Monday, May 28, 2012

శృంగారంపై అవగాహన లేకే అనర్థాలు

శృంగారంపై అవగాహన లేకే అనర్థాలు

పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు, వారి కుటుంబాలు, రెండు సంస్కృతుల, ఆచారాల కలయిక. ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఆ ఇద్దరూ జీవితాంతం ఒకరికొకరు తోడుగా, సుఖ సంతోషాలలో భాగస్వాములై కలిసి ఉండాలని అందరూ కోరుకుంటారు. శారీరక సంబంధం కూడా వారిద్దరినీ మరింత దగ్గర చేసి వారి వివాహ బంధాన్ని పటిష్టంగా ఉంచుతుంది.

కొన్ని సందర్భాలలో స్ర్తి కానీ, పురుషుడు కానీ సెక్స్ పట్ల విముఖులై ఉంటారు. అది వారి మానసిక సమస్య కావొచ్చు లేదా శారీరక సమస్య కావొచ్చు. మరి కొన్నిసార్లు కావాలని చేసేది కావొచ్చు. ఇటువంటి సమయంలో భాగస్వాములలో ఇద్దరిలో ఎవరైనా సెక్స్‌కి విముఖత చూపించడం క్రూరత్వం కింద లెక్క కట్టొచ్చు. ఇందులో మొదటి రాత్రి నుండి లెక్కపెట్టవచ్చు.. అది వారి వివాహాన్ని రద్దుచేయడానికి ఆధారం కూడా అవుతుంది అని ఈ మధ్యే ఢిల్లీ హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. మరి ఈ తీర్పుపై వివిధ రంగాలలో ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకుందాం.

పెళ్లికి చెల్లుచీటీనా? : మహేష్ కుమార్- సినీ డైరెక్టర్
పెళ్లితో అయినా సరే బలవంతపు సెక్స్ అనేది మారిటల్ రేప్ అవుతుందనే విశాలత్వం కలిగిన భారతీయ శిక్షాస్మృతిలో సెక్స్ వద్దనుకున్నంత మాత్రాన దాన్ని పెళ్లికి చెల్లుచీటీలా ఒప్పుకోవచ్చనే ధోరణి చిత్రంగా అనిపించొచ్చు. కాకపోతే, చట్టపరంగా పెళ్లి ""consummate అవడం’’ అంటేనే మొదటి రాత్రి జరగడం. కాబట్టి చట్టానికి, ఆ చట్టంలోని న్యాయపరమైన విశాలత్వానికీ ఎక్కడో తేడా ఉందనే విషయం మనకు అవగతమైతే ఈ తికమక కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఈ మొత్తం తీర్పులో ఉన్న కీలకం విలువలది కాదు. ""Willful denial'' అనే సాంకేతికతది. అందుకే కావాలని సెక్స్‌వద్దనడం చట్టపరంగా పెళ్లిని కన్సుమేట్ కాకుండా చూడటంగా లేదా కొన్నాళ్ల తర్వాత సెక్స్ వద్దనడం పెళ్లిని చట్టపరంగా కొనసాగించాలనే భావన లేనట్టుగా భావించి ఈ తీర్పు వెలువడి ఉండొచ్చు. ఇందులో అంత షాక్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు.

విపరీత ధోరణికి అవకాశాలు : పూర్ణిమ -అడ్వకేట్
పెళ్లి తరువాత సెక్స్‌ను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం ఒక రకంగా మానసికంగా, శారీరకంగా వేధించడమే. కానీ తీర్పు లో చెప్పినట్టు ఒక్కో జంటది ఒక్కో కథ, ఒక్కో పరిస్థితి. రాండమ్‌గా ఆలోచిస్తే ఇది కూడా 498ఎ-లాగా దురుపయోగం కానుంది. కాకపోతే ఇది ఒకరకంగా మగవాళ్లకే ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది. ఆడవాళ్ళూ, అల్ట్రామోడరన్ ఆడవాళ్ళ చేతిలో కూడా బ్రహ్మాస్తమ్రే. అదే సమయంలో ఇద్దరూ ఆందోళనకి గురయ్యే అవకాశాలు.. విపరీత ధోరణికి తావిచ్చే పరిస్థితులు.. ఇద్దరి అనుకూలతకి దోహదం చెయ్యాల్సిన విషయాలని సరైన చర్చ, అవగాహన లేకుండా చట్టాలు చేసి పడేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ. మన భారత విద్యా విధానంలో పదవ తరగతిలో జీవశాస్త్రంలో ఓ భాగంగా అవయవ నిర్మాణం గురించి చెబుతారు కానీ, ప్రకృతి కలిగించే సహజ భావాల గురించి కానీ వాటి ప్రాధాన్యత గురించి కానీ ఏ విషయాలూ చెప్పరు. మారుతూ, కట్టుదిట్టాలకు లోనైన సంస్కృతిలో సెక్స్ ఒక అపచారం.. దాని వాంఛ వెల్లడించడం అసాంఘికం.. అదో చీకటి కార్యం..
ఆదిమానవుల కాలంలో అదో సహజ చర్య.. ఎవరి ఇష్టం వాళ్ళది అనేలా ఉండే మనం.. కొంత ఇచ్ఛా భద్రత కోసం బైగామి, పోలిగామి, మోనోగామి ఇలా ఎవరి వారి ధర్మానుసారం ఏదో ఒకటి అడాప్ట్ చేసుకున్నాం. దాని ప్రకారమే జీవిస్తే హాయి- అని తీర్మానించుకున్నాం. మనం చేసుకున్న కట్టుదిట్టాలు మనల్ని కట్టలు తెంచుకొమ్మంటున్నాయా? ఇచ్ఛ ఒక సహజ చర్య. అది కలిగి, ఎదిగి వెల్లడించే పరిస్థితులు కల్పించలేము కాని ఆ కోరిక కచ్చితంగా తీరాలి అనే చట్టాలు చేయడం మాత్రం చేయగలం.. రెక్కలు ఉన్నాయనే స్పృహ కల్పించకుండా.. నువ్వు గాల్లో ఎగరకపోతే చంపేస్తా.. ఎగిరితీరాల్సిందే- అని లోకం కొత్తగా చూస్తున్న పక్షి పిల్లకి చెబుతున్నట్టుగా.. ఎగరటం ఎవరూ నేర్పరు. అది దాని సహజ లక్షణం. కానీ దానికా స్వేచ్ఛ ఉంది అని మాత్రం ఆరుబయట వదిలినపుడే తెలుస్తుంది.. ఇక్కడ గమనించాల్సింది.. అర్థవంతమైన స్వేచ్ఛ.. అయినా స్వేచ్ఛకి, విచ్చలవిడితనానికి చాలా తేడా ఉంది. ఆ తేడాను తెలుసుకోగలిగే సంస్కారం, జ్ఞానం మన టీనేజర్స్‌కి ఎంత కల్పిస్తున్నాం? మొన్న ప్రతిపాదించిన ఇంకో చట్టం 18 సంవత్సరాలలోపు ఆడ, మగ అంగీకారంతో అయినా సెక్స్ చేసినాసరే అది నేరమే అని. అంటే పెళ్లితో అన్నీ సవ్యం, పెళ్లికాకుంటే అన్నీ అనుచితమా? అంటే ఒక తాడు, ఒక తంతు మన కోరికలను చట్టబద్దీకరిస్తుందా? అసలు మనం ఎటువైపు పయనిస్తున్నాం? పురోగమిస్తున్నామా? తిరోగమిస్తున్నామా?

ఈ ప్రస్థానం ఎటు? : ఎం. దిలీప్‌కుమార్ - బిజినెస్‌మాన్
వివాహానికి శృంగారమే పరమావధా? శృంగారం లేనిపెళ్లి పెళ్లి కాదా? శృంగారం వద్దంటే పెళ్లి పనికిరాదా? ఆ అమ్మాయి, అబ్బాయిని శృంగారానికి తీర్చిదిద్దే బాధ్యత మన న్యాయ వ్యవస్థ తీసుకుంటుందా? మనసుల, మనుషుల మధ్య శృంగారంలో పాల్గొనే బంధం ఏర్పడకపోతే ఆ పెళ్లికి అర్థంలేదా? ఒక అమ్మాయి శృంగారానికి సమయం కావాలనుకుంటే పెళ్లి అర్థం లేనిది అవుతుందా? మన సమాజం- ప్రేమ, అనుబంధం, శృంగారాన్ని వివాహ బంధానికి పరిమితి చేయడం ఎంత అమానుషం. సరైన శృంగారానికి వధూవరులను తీర్చిదిద్దుతున్నామా? అలా కానప్పుడు శృంగారాన్ని తిరస్కరిస్తే వివాహబంధం ఎలా విచ్ఛిన్నమవుతుంది? అసలేమి జరుగుతున్నది? మన న్యాయస్థానాల ప్రస్థానం ఎటువైపు వెళుతుంది? సైన్సు దీనికి చెప్పే సమాధానం ఏంటి? ఈ లోకంలో పాండురాజులను భరిస్తున్న కుంతీదేవిలు ఎంతమంది? ఆ కుంతీలు కోర్టుకెక్కి విడాకులు తీసుకునే సామాజిక స్థైర్యం ఇచ్చేవరకూ- మగ మహారాజులు శృంగారం వద్దన్నందుకు పెళ్లి రద్దుచేసుకోనివ్వొద్దు.. ఐదు నెలలు ఒక స్ర్తి శృంగారానికి విముఖంగా ఉంటే.. ఆ వివాహం రద్దుచేసినట్లైతే.. ఎన్ని సంసారాలు సజావుగా సాగుతున్నవనేది ఆ న్యాయస్థానాల విజ్ఞతకే సవాలు వంటిది. ఈ సున్నితమైన భావాలకు సంబంధించిన విషయాన్ని న్యాయస్థానాలు నిర్ణయించే ముందు కాస్త దీని ప్రభావం బాలికలమీద ఎలా పడుతుందో బాధ్యతగా ఆలోచించాలి. శృంగారం అంటే సరియైన జ్ఞానం లేనప్పుడు, వివాహం అంటే భయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అబ్బాయి,అమ్మాయిలలో శృంగార భావాలు, వారి సుముఖత అడిగే మరోరకం సమాజం ఏర్పడుతుంది. ఏ అమ్మాయిని వారి తల్లిదండ్రులు అడగగల్గుతారు? మన సమాజంలో నీకు శృంగారంపై ఆసక్తి ఎంత? నువ్వు నీ భర్తతో శృంగారంలో పాల్గొంటావా అని? అసలు ఆ అమ్మయి ఐనా చెప్పగలుగుతుందా? ఏ న్యాయస్థానమైనా చెప్పగల్గుతుందా.. ఒక అమ్మాయి పెళ్లి తర్వాత ఎన్ని రోజులకు శృంగారానికి సుముఖంగా ఉంటుందో..?
తెగతెంపులు తప్పు కాదు : ఉమాభారతి - ఎన్‌ఆర్‌ఐ
శారీరక సంబంధాన్ని వద్దనుకోవడం నిజంగా క్రూరత్వమే. భార్యాభర్తలలో ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా సెక్స్‌కి అంగీకరించకపోవడం సమర్థించరానిది. దానివల్ల అవతలివాళ్లకు చాలా బాధను కలిగిస్తుంది. దంపతులు విడిపోవడానికి ఇది సరియైన కారణమే. ఇలాటి కారణం ఉన్నదని నిరూపణ అయితే ఆ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకోవడంలో తప్పులేదు. నేను కొన్ని జంటలను ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లను చూశాను. అందులో కొత్తగా పెళ్లైనవాళ్లు, పెళ్లయ చాలా ఏళ్లయ ఉన్నవారూ ఉన్నారు. పెళ్లయ చాలా ఏళ్లయ్యాక ఇటువంటి సమస్య వచ్చినపుడు వౌనంగా ఉండి, ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటారు. దీనివల్ల కుటుంబంలో కలతలు మొదలవుతాయి. ఇక కొత్తగా పెళ్లైనవాళ్లు మాత్రం కుటుంబం, సమాజం అనే భయాలు పెట్టుకోకుండా చాలా సులువుగా పరస్పర అంగీకారంతో విడిపోతారు. ఒకవేళ ఇది ‘ఫ్రిజిడిటి’ సమస్య ఐతే డాక్టర్లు, సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్‌తో తగ్గిపోతుంది. కాని కొత్తగా పెళ్లైనవాళ్లకు సహనం, అర్థం చేసుకునే ఓపిక ఉండకపోవచ్చు. దానివల్ల సమస్య ఇంకా పెద్దదవుతుంది తప్ప పరిష్కారం లభించదు.

Tuesday, May 8, 2012

స్వేచ్ఛ కోసం శతాబ్దాల పోరాటం


             

వరకట్నాలులైంగిక వేధింపులు, ఆడవాళ్లంటూ హద్దులు, ఆంక్షలు .. ఇవన్నీ భారతదేశంలో సర్వసాధారణం. ఇక్కడ పుట్టినందుకు ఇదంతా తప్పదు. అదే అమెరికాలో ఐతేనా?? ఇష్టారాజ్యం. ఎవరూ ఏమనరు? ఇష్టమొచ్చినట్టుగా ఉండొచ్చు. చదువుకోవచ్చు. ఉద్యోగాలు చేయొచ్చు. మహిళలకు అక్కడ ఎటువంటి ఆంక్షలు ఉండవు, అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి..... ఇలా అనుకుంటున్నారా?? అమెరికన్ స్త్రీలను గురించి అసూయ పడుతున్నారా??

కానీ అమెరికన్ స్ర్తిలకు ఈ స్వేచ్ఛ,అవకాశాలు ముందునుంచి లేవు. వాళ్లు కూడా ఎన్నో వివక్షలు, అవమానాలు,అణచివేతలకు లోనయ్యారు. దాదాపు 200 ఏళ్లకు పైబడి అక్కడి మహిళలు పోరాడి స్వేచ్ఛ, అధికారాలను సాధించుకున్నారు. ప్రపంచానికంతటికీ ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం, రారాజు వంటిది అని అనుకుంటున్న అమెరికాలో 1920 వరకు స్ర్తిలకు ఓటు హక్కు అస్సలు లేదంటే నమ్ముతారా? కొనే్నళ్ల క్రితం వరకు అక్కడి స్ర్తిలకు  కూడా సహజమైన, సరైన స్థానం వంటిల్లేనని నిర్థారించారు.మొగుడికి ఉత్తరం, చాకలిపద్దులు రాసేటంత చదువు ఉంటే చాలు. ఐనా ఆడవాళ్ళు ఎక్కువ చదువుకుని ఏం చేస్తారు? ఉద్యోగాలు చేసి ఊళ్ళేలాలా? ఈ తరహా ఆలోచనలు అమెరికాలోనూ పాతుకుపోయాయి. ఒకవేళ కొందరు స్ర్తిలు ఉద్యోగాలు చేసినా అవి ఎక్కువగా నర్సు, సెక్రటరీ, టీచరు వంటివే ఉండేవి. 1776లో బ్రిటిషు సామ్రాజ్యం నుంచి అమెరికా స్వాతంత్య్రం పొందింది. స్వాతంత్య్రానికి ముందునుంచే అమెరికన్ స్ర్తిలు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు సాగించారు. ఆ రోజుల్లోనే కొందరు ప్రతిభావంతులైన యువతులు తమ పరిస్థితిని మెరుగుపరచుకోవడమే కాకుండా సమాజంలో ఉన్న వివక్షను గుర్తించి వ్యూహాత్మకంగా ఎదుర్కొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చదువు, వృత్తి, ఉద్యోగాలు కష్టసాధ్యంగా ఉన్నా కూడా ప్రతిభావంతులైన స్ర్తిలు ఉద్యమాలు, ఉపన్యాసాలు కొనసాగించారు. కొందరు తండ్రులుకూడా తమ కుమార్తెలను విద్యావంతులుగా, ఆలోచనాపరులుగా తీర్చిదిద్దారు. పత్రికలు, ప్రచురణ సంస్థలుకూడా వీరి రచనలను ప్రచురించి ప్రోత్సహించాయి. అమెరికా దేశ వ్యవస్థాపనకు అతి ముఖ్యమైన స్వాతంత్య్ర సమరంలో సాధారణ మహిళలు కూడా పాల్గొన్నారు. బ్రిటీషు ఉత్పత్తులను బహిష్కరించడంతోపాటు, తమ భర్తలు యుద్ధానికి వెళ్లడంతో సుమారు పదేళ్లపాటు సమర్థవంతంగా వ్యవసాయం చేసి సైన్యానికి తిండికి లోటులేకుండా చేశారు ఆ తరం మహిళలు. అమెరికా చరిత్రలో స్ర్తిలకు వోటు హక్కు కోసం జరిగిన సప్రేజ్ ఉద్యమం చాలా కీలకమైనది, ముఖ్యమైనది అని చెప్పవచ్చు. స్వాతంత్య్ర పోరాటానికి ముందు 1750లో లిడీయా చాపిన్ టాప్ట్ అనే మహిళ స్థానిక రాజకీయాలలో చురకుగా పాల్గొంటూ ఉండేవారు. 18, 19 శతాబ్దంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఎక్కువ అధికారం ఉండేది. అప్పటికి స్ర్తిలకు ఇంకా వోటు హక్కు లేదు. సార్వత్రిక ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో మహిళలకు వోటు హక్కు ఇవ్వడమా? వద్దా? అని తర్జన భర్జనలు జరిగాయి. చివరికి, 1879లో న్యూజెర్సీ అసెంబ్లీ స్ర్తిలకు వోటు హక్కును ఇచ్చింది. కాని ఇరవై ఏళ్ళ తర్వాత రద్దుచేసింది. తమ వోటు హక్కు కోసం మహిళా ఉద్యమకారులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. సుమారు 70 ఏళ్ళపాటు జరిగిన సుదీర్ఘ పోరాటంలో సూసన్ బి.ఏంథొనీ అనే మహిళ కీలక పాత్ర పోషించారు. ఆమె తన రచనలతో, ఉపన్యాసాలతో మహిళా ఉద్యమ కార్యకర్తలనేకాక, సాధారణ పౌరులని, రాజకీయ నాయకులను కూడా ప్రభావితం చేశారు. స్ర్తిల వోటు హక్కు కోసం సూసన్ దాదాపు 45 సంవత్సరాలపాటు దేశమంతా పర్యటిస్తూ ఏడాదికి కనీసం వంద సభల్లో ఉపన్యాసాలు ఇస్తూ అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈ సమయంలో ఎంతోమంది కార్యకర్తలను ప్రభుత్వ ధిక్కార నేరం కింద దీర్ఘకాలం జైళ్ళలో పెట్టారు. చివరికి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1920లో అమెరికన్ కాంగ్రెస్ 19వ రాజ్యాంగ సవరణని ఆమోదించి అమెరికన్ మహిళలకు సార్వత్రిక వోటుహక్కు ఇచ్చింది.


ఇక విద్య, ఉద్యోగాల విషయానికొస్తే అమెరికాలో ఆడపిల్లలకోసం ప్రత్యేకమైన పాఠశాలలు, కళాశాలలు 18వ శతాబ్ది చివరికే ఏర్పడ్డాయి. కాని అవి ఎక్కువగా ఇంటిని చక్కదిద్దుకోవడం, అతిథి మర్యాదలు, పిల్లల పెంపకం వగైరా విషయాలకే పరిమితమై ఉండేవి. తర్వాత 19వ శతాబ్దంలో అనేక విశ్వవిద్యాలయాల్లో మహిళలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి, వైద్య, న్యాయ శాస్త్రాలలో కూడా ప్రవేశం లభించింది. స్ర్తిలు చాలావేగంగా అన్ని రంగాలలో రాణించసాగారు. అంతేకాదు మహిళలు ప్రత్యక్ష రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టారు. 1920లో వోటు హక్కు వచ్చినా, చాలా దశాబ్దాల తర్వాత ఎంతో మంది మహిళలు నగర కౌన్సిలర్లుగా, మేయర్లుగా రాష్ట్ర అసెంబ్లీ సభ్యులుగా ఎన్నికయ్యారు. తొలి తరం అమెరికన్ మహిళలు ప్రారంభించిన పోరాటం కారణంగానే ఈ రోజు అమెరికాలో ఎనిమిది రాష్ట్రాలలో మహిళలు గవర్నర్లుగా, జాతీయ కాంగ్రెస్‌కు ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. న్యూయార్క్ సెనేటర్‌గా ఎన్నికైన తొలి మహిళ హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయినా, నేడు విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


మొదట్లో మహిళలకు అధ్యాపక వృత్తిలో గుర్తింపు లభించినా ఇతర రంగాలలో ప్రవేశం అంత సులువుగా దొరకలేదు. పదేళ్లుగా టీచర్‌గా పనిచేసిన తర్వాత 1849లో ఎలిజబెత్ బ్లాక్వెల్ అనే మహిళ వైద్య కశాళాల నుండి అమెరికాలో తొలి మహిళా డాక్టర్‌గా ఉత్తీర్ణత సాధించారు. అదే సమయంలో కొందరు మహిళలు న్యాయవాద వృత్తిని చేపట్టారు. వివిధ రంగాలలో డాక్టరేట్లు సాధించారు. అమెరికాలో తొలి పరిశ్రమలు ఎక్కువగా వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకు చెందినవే. సహజంగానే ఆ పరిశ్రమల్లో మహిళా కార్మికులు అధిక సంఖ్యలో ఉండేవారు. వాళ్లకు ఎంత అనుభవమున్నా ఉన్నత హోదాలు ఇచ్చేవారు కాదు. తగిన సదుపాయాలు, సెలవులు కూడా ఉండేవి కావు. వాటికోసం ఆ మహిళలు పోరాటాలు, ఉద్యమాలు చేయక తప్పలేదు. అందులో ప్రముఖురాలు మదర్‌జోన్స్. ఆమె కుటుంబమంతా యెల్లో ఫీవర్ అనే జబ్బుతో మరణించడం, పదేళ్లకుపైగా శ్రమించి అభివృద్ధి చేసుకున్న బట్టల షాపు కాలిపోవడంతో మేరీ జోన్స్ తన గృహసంబంధ, వ్యాపార జీవితాన్ని వదిలివేసి కార్మిక ఉద్యమాలు, సంక్షేమానికి అంకితమయింది. తాను నాయకురాలు అవడమే కాకుండా మిగిలిన స్ర్తిలకు కూడా కార్మిక ఉద్యమాలలో సరియైన స్థానం ఉండాలని కృషి చేసింది. తర్వాతి కాలంలో అమెరికాలో జరిగిన అనేక కార్మిక సంస్కరణలకు మూలం మదర్ జోన్స్‌గా పిలవబడే మేరీ జోన్స్ నడిపించిన ఉద్యమాలే అని అందరూ ఒప్పుకుంటారు. అందుకే ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆమెను ‘అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన స్ర్తీగా అభివర్ణించారు.


ఇక వర్తమానానికి వస్తే 19వ శతాబ్దంలో, 20వ శతాబ్ది ప్రారంభంలో స్ర్తీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, ఉన్నత విద్యనభ్యసించినా ఒక స్థాయి వచ్చేసరికి వారి ఉద్యోగ ప్రస్థానం ఆగిపోతూ వచ్చింది. ఉద్యోగాలు చేసేవారేకాక చిన్నా, పెద్దా వ్యాపారాలు ప్రారంభించినవారు కూడా అభివృద్ధి చెందారు. కాలక్రమేణా మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పురుషులతో సమానంగా ఉన్నత విద్యలు అభ్యసించి బహుళజాతి వాణిజ్య సంస్థల్లో ఉన్నత పదవులు అధిరోహించారు. వారి ప్రతిభ, సామర్థ్యం అన్నింటా ప్రకాశించింది. ఈ అనూహ్యమైన మార్పు విద్య, ఉద్యోగ, వాణిజ్య రంగాలలోనే కాక రాజకీయాలలో కూడా ప్రముఖంగా కనిపించింది. దాని ఫలితంగానే ఎంతోమంది మహిళలు రాష్ట్ర గవర్నర్లుగా ఎన్నికయ్యారు. హిల్లరి క్లింటన్ దేశాధ్యక్ష పదవికి పోటీపడి ఒబామాకు గట్టి పోటీ ఇచ్చారు. కాని అమెరికాలో కూడా కొందరు ఛాందసవాదులు మాత్రం స్ర్తిలు తమ సాంప్రదాయకమైన కుటుంబ పాత్రను వదిలి ఉద్యోగాలకు ఎగబడుతున్నారని అసూయ పడుతున్నారు. కానీ, తన విలువ తెలుసుకున్న ఏ తల్లయనా ఆత్మవిశ్వాసంతోనే తన పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. తన వృత్తికోసం కుటుంబాన్ని ఎప్పుడూ పణంగా పెట్టదు. రెండు బాధ్యతలనూ సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయాలు సాధిస్తుంది. ఇది మహిళలకున్న ప్రత్యేక లక్షణం. అది భారతదేశంలోనైనా, అభివృద్ధి చెందిన అమెరికా దేశంలోనైనా ఒక్కటే..!

Wednesday, May 2, 2012

"ఇరుకైన" వంటగది... ఆప్యాయతకు చోటేది??
ప్రతీరోజు ఉదయం ఆరుగంటలనుండి  పదకొండు వరకు ఏ ఇంటి ఇల్లాలిని కూడ పలకరించడానికి సాహసించరాదు. అంత బిజీగా ఉంటారు. భర్త, పిల్లలకోసం టిఫిన్లు పెట్టి, లంచ్ బాక్సులు కట్టి, నీళ్లు వగైరా పెట్టి, నాప్కిన్ మర్చిపోకుండా  పెట్టి వాళ్లను పంపేసాక కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఉద్యోగాలు చేసే వాళ్ల పరిస్ధితి మరీ ఘోరం.  గాలిలో తేలుతున్నట్టుగా ఇంటిపని, వంటపని  ముగించుకుని  ఆదరాబాదరా ఎంగిలిపడి ఆఫీసుకు పరిగెత్తాల్సి వస్తుంది. ఇక ఇంట్లో ఉంటే ఇల్లాల్లు మాత్రం సుఖంగా ఉంటారని కాదు.  భర్త,పిల్లలు వెళ్లిపోయాక కాపీ తాగుతూ కాస్సేపు కూర్చుని ఇల్లు సర్ధడం, పూజ వగైరా చూసుకుంటుంది. తీరిగ్గా మద్యాహ్నం పేపర్ పట్టుకుని కూర్చున్నప్పుడు  పక్కింటి రజని వచ్చింది. "అక్కయ్యా!! వంట అయ్యిందా?"  ఎదురింటి బామ్మగారు కూడా పలకరించారు. "అమ్మాయ్! భోజనం అయిందా?ఇవాళేం చేసావు??ఆడవాళ్లకు ఇలాంటి సంభాషణలు మామూలే కదా. ఎవరినైనా పలకరించినప్పుడు ఆయా సమయాలను బట్టి ముందుగా అడిగేది తిన్నారా? ఇవాళేంటి స్పెషల్? అని. "ఆడవాళ్లకు వంట తప్ప వేరే ముచ్చట్లే ఉండవా??"

వంట చేయడమనేది మన సంస్కృతి స్త్రీకి లభించిన ఒక గొప్ప వరం. అగ్నిముందే నిలబడి వంట చేయడం ఒక యజ్ఞం లాంటిది.. ఇంట్లోవాళ్లందరి ఇష్టాలు, వాళ్ల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని  వంట చేసి వడ్డించి ఆకలి తీర్చడం మాత్రమే  కాక తిన్నవాళ్లు పూర్తిగా  సంతృప్తిపడాలి అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకే తృప్తిగా భోజనం చేసిన తర్వాత  ఎక్కడైనా, ఎవరైనా అనుకోకుండా మనసులో వచ్చే మాట "అన్నదాతా సుఖీభవ"

కాని నిజం చెప్పాలంటే వంట చేయడం ఒక గొప్ప కళ. ఏదో బ్రతకడానికి తినక తప్పదు కాబట్టి వండుకోక తప్పదు అన్నట్టు ఆదరాబాదరా కుక్కర్ పెట్టి, కూరలు తరిగి పోపులో పడేసి వంటింట్లో శతసహస్రావధానం చేసినట్టుగా మారిపోయింది నేటి జీవితం. ఏమంటే  ప్రతీరోజు భార్యాభర్తలు, పిల్లలు కూడా ఒకేవిధంగా   చదువులు,ఉద్యోగాలకు పరిగెత్తక తప్పడంలేదు. అందుకని రెండురోజుల కొకసారికాని, వారంకోసారి కూరలు వండి ఫ్రిజ్ లో పెట్టుకుని రోజుకొకటి మైక్రోవేవ్ లో వేడిచేసుకుని తినేవాళ్లు కూడా ఉన్నారు. ఈ పద్ధతి విదేశాలలో ఉండేవారే చేస్తారు అనుకునేవాళ్లు కాని మన దేశంలో కూడా మొదలైంది ఈ ప్రహసనం. శుభ్రంగా, తాజాగా వంట చేసుకునేవాళ్లు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. సాంకేతిక, మర యంత్రాలతో పాటు పనిచేస్తూ మనిషి జీవితం కూడా యాంత్రికంగా మారిపోతుంది. ఇందులో ఎవరినీ తప్పు పట్టలేం..

కొన్నేళ్ల క్రితం అంటే  నలబై, యాభై  సంవత్సరాల క్రింద   గ్యాసు పొయ్యిలు, కరెంట్ పొయ్యిలు ఎక్కడివి??. కట్టెలు, బొగ్గులు లేదా ఊకతో చేసే పొయ్యిల మీద వంట చేసేవారు. కళాయి పూసిన ఇత్తడి పాత్రలు.(ఇపుడు ఇత్తడి అంటే ఇరవై ఆమడలు పారిపోతున్నారు అతివలు). ఉచితంగా ఇచ్చినా ఇత్తడి గిన్నెలు తీసుకోవట్లేదు ఎవ్వరు కూడా.. ఆప్పటి వంటిల్లు మట్టి గోడలతో ఉండేది. రోజు రాత్రి పడుకునే ముందు వంటిల్లు శుభ్రం చేసి పొయ్యిలో బూడిద అంతా తీసేసి పడుకునేవాళ్లు . ప్రతి గురువారం రాత్రి పేడతో గోడలు అలికి ముగ్గులుపెట్టి శుక్రవారం ప్రత్యేకంగా వంట ప్రారంభించేవాళ్లు.   ఇప్పట్లా భోజనాలు బెడ్ రూముల్లోనో, టీవీ చూస్తూనో తినేవాళ్లు కాదు. వంటింట్లో లేదా మరో పెద్ద గదిలొ  విస్తరాకులు కాని అరిటాకులు వేసి నేలమీదే కుటుంబ సభ్యులందరూ ఒకే వరుసలో కూర్చుని తినేవాళ్లు మగవాళ్లైనా, ఆడవాళ్లైనా. అప్పుడే కష్టసుఖాలు మాట్లాడుకునేది.  ఆరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కాబట్టి పిల్లలు కూడా ఎక్కువగా ఉండేవారు. అందరూ తినడానికి కూర్చుంటే పోట్లాడుకుంటూ సరిగ్గా తినరని అమ్మకాని బామ్మకాని  పెద్ద పల్లెంలో అన్నం పెట్టి వేడి వేడి నెయ్యి వేస్తూ, పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టి పప్పన్నం, చారన్నం, కూరన్నం చివరలో పెరుగన్నం అంటూ ముద్దలు కలిపి పెట్టేది. చిన్నపిల్లలకైతే నోట్లో , పెద్దపిల్లలకైతే చేటిలో పెట్టేది. ఇలా తింటూనే వాళ్లకు ఎన్నో కథలు కూడా చెప్పేది కదా.. పిల్లలు ఆసక్తిగా కధ వింటూ, నాకు నాకు అంటూ పోటీ పడుతూ తినేసి ఆటలకు పరిగెత్తేవాళ్లు .  ఇప్పట్లా పిల్లలు తినడానికి సతాయించేవారు కాదు. అఫ్పుడు ఎవరింట్లోనూ  ఫ్రిజ్ లేదు కాబట్టి రోజు రోజు వండుకోవాల్సిందే. తాజా, నిల్వ పచ్చళ్లు, ఊరగాయలు, అప్పడాలు. పండగలొస్తే తప్పనిసరిగా చేసే పులిహోర, పాయసం.

ప్రతీ పండక్కీ వేర్వేరు రకాల పిండి వంటలు, ప్రసాదాలు. తినేటప్పుడు కూడా కొన్ని నిబంధనలు ఉండేవి. ఏదైనా చెప్పగానే ఎందుకు అని ఎదురు మాట్లాడకుండా పాటించేవాళ్లు అందరూ. భోజనం చేసేటప్పుడు ఎడమచేతిని నేలపై ఉంచడం తప్పు. కంచాన్ని చేతిలో పట్టుకుని తినడం కూడా తప్పని చెప్పేవారు. ఎడమచేత్తో తినే పదార్థాలను తాకడం అనాచారమని చెప్పేవారు పెద్దలు. తినేటప్పుడు తుమ్మొద్దు. తుమ్ము వస్తే పళ్లెం క్రింద కొన్ని నీళ్లుపోయాలి అనేది ఒక నియమం. అలాగే విస్తరాకులో కాని అరిటాకులో కాని వడ్డించేటప్పుడు ప్రతి పదార్థాన్ని ఒక వరుస క్రమంలో వడ్డించాలి. పచ్చడి నుండి మొదలెట్టి చివరగా అన్నం, నెయ్యి వడ్డించేవారు. అన్ని పదార్థాలు వడ్డించేవరకు ఎవ్వరూ భోజనం మొదలెట్టకూడదు.అలాగే భోజనం ఐపోయాక కొంపలు మునిగిపోయినట్టు లేచి వెళ్లిపోకూడదు. మరి కొందరు తినేవరకు కూర్చోవాలి. ఇది ఒక క్రమశిక్షణ లాంటిది.

వంట చేయడం మాత్రమే కాదు వడ్డించడం కూడా చాలా ముఖ్యం. స్థిమితంగా కూర్చుని ఒకరు వడ్డిస్తే భోంచేయడంలో తేడా ఉంటుంది. వడ్డించేవారు ఆప్యాయతతో, ప్రేమతో కావలసినంత వడ్డించడం, మరి కొంచం వేసుకోండి పర్లేదు అని మారు వడ్డన చేయడం ఒక ప్రత్యేకమైన కళ, ఇంత ఆప్యాయంగా వడ్డిస్తే ఎంత మొహమాటస్తుడైన మరికొంచం వడ్డించుకోక తప్పదు. అలాగే వడ్డించేటప్పుడు అవతలి వ్యక్తి ఎవరు, ఏమిటి, అతని హోదా , దర్జా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వడ్డించడం మహాపాపం. ప్రతి వారికి సమానంగా వడ్డించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సహజ సిద్ధంగా ఓర్పు, సున్నితత్వం, లాలన లాంటి లక్షణాలు కలిగిన స్త్రీయే ఇందుకు సమర్ధురాలని తలచే పెద్దలు ఈ మహత్తరమైన బాధ్యతని అప్పగించారేమో. అన్నం ప్రాణుల జీవాధారం. కోటి విద్యలు కూటి కొరకే. ఆనాటినుండి ఈనాటి వరకు ఏ మనిషైనా పొద్దుటినుండి రాత్రి వరకు గానుగెద్దులా కష్టపడేది పట్టెడన్నం కోసమే కదా. ..

ఇదంతా ఓ మధురమైన కలలా ఉందికదా.  కాని సాధ్యం కానిది కాదు కదా. ఎంత బిజీగా ఉన్నా కనీసం కుటుంబ సభ్యులందరూ రోజూ ఒక్కసారన్నా కలిసి , మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తే అది వారిమధ్య అనుబందాన్ని మరింత పెంచుతుంది. ఒకరికొకరు అన్న భావన, ఎవరేం చేస్తున్నారు అన్న సంప్రదింపులు పెరుగుతాయి. ఎవరికి ఆకలైనప్పుడు వాళ్లు కంచంలో అన్నం, కూరలు అన్న పెట్టేసుకుని కంప్యూటర్ ముందో, టీవీ ముందో సెటిల్ ఐపోతున్నారు. కనీసం తాము తినే తిండిని కూడా ఆస్వాదించలేకున్నారు.... పెళ్లిళ్లు, పూజలు వగైరా జరిగినప్పుడు బంతి భోజనాలు తప్పనిసరి. ఎంతమంది వచ్చినా విసుక్కోకుండా అన్ని వంటకాలు ఇష్టపూర్తిగా వడ్డిస్తారు. అడిగి మరీ మారు వడ్డన చేస్తారు. కాని ఈరోజుల్లో ఇంట్లోనే కాదు పెళ్లిల్లు, చిన్న చిన్న పార్టీలలో కూడా వడ్డన జరగడంలేదు. రుచికరమైన, ఖరీదైన వంటకాలు చేయిస్తారు. పెద్ద, పెద్ద టేబుళ్ల మీద అన్నీ అమరుస్తారు. ఇక అతిధులు ప్లేట్లు తీసుకుని లైన్లో నిలబడి మళ్లీ దొరుకుతాయో లేవో అన్నట్టు అన్నం , పప్పు, కూరలు, స్వీట్లు, పెరుగు అన్నీ వడ్డించేసుకుని ఓ పక్కన నిలబడి తినేస్తారు.  దీనివల్ల ఆకలి తీరుతుంది కాని సంతృప్తి కలగదు. ఏదో పెళ్లికొచ్చాం తినాలి కాబట్టి తింటున్నాం అన్నట్టుగా ఉంటుంది అందరి పరిస్ధతి, ఆలోచన కూడా...

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008