Monday 31 January 2011

ఆపన్నహస్తం - ఫిబ్రవరి 2011 కంప్యూటర్ ఎరా సంపాదకీయం

ఓ సంఘటన తాలూకూ విపరీతమైన ఆందోళన తర్వాత రాస్తున్న సంపాదకీయం ఇది. మా బంధువుల్లో ఒకమ్మాయి అకస్మాత్తుగా కన్పించకుండాపోయింది. ఉదయం 8 గంటల నుండి మరుసటిరోజు వేకువజామున 4 గంటల వరకూ అన్ని రకాల ప్రయత్నాలూ చేశాం. వేకువజాము 4 గంటలకు తన ఫోన్‌ కలిసింది. మాట్లాడితే హైదరాబాద్‌ నుండి రాములవారి భద్రాచలం ఓ డిప్రెస్డ్‌ మూడ్‌లో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిందని తెలిసింది. వెళ్లిన వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులు పేదవాళ్లకు పంచేసింది. ఆ భగవంతుడి దయతో తన మనసుమారింది కాబట్టి సరిపోయింది.. మాకు ఫోన్‌ కలిసింది. తీరా తిరుగు ప్రయాణం అవుదామంటే తన దగ్గర ఐదు రూపాయలు తప్ప బస్‌ ఛార్జీలకు కూడా డబ్బులు లేవు. ఆ సమయంలో మన కంప్యూటర్‌ ఎరాపాఠకులు భద్రాచలం లో నివశిస్తున్న మధుసూదనరావు గారి నెంబర్‌ ఇప్పటివరకూ తమ వివరాలు అందించిన సుమారు 6000 మంది మన పాఠకుల వివరాల్లో నాకు లభించింది. ఆయనకు ఫోన్‌ చేసి సహాయం కోరడం ఆలస్యం.. అంత వేకువజాము వాళ్ల కూతురిని తోడుగా నిద్రలేపి ఉన్న ఫళంగా బస్టాండ్‌కి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఎందుకు ఇదంతా రాస్తున్నానని మీకు అన్పించవచ్చు. దాదాపు 20 గంటల పాటు అందరం ఎంత నరకయాతన అనుభవించామో ఆ స్థితిలో ఉన్న మాకే తెలుసు. ఇలాంటి పరిస్థితులు మన పాఠకుల్లో ఎవరికైనా ఎప్పుడైనా తలెత్తవచ్చు. ప్రతీ ఊళ్లోనూ మన పాఠకులు ఉంటారు. ఆపత్కాలంలో ఒకరికొకరు మాట సాయమో, స్వల్ప ఆర్థిక సాయమో చేసుకోవడానికి మించిన మానవత్వం ఏముంటుంది? మేము ఎదుర్కొన్న స్వీయ అనుభవం నుండి ఓ ఆలోచన ఉద్భవించింది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతీ ఊళ్లో ఉన్న పాఠకులు మానవత్వంతో ఇతరులు ఎవరికైనా తమకు సాధ్యమైనంత సాయం చేయగలిగిన అవకాశం ఉండి ఉంటే మీ పేరు, ఊరు, ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడిలను http://computerera.co.in అనే మన వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేయండి. ఎవరికైనా, ఎప్పుడైనా, పైన తెలిపిన దయనీయ పరిస్థితులు ఏర్పడినట్లు మా దృష్టికి వస్తే వారికి మీ వివరాలు అందిస్తాము. అలాగే మీలో, మీ బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరైనా ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఇరుక్కుని ఉంటే ఒక్కసారి 9000239948 అనే నెంబర్‌కి ఫోన్‌ చేసి ఊరు కాని ఊళ్లో మీకు ఏర్పడిన క్లిష్టమైన పరిస్థితిని వివరించి ఆ ఊళ్లలో నివశిస్తున్న మన కంప్యూటర్‌ ఎరాపాఠకుల వివరాలను పొందవచ్చు. కేవలం మానవత్వంతో, సేవాభావంతో నిర్వహించదలుచుకున్న ఈ సర్వీస్‌ని సద్వినియోగం చేసుకోగలరు, మనసున్న మనుషులుగా ఇందులో మీరూ భాగస్వాములైతే ఆపత్కాలంలో ఎందరికో మనవంతు సాయాన్ని అందించగలిగిన వాళ్లం అవుతాము. సెల్‌ఫోన్లు, `మెయిళ్లు.. అధునాతన కమ్యూనికేషన్‌ టెక్నాలజీ వల్ల మానవత్వం మంటగలిసిపోతోందన్న అన్న తప్పుడు అభిప్రాయాన్ని చెరిపేద్దాం. మనలోనూ సున్నితత్వం, స్పందించే హృదయం ఉందన్న విషయాన్ని నిరూపించుకుందాం. ఈ సర్వీస్‌లో మీరూ భాగస్వాములు అవాలనుకుంటే మీ వివరాలు http://computerera.co.in అనే వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేయండి. అలాగే మీ మిత్రులకూ ఈ సర్వీస్‌ని పరిచయం చేయండి. మీ వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదు. ఆపత్కాలంలో మీ వివరాలను ఇతరులకు అందించడంతోపాటు నెలకొక్కసారి మన మేగజైన్‌ రిలీజ్‌ అయ్యే తేదీ మాత్రం మీకు SMS చేస్తుంటాం. ఓ క్లిష్టపరిస్థితిలో తన సహాయం అందించి ఇటువంటి సర్వీస్‌కి శ్రీకారం చుట్టడానికి కారకులైన మధుసూదనరావు గారికి మరోసారి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ..

మీ
నల్లమోతు శ్రీధర్

Thursday 27 January 2011

సారీ సృజన..

ముందుగా సృజన కు సారీ చెప్తున్నాను. కంగారు పడకండి. లేని సృజన కు సారీ ఏంటి అంటారా?? లేని ప్రియ చనిపోయింది అని చెప్పలా?? నేను సారీ చెప్పింది ప్రియ అనే పేరుతొ పెట్టిన టపాలోని ఫోటో ఓనర్ సృజన కు. సారీ చెప్పాల్సిన వ్యక్తితో మాట్లాడాను. ఇది సంగతి ఇలా జరిగింది అని చెప్పాను. సరేలెండి మీ తప్పు లేదుగా అని సెమించేసింది ఆ అమ్మాయి. ఈ విషయం నమ్మినా, నమ్మకున్నా మీ ఇష్టం.

ఇక మిగతా వ్యక్తులు సృజన రామానుజన్, ప్రియ అయ్యంగార్, చైతి కల్యాణి, వైష్ణవి హరివల్లభ, ధనరాజ్ మన్మధ.. సూపర్ క్యారెక్టర్లు. ఒక్కొక్కరికి ఒక్కో హిట్ స్టోరీ.. భలే ఉంది. అతను చెప్పే మాటలు ఫేక్ అనుకున్నా, పెట్టిన ఫోటోలు నెట్ వి అని తెలిసినా వాటి వల్ల నష్టం ఏమి లేదు కదా అని ఊరుకున్నారు అందరూ. అందరూ అంటే అతను మాట్లాడినవాళ్ళు. పరిచయం ఉన్నవాళ్ళు. కాని ఒక్కరంటే ఒక్కరికి ఈ వ్యక్తులు ఉన్నారా అని ఆలోచన రాలేదు. నాకు వాళ్ళు ఎవరితో కలవాలి అనే అవసరం పడలేదు. కలవలేదు కూడా. అనవసరంగా ఎదో ఊహించుకోకండి. అసలు వ్యక్తిని వదిలేసి నన్ను ముద్దాయిని చేస్తున్నారు కాని ఎంతమంది విజయవాడ వెళ్ళి గీతాచార్యను లేదా అతని ఫ్యామిలీ లోని వ్యక్తులను కలవాలి అని ప్రయత్నించారు.?? ముందు ఆ పని మీద ఉండండి.


ఇక ఎప్పుడు ఏ గొడవ జరిగిన ప్రమదావనం మీద పడి ఏడుస్తారు. మావల్ల ఎంతమంది ఎంత నష్టపోయారు కాస్త చెప్పండి. యిపుడు మాకంటే ఎక్కువ బయట బ్లాగర్లు కూడా నమ్మారు. ఆ సంగతి తెలుసుకొని మాట్లాడండి. ఒకే.. యిపుడు జరుగుతున్న గొడవ వల్ల నాకేమి నష్టం లేదు. నా పని నేను చేసుకుంటున్నా. అనవసరంగా మీ సమయాన్నివృధా చేసుకుంటున్నారు. ఒకవేళ అతనికి డబ్బులు ఇచ్చి మోసపోతే వెళ్ళి కలవండి. వసూలు చేసుకోండి.


ఆ అబ్బాయి చెప్పిన మాయమాటలు ఎలా నమ్మారు అని నన్ను అడుగుతున్న పెద్ద మనుష్యుల్లారా?? మీకు తెలిస్తే ఎందుకు అడగలేదు. ఎందుకు నిశ్సబ్దంగా ఉన్నారు? ఇప్పుడు తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. నాకు ఇది తెలియాలి. నాకేనా అందరికీ తెలియాలి. తెలియాలి .. తెలియాలి ..



మరో ముఖ్య విషయం..ఇది పవన్ కోసం..

అబ్బాయ్ పవన్.. నీ వెనకాల ఉండి నా మీద అడ్డమైన రాతలు రాయిస్తున్న అక్కాయ్ ఎవరో నాకే కాదు ఎంతో మందికి తెలుసు. నువ్వు అనవసరంగా బకరా అవుతున్నావు అది తెలుసుకో. ఎవరో ఎదో చెప్పారని ప్రమదావనం మీద ఇష్టమొచ్చినట్టు రాయకు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. మెయిల్ చేయి.. చెప్తాను.


ఇప్పుడు జరిగిన సంఘటనను అందరూ ఒక పాఠంలా గుర్తుంచుకుంటే మంచిది. కాని మోసం, అబద్ధం, అసూయ , ద్వేషం కలకాలం నిలవవు. ఎప్పుడో ఒకప్పుడు అవి బయటపడతాయి. నిజం నిలకడ మీద తప్పకుండా తెలుస్తుంది.

Wednesday 26 January 2011

జై హింద్




స్వాతంత్ర , గణతంత్ర దినోత్సవం అనగానే గుర్తొచ్చేది స్కూలు రోజులే.. ఆరోజుకోసం గేమ్స్ డ్రెస్. పోటీలలో గెలుచుకున్న బహుమతులు. ఆటలు పాటలు, చివర్లో ఇచ్చే చాక్లెట్లు , బిస్కెట్లు. ప్రతి స్కూలులో పండగ వాతావరణం. స్కూల్లో రంగు రంగు కాగితాలతో అలంకరించి జండా వందనం చేయడం. ఎప్పుడు వినపడని దేశభక్తి సినిమా పాటలు ఆరోజు వినిపించేవారు. ఆ పాటలు ఈ రెండు రోజుల్లో మాత్రమే వినిపిస్తాయి. లేదంటే వివిధభారతి లో వచ్చే జయమాలా సైనికుల కార్యక్రమంలో. ఎప్పుడు ఈ పాటలు విన్నా ఒళ్ళంతా గగుర్పొడుస్తుంది. మనం హాయిగా ఇంట్లో ఉంటే వాళ్ళు మనను రక్షించడానికి తమ ప్రాణాలను సైతం అడ్డు పెడుతున్నారు. సరిహద్దులోనే కాక దేశంలో ఎపుడు పెద్ద విపత్తు సంభవించిన సైన్యం రంగంలోకి దిగుతుంది. వాళ్ళు ఒక్క రాజకీయ నాయకులనే కాదు, ఆపదలో ఉన్న సామాన్య ప్రజలను సైతం రక్షిస్తారు. ఇది పార్లమెంట్, ముంబై దాడుల్లో చూసాము. తమ కుటుంబాలకు దూరంగా దేశం కోసం పోరాడే వీర జవానులను మరోసారి గుర్తు చేసుకుని నివాళి అర్పిస్తూ .. కొన్ని దేశభక్తి గేయాలి. వాటి గురించి చెప్పడానికి మాటలు లేవు. అనుభూతులే తప్ప.

Tuesday 25 January 2011

పిల్లలను కాస్త మాయ చేయండిలా!!


చిన్నపిల్లలున్నఇంత ప్రతి రోజూ వాళ్ళతో తినేలా చేయడం అంటే ఒక యుద్ధం లా ఉంటుంది. అందుకే వాళ్ళను కొంచం మాయ చేయాలి. నేను చేసి సక్సెస్ అయ్యాను మరి..



" బాబూ! ఈ ఒక్క ముద్ద తినరా. లేకుంటే నీరసమొస్తుంది."



" బుజ్జి. నీకు సాయంత్రం బర్గర్ కొనిస్తా కాని ఇప్పుడు కొంచం పెరుగన్నం తినమ్మా. లేకుంటే క్లాసులో ఎలా చదువుకుంటావ్?"



పిల్లలున్న ప్రతీ ఇంట్లో నిత్యం జరిగే తంతు ఇది. ఈరోజుల్లో పిల్లలను కడుపునిండా తినేలా చేయాలంటే తల్లితండ్రులకు పెద్ద యజ్ఞంలా ఉంటుంది. సాధారణంగా పిల్లల తిండి విషయం చూసుకునేది తల్లే. కాని పిల్లలు ఎంతగా సతాయిస్తున్నారంటే తండ్రి కూడా రంగంలోకి దిగక తప్పడం లేదు. పొద్దున్నే పాలు తాగండి, వేడి వేడి అన్నంలో ఇంత పప్పు, నెయ్యి వేసుకుని తినడర్రా అంటే అదేదో భయంకరమైన పదార్థంలా తప్పించుకుని పారిపోతున్నారు.మధ్యాహ్నం భోజనానికి ఇచ్చిన బాక్స్ కూడా సగం ఖాళీగానే ఉంటుంది. చిన్నారులు బండెడు పుస్తకాల బరువు, చదువులకు తగ్గట్టు శక్తి పుంజుకోవాలంటే సరియైన పోషకాహారం తినాలి. కాని వాళ్లు తినరు. ఆకలితో ఉంటారు కాని పెట్టింది మాత్రం తిననంటారు. ఇది చూసి ఏ తల్లి కలవరపడదు.


అన్నం తినమంటే తినరు కాని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అనగానే వాళ్లకు ప్రాణం లేచొస్తుంది. బర్గర్ , పిజ్జా, చిప్స్, పఫ్స్ అనగానే ఎక్కడలేని హుషారుతో పరుగెత్తుకువస్తారు. దానికి తోడు కోక్ లాంటి డ్రింకులు. ఊరికే అవే కావాలని అడుగుగుతుంటే పోనీలే పాపం అలా ఐనా ఆకలి తీరుతుంది అని తినిపిస్తారు. కాని అదే అలవాటుగా మారితే మాత్రం పిల్లల ఆరోగ్యానికి హానికరం అవుతుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ తరచూ తినడం మంచిది కాదు. అందులో వాడే చీజ్, వెన్న వంటివి అధిక క్యాలరీలు కలిగి ఉంటాయి. కొవ్వు కూడా ఎక్కువే. ఇంకా వాటిల్లో వాడే మైదా మొదలైనవి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పోషక పదార్థాల సంగతి పక్కనపెడితే అసలుకే మోసం వస్తుంది.



మరి ఏం చేయాలి? రోజూ వాళ్లతో ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది .. పిల్లలు సరియైన, పోషకాంశాలతో కూడిన ఆహారం తినేలా చేయడం అంత సులువు కాదు. కాని ఇది సాధ్యమే అని చెప్పవచ్చు. ఈ విషయంలో పిల్లలకంటే ముందు తల్లితండ్రులే మారి పిల్లలను మాయ చేయాలి. పిల్లలతో కాస్త తెలివిగా వ్యవహరిస్తూ వారి ఆహారపు అలవాట్లు అదుపు తప్పకుండా జాగ్రత్తపడాలి. వాళ్లకు నచ్చినట్టుగానే చేయాలి.. వాళ్లు తినే ఫాస్ట్ ఫుడ్ లోనే ఫోషకాలు ఉన్న తిండి పెట్టాలి. దానికోసం కొత్త కొత్త ప్రయోగాలు చేయక తప్పదు మరి. పిల్లలకు ఏ వయసులో ఎటువంటి ఆహరం ఇస్తే మంచిది అని ముందు తెలుసుకోవాలి. ఆ ఆహారాన్ని వాళ్లకు కంటికి ఇంపుగా, లేటేస్టుగా ఉండేలా తయారు చేసి ఇస్తే సరి. అది కొంచెం కష్టమే కాని అసాధ్యం మాత్రం కాదు. ఎలా చేసినా మనకు కావలసింది పిల్లలు వయసుకు తగ్గట్టుగా సంపూర్ణ పోషకాహారం తీసుకోవాలి.


చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. కాని ఎదిగే పిల్లలకు పాలు ఒక సంపూర్ణ ఆహారం. వారి ఎముకలు ధృడంగా ఉండేందుకు ఎంతొ అవసరం. దాని కోసం బూస్ట్,బోర్నవిటా లాంటి ఎన్ని కొన్నా కూడా పాలగ్లాసు కనపడగానే పారిపోతారు. అలా వారి వెనకాల పరిగెత్తే బదులు ఆ పాలను వేరేవిధంగా ఎలా ఇవ్వొచ్చో ఆలొచించాలి. ఆ పాలల్లో ఒక్కోసారి ఒక్కో పండు ( మామిడి, స్ట్రాబెర్రీ, లీచీ, ) వేసి గ్రైండ్ చేసి మిల్క్ షేక్ లా ఇవ్వొచ్చు. నాలుగైదు రకాల పళ్లు ముక్కలు చెసి పాలు, పంచదార, యాలకులపొడి లేదా ఎస్సెన్స్ చుక్కలు వేసి ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టొచ్చు. పాయసం, పరమాన్నం చేసి వేడిగా కాని, చల్లగా కాని ఇవ్వొచ్చు. అప్పుడప్పుడు చక్కెర బదులు బెల్లం వేయండి. పెరుగును తోడుపెట్టి చక్కెర కలిపి ఇవ్వండి. ఏదైన ఫ్లేవర్ వేసి చిలికేసి బటర్ మిల్క్ అని అందమైన గ్లాసులో పోసి స్ట్రా పెట్టి ఇవ్వండి. అలాగే పనీర్ తో కూరలు, వేపుళ్లు, కబాబ్, కట్లెట్ లాంటి స్నాక్స్ చేసి పెట్టొచ్చు. కొంతమంది పిల్లలకు పాలు అస్సలు పడవు. బలవంతంగా ఇస్తే వాంతి చేసుకుంటారు. వాళ్ల శరీరంలో అవసరమైననత లాక్టోజ్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అప్పుడు వాళ్లకు పాలకు ప్రత్యామ్నాయంగా సోయా ఉత్పత్తులు పెట్టవచ్చు. పాలు తక్కువగా ఇచ్చి పెరుగు, సోయా ఉత్పత్తులు ఎక్కువగా ఇవ్వాలి.



ఇక చాలామంది పిల్లలకు కూరగాయలు, ఆకుకూరలు అంటే కూడా అస్సలు పడదు. పళ్లు తినమంటే వద్దంటారు. ఇవన్నీ తినకుంటే పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందక రోగనిరోధకశక్తి తగ్గి నీరసపడిపోతారని తల్లితండ్రుల బెంగ. అలాకాకుండా అదే కూరగాయలను పచ్చళ్లుగా చేసి పెట్టొచ్చు. కూరగాయలను కొద్దిగా ఉడికించి కబాబ్, కట్లెట్ లేదా పకోడీల్లా చేసి సాస్ తో ఇస్తే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. పాలకూరలో కోడిగుడ్డు కలిపి కూర చేస్తే ఇష్టంతో తింటారు. పాలతో కస్టర్డ్ చేసి పళ్ల ముక్కలు కలిపి చల్లగా ఇస్తే నిమిషాల్లో ఖాళీ చేసి మళ్లీ కావాలని అడుగుతారు. అప్పుడప్పుడు జ్యూస్ చేసి, చాట్ మసాలా కలిపి ఇవ్వొచ్చు.


ఇవన్నీ బానే ఉన్నాయి మరి ఫాస్ట్ ఫుడ్ సంగతేంటి? మనం ఎన్ని తిప్పలు పడ్డా బర్గర్, పిజ్జా, నూడుల్స్ అంటారు. వాటిని కూడా కొద్దిపాటి మార్పులతో ఇంట్లోనే చేసి పెట్టాలి. మైక్రోవేవ్ ఓవెన్ ల వాడకం పెరిగిన ఈ రోజుల్లో ఇవి చేసుకోవడం అంత కష్టమేమి కాదు. బయట వాడే చీజ్ బదులు తక్కువ కొవ్వుశాతం ఉన్న వెన్నలేదా చీజ్ ఉపయోగించాలి. కూరగాయలతో కట్లెట్ చేసి బర్గర్లో పెట్టి ఇవ్వాలి. నూడుల్స్ కూడా కూరగాయలు, గుడ్లు వేసి వెరయిటీగా తయారు చేయొచ్చు. ఇన్ స్టెంట్ నూడుల్స్ చేసి సాంబార్ పోసి సాంబార్ నూడుల్స్ అని ఇవ్వండి . అదో వెరయిటీ రుచి. అలాగే చపాతీలు చేసి మధ్యలో వేయించిన కూరగాయలు, గుడ్డు, చికెన్ వంటివి స్టఫింగ్ చేసి మడిచి పేపర్ నాప్కిన్లో అందంగా చుట్టి "ఫ్రాంకీ" అనండి. పిల్లలు పరుగెత్తుకుని వచ్చి లాక్కుంటారు. పాస్టా, మాక్రోనీలతో కూరలు , పకోడీలు చేయండి. ఇలా అన్ని చిరుతిళ్లను పోషకాహారం చేస్తే సరి పిల్లలూ, తల్లితండ్రులూ అందరూ ఫుల్ హ్యాపీస్.


Monday 24 January 2011

వెక్కిరింపు మాటలు




కొంతమంది తమ చుట్టూ ఒక లోకం సృష్టించుకుంటారు. వాళ్లు కరెక్ట్ ఆనుకున్న విషయాలే ఆ లోకంలో ఉంటాయి. మిగతావి అసలు పనికొచ్చేవే కావు. ఆ పనులు చేసేవాళ్లు కూడా పనికిరానివాళ్లే అనుకుంటారు. పైగా ఆ వ్యక్తుల ప్రతిభను గుర్తించరు సరికదా వెక్కిరించడం, ఎత్తి పొడుపు మాటలతో నిరుత్సాహపరిచి కొండొకచో అవమానకరపు మాటలతో బాధపెడతారు. గురజాడవారి కన్యాశుల్కంలో మహేశం మాటలు చదువుతుంటే ఇలాటివారు గుర్తొచ్చారు.

ఆర్నెళ్లకోమాటు పొస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకాలు, పాత శ్లోకాలు ఒక్కలాగనబడతాయి. యిప్పుడు కొత్త శ్లోకం కన్నుకోవంటే నా శక్యవా? సిద్ధాంతి నెవణ్ణయినా ప్రశ్నడిగి కనుక్కోవాలి. లేకుంటే చటుక్కున పుస్తకం విప్పి యే శ్లోకం కనబడితే ఆ శ్లోకం చదువుతాను.

"మృగాః ప్రియాళద్రుమ మంజరీణాం "

యిదేదో చదివిన జ్ఞాపకం లీలగా వుంది. లేళ్లు పరుగెత్తుతాయని కదూ? యేం గొప్పమాట చెప్పాడోయ్ కవి. లేళ్లు పరిగెత్తితే యెవడిక్కావాలి, పరిగెత్తకపోతే యవడిక్కావాలి? కుక్కలు పరిగెత్తుతున్నాయి కావా? నక్కలు పరిగెత్తుతున్నాయి కావా? పిల్లులు పరిగెత్తుతున్నాయి కావా? పనికొచ్చే ముక్క ఒక్కటీ యీ పుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వొడ్డీ, వాళీ కట్టడం కాళిదాసుకేం తెలుసు? తెల్లవాడిదా మహిమ. ఏ పట్నం యెక్కడుందో, యే కొండ లెక్కడున్నాయో అడగవయ్యా గిరీశంగార్ని, నిల్చున్నపాట్న చెబుతాడు.

"మృగాః ప్రియాళద్రుమ మంజరీణాం "
ముద్దెట్టుకున్నాడటోయి ముండాకొడుకు, ముక్కట్టు కొన్నాడు కాడూ?

"వర్ణప్రకర్షే సతి కర్ణికారం
దునోతి నిర్గంధతయా స్మ చేతః "

యిది కూడా చదివినట్టే వుందోయి. ఆ పువ్వేదో కవికిష్టం లేదట. యిష్టం లేకపోతే ములిగిపోయింది కాబోలు? మా గురువుగారికి దొండకాయ కూర యిష్టం లేదు. గురువుగారి పెళ్లాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆ కూరే వొండుతుంది. బతికున్నవాళ్ల యిష్టమే యిలా యేడుస్తుంటే, చచ్చినవాడి యిష్టాయిష్టాల్తో యేం పని?"

Sunday 23 January 2011

షాండిలియర్ హ్యాంగింగ్స్


అలకల కొలికికి అందమైన లోలాకులు


ఆడపిల్లలకు, ఆభరణాలకు విడదీయలేని అనుబంధముంది. ప్రాణస్నేహితుల్లా కలిసినప్పుడు ఒకరివలన ఇంకొకరికి అందం , ఆకర్షణ ఏర్పడుతుంది. అందులో చెవులకు ధరించే నగలకు కూడా ప్రత్యేకత ఉంటుంది. దుద్దులు, ఏడు రాళ్ల కమ్మలు, బుట్టలు, జూకాలు మొదలైనవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అంటున్నారు ఈనాటి అమ్మాయిలు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువగా వేలాడే జూకాలు లేదా లోలాకులు పెట్టుకుంటున్నారు. మాడర్న్ డ్రెస్సులైనా, పార్టీలు , పెళ్లిళ్లైనా ఈ లోలాకులు ధరిస్తే మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు కాంతామణులు. ఈ లోలాకులు వేలాడుతూ భుజాలను తాకేలా కూడా ఉంటున్నాయి.


రంగు రంగు రాళ్లతో, పొడవుగా వేలాడుతూ ఉండే ఈ లోలాకులను షాండిలియర్ లోలాకులు, జూకాలు లేదా చెవిరింగులు అంటారు. వీటి పొడవు రెండు నుండి మూడంగుళాల వరకు ఉంటుంది. ఇందులో కొన్ని దిద్దులకు వేలాడదీసుకునేలా ఉంటాయి. కొన్నింటికి కొక్కెంతో పెట్టుకునేలా ఉంటాయి. ఈ షాండిలియర్ లోలాకులు బ్లాక్ మెటల్, ఇత్తడి, వెండి, బంగారం,ప్లాటినం మొదలైన లోహాలతో చేసినవి ఉంటాయి. వాటిలో పూసలు, రంగురాళ్లు, ఖరీదైన రాళ్లూ, వజ్రాలు కూడా అమరుస్తున్నారు. అందుకే ఇవి అన్నిరకాల వస్త్రధారణకు అచ్చంగా సరిపోతాయి. ఖరీదైన వజ్రాలు, రాళ్లతో చేసిన లోలాకులు ధరించాక ఇక వేరే నగలు ఎందుకు అని మెడలో కూడా ఏమీ ధరించరు .మీరు గమనించే ఉంటారు సినిమా పార్టీల ఫోటోలలో. షాండిలియర్ పోగులు పెట్టుకుంటే కట్టుకున్న చీర కూడా సింపుల్ గా ఉన్నా సరిపోతుంది. అదొక్కటే ఆ ఇంతి అందాన్ని మరింతగా ఇనుమడింపచేస్తుంది. ఈ మధ్య ఫ్యాషన్ ప్రపంచంలో, చిత్ర పరిశ్రమలో ఎందరో తారలు ఈ షాండిలియర్ లోలాకులనే విరివిగా ధరిస్తున్నారు.


ఈ లోలాకులు ధరించిన స్త్రీకి ప్రత్యేకమైన సొగసు, సౌందర్యాన్నిస్తాయి. కాని బాగున్నాయి కదా అని ఏది పడితే అది కాకుండా ఈ చెవి రింగులు ఆ వ్యక్తి ఆకృతికి తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మరింత అకర్షణీయంగా ఉంటుంది. ముఖం కోలగా ,పొడవుగా ఉండేవాళ్లు కొంచం పొడవైన జూకాలు ధరిస్తే బావుంటుంది. గుండ్రటి ముఖం ఉన్నవారు మరీ ఎక్కువగా కాకుండా తగినంత పొడవున్న జూకాలు సెలెక్ట్ చేసుకోవాలి. హృదయం ఆకారంలో ముఖం ఉన్నవాళ్లు త్రికోణాకరంలో ఉన్న జూకాలు అందంగా ఉంటాయి. ఈ షాండిలియర్ లోలాకులు సంప్రదాయ దుస్తులు, చీర, డ్రెస్సు, గౌన్లు లేదా స్కర్టులు..మొదలైన ఏ రకపు దుస్తులకైనా మ్యాచ్ అవుతాయి. ఖరీదైన జూకాలు కొనుక్కోలేని వనితలు తక్కువ ధర రాళ్లు, స్వరోస్కి క్రిస్టల్స్, ముత్యాలతో చేసినవి కూడా కొనుక్కోవచ్చు. ఈనాటి అమ్మాయిల లేటెస్ట్ ఫాషన్ షాండిలియర్ లోలాకులు.. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చినవి కొనుక్కోండి ..

Friday 7 January 2011

ఇంటిపోరు ఇంతింతకాదయా!




సంసారంలో అప్పుడప్పుడు సరసాలు, చిటపటలు ఉంటేనే కదా మజా.. సరసాలు ఒక్కోసారి అభిప్రాయబేధాలు, అలగడాలు .. శ్రుతిమించితే పోట్లాటల వరకు వెళ్తాయి. విషయంలో కొందరు పండితులేమన్నారో చూడండి.


ఇంద్రగంటి : నాకూ, నా భార్యకూ అభిప్రాయబేధాలు రాకుండా ఉండవు, వస్తూనే ఉంటాయి. అలా అభిప్రాయబేధం వచ్చినప్పుడు నా అభిప్రాయం మాత్రం చస్తే ఆవిడతో చెప్పను. ఇక ఆవిడ ఏం చేస్తుంది? నోరు మూసుకుని ఉంటుంది. అర్ధం కాలేదా? అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేనే నోరుమూసుకుని ఊరుకుంటాను.

కాటూరి : మా ఇంట్లో ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అదెలా సంభవం అంటే.. నేను చెప్పిన మాటలన్నీ ఆవిడ వింటుందని కాదు. ఆవిడ చెప్పినట్టే నేను వింటాను. ఏదైనా మాటా మాటా వచ్చి ఆవిడకు కోపం వస్తే నేను వెంటనే... "దోషముగల్గె, నా వలన దోసిలి యొగ్గితి నేలుకొమ్ము నీ దాసుడ" అని " ముట్టెద తత్పద్ద్వయిన్" అంటాను.


దేవులపల్లి : నా ప్రియురాలితో పోట్లాట నేను భరించలేను. ఒకవేళ వచ్చిందో నాకు దుఃఖం వస్తుంది. దుస్సహగాఢ దుఃఖం ఆపుకోలేను ఏడుపు వస్తుంది. మృదుల కరుణా మధురం నా హృదయము.


మొక్కపాటి : మాకు ఎలాంటి పోట్లాటలు లేవు. శాంతంగా జరిగిపోతుంది. ఎలాగంటే నేను మద్రాసులో ఉంటున్నాను. ఆవిడ రాజమండ్రిలో ఉంటున్నది. ఎప్పుడైనా టెలిఫోనులో మాట్లాడుకుంటాము. పైగా చాలా డబ్బు ఖర్చవుతుంది. ఇక పోట్లాడడానికి వ్యవధి ఎక్కడిది.


గిడుగు : మా ఇంట్లో అస్సలు పోట్లాటలే లేవండి. పోట్లాటలే కాదు అసలు మాట్లాటలే లేవు. ఎందుకంటే నేను ఒక ప్రతిజ్ఞ చేసాను. ఇంట్లో సవర భాషలో మాత్రమే మాట్లాడతాను. బయట సవరభాషను గురించి మాత్రమే మాట్లాడతాను. అందుకని నేను ఏమంటున్నది ఆవిడకు తెలీదు. అందుకే ఏటువంటి పోట్లాటలు లేవు.


వేలూరి : ఇంటావిడకు మన మాటలు వినపడనంతటి దూరంలో ఒక కుటీరం నిర్మించుకొని పొద్దస్తమానమూ అక్కడే కాలం గడపడంవల్ల చాలా వరకు భార్యాభర్తల మధ్య పోట్లాటలు ఉండవు.


ధనికొండవారు : సన్నని వేప బెత్తంతో వీపు చిట్లగొడితే మళ్లీ మాట్లాడదు. ఒకటి రెండుసార్లు ఇలా జరిగిన తర్వాత మా ఆవిడకూ, నాకూ అభిప్రాయ భేదాలంటూ లేకుండా పోయినాయి.


బుచ్చిబాబు: మా ఆవిడ ఎప్పుడూ " మీకేమీ తెలియదు. మీకేమాత్రమూ తెలియదండీ" అంటూ ఉంటుంది. ఇలా ప్రతిరోజూ చెవిలో నూరిపోయడం వల్ల నాకు ఏమీ తెలియదన్న నమ్మకం బాగా కుదిరింది. అన్నీ తెలిసిన విజ్ఞాన సర్వస్వం మా ఆవిడ. ఆవిడ మాట మెదలకుండా వినడమే నా పని. ఇక పోట్లాటలు ఎలా వస్తాయి?


జమ్మలమడక : భార్యాభర్తల మధ్య పోట్లాటలు రాకుండా ఉండాలంటే భర్త తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకోవాలి. భర్త సంస్కృతంలో ఏది మాట్లాడినా ఆవిడకు అర్ధం కాదు.దాంతో గప్ చిప్ గా ఊరుకుంటుంది. నేను అలాగే చేస్తున్నా మొగుల్లకు.



పాపం.. ఎన్ని కష్టాలో ee

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008