీ బ్లాగు తెరుచుకుని అక్కడ చేయమని గొడవ చేసి నాతో బ్లాగు మొదలెట్టించారు.


ఇక ప్రేమలు దోమలు అస్సలు తెలీవు. చదువుకుంటుండగానే పెళ్ళి చేసేసారు. ఏం చేస్తాం తప్పదని తప్పేదిలేదని మావారినే ప్రేమించడం మొదలుపెట్టాను. కాని నన్ను ప్రేమించేవాళ్ళు చాలామంది ఉన్నారు లైన్లో. గొడవ చేస్తారు ఇలా మాకంటే ముందుగా ఎందుకు పుట్టారు. లేకుంటే ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకునేవాళ్లం కదా అని. నేను చెప్పా వచ్చే జన్మలో ప్రయత్నించండి. కాని ఇంకా వెతుకుతున్నా మావారికంటే బెట్టర్ క్యాండిడేట్ దొరుకుతాడేమో అని ?


తర్వాత సత్యవతి గారివైపు గాలి మళ్ళింది.


సత్యవతి : నాది ప్రేమ వివాహం . నిప్పుల మీద నడిచి సహచరున్ని పట్టుకున్నా. అతనితో కలిసి జీవితమంతా పువ్వులు పరుచుకున్నా. అప్పుడు తను చెట్టుకింద ప్లీడరు. ఇప్పుడు హైకోర్టు జడ్జి.


కాని అందరూ ఒప్పుకున్నది ఏంటంటే సంసారంలో గొడవలు లేకుంటే మజా లేదని. అస్తమానం తీపి తింటే మంచిది కాదు , కాస్త ఘాటైనా మసాలాలు తగలాలి. మధ్యలో కాకరకాయ ప్రహసనం. కాకరకాయ సంఘం పెట్టేవరకు వెళ్ళింది చర్చ.
కొద్దిసేపు రమణిగారు కాకినాడ విహారయాత్ర వివరాలు ముచ్చటించుకున్నాక రమణిగారి సమస్య చర్చకు వచ్చింది.


రమణి : నా వృత్తి రిత్యా ప్రభుత్వ ఆఫీసులో ఒక పేమెంట్ కలెక్ట్ చేసుకోవాల్సి వుంది. అక్కడికి వెళ్తే, సీనియర్ అధికారి రకంగా లైంగిక వేధిపులకి గురి చేసారు. అలాగే ఫోన్ ద్వారా కూడా వేధింపులు జరిగాయి,ఫోన్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళి చెక్ చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళి చెక్ చెయ్యాలి మీరు రండీ అనే వేదింపులు మొదలయ్యాయి. సమస్యకి ఎదో ఒక టైం లో మన మహిళలమందరం (ఉద్యోగం చేస్తున్నవారు/చెయ్యని వారు) గురి అవుతున్నవాళ్ళమే. ఇలాంటి సమస్య వస్తే ఎవరికి వారం ఎలా ఎదుర్కొంటాము? సమస్యకి పరిష్కారం ఏంటి. అధికారి హోదా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, కఱ్ఱ విరగకూడదు, పాము చావకూడదు అన్న రీతిలో.


తెరెసా: నాకు ఇంతవరకు ఇలాంటి సమస్య రాలేదు కాని ఇలాంటి విషయాలు మనమే తేల్చుకోవాలి.అతడిని హెచ్చరించి లేదా పై అధికారులకు చెప్పి. లేదా ఎవ్వరికి తెలీకుండా వాడిని తిట్టేసి బయటపడడం.


స్వాతి : నేను మధ్యే ఉద్యోగంలో చేరాను. ఇలాంటి సమస్య వస్తే ఆయనకే చెప్తాను.


సుజాతశ్రీ : అలా కాకుండా ఒక చిన్ని కెమెరా తీసికెళ్ళి అతని మాటలు రికార్డ్ చేస్తే మనకు దొరికినట్టే కదా.లేదా TV 9 వాళ్ళకి చెప్తే సరి. అంతా చండాలం చేసేస్తారు.


తెరెసా : కాని చండాలంలో అనవసరంగా తన పేరు కూడ చేరుతుంది.


స్వాతి : రమణిగారు ఆఫిసర్ నంబర్ ఇస్తే మా ఆయన వారానికో కోటింగ్ ఇప్పిస్తారంట.


రమణి : నేను ఎంచుకొన్న పరిష్కార మార్గం: క్రమంలో రోజు రండీ క్రాస్ చెక్ చెయ్యాలి ఒక్క 2 మినిట్స్ లో అయిపోతుంది అని ఫోన్ చేసినప్పుడు సదరు అధికారి ఫోన్ చేసినప్పుడు "తప్పకుండా వస్తాను సర్! కాకపోతే కొంచం ఆలస్యం అవుతుంది , ఎందుకంటే ఈమధ్య వారం రోజులనుండి ఎవో మిస్డ్ కాల్స్ , రాంగ్ కాల్స్ వస్తున్నాయి, సో! అన్నయ్యకి తెలిసిన ఎవరో పోలీస్ హైయ్యర్ అఫ్ఫిషియల్స్ దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, దానిలో భాగంగా నేను నా సెల్ లో నంబర్స్ అక్కడ ఇచ్చి వస్తున్నాను, రోజు వచ్చిన కాల్స్ వాళ్ళు చెక్ చేస్తున్నారు, సొ! నాకు కొంత టైం కావాలి మీ నంబర్కి కూడా ఫోన్ చెయ్యొచ్చు అయినా, పర్వలేదు నేను చెప్తాను మీరెంత మంచివారో అని..".

ఆతరువాత రోజు నాకు అతని(అధికారి) ఆఫీసు (ప్రభుత్వ ఆఫీసు) లాండ్ లైన్ నుండి ఫోన్, చెక్ రడీగా వుంది, ఆఫిస్ కి వచ్చి ఇస్తున్నానని, పనిలో పనిగా, మాడం నా నంబర్ మీ ఫోన్లో సేవ్ అయి వుందా. (గొంతులో కంగారు తెలుస్తూనే వుంది).


జ్యోతి : కాని ఇది అన్నివేళలా పని చేయదు కదా.


రమణి : అవును ఇప్పటికి సమస్య తీరింది.ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో.ప్రతీసారి వేర్వేరుగా ప్రయత్నించాలి.


జ్ఞాప్రసూన : విషయంలో ఇంట్లోవాళ్ల సహకారం కూడ ఉంటే మంచిది.


అనుభవజ్ఞులైన ప్రసూనగారు ఇంకో మంచి సలహా ఇచ్చారు. పొద్దునే పెళ్ళానికి టీ కాని కాఫీ కాని ఇస్తే రోజంతా ఎంతా బాగుంటూందో మగాళ్ళకి తెలీదు అని. ఈసారి శ్రీవారితో కలిసి నౌకావిహారానికి తయారవుతున్న తెరెసా గారిని కాస్త ఆటపట్టించి అందరూ సెలవు తీసుకున్నాము.


నిజంగా జాణలందరూ కలిస్తే నెరజాణలే ..వారిని ఆప తరమా?

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008