Monday, May 28, 2012

శృంగారంపై అవగాహన లేకే అనర్థాలు

శృంగారంపై అవగాహన లేకే అనర్థాలు

పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు, వారి కుటుంబాలు, రెండు సంస్కృతుల, ఆచారాల కలయిక. ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఆ ఇద్దరూ జీవితాంతం ఒకరికొకరు తోడుగా, సుఖ సంతోషాలలో భాగస్వాములై కలిసి ఉండాలని అందరూ కోరుకుంటారు. శారీరక సంబంధం కూడా వారిద్దరినీ మరింత దగ్గర చేసి వారి వివాహ బంధాన్ని పటిష్టంగా ఉంచుతుంది.

కొన్ని సందర్భాలలో స్ర్తి కానీ, పురుషుడు కానీ సెక్స్ పట్ల విముఖులై ఉంటారు. అది వారి మానసిక సమస్య కావొచ్చు లేదా శారీరక సమస్య కావొచ్చు. మరి కొన్నిసార్లు కావాలని చేసేది కావొచ్చు. ఇటువంటి సమయంలో భాగస్వాములలో ఇద్దరిలో ఎవరైనా సెక్స్‌కి విముఖత చూపించడం క్రూరత్వం కింద లెక్క కట్టొచ్చు. ఇందులో మొదటి రాత్రి నుండి లెక్కపెట్టవచ్చు.. అది వారి వివాహాన్ని రద్దుచేయడానికి ఆధారం కూడా అవుతుంది అని ఈ మధ్యే ఢిల్లీ హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. మరి ఈ తీర్పుపై వివిధ రంగాలలో ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకుందాం.

పెళ్లికి చెల్లుచీటీనా? : మహేష్ కుమార్- సినీ డైరెక్టర్
పెళ్లితో అయినా సరే బలవంతపు సెక్స్ అనేది మారిటల్ రేప్ అవుతుందనే విశాలత్వం కలిగిన భారతీయ శిక్షాస్మృతిలో సెక్స్ వద్దనుకున్నంత మాత్రాన దాన్ని పెళ్లికి చెల్లుచీటీలా ఒప్పుకోవచ్చనే ధోరణి చిత్రంగా అనిపించొచ్చు. కాకపోతే, చట్టపరంగా పెళ్లి ""consummate అవడం’’ అంటేనే మొదటి రాత్రి జరగడం. కాబట్టి చట్టానికి, ఆ చట్టంలోని న్యాయపరమైన విశాలత్వానికీ ఎక్కడో తేడా ఉందనే విషయం మనకు అవగతమైతే ఈ తికమక కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఈ మొత్తం తీర్పులో ఉన్న కీలకం విలువలది కాదు. ""Willful denial'' అనే సాంకేతికతది. అందుకే కావాలని సెక్స్‌వద్దనడం చట్టపరంగా పెళ్లిని కన్సుమేట్ కాకుండా చూడటంగా లేదా కొన్నాళ్ల తర్వాత సెక్స్ వద్దనడం పెళ్లిని చట్టపరంగా కొనసాగించాలనే భావన లేనట్టుగా భావించి ఈ తీర్పు వెలువడి ఉండొచ్చు. ఇందులో అంత షాక్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు.

విపరీత ధోరణికి అవకాశాలు : పూర్ణిమ -అడ్వకేట్
పెళ్లి తరువాత సెక్స్‌ను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం ఒక రకంగా మానసికంగా, శారీరకంగా వేధించడమే. కానీ తీర్పు లో చెప్పినట్టు ఒక్కో జంటది ఒక్కో కథ, ఒక్కో పరిస్థితి. రాండమ్‌గా ఆలోచిస్తే ఇది కూడా 498ఎ-లాగా దురుపయోగం కానుంది. కాకపోతే ఇది ఒకరకంగా మగవాళ్లకే ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది. ఆడవాళ్ళూ, అల్ట్రామోడరన్ ఆడవాళ్ళ చేతిలో కూడా బ్రహ్మాస్తమ్రే. అదే సమయంలో ఇద్దరూ ఆందోళనకి గురయ్యే అవకాశాలు.. విపరీత ధోరణికి తావిచ్చే పరిస్థితులు.. ఇద్దరి అనుకూలతకి దోహదం చెయ్యాల్సిన విషయాలని సరైన చర్చ, అవగాహన లేకుండా చట్టాలు చేసి పడేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ. మన భారత విద్యా విధానంలో పదవ తరగతిలో జీవశాస్త్రంలో ఓ భాగంగా అవయవ నిర్మాణం గురించి చెబుతారు కానీ, ప్రకృతి కలిగించే సహజ భావాల గురించి కానీ వాటి ప్రాధాన్యత గురించి కానీ ఏ విషయాలూ చెప్పరు. మారుతూ, కట్టుదిట్టాలకు లోనైన సంస్కృతిలో సెక్స్ ఒక అపచారం.. దాని వాంఛ వెల్లడించడం అసాంఘికం.. అదో చీకటి కార్యం..
ఆదిమానవుల కాలంలో అదో సహజ చర్య.. ఎవరి ఇష్టం వాళ్ళది అనేలా ఉండే మనం.. కొంత ఇచ్ఛా భద్రత కోసం బైగామి, పోలిగామి, మోనోగామి ఇలా ఎవరి వారి ధర్మానుసారం ఏదో ఒకటి అడాప్ట్ చేసుకున్నాం. దాని ప్రకారమే జీవిస్తే హాయి- అని తీర్మానించుకున్నాం. మనం చేసుకున్న కట్టుదిట్టాలు మనల్ని కట్టలు తెంచుకొమ్మంటున్నాయా? ఇచ్ఛ ఒక సహజ చర్య. అది కలిగి, ఎదిగి వెల్లడించే పరిస్థితులు కల్పించలేము కాని ఆ కోరిక కచ్చితంగా తీరాలి అనే చట్టాలు చేయడం మాత్రం చేయగలం.. రెక్కలు ఉన్నాయనే స్పృహ కల్పించకుండా.. నువ్వు గాల్లో ఎగరకపోతే చంపేస్తా.. ఎగిరితీరాల్సిందే- అని లోకం కొత్తగా చూస్తున్న పక్షి పిల్లకి చెబుతున్నట్టుగా.. ఎగరటం ఎవరూ నేర్పరు. అది దాని సహజ లక్షణం. కానీ దానికా స్వేచ్ఛ ఉంది అని మాత్రం ఆరుబయట వదిలినపుడే తెలుస్తుంది.. ఇక్కడ గమనించాల్సింది.. అర్థవంతమైన స్వేచ్ఛ.. అయినా స్వేచ్ఛకి, విచ్చలవిడితనానికి చాలా తేడా ఉంది. ఆ తేడాను తెలుసుకోగలిగే సంస్కారం, జ్ఞానం మన టీనేజర్స్‌కి ఎంత కల్పిస్తున్నాం? మొన్న ప్రతిపాదించిన ఇంకో చట్టం 18 సంవత్సరాలలోపు ఆడ, మగ అంగీకారంతో అయినా సెక్స్ చేసినాసరే అది నేరమే అని. అంటే పెళ్లితో అన్నీ సవ్యం, పెళ్లికాకుంటే అన్నీ అనుచితమా? అంటే ఒక తాడు, ఒక తంతు మన కోరికలను చట్టబద్దీకరిస్తుందా? అసలు మనం ఎటువైపు పయనిస్తున్నాం? పురోగమిస్తున్నామా? తిరోగమిస్తున్నామా?

ఈ ప్రస్థానం ఎటు? : ఎం. దిలీప్‌కుమార్ - బిజినెస్‌మాన్
వివాహానికి శృంగారమే పరమావధా? శృంగారం లేనిపెళ్లి పెళ్లి కాదా? శృంగారం వద్దంటే పెళ్లి పనికిరాదా? ఆ అమ్మాయి, అబ్బాయిని శృంగారానికి తీర్చిదిద్దే బాధ్యత మన న్యాయ వ్యవస్థ తీసుకుంటుందా? మనసుల, మనుషుల మధ్య శృంగారంలో పాల్గొనే బంధం ఏర్పడకపోతే ఆ పెళ్లికి అర్థంలేదా? ఒక అమ్మాయి శృంగారానికి సమయం కావాలనుకుంటే పెళ్లి అర్థం లేనిది అవుతుందా? మన సమాజం- ప్రేమ, అనుబంధం, శృంగారాన్ని వివాహ బంధానికి పరిమితి చేయడం ఎంత అమానుషం. సరైన శృంగారానికి వధూవరులను తీర్చిదిద్దుతున్నామా? అలా కానప్పుడు శృంగారాన్ని తిరస్కరిస్తే వివాహబంధం ఎలా విచ్ఛిన్నమవుతుంది? అసలేమి జరుగుతున్నది? మన న్యాయస్థానాల ప్రస్థానం ఎటువైపు వెళుతుంది? సైన్సు దీనికి చెప్పే సమాధానం ఏంటి? ఈ లోకంలో పాండురాజులను భరిస్తున్న కుంతీదేవిలు ఎంతమంది? ఆ కుంతీలు కోర్టుకెక్కి విడాకులు తీసుకునే సామాజిక స్థైర్యం ఇచ్చేవరకూ- మగ మహారాజులు శృంగారం వద్దన్నందుకు పెళ్లి రద్దుచేసుకోనివ్వొద్దు.. ఐదు నెలలు ఒక స్ర్తి శృంగారానికి విముఖంగా ఉంటే.. ఆ వివాహం రద్దుచేసినట్లైతే.. ఎన్ని సంసారాలు సజావుగా సాగుతున్నవనేది ఆ న్యాయస్థానాల విజ్ఞతకే సవాలు వంటిది. ఈ సున్నితమైన భావాలకు సంబంధించిన విషయాన్ని న్యాయస్థానాలు నిర్ణయించే ముందు కాస్త దీని ప్రభావం బాలికలమీద ఎలా పడుతుందో బాధ్యతగా ఆలోచించాలి. శృంగారం అంటే సరియైన జ్ఞానం లేనప్పుడు, వివాహం అంటే భయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అబ్బాయి,అమ్మాయిలలో శృంగార భావాలు, వారి సుముఖత అడిగే మరోరకం సమాజం ఏర్పడుతుంది. ఏ అమ్మాయిని వారి తల్లిదండ్రులు అడగగల్గుతారు? మన సమాజంలో నీకు శృంగారంపై ఆసక్తి ఎంత? నువ్వు నీ భర్తతో శృంగారంలో పాల్గొంటావా అని? అసలు ఆ అమ్మయి ఐనా చెప్పగలుగుతుందా? ఏ న్యాయస్థానమైనా చెప్పగల్గుతుందా.. ఒక అమ్మాయి పెళ్లి తర్వాత ఎన్ని రోజులకు శృంగారానికి సుముఖంగా ఉంటుందో..?
తెగతెంపులు తప్పు కాదు : ఉమాభారతి - ఎన్‌ఆర్‌ఐ
శారీరక సంబంధాన్ని వద్దనుకోవడం నిజంగా క్రూరత్వమే. భార్యాభర్తలలో ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా సెక్స్‌కి అంగీకరించకపోవడం సమర్థించరానిది. దానివల్ల అవతలివాళ్లకు చాలా బాధను కలిగిస్తుంది. దంపతులు విడిపోవడానికి ఇది సరియైన కారణమే. ఇలాటి కారణం ఉన్నదని నిరూపణ అయితే ఆ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకోవడంలో తప్పులేదు. నేను కొన్ని జంటలను ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లను చూశాను. అందులో కొత్తగా పెళ్లైనవాళ్లు, పెళ్లయ చాలా ఏళ్లయ ఉన్నవారూ ఉన్నారు. పెళ్లయ చాలా ఏళ్లయ్యాక ఇటువంటి సమస్య వచ్చినపుడు వౌనంగా ఉండి, ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటారు. దీనివల్ల కుటుంబంలో కలతలు మొదలవుతాయి. ఇక కొత్తగా పెళ్లైనవాళ్లు మాత్రం కుటుంబం, సమాజం అనే భయాలు పెట్టుకోకుండా చాలా సులువుగా పరస్పర అంగీకారంతో విడిపోతారు. ఒకవేళ ఇది ‘ఫ్రిజిడిటి’ సమస్య ఐతే డాక్టర్లు, సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్‌తో తగ్గిపోతుంది. కాని కొత్తగా పెళ్లైనవాళ్లకు సహనం, అర్థం చేసుకునే ఓపిక ఉండకపోవచ్చు. దానివల్ల సమస్య ఇంకా పెద్దదవుతుంది తప్ప పరిష్కారం లభించదు.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008