Thursday, June 25, 2009

చదువు (కొందామా) కుందామా?

జూన్ వచ్చేసింది. స్కూళ్ళు తెరిచేశారు. ఐతే ఎంటంట.. ప్రతి ఏడాది జరిగేదేగా.

ఈసారి ఒక వింత చెప్తాను. తల్లితండ్రులు ఈ ఫీజులు భరించలేము, మేము చదువు కొనలేము అని ఆగ్రహావేశాలు వెలిబుచ్చుతున్నారు. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ళలో ఫీజులు విపరీతంగా పెంచేశారు. ఫీజు కాక సదుపాయాలు అని అదనపు వడ్డింపులు.. రెట్టింపు కాదు మూడింతలు నాలుగింతల ఫీజు పెంచేశారు. ఈ ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం దయ తలిచి ఒక కమిటీ వేసింది. ఈ బాధిత తల్లితండ్రులు ఆ కమిటీ ముందు భోరు మన్నారు. ఆగ్రహించారు. .. విద్యాశాఖను జాడించి ఉతికేసారు. అధికారులు ఎం చెప్తారు. సైలెంట్..

ఇక ఈ పెద్ద స్కూళ్ళ ఫీజుల ధరవరలు ఎలా ఉన్నాయంటే.. ఎల్.కే.జి కి దాదాపు 85 వేలు , పుస్తకాలకే 11 వేలు, ఇక డ్రస్సులు, , బూట్లు కూడా స్కూల్లోనే కొనాలి. స్కూలు వారిచే సదుపాయాలు అంటే.. అన్ని క్లాసుల్లో ఏ.సి , మినరల్ వాటర్, బస్సు కూడా ఏ.సి. కంప్యూటర్లు. ఇలా ఎన్నో ఎన్నెన్నో. మరి వాటికి డబ్బులు మనమే కట్టాలిగా. దినదినం ధరలు పెరుగుతున్నాయి. ఫీజులు పెంచకుంటే స్కూలు వాళ్లు బ్రతికేది ఎలా.

దీనికి కారణం ఎవరు?? అన్ని వేలు, లక్షలు కట్టి చదివిస్తే కాని చదువు రాదా? వాళ్ళు చెప్పేది ప్రత్యేకమైన చదువా?? సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వచ్చే జీతల ధీమాతో తల్లితండ్రులే ఈ స్కూళ్ళను పెంచి పోషిస్తున్నారు. డబ్బుంది కదా అని తమ పిల్లలకు చిన్నప్పటినుండే హైటెక్ సదుపాయాలు ఇవాలనుకున్నారు. ఒక కే.జి పిల్లాడికి ఏడాదికి తక్కువలో లక్ష కట్టాల్సిందే. నేలజీతాలే లక్షల్లో ఉంటే ఈ ఫీజులో లెక్కా? పైగా తల్లితండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలను చూసుకోవడానికి, చదివించడానికి వారికి తీరిక లేదు. సో .. డబ్బులు కట్టి ఆ భాద్యతలు స్కూలు వారిపై వేసేస్తున్నారు. ఇపుడు ఆర్ధిక మాంద్యం వల్ల అందరికి డబ్బులకు కటకటగా ఉంది. ఇంతకూ ముందు లెక్కలోకి రాని స్కూలు ఫీజులు ఇపుడు భారమైనాయి. సంపాదనకు అలవాటు పది చదువును ఒక వ్యాపారం లా మార్చిన యాజమాన్యం వారు ఫీజులు పెంచుతున్నారు. వారికి కావలసింది డబ్బు., లాభాలు. ఎవరెలా పొతే వారికేంటి.. ఇంతకు ముందు కూడా ఇంగ్లీషు మీడియం, కాన్వెంట్ స్కూళ్ళు ఉన్నాయి. కాని చదువు కూడా హైటెక్ కావాల్సి వచ్చింది. అందుకే ఈ హైటెక్, కార్పోరేట్ స్కూలు వెలిసాయి. మూడు ఫీజులు, ఆరు డొనేషన్లు లా దినదినాభివృద్ధి చెందాయి. ఇపుడు వాటిని భరించలేకపోతున్నారా ?? దీనికి కారణం తల్లితండ్రులు. వాళ్లు మారాలి ముందు. ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుతుంటే ఊరుకున్నారు. ఇపుడు ఊరుకోక తప్పదు. లేదా దానికి పరిష్కారం వెతకాలి. అసలు ఐదో తరగతి నుండే ఐ.ఐ.టి కోచింగా ??? పొద్దున్న ఆరుగంటలకు వెళితే ఇంటికొచ్చేసరికి రాత్రి ఎనిమిది. వాళ్ళను దింపడానికి తల్లితండ్రులు కూడా కష్టపడుతున్నారు. అసలు తల్లితండ్రులనే పరిక్షలు రాయమంటే సరిపోతుంది. ఈ తల్లితండ్రికైనా తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. దానికి ఆ పిల్లల బాల్యాన్ని బలి పెడుతున్నారు. కాలేజి పిల్లల బ్రతుకు కూడా అలాగే ఉంది. రెండు మూడు కాలేజీలే తప్ప మిగతావి పనికిరాకుండా పోయాయి. వాళ్ళేమో బాగా చదివే పిల్లల మీద ఎక్కువ శ్రద్ద తీసుకుని ర్యాంకులోచ్చాయోచ్ అని డప్పు కొట్టుకుంటున్నారు. దానితో వల్ల వ్యాపారం ఇంకా అభివృద్ది చెందుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి చోటా వ్యాపారమే.. దీనికి అంతం లేదా..

ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి విజయాలు ఎందుకుండవు. అసలు అవి అసలు కళ్ళకు కూడా కనపడవెందుకు. అక్కడ చదివించే పుస్తకాలు సిలబస్ వేరేనా.. కాదె.. కార్పోరేట్ స్కూళ్ళలో పెట్టె ఫీజుల్లో సగం పెట్టి మంచి అధ్యాపకులను పెట్టి తమ పిల్లలను అక్కడ చదివించలేరా. ఆ చదువుకు ప్రభుత్వ గుర్తింపు ఉండదా.. పదో క్లాసు పరీక్ష రాయనివ్వరా .. అదేం లేదే.. పెద్ద చదువులు చదివి , ఉద్యోగాలు లేనివారెందరో ఉన్నారు. ప్రభుత్వం తో మాట్లాడి తల్లితండ్రులే ఈ విషయంలో ముందడుగు వేయాలి. తమకు కానీ ఖర్చు లేదంటే ప్రభుత్వం ఎందుకు నో అంటుంది.

ఇది చాలా చీప్ గా ఉందా.. ఐతే మీ ఇష్టం. మా బాబుకు ఇరవై ఏళ్ళ క్రింద ఒక పెద్ద స్కూలులో (పేరు గొప్ప ఊరు దిబ్బ అని తర్వాత తెలిసింది) ఎల్.కేజీ కోసం యాభై వేలు అడిగారు. ఒక స్కూలులో నలభై వేలు.. నేనివ్వను అని మామూలు స్కూలులో డొనేషన్ లేకుండా చేర్పించాను. ఇచ్చేవాడుంటేనే కదా తీసుకునేవాడికి ఆశ పెరిగేది.. ఆ తర్వాత మనను దోచుకునేది.. :)

Tuesday, June 23, 2009

హ్యాపీ బర్త్ డే విహారి.....సరదా టపాలతో సిధ్ద,బుధ్దలతో బ్లాగ్లోకంలో నవ్వులు వెదజల్లిన విహారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ,సంతోషంగా ఉండాలని మనసారా దీవిస్తు... అక్క...
విహారి... మీ పెద్దపండు, చిన్నపండు ఎలా ఉన్నారేంటి. చాలా రోజులైంది టపాయించడంలేదు..

Monday, June 22, 2009

చెట్టు కథలు - మల్లె చెట్టు

అనుబంధం అంటే మనుష్యులతోనే ఉండాలి, మరీ చెట్లతో మరిచిపోలేని అనుబంధమా?? మరీ చోద్యం కాకపోతే. అని అనేవారు ఎందరో. కాని ఈ రోజుల్లో మనుష్యులు, కుటుంబీకుల మధ్యే సంబంధాలు మరీ ఆధునికము, యాంత్రికము, పలుచనయ్యాయి. ఇక మిగతవాటితో ఏముంటుంది? కొన్ని చెట్లతో మనకు ఇదీ అని చెప్పలేని అనుబంధం ఏర్పడుతుంది చిన్నప్పటినుండి. దాన్ని మనసులోనే ఉంచుకుంటాము. వ్యక్తపరచలేము. కాని పెద్దయ్యాక ఆ అనుబంధం దూరమయ్యాక ఆ ఆలోచనలు, అనుభూతులు మాటల రూపంలో వెలికి వస్తాయి. ఔరా! మాటలాడే మనిషికంటే మాటరాని ఆ చెట్టుతో మనకు ఎంత గాఢమైన అంబంధం ఉంది కదా అనుకుంటాం..నా చిన్నప్పుడు ఇంట్లో ఒక మల్లెచెట్టు ఉండేది. ఏదో మల్లె చెట్టు కాదు. చమేలి . బొద్దుగా, ముద్దుగా నాలుగే రెక్కలతో మత్తైన సువాసనలు వెదజల్లే ఈ పూలంటే నాకు చాలా ఇష్టం.. ప్రాణం అనుకోండి . అమ్మకు కూడా చెట్లు, పూలు అంటే ఇష్టమే కాబట్టి ఇల్లు కట్టేటప్పుడే మల్లె చెట్టు కూడా పెట్టించింది. ఇక వేసవి వచ్చిందంటే మనసంతా ఆ చెట్టు మీదే. ఎలాగు సెలవులు, అప్పట్లో టీవీ, ఫోన్లు లేవు ఆటలన్నీ ఇంట్లోనే.. రోజూ సాయంత్రం కాగానే స్టూలు వేసుకుని ఒక్కో పువ్వు వెతికి కోసి ఒక గిన్నెలో వేసుకొవడం ఒక పెద్ద అలుపురాని పని .. అవన్నీ తీసికెళ్లి అమ్మను సతాయించి దండ కట్టించుకోవడం. మొహాలు కడుక్కుని ఇంచక్కా ఆ పూల దండ తురుముకుని , ఆ చెట్టు క్రింద శుభ్రపరచుకొని ఒక దుప్పటి పరుచుకుని తమ్ముళ్లతో గచ్చకాయలు, అష్టాచెమ్మా వగైరా ఆటలు .. ఇవీ వేసవి సెలవుల్లో క్రమం తప్పని దినచర్య. ఎందుకో ఆ మల్లెచెట్టంటే అంత ఇష్టం .. సాయంత్రం కాగానే ఎర్రని గీతలతో సన్నగా, వయ్యారంగా మొగ్గలేసుకుని రారమ్మని పిలుస్తుంది. కాని ఆ పూలు తెల్లారేసరికి వాడిపోతాయని భలే కోపమొచ్చేది. ఇంకో రెండురోజులుంటే ఏం పోయేది అని తిట్టుకునేదాన్ని. ఏమ్, చామంతి, బంతి ఉండట్లేదా?? ... కాని బంగారూ! నేనిచ్చే పూలు ఒక్కరోజే ఉంటాయని దిగులు పడకు.. రోజూ ఇస్తాగా.. ఎంచక్కా పెట్టుకుందువుగాని అని నన్ను బుజ్జగించేదేమో ఆ మల్లెచెట్టు. పూలదండలో మాత్రం నాకు గజానికి తక్కువ పనికిరాదు. మిగిలింది అమ్మకు. సరే తల్లి .. తీసుకో అనేది.. ఎంతైనా అమ్మ కదా.. ఒక్కోసారి అనిపించేది.. ఈ మల్లెచెట్టు అస్సలు మంచిది కాదు.. మండే ఎండల్లో పూలు ఇస్తుంది. . హాయిగా చలికాలంలో ఐతే ఎంతా బాగుంటుందో కదా. చల్లగా, మంచి వాసనలు.. కాని ఆ కోరిక తీరే అవకాశం లేదని చాలా పెద్దయ్యాక తెలిసింది...రాత్రి భోజనం మాత్రం మల్లె చెట్టుకిందే.. మళ్లీ అన్నీ శుభ్రం చేస్తామనే షరతు మీద అమ్మ ఒప్పుకునేది. కాని తర్వాత తర్వాత ఇంటి రిపేర్లలో సిమెంట్ గచ్చు చేయించడం వల్ల ఆ చెట్టు తీసేయాల్సి వచ్చింది. బాధపడ్డా లాభం లేకుండా పోయింది .. ఇప్పటికీ ఆ విరజాజి మీద అంతే ప్రేమ, ఆప్యాయత ఉంది. మార్కెట్లో గుప్పెడు పూలు కనిపిస్తే చాలు, కొనుక్కోవడమే. చిన్నప్పుడు అంటే పెద్ద ఇల్లు కాబట్టి ఎన్నో చేట్లు ఉండేవి ఇంట్లో . ఇప్పటి ఇరుకిరుకు అపార్ట్ మెంట్ జీవితాలలో నాలుగైదు కుండీలలో చిన్ని చిన్ని చెట్లు పెంచుకోవడం మహా కష్టమైపోయింది. మనసు చావక అదే మల్లె చెట్టు కుండీలో పెంచుతూ,. కనీసం మూడురోజులకొక పూవు పూసినా చాలు అని సంతృప్తి పడిపోవడం. చిన్నప్పటి మల్లెచెట్టును గుర్తుకు తెచ్చుకోవడం తప్ప గత్యంతరం లేదుకదా.. కాని వేసవిలో చమేలి పూలు ఎక్కడ కనపడినా , ధర ఎంత ఎక్కువైనా కొనుక్కోవడం మాత్రం మానను.

Wednesday, June 17, 2009

నన్నుబ్రతికించండి... ఊపిరినివ్వండి..


దేవుడు ప్రతి ఒక్కరికి నిర్ణీతమైన జీవన పరిమాణం, ఆయుస్సు ఇస్తాదంటారు. కాని ఈ చిన్నారి చైతన్య ప్రతి క్షణం మృత్యువుకు చేరువవుతున్నాడు. అతనిని మృత్యువుకు అందనీయకుండా ఆ బాబు మేనమామ తలకు మించిన భారమైనా అష్టకష్టాలు పడి, పరిస్థితులతో పోరాడుతున్నాడు. ఈ విషయం తెలిసి సహాయం చేయాలనుకున్న ప్రమదావనం సభ్యుల కోరిక మేరకు గీతాచార్య స్వయంగా ఆ బాబు ఇంటికి వెళ్లి కనుక్కున్న వివరాలు ఇవి.

ఆ పిల్ల వాడికి ఉన్న వ్యాధి థలసీమియా మేజర్. రక్త హీనత, హిమోగ్లోబిన్ లోపమ్ మొదలైనవి ప్రాథమిక లక్షణాలు.
తెలిసిన డాక్టర్ వద్ద నుంచీ సేకరించిన వివరాల ప్రకారం ఈ వ్యాధి వివరాలు...

ఎర్ర రక్తకణాల హీనత వల్ల కలిగే అతి దారుణమైన ఫలితమే ఈ వ్యాధి. Mean corpuscular volume in blood కనుక 75% కన్న తక్కువగా ఉంటే ఈ వ్యాధి కారకులు గా పరిగణించ వచ్చు. అలాంటి వారికి పుట్టే బిడ్డలకి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం చాలా ఎక్కువ. (ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది).

కనీసం మూడు వారాలకి ఒకసారి రక్తం ఎక్కించాలట. మళ్ళా దాని వల్ల ఎక్కువైన ఇనుము ధాతువుని తీసివేయటానికి 12 గం|| పాటూ చీలేషన్ థెరపీ చేయవలసి ఉంటుంది. ఇలా మూడు వారాలకి ఒకసారి రక్తం ఎక్కించవలసి రావటం ఖర్చుతో కూడుకున్నదే కాక ఆ వ్యాధిగ్రస్తునికి మానసిక వేదన కూడా. (దీనికయ్యే ఖర్చు కనీసం 8000-10000)

వీరిలో ఎర్ర రక్త కణాలు సాధారణమైన ఆరోగ్యవంతునికన్నా తక్కువ సైజులో ఉంటాయి.

దీని వల్ల కలిగే ఇతర పరిణామాలు...

ఆస్టియోపోరిస్, గుండె ఎండోక్రైన్ సమస్యలు, హైపటైటిస్ బీ, సీ, HIV మొదలైన వ్యాధులు తేలికగా సంక్రమించటం.

Bone marrow (ఎముక మూలుగ) operation మాత్రమే ఈ వ్యాధికి ఉన్న ఏకైక శాశ్వత చికిత్స. దీనికయ్యే ఖర్చు... సుమారుగా 15,00,౦౦౦

ఈ కుర్రాడికి వాళ్ళ చెల్లి మూలుగ సరిపోయిందట. ఇప్పటివరకూ దాదాపూ, ఎనిమిది లక్షలు సమకూరాయట. డిసెంబరులో ఆపరేషన్ చేయాలని డక్టర్లు చెప్పారట.


చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇది. మన రాష్ట్రం లో సుమారు 900 మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

ఇప్పటివరకు ప్రమదావనం సభ్యులు సేకరించిన సొమ్ము ఆరువేలు. కాని ఈ బాబుకు ప్రాణదానం చేయడానికి అది సరిపోదు.
బ్లాగర్లు, చదువరులందరికి నా విన్నపము .. బాబుకు బ్రతికే అవకాశమివ్వండి.అతను హాయిగా ఆడుతూ పాడుతూ తిరగాలని బాబు మేనమామ విధితో చేస్తున్న పోరాటానికి చేయూత నివ్వండి. మీవంతు సహాయం అందించండి. వివరాలు మీ స్నేహితులకు, తెలిసినవాళ్ళకు తెలియచేయండి. నీటిబొట్లు కలిస్తేనే సముద్రమయ్యేది .. మనమందరం కలిస్తే చిన్నపాటి సహాయం చేయలేమా.

మరి కొన్ని వివరాలకు చూడండి..

విరాళాలు పంపవలసిన చిరునామా:Monday, June 15, 2009

ఇట్స్ మై చాయిస్ …

అనగనగా అప్పుడెప్పుడో కొత్తపాళిగారు ఐడియాలు ఇచ్చి కథ రాయండర్రా అని చెప్పేవారు గుర్తుందా??? కథ ఎలా రాయాలో తెలీకున్నా ప్రయత్నిస్తే పోయేదేముంది అని నేను రాసాను. బహుమతి రాకున్నా తిట్లు మాత్రం పడలేదు. నయం. గత అక్టోబర్ లో ఇచ్చిన ఒక వినూత్న ఫాంటసీ కథ పోటీకోసం నేను రాసిన కథ నిన్నటి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం లో ప్రచురించబడింది. నేను ఊహించింది వాస్తవం అయ్యే చాన్స్ లేకపోవచ్చు కాని ఇలా జరిగితే బావుంటుంది కదా అనే చిన్ని ఆలోచన ఈ కథ రాయడానికి ప్రేరణ కలిగించింది. అంతకు ముందు రెండు సార్లు కథలు రాసినా, ఈ సాంకేతిక, ఫాంటసీ విషయాలు నా తలకేక్కేవి కావులే అని ముందు ఊరుకున్నాను. కాని కొత్తపాళిగారి ఐడియాతో పాటు తాడేపల్లి గారి వ్యాఖ్య కూడా నన్ను ఈ కథ రాయడానికి ఉత్సుకత కల్పించింది.
ఇదే అంశం మీద మరికొందరు బ్లాగర్లు రాసిన కథలు కూడా చదవండి..

ఇంత మంచి ఐడియా ఇచ్చి, కథ ఎలా రాయాలో మెళకువలు చెప్పిన కొత్తపాళిగారికి నా మొదటి కథ గురుదక్షిణగా సమర్పిస్తున్నాను....


"షాలినీ! వంటైందా? ఆఫీసుకు లేట్ అవుతుంది. రోజూ పొద్దున్నే అరుస్తూ ఉండాలి. ఒక్క పని టైం మీద చేయవు?. పెళ్ళిచూపుల్లో మీవాళ్ళు "మా అమ్మాయి వంటలు బాగా చేస్తుంది, ఇల్లు చక్కగా ఉంచుకుంటుంది. అని తెగ కోతలు కోసారు. చదువు, అందం, కుటుంబం, అన్నీ చూసి పెళ్ళి చేసుకుంటే నా బ్రతుకు ఇలా తెల్లారింది. రోజూ లేట్ అవుతుంది.ఆఫీసులో తిందామంటే అదో అడ్డమైన గడ్డి. ఖర్మ . ఖర్మ.."

" ఇదేంటి ! ఈ సోఫా కవర్లు ఇంకా మార్చలేదు. ఆ టివి మీద దుమ్ము కనపడటంలేదా? ఇంట్లో ఉండి ఏం చేస్తావ్ పొద్దంతా. టీవీ చూడటం తెలుసు ఆ దుమ్ము దులపడం రాదా? ప్రతీది చెప్పాలి. " అని విసుక్కుంటూ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు రమేష్.

"అవును ! ఖర్మ గాక మరేంటి? మీరేమో అన్నీ తెలుసుకుని, చూసి పెళ్ళి చేసుకున్నారు మరి నాకలా లేదే. అమ్మానాన్న చూసి నచ్చికట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేసారు. తప్పదురా భగవంతుడా అని సర్దుకుపోతున్నా కూడా రోజూ ఏదో ఒక తప్పు వెతకడం. ఏ పని చేసినా వంకలు పెట్టడం. నాకు నచ్చిన మొగుడిని వెతుక్కుంటే ఈ బాధ ఉండకపోను. జీవితాంతం ఇలా సర్దుకుపోతుండాల్సిందేనా..??" అని తనలో తానే గొణుక్కుంటు ఇల్లు సర్దడం మొదలుపెట్టింది షాలిని.

************

"హాయ్! మీనా! ఎలా ఉన్నావు? ఏంటి నీకు పెళ్ళి చూపులు జరిగాయంట . అబ్బాయి ఎలా ఉన్నాడు. సంబంధం కుదిరిందా?

" అబ్బాయి బానే ఉన్నాడు. ఇంకా ఏమీ అనుకోలేదే రాజీ! ఆ మధ్యవర్తి చెప్పింది చూస్తే అన్నీ బాగానే ఉన్నాయనిపిస్తుంది. కాని ఎన్ని నిజమో , ఎన్ని అబద్ధమో? నాకేమీ పాలుపోవటం లేదు. నాన్నగారేమో! అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు. చెడు అలవాట్లు లేవు. ఒప్పుకుంటే మంచిది అంటున్నారు. నాకేమో భయంగా ఉంది. సంపాదన బానే ఉన్నా. చెడు అలవాట్లు లేవు అనగానే ఎలా నమ్మేది ఈ రోజుల్లో? తర్వాత బయటపడితే నా బ్రతుకు తెల్లారిపోతుంది కదా? నా అంత నేనుగా అతని గురించి తెలుసుకోవాలంటే కష్టం కదా? పెళ్ళి అంటే రిస్క్ తీసుకోవాల్సిందేనా.?"

" అవునే మీనా! పెళ్ళి ఒక రిస్కే. మనచేతిలో ఏది ఉండదు. అన్నింటికి అడ్జస్ట్ కావాల్సిందే. నాకు రోజు ఈ గొడవ తప్పడంలేదు. నేనేమో ఉద్యోగం నిర్వహణలో రోజూ ఎందరితోనో మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడైనా అర్జెంట్ పని ఉండి ఎవరైనా ఇంటికి కాల్ చేస్తే మా ఆయనతో చచ్చే గొడవ. నేను తెచ్చే జీతం కావాలి కాని నేను మగాళ్ళతో ఫ్రీగా మాట్లాడొద్దు అంటాడు. నాకు ముందే ఈ సంగతి తెలిసుంటే అస్సలు పెళ్ళి చేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఏమీ చేయలేను " అంది రాజీ.

*************

"అబ్బబ్బా! రోజూ ఈ ఆఫీసు, ఇంటిపనితో చచ్చిపోతున్నాను. ఆ పనిమనిషి సరిగ్గా రాదు. ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ అని ఎప్పుడు తింటానో. ఎప్పుడు ఇంటికొస్తానో కూడా తెలియటంలేదు. ఆఫీసు పనయ్యాక, ఇంటికెళ్ళే ఓపిక కూడ ఉండదు ఐనా వెళ్ళి మళ్ళీ ఇంటిపని చూడాలి. క్రష్ నుండి పాపను తీసికెళ్ళి వంట చేసి ఇల్లు సర్దుకోవాలి. అయన ఒక్క పనిలో సాయపడరు. ఏమంటే నా బిజినెస్ టెన్షన్స్ నాకున్నాయి అంటారు. . ఉద్యోగం, ఇంటిపనితో ఒళ్ళు హూనమైపోతుంది ." అనుకుంటూ వంట చేస్తుంది కావ్య.

"ఏమోయ్! వంట ఐందా. ఆకలి దంచేస్తుంది. ఇంకా ఎంత సేపు?" అవునూ. వచ్చే నెల్లో ప్లాస్మా టీవీ కొందామా?" అడిగాడు భర్త రాజు.

" ఆ వచ్చే ! ఐపోయింది !. అందంగా ఉన్నాడు, మంచి బిజినెస్ ఉంది అని పెద్దలు చెప్తే , పెళ్ళి చేసుకుని ఇప్పుడు అనుభవిస్తున్నాను. తను సంపాదించేది సరిపోదన్నట్టు నన్ను కూడా ఉద్యోగం చేయిస్తున్నారు. ఏమంటే అన్నీ ఆడంబరంగా ఉండాలి అంటారు. . బజారుకెళ్ళి నచ్చిన చీరో,నగో కొనుక్కునే అవకాశం ఉంది కాని నచ్చిన మొగుడిని వెతుక్కునే అవకాశం ఆ భగవంతుడు ఆడవాళ్లకు ఇవ్వలేదు " అనుకుంటూ భర్తకు , కూతురుకి భోజనం పెట్టసాగింది కావ్య.

***************

"ఒసేయ్ ! కనకమ్మా! ఎక్కడ చచ్చావే? తొరగా నాకు అన్నం పెట్టు. థూ నీయమ్మ. ఎప్పుడు చూసినా చారు,పచ్చడి మెతుకులే . సంపాదించినదంతా ఏం చేస్తున్నావే?" మొగుడికి కమ్మగా వండిపెడదామన్న బుద్ధి లేదు?" తాగి వచ్చిన మొగుడి అరుపులు విని కోపంతో రెచ్చిపోయింది కనకమ్మా. "ఏంట్రా? తాగి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నావ్?, సంపాదించినదంతా తాగుడుకు, మట్కాలకు పెట్టేస్తావ్ సిగ్గులేని జన్మ.ఇంకా నీకు కోడికూర, చాపల పులుసు పెట్టాలా ? పెట్టింది తిను. అదే ఎక్కువ. చేసుకున్నందుకు జన్మంతా భరించక తప్పదని ఊరుకున్న. లేకుంటే ఎప్పుడో తన్ని తగలేసేదాన్ని. నువ్వు ఇలా


తాగుబోతువని తెలిసుంటే చావనైనా చచ్చేదాన్ని కాని,నిన్ను చేసుకునేదాన్ని కాదు" అని మొగుడిని తిట్టి వెళ్ళి పడుకుంది కనకమ్మ.


ఇలా చాలా మంది మహిళలు తమకు నచ్చని, తమ అభిరుచులకు అనుగుణంగా లేని భర్తలతో వేగలేక, విసిగిపోయి కనీసం తమ కూతుళ్ళకైనా ఇలాంటి పరిస్థితి రాకుండా ఏదో ఒకటి చేయాలి అని నిశ్చయించుకుని , ఆ కాలనీలో ఉన్న అరుణక్కను కలిసారు. ఆవిడ ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. వాళ్ల గోడు విన్న అరుణక్క " ఎందుకు మీరు అంత ఖంగారు పడతారు. ఐపోయిందేదో అయింది. మీలాంటి పరిస్థితి మీ కూతుళ్ళకు రాకుండా ఉండేలా మీరు ప్రయత్నించొచ్చు. ఇన్నేళ్ళు మీ మొగుళ్ళ కోసం మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం అలా ఎన్నో నోములు , వ్రతాలు చేస్తున్నారు కదా. అలాగే ఈ సమస్య కోసం కూడా ఆ లక్ష్మీదేవిని ప్రార్ధించి వ్రతం చేయండి. మనస్పూర్థిగా చేస్తే ఆ అమ్మవారు తప్పకుండా మీ కోరిక తీరుస్తుంది. ఒక వ్రతం ఉంది, దాని పేరు " మై చాయిస్" అంటే మీకు నచ్చిన మగాడినే మీరు మొగుడిగా చేసుకోండి" అని ఆ వ్రతానికి కావల్సిన పూజసామగ్రి, వ్రతవిధానం వగైరా అన్నీ చెప్పింది.


ఇంత మంచి వ్రతం గురించి తెలుసుకున్న అందరు ఆడవాళ్ళూ తమ స్నేహితులకు మొబైల్, SMS, Orkut ద్వారా చెప్పుకుని అందరు కలిసి ఒకే రోజు. ఒక మినీ హాలులో వ్రతం చెసారు. అంతమంది ఆడాళ్ళు కలిసి " ఈ మొగుళ్ళతో వేగలేము తల్లీ ? " అని మొరపెట్టుకుంటే ఆ తల్లి ఊరుకుంటుందా ??..


******


అల వైకుంఠపురములో శేషశయనుడై అరమోడ్పు కనులతో చిరునవ్వు చిందిస్తున్న శ్రీహరిని చూచి లక్ష్మీదేవి

"స్వామీ!" అని గోముగా పిలిచింది.

"ఊ! చెప్పు దేవి!"

"స్వామీ! వింటిరి కదా! నా భక్తురాళ్ల మనోవేదన. దానికి పరిష్కారం లేదా? భక్తపరాయణుడు కదా? దీనికి పరిష్కారం చూపలేరా?"


" అదే ఆలొచిస్తున్నా దేవీ! మీ భక్తురాళ్లకు ఆవేదన ఉండుట మాకుకూడా సంతోషము కాదు."

అంతట అయ్యవారు బ్రహ్మను పిలిచి " కుమారా! త్వరగా ఈ సమస్యను తీర్చే ఉపాయం ఆలోచించు. లేకుంటే పుట్టగతులుండవు. లేడీ కస్టమర్ల సమస్యలు వెంటనే తీర్చాలి . జాగ్రత్త. " అని హెచ్చరించాడు . అప్పటికే దివిలో కూడా అంతా కంప్యూటరైజ్డ్ ఐపోయింది. ముఖ్యంగా బ్రహ్మ తన సృష్టి కార్యకలాపాలు అన్నీ టైం మీద చెసుకోలేకపోతున్నానని ఒక సూపర్ కంప్యూటర్ ఏర్పాటు చేసేసుకున్నాడు. తీవ్రంగా ఆలోచించి ఉన్నవాళ్లని మార్చడం వీలు కాదు అని, పుట్టబోయే ప్రతి అబ్బాయికి ఒక విచిత్రమైన చిప్ ఏర్పాటు చేసాడు. ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాక , ఎవరైనా అమ్మాయి అతడిని మెచ్చి తన భర్తగా చేసుకోవాలని అనుకుంటే ఆ అబ్బాయి గుణగణాలు, చదువు, ఉద్యోగం, జీతం, బ్యాంక్ బాలన్సు, అప్పులు, మొదలైన వివరాలన్నీ ఆ అబ్బాయి నుదుటిలో LED డిస్‌ప్లే లో కనిపిస్తాయి. వాటి ఆధారంగా అతడిని పెళ్ళి చేసుకోవాలో , వద్దో అని అమ్మాయి నిర్ణయించుకోవచ్చు.

పాతికేళ్ళ తర్వాత...

పెళ్ళిచూపులు జరుగుతున్నాయి.


" అమ్మాయిని తీసుకురండి." పెళ్ళికొడుకు తండ్రి అన్నాడు. అమ్మాయి వచ్చి అందరికి నమస్కరించి కుర్చీలో కూర్చుంది. "రాజారాంగారు! మీకు తెలియనిదేముంది. మా అమ్మాయి ఇంజనీరింగ్ చేసి పెద్ద కంపేనీలో ఉద్యొగం చేస్తుంది. పాతికవేల జీతం. అందుకే కట్నం ఇవ్వదలుచుకోలేదు. నా దగ్గరున్న ఆస్థి పిల్లల చదువులకే పెట్టుబడి పెట్టాను. తన జీతమే మీకు కట్నం అనుకోండి. కానీ అమ్మాయికి నచ్చితేనే ఈ పెళ్ళి ముచ్చట్లు ముందుకు కదిలేది." అని మెల్లిగా చెప్పాడు పెళ్ళికూతురు తండ్రి సుబ్బారావు. పెళ్ళికూతురు తల ఎత్తి అబ్బాయిని చూసింది. "పర్లేదు, బానే ఉన్నాడు. మంచి ఫ్యామిలీ, పెద్ద ఉద్యోగం అని తెలిసింది. ఇతడిని చేసుకుంటే బానే ఉంటుందా?" అని అనుకుంది. అప్పుడు విచిత్రంగా ఆ అబ్బాయి నుదురుమీద ఒక LED స్క్రీన్ ప్రత్యక్షమైంది. అందులో " చదువు-పి.జి, ఉద్యోగం మేనేజర్, జీతం - యాభైవేలు, అప్పులు లేవు, ఆస్థి - ఒక ఫ్లాట్, బైకు, బ్యాంకు బ్యాలన్సు - పది లక్షలు, సిగరెట్ మాత్రం అప్పుడప్పుడు తాగుతాడు. బుద్ధిమంతుడు , కాని చాలా మెతక మనిషి. అమ్మ చేప్పిందే వేదం అతనికి " అని కనిపించింది. " అన్నీ బానే ఉన్నాయి. అమ్మ చెప్పినట్టు వినేవాడైతే నేను చెప్తే వినేలా చేయడం అంత కష్టమేమీ కాదు " అనుకున్న అమ్మాయి లోపలికి వెళ్ళి తల్లికి ఓకె అని చెప్పింది. కట్నకానుకలు లేకుండా మరుసటి నెలలోనే వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది.


లత, రామకృష్ణలు మంచి స్నేహితులు. కాని పెళ్ళి గురించి ఆలోచించలేదు. ఒకరోజు వాళ్లిద్దరు గుడిలో కలుసుకున్నారు. "లతా! మనం ఒకరికొకరు బాగా అర్ధం చేసుకున్నామనుకుంటా.నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. మన పెద్దలకు చెప్పి పెళ్ళి చేసుకుందాము. ఏమంటావు?" లత కొద్ది సేపు ఆలోచించింది పాప్‌కార్న్ తింటున్న రామకృష్ణను తదేకంగా చూసింది. అప్పుడు అతని నుదురుపై LED స్క్రీన్ కనిపించింది. అందులో అతని జీతం - 15,000, ఆస్థి - ఒక ఇల్లు, అప్పులు - 50,000, బ్యాంకు బ్యాలన్సు - 4000, ఇద్దరు చెళ్ళెల్లకు చేయాల్సిన పెళ్ళిల్లు, ఆడంబరాలంటే ఇష్టం లేదు. భార్య కూడా పనిచేస్తే తనకు కష్టాలు కాస్త తగ్గొచ్చు ఉన్నదాంట్లోనే సర్దుకుపోయే భార్య కావాలి " అని కనిపించింది. అప్పుడు లత " నేను చేసిన డిగ్రీకి ఏముద్యోగం వస్తుంది. నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఆఫీసులో, ఇంట్లో చేయడం నా వల్ల కాదు. పైగా ఇన్ని బాధ్యతలు. అమ్మో నావల్ల కాదు." అని అనుకుని "సారీ రామకృష్ణ ! నేను పెళ్ళి గురించి ఇంకా ఏమీ ఆలొచించలేదు. మావాళ్ళు ఒప్పుకుంటారనుకోను. పెద్దలను ఎదిరించడం నాకిష్టం లేదు. మనం మంచి


స్నేహితుల్లా ఉందాము" అని లేచి వెళ్ళిపోయింది.

*******

అక్కడ స్వయంవరం జరుగుతుంది. అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి కదా. అమ్మాయిలు తాము కోరుకున్న లక్షణాలు గల అబ్బాయిలను వారి నుదుటిపై కనపడే LED స్క్రీన్‌ల పై చూసి మెచ్చేసారు. అబ్బాయిలకు తమకు అమ్మాయి నచ్చినా , అమ్మాయికి తాను నచ్చుతానో లేదో అన్న టెన్షన్ ఉంది. చివరికి సగం అబ్బ్బాయిలను ఏ అమ్మాయి నచ్చలేదు. అందరూ పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారే. కాని అమ్మాయిలకు వాళ్ళు తగినట్టుగా లేరు మరి.


రాజేంద్ర ఒక పెద్ద కంపెనీలో సిఏ గా పని చేస్తున్నాడు. అతడిని పెళ్ళి చేసుకోవాలని వచ్చిన గీతకు " చదువు సి.ఎ. పెద్ద కంపెనీలో ఉద్యోగంకారు, ఇల్లు, ఆస్థి గట్రా బాగానే ఉన్నాయి. కాని అనుమానం ఎక్కువ. తన భార్య ఉద్యోగం చేయకూడదు. ఇంట్లోనే ఉండి అందరిని బాగా చూసుకోవాలి. " అని కన్పించింది. అది చూసిన గీత ఇలాంటి అనుమానం మొగుడు నాకొద్దు అంటూ చీకొట్టింది అందరి ముందు. అది చూసిన ఏ అమ్మాయి అతని వైపుకు రాలేదు. చాలా సేపు చూసి వాళ్లు అవమానంతో ఇంటికెళ్ళారు. దారి పొడుగునా అతని తల్లితండ్రులు రాజేంద్రను బాగా తిట్టారు. అతడు ఏమీ చెప్పలేక తల దించుకున్నాడు.


చైతన్య గవర్నమెంట్ ఉద్యోగి. అతను కూడా స్వయంవరానికి వచ్చాడు. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్న లీల అతడిని చూసి పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించగానే " ప్రభుత్వ ఉద్యోగం, పదివేల జీతం. ఇంకా లంచం తీసుకునే అలవాటు కాలేదు. ఎప్పుడైనా ఫ్రెండ్శ్ తో కొద్దిగా తాగడం అలవాటు. భార్య ఉద్యోగం చేసినా , చేయకున్నా ఇష్టమే. అప్పులేమీ లేవు. కానీ జీతంతోనే ఇల్లు గడిపే పొదుపరి భార్య కావాలి" అని కనిపించింది. లీల " ఈ కాలంలో ఇంతకంటే మంచి మొగుడు ఎక్కడ దొరుకుతాడు. పైగా పర్మనెంట్ ఉద్యోగం. నాకిష్టముంటే ఉద్యోగం చేస్తాను.లేకుంటే మానేయొచ్చు" అనుకుని వెంటనే పెళ్ళికి ముహూర్తం పెట్టించమంది.


అలా ఆ స్వయంవరంలో సగంమంది అబ్బాయిలు మాత్రమే అమ్మాయిలకు నచ్చారు.


ఇలా ఎన్నో చోట్ల ఇలాంటి సంస్యలు తలెత్తాయి. ఎందరో అబ్బాయిలు పెళ్ళి కాకుండా మిగిలిపోతున్నారు. అంతా గోల గోలగా ఉంది. తమ అందాలు మెరుగులు దిద్దుకోవచ్చు, జీతం అంటే కష్టపడి పెంచుకోవచ్చు. లేదా వేరే బిజినెస్సులో సంపాదించుకోవచ్చు. కాని ఈ గుణగణాలు ఎలా మార్చుకోవడం. అని ఒకటే దిగులు పట్టుకుంది అబ్బాయిలకు , వారి తల్లితండ్రులకు. అసలు ఇలా అబ్బాయి గుణగనాలు ఎలా తెలిసిపోతున్నాయి అని ఆ పిల్లల తల్లితండ్రులు విచారించారు. దీనికి కారణం ఆ అమ్మాయిల తల్లులు చేసిన "మై చాయిస్ " వ్రతం అని తెలిసింది.


దానికి విరుగుడు కనుక్కోవాలని అబ్బాయిలు (ముఖ్యంగా అమ్మాయిలకు నచ్చనివాళ్ళు) వాళ్ల తల్లితండ్రులు కలిసి ఇంటర్నెవట్లోు వ్రతాలు గురించి వెబ్సైట్లన్నీ వెతికారు. కాని ఒక ఆన్ లైన్ గురువు ఆషాఢభవభూతి గురించి తెలిసింది. అందరు ఆ స్వామిని కలుసుకోవాలని తగిన ఫీజ్ క్రెడిట్ కార్డుతో కట్టి తమ సమస్యను వివరించారు." స్వామీ ! పాతికేళ్ళ క్రితం "మై చాయిస్" అనే వ్రతం చేసి అమ్మాయిలు తమకు నచ్చిన, కావల్సిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. అసలే అమ్మాయిలకు కొరత ఎక్కువగా ఉంది. పైగా ఈ పద్ధతి వచ్చి ఎంతో మంది అబ్బాయిలు పెళ్ళీకాకుండా ముదిరిపోతున్నారు. మీరే పరిష్కరించాలి." అని మెయిల్స్ పంపారు. దానికి సమాధానం వారం రోజులకు అందరికి ఒకే విధమైన సమాధానం వచ్చింది. "ఎందుకర్రా! అలా బాధపడతారు. ఏళ్ళ నుండి అమ్మాయిలకు తమ నచ్చినట్లుగా జీవితభాగస్వామిని ఎంచుకునే అవకాశం లేకుండింది. పెద్దలు ఎలా చెప్తే అలా ఒప్పుకుని ఎదురు మాటాడక, తల వంచి తాళి కట్టించుకున్నారు. . ప్రేమించి చేసుకున్నా, ఆ తర్వాత అబ్బాయిల అసలు రంగు బయటపడి బాధపడ్డ అమ్మాయిలెందరో. అందుకే వాళ్లు ఎంతో నిష్టతో వ్రతం చేసి ఆ వరం తెచ్చుకున్నారు. అబ్బాయిలను కూడా అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారో అలా తయారవ్వమనండి. లేదా అబ్బాయిలను కూడ వ్రతం లేదా హోమం చేయమనండి. తప్పేముంది?" అని కుండ బద్దలు కొట్టినట్టుగా ఉంది ఆ మెయిల్.


అది చూసి అబ్బాయిలు " ఇప్పటికిప్పుడు మా గుణాలు మార్చుకోవాలంటే అయ్యే పనా? ఆ వ్రతమేదో చేసేస్తే పోలా?" అని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆ ఆన్లైగన్ గురువు ఆషాడభవభూతి ఆశ్రమానికి వంద డాలర్ల ఫీజు కట్టారు. అది కాస్త ఎక్కువే ఐనా తమ పెళ్ళికోసం తప్పదు అనుకుని వేలమంది ఆ ఫీజ్ కట్టేసారు. రెండురోజుల తర్వాత "చేంజ్ మి" వ్రత విధానం గురించిన మెయిల్స్ వచ్చాయి అందరికి. దాని వివరాలు ఇలా ఉన్నాయి.


" చేంజ్ మి" వ్రతం" ఎంతో కాలంగా పెళ్ళికాని అబ్బాయిలకు ఓక గొప్ప వరం. ఇందులో ఫీజ్ కట్టి చేరిన వారికి ప్రపంచంలోని 21 హిందూ దేవాలయాలో,చర్చిల్లో, మసీదుల్లో ప్రవేశం కల్పించి గుర్తింపు నంబరు ఇవ్వబడింది. ప్రతి అబ్బాయి 108 రోజుల పాటు , రోజూ ఉదయం స్నానం చేసి శుచిగా, ఈ ప్రార్ధనా స్థలాల్లో ఆన్లైబన్ పూజలు చేయాలి. వీరందరికి ప్రత్యేక సర్వర్ ఏర్పాటు చేయబడి. వారి పూజకు ఆటంకము లేకుండా ఏర్పాట్లు చేయబడ్డాయి. చివరి రోజు కొత్తగా పెళ్ళైన అబ్బాయికి తమ శక్తానుసారంగా భోజనం , బట్టలు పెట్టి సత్కరించి, అతని ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ పూజ నిష్టగా చేస్తే అది ముగిసేసరికి అమ్మాయిలకు నచ్చని గుణాలన్నీ మాయమవుతాయి. ఇది నిజము. తప్పక జరుగుతుంది.ఏముంది. పెళ్ళికాకుండా ఉండే కంటే ఈ వ్రతం చేయడం ఉత్తమమని తలిచి మంచి రోజు చూసుకుని అబ్బాయిలందరూ తమ స్నేహితులను కూడగట్టుకుని వ్రతం చేసి చివర్లో భారీ హోమం మొదలుపెట్టారు. " చేంజ్ మీ " . ఉధృతంగా జరిగిన ఆ వ్రతం, హోమం ధాటికి ఇంద్రుడి పీఠం కదిలింది. బ్రహ్మకు దిక్కు తోచలేదు. కంఫ్యూటర్లో వైరస్ వస్తే ఎలాగో దాన్నీ తీసేయొచ్చు. ఇప్పుడు ఈ మనుష్యుల తల రాతలు ఎలా మార్చేది అని మూడు తలలు పట్టుకుని కూర్చున్నాడు. ఎప్పుడు పితృదేవుల నుండి పిలుపు వస్తుందో అని భయపడుతూ. దేవతలందరూ కలిసి అయ్యవారి దగ్గరకు పరిగెత్తారు. అమ్మవారు


సంగతి తెలుసుకుని ముసిముసి నవ్వులు. జరిగిన సంగతి తెలుసుకున్న అయ్యవారు వెంటనే విరించిని పిలిచాడు. "ఏంటబ్బాయ్! ఈ గోల ఏంటి? అప్పుడేమో అమ్మాయిల వ్రతం, ఇప్పుడు అబ్బాయిల వ్రతం,హోమంతో ముల్లోకాలు దద్దరిల్లేలా చేస్తున్నారు. నీ సృష్టికార్యక్రమంలో ఈ అవకతవకలేంటి? అసలే నువ్వు సూపర్ కంప్యూటర్ వాడుతున్నావు." అని అడిగాడు. "తండ్రీ! నేను అదే చూస్తున్నా. అసలే నెట్ ప్రాబ్లం. ఇప్పుడేదైనా మార్పులు చేద్దామంటే వైరస్ అంటుకున్నట్టుంది. నా కంప్యూటర్ సతాయిస్తుంది. నాకేమీ పాలుపోవటంలేదు. మీరే ఏదో దారి చూపండి ప్రభూ!!" అని మొరపెట్టుకున్నాడు విరించి.


అప్పుడు అయ్యవారికి తప్పనిసరై దివినుండి భువికి ఆన్ సైట్ రాక తప్పలేదు..


శ్రీమతి మాటవిని అమ్మాయిల గురించి ఆలొచించి తీసుకున్న నిర్ణయం అబ్బాయిలకు సంకటంగా మారింది కనుక, దానిని మార్చక తప్పదనుకుని ఆ వ్రతం చేసుకున్న అబ్బాయిల అవలక్షణాలు (ముఖ్యంగా తమ భార్యలను బాధించేవి) , మారేటట్టుగా చేసి , "హతోస్మీ!" అనుకుంటు వెళ్ళి శేషతల్పముపై నిదురించాడు. కాని శ్రీలక్ష్మి మొహంలో మందహాసం ఇంకా పెరిగింది సంతోషంతో. ఎలాగైతేనేమి. మొదటి వ్రతంవల్ల అమ్మాయిలకు తమకు నచ్చిన వరుడిని పెళ్ళిచేసుకునే అవకాశం. రెండో వ్రతం వల్ల భార్యలను బాధించే లక్షణాలు అబ్బాయిలలో మాయమవడం.


ఎంతవారలైనా కాంతదాసులే కదా! :)

Friday, June 12, 2009

కలిసుందామా ??? వద్దా ???

అక్కడ ఒక షష్టిపూర్తి ఫంక్షన్ జరుగుతుంది. అన్నదమ్ములు, కొడుకులు , కూతుళ్ళు, మనవాళ్ళు,మనవరాళ్ళు, అక్కా చెల్లెళ్ళు, ఇలా ఎంతో మంది వచ్చారు ఎక్కడ చూసిన పండగ వాతావరణం. ఛలోక్తులు, నవ్వులు, ఆటలు , పలకరింపులతో ఆ ఇల్లు కళకళలాడుతుంది. సాయంత్రం కాగానే అందరూ వెళ్లిపోయారు. మళ్ళీ అలా కలవడం ఎప్పుడో??. ఈ ఆనందాన్ని ఒక మధురస్మృతిగా మనస్సులో దాచుకోవాల్సిందే. తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ.


ఇది ఈనాటి చిత్రం. ఓ యాభై, వందేళ్ళ క్రింద ఇలా ఉండేది కాదేమో. అన్నీ ఉమ్మడి కుటుంబాలే. అన్నదమ్ములు, కొడుకులు , కోడళ్ళు. పిల్లలు అందరు కలిసి ఉండేవారు. ఇంటి పెద్ద మాట అందరూ వినేవారు. గౌరవంతో ఆచరించేవారు కూడా. ఇంట్లో పెళ్లి చేస్తే అది వ్యక్తుల మధ్య కాక కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పడేది. అప్పట్లో ఐదు రోజుల పెళ్ళిళ్ళు చేసేవారు. పెళ్ళికొడుకు వాళ్లు బళ్ళు కట్టుకుని తీరిగ్గా అమ్మాయి ఊరికి వచ్చేవారు. వారి ఆలనాపాలనా ఆంతా అమ్మయివారిదే. అదో ముచ్చట.. కాని ఇపుడు అన్నీ ఒక్కరోజు పెళ్ళిళ్ళు . దానికి కూడా తీరదు కొందరికి. ఎందుకిలా జరుగుతుంది. మనుష్యుల మధ్య అనుబంధం , ఆప్యాయత ఎందుకు కొరవడుతుంది. ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. బయటివాళ్ళు అంటే అనుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్యే దూరాలు. తల్లితండ్రులు చెప్పింది పిల్లలకు నచ్చాడు. వాళ్లకు ఏమీ తెలిదు అంటారు. తమ ఆలోచనలు , అభిప్రాయాలు పెద్దలు అర్ధం చేసుకోవడం లేదు అంటారు. నిజమేనా???

తల్లితండ్రులు, పిల్లల అనుబంధం ఎంతవరకు?? వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్లి వరకేనా. ఆ తర్వాత ??? పిల్లలను మీ బ్రతుకు మీరు బ్రతకండి అని వదిలేయాలా? లేదా ఇంకా మన అవసరం ఉందా?? ఉమ్మడికుటుంబాలలో తప్పనిసరై ఉన్నవారికి ఎప్పుడు కీచులాటలే. భోజనం, పిల్లలు. ఖర్చులు ఇలా ఎక్కడ సర్దుకునే ఉద్ధేశ్యం ఉండదు ఆడాళ్ళకి. ఆ వారికి ఉండదుమగాళ్ళకి. తల్లి ఏమో వంట దగ్గర పని చేయడానికి, భోజనం వగైరా గురించి చూడడమే సరిపోతుంది. తండ్రి ఆ ఇంటికి వాచ్ మెన్. అంతే తప్ప పెద్దల మాట మాత్రం ఎవరికీ నచ్చాడు. వినడానికి కూడా సిద్ధంగా ఉండరు. ఇక కొందరు బుద్ధిమంతులైతే తల్లితండ్రులు తమకు అడ్డమని ఇంటినుండే గెంటేస్తారు. లేదా ఆశ్రమంలో చేరుస్తారు.

ముందు ముందు తల్లితండ్రులే పిల్లలను వేరుగా ఉండమని అనాల్సి వస్తుందేమో. అదే మంచిదనుకుంటా. ఒకరి జీవితంలో ఒకరి జోక్యం ఉండదు. ఏ గొడవా ఉండదు. దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటే ఆ ఆత్మీయతలు నిలిచి ఉంటాయి. ఒకదగ్గర ఉండి రోజూ గొడవ పడేకంటే ఇదే మేలు కదా.

ఈ మధ్య తరచుగా చూస్తున్న ఎన్నో కుటుంబాలలో జరిగే గొడవలు, అలాగే ఒక వ్యాసంలో ఒకే కుటుంబంలో వందమందికి పైగా కలిసి ఉంటున్నారు అనే విషయం చదివి నాలో చెలరేగిన ఆలోచనలు ఇవి.

Monday, June 8, 2009

వంట ఎవరి సొత్తు???

ఒక పెద్ద వివాహ వేడుకలకు వెళ్లి . సుష్టిగా భోంచేసి వచ్చాక " ఆహా! వంటలన్నీ సూపర్ గా ఉన్నాయి. నలభీమ పాకాలే" అనడం సర్వసాధారణం కదా. కానీ.. అసలు వంట ఎవరి సొత్తు. పూర్వకాలం నుండి రాజాస్థానంలో , ఇప్పటి హోటళ్లలో, రోడ్ సైడులో వెలసిన టిఫిన్ బండ్లు, ఉపాహారాశాలలు... పెళ్లిల్లు, కేటరింగ్ .. ఇలా అన్ని చోట్లా వంట విషయానికొస్తే మగవారిదే పెత్తనం. చేతికింద ఆడవాళ్లు ఉంటారు. అది వేరే సంగతి.. అందుకేనేమో ఎప్పుడు చూసినా నలభీమ పాకాలే అంటారు కాని దమయంతి,ద్రౌపది పాకాలు అనరే??? అంతే వంట పని మగవారి సొత్తు అని అర్ధమా??

ఏ పెళ్లిలో ఐనా వంటల కాంట్రాక్ట్ తీసుకునేది మగవారే. ఏ హోటల్ కెళ్లినా వంటిల్లు మగవారి ఆధీనంలోనే ఉంటుంది. ఇక దాదాపు అన్ని టీవీ చానెల్స్ లో మగవారే ఎన్నో రకాల వంటకాలు చేసి చూపిస్తున్నారు. అలనాడు నలుడైనా, భీముడైనా రాజ్యాధికారం ఉన్నప్పుడు వంట చేసిన దాఖలాలు లేవనుకుంటా. అజ్ఞాతవాసం చేసినప్పుడు తప్పనిసరై వంటలు చేయాల్సి వచ్చి . అందులో ప్రావీణ్యం సంపాదించుకున్నారేమో?? అంటే ఏతావాతా తేలిందేంటంటే వంట పనికి మగవారే ఎక్కువ అర్హులని, ఎక్కువ పేరు తెచ్చుకున్నారని. వేరీ గుడ్.

కాని.. కాని...


కాని మన ఇళ్లలో ఇలా జరగదే? వంటిల్లు ఆడవాళ్ల సామ్రాజ్యం చేసేసారు? అందులో మగవారు కాలు పెట్టడం పాపం అనుకునేవారెందరో? ఆడపిల్లలకు పెళ్లి కాకముందే ట్రెయినింగు. వంట నేర్చుకో లేకపోతే కష్టాలు పడతావ్. అత్త ఉంటే ఆరణాలు పెడుతుంది. లేకున్నా అది నీ కర్తవ్యం అని బ్రెయిన్ వాష్ చెస్తారు. పెళ్లి ముందు వంట రాకున్నా తర్వాత నేర్చుకోక తప్పదు. బి.ఏ చదివినా బియ్యంలో రాళ్లేరక తప్పదు అని వాపోవడం సామాన్యమైన విషయం. అది సరే.. వంట బాగుంటే " ఇవాళ కూర బావుంది. రుచిగా ఉంది " అంటే నోటి ముత్యాలు రాలిపోతాయేమో మొగుళ్లకి. ఎప్పుడైనా కొంచం ఉప్పు , కారం ఎక్కువతక్కువ ఐతే సింహాల్లా గర్జిస్తారు " ఇన్నేళ్లైంది నీకు వంట రాదు. మీ అమ్మ ఏం నేర్పించింది. నీ ధ్యాస ఎక్కడ ఉంటుంది." అని. భారీ డైలాగులు. ఏది ఏమైనా తరతరాలుగా ఇంట్లో వంటలు స్త్రీలే చేస్తున్నారు. కాని వంట పనిలో ఉద్యోగాలు, గుర్తింపులు మగవారికే.

అందరు మగవాళ్లు వంట చేయరు అని కాదు. కొందరిళ్లలో ఇంట్లోకి రాని మూడు రోజులు మాత్రం భార్యను తిట్టుకుంటూ , సణుక్కుంటూ ఆవిడ చెబుతుంటే ఎలాగో నానా తిప్పలు పడి వంట కానిచ్చేస్తారు. ఎన్నాళ్లని బయట తింటారు. జేబుకు, ఆరోగ్యానికి చిల్లు పడుతుందిగా :)... మరి అలాంటప్పుదు ఆవిడని కాస్త మెచ్చుకుంటె సొమ్మేం పోయిందంట. ఉహూ .. ఏక్కడో ఏ మూలో ఒక్కరో , ఇద్దరో తల్లికి తర్వాత ఆలికి వంటలో సహాయపడేవాళ్లు ఉన్నారులెండి.

పెళ్లికాకముందు డబ్బులుంటే రోజుకో పూటకుళ్లు అదేనండి హోటళ్లు. డబ్బులు తక్కువుంటే, ఒకవేళ ఆరోగ్యం హర్తాల్ చేస్తే, రోజూ అదే తిండి తిని విసుగేస్తే తప్పనిసరై వంట చేసుకుంటారు అబ్బాయిలు. అలాగే భార్యకు దూరంగా తప్పనిసరై ఉండాల్సి వచ్చినప్పుడు , విదేశాళ్లో ఉండేవాళ్లు తప్పనిసరై వంటింట్లోకి దూరుతున్నారు. కాని పూర్తి ఇష్టంగా ఎంతమంది చేస్తున్నారన్నది డౌట్. ఇలా పెళ్లికిముందు బాగా వంట వచ్చిన మగాడిని కట్టుకున్న అమ్మాయికి మరో రకమైన కష్టాలు. ఆమె చేసే ప్రతీ వంటకు వంకలు పెట్టడం. నేనే చేస్తా అనకుండా, నీకేమీ రాదు , ఉండు నేను నేర్పిస్తా .. నేర్చుకో అని లుంగీ బిగించి వంటింట్లో రంగప్రవేశం చేస్తారు. ఇంకా ఆ అమ్మాయి తిప్పలు చెప్పనలవి కాదు.

కొందరు.. ఉహూ చాలా మంది భర్తలు వంట వచ్చినా కూడా అది భార్యల జన్మహక్కు .. తామెందుకు చేయాలి అని అనుకుంటారు. అలా కాక ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ సగం సమయంలోనే వంట పూర్తిచేసుకోవచ్చన్న నిజాన్ని ఎంతమంది తెలుసుకుంటారో? వంట పని మాది కాదు ఆడాళ్లదే అని నొక్కి వక్కానిస్తారు... కాని స్త్రీలు ఈ వంట పని నాది కాదు అంటారా? లేదు... ఇంతకుముందంటే భర్త ఉద్యోగం చేస్తే , భార్య ఇల్లు, వంట , పిల్లలు చూసుకునేది. వంట తప్ప అన్ని వ్యవహారాలు భర్త కూడా పంచుకుంటే, వంట మాత్రం నాకు చెప్పకు అంటారు. ఇప్పుడు భార్యా, భర్త ఇద్దరూ సమాన స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఐనా ఇంట్లో వంట భాద్యత స్త్రీదే కదా. ఏ మొగుడైనా అయ్యో తొందరగా ఇంటికెళ్లాలి . ఇంట్లో వంట చేయాలి అని అనుకుంటాడా? లేదు. కాని ప్రతి ఉగ్యోగిని అనుకుంటుంది. అదేంటో మరి??? ఇప్పుడు ఎవరు మారాలి? వంట నా ఒక్కరి బాధ్యత కాదు అని స్త్రీ అనాలా? పర్లేదు .. నేను ఈ పూట వంట చేస్తాను అని భర్త అనాలా??(ఒక్కరోజు కాదు. ప్రతి రోజూ)
ఇలాంటి కష్టాలు తీర్చడానికేనేమో కర్రీ పాయింట్స్ వెలిసాయి. డబ్బులుంటే కొనుక్కుని ఏదో గడ్డి తింటారు. కొండరు చిన్న వ్యాపకంగా, వ్యాపారంగా భోజనం తయారు చేసి ఇస్తున్నారు. అలాగే పదిరోజులైనా పాడుకాకుండా ఉండే వంటకాలు కూడా దొరుకుతున్నాయి. ఇద్దరూ సంపాదనలో ఉండి, వంట జంఝాటం వద్దనుకునేవాళ్లు బతకాలి తప్పదు కనుక రోజుకోరకం తెచ్చుకుని తింటారు . అప్పుడు వంట పని ఆడవాళ్ళదా, మగవాళ్ళదా , భర్తదా, భార్యదా అనే ప్రశ్న రాదు. అది కూడా ఎన్నాళ్లు. రోజూ వంట చేసే ఆడవాళ్లకు మెప్పు లేదు కాని ఎప్పుడైనా మగవాళ్లు వంట .. కనీసం ఒక్క కూర చేస్తే పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతారు. భుజాలు తడుముకోవద్దు.. :)

ఒక్క విషయం చెప్పండి. మగవాళ్లు ఏదైనా ఉపవాసం చేస్తే భార్య అతనికి పాలు, పళ్లు, లేదా టిఫినో ఏదో టైం కి చేసి పెడుతుందిగా. అదే భార్య ఉపవాసం ఉంటే భర్త ఏం చేస్తాడు?? ఇవన్నీ ఎందుకు . హాయిగా తిని పని చేసుకోక అని తన దారిన తాను ఆఫీసుకు వెళ్లిపోతాడు. ఆ ఇల్లాలే తనకు కావలసినవి చేసుకోక తప్పదుగా..>>>

కాని ఎన్ని చెప్పినా, రాసినా .. స్త్రీ చదువుకున్నా, చదువుకోకున్నా రోజూ వంట చేయక తప్పదుకదా?? ప్చ్..

Friday, June 5, 2009

మరో ప్రస్థానానికి సాదర ఆహ్వానం ...

అంతర్జాలంతో పరిచయం చేసుకుని నాకిష్టమైన తెలుగు కోసం వెతుకుతూ సరిగ్గా మూడేళ్ళ క్రింద తెలుగు బ్లాగు గుంపులో చేరాను. ఊరికే అల్లరిగా ఉండే నన్ను వేదించి బ్లాగు తెరిచేలా చేసారు.. అలా మొదలైన బ్లాగు ప్రయాణం మొదటి నెలలో వంటల బ్లాగు మొదలెట్టేలా సాగింది. జాలంలో ఎంత గాలించినా తెలుగులో వంటలు కనపడలేదు. మనమే ఎందుకు మొదలెట్టకూడదు అన్న ఆలోచన షడ్రుచులు బ్లాగుకు అంకురం వేసింది. అది అలా మొక్కలా ఎదిగి చెట్టులా మారింది . ఆ క్రమంలో నా అభిరుచులన్నీ బ్లాగులుగా చేసుకుని రాసుకుంటున్నాను. అందులో కొన్ని ఎంతో మందికి ఉపయోగకరంగా మారాయని తెలిసి సంతోషించాను. ఈ బ్లాగు ప్రపంచం నుండి మరో ప్రస్తానం వైపు అడుగువేయాలనే కోరికతో గత నెలలో అక్షయతృతీయ నాడే అంకురార్పణ జరిగినా బాలారిష్టాలు దాటుకుని వచ్చేసరికి ఇంతకాలమైంది. షడ్రుచులు పేరుతో వెబ్సైట్ మొదలు పెట్టాను. జాలంలో మొదటి తెలుగులో వంటల బ్లాగు, అలాగే వంటల వెబ్సైట్ నేనే మొదలుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సైట్ పనులు ఎవరితో అయినా చేయించుకోవచ్చు. డబ్బులిస్తే ఎంతో మంది చేస్తారు. ఇవ్వకున్నా చేస్తారనుకోండి. కాని మన పప్పు మనమే ఉడకేసుకోవాలి. అప్పుడే ఈ దినుసులు ఎంత పాళ్ళలో వేయాలో మనకే తెలుస్తూంది. అలా ఒక్కోటి తెలుసుకుంటూ, నేర్చుకుని ఈ సైట్ ని అలంకరించుకునే సరికి ఇప్పటికి ఈమాత్రమైనా తయారైంది. ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. సాంకేతిక నిపుణులు ఐతే గంటలో చేసుకోగలరు. కాని ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి ల తో ఆటలాడే నేను ఈ css, html, FTP, వగైరా చేయాలంటే కష్టమే కదా. అందుకే అన్నమాట. పూర్తి స్థాయిలో నిలదొక్కుకునేవరకు కాస్త సహకరించండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, మార్పులు , చేర్పులు చెప్తారు కదూ .. ముందుగా అందరూ నోరు తీపి చేసుకోండి.
ఈ దుర్గ నిర్మాణంలో సహకరించి, ప్రోత్సహించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.


పదండి మరి షడ్రుచులు ప్రయాణానికి. http://shadruchulu.com/

Thursday, June 4, 2009

మధుర స్వరానికి పుట్టినరోజు మంగిడీలు

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కి సంగీత శుభాకాంక్షలు. అయన పాడిన కొన్ని మధురమైన పాటలు ఆయనకే అంకితం. మనకు శ్రవణానందం..
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008