Sunday, June 27, 2010

అంతర్జాలంలో అభిరుచులు - ఈనాడు


వంటకు వనితలకు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే కదా. అందరి అభిరుచులు, ఆకలి తెలిసి అన్నం పెడుతుంది అమ్మైనా, ఆలైనా.. అంతర్జాలంలో కూడా ఆహారంలో తమ అభిరుచులను చాటుతున్న వారికోసం సుజాత గారు అందించిన వ్యాసం ఈనాటి ఈనాడు వసుంధరలో .. థాంక్స్ సుజాత.. ఈ వ్యాసం కోసం వంటల గురించి రాసిన మహిళా బ్లాగులన్నీ తమ వ్యాసంలో పరిచయం చేసారు సుజాతగారు . కాని చివరి నిర్ణయం పత్రికల వాళ్ళదే కదా. మిగతావారు తప్పుగా తీసుకోవద్దు.

Friday, June 25, 2010

ఒఖ్ఖ రెండు రూపాయలు - కథాజగత్ పోటీ

దాదాపు పదిరోజుల క్రింద కథా జగత్ లో వంద కథలు ప్రకటించబడిన సందర్భంగా బ్లాగర్ల కోసం పోటీ నిర్వహిస్తున్న సంగతి తెలుసు కదా. ఇంతవరకు ఒక్కరూ తమ వేళ్ళను దిశలో కదిలించనట్టుంది.. ముందుగా అటువైపో లుక్కేసి రండి. పోటీ కోసం నేను రెండు కథలు ఎంచుకున్నాను. అవి నాకు బాగా నచ్చాయి. వాస్తవిక జీవితంలో నాకు ఎదురైన సంఘటనలే అవి. కథలు రాసినవారు నాకంటే పెద్దవారు అయినా బ్లాగ్లోకంలో నేను వారికి గురువునే. సో శిష్యుల కథల గురించే రాస్తే పోలా అని డిసైడ్ అయిపోయానన్నమాట.


ఒఖ్ఖ రెండు రూపాయలు.. రచన. జి.ఎస్.లక్ష్మి .

పిల్లలు , వృద్ధులు ఒకే విధమైన మనస్తత్వం కలవారు. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు. పిల్లలను చిన్నప్పటినుండి గారాబంగా పెంచి పెద్ద చేయడం, చదువులు ఇలా ఇవే తమ లక్ష్యంగా తల్లితండ్రులు ఉంటారు. తమ కోరికలకంటే పిల్లల కోరికలు ముందు తీర్చాలని అనుకుంటారు. క్రమంలో తమ ఆశయాలు , ఆశలను కూడా వదులుకుంటారు. అలాగే తమ తల్లితండ్రులను కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారు. ఇది ఒకప్పటి తరం మాట అనుకోండి. కాని ఈనాడు ఉమ్మడి కుటుంబం సంగతి పక్కన పెడితే అసలు తల్లితండ్రులు కూడా భారమైపోతున్నారు కొందరు పుత్ర రత్నాలకు. తమపిల్లలతోనే సతమతమవుతూ తల్లితండ్రుల గురించి శ్రద్ధ తీసుకునే, ఆలోచించే సమయం, ఓపిక వారికి ఉండడం లేదు. ఒకోసారి తల్లితండ్రులు ఇంటిలోని వారికి అడ్డంకిగా కూడా కనిపిస్తారు. వాళ్ళ మాటలు రుచించవు. చాదస్తం అని కొట్టి పడేస్తారు. వీళ్ళ మాటలేంటి వినేది? మాకు తెలీదా ? అని హుంకరిస్తారు.


ఉద్యోగాలు చేసినంత కాలమ్ ఒకరికి లొంగకుండా తమ పిల్లలను దర్జాగా పెంచిన తల్లితండ్రులు రిటైరయ్యాక అదే కొడుకుల దగ్గర నిస్సహాయంగా ఉండవలసి వస్తుంది. పెత్తనం ఉండదు. వాళ్లకు భోజనం మాత్రమే అవసరం . అప్పుడప్పుడు మందులు .. అది తప్ప ముసలివాళ్ళకు ఇంకేం కావాలి అనుకుంటారు కొడుకు,కోడలు.. రిటైరైనంత మాత్రాన, సంపాదించనంత మాత్రాన వాళ్లకు ఆశలు,కోరికలు ఉండకూడదా. శారీరకంగా శక్తి ఉన్నంతవరకు కష్టపడుతూనే ఉంటారు. అపుడు తమకు కోరినవి కొనుక్కుంటారు. తింటారు. పిల్లలు సెటిల్ అయ్యి, రిటైరయ్యాక తీరిగ్గా ఉండడం మూలాన పెద్దవాళ్ళకు ఏవో కోరికలు ఉంటాయి. అవి ఎక్కువగా తిండి వస్తువులు, పుస్తకాలు, సినిమాలు, పూజలు గట్రా అయ్యుండొచ్చు. కాని వాటికి డబ్బులు కావాలిగా. ఉన్నదంతా కొడుకులకు ఊడ్చిపెడితే , చివరకు కొడుకు కోడలు దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సి వస్తుంది. ముందే జాగ్రత్త పడి డబ్బు దాచుకుంటే వారి అవసరాలకు పనికొస్తుంది. ఒక్కోసారి ఇలా చేసిన చిక్కే . ముసలోళ్ళు ఎంత సొమ్ము దాచిపెట్టుకున్నారో ఏమో? కొడుకులకు, మనవళ్ళు , మనవరాళ్లకు ఇవ్వకుంటే ఎలా అని గొడవ మొదలవుతుంది. దాచుకుని పోయేటప్పుడు కట్టుకుపోతారా? అని పీక్కుతినేవాళ్ళు ఉన్నారు. అలాగే సొమ్ము కోసం కాట్ల కుక్కల్లా కొట్టుకునే సోదరీ , సోదరులు ఉన్నారు.

వాళ్ళ సొమ్ముకు ఆశపడ్డమే కాని అయ్యో వాళ్లకు ఏదైనా తినాలనిపిస్తుంది. వాళ్లకు ఇష్టమైనవి కొనుక్కోవాలనుకుంటారు.లేదా ఖర్చు పెట్టాలనుకుంటారు అని కొంత సొమ్ము ఇద్దాము అని అనుకునే వాళ్ళు ఎందరు? పెన్షన్ గట్రా వస్తుంటే ఇంట్లోకే అవసరమోస్తుంది అని లాక్కోవడం తప్ప. పెళ్ళాం మాటలు విని తల్లిని గెంటేసి ఒంటరిని చేసిన కొడుకు , అదే తల్లి కాయకష్టం చేసి సంపాదిస్తుంటే తన భార్యతో కలిసి ఆమె సంపాదించిన డబ్బులు కూడా ప్రతి నెల తీసుకుంటాడు. బ్రతకడానికి తల్లికి ఇంత తిండి ఉంటే చాలు అని అనుకుంటారు. ఏమో! తామూ తల్లితండ్రులమవుతాము. ముసలివాళ్ళమూ అవుతాము. అపుడు తమకు పరిస్థితి రాదా? అన్న ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా భవిష్యత్తు ఎవరు చూడొచ్చారు? మా పిల్లలు బంగారం. అలా చేయరు అని అనుకుంటారు.

అందుకే పిల్లల్లారా!!! వృద్ధులైన తల్లితండ్రులను ఒక నిరుపయోగ వస్తువులా భావించకండి. వాళ్ళకూ ఎన్నో కోరికలు, ఖర్చులూ ఉంటాయి. అందుకు సొమ్ము అవసరమవుతుంది. లోటు రాకుండా చేయండి. ఎందుకు చేయాలని అన్న ఆలోచన వస్తే మిమ్మల్ని పెంచడానికి పెట్టడానికి పెట్టిన సొమ్ము తిరిగి ఇస్తున్నాం అను కొండి. మీకు మీరు కన్నవాళ్ళు అంటే ఎంత ప్రేమ , ఆప్యాయతో, మిమ్మల్ని కన్నవాళ్ళు కూడా అలాగే అని అపురూపంగా చూసుకోండి.

లక్ష్మిగారి కథను చదివిన తర్వాత నా అనుభవాలను , అభిప్రాయాన్ని చెప్తున్నాను. కథలో చెప్పిన పరిస్థితులన్నీ కళ్ళారా చూసినవే .. ఒకసారి కాదు ఎన్నోసార్లు. పిల్లలను మార్చలేకున్నా తల్లితండ్రులను జాగ్రత్తగా ఉండమని చెప్తుంటాను. ఆస్ధిపాస్తులన్నీ పిల్లలకోసం ధారాదత్తం చేయకండి. మీ భవిష్యత్తు గురించి మీరే జాగ్రత్త పడండి. వయసు మీరినంత మాత్రాన ఒకరి మీద ఆధారపడవలసిన పని లేదు అని. మా పిల్లలకు కూడా చెప్తాను. మా గురించి మీరేమి బెంగ పడొద్దు. మీ జీవితం, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు మా మీద ఆధారపడొద్దు. మేము మీ మీద ఆధారపడొద్దు అని..

Friday, June 18, 2010

చదువు కోసం సాయం చేయండి..


హారిక అనే అమ్మాయి ప్రస్తుతం బీటెక్ (ఐటీ) సెకండియర్ పూర్తి చేసి థర్డ్ ఇయర్లోకి వచ్చింది.. షంషాబాదులో ఆ అమ్మాయి కాలేజి . ఆర్ధిక ఇబ్బందుల వల్ల కాలేజీ ఫీజు కట్టలేకుండా ఉంది. కాలేజీ ఫీజు సంవత్సరానికి rs 27,000. చదువులో కూడా రాణిస్తున్న అమ్మాయి ప్రస్తుతం వాళ్ళ మామయ్య ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ఆమె వివరాలు కనుక్కుని ప్రమదావనం నుండి ఆరువేలు ఇవ్వడం జరిగింది. కాని అది సరిపోదు. ఈ సంవత్సరం , వచ్చే సంవత్సరం ఫీజుకు చాలా కష్టంగా ఉందంట. ఇప్పటికి మేము ఇచ్చిన సొమ్ముతో కలిపి పదహారు వేలు అయ్యింది. మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేయగలరు .

ఇవి తన వివరాలు క్లుప్తంగా..

Name : Muddam Harika

Fathers Name : Muddam Narasimha Reddy
Date of Birth : 30th july 1991
Fathers Occupation : Agriculture
income as per 2008: 18,000 per anum
SSC : 543 (91%)
inter : 930(93%)
B.tech : 1st year (70.54%) 2-1 (81.46%)


హారికతో పర్సనల్ గా మాట్లాడి ,ఆ అమ్మాయి సర్టిఫికెట్లు అవి చూసి ప్రమదావనం నుండి సహాయం చేయడం జరిగింది. ఈ విషయంలో సందేహం అనవసరం. అందుకే ఆ అమ్మాయి నంబర్ ఇవ్వడం లేదు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నాకు మెయిల్ పెట్టండి.నేను నంబర్ ఇస్తాను. అమ్మాయి వ్యక్తిగత భద్రతా దృష్ట్యా ఈ జాగ్రత్త తీసుకోక తప్పదు.
తన బ్యాంక్ అకౌంట్ వివరాలు..

A/C number: 30903316788
Name of A/C Holder: L. Srinu
Bank: SBI
Branch: Vinukonada

Thursday, June 10, 2010

క్రేజీ కాంబినేషన్స్ - 2
అన్నం, పప్పు, వేపుళ్ళు, పులుసులు, ఖుర్మాలు, పచ్చళ్ళు .. ఇలా వంటకాలలో ఎన్నో రకాలు . అప్పుడప్పుడు బోర్ కొడితే ఒకదానికొకటి రీమిక్స్ చేసేస్తాను. అది అలా చేయడం తప్పు కదా . అలా ఉండదు కదా? అలా చేయకూడదేమో. ఈ కూర ఇలాగే చేయాలి , ఆ వేపుడు అలా తినాలి అని ఎన్నో లెక్కలు చెప్తారు.కాని తినేది మనము. మనకు ఇష్టమైనట్టు తినాలి కాని దానికి రూలేంటి అంటాను నేను. చెత్త బుట్టలో పడేసేట్టు ఉండకుంటే చాలు మనం చేసే కాంబినేషన్స్. ఏమంటారు ?? ఇదంతా ఎందుకు చెప్తున్న అంటారా?? ఇంతకు ముందు అంటే రెండేళ్ళ క్రింద రాసిన టపా ఒకటుంది. అందులో ఎన్ని రకాల క్రేజీ కాంబినేషన్సో మీరే చూడండి.

మరి మీ క్రేజీ కాంబినేషన్స్ ఉంటే మాతో పంచుకుంటారా. ఐతే కానివ్వండి .. ఆలస్యమెందుకు??

Monday, June 7, 2010

ప్రథమ వార్షికోత్సవం ....
గత సంవత్సరం ఇదే సమయంలో బ్లాగులనుండి సొంత డొమైన్ కి మారింది షడ్రుచులు.

షడ్రుచులు బ్లాగులో ఎక్కువగా సేకరణలు ఉన్నా ఈ సైట్ లో మాత్రం అన్నీ నా సొంత వంటకాలు, చిత్రాలే. ఈ సైట్ వల్ల మరింతమంది మిత్రులు లభించారు. వందలకొద్దీ వంటల బ్లాగులు పరిచయమయ్యాయి. అలాగే వంటల బ్లాగులకోసం ఉన్న ఆగ్రిగేటర్లు, వంటల పోటీలు ఇలా ఒక తెలియని మరోప్రపంచంలోకి ప్రవేశించడం జరిగింది. నా సైట్ లో ఉన్న బ్లాగుల్లో నేను ఎక్కువగా చాలా తక్కువ దినుసులు, తక్కువ సమయంలో చేసుకోగలిగే వంటకాలే ఇవ్వడం జరిగింది. వంట వచ్చినవారికి ఇవన్నీ విసుగ్గా ఉండొచ్చు కాని అస్సలు వంట రాని , వంట నేర్చుకోవడం మొదలుపెట్టినవారికి అవి చాలా ఉపయోగపడతాయి. మా అబ్బాయి ఆఫీసునుండి వచ్చిన స్పందన నేను సరియైన పనే చేసానని నిరూపించింది.

అలాగే అప్పుడప్పుడు ఒకే రకమైన వంటకాలతో ఉత్సవాలు కూడా నిర్వహించాను. టమాటో ఉత్సవాలు, వంకాయ వసంతోత్సవాలు, పులిహోర ఉత్సవాలు మొదలైనవి. బ్లాగు కోసమైనా కూడా కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరిగింది. ఈ సంవత్సరం కూడా ఎంతో వేగంగా గడిచిపోయింది అనిపిస్తుంది. ముందు ముందు చాట్, చైనీస్, మాక్ టేల్స్ లాంటివి చేయాలనుకుంటున్నా. ఈ సైట్ నాకో గుర్తింపుగా మారింది. దీనివల్ల పత్రికల్లో వంటల వ్యాసాలు, టీవీ షో ల చాన్స్ వచ్చింది .. ఈ సైట్లోని రెండు బ్లాగులు మరింత అందంగా చేయాలని నా ప్రయత్నం. ఇక దీనివల్ల ప్రకటనలు అవి వస్తాయేమో చూడాలి..


నా అభివృద్ధికి అన్నివిధాలా ప్రోత్సహించిన, విలువైన సలహాలు ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.షడ్రుచులు

Shadruchulu

Wednesday, June 2, 2010

నన్ను దోచుకుందువటేఅందమైన వాతావరణం. చల్లని పిల్ల గాలులు గిలిగింతలు పెడుతున్నాయి. కొత్తగా పెళ్లైన జంట. తొలిరాత్రి. ఇద్దరి మనసుల్లో ఉప్పొంగే సంతోషం, ప్రేమ..ఆ ఆనందం వారి వదనాలపై స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. సర్వాలంకార భూషితురాలైన నాయిక అందంతో ఆమె నగలు, పువ్వులు, ప్రకృతి కూడా పోటీపడుతుంటే , వలచి, వలపించుకున్నవాడు, అందగాడు, వీరుడు తనను చేపట్టినవాడు అనే ఆనందం ఆమె పెదవులపై చెరగని చిరుదరహాసమై వెలుగులు చిమ్ముతుంది. ఇక నాయకుడు కన్నియను వలచి, దక్కించుకున్నానన్న విజయగర్వం, సంతోషం తన హావభావాల్లో , మాటల్లో చెప్పకనే చెప్తున్నాడు. అన్నింటిని మించి అతని నుదుటిపై ఉన్న అర్ధ చంద్రిక. కోర మీసం, పెదవి వొంపులలొ దాగిన చిరునవ్వు మనను కట్టిపడేస్తుంది. అందగాడంటే ఇలాగే ఉండాలి అనిపించే ఆ మహ నటుడు గుర్తొచ్చాడా?? ఆ అందం, అభినయం, సంగీతం, సాహిత్యం, స్వర మాధుర్యం వెరసి ఒక అత్యద్భుతమైన పాటని మనకందించాయి.. "అదే నన్ను దోచుకుందువటే" .... ఎంతమంది కలిసి పని చేస్తే ఇంత మనోహరమైన సినీగీతం మనకు దక్కింది. గులేబకావలి చిత్రంలోని ఈ పాటతోనే సి.నారాయణరెడ్డి సినీరంగ ప్రవేశం చేసారు.

నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి

నన్ను దోచుకుందువటే

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు

నన్ను దొచుకొందువటే

నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలో
కలసి పోదు నీలో ..
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం

నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటే.

భార్యాభర్తలై ఒకరికొకరు జీవితం పంచుకునే తరుణంలో వారి మనోభావాలు ఈ పాటలో స్పష్టంగా చిత్రించారు సినారె గారు. దానికి సంగీతం మరిన్ని మెరుగులు దిద్దింది. ఇక నాయికా నాయికల సంగతి చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు, జమున ఒకరిని మించి ఒకరు తమ అందంతో, హావభావాలతో మనను అలరించారు. (ఇది మేకప్పు మహిమైనా) భార్యాభర్తలు ఒకరినొకరు దోచుకుంటూ, ఒకరి మనసుల్లో ఒకరిని దాచుకుంటూ , ఒకరికొకరై ఉండే జీవితకాలపు అనుబంధానికి దాసులై ప్రేమలో కరిగిపోవాలని ఎంత అందంగా చెప్పారో??

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008