Friday, October 30, 2009

నరుడా ఏమి నీ కోరిక??

నరుడా ఏమి నీ కోరిక, సాహసము శాయరా డింభకా అనగానే అందరికి గుర్తొచ్చేది అలనాటి ఆణిముత్యం పాతాళభైరవి. ఆ సినిమా చూసినవాళ్లు ఎంతమంది అలాటి విగ్రహం మనకూ దొరికితే ఎంత బావుండు అని అనుకోలేదు. నేను మాత్రం ఆ లైన్లో ఫస్ట్ గా ఉంటాను. ఎన్.టి.ఆర్.అమాయకమైన ప్రేమ, ఎస్.వి.ఆర్ నటన , మధురమైన పాటలు ఎవరు మాత్రం మరిచిపోగలరు. అదేంటో అప్పటి సినిమాలు పొల్లు పోకుండా ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ సినిమాలోని విశేషాలు ఈ వారాంతంలో ఒకసారి గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది అని చేసిన ప్రయత్నమే

పాతాళ భైరవి..B & G లో

అమ్మ నాదే!!!!అంబరాన పూసిన తారలు కోసి
మాలచేసి నీ జడలొ తురుముతానంటే
మురిసిపోయింది అమ్మ ముసిముసి నవ్వులతో

హరివిల్లుని పట్టి తెచ్చి నీకు ఊయలకట్టి ఊపుతానంటే
చిరునవ్వుతో నా తల్లీ అంటూ ముద్దులాడింది

సఖులతో చేరి ఆటలాడగా
బుజ్జగించి, ఊసులెన్నో చెప్పి బొజ్జ నింపింది

నిదురమ్మ రానని మొరాయిస్తుంటే
చందమామని చూపి లాలిపాడి జోకొట్టింది

సూరీడు తాపం చురుక్కుమంటూ బాధిస్తుంటే
తన కొంగునే గొడుగుగా కప్పి పొదుముకుంది

వానజల్లులో తడిసి, మెరుపు గర్జనలకు ఉలిక్కిపడితే
నేనున్నానురా అంటూ వెన్ను తట్టింది లాలనగా

ఆటలలో చిన్ని గాయమై కంటతడిపెడితే
తన గుండెల్లో దిగిన బాకులా విలవిలలాడింది

అమ్మ ఆప్యాయతను ఆలంబనగా చేసుకొని
అందరికంటే ఉన్నతంగా ఎదిగినప్పుడు
అక్కున చేర్చుకుంది అశ్రునయనాలతో...

మరచిపోగలమా? తీర్చుకోగలమా?
అమ్మను. ఆమె ప్రేమని.. నేర్పిన పాఠాలను
అందుకే అమ్మ నాదే...

Thursday, October 29, 2009

Happy Birthday Friend..

"ఎక్కడొ ఒకచోట యాధృచ్చికంగా మనకు తారసిల్లిన కొందరు,మన జీవితంలో ఒక గణనీయమైన మార్పు రావటానికి కారణభూతులైపోవటం విచిత్రమే!నివురుగప్పిన నిప్పులా మనలో దాగి ఉన్న ఒక విశెష గుణాన్ని వాళ్ళు మన చేత గుర్తింపచేస్తారు." అలాటి ఒక స్నేహరూపానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Wednesday, October 28, 2009

మరువం ఉషపై చేయి చేసుకున్నాను......

చల్లని,ఆహ్లాదకరమైన వాతావరణం. సాయంకాల సమయంలో తాజా ఫిల్టర్ కాఫీ పట్టుకుని కూర్చుంటే ఏం రాద్దామా? అని ఆలోచించాను. ఈ మధ్య ఒక వ్యక్తి పై నాకు భలే ఈర్ష్యగా ఉంది. నిజమండి. చాలా చాలా ఈర్ష్య అసూయగా ఉంది. అదేమో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక తప్పదని చేయి చేసుకోక తప్పలేదు. :))

కంగారు పడకండి.. నాకు ఈర్ష్యగా ఉంది ఉష మీద. అదే మరువం బ్లాగర్. ప్రతీ అనుభూతి, ఆలోచన ఇట్టే కవితలా రాసెస్తుంది. చిన్ని చిన్ని పదాలలో, వాక్యాలలో ఎంత భావాన్ని నిక్షిప్తం చేస్తుంది . రోజూ పప్పు,కూరలు, వేపుళ్ళు చేసినంత సులువుగా కవితలు రాసెస్తుంది అని కుళ్ళుకునేదాన్ని. కాని మరువపు తావి దానిని కట్టిన దారానికి అబ్బినట్టు ఉష స్నేహంతో కవితలను చదివి, అర్ధం చేసుకుని ఆస్వాదించే అవకాశం కలిగింది..

పుస్తకంలో నేను ఉషాపై చేయి చేసుకున్న విధంబిట్టిది..

Monday, October 26, 2009

మనుషుల్ని జడ్జ్ చెయ్యగలమా.. (కంప్యూటర్ ఎరా నవంబర్ 2009 ఎడిటోరియల్)

మనం ఒకలా ఉండాలనుకుంటాము.. కానీ ప్రపంచం మనల్ని మరోలా స్వీకరిస్తుంది. మనం ఉండాలనుకునే దానికీ, మనం చేసే పనులకీ, ప్రపంచం మనల్ని అంచనా వేసేదానికీ పొంతనే చిక్కదు. మన గుణగణాలను ఉన్నవి ఉన్నట్లు గ్రహించడం లేదని సమాజంపై అసహనానికి లోనవుతాం. ఆ గుణాలను మరింత ప్రొజెక్ట్‌ చెయ్యాలని ఆరాటపడతాం. అయినా జనాల్లో చలనం ఉండదు. ఒకసారి మనల్ని తమ మనసులో ఒకలా స్థిరపరుచుకున్న తర్వాత ఆ బలీయమైన అభిప్రాయాన్ని వారి మనసు నుండి పెకిలించడానికి బ్రహ్మ దిగిరావలసిందే. ''వారు మనపై కలిగించుకున్న అభిప్రాయాలే నిజమా, వారు అనుకున్నదే మన నిజమైన వ్యక్తిత్వమా?'' అని ప్రశ్నించుకుంటే ''అస్సలు వారెవరు.. మనల్ని జడ్జ్‌ చెయ్యడానికీ?'' అంటూ ఎదురు తిరుగుతుంది మనసు. వాస్తవానికి అదే కరెక్ట్‌!! ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక బలహీనతనో, బలాన్నో మనలో చూసి ''ఈ మనిషింతే'' అని ముద్ర గుద్దేసుకోవడం అవివేకమే కదా. సో మనల్ని తప్పుగా అంచనా వేయడం ఎదుటి వారి తప్పు అని తెలిసినా, అవతలి వారి కన్నా మనమేమిటో మనకే పర్‌ఫెక్ట్‌గా తెలుసునని ఓ క్షణం భరోసా వచ్చినా అంతలోనే జారిపోతాం. మనకు మనపై కన్నా సమాజం మీద గమనింపు ఎక్కువ. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకున్నా ఫర్వాలేదు గానీ ఎదుటి వారు మాత్రం మనల్ని తక్కువ చూడకూడదు. మరొకరికి ప్రదర్శింపబడని అస్థిత్వాన్నే మనం జీర్ణించుకోలేం. నిద్రలేవడం ఆలస్యం అప్పటివరకూ నిశ్చలంగా ఉన్న మనసు నిండా ఒకటొకటిగా ఆలోచనలు ముప్పిరిగొంటూ ప్రపంచ రంగస్థలంపై నటింపజె య్యడానికి మనసుని సన్నద్ధం చేస్తుంటాయి.అదేంటో ప్రతీ వ్యక్తికీ తాను తప్ప చుట్టూ ఉన్న ప్రపంచంలోని సమస్త మానవాళీ అసమర్థులే! అలాంటి సమాజంలో ప్రక్క వ్యక్తి చేత మెప్పుదలని పొందడం కోసం మనం పడే ఆరాటం, ప్రక్క వ్యక్తి మనల్ని ఉన్నతులుగా ఒప్పుకోలేక పైపైన ప్రదర్శించే నాటకీయ మెచ్చుకోళ్లు, అవి మనసులోతుల నుండి వచ్చిన ప్రశంసలు కావని తెలిసినా, 'వాడంతే ఒట్టి అసూయాపరుడు' అని మనల్ని మనం సముదాయించుకుని మరోచోట అహాన్ని సంతృప్తిపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు... ఛ ఎంత దుస్థితిలో కూరుకుపోయాం. ఓ చిన్న సంఘటన ఆధారంగా మనుషులు మనపై ఏర్పరుచుకున్న అభిప్రాయాలు జీవితాంతం వారి చేష్టల్లో కొట్టొచ్చినట్లు కన్పించినప్పుడల్లా 'అయ్యో నేను అలా కాదు.. ఇలా కదా! ఎందుకు వారు అలా అనుకుంటున్నారు' అని మనసు మూలుగుతుంది. అంత అవసరం ఏమొచ్చింది? మనకు మనం అర్థమవడానికే ఈ జీవితం సరిపోదు. అలాంటిది మనల్ని ఎదుటివారు అర్థం చేసుకున్నామనుకోవడమూ, ఓ ముద్ర తగిలించేయడమూ, దాన్ని మనం ఒప్పుకోలేక మూలగడమూ అవసరమా? అవతలి వ్యక్తికి మనల్ని చూసి ఏదో ఒక ముద్ర అది మంచిదో, చెడ్డదో త్వరగా వేసుకోకపోతే వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడానికి, వారి పాత్రలను పోషించడానికీ సమయం సరిపోవద్దూ! జీవితపు ఏ దశలో అయితే సామాజికగౌరవాలపై వ్యామోహం తగ్గుతుందో అప్పుడే ఈ నాటకానికీ, నటనలకూ తెరపడుతుంది.

మీ
నల్లమోతు శ్రీధర్

Saturday, October 24, 2009

మ" రోటీ " తిందాం....

ఆకలి భోరుమన్నప్పుడు...
మామూలు రోటీ బోరు అనిపించినప్పుడు....
మరోటి - మరేదయినా మంచి వెరైటీ...
తినాలనిపిస్తే..పరాఠాలు ట్రై చేయండి.
రోటీలలో రారాు పరాఠా...
రుచికిరుచి, ఒంటికింత పుష్టి..
ఒక్కసారి రుచి చూసారంటే...
మరోటీ... మరోటీ.. కావాలంటారు..

నా  స్నేహితురాలు , ప్రమదావనం సభ్యురాలు  శ్రీమతి జయారెడ్డిగారి వంటకాలు ఈనాటి సాక్షి ఫ్యామిలీ విభాగంలో ప్రచురించబడ్డాయి.తనకు బ్లాగు లేనందున ఇలా ఇస్తున్నాను. చపాతీలు, పూరీలు, పుల్కాలు.. చేసి బోర్ కొడితే ఇవి ప్రయత్నించండి. వెరైటీకి వెరైటి. ఆరోగ్యానికి ఆరోగ్యం.

Friday, October 23, 2009

వసుధైక కుటుంబం -జింతాత

అందరూ కలిసి ఉండాలని ఎవరికీ మాత్రము ఉండదు. ఒక ఇంటిలో కాని, వీధిలో కాని, జిల్లాలో కాని, రాష్ట్రంలోకాని, దేశంలో కాని, చివరకి ప్రపంచంలోని వారందరూ కలిసి మెలసి ఉండాలి . అందరూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని అందరూ కోరుకుంటారు.కాని ఇది సాధ్యమా. ఒక ఇంటిలో పుట్టి పెరిగిన అన్నదమ్ములే కలిసి ఉండే పరిస్థితి లేదు. ఈర్ష్యా అసూయ ద్వేషాలు మితిమీరిపోయాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. ఎక్కడ చూసినా ఎవరు ఎక్కువ , ఎవరు తక్కువ అని పోటీ. ఇలాంటి సమయంలో ప్రపంచంలోని ప్రముఖులంతా కలిసి సరదాగా గడిపితే ఎలా ఉంటుంది.

ఎలా ఉంది. ఇది చేసింది మన మలక్పేట్ రౌడీనే. ఈ మధ్యే ఈ వీడియో సంగతి తెలిసింది. సరే అని ఆయన్ని అడిగి మరీ ఎత్తేశాను. హాయిగా నవ్వుకోండి..


రెండు నెలలనుండి పండగలు .. ఏదో ఒక పనితో బిజీ బిజీగా గడిచిపోతుంది. కాస్త రిఫ్రెష్ అవుదామని ఈ వారమంతా సరదాగా గడిపేద్దామని డిసైడ్ ఐపోయా. అదేంటో మొదట్లో ఎక్కువ సరదా టపాలే రాసేదాన్ని. ఆ అల్లరి ఎక్కడకు పోయిందో ఏమో. మళ్ళీ ఆ పాత రోజులను గుర్తు తెచ్చుకోవడానికి అలనాటి టపాలను వైజాగ్ డైలీలో ప్రచురించాను. ఇక చివరిగా ఇవాళ ఈ వీడియో. ఇక ఆటలు ,సరదా ఎక్కువైంది కాని వచ్చే వారం నుండి బుద్ధిగా , సీరియస్సుగా రాసుకోవాలి. ఉంటా మరి.

మరో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలండోయ్..

మూడు,నాలుగు,ఐదేళ్లుగా (కరెక్టుగా తెలీదు) జెమిని టీవీలో వస్తున్న ఝాన్సి సీరియల్ ఇవాల్టికి శుభం కార్డు వేసారు. అంతకు ముందు వచ్చే పిన్నీ సీరియల్ ఎంత ఆసక్తిగా చూసేదాన్నో.మద్యాహ్నం వీలుకాకపోతే రాత్రి. ఇంకా ఆతృత ఎక్కువైతే భాష రాకున్న సన్ టీవీలో తమిళంలో చూసేదాన్ని. అబ్బో .. దానితర్వాత వచ్చిన ఈ సీరియల్ తల లేదు,తోక లేదు. ఎందుకు మొదలైందో.ఎందుకు పూర్తయిందో. ఎవరికీ ఎవరు ఏమవుతారో?? అస్సలు అర్ధంకాలేదు. ప్చ్.

Thursday, October 22, 2009

ఇంటా – వంటా – తంటా – పెంట

ఈ రోజు మార్కెట్లో కూరగాయల్లా టీవీ చానెళ్ళు పుట్టుకొచ్చాయి. అసలు ఇన్ని చానెళ్ళు చూసే తీరిక, ఓపిక ఎంత మందికుంటుందో ఏమో? చానెళ్ళు అన్నపుడు సీరియల్లు, సినిమాలు, రియాలిటీ షోలు.పాటల ప్రోగ్రాములు , వార్తలు ఇలా అన్నీ ఉండక తప్పదుగా. అలాగే ప్రతి చానెల్ లో తప్పనిసరిగా ప్రసారమవుతున్న ప్రోగ్రాం వంటల ప్రోగ్రాం. మధ్యాహ్నం నారీమణులు పనులన్నీ తీర్చుకుని సేదతీరే సమయంలో ఇవి ప్రసారమవుతాయి. ఒక్కోసారి దాదాపు ఐదారు చానెళ్ళలో ఒకే సారి వంటల ప్రోగ్రాములు వస్తాయి. ఏది చూడాలో తెలీదు. ఇక ఆ రిమోట్ అవస్థ చెప్పనలవి కాదు. దాని తిప్పలు ఆ దేవుడు కూడా తీర్చలేడు. అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రింద రెండు మూడు చానెళ్ళు మాత్రమె ఉన్నా టైంలో ఈ టపా కట్టడం జరిగింది. రోజూ వచ్చే ప్రోగ్రాములలో పాల్గొనే యాంకర్ల అవస్థలు ఎటువంటివో అని ఊహించి రాసిన ఒక చిలిపి టపా ఇది..

ఒకసారి ఇక్కడ లుక్కేయండి మరి..

Wednesday, October 21, 2009

నచ్చిన భోజనంబు.. చిన్ని ప్రయత్నం

పాటలంటే అందరికీ ఇష్టమే కదా. దేనికదే ప్రత్యేకం. ఈ మధ్య జనాలకు రీమిక్షులు ఎక్కువ అలరిస్తున్నాయి. కాని ఆ పాటలు మరీ ఘోరంగా ఉంటున్నాయి. మధురమైన పాత పాటలను రీమిక్షులని ఖూని చేసి పడేస్తున్నారు. అలా కాకుండా ఒక వీడియోకు మరో ఆడియో పెట్టి కాస్త అల్లరి చేస్తే ఎలా ఉంటుంది. అదే పని మన మలక్పేట్ రౌడీ చేస్తున్నారు. సరే పోయేదేముంది అని నేను ఒక ట్రయల్ వేద్దామనుకున్నా. అడిగిన వెంటనే సమయం కేటాయించి నాకు ఈ ఆడియో,వీడియో మిక్సింగ్ నేర్పించిన భరద్వాజ్ కి జై హింద్. ఇది చిన్నిప్రయత్నం. బావుంటే మరిన్ని.. హి హి హి....Monday, October 19, 2009

ప్రతి రాత్రి వసంత రాత్రిప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి


ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి


బ్రతుకంతా ప్రతి నిమిషం పాట లాగా సాగాలి


ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి.


నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి


నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి


లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి


లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి


మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి


మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి.


ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక


ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక


విరిజాజి తీగ సుంత జరిగింది మావి చెంత


విరిజాజి తీగ సుంత జరిగింది మావి చెంత


నను జూచి నిను జూచి వనమంతా వలచింది


నను జూచి ప్రియా ప్రియా వనమంతా వలచిందిసినిమాలో సందర్భం, పాత్రల స్థితిగతులూ,అప్పటి మనస్థితి, వారి బాష, వ్యావహార్యం అన్నీ తెలుసుకుని అందమైన పదాలలో ఇమిడ్చి పాటలా అందిస్తే ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతాము. ఇలాంటి పాటలు సినిమాలో చూస్తున్నపుడు , విడిగా విన్తున్నప్పుడూ ఒకేవిధమైన అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాము అనడంలో సంశయం లేదు. అలాటి ఒక పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు "ఏకవీర" సినిమాలో లలితమైన శైలితో అందరం మాట్లాడుకునే మాటలతోనే మనకందించిన అద్భుతమైన పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి".


అలనాటి రాజకుమారులు అరివీర భయంకరులే కాదు సంగీత, సాహిత్యాభిమానులు కూడా. సకల విద్యలను అభ్యసించేవారేమో అనిపిస్తుంది ఈ పాట వింటే. కాంతారావు, ఎన్టీఆర్ స్నేహితులు.చాల రోజుల తర్వాత కలిసారు. కుశలప్రశ్నలు, భోజనాలు అయ్యాక అలా చల్లని వాతావరణంలో అలా తమ ప్రేమముచ్చట్లు చెప్పుకున్నారు.ఇంకేముంది. లోకమంతా అందంగా, మనోహరంగా ఉంటుంది. చెలిని తల్చుకుని ఎన్నెన్ని మధురమైన ఊహలో ఇద్దరికీ..

ప్రతి రాత్రి ఒక వసంతరాత్రి కావాలంట. అమ్మో ఎంత ఆశో!! కదా.. ఒక ప్రియుడు తన చెలితో కూడిన వేళ ప్రకృతి, జీవితం ఎలా ఉండాలో అని అందమైన ఆలోచనలు చేస్తున్నాడు. ఈ ఆనంద సమయంలో ప్రతి రాత్రి ఒక వసంత రాత్రిగా, ప్రతీ గాలి పైరగాలిలా తాకి తమ బ్రతుకంతా ఒక పాటలా సాగిపోవాలి. నాలోని పాటతో నీ కాలి అందెలు ఘల్లుమనాలి, నీ మనసులో పూలన్నీ మల్లె పొదలా (ఎన్నిపూవులు కావాలో) విరియాలి. అబ్బా!! ఎంత సువాసన!! అలాగే ప్రతీ నిమిషం మధుమాసమై వెల్లివిరియాలి సుమా... ( ఈ ఊహ కూడా ఎంత అందమైనది .నిజంగా అలా ఉంటే ఎంత బాగుండునో? )


ప్రేమలో పడినవాళ్ళకి ప్రతీది అందంగా కనిపిస్తుంది. కవిత్వం జాలువారుతుంది. చుట్టూ ఉన్నా ప్రకృతిలో కూడా ప్రేమ,ఆనందం కనిపిస్తుంది వాళ్లకు. అందుకే చూడండి... నింగిలో చందమామ కూడా వయ్యారి తారవంక వంగినట్టుగా కనిపిస్తుందంట. మరోవైపు మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ విరజాజి మావి వైపు జరిగిందంట. నిన్ను నను చూచి ఈ వనమంతా ప్రేమలో పడింది అని ఎంత ధీమాగా చెప్తున్నాడు ప్రియుడు.


విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఏకవీర నవలను సుమారు నలభై ఏళ్ల క్రింద సినిమాగా రూపొందించారు సి.ఎస్.రావుగారు. కే.వి.మహాదేవన్ సంగీతంలో అలనాటి మేటి నటులు ఎన్.టి.ఆర్, కాంతారావుల మీద చిత్రీకరించబడిన ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే. గాన గంధర్వులైన గురుశిష్యులు ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడిన పాట ఇది. పాట చూడకున్నా, వింటున్నా సరే చల్లటి సాయంత్రంలో పూలతోటలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. స్వరమాదుర్యం, సంగీతం అలా వీనులవిందుగా ఉంటుంది.

Sunday, October 18, 2009

షార్ట్ కట్ లో పండుగలు

వరుసగా వస్తున్నపండగలు. వినాయకచవితి, దసరా. ఇక నిన్నే దీపావళి జరుపుకున్నాము. మరి ఈ షార్ట్ కట్ లో పండగలు ఏంటి అనుకుంటున్నారా?? అదేనండి కలికాలం. మాయాజాలం. ఆధునిక జీవనంలో మారుతున్న తీరు ఇలా ఉంది మరి. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఐతే ఓ లుక్కేసుకోని వచ్చేయండి మరి..

షార్ట్ కట్ లో పండుగలు

Monday, October 12, 2009

అమర గాయకుడికి అద్భుత గుర్తింపు


ప్రియురాలా సిగ్గేలనే..
నన్ను దోచుకుందువటే
ముద్ద బంతి పూవులో
అలిగితివా సఖి ప్రియ
అందమే ఆనందం..


ఇవన్నీ చూస్తుంటే మీకు ఎం గుర్తొస్తుంది?? ఖచ్చితంగా ఘంటసాలగారే కదా. భౌతికంగా ఆయన మనమధ్య లేకున్నా ఆయన గాంధర్వ గానం ఎప్పటికి తెలుగువారి గుండెల్లో నిలిచిపోతుందన్నది అక్షర సత్యం. ఆ మహా గాయకుడికి ప్రపంచంలోని అద్భుత స్వరాలలో ఒకటిగా చేద్దామా??

ఐతే కదలిరండి.. ఇక్కడ మీ నామినేషన్ వేయండి. ఘంటసాల గారికి అద్భుత నివాళి, గుర్తింపు నిద్దాం.. మీ నామినేషన్తో పాటు ఒక పాట లింక్ ఇవ్వండి. ఈ నామినేషన్ Oct. 5 నుండి Oct. 16,,


ఘంటసాల గారి అద్భుతమైన పాటలు ఇక్కడ లభ్యం..

ghantasala.info

oldtelugusongs.com

chimatamusic.com

త్వరపడండి...

Sunday, October 11, 2009

సాక్షిలో షడ్రుచులు


ఈ రోజు సాక్షి ఫండే రుచి లో నా వంటలు ప్రచురించబడ్డాయి. అన్ని టమాట స్పెషల్స్. ఓ సారి లుక్కేసుకోండి.

వీటి ఒరిజినల్ వివరాలు ఇక్కడ చూడొచ్చు.

టమాటా పులావ్

టమాట చట్నీ

టమాట కోడిగుడ్డు కూర

టమాట సూపు

Saturday, October 10, 2009

ఆటలు -పాటలు

ఆడేవి ఆటలు పాడేవి పాటలు కాని ఆటపాటలేంటి?? ఆటలు శారీరక వ్యాయాయం ఐతే పాటలు మానసిక వ్యాయాయం. వీటివల్ల మనసు, శరీరం రెండూ సేదతీరుతాయి, ఉత్తేజితమౌతాయి అని అందరికి తెలుసు .కాని ఈనాడు పిల్లలకు చదువు తప్ప ఆటపాటలంటే ఆసక్తి లేదు, సమయం కూడా దొరకడం లేదు.వాళ్లకు తెలిసిన ఆటలు టీవీలో వచ్చే క్రికెట్, లేదా వీడియో ,కంప్యూటర్ గేమ్స్. వాటివల్ల ఇంట్లోనే కదలకుండా ఆటలు ఆడుతున్నారు. అవి ఏమన్నా వాళ్లకు ఉపయోగకరమా అంటే అదీ లేదు.

కాని ఆనాటి అంటే నా చిన్నప్పటి బాల్యం ఎంత అందమైనది. ఎన్నెన్ని ఆటలు. వాటితో పాటు పాటలు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని ఒక సినీకవి అన్నట్టు పాటలు పాడుతూ ఆటలాడితే అలుపెమున్నది కదా.. ఈ ఆటలు ఆడాలంటే ప్రత్యేకమైన స్థలం అంటూ అవసరం లేదు. ప్రఎకమైన పరికరాలు లేవు. ఇంటి పెరట్లో ,డాబా మీద, పార్కులలో, స్కూలు గ్రౌండులో. ఎక్కడైనా కాసింత స్థలం దొరికితే చాలుఆటలు మొదలెట్టడమే. అపుడప్పుడు క్లాసులో టీచర్ రాకుంటే కూడా ఆటలే. స్కూలు పాఠాలతో అలసిన వేళ ఈ ఆటలు ఉల్లాసాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు.వేసవి వచ్చిందంటే చాలు పిల్లలు ఒకదగ్గర చేరి ఆటలే ఆటలు. చుట్టుపక్కల ఎవరైనా ఇల్లు కడుతున్నారంటే వాళ్లకు తెలీకుండా, చూడకుండా కొంచం ఇసుక ఎత్తుకోచ్చేసి కుప్పలా పోసి అందులో అగ్గిపుల్ల పెట్టి వెతుక్కోవడం. పిల్లలందరూ గుండ్రంగా కూర్చుని ఒకరి పిడికిలిపై మరొకరి పిడికిలి కొండలా పెట్టి గుడు గుడు గుంచం గుండె రాగం అంటూ పాడడం గుర్తుందా..

ఇక అమ్మాయిలందరికీ ఇష్తమైన ఆట..పాట.. ఒప్పులకుప్ప ఒయ్యారి భామా.. అంటూ చేతులు పట్టుకుని గిర్రున బొమ్మల్లా తిరుగుతూ ఎన్నో విన్యాసాలు చేసె అమ్మాయిల ఆనందం అలవికానిది. ఆడే వాళ్ళకంటే చూసేవాళ్ళకు భయమేస్తుంది.పడిపోతారేమో అని.
అమ్మాయిలకే పరిమితమైన మరో ఆట చెమ్మచెక్క చారెడేసి మొగ్గ ,, అట్లు పోయంగా ఆరగించంగా ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మచెక్క రంగులేయంగా ... ఇలా లయబద్ధంగా సాగిపోతుంది. పాటతో పాటు పిల్లల చేతులు కూడా కదులుతాయి.

వాన చినుకులు పడుతున్నాయి. పిల్లలకు ఉషారు వచ్చింది. ఇంట్లో కాళ్ళు నిలవనంటున్నాయి. అమ్మ చూడకుండా బయటకు పరిగెత్తి , చేతులు బార్లా చాచి ఆకాశాన్ని చూస్తూ చినుకులలో తడుస్తూ పాడే వానా వానా వల్లప్పా ,, వాకిలి తిరుగు చెల్లప్పా అని హాయిగా పాడుకునే బంగారు రోజులు కదా.

ఒకరి వెనకాల ఒకరు చేరి షర్టు,గౌను అంచుపట్టుకుని మొదట్లో ఉన్నవారు కూత పెడుతూ పాడే చుక్ చుక్ రైలు వస్తుంది, పక్కకు పక్కకు జరగండి ... ఇక చెట్టు లేదా దిమ్మె కనిపిస్తే చాలు చీర లేదా దుప్పటి తీసి ఉయ్యాల కట్టేయడమే. ఇష్టమొచ్చినా పాటలు పాడుకుంటూ సమయమనేది తెలీకుండా ఊగుతుంటే మనసు అలా అలా తేలిపోయేది. అయినా అప్పట్లో ఈ టీవీలు , వీడియోలు ఎక్కడివి. అమ్మమ్మ,నానమ్మ చెప్పే పాటల పాఠాలు ఎన్నో .. మామా,మామా ,,మామిడి పండు, తారంగంతారంగం... చిట్టి చిట్టి మిరియాలు ,, బుర్రు పిట్ట బుర్రు పిట్ట,, చందమామ రావే,, చిట్టి చిలకమ్మా అమ్మా కొట్టిందా...


మీకు గుర్తుందా.. స్కూలులో ఇంటర్వెల్ లో దొరికే కొద్దిసమయం, లంచ్ టైంలో తొందరగా తినేసి ఆటలాడుకోవడం. బెల కొత్తగానే క్లాసులోకి పరిగెట్టడం.. చిన్నప్పుడు నేను ఆడిన ఆటలు, పాటలు ,అందమైన అనుభూతులు ఇప్పటికీ మరిచిపోలేనివి. ఈ కంప్యూటర్, వీడియో గేమ్స్ కూడా వాటిని తలదన్నేవి లేవు . మీరేమంటారు??

Tuesday, October 6, 2009

మత్స్యకన్య

మరువం ఉష ప్రారంభించిన జలపుష్పాభిషేకానికి నావంతుగా ఓ తుమ్మిపువ్వు సమర్పిస్తున్నాను. చలాకీ చేపపిల్ల , అమాయకపు ఆడపిల్ల ఒకటే అనే నా భావవ్యక్తీకరణ ఇది..

అదిగదిగో చేపపిల్ల
తుళ్లి తుళ్లి తిరిగేను
ఇదిగిదిగో ఈ చిట్టితల్లి
కేరింతలతో పరుగులెత్తేను

విశాలమైన సాగరానికి భయపడి
అమ్మ వెనకాలే భయంభయంగా
ఈదులాడేను చేప పిల్ల
చుట్టూ ఉన్న వారిని చూసి
భీతిల్లి, తప్పిపొతానేమొ అని
అమ్మ కొంగట్టుకు తిరిగెను చిట్టితల్లి

ఎన్ని రంగులొ, ఎన్ని అందాలో
ఎంతమంది బంధుమిత్రులో
అని కళ్లు విప్పార్చి పలకరించే చేప పిల్ల
ఎన్ని వర్ణాలో, ఎన్నెన్ని అందాలో ప్రకృతిలో
మనసంతా ఆనందాన్ని పదిలపరుచుకునే చిట్టితల్లి

అందరూ మనవారు కాదని అమ్మ
చెప్పెను జాగ్రత్తలు చేపపిల్లకు
అందరినీ నమ్మకు బుజ్జీ అని అమ్మ
హెచ్చరించెను చిట్టి తల్లికి

తనవారే తనకు శత్రువులా
అని మాటవినక సాగిపోయె చేపపిల్ల
అందరూ మనసున్న మారాజులే
అని నమ్మి మోసపోయే చిట్టితల్లి

అన్నా అని చేరబోయి
సొరచేప నోటచిక్కె చేపపిల్ల
తాళి కట్టించుకుని
కట్నదాహానికి బూడిదాయె చిట్టితల్లి.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008