Tuesday, March 31, 2009

లాభమేమిటి ???

ద్వేషం,... మనిషిని అధఃపాతాళానికి తీసుకెళ్లే భాయంకరమైన గుణం ఇది. మనుషుల మధ్య బంధాలు పలుచనవుతూ ఆర్ధిక, సామాజికపరమైన అగాధాలు పెరుగుతున్న తరుణంలో ప్రేమ స్థానంలో ద్వేషం మనల్ని నిలువునా దహించివేస్తుంది. నిన్న మొన్నటి వరకూ అరమరికలు లేకుండా కలిసి గడిపిన వ్యక్తులు, కుటుంబాలు వృత్తి వ్యాపారాల్లో తలమునకలై సామాజికంగా కొంత దూరం అవగానే వారి ఆర్ధికపరమైన హోదాలు, స్థితిగతులు ఒక్కొక్కరి మనసుల్ని తొలవడం సర్వసాధారణమైపోయింది. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంతెత్తు ఎదిగిపోతున్నారు అన్నదే ప్రధానమైపోతుంది. అంతకాలం మనిషిని అభిమానించిన మనసు కాస్తా డబ్బు పొడ చూపగానే ద్వేషించడం మొదలెడుతుంది. "అందరికన్నా ఎక్కువ సంపాదించాలి. అందరికన్నా వీలుపడకపోయినా ఫలానా వారి కన్నా ఉన్నతంగా ఉండాలి".. ఇదే యావ ఎక్కడ చూసినా మనుషుల్లో ! అయిన వారిని, కావలసిన వారిని ఆర్ధికంగా కొలవడమేమిటో?..!! ఎంత గొప్ప అనుబంధాలు ఈ అనారోగ్యకరమైన పోటీకి పుటుక్కున తెగిపోతున్నాయి? నువ్వు సంపాదించుకో బాగుండు.. ఎవరూ కాదనరు. కాని నిన్నటి వరకు ప్రాణానికి ప్రాణమైన వ్యక్తులతో, కుటుంబాలతో నీకు పోటీ ఏమిటీ? నీకన్నా వారు నాలుగురాళ్లు ఎక్కువ సంపాదిస్తే జీవితం మొత్తం కోల్పోయినంత అసంతృప్తి ఎందుకు?అస్సలు కావలసిన మనిషిని ఎందుకు ద్వేషించాలి? ఎందుకంటే... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం కోసం మనం మనుషుల్ని, మనసుల్ని పోగొట్టుకుంటూ సంపాదనలోనే ముఖాన్ని విప్పార్చుకుంటున్నాం. ఒకప్పుడు ఓ వారం రోజులు కన్పించకపోతే బెంగపడిపోయిన మిత్రుడు ఈరోజు ఆర్నెల్ల తర్వాత ఆత్మీయంగా పలకరిద్దామని వస్తే... "ఇప్పుడు వీడెక్కడ తగిలాడురా దేవుడా.. టైమ్ వేస్ట్" అనుకుంటూ చిటపటలాడే మొహంపై చిరునవ్వులు పులుముకుని ఏడవలేక నవ్వుతున్నాం. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప. ఆ గొప్ప మనకే చెందాలి. మనకన్నా ఎక్కువ సంపాదించి ఇంకెవరూ, చివరకు మనవాళ్లయినా ఎదిగిపోకూడదు. అలా జరిగితే వెంటనే ద్వేషం తన్నుకొస్తుంది. ఎదిగిపోతున్నాం.. చితికి సరిపడా నోట్ల కట్టలను పేర్చుకోగలిగేటంతగా!! చితికిపోతున్నాం.. ఒక్కటంటే ఒక్కటన్నా మనసైన బంధాన్ని మిగుల్చుకోలేక!! ఈ నెగిటివ్ ఎమోషన్స్ మనల్ని ఆవహించి నిరంతరం అసంతృప్తికి లోనుచేస్తూ అర్ధం పర్ధంలేని అపార్థాలతో మనుషుల్ని దూరం చేస్తున్నాయి. ఎవరితో ఎలా ఉంటే ఎంత లాభమా అని దేబిరించుకుని లెక్కలు కట్టుకుంటున్నాం. లాభం లేనిదే ఏ పనీ చెయ్యం. లోపల మాత్రం ద్వేషం మనసుని కుళ్లబెట్టి చెయ్యవలసిన నష్టం చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆ ఇనపచట్రంలో నుండి బయటకొచ్చి బంధాలను పెనవేసుకుంటే ఆ ఊహే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా!!!

మీ నల్లమోతు శ్రీధర్

Monday, March 30, 2009

మందార మకరందాలు
"మందార మకరందాలు " ... అనే పదప్రయోగం చెవుల పడగానే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చేది పోతన రాసిన సుప్రసిద్ధ పద్యం " మందార మకరంద మాధుర్యమ్మున దేలు మధుపమ్ము".. అలాగే పోతన కవిత్వాన్ని సంక్షిప్తంగా వివరించమంటే మందార మకరంద మాధుర్యం అనక తప్పదు కదా. అంతటి మధురమైన కవిత్వం అని పోతన భాగవతం చదివిన వారెవరైనా ఒప్పుకోక తప్పదేమో. అందుకే నేను ఈ మధ్యే చదవడం మొదలుపెట్టిన పోతన భాగవతంలోని కొన్ని అందమైన పద్యాలను నాకు అనువైన రీతిలో వివరించడానికి చేసే చిన్న ప్రయత్నానికి మందార మకరందాలు అని నామకరణం చేస్తున్నాను.

భక్తికి మారుపేరుగా భాగవతాన్ని చెప్పుకుంటారు. దానికి కారణం అందులో ఉన్న భక్తి కథలే కాదు, బమ్మెర పోతన మనకందించిన కమ్మని కవిత్వం. కవిత్వం పోతనకి ఒక ముక్తి సాధనం. అది జ్ఞానం వల్ల గాని మనకు లభించదు. అందరికీ అందుబాటులో ఉండేది భక్తి. ఈ మధురాతి మధురమైన ఈ భక్తి మార్గంలో కైవల్యం సాధించుకోవడం చాలా సులువు అనే మహోన్నతమైన దారి మనకు చూపించాడు పోతన.

ముందుగా కొన్ని పరిచయ వాక్యాలు. ఆంధ్రమహాభాగవతం పన్నెండు స్కందాలలొ రాయబడిన మహాపురాణం. రాసింది నలుగురు కవులు, భాగవత రచనలో బమ్మెర పోతన ముఖ్యుడు. భక్తిరస ఘట్టాలన్నీ ఆయన గంటం నుండి జాలువారినవే. మరి కొన్ని భాగాలను మరో ముగ్గురు కవులు అనువదించారు. వారిలో వెలిగందల నారయ ముఖ్యుడు. ఏకాదశ ద్వాదశ స్కందాలు పూర్తిగా, ద్వితీయ దశమోత్తర స్కందాలలో కొంత భాగం ఆయన రచన. పంచమ స్కందం గంగన్న, షష్ట స్కందం సింగన్న తెనిగించారు.శ్రీ కై వల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లో కర
క్షైకారంభకు భక్త పాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోకవిలస ద్దృగ్జాలసంభూత నా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.

శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని మొదటి పద్యమిది. నాందీ శ్లోకం అనవచ్చు. ఈ పద్యంలో నమస్సు, కథా సూచనము రెండూ ఉన్నాయి. భాగవతాన్నితెనిగించమని పోతనకు ఆనతిచ్చినవాడు రామభద్రుడు, కాని కృతిని అందుకున్నవాడు నందనందనుడు. అందుకే పోతన ఆ నందకుమారుని అవతార రహస్యాలను ఈ పద్యంలో అందంగా పొందుపరిచారు. '”లోకరక్షైకారంభకు “ డు అనడంలో పరమాత్ముని స్థితికరత్వాన్ని, “ భక్త పాలన కళసంరంభకుడు “ అనడంలో ఆర్తులను ఆదుకునే గుణాన్ని, “ దానవోద్రేక స్తంభకు” డనడంలో హిరణ్యకశిపునివంటి రాక్షసులను అణచివేసే పనితనాన్ని, “కేళీలోల విల సద్దృగ్జాల సంభూతనానాకంజాత భవాండకుంభకు” డనడనంలో సృష్టిలీలను, కేళీ శబ్దం చేత కృష్ణలీలను కూడా ధ్వనింప చేసాడు.

పద్యంలో పదాలతోఆటలాడుతో మహార్ధాన్ని సూచించడం పోతనకు వెన్నతో పెట్టిన విద్య. "డింభకున్" , "ఆరంభకున్", "సమ్రంభకున్", సమ్రంభకున్", స్తంభకున్" "కుంభకున్" అంటూ సమాసాంతంలో అంత్యప్రాసలు కూర్చే వింత విద్య ఇది. దీనివలన లాభమేంటి అంటారా? చెవికి చవులూరించే నాద సుఖం. పదం - అర్ధం పొందిన మధుర పద సమ్మేళనం ఈ పద్యం.

ఈ పద్యంలో పోతన ఆశిస్తున్నది కేవలం కైవల్యం. మన శరీరం ఇంద్రియ విముక్తమైన అత్మ కేవలమైనది. అది పొందే స్థితి కైవల్యం. మహాకవి పోతన కాంక్షించేది కైవల్యమే తప్ప , కాసులు కాదు.

ఇది మొదటి ప్రయత్నం . తప్పులుంటే మన్నించి, సరిదిద్దండి.

Friday, March 27, 2009

యుగాది శుభాకాంక్షలుమిత్రులందరికీ విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ సంవత్సరం మీకు సకల ఐశ్వర్యానందాలు లభించాలని కోరుకుంటున్నాను.

పంచాంగ శ్రవణం:

మేష రాశి :

అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం

ఆదాయం:2, వ్యయం:8, రాజపూజ్యం:1, అవమానం:7


వృషభ రాశి :

కృత్తిక 2, 3, 4, పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదలు

ఆదాయం: 11, వ్యయం:14, రాజపూజ్యం:4, అవమానం:౭


మిథున రాశి:

మృగశిర 3,4 పదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పదాలు.


ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 14, వ్యయం: ౧౧


కర్కాటక రాశి:

పునర్వసు 4 వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పదాలు

ఆదాయం: 8, వ్యయం:11, రాజపూజ్యం:3, అవమానం:౩


సింహ రాశి:

మఘ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3


కన్యా రాశి:

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు

ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 2, అవమానం:6


తులా రాశి:

చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం: 11, వ్యయం 14, రాజపూజ్యం: 5, అవమానం: 6


వృశ్చిక రాశి:

విశాఖ 4 వ పాదం, అనూరాధ 1, 2, 3 పాదాలు, జ్యేష్ట 1, 2, 3 పాదాలు

ఆదాయం: 2, వ్యయం: 8, రాజపూజ్యం:1, అవమానం: 2


ధనూ రాశి:

మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ 1 వ పాదం.

ఆదాయం: 5 , వ్యయం:14, రాజపూజ్యం:4, వ్యయం:2


మకర రాశి:

ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 అప్దాలు, ధనిష్ట 1, 2 పాదాలు

ఆదాయం: 8, వ్యయం:8, రాజపూజ్యం:7, అవమానం:2కుంభ రాశి:

ధనిష్ఠ 3 4, పాదాలు, శతభిష 4 పదాలు, పూర్వాభాద్ర 1,2,3, పాదాలు

ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 5


మీన రాశి:

పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు
ఆదాయం 5, వ్యయం 4 , రాజపూజ్యం 6, అవమానం 5

-పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి

ఈ రాశి ఫలాలు వివరంగా కావాలంటే ఒక్కో రాశి మీద నొక్కి చూడండి.


ఇక పండగ రోజు ఎం స్పెషల్స్ చేసావు అని అడిగే స్నేహితుల కోసం..


Tuesday, March 24, 2009

థాంక్స్ .....

మనం ఎవరి దగ్గరన్నా ఏదైనా వస్తువు తీసుకుని తిరిగి ఇచ్చేటప్పుడు థాంక్స్ అని చెప్తాము. క్లాసులో పెన్ను కాని, పుస్తకం కాని తీసుకుని మన అవసరం తీరాక అది ఇచ్చిన వారికి తప్పకుండా థాంక్స్ చెప్తాము. అది చాలా మంది చేస్తారు. ఓకే. అలాగే మనకు చాలా అవసరమైన సమాచారం దొరికితే కూడా అవతలి వ్యక్తికి థాంక్స్ చెప్పుకుంటాము. సన్నిహితంగా ఉండే మిత్రుల మధ్య ఈ పదం ఎక్కువగా వాడబడదనుకుంటా. ఎందుకంటే వాళ్లు తమ స్నేహితులకు అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉండడం, అతనికి ఏ సాయమైనా చేయడానికి వెనుకాడకపోవడం, అతని సమస్యను తమదిగా భావించి స్నేహితుడికి సహాయం చేసి అతను సంతోషంగా ఉండాలి, అతని భారం కొంతైనా తగ్గించాలి అనే తపన తప్ప వేరే దురుద్ధేశ్యం కాని, ప్రతిఫలాపేక్ష కాని కనబడదు ఆ మిత్రుల మధ్య. అది ఒక నిష్కల్మషమైన స్నేహానికి గుర్తు. అవసరమైనప్పుడు సాయం చేసి దానిని మర్చిపోతారు కూడా. అలాగే తమకు ఎటువంటి సందేహం కాని, సమస్య కాని వచ్చినప్పుడు ఆ స్నేహితుడిని అడగడానికి సంకోచించరు కూడా..

ఈ థాంక్స్, షుక్రియా, ధన్యవాదాలు, కృతజ్ఞతలు ... కుటుంబ సభ్యుల కంటే అవతలి వారి మధ్యే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? కుటుంబ సభ్యులు చేసే సహాయం లెక్కలోనికి రాదా? పొందిన సహాయానికి థాంక్స్ చెప్పడం అవసరమా.. లేక మనవాళ్లే కదా ఇంతోటి దానికి థాంక్స్ చెప్పాలా అన్న ఫీలింగ్ ఉంటుంది సాధారణంగా ... అమ్మ .. అమ్మ కాబట్టి , కన్నది కాబట్టి ఆమె బాధ్యత భర్తకు, పిల్లలకు కావలసినవి సమకూర్చడం, ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకు వచ్చినట్టుగానే భావించి బాధపడుతుంది. అలాగే తండ్రి .. కుటుంబానికి పెద్ద , సంపాదిస్తున్నాడు. భార్యా పిల్లలను పోషించడం, వాళ్లు కోరిన కోరికలు తీర్చడానికి కష్టపడటాడు .. ఇవి ఒక భాద్యతగా భావించి చేస్తున్నందుకా వీళ్లకు కనీసం ఒక్కసరి కూడా థాంక్స్ చెప్పాలని ఎవ్వరికీ అనిపించదు? వాళ్లకు తాము చేసిన పనులకు థాంక్స్ అనే చిన్న పదం ఇచ్చే ఆనందం, సంతృప్తి కావాలని ఉండదా. అలా అని ఏ తల్లి తండ్రి ఎదురు చూడరు.కాని పిల్లలు ఒక్కసారైనా తమ తల్లితండ్రులకు కాని, భార్యకు కాని, భర్తకు కాని మనసారా థాంక్స్ అని చెప్పాలనిపించిందా?? చెప్పారా?? బయటివాళ్లకు థాంక్స్ చెప్తాం, ఇంట్లోవాళ్లకు ఎందుకు చెప్పాలి అని అనుకుంటే మీ కుటుంబ సభ్యులను taken for granted లా అనుకుంటున్నారన్నమాట. అలాగే తల్లి తండ్రులు కూడా పిల్లలకు సంధర్భానుసారంగా వారు మనకు కలిగించే చిన్ని చిన్ని ఆనందాలకు థాంక్స్ చెప్పడంలో తప్పు లేదు. ఈ చిన్ని పదం అవతలి వ్యక్తి గుండెల్లో సంతోషం వెల్లువలా ఉప్పొంగేలా చేస్తుంది. బాధ్యతగా భావించి తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు అనుకుంటే మాత్రం మనుష్యుల మధ్య అనుబంధం యాంత్రికంగా మారుతుంది . ఉద్యోగం, పిల్లలు, చదువులు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, పనిమనిషి ఇలా.. అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవడం వల్ల ఆత్మీయత అనేది ఎక్కడో ఏ మూలో బిక్కు బిక్కు మంటూ ఒదిగి ఉంటుంది. దాన్ని బయటకు తీసి వ్యక్తపరుచుకోవడం ఎంతో అవసరం ఈ ఆధునిక, బిజీ బిజీ జీవితంలో. సహాయం అందుకున్న ప్రతీసారి థాంక్స్ చెప్పాల్సిన పని లేదు. మనసారా ఒక్కసారైనా నా కోసం చేసిన ఎన్నొ సహాయాలకు థాంక్స్ అని చెప్తే చాలు . మన జీవితం ధన్యమైపోతుంది. అవతలి వ్యక్తి హృదయం ద్రవించి కంట ఒక ఆనంద భాష్పం జాలువారుతుంది. ఆ అనుభూతి జీవితాంతం మరిచిపోలేనిది.. కాదంటారా.. ఒక్కసారి ఆలోచించండి. అమలుపరిచి చూడండి.

మనకు తెలిసినవారు సహాయం చేస్తారు, తెలియనివారివల్ల కూడా మనం ఎప్పుడో ఒకప్పుడు సహాయం పొందుతాము. ఒక్కోసారి మనను ద్వేషించే వారివల్ల కూడా మనకు మంచే జరుగుతుంది. ఆ ద్వేషాన్ని మనం ఎలా receive చేసుకుంటాం. దాని పర్యవసానం మనమే మనకు లాభించేలా మార్చుకుంటాము అన్నది ముఖ్యం.. అలాగే నా మీద ద్వేషంతో నన్ను నిందిస్తూ, దుమ్మెత్తి పోస్తూ, అసభ్యంగా , అశ్లీలంగా రాతలు రాసిన, రాస్తున్న వారికి ఈ బ్లాగు (సభా) ముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అప్పుడు కలిగిన బాధ నాలోని ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంచింది. ఒక మరిచిపోలేని, చాలా అవసరమైనట్టి పాఠాన్ని నేర్పింది. నన్ను నేను ఇంకా మెరుగు పరుచుకునేలా చేసింది. అందుకే వాళ్లకు థాంక్స్...

Thursday, March 19, 2009

మీరేమంటారు?????క్షమించండి. స్త్రీ మూర్తులను చావబాదే సౌలభ్యం వారి భర్తలకు మాత్రమే పరిమితమై ఉండడంలోని ఒక సామాజిక దౌర్భాగ్యం గురించి ఈ ఆర్ధికమాంధ్యపు రోజుల్లో తప్పనిసరై మాట్లాడవలసి వస్తోంది. ఇళ్లలోనూ, ఆఫీసులలోనూ కూర్చుని 'అందమైన కలలు' కంటున్న స్త్రీలందరి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, వారందరిని ఇంటర్వ్యూకి పిలిపించి.. విడివిడిగా వెయ్యి కొరడాదెబ్బలు కొట్టి పంపించే అధికారమేదైనా నాలాంటి వాడొకడికి రాజ్యాంగబద్ధంగా సంక్రమిస్తే ఎంత బాగుంటుంది ! స్త్రీలు కలలు కనడంలో తప్పు లేదు. అయితే మార్కెట్‌లో డబ్బు లేనప్పుడు మనిషి ఎలాంటి కలలు కనకూడదో మన స్త్రీలకి తెలిసుండాలి. తెలియజెప్పే వాళ్లుండాలి. భర్త అనేవాడికి భార్యను నాలుగు తన్ని కూర్చోబెట్టే ఓపిక తప్ప, కూర్చోబెట్టి నాలుగుమంచి మాటలు చెప్పే తీరిక ఎప్పుడూ ఉండదు. మనిషినే పట్టించుకోనివాడు ఆవిడ కలల్నేం పట్టించుకుంటాడు? వాడు బయట తిరగాలి. గడ్డి కరిచి గింజలు తేవాలి. ముద్ద వెతుక్కోవడం మాని ముచ్చట పెట్టుకుంటే అయ్యే పని కాదు.పైగా భార్యకు సమీపంగా రెండు నిమిషాలు కూర్చోవడంలోని ప్రాణహాని ఏమిటో వాడికి తెలుసు. అప్పటికప్పుడు ఆవిడ ఒక కల కంటుంది. అందమైన కల. లేదా, ఎన్నో జన్మలుగా వంటింట్లో ఉండిపోయి, ఉద్యోగంలో పడిపోయి తను కంటూ ఉన్న కలలన్నింటినీ కడుపులోంచి గొంతులోకి తెచ్చుకుని భర్త భుజాలకెక్కిస్తుంది. ఇద్దరం కలిసి అలా వీధి చివరి వరకూ ఏడడుగులు నడిచొద్దాం అంటుంది. "నన్నొక్కసారైనా మీ కౌగిలిలో తలవాల్చుకోనివ్వరా" అని ఆశగా అడుగుతుంది. వేళకు ఇంటికొచ్చి తన ఒడిలో పడుకోమంటుంది. ఇవన్నీ కలలు. అందమైన కలలు..కలలు ఇలా కూడా ఉంటాయా?! నువ్వొక చోట, నేనొక చోటికి వేటకు వెళ్లి ఆహారం తెచ్చుకోవడం, అందులో తిన్నంత తినగా మిగిలింది, తినకుండా మిగుల్చుకుందీ బ్యంక్ లో భద్రపరుచుకోవడం, పిల్లల భవిష్యత్తుని పోస్టాఫీసులోరికరింగ్ గా డిపాజిట్ చేస్తూ ఉండడం, నీ కెరీర్‌లో నువ్వు, నా కెరీర్‌లో నేను ఎదగడానికి ... నా భుజాలను నువ్వు., నీ ఒడిని నేను సంతోషంగా వదులుకోవడం.. ఇఫి కదా మనమిప్పుడు కనవలసిన కలలు?! ప్రపంచం డొల్లబారుతున్నపుడు కళ్లు తెరిచి కనవలసిన కలలు!స్త్రీలకు ప్రత్యేకంగా ఒక 'వైట్ హౌస్ కౌన్సిల్' ను ఏర్పాటు చేస్తూ, గొప్ప విజయాలు సాధించేందుకు అపరిమితంగా కలలు కనండి అని ఒబామా తన దేశ మహిళలకు పిలుపునిచ్చారు. కనడానికి ఒక గొప్ప కలను ఎంపిక చేసుకునే ప్రోత్సాహం ఇలా ప్రతి స్త్రీకి లభించాలి. 'అందమైన కల'లకు బదులుగా ఆమె... అవసరమైన కలలు మాత్రమే కనాలి. ఒక సాధారణ, అందమైన కలను... అవసరమైన కలగా కనే దుస్థితిలో ఏ స్త్రీ ఉన్నా మన తప్పే అవుతుంది.


........... మాధవ్ శింగరాజు.

పై వ్యాసం మూడురోజుల క్రింద ఒక దినపత్రికలో వచ్చింది. చదవగానే చాలా కోపం వచ్చింది. అసలు ఈ రచయిత ఉద్ధేశ్యమేంటి.? ఆడవాళ్లను పొగుడుతున్నట్టా , ఆక్షేపిస్తున్నట్టా??? ఆఫీసుల్లో ఆడాళ్లు పనిపాట చేయక కలలు కంటుంటారా. అసలు ఆడవాళ్లు ఎలాంటి కలలు కనాలో కూడా వాళ్లిష్టమేనా.. అదంతా కాదుగాని, మీరైనా చెప్పండి .. ఈ వ్యాసం చదివి మీరేమనుకుంటున్నారు. నాకైతే తికమకగా ఉంది.. :(

Tuesday, March 17, 2009

మసాలా దోసె – మనస్తత్వ విశ్లేషణ
మసాలా దోసె చాలా మందికి ఇష్టం. కాని దానిని ఎన్నో విధాలుగా తింటారు, రకరకాల దోసెలు విన్నాము గాని , తినడంలో రకాలున్నాయా? అని ఆశ్చర్యపోకండి. కొన్ని విధానాలు చెప్తున్నాను. మసాలా దోసెను తినే విధానం ఆ వ్యక్తి మనస్తత్వాన్ని తెలియజేస్తుందంట. అవి నిజమో కాదో మీరే నిర్దారించుకోండి.


1. దోసెను పూర్తిగా విప్పి తినేవాళ్లు: వీళ్లు నిజజీవితంలో కూడా అన్ని విషయాల్లో ఒపెన్ గా ఉంటారు. వారి సన్నిహిత మిత్రులకు వారి గురించి దాదాపుగా అన్ని విషయాలు తెలిసి ఉంటాయంట. ఇలా తినేవాళ్లు అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువగా ఉంటారంట. (అమ్మాయిలు గుట్టు దాచడంలో ఘనులు కదా )


2. దోసెలను చివర్లనుండి మొదలుపెట్టి మసాలాను తర్వాత తినేవాళ్లు : వీళ్లు అద్భుతమైన విషయాల కోసం ఎదురు చూస్తారు. కాని ఆ సమయం వచ్చేసరికి ఆ అద్భుతాన్ని మనస్పూర్తిగా అనుభవించలేరు. వీళ్లు జీవితాన్ని కష్టమైనా, సుఖమైనా ఎంజాయ్ చేయలేరు. ఇందులో మళ్లీ రెండు రకాలు ...

1) దోసె మొత్తం తింటారు కాని మసాలా వదిలేస్తారు: ఈ వ్యక్తులు ఎక్కువగా సంతోషాన్ని ఆశించరు, ఎందుకంటే వాళ్ల జీవితంలోని ఒడిదుడుకులు, బాధలు వారిని అరుదుగా లభించే చిన్ని, చిన్ని ఆనందాలు కూడా సంతోషాన్ని ఇవ్వలేవు.
2) దోసె చిన్నదైనా మసాలా మొత్తం ఖాళీ చేస్తారు : ఈ వ్యక్తులు నిజంగా అభినందనీయులు. జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారు. ఏదీ మిస్ కారు. సుఖ దుఃఖాలలో తొణకరు, బెణకరు. చీకటైనా, వెలుతురైనా నిబ్బరంగా ఉండే ఈ వ్యక్తులను అర్దం చేసుకోవడం కష్టమే. ఇలాంటివారు ఐతే మన ఆప్త మిత్రుడన్నా అన్నా అవుతారు లేదా బద్ధ శత్రువన్నా అవుతారు.


3. దోసె మధ్యలో నుండి మొదలెట్టి చివర్లకు వెళ్లేవారు: వీళ్లు ఎక్కువగా జీవితంలోని సంతోషాన్నే ముందుగా కావాలనుకుంటారు. ఎప్పుడు కూడా మంచివి, పనికొచ్చే పనులు తొందరగా పూర్తి చేస్తారు. చిక్కులు, ఆపదలు వచ్చేసరికి బెంబేలెత్తిపోతారు. ఇందులో రెండు రకాలు..

1) దోసెను మొత్తం తిననివాళ్లు : వీళ్లు చాలా దురదృష్టవంతులనవచ్చు. ఈ వ్యక్తులు ఎప్పుడు సుఖాన్నే, విజయాలనే కోరుకుంటారు. అనుకున్నవన్నీ సఫలం కావాలనుకుంటారు. కష్టాలు రాగానే ఎదుర్కొనే ధైర్యం లేక చావాలనుకుంటారు. జీవితం మొత్తం సాఫీగా ఎటువంటి సమస్య లేకుండా సాగిపోవాలనుకుంటారు. ఇది అసాధ్యం కదా. ఎంతటి ధనవంతుడికైనా జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయా?
2) దోసెను పూర్తిగా తినేవాళ్లు : వీళ్లు సాధారణ మానవుకు అనొచ్చు. జీవితంలో కష్ట సుఖాలు సమంగా ఉంటాయి, వాటిని అనుభవించక తప్పదు అని నమ్మి వాటికి తయారుగానే ఉంటారు. సంతోషంగా ఉన్నప్పటి ఆనందాన్ని కష్టకాలంలో గుర్తు తెచ్చుకుని సాగిపోతుంటారు. ఈ వ్యక్తులు జీవితం అంటే పూలపాన్పు కాదు, అప్పుడప్పుడు ముళ్లు కూడా తగులుతుంటాయి అని గాఢంగా నమ్ముతారు.


4. మసాలాను దోసె మొత్తానికి వచ్చేలా జాగ్రత్త పడేవారు : ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. వీళ్లు చాలా నిబ్బరంగా, బ్యాలెన్స్ డ్ గా ఉంటారు. వీరిని సంతోషపరచాలన్నా, బాధపెట్టాలన్నా కష్టమైన పనే. కాని వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. ఎవరిని తమ జీవితంలోకి తొంగి చూడనివ్వరు. స్నేహితులుగా ఉండ తగరు కాని గుంపు చెదిరిపోకుండా మాత్రం చూసే ప్రతిభ వీరికి ఉంది అని చెప్పవచ్చు.

5. తమ దోసెను అపురూపంగా భావించి ఎవరితోను పంచుకోవడానికి ఇష్టపడరు: వీళ్లు తమ జీవితం గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరినీ సన్నిహితులుగా భావించరు. తమ గురించి కూడా చెప్పరు. ఎప్పుడూ తమ లాభం గురించే ఆలోచిస్తారు. ఇలాంటివారు ఏ గుంపులో ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు తమ సంతోషం,. లాభం తప్ప వేరే ఉద్ధేశ్యం ఉండదు.

6. తమ దోసెనుండి మొదటి ముక్క ఇతరులకు ఇచ్చేవారు: ఇలాంటివారు స్నేహానికి అత్యంత ప్రాముఖ్యం ఇస్తారు. ఏదైనా కార్యం కాని గుంపులో కాని ఉంటే అది తమ స్వంతంగా భావిస్తారు. గుంపులోని సభ్యులందరినీ ఒక్కటిగా ఉంచే గం లాంటివారు. చాలా కలుపుగోలుగా ఉంటారు. అందరిని చాలా తొందరగా తమలో కలుపుకుంటారు. ఎప్పుడు కూడా స్నేహితులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.


7. దోసెనుండి ముందు కొంచం తిని తర్వాత ఇతరులకు ఇచ్చేవారు : ఇలాంటివారు తమ స్నేహితులను అమితంగా ప్రేమిస్తారు. అసలు స్నేహం చేయడానికి చాలా ఆలోచిస్తారు. స్నేహితులని నిశ్చయించుకున్న తర్వాత మాత్రం ఆ బంధాన్ని ఎప్పటికీ విడిచిపెట్టరు. ఎప్పుడు కూడా తొందరపడరు. ఏ పరిస్థితి నైనా ముందుగా దానిని గురించి ఆలోచించి, విశ్లేషించి ఆ తర్వాత రంగంలోకి దూకుతారు.

8. ఎదుటివారు ముందు తమకు ఇవ్వాలని ఎదురుచూసేవాళ్లు : ఇలాంటివారు సర్వసాధారణంగా కనిపిస్తారు. దేనిగురించి కూడా ఖచ్చితమైన అభిప్రాయం కలిగి ఉండరు. ఎప్పుడు కూడా అవతలివాడు ముందడుగు వేయాలని చూస్తుంటారు. తమంతట తాము ధైర్యం చేయరు. ఎదుటివారు మిన్నకుంటే వీరు అంతే.


9. తమకు ఎక్కువవుతుందని అనుకున్నప్పుడే ఎదుటివారికి ఇవ్వాలని ఆలోచించేవాళ్లు : ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు మనకు ఎంతో మంది తారసిల్లుతారు. తమ అవసరాలన్నీ తీరాక, ఏమైనా మిగిలి ఉంటే అప్పుడు దానం చేయడానికి ముందుకొస్తారు. అలా అని వాళ్లు పిసినారులు కారు. దానకర్ణులూ కారు. చాలా మంచివాళ్లు. ముందు తమని తాము సంతృప్తి పరుచుకున్నాకే మిగిలిన వారికి సాయం చేస్తారు. మంచి అనుభవైకవేద్యమైన సలహాలు ఇస్తారు.


10. దోసె మొత్తం ఎదుటివారికి ఇచ్చి తర్వాత అందులోనుండి తీసుకుని తినేవారు : ఇలాంటివారిదో వింత మనస్తత్వం. తమకేమి కావాలో తెలుసు, ఎలా సంపాదించుకోవాలో తెలుసు కాని ఆ సంపాదించినదాన్ని పూర్తిగా ఎలా అనుభవించాలో తెలీదు. తమ అవసరాలు తీరితే చాలు అనుకుంటారు కాని సంపూర్ణంగా అనుభవించడం అనేది అస్సలు తెలీదు.


అర్ధమైంది కదా. ఇక ఎప్పుడైనా మసాలా దోసే తినేవాళ్లు కనిపిస్తే , కాస్త గమనించండి. అతను మీ స్నేహితుడైతే , అతని స్వభావం అంచనా వేసి నిజమేనా చూడండి. ఇంతకీ మీరు పైవాటిలో ఏ విధానంలో మసాలా దోసె తింటారేంటి?

Thursday, March 12, 2009

హ్యాపీ బర్త్ డే గిరిచంద్....
గిరి , పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఎప్పుడూ , నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను..

ఈ అక్క ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉంటాయి.

ఈ గిరిచంద్, మన నువ్వుశెట్టి బ్రదర్స్ లో ఒకడు. కృకీలు గుర్తున్నాయా :)

Sunday, March 8, 2009

ఆడవాళ్లలో జీనియస్సులు ఎందుకు లేరు???


ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలు. ఇవాళ ఒక్కరోజే కాదు , ప్రతి రోజు మనదే. ప్రత్యేకమైనదే. మనచేతిలో ఉన్నదే. దానిని అందంగా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం మనచేతిలో ఉంది. కుటుంబంతో పాటు మనగురించి కూడా ఆలొచించి అద్భుతాలు సాధించగలం అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోండి. నిజంగా మనం గొప్పవాళ్లం. ఎవరితో పోల్చుకోవద్దు. పోటీ వద్దు. మన టాలెంట్ మనం గుర్తిస్తే చాలు. ఎవరో మనను గుర్తించాల్సిన పనిలేదు. అవసరం లేదు. ధృడ విశ్వాసంతో మీ ప్రయాణం సాగించండి. దారికడ్డం వచ్చే పిచ్చి (గజ్జి) కుక్కలు, చీడ పురుగులను పట్టించుకోకుండా ముందుకు అడుగులేయండి. విజయం మీదే.. ఎక్కడైనా..


ఏ. ఆర్. రెహ్మాన్ ఆస్కార్ అవార్డు సాధించినప్పుడు మనందరికీ ఎంతో గర్వంగా అనిపించింది. దేశమంతా పండగ చేసుకున్నారు. అతని తోడుగా ఉన్న తల్లి కూడ గర్వంతో పులకరించిపోయింది అని చెప్పక తప్పదు. అలాగే అతని భార్య అందరికంటే ఎక్కువగా గర్వపడి ఉండొచ్చు. నా భర్త ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అది నాకూ కూడా సంతోషం. నాకే వచ్చినంత ఆనందంగా ఉంది అనుకొని ఉండొచ్చు కదా. భర్తను ప్రేమించే, గౌరవించే ప్రతి భారతీయ నారి ఇలాగే అనుకుంటుంది. కాని... ఇక్కడ పరిస్థితి రివర్స్ చేస్తే... భార్య ఇలాగే పెద్ద పేరు తెచ్చుకుంటే భర్త కూడా గర్వపడతాడా ??? నాకైతే డౌటే.

పూర్వకాలంలో మగాళ్లు అంటే పని చేయాలి, ఇల్లు నడిపించే బాధ్యత అతనిదే, భార్య అంటే ఇల్లు, వంట, పిల్లలు, కుటుంబ సభ్యుల గురించి చూసుకోవాలి అని నియమం ఉండేది. ఆడవాళ్లు గడప దాటి బయటకొచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం భార్యా భర్తలు ఇద్దరూ పని చేయకుంటే తప్పేట్టు లేదు. ఇంతవరకు ఓకే.

ఈ రెండువేల సంవత్సరాలలో ప్రపంచ ప్రసిద్ధులైన వ్యక్తుల లిస్ట్ తయారు చేస్తే... అందులో ఆడవాళ్లు ఎంత మంది ఉంటారు. 1901 నుండి ఇస్తున్న నోబుల్ బహుమతుల్లో ఎంత మంది స్త్రీలు ఆ అవార్డు పొందారు?. నాటక రచయితలు, సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, పాటల రచయితలు, సైంటిస్టులు .. అందరూ ఎక్కువగా మగవాళ్లే. స్త్రీలు చాలా చాలా తక్కువ. ఎందుకని. స్త్రీలలో జీనియస్సులు లేరా. వాళ్లు ప్రతిభాపాటవాలు లేవా?

ఈ జీనియస్ అనబడే వ్యక్తికి చెమ్మగిల్లే హృదయం ఉండాలి. కంట తడిపెట్టగలిగే మెత్త్తటి మనసుండాలి. ఈ గుణాలు ఆడవాళ్లలో సహజంగానే ఉంటాయి. అందుకే ప్రతి స్త్రీలో ఒక జీనియస్ ఉంటుంది. కాని అది పైకి కనపడదు. అది పైకి రావాలంటే , పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలంటే ఆ ప్రతిభకు మెరుగులు దిద్దాలి. ప్రాక్టీసు చేయాలి. ఇలా తమ సమయాన్ని ఎక్కువగా దీనికే వినియోగిస్తే మరి ఇంట్లో వంటెవరు చేస్తారు?, భర్తను, పిల్లలను ఎవరు చూస్తారు? ఇంటి భాద్యతలు సరే సరి. పైగా ఈర్ష్యా అసూయలతో పాటు పురుషాధిక్య సమాజంలో స్త్రీ ఓ తెగించి ఓ అడుగు ముందుకేయాలంటే ఎన్నో అడ్డంకులు, వాదాలు , వివాదాలు. తనో జీనియస్, తనలో కూడా టాలెంట్ ఉంది అని నిరూపించుకోవడానికి అనుక్షణం ఎన్నో విషయాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. సహజంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే స్త్రీ ఇటువంటి గొడవలు లేకుండా ఉండాలని అందుకుంటుంది. అందుకే సాధారణంగా ఎక్కువ మంది స్త్రీలు తమలో నిభిడీకృతమైన శక్తిని గురించి ఆలోచించరు, జీనియస్‌లుగా ఉండడానికి ప్రయత్నించరు.

1968 లో బార్రన్ ఇలా అన్నాడు... సృష్టించడం అన్నది కళాకారులు మాత్రమే చేయగలరు. వాళ్ల రాతలతోనో, చేతలతోనో, గీతలతోనో.. ఈ విధయమైన సృజనాత్మకత స్త్రీలలో లోపించింది. రిస్క్ ఎందుకని ప్రకృతి డివిజన్ ఆఫ్ లేబర్ క్రింద మగవాళ్లు ఐడియాలని, పెయింటింగ్‌లని , సాహిత్య, సంగీత సంస్థల్ని, దేశాల్ని, మతాల్ని, స్త్రీలు తరాల్ని సృష్టించేట్టుగా ఏర్పాటు చేసింది.

అయితే ఫ్రాయిడ్ ప్రకారం పుట్టుకతో ఆడవాళ్లు ఇన్‌ఫీరియర్ కాదు. సామాజిక బంధాలు, కమిట్‌మెంట్స్ వాళ్లని ఓ మెట్టు తక్కువగా చేసింది. ఈ కంచెల్ని చేధించిన వాళ్లు, తప్పించుకున్నవాళ్లు, మగలక్షణాలున్న ఆడవాళ్లుగా మిగిలిపోతున్నారు. ఒక స్త్రీ నిజమైన స్త్రీత్వం గల మనిషిలాగానైనా ఉంటుంది. లేదా క్రియేటివ్ జీనియస్‌గా ఉండిపోతుంది. ఈ రెండు ఒకే స్త్రీలో ఉండడం చాలా అరుదు. ఆడవాళ్లలో జీనియస్సులు లేరని కాదు. ఎక్కువగా వాళ్ల తెలివితేటలు అణచివేయబడతాయి. ఐనా కూడా కొందరు స్త్రీలు ఈ ఆటంకాలు చేధించుకుని విజయాలు సాధిస్తున్నారు తానొచ్చినా, ఇతరులను నొప్పించని రీతిలో.


మన దేశంలో స్త్రీకి స్వంత అభిమతం, వ్యక్తిత్వం, సృజన ఉండకూడదని , చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్దాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలని రూల్ పెట్టేస్తారు. ఇంకా నయం నేటి తరం పురుషులు మారుతున్నారు. స్త్రీలను గౌరవించి, వారి ప్రతిభని వెలికితీయలనే కోరిక కాకున్నా కుటుంబాన్ని నడపడానికైనా వారిని ఉన్నత చదువులు , ఉద్యోగాలకు అనుమతిస్తున్నారు. ఇక్కడ ఉద్యోగం ఒక అవసరం గానే ఉండిపోతుంది. కాని స్త్రీలలోని అసలైన టాలెంట్ బయటకు రావడం అరుదనే చెప్పవచ్చు.

ప్రతి వ్యక్తిలోనూ జీనియస్ ఉంటాడు . పురుషులు తాము అనుకున్నది చేయగలుగుతారు. కాని స్త్రీలు మాత్రం ఎక్కువగా కుటుంబానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. సంసారం, ఇంటిపని, వంటపని, పిల్లల పని ఆడవాళ్లని పీల్చి పిప్పి చేస్తాయి. ఇలా నాలుగు గోడల మధ్య బందీ ఐన జీవితం జీనియస్సులని ఎలా ప్రసాదిస్తుంది. మగవాళ్లు ఇవన్నీ పట్టించుకోకుండా తమ కార్యక్రమాలు చేసుకోగలరు కాబట్టే జీనియస్సులు అయ్యే అవకాశం ఎక్కువ. ఆ అదృష్టం ఆడవాళ్లకు లేదుగా. ఇప్పుడు ఉద్యోగం చేసే స్త్రీ ఐనా ముందు ఇంటిపని, పిల్లల పని మొత్తం పూర్తి చేసుకున్న తర్వాతే ఉద్యోగానికెళ్ళాలి. వచ్చిన తర్వాత మళ్లీ ఇంటిపని తప్పదు. ఎంత చేసినా ఏవో వంకలు. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే సంపాదిస్తున్నానని గర్వమా అంటారు. కాని మగవాడికి అలాంటి టెన్షన్స్ ఉండవే.

కుటుంబ విషయాలకు సంబంధించినత వరకైతే ఆడవాళ్లకు ఎక్కడికెళ్లినా కుటుంబం నుండి ఎటువంటి అభ్యంతరం, అడ్డంకి ఉండదు. కాని తన కిష్టమైన పనుల కోసం బయటకు వెళ్లాలంటే మాత్రం సవాలక్ష ప్రశ్నలు, అడ్డంకులు. భావాలు, ఆలోచనలు, ఊహలు ప్రయాణించినట్టుగా తాము కూడా ప్రయాణించే రోజు ఇంకా రాలేదు మహిళలకు. మగవాళ్లు తమ భార్యలను ప్రోత్సహిస్తారు ఆమే విజయాలకు ఆనందిస్తారు. కాని అది కొంతవరకే.. ఆమె విజయాలు, పేరు ప్రఖ్యాతులు ఎక్కువైనా, తమ కంటే అధికమనిపించినా వాళ్లలోని ఇగో నేనున్నానంటూ బయటకొస్తుంది. ఇక్కడ ఈర్ష్య మొదలవుతుంది. అప్పుడు వాళ్లను అణగదొక్కాలని ప్రయత్నిస్తారు. కుటుంబంలో అల్లకల్లోలం భరించలేని స్త్రీలు తప్పనిసరై తలవంచుతారు. అలా కాకుండా ధైర్యంగా మొండికేస్తే తెగించింది, మగరాయుడు, ఇలా ఎన్నో పేర్లు పెడతారు. ఇంట్లోనించి వెళ్లిపొమ్మంటారు. నీకు నీ సంసారం ముఖ్యమా నీ టాలెంట్ ముఖ్యమా తేల్చుకో అని అల్టిమేటం జారీ చేస్తారు. ఉదా.. భర్తకు ఎప్పుడైనా ఎక్కడికెళ్లాలన్నా ఎంచక్కా వెళుతున్నా అని చెప్పేసి వెళ్లిపోతాడు. కాని భార్య వెళ్లాలంటే కుదురుతుందా? లేదు. తను బయటకెళ్లాలంటే ముందు భర్త అనుమతి తీసుకోవాలి. తను లేని లోటు తెలీకుండా ఇంట్లో అన్నీ అమర్చి (కొన్ని గంటలకోసమైనా) బయటకెళ్లాల్సి వస్తుంది. కాని ఆ భర్త, నువ్వ్వెళ్లవోయ్, నేను చూసుకుంటాను అనే రోజు వస్తుందా.. అలా ఉంటే ఇంకా ఎంతో మంది జీనియస్సులు తయారవుతారు అన్నది లక్షలవరహాల మాట.

నేను ఈ విషయాలన్నీ ఊహించి రాసినవి కావు. సంవత్సరాలుగా ఎంతో మంది స్త్రీలను చూసి తెలుసుకున్న నిజాలు. అలా అని అందరు మగవాళ్లు ఇలాగే ఉండరు. భార్యను తనకిష్టమైన చదువులు , ఉద్యోగాలకు ప్రోత్సహిస్తూ, ఇంటిని పిల్లలను చూసుకునే భర్తలు కూడా ఉన్నారు. కాని చాలా తక్కువమంది.. భర్త విజయాలకు పొంగిపోని భార్య ఉంటుందా. ఎప్పుడు కూడా మా ఆయన బంగారం అనుకుంటుంది. కాని అలాగే భార్య విజయాలకు కూడా భర్తలు గర్వపడతారా అన్నదే నా సందేహం???

Wednesday, March 4, 2009

ఈటివి2 సఖులకు బ్లాగు పాఠాలు..


కంప్యూటర్ అనగానే అది చదువుకున్న వాళ్ళకే , ఇంగ్లీషు వచ్చినవాళ్ళే వాడతారు. అయినా దానివలన మనకేంటి ఉపయోగం. అది నేర్చుకుని మాత్రం చేసేదేముంది. చోద్యం కాకపొతే కంప్యూటర్లో చేసే పనులేముంటాయి. అని చాలా మంది గృహిణులు అనుకోవచ్చు. కాని కుట్లు అల్లికలు లాగ బ్లాగింగు కూడా ఒక హాబీ లా పెంపొందించుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో మనందరికీ తెలిసిన etv2 చానెల్ లో సఖి అనే మహిళల ప్రోగ్రాములో కొత్తగా తెలుగు బ్లాగుల గురించి ఒక వినూత్నమైన కార్యక్రమం మొన్న సోమవారం అంటే March 2 నుండి ప్రారంభమైంది. ఐతే ఏంటంటా? అంటారా? ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది మన మహిళా బ్లాగర్లే..

ఇందులో అస్సలు బ్లాగులంటే తెలియని సఖులకు అవి ఏమిటి, ఎందుకు , ఎలా, ఎక్కడ ప్రారంభించుకోవచ్చో అనే విషయాలు కూలంకషంగా నేర్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రోగ్రాం ప్రతి సోమవారం మద్యాహ్నం సఖి లో ప్రసారమవుతుంది . మొదటి కార్యక్రమంలో అసలు బ్లాగులంటే ఏమిటి, ఎలా రాయాలి, ఎందుకు రాయాలి . ఎటువంటి విషయాలు రాయాలి. వాటివలన ఉపయోగాలు మున్నగు విషయాలు వివరించడమైనది. ఇక ముందు ముందు ఏయే విషయాలు నేర్పించబడతాయో వేచి చూడాల్సిందే. ...


ఎంతో మంది మహిళలకు ఇదొక మంచి వ్యాపకంగా, తమ భావాలను, అభిరుచులను, ఆలోచనలనూ, అనుభవాలనూ పంచుకునే వేదికగా బ్లాగులు సహకరిస్తాయి అని సఖి కార్యక్రమం ద్వారా చక్కటి ప్రయత్నం చేసిన రమ గారికీ, ఈటీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు


ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రమదలందరికీ అభినందనలు...

Tuesday, March 3, 2009

జన్మదిన శుభాకాంక్షలు శ్రీధర్...కంప్యూటర్ ఎరా సంపాదకుడు, మనందరికి ఆత్మీయుడైన శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.

శ్రీధర్, నువ్వు ఆయురారోగ్యాలతో, సకల ఐశ్వర్యాలతో , ఇంకా ఎన్నో విజయ శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
Always Keep Smiling brother...


పైన బహుమతి కాస్త ప్రత్యేకమైనది. దీని మీద క్లిక్ చేసి చూసి రండి.. అందులో పేజి చివరంటా వెళ్లి సున్నితంగా తాకండి.. అదే వెనక్కి మరలుతుంది..ఈ బహుమతి చేయడానికి సహకరించిన మహేష్ గారికి ధన్యవాదాలు.

Sunday, March 1, 2009

గోల్ మాల్

కూటి కోసం కోటి తిప్పలు అని పెద్దలు ఊరికే అన్నారా?. అలాగే ఉద్యోగం పురుష లక్షణం. కాని మీసం లేని మగాడు వ్యక్తిత్వం లేనివాడు. అసలు మగాడే కాదు అంటే మీరు ఒప్పుకుంటారా? కాని భవానీ శంకర్ అనే పెద్దమనిషికి యువకులు అంటే మీసముండాలి, ఎటువంటి ఆటలు గట్రా ఆడకూడదు, సంస్కృతి , సంప్రదాయాలను పాటించాలి. అని కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉండాలి. తికమకగా ఉందా?? ఈ కథ కమామీషు దాదాపు ముప్పై ఏళ్ల క్రింద విడుదలైన హిందీ చిత్రం "గోల్ మాల్" లోది. ఉద్యోగం కోసం అబద్దం ఆడిన అమోల్ పాలేకర్, తర్వాత దాన్ని నిలుపుకోవడానికి పడ్డ నానా అగచాట్లు, ఉత్పల్ దత్ హుందా ఐన నటన, సున్నితమైన హాస్యాన్ని అందించిన దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ. వీరిని ఇప్పటికీ గుర్తుచేయనివారుంటారా. ఆ చిత్రం విడుదలై అందరిని అలరించింది, ఇప్పటికీ దాదాపు ప్రతీ సీను చాలా మందికి గుర్తుంటుంది. వెంటనే పెదవులపై చిరు మందహాసం ఉదయించక మానదు.


రామ్ ప్రసాద్, అతని చెల్లెలు రత్న తల్లి తండ్రి లేని అనాధలు. చదువు పూర్తైన రాం ప్రసాద్ ఉద్యోగవేటలో ఉండగా వారి కుటుంబ మిత్రుడైన డాక్టర్ చెప్పిన ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళతాడు . కాని ఆ ఉద్యోగంకోసం ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ అధిపతి భవానీ శంకర్ చాందసవాది, అమాయకుడు. జీతం, అల్లొవెన్సులు బానే ఉన్నాయి. కాని కాస్త పాతకాలం వేషధారణ , మాటలు ఉండాలి. అధునిక యువకులు పెద్దలను, సంస్కృతిని గౌరవించరు అని భవానిశంకర్ అభిప్రాయం. డాక్టర్ చెప్పిన ప్రకారమే రామ్ ప్రసాద్ ఖద్దరు లాల్చీ, పైజామా, తలకు నూనె పట్టించి, చాలా నిదానస్తుడిలా వెళతాడు ..ఇక్కడ ఇంటర్వ్యూలో అమోల్ పాలేకర్, ఉత్పల్ దత్ నటన అద్భుతం. భవాని శంకర్ ని మెప్పించడానికి ఆటలంటే పిచ్చి ఉన్నా కూడా అస్సలు ఆటల గురించి తెలీనట్టే మాట్లాడతాడు. ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు బ్లాక్ పెర్ల్ (పీలే బిరుదు) గురించి అడిగితే రామ్ ప్రసాద్ ముత్యాలు నల్లగా ఉంటాయా సర్? నాకు తెలీదే అని అమాయకంగా ఎదురు ప్రశ్న వేస్తాడు ..అలాగే తరచూ "మేరే పితాజీ కహాకర్తే తే " అంటూ ఎన్నో అబద్ధాలు చెప్తాడు. ఆ గ్రాంధిక బాష విన్న భవానీ శంకర్ ముగ్ధుడైపోయి, అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు.

ఉద్యోగం వచ్చాక హాయిగా గడిచిపోతుంటుంది. బయట ఎంత చలాకీగా, ఆధునికంగా ఉన్నా, ఆఫీసుకు వెళ్లేటప్పుడు మాత్రం వేషం మార్చుకుని వెళుతుంటాడు రామ్ ప్రసాద్. ఒకరోజు ఫుట్ బాల్ మాచ్ చూడడానికి లీవు కోసం లేని తల్లికి ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్తాడు రాం ప్రసాద్. కాని అదే మాచ్‌లో భవానీ శంకర్ అతడిని స్నేహితులతో కలిసి అల్లరి చేస్తుండగా చూస్తాడు. కోపంతో మరునాడు ఆఫీసులో నిలదీస్తాడు. అసలే అబద్ధంతో మొదలైన ఉద్యోగం. దానిని కాపాడుకోవడానికి మరిన్ని అబద్ధాలు ఆడక తప్పదు అతనికి. ఫుట్ బాల్ మాచ్ లో కనిపించింది తను కాదు ఉద్యోగం సద్యోగం లేక తిరుగుతున్న తన తమ్ముడు లక్ష్మన్ ప్రసాద్ అని చెప్తాడు రామ్. నమ్మని బాస్ కు తనకు మీసముందని, తమ్ముడికి మీసం లేదని బొంకుతాడు. అలాగే ఒక నటీమణిని తల్లిగా పరిచయం చేస్తాడు. రామ్ ప్రసాద్, అతని చెల్లెలిమీద ప్రేమతో ఆవిడ కూడా వీళ్లకు వంత పాడుతుంది. తమ్ముడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని రామ్ ప్రసాద్ బాధ పడుతుంటే భవానీ శంకర్ అతడిని తన కూతురికి సంగీతం నేర్పించమంటాడు. ఇక మొదలవుతుంది రామ్ కి రెండు విభిన్నమైన పాత్రలు పోషించడం. అనుకోకుండా ఒకసారి తల్లి పాత్ర వేస్తున్న కమలాదేవి కూడా అనుకోని పరిస్థితిలో తనకు ఒక కవల సోదరి ఉందని చెప్తుంది. మరో గోల ఏంటంటే భవానీశంకర్ కూతురు ఊర్మిళ తమ్ముడు లక్ష్మన్ ని ప్రేమిస్తుంది. తండ్రి ఏమో తన కూతురికి బుద్ధిమంతుడైన రామ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.

ఇక్కడ మొదలవుతుంది అసలు గందరగోళం. ఉద్యోగం కాపాడుకోవటానికి రామ్ ప్రసాద్ పాట్లు, ఏది నమ్మాలో , ఏది నమ్మకూడదో తెలియని అయోమయంలో భవానీ శంకర్. ఇందులో ఉత్పల్ దత్, అమోల్ పాలేకర్ ఒకరిని మించి ఒకరు అద్భుత నటనను కనబరిచారు. ఎవరు ఎక్కువ , ఎవరు తక్కువ అని చెప్పలేము. అమాయకంగా అమోల్ పడే పాట్లు, సీరియస్ గా ఉంటూనే కడుపుబ్బా నవ్వించే ఉత్పల్ దత్ హావభావాలు. అంతకు మించి దర్శకుడి ప్రతిభ. 1979లో విడుదలైన ఈ చిత్రం లక్షలాదిమందికి ఫేవరేట్ గా నిలిచిపోయింది. ఇప్పటి చిత్రాల్లో లాగా వెకిలి హాస్యం కాకుండా ఏళ్ల తరబడి గుర్తుండిపోయే, కుటుంబ సమేతంగా చూడగలిగే సున్నితమైన హాస్య కథా చిత్రం ఇది. ప్రతి మగాడికి మీసం ఉండాలని, మీసం లేని వాడికి మంచి మనసు, చరిత్ర, సంస్కృతి, పెద్దల ఎడ భయం భక్తి ఉండదు అనే భవానీశంకర్ ను ఎలా ఒప్పించి అతడి కూతురిని పెళ్లి చేసుకున్నాడన్నది సినిమా క్లైమాక్స్. ఎలాగైతేనేమి కూతురికోసం మనసు మార్చుకున్న భవానీశంకర్ కూడ సినిమా చివర్లో మీసం తీసేసి కూతురు అల్లుడితో ఫోటొ దిగుతాడు.

ఇందులోని టైటిల్ పాట "గోల్ మాల్ హై భై సబ్ గోల్ మాల్ హై " మనకు ఎదురయ్యే ఎన్నో సంఘటనలకు తప్పనిసారి పాడుకోవాల్సి వస్తుందేమో. ఈరోజు అన్నీ గోల్‌మాల్ గా ఉన్నాయి కదా. అలాగే మరో మధురమైన పాట "ఆనేవాలా పల్ ,, జానేవాలా హై." మంచి ప్రేమ గీతం.. సంగీతానందించింది R.D.Burman. ఎప్పుడైనా బోర్ గా, దిగులుగా ఉందా?? ఐతే ఈ సినిమా ఒక్కసారి చూడండి, మీ మూడ్ మారి తప్పకుండా హాయిగా నవ్వి తీరుతారు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008