Friday 30 July 2010

తనువూ .. మనసూ.


ఈ టపా రాయడానికి కారణం నిన్న మా డాక్టర్ చెప్పిన మాటలు. ఇవే మాటలు నేను ఎంతో మందికి ఎన్నో సార్లు చెప్పాను. విన్నాను కూడా.కాని ఎందుకో ఈసారి ఈ మాటలే నా మనసును కెలికి ఆలోచింప చేసాయి. ఏంటంటే..


జీవితం అన్నప్పుడు ప్రతీ ఒక్కరికి సంతోషం, బాధ , ఆవేదన, ఆవేశం ,ఆనందం అన్నీ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అనుభవం. ఒక్కో ఆలోచన. ఈ మనసు ఉందే. చాలా చిత్రమైంది. అది మనలను ఆడిస్తుందా? మనం దానిని ఆడిస్తున్నామా? అర్ధం కాదు. ఎటువంటి సంఘటనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి , నెగటివ్ గా ఆలోచించొద్దు అంటారు. కాని ఎంత మంది అలా ఉండగలరు? చెప్పినంత తేలికగా ఆ పరిస్థితిని ఎదుర్కోగలరా?? కొన్ని సార్లు ఎలా ఉంటుంది అంటే ఆ వ్యక్తీ మనసులో చెలరేగే ఆలోచనలు ఎవరికీ అర్ధంకావు? చూడడానికి బానే కనిపించినా లోలోపల అగ్నిపర్వతంలా ఉంటుంది మనసు. అది కోపంతో అయినా, బాధతో అయినా సరే.. సంతోషం ఐతే వెంటనే బయటకొచ్చేస్తుంది. అడగకున్నా అందరికీ చెప్పాలనిపిస్తుంది. కాని కొన్ని సార్లు ఎవరికీ చెప్పలేని , పంచుకోలేని సమస్య వస్తుంది. చెప్పినా కూడా ఎవరూ అర్ధం చేసుకోరు అని మరింత కృంగి పోతారు. ఈ బాధ , డిప్రెషన్ అనేది ఎవరికీ వారు వెంటనే అణగదొక్కి ,పరిష్కారం ఆలోచిస్తే కాని మామూలు మనిషి కాలేరు. అలా కాకుండా లోలోపల కుమిలిపోతూ, బాధపడుతుంటే క్రమంగా అది శరీరంపై ప్రభావం చూపిస్తుంది. కనిపించని మనసు బాధ కనిపించే శరీరం అనుభవిస్తుంది. మనసుకు ఎక్కువ కష్టం కలిగించకుండా దానిని బుజ్జగిస్తే బాధ తగ్గుతుంది. ఒక్కోసారి మనిషి ఎంతగా కృంగి పోతాడంటే ఛీ ఈ వెధవ బ్రతుకు ఎందుకు చచ్చిపోతే మేలు అనుకుంటాడు.ఇదే ఆత్మహత్యలకు దారితీస్తుంది. కాని మనలో ఉన్న మనసుకు మనని నిర్మూలించే అధికారం ఎందుకివ్వాలి?? మనసుకు గాయమైతే దాని ప్రభావం శరీరం పై పడుతుంది అని చెప్పాగా.. ఎందుకంటే ఈ రోజు బిపి, షుగర్ లాంటి వ్యాధులు సర్వసామాన్యమైపోయాయి. కారణం టెన్షన్ , stress అంటారు డాక్టర్లు. వాళ్లకేంటి అలాగే చెప్తారులే అని కొట్టిపారెయోచ్చు.కాని అది నిజమే కదా. ఈ డిప్రెషన్ అనేది ఎన్నో వ్యాధులకు దారి తీస్తుంది.మనకు మనం బయటపడకపోతే అంతే సంగతి.. కాదంటారా??


కాని ఇక్కడ నా సందేహం ఏంటంటే??


మనసులోని బాధ శరీరానికి హాని కలిగిస్తుంది. కాని శరీరానికి గాయమైతే అది మనసుకు తగుల్తుందా?? కాలికి దెబ్బ తగిలింది.గుండె నొప్పి వచ్చింది. ఆపరేషన్ చేయాలి అన్నారు. అందరూ దిగులు పడిపోరు కదా. డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు వేసుకుంటారు.తగ్గిపోతుంది. మరీ సీరియస్ , మేజర్ ఆపరేషన్లు, వ్యాధులు ఐతే కొంతమందికి దిగులు, భయం ఉంటుంది. డబ్బుల గురించి, ఆపరేషన్ అయ్యాక బ్రతుకుతానో లేదో, పిల్లలు ఏమవుతారో అని? .. తగ్గిపోయాక అంటా మామూలే. అంతే కదా. ఇంతకంటే ఎక్కువ ప్రభావం ఏముంటుంది మనసు మీద.. ఇపుడు చెప్పండి...


మనసు బాధ శరీరం అర్ధం చేసుకుంటుంది తాను కూడా బాధపడుతుంది కాని శరీరం బాధ మనసుకు తెలుస్తుందా??

మరో విషయం చెప్పాలండోయ్.. నాకు ఎప్పుడైనాగాని తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఏదైనా సరే మా శ్రీవారు " నువ్వు అస్తమానం కంప్యూటర్ ముందు కూర్చుంటావ్ అందుకే వచ్చింది " అని తేల్చేస్తారు. అదన్నమాట సంగతి.. ప్చ్..

Sunday 25 July 2010

సాక్షిలో నవపారిజాతాలు




ఈ రోజు సాక్షి ఫండే లో నవపారిజాతాలు పుస్తక సమీక్ష ప్రచురించబడింది. ఇంతకు ముందు ఇదే పుస్తకం మీద మరింత వివరంగా పుస్తకంలో రాసిన సమీక్ష కింద ఇస్తున్నాను..

“షట్కర్మయుక్తా కులధర్మ పత్నీ” అన్నారు మన ప్రాచీనులు. మరి ఈ మాటను ఎంతమంది పాటించారో, పాటిస్తున్నారో తెలీదు. నేటి మహిళ ఇల్లాలుగా, కోడలిగా, అమ్మగా, అత్తగా ఇంట్లో ఉండి ఎన్నో పాత్రలు విజయవంతంగా పోషిస్తుంది. తనవారిని ఆదరిస్తుంది. ప్రేమిస్తుంది. అదే విధంగా కుటుంబ నిర్వహణలో నేనున్నానంటూ భర్తకు తోడుగా పని చేయడానికి గడపదాటి బయట కూడా ఎన్నో బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఉంది. ఇలా ఎన్నో రకాల శక్తిసామర్ధ్యాలు కలిగిన స్త్రీలు ఈనాడే కాదు ప్రాచీన కాలంలో కూడా ఉన్నారు. ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావించబడిన కొందరు విశిష్ట మహిళలను, స్త్రీత్వాన్ని నింపుకున్న గోవు, హంసలను కూడా కలుపుకుని నవపారిజాతాలుగా మనకు అందించారు డా. రాఘవమ్మ, డా.సీతాలక్ష్మి, డా.విజయలక్ష్మి.. ముప్పై ఏళ్లకు పైగా తెలుగు అధ్యాపక వృత్తి నిర్వహించి ప్రస్తుతం విశ్రాంత జీవితం సాగిస్తూ కూడా సాహిత్యసేవ చేస్తున్న వీరి కృషి ప్రశంసనీయం. ఈ రచన కోసం వీరు ఎంచుకున్న కావ్యాలు భోజరాజీయం, వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, ఆంధ్రభారతం, విరాటపర్వం, గోపీనాధ రామాయణం మొదలైనవి.

ఈ పుస్తకంలోని తొమ్మిది కథలలో ఒక్కో రచయిత్రి ప్రాచీన తెలుగు సాహిత్యం నుండి మూడేసి పారిజాతాలను మనకు అందించారు. ఆ పారిజాతాల చిరు పరిచయం..



డా. వి.వి.రాఘవమ్మ


1. ఆదర్శ సతి సీత ..


తెలుగు సాహిత్యాన్ని తేనెలూరు తీయని మాటలతో గద్యపద్యాలతో అందమైన కావ్యంగా మలచిన మొల్ల రామాయణాన్ని వాల్మీకి రామయణంతో అనుసంధించి సీతమ్మ చరిత్రను పరిశీలించారు రచయిత్రి. మానవ జీవన విధానంలో అవాంతరాలు సహజమే. అందునా కుటుంబం, సమాజంలోని వ్యక్తుల వల్లకూడా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని ఎలా అధిగమించాలో, ఆచరించాలో తమ అనుభవంతో చాటి చెప్పినవారు సీతారాములు. శ్రీరామచరిత్రలో నాయికయేగాక , రాముడికి మార్గనిర్దేశం చేసి కర్తవ్యోన్ముఖున్ని చేసిన దివ్య పాత్ర సీతది. సకల సద్గుణ రాశి, అయోనిజ ఐన సీత రామునిచే ఆరాధింపబడింది. తాను తరించి అతనిని తరింపచేసింది. శారీరక స్థితిని బట్టి స్త్రీలు అబలలు అంటారు కాని అవసరమైన వేళలో నైతిక, మానసిక బలప్రదర్శనలు చేయగల సబలలు అని ఎందరో నిరూపించారు. సీత కూడా ఆ కోవకు చెందిన ధీరవనిత.



2.మహారాజ్ఞి మండోదరి


రామాయణంలో ఒక ముఖ్యపాత్ర రావణాసురుడి ధర్మపత్ని మండోదరి. గోపీనాధ రామాయణంలో శ్రీరాముడి ఔన్నత్యాన్ని, ధర్మస్వరూపాన్ని చాలా పాత్రల నోట వినిపించాడు కవి.. మండోదరి ఉత్తమ ఇల్లాలైనా ధూర్తుడైన భర్త వల్ల ఆవేదన పాలైంది. ఆమె వ్యక్తిత్వం మిక్కిలి ప్రశంసనీయమైంది. దానవకులానికి చెందిన స్త్రీ ఐనా మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. సీతవలె అయోనిజ ఐన మండోదరి పంచకన్యలలో చేర్చబడింది. ఎంత గొప్పవాడైనా నీతిహీనుడైన భర్త లభించిన కాంతలకు మిగిలేది చింతలే తప్ప సుఖం లేదన్నదానికి మండోదరి జీవితం ఒక సాక్ష్యం. నేటికీ ఎందరో స్త్రీలు ఇదే విధంగా బాధలు అనుభవిస్తూ బ్రతకలేక, చావలేక కుమిలిపోతున్నారు. “సీత నీ పాలిట కాళరాత్రి ఆమెను అపహరించి చాలా పెద్ద తప్పు చేసావు. వంశనాశనము నివారించాలంటే ఆమెను శ్రీరాముడికి అప్పగించ” మని భర్తను హెచ్చరించిన విజ్ఞానమూర్తి. గోపీనాధ రామాయణంలో మండోదరిని కవి విద్యా సంపద, సంస్కృతీ సంప్రదాయాలు, వినయాహంకారాలు అన్నింటినీ పరిపుష్టిగా సృష్టించి ఆమెనొక మహోన్నత మహిళగా సృజించాడు వేంకటకవి.



3. స్వయంప్రభ


రామాయణంలో ప్రధాన కథాగమనానికి ఎన్నో పాత్రలు తమ సహాయ సహకారాలు అందించాయి.. సుగ్రీవుడు, హనుమంతుడు, జటాయువు , శబరి . విభీషణుడు. శబరి కాక మనకు తెలీని మరో స్త్రీ కూడ రామకధకు తన వంతు సాయంచేసింది. ఆమే స్వయంప్రభ. సీతాన్వేషణకు బయలుదేరిన వానరులకు మార్గమధ్యంలో అలసిన వేళ వారి ఆకలి తీర్చి, శ్రమను పోగొట్టి మార్గాన్ని సూచిస్తుంది. తపోనిష్టతో, దివ్య తేజస్సుతో విరాజిల్లే స్వయంప్రభ హనుమకు తన జన్మవృత్తాంతాన్ని, ఋక్షబిలాన్ని, విశేషాలను వివరిస్తుంది. సీతాన్వేషణనకు బయలుదేరిన వానరులకు అగమ్యగోచరంగా ఉన్న వారి మార్గంలోని అవరోధాల్ని తొలగిస్తూ ఎలా సాగిపోవాలో వివరించి సీతాన్వేషణకు వనగమనాన్ని సుగమం చేసి తన దారిన తాను పోతుంది.



డా. సీతాలక్ష్మి


1. సైరంధ్రి.


కారణజన్మురాలై, స్వయంవరమున అర్జునుడు తనను వరించినా కుంతీ దేవి ఆదేశం మేరకు పంచపాండవులకు ఇల్లాలై వారితో పాటు కష్ట సుఖాలు పంచుకుంది ధ్రౌపది. ఉపాఖ్యానాలు లేని చక్కని , చిక్కని కథ కలిగిన ఐదాశ్వాసాల పర్వం విరాట పర్వం. మాయాద్యూతమున ఓడిన పాండవులు తమ ధర్మపత్నితో సహా మారువేషాలలో గడిపే సమయంలో ద్రౌపది ఎంచుకున్న సైరంధ్రివృత్తి కేవలం పరిచారికగా కాక మహారాణిని అలంకరించి, ఉల్లాసం కలిగించే గౌరవప్రదమైన వృత్తి. అపూర్వమైన ఆమె సౌందర్యానికి మోహితుడైన కీచకుడు నిండు సంభలో అవమానించినా నిగ్రహించుకుంటుంది. ఒకానొక సమయంలో ధర్మజుని నిందించినా తర్వాత ఆతని అసహాయతని అర్ధం చేసుకుంటుంది. తన పరాభాగ్నితో భీముని కీచకవధకు కర్తవ్యోన్ముఖున్ని చేసి దుష్టశిక్షణలో అతనికి తోడ్పడుతుంది. పంచమహాపతివ్రతల్లో ఒకతైన ద్రౌపది తక్కినవారికన్నా భిన్నమైన జీవితం గడిపింది. ప్రతి మహిళ సమస్యలను సమయస్ఫూర్థితో, సమయానుకూలంగా , సరియైన రీతిలో ధైర్యంగా ఎదిరించే పోరాడే మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని సైరంధ్రిగా ద్రౌపది హెచ్చరిస్తుంది.



2. సత్యగోవు


ధర్మానికి ప్రతినిధి ఐన గోవు హిందువులకు ఎంతో పవిత్రమైనది, పూజనీయమైనది. అనంతామాత్యుడు భోజరాజీయంలో గోవును అఖండ సత్యవ్రతగా చిత్రించాడు. ఇందులో సత్వగుణంగల గోవు, వ్యాఘ్ర సంవాదమును అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒకనాడు కపిల అనే గోవు దారితప్పి మందనుండి విడివడి ఒక పులి చేత చిక్కుతుంది. తాను ఎలాగూ ఆ వ్యాఘ్రానికి ఆహారం కాబోతున్నందున ఒక్కసారి తన బిడ్డను చూసి, సఖులు, బంధువులందరికీ చెప్పి మరల వత్తునని ప్రమాణం చేసి ఆడిన మాట తప్పనని శపథం చేస్తుంది. చావు నుండి తప్పించుకుని వెళ్లి మళ్లీ వచ్చి తనకు ఆహారమవుతానన్న గోవు మాటలకు ఆ పులి ఆశ్చర్యపడినా నమ్మకముతో వెళ్లిరమ్మంటుంది. కపిల తన బిడ్డ వద్దకు వెళ్లి ఆకలి తీర్చి, తను లేనప్పుడు ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మెలగాలో అన్ని జాగ్రత్తలు చెప్తుంది. సఖులు, బంధువులు వెళ్లవద్దని వారించినా తిరిగి వ్యాఘ్రం వద్దకు వెళ్తుంది. భోజరాజీయములో అనంతామాత్యుడు తీర్చిదిద్దిన గోవు సత్యవాక్పరిపాలనకు, ఆదర్శ మాతృత్వానికి నిదర్శనము. భయంకరమైన వ్యాఘ్రము కూడా కపిల సత్యవాక్య మహిమచే పరమసాధువుగా మారి ఆ గోవుతో ధర్మసూత్రాలు చెప్పించుకుంటుంది.



3. పుష్పగంధి


భోజరాజీయంలోని ఉపాఖ్యానాలలో ఎన్నెన్నో ఉపకథలతో పెనవేసుకున్న అద్భుతమైన కథ పుష్పగంధి. యమునితో పొరాడి భర్త ప్రాణాలను తిరిగి దక్కించుకున్న సావిత్రితో పోల్చదగిన శీలవతి పుష్పగంధి. అపురూప సౌందర్యవతి, ప్రజ్ఞాపాటవాలు గల మనోహరమూర్తి, విద్యావతి. కాని ఆమెని వివాహమాడినవాడు వివాహమైన తొమ్మిది దినాలకే బ్రహ్మరాక్షసుని పాలపడతాడు అన్న జాతకదోషం ఉన్న దురదృష్టవంతురాలు. పుష్పగంధికి వివాహమైన తర్వాత ఒకరోజు ఏకాంతంగా ఉన్నవేళ బ్రహ్మరాక్షసుడికి చిక్కిన అమె భర్త రత్నమండనుడు అతి కష్టం మీద తన వారిని చూసి వస్తానని రాక్షసుడి దగ్గర అనుమతి పొంది పుష్పగంధి దగ్గరకు వస్తాడు. ఇది తెలుసుకున్న పుష్పగంధి అధైర్యపడక అతను రాక్షసుడికి చేసిన శపధం గురించి తెలుసుకుని అతడిని తిరిగి పంపివేస్తుంది. ఎంతమంది నిందించినా వెరవక భర్త ప్రాణరక్షణార్ధం అతడికి తెలియకుండా వెంబడించిన ధైర్యశాలి. తన భర్త చేత ఏ శపధం చేయించుకుని బ్రహ్మరాక్షసుడు అతనిని తన వద్దకు పంపాడో అదే రీతిలో రాక్షసుని గెలిచి తన పతి ప్రాణములు దక్కించుకుంటుంది. ఇక్కడ సమయానికి తగిన విధంగా పుష్పగంధి చూపిన చొరవ, ధీశక్తి, ధైర్యసాహసములు సామాన్య స్త్రీలకే కాదు రాచవనితలకు కూడా మార్గదర్శకము. ఆపదలు కలిగినప్పుడు బెదరక, దానిని ఎదుర్కొని అధిగమించుట ముఖ్యము అని పుష్పగంధి నిరూపించింది.



డా. విజయలక్ష్మి



1. కుంతీ మాతృత్వం


మహభారతంలో కుంతీ మాతృత్వం అత్యంత ప్రధానమైనది. దూర్వాస మహాముని వరప్రభావమున పెళ్లికాకముందే సూర్యుని వలన సహజ కవచకుండలాలతో ఉన్న పుత్రుని కంటుంది. కాని కన్యగా ఆ బిడ్డను పెంచి, ఆనందించలేక ఆమె పడే మానసిక ఆందోళనను ఆదిపర్వమున నన్నయ, అరణ్యపర్వమున ఎఱ్ఱన అత్యంత మనోజ్ఞంగా వర్ణించారు. లోకనిందకు భయపడి పుట్టిన బిడ్డను నదిలో వదిలేస్తుంది కుంతి. అస్త్రవిద్యాప్రదర్శనలో కర్ణుని చూసి గుర్తించినా తన పుత్రుడని చెప్పలేక తల్లడిల్లిపోతుంది. చివరికి తన పెద్దకుమారుడే శత్రువులా తన తమ్ముళ్లతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు కూడా ఆతడు తన కుమారుడని చెప్పలేకపోతుంది. కర్ణుని గురించిన హృదయవేదన కుంతీదేవిని జీవితాంతం వెంటాడుతుంది. సవతి పుత్రులైన నకులసహదేవులను కూడా తన పిల్లలతో సమానంగా పెంచింది. ప్రేమించింది. పంచపాండవులను ఎప్పుడూ కలిసి ఉండమని, ఏదైనా సరే సమానంగా పంచుకోమని చెప్తుంది. రాచబిడ్డలైన తన పుత్రులు అడవులపాలై అష్టకష్టాలు పడడం చూసి ఆ మాతృమూర్తి ఆవేదన వర్ణనాతీతమైనది. ఆ మాతృమూర్తి దుస్థితి , ఆవేదన మన కళ్లకు కట్టినట్టు కవిబ్రహ్మ చిత్రించాడు.



2. రుక్మిణి


పోతన విరచితమైన మహాభారతం ఒక సమగ్ర వ్యక్తిత్వం, సార్వకాలిక ప్రయోజనమును సాధించిపెట్టిన పురాణము. భక్తి మార్గములో తీర్చబడిన ఈ పురాణంలో రుక్మిణీ కళ్యాణం దశమ స్కందములో రచించబడింది. సాక్షాత్తు లక్ష్మీ దేవి అంశ ఐన రుక్మిణి బాల్యము నుండి శ్రీకృష్ణుని ఆరాధించి తన ప్రేమను ఒక బ్రాహమణుడి ద్వారా కృష్ణుడికి పంపి తనను తీసికెళ్లమని సందేశం పంపింది. అతడిని చేపట్టింది. అతిథి సేవ, పతి సేవ,ధర్మనిష్ట, సహనశీలత, దైవభక్తి మొదలైన విశిష్ట లక్షణాలతో రుక్మిణి శ్రీకృష్ణుడికి ఆత్మ నివేదన చేసుకుని భక్తితో ఆరాధించి ధన్యురాలయింది.



3. శుచిముఖి


పింగళి సూరన రాసిన ప్రభావతీ ప్రద్యుమ్నములో ప్రధాన సూత్రధారిణి సరస్వతిదేవి పెంపకంలో పెరిగిన రాయంచ శుచిముఖి. ఇంద్రుడు తన శత్రువు వజ్రనాభుడి ప్రాంతంలో విహరించి అక్కడి వివరములు సేకరించు కార్యనిర్వహణకు శుచిముఖిని పంపిస్తాడు. వజ్రనాభుడి కుమార్తె ప్రభావతికి, శ్రీకృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నులకు అనురాగం వృద్ధి చేసి వారి వివాహమునకు కారణభూతురాలు కావలెనని దేవేంద్రుడు శుచిముఖిని కోరతాడు. దానికి అంగీకరించిన పక్షిరాజము ఇటు ప్రద్యుమ్నుని కలిసి అతనికి ప్రభావతిపై అనురాగము కలుగచేస్తుంది. అదే విధంగా ప్రభావతికి తగినవాడు ప్రద్యుమ్నుడే అని తన చమత్కారముగా తెలియచేస్తుంది. చివరకు వజ్రనాభుని కూడా తన వాక్పటిమతో వీరివురి ప్రేమవృత్తాంత్తాన్ని తెలిపి వివాహమునకు అంగీకరింపచేస్తుంది. నిర్మలహృదయంతో దేవకార్యము నెరవేర్చి దనుజ సంహారానికి దేవేంద్రుని అభ్యుదయానికి ప్రధాన భూమిక పోషించింది శుచిముఖి..


ఈ పుస్తకంలోని ఒక పారిజాతాన్ని ఆస్వాదించాలంటే ఇక్కడ చూడండి.

పుస్తకం వివరాలు


ప్రతులకు..
వెల : రూ.101 /-
Dr.V.V.Raghavamma
4-1-37 , Travvakalva Road
3rd Cross Line, SNP Agraharam
Bapatla – 5221010
Guntur District.


అమెరికాలో


Dr.Seethalakshmi (001)-401 636 0316

Wednesday 21 July 2010

వెండి వెన్నెల జాబిల్లి - సుశీల




నవపారిజాతాలు పుస్తక రచయిత్రి డా.సీతాలక్ష్మిగారు నాకు ఇచ్చిన అమూల్యమైన కానుక ఈ వ్యాసం. సీతగారి మాటలకు పాటలు జతచేర్చాను. కొన్ని పాటలు దొరకలేదు.

మధుమాసపు ప్రత్యూషమా
మత్తకోకిల మధురస్వరమా
ఉత్పలాల సోయగమా,
చంపకాల అందమా
పారిజాత పరిమళమా,
మందార మకరందమా
గోదావరి తరంగమా,
వెన్నెలమ్మా సంతకమా
గంగానిర్ఝరీ ప్రవాహమా,
తెలుగుభాష తీయందనమా
నవరసాల సారమా, వైవిధ్య భరితమా
వాసంతపు వాక్సుద్ధీ, గ్రీష్మాదిత్య నైశిత్వం
వర్షఋతువు ఆర్ద్రత, శరదృతువు స్వచ్చత.
శిశిరపు ఒద్దిక, హేమంతపు పొందిక

ఎన్నో… ఎన్నెన్నో… సుశీలమ్మ స్వరాల సుగంధాలు

నవరసాల్ని నవకంగా, సన్నివేశపరంగా, సరసంగా ఆవిష్కరించగలిగిన ప్రజ్జాశాలి శ్రీమతి సుశీల. సరస సంగీతసాహిత్య సీమలో సరిలేని సుమధుర గాయని ఆమె. గోదారి, వెన్నెల, మల్లెలు, పారిజాతాలు, మలయానిలాలు ఆ కల్యాణి కంఠాభరణాలే.

రేడియోలు ఇంటింటా లేని రోజుల్లో మా ఊరు బాపట్లలో సినిమా పాటలు పగలు గూడురిక్షా మైక్ల్లోను, రాత్రివేళ ఎక్కడో చాలా దూరంనుండిన్నీ వినిపిస్తూ వీనులవిందు చేసేవి. ఐతే అప్పట్లో ఆ పాటల్ని పాడిన లతా, రఫీ, కిషోర్, గీతా, ఘంటసాల, జిక్కి, లీల, భానుమతి గార్ల పేర్లు కూడా అంతగా తెలియవు. ఆ చిన్నవయసులో మనసుకు క్రొత్తగా అందిన పాట “బలే తాత మన బాపూజీ” సందెగొబ్బెమ్మ చుట్టూ తిరిగి పాడే రాముడి పాటలు, కృష్ణుడి పాటలే కాక క్రొత్తగా నేర్చుకున్న “బృందావనమది అందరిదీ” పాట కూడా జత కలిసింది. అట్లతద్దె, ఉండ్రాళ్లతద్దె రోజుల్లో తదియ చంద్రుడి వెన్నెల్లో గోరింటాకు చూసుకుంటూ ఉయ్యాలలూగుతూ స్నేహితులతో “సుందరాంగ మరువగలేనోయ్” పాడుకోవటం నాకిప్పటికి తీపిగుర్తు. కాలమెంత మారినా ఎన్ని కొత్త స్వరాలు సంగీత రసఝరిలో చేరినా నాకు మాత్రం సుశీలగారి పట్ల నాటినుండి నేటివరకు చెక్కుచెదరని అభిమానం. 1958 ప్రాంతాల్లో మా ఊళ్లో భయంకరమైన కలరా వచ్చింది. వేడి అన్నం, పాత చింతకాయ పచ్చడి, వేడిచారు, త్రాగడానికి వేడినీరు. నెలరోజులపాటు ఇదే మా ఇంట్లో భోజనం. స్కూళ్ళకు నిరవధికంగా శలవులు ఇచ్చారు. ఊరంతా పోలేరమ్మ జాతరలు జరిపారు. కలరా అంటే దేవుడికి మనమీద కోపం వచ్చిందని అందువల్ల దైవప్రార్ధన చేయాలని పెద్దవాళ్ల బోధ. పదేళ్ల వయస్సున్న నేను మా చెల్లెల్ని పట్టుకొని కళ్ళు మూసుకొని “పాలకడలిపై శేషతల్పమున”, “నారాయణా హరి నారాయణా”, పాటలు గట్టిగా పాడుకున్న సన్నివేశం ఈనాటికి నాకళ్ళముందు కనిపిస్తుంది. దేవుడి ప్రార్ధన కూడా సుశీలగారి పాటలే. భయంవేసినా, భక్తి కలిగినా, సంతోషమైనా, బాధకలిగినా ఆ భావాన్ని చిన్నతనంలో గట్టిగా, పెద్దయ్యాక మెల్లగా సుశీలగారి పాటలతో అనుభవించడం నాకు బాగా అలవాటై పోయింది.

తన పాటల్లోని సాన్నిహిత్యాన్ని ఆమె ఆస్వాదించి ఆలపించటంతో ఉండే ప్రత్యేకత నన్నాకర్షించింది. ఆమె పాటల్ని వింటూ చకాచకా కాగితం మీద సరిగ్గా వ్రాయగలమంటే అది ఆవిడమాట పలికేతీరు, పలుకుదనంలోని స్పష్టత.

తన స్వరం జమున స్వరానికి చాలావరకు సరిపొతుందని తానే స్వయంగా తెల్పిన సుశీలగారు సావిత్రికి పాడినా, అంజలీదేవికి పాడినా చివరకు నిన్నటితరం యువనాయికలకు పాడినా పాటకు న్యాయం చేయడంలో ఏ మాత్రం తేడా చూపలేదు. నటిగాత్రం, సన్నివేశం, కథ, ఔచిత్యాలను బట్టి తన గాత్రంలో అద్భుతమైన వైవిధ్యాన్ని చూపిస్తూ తన స్వరాన్ని ఎందరెందరో నాయికల నోట పలికించి మనకు వినిపించి మంత్రముగ్ధుల్ని చేసారు.

పద్యాన్ని ఆమె ఆలపించేతీరు అద్వితీయం . రమ్యమైన గీతం రసాత్మక కావ్యంతో సమానమై రసహృదయుల్ని ఆనందపరవశుల్ని చేస్తుంది . నవరసాలు ఆమె గళంనుండి జాలువారి వాటి ఉనికిని నిలబెట్టుకున్నాయి. ఎన్నిపాటలు, ఎన్నిరాగాలు, ఎన్నిభావాలు…

శిరీష కుసుమ సదృశమైన లాలిత్యంలో శృంగార రసభరితమైన కొన్నివేళ పాటల్ని ఆమె మనకందించారు. ఆ అమృత రసఝరిలో ఈనాటికీ మనం మునకలు వేస్తూనే ఉన్నాం. “అనురాగం విరిసేనా”, “మాధవా ననులాలించవా”, “ మామచందమామ ”, “బాలనురా మదనా”, “అందెనునేడే”, “అందాలబొమ్మతో”, “ కనులలో కులుకులే ”, “మల్లెపూవులు విరిసెరా”, “మీరజాలగలడా”…….. ఇలా ఒకటా రెండా వందలాది శృంగారరసభరిత మనోహర గీతాలు సుశీలమ్మ మనకు ప్రసాదించిన వరాలు. “అనురాగము విరిసేనా” పాటలో సాహిత్యం గొప్పదా సంగీతం గొప్పదా అంటే ఆ రెండింటి సౌందర్యాన్ని తన గాత్రంలో పరిమళింపజేసిన సుశీలగారి స్వరసౌరభమే గొప్పదని నిస్సందేహంగా చెప్పవచ్చు. “మీరజాలగలడా” పాటను స్థానం నరసింహారావుగారి బాణిలో ఎందరు పాడినా సుశీల గీతమే సత్యభామకు ప్రాణప్రతిష్ట చేసి అజరామర కీర్తిని తెచ్చింది.

ఇక హాస్యరసాన్ని మధురమైన కంఠంలో పలికించడం కొంచెం కష్టమే. కాని “పిల్లాపిల్లారా పెళ్లి చేసుకో”, ”నీకోతోడుకావాలి ”, “పొరుగింటి మీనాక్షమ్మను చూసారా”,”ఇంటింటి రామాయణం” వంటి పాటల్లో సున్నితమైన హాస్యంతో పాటు సునిశిత సందేశాన్ని కూడా అందించి హాస్యరసాన్ని సైతం అనేక సందర్భాల్లో అద్భుతంగా పండించిన సుహాసిని సుశీల. సుశీల ఆలపించిన శోకభరిత గీతాలు మనసుల్ని ఆర్ద్రం చేసి కళ్లని తడిపేస్తాయి. “కనులకొకసారైనా”,”అమ్మా చూడాలి ”, “వెన్నెలవేళలు”, “ఏనాటికైనా మూగవీణా”, “పెనుచీకటాయే లోకం”, “నీచెలిమి నేడెకోరితిని ” వంటి పాటలు మనల్ని కదిలించేవీ,కరిగించేవీ.

ఉత్సాహభరితమైన వీరరసం పలికించటానికి ఉత్కృష్టమైన కంఠస్థాయి ఉండాలి. “లేరు కుశలవులసాటి”, “సవనాశ్వంబిది”(పద్యం) వంటి వీరరస ప్రధానమైన పాటలకు , పద్యాలకు నేటికీ వన్నె తరుగలేదు. జయభేరిలో మల్లాదివారి “సంగీతసాహిత్యమే” పాటలలో సుశీలగారు నవరసాల్లో విశిష్టమైన వీరరసశృంగారాలనద్భుతంగా మేళవించారు.

భయానక, బీభత్సాలు కోమలమైన కంఠం నుండి వెలువడాలంటే ఆ గాత్రధారి పాత్రలోనేకాక సన్నివేశంలో కూడా పరకాయ ప్రవేశం చేయక తప్పదు. “నినువీడని నీడని నేను”, “.. నా రాజా, రావారావా” వంటివి ఈ కోవకు చెందినవే. కాగా “దుర్వారోద్యమ” పద్యంలో మొదటి రెండు పాదాల్లో పాండవుల పరాక్రమ ప్రశంసను వీరరసంలోను, తర్వాత రెండు పాదాల్లో కీచకుని పట్ల జుగుప్సను వ్యక్తపరుస్తూ బీభత్సాన్ని వైవిధ్యభరితంగా సమ్మేళనం చేసిన సుశీల అద్వితీయురాలు కాదా.

క్రోధం మూలమైన “భద్రకాళివంటి వీరరుద్రమాంబ మాసోదరి”, “మహాదేవశంభో” వంటి పాటలు సుశీలగళం అందించిన రౌద్రరస ప్రతీకలు, విస్మయాన్ని కలిగించే అద్భుతరసంతో శ్రోతలను సమ్మోహనపరిచే సుశీలమ్మ గీతాలలో కొన్ని చూడండి. ఎవరివల్లైతే ఏ సన్నివేశాల్లో అయితే తనకు మరణం రాకూడదని హిరణ్యకశిపుడు వరాలు కోరాడో వాటికి విరుగుడు “కలడంభోధి” పద్యంలో ఉంది. సుశీలగారా పద్యాన్ని మహాగడుసుగా పాడారు. “మధురమైన గురుదీవనా”, వేణుగానమ్ము వినిపించెనే”, “ఎవరవయా”, “స్వాగతం కురుసార్వభౌమా”, “రాయినైనా కాకపోతిని”, “ఎవరునేర్పేరమ్మా ”, “పాటల్లో పాడలేనిది” లాంటి ఎన్నో అద్భుతమైన పాటలు సుశీలమ్మవే.

శాంతం కరుణకు సన్నితురాలు. “కలలుకనే వేళయిదే కన్నయ్యా”, “ మీ నగుమోము”, “కనరానిదేవుడే”, “అందెనా యీ చేతుల”వంటి చక్కని పాటలు, “మందారమకరంద”, కంజాక్షునకుగాని కాయంబు” వంటి సుమధురమైన పద్యాలు మనల్ని సేదదీర్చే శాంతరస ప్రధానాలు.

భక్తిని కూడా రసంగా అంగీకరించే పక్షంలో సుశీలమ్మ పారవశ్యంతో, తాదాత్మ్యంతో గానం చేసిన భక్తి గీతాలు కోకొల్లలు. ఆ రతనాల రాశులలో “నీవుండేదా కొండపై”, “పాలకడలిపై”, “తిరుమల తిరుపతి వేంకటేశ్వరా”, “జగదేకమాతాగౌరీ”, “హ్రీంకారాసన” వంటి మణిమాణిక్యాలు ఎన్నెన్నో. ఇక పోతనగారి పద్యమందారాలకు మకరందాలద్దిన సుమనోహర సుశీలమ్మ తన గాత్రంలో నవరసాలకు ఔపోసన పట్టిన వీణాపాణి.

సుశీలగారు అష్టవిధ నాయికలలో పరకాయ ప్రవేశం చేసిన తీరుపై ఒక విహంగ వీక్షణం. “మనసే కోవెలగా”, “ప్రేమ నిండిన యిల్లే” వంటి నాజూకైన పాటలలో స్వాధీన భర్తృకగా, “పాడవేల రాధికా”, “మల్లెపందిరి నీడలోన”, “వస్తాడు నారాజు ఈరోజు ”, “నీపేరు తలచినా చాలు”, మొదలైన గీతాల్లో వాసకసజ్జికగా, “వినిపించని రాగాలే”, “నీదయ రాదా”, “సన్నగవీచే చల్లగాలికి”, “నీవులేక వీణా”, ’సఖియా వివరించవే” వంటి సన్నజాజుల సమూహంలో విరహోత్కంటితగా, “నడిరేయి గడిచేనే”, “నిదురించే తోటలోకి” వంటి సుతిమెత్తని పాటల్లో విప్రలబ్ధగా, “ముందటివలెనాపై”, “ఏమనిపాడెదనో” వంటి గీతాల్లో ఖండితగా “పెనుచీకటాయే లొకం” “మనసా కవ్వించకే” మొదలైన పాటల్లో కొంతవరకు కలహాంతరితగా , “కన్నుమూసింది లేదు”, “నీవురావు నిదురరాదు” , “రేపల్లె వేచెను” వంటి ఆర్ద్ర గీతాలలో ప్రోశితభర్తృకగా , “నిన్నే వలచితినోయీ, కన్నుల్లో దాచితినోయీ, వెన్నెల్లో వేచితినోయీ, నీకై అభిసారికనై”, “నిన్నటిదాకాశిలనయినా ” మొదలయిన గీతాల్లో అభిసారికగా దర్శనమిచ్చే సుశీలమ్మ నవరస రాగరాగిణి, అష్టవిధ నాయికా స్వరూపిణి, మదిమదినీ మురిపించే మంజులవాణి.

లాలిపాటలనైనా, వీణపాటలనైనా, అలకనైనా, ఆలాపనైనా, ప్రశ్ననైనా, సమాధాన్నైనా,దేశభక్తి గీతాన్నైనా, దుర్యోధనునితో యుగళగీతాన్నైనా, ఒకే పాటలో భిన్నపాత్రధారులకు స్వరాన్నందించినా, ఆమె ఆలపించిన తీరు బహుధా ప్రశంసనీయం. ఏభై సంవత్సరాలనుండి శశిరేఖ “అహ నా పెళ్లియంట” అని నిత్యనూతనంగా మనల్ని ఆహ్వానిస్తూనే ఉంది. “ఏమండోయ్ శ్రీవారు”, “నా మాట నమ్మితివేలా” అని కవ్వించినా, “చిన్నమాట ఒక చిన్నమాట” అని చెవిలో గుసగుసలాడినా ఆమె “సరస సరాగాల సుమరాణియే”

“కవికోకిల తీయని పలుకులలో చెలువారు నవరసాలు
కవిరాజ హంస నడకలలో కులికే వయ్యారాలు
కలవోయి “సుశీలమ్మ గళసీమ”లో “

తెలుగుసినీగాన వినీలాకాశంలో ఆమె కృష్ణపక్షం లేని వెండివెన్నెల జాబిలి..

Sunday 18 July 2010

సాక్షిలో సౌశీల్య ద్రౌపది



ఈరోజు సాక్షి ఫండేలో ప్రచురించబడిన సౌశీల్య ద్రౌపది పుస్తక సమీక్ష..


రామాయణ, భారతాది పురాణాలు భారతీయ జీవనవిధానంలోని ఔన్నత్యాన్ని ప్రదర్శించి మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఈనాడు ప్రతి మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు , సందేహాలకు తగిన సమాధానాలు ఈ పవిత్ర గ్రంధాలలో లభిస్తాయి. అందుకే ఈ పురాణగ్రంధాలు ముఖ్యంగా రామాయణ, భారతాలు యుగాలు గడిచినా ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఈ పురాణగాధలలో తరచి చూస్తే ఎన్నో అద్భుతమైన జీవితపాఠాలు మనకు లభిస్తాయి. రచయిత కస్తూరి మురళీకృష్ణగారు తన నవల “సౌశీల్య ద్రౌపది” లో నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను ఎత్తి చూపారు. ఈ నవలలో ద్రౌపది పాత్రను , ఆమె మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి ఆధునిక మహిళకు ప్రతీకగా చేసారు. ద్రౌపది అసమాన సౌందర్యరాశిగా, ధీరగా, సహనానికి ప్రతిరూపంగా, ఉచితానుచితాలు తెలిసిన ఇంతిగా, తన భర్తల పట్ల అమితమైన ప్రేమ, వారి శౌర్యపరాక్రమాలపట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన ఇల్లాలిగా చరిత్రలో నిలిచిపోయిన ఒక మహాశక్తి.


సృష్టికి మూలం స్త్రీ అంటారు. ఆమె ఆకాశంలో సగం అయింది. ఆమెయే ప్రకృతి. కాని అనాదిగా స్త్రీని కాముక దృష్టితో చూస్తున్నారు, ఆటవస్తువుగా ఆడుకోవాలని ప్రయత్నించారు. దుష్టశిక్షణ కోసం జరిగిన రామరావణ యుద్ధమైనా, దాయాదుల మధ్య జరిగిన మహాభారత యుద్ధమైనా ఘోర నష్టం జరిగింది. ఆ యుద్ధాలకు కారణం వేరైనా స్త్రీనే నిందించారు. ఒక మహోన్నత వ్యక్తిత్వం గల కారణజన్మురాలైన స్త్రీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కోక తప్పలేదు అని పాండవ పత్ని ద్రౌపది కథ తెలియచేస్తుంది. ఆమె ఎదుర్కొన్న అవమానాలు, మానసిక సంఘర్షణ, క్లిష్టమైన సమయంలో ఆమె చూపిన సంస్కారం సవివరంగా మనకు అవగతం చేసారు కస్తూరి మురళీకృష్ణగారు రచించిన "సౌశీల్య ద్రౌపది" లో. ఈ కథ చదువుతుంటే స్త్రీకి తన అందం, వ్యక్తిత్వమే శత్రువుగా మారుతుంది అని నిరూపణ అవుతుంది. పాండవుల పట్టపురాణి ఐనా కూడా కాముకుల వలన అవమానింపడింది. తన తప్పిదం లేకున్నా నిండుసభలో వస్త్రాపహరణకు గురైంది.



మహిళల జీవితంలో ఎన్ని అపోహలు, ఎన్ని అపార్ధాలుంటాయో అన్నీ తాను అనుభవించింది. ఒక పురుషుడు ఎంత ఉన్నతుడైనా స్త్రీ పట్ల అతడి ఆవగాహనకు పరిమితులుంటాయి. ఎంత ప్రయత్నించినా పురుషుడు ఓ పరిధి దాటి స్త్రీని అర్ధం చేసుకోలేడు. ఇలా ద్రౌపది తన గతం గుర్తు చేసుకుంటూ, మహాభారత యుద్దానంతరం వానప్రస్ధానం స్వీకరించి పాండవులతో కలిసి హిమాలయాలలో ప్రయాణిస్తున్న సంఘటనలతో నవల మొదలవుతుంది. ద్రౌపది స్వయంవరం, తల్లి ఆదేశం మేరకు ఐదుగురు పాండవులు ఆమెని వివాహమాడడం, వైవాహిక జీవితం, రాజసూయ యాగం, ద్యూతక్రీడ , వస్త్రాపహరణం, అరణ్యవాసం, సైందవుని పరాభవం, కీచకుని వధ, రాజసూయ యాగం , మహాభారత యుద్దం .. ఇలా కథ సాగిపోతుంది. ఎన్నో సందర్భాలలో ద్రౌపది మానసిక సంఘర్షణ, ఆవేశం, అధర్మాన్ని ప్రశ్నించడం వంటి ఎన్నో విషయాలు మనసుకు హత్తుకునేలా, ఆలోచించేలా చేసారు రచయిత. మహాభారత కథ ఏమున్నది అనుకుంటాము కాని కొన్నికొన్ని సందర్భాలలో రచయిత చెప్పిన మాటలు నన్ను కదిలించాయి..


భగవంతుడు తనకు ప్రతిగా స్త్రీని సృజించాడంటారు. భగవంతుడిలోని సహనం, క్షమాగుణం, ప్రేమ, జాలి, దయ, సౌందర్యం వంటి అన్ని లక్షణాలు తనలో నింపుకుంది స్త్రీ.


మహిళ జీవితంలో వివాహం అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. అంతవరకు పుట్టింటిలో ఎంతో ప్రేమతో పువ్వులా చూసుకుంటారు, లాలిస్తారు, బుజ్జగిస్తారు. కాని రాజకుమారి ఐనా, సామాన్య స్త్రీ ఐనా చివరికి దేవత ఐనా వివాహమాడడంతో ఆమె జీవితం మారిపోతుంది. అంతవరకు తను పెరిగిన వాతావరణం, ఎరిగిన పద్ధతులు, నేర్పిన విద్యలు అన్నీ వదిలి కొత్త జీవితం సరికొత్తగా ప్రారంభించాల్సి వస్తుంది.


పురుషుడిని స్త్రీ ఎంత నిజాయితీగా ప్రేమించినా పురుషుడికి ఆమె నిజాయితీ గురించి ఏదో మూల అనుమానం ఉంటుంది.

ద్రౌపదికి అయిదుగురు భర్తలుండడం వల్ల కాముకి అన్నారు ప్రజలు కాని ఆమెని స్వయంవరంలో గెలుచుకున్నది అర్జునుడే. తల్లి చెప్పిందని అందరూ పంచుకున్నారు. అది ఆమె తప్పు కాదే. కాని కర్ణుడు విషయమై ద్రౌపదిని వేశ్య అని సంబోధించాడు. దుర్యోధనుడు హేళన చేసి తన తొడ మీద కూర్చోమన్నాడు. అన్నవరసైన సైందవుడూ చెరబట్ట చూశాడు. ఇలా అడుగడుగునా అవమానాలు పడింది ద్రౌపది. సౌశీల్యద్రౌపది నవల ద్వారా ద్రౌపది లోని మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని మన కళ్లముందుంచారు రచయిత కస్తూరి మురళీకృష్ణగారు. ద్రౌపదిలోని ఉచితజ్ఞత మనకు అనేక సందర్భాలలో ప్రదర్శితమవుతుంది.


ఇందులో ఆడవాళ్లను పొగిడినందుకో, ఆమే గొప్పది అని చెప్పినందుకో నాకు కథ నచ్చింది అని చెప్పడంలేదు. స్త్రీ మనస్సును చదవడానికి ప్రయత్నించి అర్ధం చేసుకున్నారు అనిపించింది. ఆడవాళ్లను అందలం ఎక్కించి కిరీటం పెట్టి ఆహా, ఓహో అనక్కరలేదు. స్త్రీ కూడా మనిషే, ఆమెకు కూడా స్వంత అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, గౌరవించాలి అని మగవాళ్లు(మొగుళ్లు) అనుకుంటే చాలు. ఆనాడు ద్రౌపది వివిధ సందర్బాలలో ప్రదర్శించిన స్దితప్రజ్ఞత , కార్యనిర్వహణ నవసమాజంలో కూడా ప్రతి మహిళకు ఆవశ్యకమైన విషయాలు.


మురళీకృష్ణగారు

మీ పుస్తకంలో నాకు నచ్చనిది టైటిల్. అసలు సౌశీల్య అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది?. ద్రౌపది సౌశీల్యాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ముందుమాటలో చెప్పినట్టు, వివిధ పత్రికల్లో పుస్తక సమీక్షలో ప్రస్తావించిన యార్లగడ్డ నవల మూలంగా జరిగిన నష్టం ఏమున్నదని. అవును అందులో ద్రౌపది గురించి నీచంగా రాసారు. దానివల్ల మనకు కోపం, ఆవేశం వస్తుంది. అంతే తప్ప ద్రౌపదికి కాని, పురాణ గ్రంధాల గురించి తెలిసినవారు, పవిత్రంగా భావించేవారికి ఎటువంటి నష్టం లేదుకదా. పదే పదే నవల గురించి ప్రస్తావించి మనమే ఎక్కువ ప్రచారం కలిగిస్తున్నాము కదా. చెడును, తప్పును పదే పదే ఎత్తిచూపితే అది వాళ్లకే ఎక్కువ ప్రచారం ఇచ్చినట్టు అవుతుంది. అస్సలు పట్టించుకోకుంటే . అదే మరుగునపడిపోతుంది. ప్రహ్లాదుడికంటే హిరణ్యకశ్యపుడే విష్ణువుకు పరమ భక్తుడంట. శత్రువైన శ్రీహరిని ఆక్షేపిస్తూనే ఎక్కువసార్లు తలుచుకునేవాడంట. అందుకే ఇక్కడ యార్లగడ్డ ద్రౌపది ప్రస్తావన అనవసరం అనిపించింది.

మరో విషయం నాకు కొరుకుడుపడలేదండి..
నిజంగా ధర్మరాజు కర్ణుడిని కూడా భర్తగా స్వీకరించేదానివా అని ద్రౌపదిని అడిగాడంటారా? ప్రస్తావన గ్రంధంలో పర్వంలో ఉందో చెప్పగలరా? ధర్మానికి మారుపేరు, ద్రౌపదిని అమితంగా గౌరవించి, ప్రేమించే ధర్మరాజు ఇలా అడిగాడంటే నాకు నమ్మబుద్ది కాలేదు. కర్ణుడు చనిపోకుండా ఉండి, పాండవులతో కలిసిపోయి ఉంటే అతడిని ఆరవ భర్తగా స్వీరించేదా ద్రౌపది? అనే చర్చఎక్కడో చదివాను. కాని అలాటి ప్రస్తావన భారతంలో ఎక్కడా చెప్పబడలేదని కూడా విన్నాను. అందుకే మీ నవలలో నాకు సందేహం కలిగింది.


పుస్తకం లభించు వివరాలు:
Price : Rs. 50
Navodaya Book House
Opp. Arya Samaj Mandir
Kachiguda ‘X’ Roads,
Hyderabad – 27
Ph. 040 – 24652387



"సౌశీల్య ద్రౌపది" చదివినవారు అందులో నచ్చిన, నచ్చని విషయాలగురించి సహేతుకంగా ఇక్కడ చర్చించడానికి అహ్వానిస్తున్నాను.

టపాకు సంబంధంలేని , అవసరంలేని వ్యాఖ్యలను అనుమతించను.. గమనించగలరు.

Saturday 17 July 2010

ఓట్స్ ఫర్ బ్రేక్ ఫాస్ట్







ఈ బిజీ బిజీ లైఫ్ లో ఆహారం మీద శ్రద్ధ తీసుకోవడం తగ్గుతుంది. అందుకే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఓట్స్ ను మీ బ్రేక్ ఫాస్ట్ లో తప్పక చేర్చుకోండి. మరి అవి ఎలా తయారు చేసుకోవాలి అంటారా? ఐతే ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ఓట్స్ వంటకాలు చూసి నేర్చుకోండి. చాలా ఈజీ..

Thursday 15 July 2010

వాన ముచ్చట్లు..


మొన్న

కల్లా కపటం తెలీని అమాయకపు బాల్యం. అమ్మ కథలు చెప్తూ బతిమాలి పెట్టిన బువ్వ తిని, బుద్ధిగా స్కూలు పాఠాలు చదువుకుంటూ గడిచిపోయిన అందమైన పసితనం అది. శనివారం సగం దినం స్కూలు అంటేనే ఆ రోజు సగం, మరునాడు ఆదివారం మొత్తం పండగలా గడిచిపోయేది. కాదంటారా? ఆదివారం రాత్రి అవుతుంది అంటేనే గుండెల్లో గుబులు మొదలు. అమ్మో! రేపు స్కూలుకెళ్లాలి.. మళ్లీ సెలవులు ఎప్పుడొస్తాయో?. ఎప్పుడు వాన పడుతుందా? అని ఎదురుచూడడం. ఆ వాన కూడా స్కూలుకు వెళ్లకముందే రావాలి. రాత్రి రావొద్దు. అలా వస్తే తెల్లారేసరికి తగ్గిపోతుందిగా. మనం నిద్ర లేవకముందు మొదలై స్కూలు ఇంటర్వెల్ లేదా లంచ్ బెల్ వరకు పడితేచాలు. ఆతర్వాత మనం బయటకు వెళ్లి ఎంచక్కా ఆడుకోవచ్చుగా. వానలో ఆడుకోవాలని ఉన్నా అమ్మ వెళ్లనివ్వదుగా. తన పని చేసుకుంటూనే పిల్లలవైపు ఓ కన్నేసి ఉంచుతుంది. తగ్గినతర్వాత పాత నోట్ బుక్కులనుండి పేజీలు చింపుకుని బయటకు పరుగు. ఇంటి ముందు పారుతున్న నీటిలో పడవలు చేసి అవి వెళుతున్నంతసేపు చూడడం. అప్పుడప్పుడు స్కూలు స్క్రాప్ బుక్ లో బొమ్మల కోసం కొన్న రంగుల పేపర్లు దాచుకుని వాటితో పడవలు చేసి వదలడం భలేగా ఉండేది. రంగు రంగు పడవలు మనముందు నీటిలో కదులుతున్నట్టు, మనం దానికి ఓనరైనట్టు.. మమూలు పడవ చేయడం అందరికీ వచ్చు. అది మునిగిపోకుండా చేయాలి. అదో ఆర్టు. మళ్లీ కత్తి పడవ చేయడమంటే పేద్ద ఘనకార్యం అన్నమాట. కాగితం పడవలు నీటిలో ఎంతవరకు వెళతాయో అంతవరకు వాటి వెనకాలే అడుగులేయడం. చివరికి అవి ఎక్కడో మునిగిపోయేసరికి దిగాలు పడి , వెనక్కు పరిగెత్తుకురావడం గుర్తు లేనిదెవ్వరికంటా?. అప్పుడు వానలో, నీళ్లలో ఆడడం తప్ప వేరే ధ్యాస లేదు. తడిస్తే జలుబు చేస్తుందని అమ్మ భయం. అమ్మకు తెలీకుండా ఒక్కసారి వానలో తడిచేసి జ్వరం తెచ్చుకుంటే ఎంత బాగుండు అని కోరుకున్న రోజులెన్నో. స్కూలు వెళ్లే పనుండదు మరి.. జ్వరం వస్తే అమ్మ దేనికీ తిట్టదు. రాజమర్యాదలు. కదా.. :)


నిన్న

ప్రకృతి , ఇంకా చెప్పాలంటే ప్రతీది అందంగానే గడిచిపోయిన కాలం. వానచినుకులతో అల్లరి తప్పనిసరి. మండువేసవి దాటి తొలకరి వాన వచ్చే సమయంలో ఉండే ఆనందమే వేరు. ఇపుడు అమ్మ ఏమన్నా మనకు అంత భయం లేదుగా. వానలో తడిస్తే జ్వరం వచ్చినా డాక్టర్ ఉన్నాడు. మందులు ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనిపించే మధురమైన ఉరకలు వేసే యవ్వనం. విశాలంగా ఉన్న నీలి ఉద్యానవనంలో తెల్లని మబ్బుల తునకలు అలా తేలిపోతుంటే వాటితో పాటు పరుగుతీయాలనిపిస్తుంది. ఇక సరసన కోరిన చిన్నవాడుంటే చిలిపి ఊహలు, తరగని ఊసులు.. చెలికాని తోడున్నన్నదన్న ధీమాతో ప్రతి చెట్టు, ప్రతి పువ్వు అందంగా కనిపిస్తుంది. అలరిస్తుంది. మాతో పోటీగా హొయలు కురిపించగలవా అని సవాలు కూడా చేస్తాయి. ఆ చినుకులతో మొదలయ్యే చిరు చలి కూడ వెచ్చగా మారుతుంది. వర్షపు జల్లు కూడా ముత్యాల తలంబ్రాలుగా మారతాయి. కాదంటారా??

నేడు..

జీవితపు చివరి అంకం. బ్రతుకుపోరాటంలో ఎన్నో ఎదురీతలు. ఆటుపోట్లు. అలసినా ఆపలేని ప్రయాణంలో ఎందరో జత కలిసినా చివరిదాకా తోడుండేది ఎవరూ లేరు. ఎవరి జీవితం వారిది. అందరూ మనవారే. అందరికి మనం ఏమీ కాము. ఇప్పుడు మనకు కొత్త జీవితమేముంది. మనసు అల్లకల్లొమైంది. కాని ఈ ప్రకృతి నా బంధువైంది. జడివాన తనువును, మనసును చల్లబరచడానికి కృషి చేస్తుంది. చిరు జల్లులలో కన్నీరు కలిసి వరదలా పారింది. మసకబారిన పొగమంచు ఓదారుస్తూ కౌగలించుకుంది.. అదే పెనుచీకటిగా మారిపోతే ఎంత బాగుంటుంది. ఆ చీకటిలో ఎంత హాయి, వెచ్చదనం,ఆప్యాయత ఉంది. నన్ను నన్నులా అక్కున చేర్చుకుంటుంది. అందరిలా నను ఎప్పటికీ వీడిపోనంటుంది. ఒకోసారి అందులో ఐక్యమైపోవాలని ఉంటుంది. మరు నిమిషం ఆ చీకటిని చీల్చుకుని నాకు నేనే వెలుగునవ్వాలని ఉంటుంది. ప్రజ్వరిల్లి జగమంతా వెలుగు నింపాలని ఉంది. ఆ జ్వాలలోనే జ్వాలనై కరిగిపోతే ఎంత బావుండు..



నాడైనా , నేడైనా నాకున్నది ఓకే కోరిక.. ఈ వాననీళ్లు కాస్త గోరువెచ్చగా ఉంటే ఎంత బాగుండు? హాయిగా వానలో కూర్చోవచ్చు. ఆడొచ్చు. జలుబు రాదు, జ్వరం కూడా రాదు. వానపడుతుంటే మధ్యలో పెద్ద గొడుగు క్రింద కుర్చీ వేసుకుని కూర్చొని పాత పాటలువింటూ, వాన హోరును ఎంజాయ్ చేస్తూ రకరకాల ఐస్ క్రీములు, వేడి వేడి జిలేబీలు తినాలని ఆశ. ప్చ్..

Monday 12 July 2010

ధిక్కార స్వరం - కధాజగత్ పోటి

కథాజగత్ కధలపోటి లోని పంతుల జోగారావుగారు రాసిన ధిక్కార స్వరం నాకు చాలా నచ్చింది. దాని గురించి కొన్ని మాటలు.

అనువుగాని చోట అధికులమనరాదు అనే నానుడి అందరికీ తెలిసిందే. కాని ఎప్పుడూ పరిస్థితులకు, వ్యక్తులకు భయపడి అణగిమణగి ఉండడం కూడా మంచిది కాదు. ఇది జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు కాని, ఉద్యోగంలో నిత్యం ఎదురయ్యే సమస్యలు కాని అవసరమైనప్పుడు మనలోని ఆలోచనలను, ఆవేశాన్ని బయటకు ధైర్యంగా చెప్పాలి తప్పదు. లేకుంటే అందరు మనని చేతకానివాడనుకుని పెత్తనం చెలాయిస్తారు. అలా అని ప్రతీసారి ధిక్కార స్వరంతో  మాట్లాడం కూడా మంచిది కాదు. ఈ కథలో వామనరావు పరిస్థితి అంతే.  మధ్యతరగతి మనిషిగా ఇంట్లో, బయటా,ఆఫీసులొ ప్రతీ చోట అతనికి సమస్యలే. ధైర్యంగా తన మనసులోని భవాలను మాటలుగా గట్టిగా చెప్పలేడు. ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. మనం ఎప్పుడూ తగ్గి ఉండాలి.అవతలివాళ్లు పెద్దవాళ్లు .ఎదిరించరాదు.వాళ్లు ఏదైనా చేయగలరు.మనం ఏదంటే ఏమవుతుందో? అనే సవాలక్ష సందేహాలు,భయాలు అతడిని ప్రతీ విషయంలో కృంగదీస్తాయి.  ఎప్పటికీ అలా పిరికివాడిగా, భయస్తుడిగానే  ఉండిపోతాడు. అతని మనుగడ కూడా అసంతృప్తిగా, నిస్సహయతగా గడిచిపోతుంది. అతని కూతురు వామనరావుకి పూర్తిగా వ్యతిరేకం. తనకు జరిగిన అన్యాయానికి బాధపడి , నిరాశ చెందక ఒంటరిగా అందరినీ కలిసి ఒక ఉద్యమం లేవనెత్తి తన స్వరాన్ని అందరికీ వినిపించింది. తండ్రి అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపిస్తుంది. తాను తన కూతురిలా ఎప్పుడూ ఎదిరించి, తన స్వరాన్ని వినిపించలేకపోయినా జరిగిన సంఘటన అతనికి సంతోషాన్నిస్తుంది. తప్పు చేయనప్పుడు,అన్యాయం జరిగినప్పుడు ధిక్కారంగా, ధైర్యంగా మాట్లాడంలో తప్పేమి లేదు. మనసులోని కుమిలిపోతుంటే ఆ వ్యధ అందరికి తెలిసేది ఎలా? అతని అభిప్రాయం అర్ధమయ్యేది ఎలా? 

ఈ కథలో రచయిత చెప్పదలుచుకున్నది నీతిసూత్రం లా అనిపిస్తే అది చాలా తప్పు అని నేనంటాను. ఎందుకంటే ప్రతి మనిషి సర్వస్వతంత్రుడు. మంచిని సమర్ధించి, చెడును,అన్యాయన్ని ఎదిరించే అధికారం, హక్కు అందరికీ ఉంది. పిరికివాడు, తప్పు చేసినవాడే మరొకరికి భయపడతాడు. పెద్దవాళ్లను గౌరవించాలి, ఆదరించాలి.కాని అవసరమైన వేళలో ఏ విషయం మీదైనా తమ ధిక్కార స్వరం అందరూ ఉపయోగించాల్సిందే.. తమకు నచ్చని విషయాల గురించి ఎలుగెత్తి చెప్పాలి అన్నామాట అక్షరాలా ఆచరణీయమైనది.  అనుసరణీయమైనది అని ఒప్పుకోక తప్పదు కదా.

Tuesday 6 July 2010

అలమేలుమంగపతికి అన్నమయ్య ఆరగింపు సేవ



Get this widget | Track details | eSnips Social DNA

ఇందిర వడ్డించ నింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి

అక్కాళపాశాలు అప్పాలు వడలు
పెక్కైన సయిదంపు పేణులును
సక్కెరరాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామి

మీరిన కెళంగు మిరియపు దాళింపు
గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే
కూరిమితో జేకొనవో స్వామీ

పిండివంటలును పెరుగులు పాలు
మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ |

భర్తకు ఇష్టమైన వంటకాలు తయారుచేసి అతనికి కొసరి కొసరి వడ్డించడం ప్రతీ ఇల్లాలికి ప్రియమైన పని. అతను తృప్తిగా భోజనం చేస్తే సంతోషిస్తుంది. శ్రీ వేంకటేశ్వరుడికి ఇందిరాదేవి ప్రేమతో కొసరి కొసరి వడ్డిస్తున్న దృశ్యం చూసిన అన్నమయ్య మా ఇందిరాదేవి ప్రేమతో వడ్డిస్తుండగా చక్కగా ఆరగించవయ్యా స్వామి అంటున్నాడు. ఆ స్వామికి వడ్డించిన వంటకాలు ఏంటయ్యా అంటే నేతి పాయసాలు, అప్పాలు, వడలు, చక్కెర రాసులు, మిరియపు తాళింపు పెట్టిన కమ్మని కూరలు, పచ్చళ్లు, పిండివంటలు, పాలు , పెరుగు మొదలైనవి. అంటే ఆ కాలంలో స్వామివారికి ఈ వంటకాలు నిత్యం నివేదించేవారేమో.

***********************************************************************************


పంకజాక్షులు సొలసిపలికి నగగా-
నింకా నారగించు మిట్లనే అయ్యా

కలవంటకములు పులుగములు దుగ్ధాన్నములు
పలుదెరగులైన అప్పములగములు
నెలకొన్ననేతులును నిరతంపుచక్కెరలు
గిలుకొట్టుచును నారగించవయ్యా

పెక్కువగునై దంపుపిండివంటలమీద
పిక్కిటిలు మెర్కుగుబొడి బెల్లమును
వొక్కటిగ గలుపుకొని వొలుపుబప్పులతోడ
కిక్కిరియ నిటు లారగించవయ్యా

కడుమధురమైన మీగడపెరుగులను ముంచు -
అడియాల వూరుగాయల రుచులతో
బడిబడిగ నవకంపు బళ్ళెరంబులతోడ
కడునారగించు వేంకటగిరీంద్రా


ఇక్కడ అమ్మావార్లు స్వామివారికి ప్రీతికరమైన వంటకాలు వడ్డించి, మధురమైన మాటలు తమ నవ్వులతో జతచేసి పతికి విందు చేస్తున్నారు. మనం పప్పు +ఆవకాయ, పప్పన్నం + అప్పడం .. ఇలా రెండు మూడు వంటకాలు కలిపి తింటుంటాం కదా. అలాగే అన్నమయ్యా శ్రీనివాసుడిని కూడా పిండివంటలను పొడిబెల్లంతో కలిపి, మీగడపెరుగు ఆవకాయ కలిపి ఆరగించవయ్యా వేంకటగిరివాసా అని నివేదన చేస్తున్నాడు.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008