Friday, June 22, 2012

మాలిక పత్రిక - ప్రహేళికల సమాధానాలు

మాలిక  పత్రికలో నిర్వహించిన మూడు ప్రహేళికల గడువుతేది దాటి  చాలా కాలమైంది. అనివార్య కారణాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైంది. క్షంతవ్యులం..
మాలికా పదచంద్రికకు వచ్చిన పూరణలలో భమిడిపాటి సూర్యలక్ష్మిగారు సరియైన సమాధానం పంపారు. మాచర్ల హనుమంతరావుగారు పూర్తిగా పూరించలేదు. సూర్యలక్ష్మిగారు మీ బహుమతి వెయ్యిరూపాయలు త్వరలో పంపబడుతుంది..


బ్లాగ్గడి సమాధానాలు:
అడ్డం: 1.బులుసు, 5.మా గోదావరి,7.కృష్ణప్రియ,10. ప్రమాదవనం, 12యశోదకృష్ణ, 13,మార్తాండ, 16.తొలి, 17.వికటకవి(?), 22.తురుపుముక్క, 23.డిఒ అమ్మ, 24.హరిసేవ :)

నిలువు:2.సుమ,3.రానారె,4.కుమార్(?),6.రిచదువ,8.ప్రియాదయ్యంగారు,9.శ్రీష్ణ, 11.దబెడ, 12.నండూరి, 13.మాలిక(!!), 15.రవిగారు, 16.తోటరాముడు, 19. విసే, 20.జుబోలవ, 22.తుమ్మ


తెలుగు బ్లాగర్ల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన బ్లాగ్గడికి ఒకే పూరణ వచ్చింది.  మురళీమోహన్ గారు సరియైన చిరునామా పంపగలరు. మీ బహుమతి  Rs. 200 మీకు అందజేయబడుతుంది..

ఇక మరో ప్రహేళిక కనుక్కోండి చూద్దాం అని అడిగాం. మాలిక ఉగాది సంచికలో ఒకే రచయిత రాసిన రెండు రచనలు పొందుపరచబడ్డాయి. ఆ రచనాశైలి బట్టి రచయితను గుర్తించమని అడిగాం. సరియైన సమాధానం చెప్పినవారు శ్రీ కోడిహళ్లి మురళీమోహన్ గారు.  సమాధానం: సరస్వతీపుత్రుడు వ్యాసం రాసింది ఇదే సంచికలో వేణీసంహారం నాటకాన్ని  పరిచయం చేసిన ENV రవి.. మురళీమోహన్ గారు మీ చిరునామా పంపగలరు..మీ బహుమతి Rs.500 మీకు అందజేయబడుతుంది..


Saturday, June 16, 2012

పోయిందే... Its gone.. ................అమృతాంజనం
సుమారు పాతిక, ముప్పై, నలబై ఏళ్ల క్రింద ఇప్పట్లా వీధికో మందులషాపు,  బస్తీకో కార్పోరేట్ హాస్పిటల్, మనిషిలో ఉన్న , లేని, రాని, రాబోయే రోగాలన్నింటికి విడివిడిగా డాక్టర్లు లేరు.  బస్తీలో ఉండేవాళ్లందరికీ ఉండేది  ఓక్క డాక్టరు, కాంపౌండర్ మాత్రమే... డాక్టరు పేషంటును చూసి పేపర్ మీద ఏదో గెలికితే ( అది మనకు అర్ధం కాదు కదా) కాంపౌండర్ మనం తీసికెళ్లిన ఖాళీ క్వార్టర్ బాటిల్ లేదా పాత  టానిక్ సీసాలో రెండు లేదా మూడు రోజులకోసం ఎర్ర రంగు నీళ్లు పోసి పూటకు ఎంత తాగాలో గుర్తుగా ఓ కాగితం అంచులు కట్ చేసింది అంటించి ఇచ్చేవాడు. గుర్తుందా?? ఇంకా సీరియస్ అంటే సూదిమందు.. అసలు డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు ఇంట్లోనే ప్రాధమిక చికిత్స జరగడం మాత్రం తథ్యం.. దాదాపు ప్రతీ ఇంట్లో ఉండే సర్వరోగనివారిణి.. సారా కాదండోయ్.. అమృతాంజనం.. లేదా జిందా తిలిస్మాత్... ఈ రెండింటికి తోడుగా వాము.. అంతే.. అమ్మ కంటే ఎక్కువగా బామ్మ, అమ్మమ్మలు  ఈ మూడింటిని నమ్ముకుని అందరికీ వైద్యం చేసేవారు. ఐనా తగ్గకుంటే అప్పుడు డాక్టర్ దగ్గరకు  పరుగు..

బరువైన గాజు సీసా, పచ్చటి మూత తీస్తే పసుపురంగు ఘాటైన అంజనం.. అది పెట్టుకుంటే నొప్పి తగ్గినా పలుచగా అట్టలా పేరుకుపోతుంది ఐనా సరే అదే సర్వరోగనివారిణి.. అమృతంతో తయారు చేసిన అంజనం. మరి ఈ అమృతాంజనం ఎవరు తయారు చేసి అమ్మేవాళ్లో తెలుసా... దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు. వంటింట్లో, తలగడ క్రింద, పర్సులో తప్పకుండా ఉండే  ఈ పసుపు రంగు సీసా ఎంతమందికి గుర్తుంది???. అప్పటికీ ఇప్పటికీ ఇది అమృతాంజనమే.. రాన్రానూ రంగు లేని పలుచగా ఉండే బాములు ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. దానివల్ల అమృతాజనం పసుపు రంగుది అమ్మకాలు తగ్గాయని చెప్పవచ్చు. అందుకే వాళ్లు కూడా తెల్లని అమృతాంజనం తయారీ మొదలుపెట్టారు. ఇప్పటికీ ఎంతో మంది అమ్మలు, అత్తలు తలనొప్పైనా, కాలు నొప్పైనా, చేయి నొప్పైనా, మెడనొప్పైనా ఏదైనా సరే అమృతాంజనమే కావాలంటారు.

ఈ సందర్భంగా  గరిమెల్ల సత్యనారాయణగారు రచించిన అమృతాంజనం కవిత చూద్దాం. (మాగంటి వంశీగారి బ్లాగు నుండి ఎత్తుకొచ్చా) తప్పులేదులెండి. ఎంతైనా అమృతాంజనం మనది మనందరిదీ కదా..

ఎటు జూచిన అంజనముల వరదలె
ఎటు గాంచిన బాముల బురదలె
బాధా నిర్మూలనమను కళలో
అమృతాంజన సామ్యము లేదిలలో
పేరులు చూస్తే బారెడు పొడుగులు
మేరలు చూస్తే జానెడు గిడుగులు
బాములు క్యూర్లంజనములు టోనులు
ప్రజలను ఆకర్శించే బోనులు
అమృతాంజనము అనాది ప్రసిద్ధము
బాధావారణ కంకణబద్ధము
సకలవ్యాధుల సన్నాహమ్ముల
పెకలించును ఆ దేవతయమ్ములు
తలనొప్పికిని, కీళ్ల నొప్పికి
పడిసెంబు, రొంప దగ్గులకు
అమృతాంజన మర్ధన పరిచర్యయే
అది శీఘ్ర నివారణ సాధనము
చౌకకు చౌక, గుణమునకు గుణము
సరసను గల ప్రతి షాపున దొరకును
సులభంగా ఇంటికి విచ్చేసి
నెలకొనగల గృహ వైద్యుండీతడు
నామము చెవులకు రంజనమైతే
వారణ మేనికి రంజనము
బాధలకెల్లా భంజనము
వ్యాధుల పులి అమృతాంజనము..
Saturday, June 2, 2012

వియ్యాలవారి వింత నగలు


photos courtesy : Mrs.Lakshmi Raghava


పందిట్లో పెళ్లి జరుగుతోంది.. పురోహితుడి మంత్రాలు, వధూవరుల తడబాటు.. మంగళవాద్యాలు, పట్టుచీరల రెపరెపలు.. కొత్త బంధుత్వంతో పలకరింపులు.. సరదాగా ఆట పట్టింపులు... ప్రతి పెళ్లిలో ఇదంతా సర్వసాధారణమే కదా! కానీ, పెళ్లి అనగానే వధూవరులకు సంబంధించిన కార్యక్రమాలే కాకుండా మరికొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఈ రోజుల్లో పెళ్లిళ్లు హడావుడిగా చేసేస్తున్నారు... కొన్నేళ్ల క్రితం తప్పనిసరిగా ఈ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తప్పనిసరిగా పాటించేవారు. అందులో ముఖ్యమైనది మగ పెళ్లివారికి ఆడపెళ్లివారు ఇచ్చే ప్రత్యేకమైన, విచిత్రమైన నగలు, వాయినాలు. పెళ్లి అంటే బంగారం, వజ్రాల నగలు ఎలాగూ వేసుకుంటారు కానీ ఇంకా ఈ ప్రత్యేకమైన నగలు ఏంటి? అనుకుంటున్నారా?? పెళ్లి తర్వాత మగపెళ్లివారి తరఫున ముఖ్యమైన ఆడవాళ్ళను అంటే వియ్యపురాళ్లు, ఆడపడుచులు, మేనత్తలు మొదలైనవారిని వరుసగా కూర్చోబెట్టి బొట్టుపెట్టి, తాంబూలం ఇచ్చి తాము స్వయంగా తయారుచేసిన ఈ విచిత్రమైన నగలను వాళ్లకు అలంకరించి ఆటపట్టిస్తూ, సరదా పాటలు పాడుతూ మంగళహారతి పట్టేవాళ్లు అమ్మాయి తరఫున ముతె్తైదువలు. ఇక ఆ ప్రత్యేకమైన, విచిత్రమైన నగలు ఏంటో తెలుసుకుందాం...


పెళ్లికి చాలా రోజులముందే బంగారు, వెండి, నీలం రంగుల్లో ఉండే మెరుపు కాగితాలు, అట్టలు, పూసలు, జరీ దారాలు, సన్నని గొలుసులు, మువ్వలు, అద్దాలతో అందమైన నగలు తయారుచేసి పెట్టుకుంటారు. ఇవి ఎలాంటి నగలు అంటే వడ్డాణం, అరవంకీలు, గాజులు, పాపిట గొలుసు, చెవులకు అందమైన లోలాకులు, వాటికి వేలాడే మాటీలు, చెంప స్వరాలు, మెడలోకి కాసుల దండలు, నెక్లెసులు, పొడవాటి గొలుసులు ఇలా ఎన్నో... అట్టముక్కలమీద మెరుపు కాగితం అంటించి గొలుసులు, అద్దాలు, పూసలు, రాళ్లు గమ్‌తో అతికించి, తమ సృజనాత్మకతని ఉపయోగించి సరైన నగలు తయారుచేసేవారు. మగపెళ్లివారు కూడా ఆ నగలను సంతోషంగా స్వీకరించి వారి ఆనందంలో పాలు పంచుకునేవారు. అదంతా ఆ రోజుల్లో.. ఇప్పుడంతా నాజూకు వ్యవహారమాయె..!


ఇక ఈ పెళ్లిళ్లలో మగపెళ్లివారి కోసం ఆడపెళ్లివాళ్లు తయారుచేసే మరో విచిత్రమైన నగల గురించి కూడా తెలుసుకుందాం. అవి అలాంటి లాంటి నగలు కావు.. అవి పప్పు దినుసులు, నవధాన్యాలతో చేసే నగలు. అసలు ఈ పప్పులు, ధాన్యాలు తినడానికి కదా వాడేది. వాటితో నగలు ఎలా చేస్తారని అనుకుంటున్నారా? కాస్తంత ఓపిక, కాస్తంత ఉత్సాహం, మరికొంత సృజనాత్మకత ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇందులో మనకు నవధాన్యాలు, పప్పులు సహజమైన రంగుల్లో దొరకుతాయి కాబట్టి కృత్రిమమైన రంగుల వాడకం ఉండదు. ఖర్చూ తక్కువే. మనం నిత్యం ఆహారంలో వాడే పప్పు దినుసులతోనే ఈ నగలు చేయవచ్చు. ముత్యాల్లా ఉపయోగించడానికి సగ్గుబియ్యం, వడ్లు, పుట్నాలపప్పు, మిరియాలు, నువ్వులు, కర్బూజ విత్తనాలు, ఆనపకాయ విత్తులు. (ఇవి రాయలసీమ, కర్నాటకలో విరివిగా లభించే ఒక రకం బీన్స్. ఇవి నానబెట్టి తొక్క తీస్తే వచ్చిన పప్పు) కాదేది కవితకనర్హం అన్నట్టు.. తయారైన నగలు చూస్తే కాదే ధాన్యమూ, దినుసు అలంకరణకు అనర్హం అని చెప్పవచ్చు. ఒకసారి సూపర్ మార్కెట్‌కు వెళ్తే అన్ని రకాల ధాన్యాలు దొరుకుతాయి. అలాగే- జరీదారం, గమ్, రంగు రంగుల మందపాటి అట్టముక్కలు, వార్నీషు, బ్రష్ కావాలనుకుంటే వెల్వెట్ గుడ్డ కూడా తెచ్చుకుంటే చాలు. ముందుగా మీరు చేయాలనుకున్న నగలు వాటి డిజైన్‌లను నిర్ణయించుకుని ఒక కాగితం మీద గీసి పెట్టుకోండి. దాని ప్రకారం అట్ట ముక్కలు కత్తిరించుకోండి. అట్టముక్కలు మంచి రంగుల్లో మందంగా ఉంటే గింజలను అలాగే అంటించవచ్చు లేదా దానిపైన పలుచటి వెల్వెట్ బట్టను నీటుగా అతికించాలి. ధాన్యపు గింజలు, మిగతా దినుసులను రంగులవారీగా వేరు చేసి పెట్టుకోండి. అట్టముక్క మీద కొద్ది భాగం మీద గమ్ రాసి లేదా గింజకే గమ్ రాసి అతికించవచ్చు. చాలా సన్నటి పటకారుతో లేదా కనుబొమ్మలకోసం వాడే ట్వీజరు వాడి ఈ గింజలను జాగ్రత్తగా రంగులు, సైజులు చూసుకుంటూ డిజైన్‌కు అనుగుణంగా అతికిస్తూపోవాలి. ఇలా నగ మొత్తం తయారయ్యాక కనీసం నాలుగైదు గంటలు ఆరనివ్వాలి. ఒకవేళ మధ్యలో ఏవైనా ఊడిపోతే మళ్లీ అతికించాలి. అవసరమైన చోట గొలుసు కాని, జరీదారం కాని అతికించాలి లేదా తగిలించాలి. ఇదేవిధంగా ఆ గొలుసులకు మాచింగ్‌గా చెవి దిద్దులు కూడా తయారుచేసుకోవాలి. వీలైతే గాజులు లేదా బ్రేస్‌లెట్ కూడా తయారు చేయవచ్చు. మొదట్లో కొంచెం తడబడినా, కష్టంగా అనిపించినా కాస్త అలవాటు కాగానే చేతులు అలా చకచకా కదిలిపోతూ ఉంటాయి. మరో విషయం మాత్రం మరచిపోకండి.. ఇందులో మినప్పప్పు, పుట్నాల పప్పు, వేరుశెనగ గుళ్లు లాంటివి పురుగుపట్టే అవకాశం ఉంది. అందుకే నగలు తయారుచేయగానే పైన సన్నటి బ్రష్‌తో వార్నిష్ పూయడం మాత్రం మరచిపోవద్దు.


ఈ నగలు స్వయంగా చేయడంవల్ల అవి చాలా అందంగా కనిపించకున్నా ఆత్మీయపు అనుబంధాన్ని మాత్రం స్ఫురింపజేస్తాయి. పెళ్లి సందడిలో సరదాగా గడిచిపోయే ఒక ఘట్టాన్ని అందరి మనసుల్లో నిలిపేస్తాయి. ఈ నగలు తయారుచేయడం అంత సులువైన పని కాదు. ఎంతో ఓపిక, శ్రమతో కూడుకున్నది. ఐనా సరే ఆచారాన్ని వదిలేయకుండా, మార్కెట్లో ఏదో ఒకటి కొనకుండా ఇంట్లోనే స్వయంగా చేసి బహూకరిస్తారు. అందులోనే అమితమైన ఆనందం లభిస్తుంది.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008