Tuesday, March 30, 2010

ఆముక్తమాల్యద ... అలంకారాలతో ఆరంభం


మనం చూసిన ఏ సంఘటన ఐనా, సన్నివేశం ఐనా అది ఇతరులతో పంచుకోవాలి అంటే దాన్ని సవివరంగా చెప్పాలి. ఆ దృశ్యాన్ని చూసి మనం పొందిన అనుభూతి ఆ వర్ణన విన్నవాళ్లు కూడా పొందాలి. అంటే మన మాట కాని, రచన కాని, పాట కాని, పద్యం కానీ ఒక చిత్రాన్ని విన్నవారి కళ్లముందు సాక్షాత్కరింప చేసినప్పుడే ఆ రచనలోని అసలు సారం అవతలివారికి అందుతుంది. మామూలుగా చెప్తే అనుకున్న ఫలితం దక్కదేమో అందుకే రచనలకు కొన్ని అలంకారాలు చేయాలి మరి.. ఇదే విధంగా పద్యాలకు వివిధ అలంకారాలతో మరిన్ని సొబగులద్ది అందించిన అద్భుతమైన కావ్యకన్నియ "ఆముక్త మాల్యద"

రాయలవారి పద్యాలలో ప్రస్ఫుటంగా కనిపించేవి ఉత్ప్రేక్షలు. (ఉత్ప్రేక్ష అంటే ఊహ. ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చడం ) రాయలు తన ప్రబంధంలో మొట్టమొదటి పద్యం శ్రీవేంకటేశ్వర స్వామి మీద చెప్పాడు. ఆంధ్రుల ఇలవేల్పైన వేంకటేశ్వరుని స్తుతితో మొదలుపెట్టబడిన మొట్టమొదటి తెలుగు కావ్యం.. ఆముక్తమాల్యద..

శ్రీ కమనీయ హారమణిఁ జెన్నుగఁ దానును, గౌస్తుభంబునం
దాకమలావధూటియు ను దారతఁ దోఁపఁ, బరస్పరాత్మలం
దాకలితంబు లైన తమ యాకృతు లచ్చతఁ బైకిఁ దోఁప, న
స్తోకత నందుఁ దోఁచె నన, శోభిలు వేంకటభర్తఁ గొల్చెదన్ ...


భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి ఉన్న అత్యంత ప్రేమను, అనురాగాన్ని ఈ పద్యంలో చాలా అందంగా చెప్పారు రాయలవారు. లక్ష్మీదేవి ధరించిన అందమైన హారములోని మణియందు శ్రీనివాసుడు, ఆతని కౌస్తుభమునందు లక్ష్మీదేవి చక్కగా ప్రతిబింభిస్తున్నారు. ఒకరి మనస్సులో ఒకరు నిండి యున్న కారణంగా వాళ్ళ మనసుల స్వచ్ఛత వలన (అవి transparent అయి) ఆ లోపలున్న రూపాలు వారు ధరించిన హారములలోని మణులలో స్పష్టంగా బయటకి కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి అని భావం. ఈ విధముగా విలసిల్లుతున్న వేకటేశ్వరుని సేవిస్తాను అని ఉత్పలమాల(కలువపూలమాల) తో ఆముక్తమాల్యద (ధరించిన పూలమాలను సమర్పించినది) కావ్యాన్ని మొదలుపెట్టాడు కృష్ణదేవరాయలు. పైగా తిరుమల వేంకటేశ్వరుడు రాయవారి ఇష్టదైవం.. ఈ ప్రబంధాన్ని కూడా ఆ శ్రీనివాసుడికే అంకితం చేసాడు.
సీ. ఖ నట త్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు,
ధృత కులాయార్ధ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమ త్తరువరములు.
ఘన గుహా ఘటిత ఝూంకరణ లోకైక ద్వి దుందుభీకృత మేరు మందరములు
చటుల ఝుంపా తర స్స్వ నగరీ విపరీత పాతితాశాకోణ పరిబృఢములు,

తే. ప్రబల తర బాడబీక్రుతేరమ్మదములు,
భాస్వరేరమ్మదీకృత బాడబములు
పతగ సమ్రాత్పతత్త్ర ప్రభంజనములు
వృజిన తూలౌఘములఁ దూల విసరుఁ గాత.ఆరంభం చేసాము కదా... ఆముక్తమాల్యద పీఠికలోని గరుత్మంతున్ని స్తుతించే పద్యం గురించి తెలుసుకుందాం. ఇది నారీకేళ పాకం లాంటిది, ఒక్కోసారి మరీ అతిశయం అనిపించవచ్చు. ముందుగా పద్యం చదువుతుంటే కఠినంగా , అర్ధం కాకుండా ఉంటాయి .. కాని లోతుగా అర్ధం తెలుసుకుంటూ వెళితే ఒక్కో పాదంలో ఉన్న వివిధ అలంకారాలు , వర్ణనలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి నారికేళపాకంలాంటిదే ఈ పద్యం.. గరుత్మంతుని రెక్కలయొక్క గాలివలన కలిగిన మార్పులు గురించి చెప్తున్నాడు కవి.. అసలు పద్యంలో మటుకు గరుత్మంతుడి రెక్కల గాలులు పాపాలనే దూదిపింజలను చెదరగొట్టుగాక అని స్తుతించబడింది.


ఖ నటత్ పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు

గరుత్మంతుడి రెక్కల గాలుల వల్ల సముద్రంలోని నీళ్లన్నీ ఆకాశానికి ఎగిసిపోయి పాతాళలోకం బట్టబయలై కనపడింది. అంత వేగంగా ఉన్నాయంట మరి. అప్పుడు పాతాళంలోనున్న పాములు తమ ఆజన్మశత్రువైన గరుత్మంతుని చూసి భయంతో గజగజ వణకుతూ ఒకదానికొకటి పట్టుకుని ముద్దలుగా కనిపిస్తున్నాయి.ధృత కులాయార్ధ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్ తరువరములు
గరుత్మంతుడి రెక్కలగాలి ఎంత వేగంగా తీవ్రంగా ఉందంటే పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటివేళ్లతో సహా లేచిపోయి ఆతని కాళ్లకు తట్టుకున్నాయి. ఆతడు పక్షియగుట చేత.. తన గూటి కోసం కట్టెపుల్లలను తన కాలిగోళ్లతో తీసికెల్తున్నట్టుగా తోస్తున్నది.ఘన గుహా ఘటిత ఝూంకరణ లోకైక ద్వి దుందుభీకృత మేరు మందరములు
ఆతని రెక్కల గాలులు పర్వతగుహలలో ప్రవేశించినప్పుడు ఎలా ఉంది అంటే .. మేరుపర్వతం, మంధరపర్వతం .. రెండూ ఏకమై భేరీ, దుందుభులుగా శబ్దం చేస్తున్నట్టుగా లోకాలన్నీ దద్దరిల్లుతున్నాయి ...
చటుల ఝుంపా తర స్స్వనగరీ విపరీత పాతితాశాకోణ పరిబృఢములు
గరుడుని రెక్కల గాలులు మిక్కిలి తీవ్రంగా ఉండుటచేత దిక్కులు,మూలలయందు ఉన్న పాలకులు (అష్టదిక్పాలకులు) నిలబడలేక వేఱు వేఱు దిక్కులకు విసిరివేయబడ్డారు.ప్రబల తర బాడబీక్రుతేరమ్మదములు
భాస్వరేరమ్మదీకృత బాడబములు
పతగ సమ్రాట్పతత్త్ర ప్రభంజనములు
వృజిన తూలౌఘముల దూల విసరుగాత.


గరుత్మంతుడి రెక్కలగాలి వేగానికి ఆకాశంలోని మేఘములతోడి మెరుపులు సముద్రంలో పడి బడబాగ్నులు సృష్టిస్తున్నాయి. ఆ గాలి ఉధృతానికి బడబాగ్నులు మింటికెగసి మెరుపులుగా మారాయి. అట్టి ప్రచండమైన పక్షిరాజు రెక్కల గాలి పాపములనెడి దూదిపింజెల్లాటి మేఘములను చెదిరిపోయేలా చేయాలి అని గ్రంధకర్త ప్రార్ధన చేస్తున్నాడు.


గరికపాటివారి ఆముక్తమాల్యద వివరణ చదివి ఈ కావ్యమందు ఆసక్తి కలిగి వావిళ్ల రామశాస్త్రివారి పుస్తకం చదవడం మొదలుపెట్టాను. దానితో పాటు స్కూలులో చదివిన చందస్సుకూడ మళ్లీ తిరగేయక తప్పలేదు. తప్పులున్న మన్నించి సరిచేయగలరు. ముందు ముందు మరింత వివరంగా రాయడానికి ప్రయత్నిస్తాను.

Friday, March 26, 2010

చిన్న మాటబ్లాగులు అనేది మన స్వంత అభిప్రాయాలను రాసుకుని పంచుకునే అద్భుతమైన వేదిక. ఇది మన తెలుగు బ్లాగర్లందరికీ స్వానుభావమే.. మూడేళ్ళ క్రింద మొదలైన నా బ్లాగు ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులు, విజయాలు దాటుకుంటూ వచ్చింది. . ఇప్పటి ఈ గౌరవం, గుర్తింపు అంత సులువుగా రాలేదు అని నా మిత్రులందరికీ తెలుసు..మరో గుర్తింపు లభించిన సందర్భంగా నాకు ప్రత్యక్షంగా , పరోక్షంగా సహాయపడిన వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.


ఈ సందర్భంగా ఒక చిన్ని మాట. ఇది నా అనుభవం మీద తెలుసుకున్న విషయం. మనకు ఉన్న జీవితం చాలా స్వల్పం. రేపటి సూర్యోదయం చూస్తామో లేదో కూడా తెలీదు. మరి గాలిబుడగలాంటి ఈ చిన్ని జీవితంలో ఈర్ష్యా, అసూయ , ద్వేషాలు ఎందుకు??. ఏ బ్లాగర్ అయినా పేరు తెచ్చుకునేది అతని రాతలవల్లనే తప్ప అతని డబ్బు, స్టేటస్, రికమెండేషన్ కాదు. ఎవరి రాతలవల్లో, మాటలవల్లో మరొకరు మారరు. ఈ బ్లాగులలో ఎవరి రాతలు వారివి, నచ్చినవి చదవండి, ఇష్టముంటే కామెంటండి లేకుంటే లేదు. ద్వేషం వద్దు. అందరూ సరదాగా, నవ్వుకుంటూ , చర్చించుకుంటూ తెలియని విషయాలు , తెలిసిన విషయాలు తెలుసుకుందాం, పంచుకుందాం.

వీవెన్ అన్నట్టు తెలుగు బ్లాగులు ఒక శక్తివంతమైన మాధ్యమంగా మారుతున్నాయి. ఎందరో ప్రముఖులు, జర్నలిస్టులు బ్లాగులు రాస్తున్నారు. కొద్ది బ్లాగులు, బ్లాగు రాతలకే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు రాజకీయ నాయకులు, వారి అనుచరులు బ్లాగులలోకి వస్తే అప్పటి పరిస్థితి ఏంటి్? రాసేవాళ్ళ, చదివేవాళ్ళ గతి ఏంటి? ఎన్నెన్ని గొడవలు? ఎవరికైనా ఈ ఆలోచన వచ్చిందా.. ఇప్పటికైతే ఒకరికొకరు ప్రత్యక్షంగా కలవకున్నా బ్లాగుల ద్వారా మిత్రులయ్యారు. తర్వాత ఎలా ఉంటుందో? వేలల్లో వచ్చే బ్లాగులకు, హారం, జల్లెడ, కూడలి సరిపోతుందా? మనకు చదవదగ్గ బ్లాగులు eలా వెతుక్కునేది. పరిష్కారం ఏంటి ??? .

నాకు తోచిన పరిష్కారం ........ కూడలిని వీవెన్ నిరంకుశంగా నిర్వహణ చేయాలి. ఇష్టం లేనివారు తమకంటూ ప్రత్యేక అగ్రి గేటర్ మొదలుపెట్టుకోవచ్చు .. లేదా ఎవరికీ వారే తమ స్వంత కూడలి తయారు చేసుకుంటే సరి. గూగుల్ రీడర్ ద్వారా.. ఏమంటారు ???..

Tuesday, March 23, 2010

రాముడికి సీత ఏమౌతుంది??రాముడికి సీత ఏమవుతుంది??

అందరికీ తెలిసిన వాడుక మాట ఇది. ఎవరికైనా విషయమంతా చెప్పిన తర్వాత కూడా ఏదో సందేహం వస్తే రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు ఉంది అని వేళాకోళం చేస్తారు. నిజానికి ఈ ప్రశ్న చాలా అర్ధవంతమైనది. అసలు సీతారాములలో ఎవరు గొప్ప అనేకంటే వారి మధ్య ఉన్న బంధం ఎటువంటిది అని తెలుసుకోవడం మంచిది.
రాముడికి సీత ఏమవుతుందో అనుకుంటూ వివరాలు చూద్దాం..

రావణాసురుడిని ఎలా సంహరించాలి అని శ్రీహరి మధనపడుతున్నవేళ ఆ హృదయం మీద నిరంతరం కొలువై ఉన్న లక్ష్మీదేవి (అలా ఎప్పటికి కూర్చుని ఉండడం వల్ల శ్రీవారి హృదయానికి ఓ మచ్చ ఏర్పడింది దాన్నే శ్రీవత్సం అంటారు.) శ్రీహరికి ధైర్యం చెప్తూ తాను భూలోకాన అవతరిస్తాను అని చెప్పి మరుక్షణంలో వేదవతి రూపంలో భూలోకాన అవతరించింది. దీన్ని బట్టి చూస్తే సీత రాముడికి మార్గదర్శకురాలు అయ్యింది.

దశరధుడు చేసిన పుత్రకామేష్టీ అశ్వమేధ యాగాల కారణంగా వచ్చిన పాయసం ద్వారా రాముడు కౌసల్య గర్భాన పదకొండు నెలల తర్వాత యోనిజుడై పుట్టాడు. సీతమ్మ మాత్రం అయోనిజయై జన్మించి జనకుడికి నాగటి చాలులో లభిస్తుంది. దీని బట్టి చూస్తే సీత రాముడికంటే అధికస్థాయిలో పుట్టినదౌతుంది.
అధిక బలశాలిని
తన ఆరవ ఏట ఒకనాడు చెలులతో బంతి ఆట ఆడుతున్న సీత ఎడమచేతితో మహిమాన్వితమైన శివధనుస్సు ఉన్న పెద్ద భోషాణాన్ని అలవోకగా పక్కకు జరిపేస్తుంది. రాముడు తన పదమూడవ ఏట స్వయంవర సభలో అదే వింటిని ధనుర్భంగం చేశాడు. దీన్ని బట్టి రాముడు తన పదమూడవ ఏట చేయగల పనిని ఆరవఏటనే సీతమ్మ చేయగలిగిన బలశాలి అని తెలుస్తోంది.
లోకంలో ఎక్కడైనా పరీక్షించేవాడు గొప్పవాడూ, పరీక్షకి సిద్ధమైన అభ్యర్ధి తక్కువవాడూ అవుతాడు. సీతమ్మ రామునికి శివధనుస్సుని పరీక్షగా పెట్టింది. అడిగిన దానికంటే ఎక్కువ సమాధానమిస్తూ (ఎక్కు పెట్టమంటే ఏకంగా విల్లునే విరిచేసాడు) రాముడు ఎక్కువ అంకాలతో ఉత్తీర్ణుడయ్యాడు. అంటే రాముడిని పరీక్షించగల శక్తి సీతమ్మకు ఉంది అని అర్ధమవుతుంది.

తల్లి కోరిక మేరకు పట్టాభిషేకాన్ని రద్దు చేసుకుని అరణ్యవాసానికి పయనమైన రాముడు "అరణ్యాల్లో పులులూ , సింహాలూ, కొండచిలువలూ , కల్లోల వాతావరణముంటుంది కాని ఏ సౌఖ్యాలూ ఉండవు" కావున సీతమ్మను తనతో రావొద్దని అంటాడు. కాని సీత తాను సౌఖ్యాలకోసం కాదు అరణ్యాలను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను, అందునా భర్త తోడుండగా భయమేల అని రాముడికే ధైర్యం చెప్పి వెంట నడుస్తుంది.

వయసుకి మించిన విజ్ఞత

సామాజిక దృష్టితో , దూర దృష్టితో రామునికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటంతటి ఉత్తమురాలు సీతమ్మ. చిన్న వయసులోనే (వనవాసానికి వెళ్లేటప్పుడు సీత వయసు 18 ఏళ్లు) పెద్దరికం తెచ్చుకుంది. రాముడికీ తోడూ నీడా అయింది. అరణ్యమునకు వెడుతూ సీతారాములు అనసూయాదేవిని దర్శించారు. ఇద్దరినీ ఆశీర్వదించిన అనసూయ సీతతో " అమ్మాయి నీ పెళ్లి కథని వివరించు" అని అడిగింది. సీతమ్మ తమని అరణ్యాలకు పంపి కష్టాల పాలు చేసిన కైకను, దశరధుని, రాముడిని. ఎవరినీ నిందించకుండా ఓపికగా పెళ్లి వివరాలు చెప్పింది. దానికి మురిసిపోయిన అనసూయ సీతకు వాడని పుష్పాలు, నలగని వస్త్రాలని ఇచ్చి ఆశీర్వదించింది.


రాముడికంటే ముందు తాను భూలోకానికి వేదవతిగా రావణాసురుడిని చంపించడానికే పుడతానని చెప్పింది. అలాగే రాముడికంటే ముందే లంకా నగారానికి వెళ్లింది. అదే విధంగా తానే ముందు వైకుంఠానికి వెళ్లింది సీతమ్మ. ఎక్కడెక్కడికి సీతమ్మ తనకంటే ముందు వెళ్లిందో (భూలోకానికి, మిథిలకి, లంకా నగారానికి, వాల్మీకి ఆశ్రమానికి, వైకుంఠానికి) రాముడు అక్కడక్కడికీ వెళ్లాడు. రాముని ప్రయాణం విజయవంతం కావాలని తాను ముందుగా వెళ్లి తన నాధుడికి అనుకూల పరిస్థితులను కల్పించిన సీతమ్మ రాముడికే మార్గదర్శకురాలైంది.

అరణ్యవాసంలో ఉన్న తనని రావణుడు ఎక్కడ అపహరించడో అని తల్లడిల్లిపోయింది సీతమ్మ. రావణుడు తనని అపహరించని పక్షంలో రావణుడిని వధంచడానికి రాముడికి తగిన కారణం దొరకని పక్షంలో రామావతార ప్రయోజనమే దెబ్బతింటుందని భావించిన సీత తన ప్రాణాన్ని, వంశప్రతిష్టతని పణంగా పెట్టి భర్తకోసమే రావణుడు తనని అపహరించేలా చేసుకుంది సీతమ్మ తల్లి. సీతాపహరణ సమయంలొ రావణుడితో జరిగిన పోరులో రెక్కలు విరిగి , చావు బ్రతుకుల్లో ఉన్న జటాయువును దుఖంతో కౌగలించుకుంటుంది. . భూమినుండి ఉద్భవించినందున సకల ఓషధులకు సమానురాలైన సీతమ్మ స్పర్శ కారణంగానే జటాయువు రాముడు వచ్చేవరకు ప్రాణాలతో ఉండగలిగాడు.

మనోబలంలో మిన్న

సీతావియోగానికి తట్టుకోలేక ధైర్యాన్ని కోల్పోయిన రాముడు ఆత్మహత్యకు సంబంధించిన మాటలు మాట్లాడతాడు లక్ష్మణుడితో. అయితే రాముడు తన దగ్గర లేకున్నా. శత్రువు ఇంట ఉన్నా కూడా సీత తన మనోనిబ్బరాన్ని కోల్పోకుండా రావణుడితో ఇలా అంటుంది.


అసందేశాత్తు రామస్య తపస శ్చామపాలనాత్
వ త్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్ధ చేతసా...

రాముని ఆజ్ఞ లేనికారణంగా నిన్ను బూడిద చేయలేకపోతున్నా అని స్పష్టంగా చెప్తుంది. రావణాసురుడితో నేరుగా మాట్లాడకుండా ఒక గడ్డిపోచను పట్టుకుని దానిని రావణాసురుడిగా భావించి ఈ మాటలు చెప్తుంది. రాముడే తన భార్యను కాపాడుకోగలడు అనే నమ్మకం ఆమెకు సంపూర్ణంగా ఉంది. పురుషుడైన రాముడికంటే సీత ఎక్కువ మనోధైర్యాన్ని కలిగి ఉంది.

రాముడి అంగుళీయకం యొక్క తపశ్శక్తి కారణంగా హనుమంతుడు సునాయాసంగా విఘ్నాలని దాటుకుంటూ నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మని కనుగొనగలిగాడు. అంగుళీయకాన్ని సీతమ్మకు తిరిగి ఇచ్చేశాక తిరిగివెళ్లే శక్తి మారుతికి లేదని గ్రహించిన సీత తన చూడామణిని ఇచ్చి తపశ్శక్తి, ఆశీర్వచనాన్ని కూడా ఇచ్చి పంపింది.
రావణవధ అనంతరం సీతమ్మని అలంకరించుకుని రమ్మని కోరాడు రాముడు. లంకలో సంవత్సరం ఉన్న కారణంగా నన్ను మరచిపోయి ఉంటే లంకాధిపతి విభీషణుడిని కాని, సుగ్రీవుని పంచన కాని చేరవచ్చని అంటాడు రాముడు. తన భార్య సౌశీల్యం గురించి పూర్తిగా తెలిసినా కూడా మహారాజు కనుక లోకానికి వెరసి ఆమె పాత్రివ్రత్య నిరూపణకోసం అగ్నిప్రవేశాన్ని కోరతాడు శ్రీరాముడు. ఐనా కూడా రాముని ఒక్కమాట కూడా అనకుండా అగ్నిప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటుంది.

అగ్ని రెండు విధాలు. ఇంధనం చేర్చగా వెలిగే అగ్ని ( సేంధనాగ్ని - స+ఇంధన_అగ్ని ) ఒకటి. ఇంధనపు అవసరం ఏ మాత్రమూ లేని అగ్ని ( అనింధనాగ్ని - న+ఇంధన+అగ్ని) మరొకటి. ఈ రెండింటిలోనూ అనింధనాగ్ని గొప్పది. ఈ అగ్ని ముందు సేంధనాగ్ని తలవంచి తీరుతుంది. సీతమ్మ ముందు అగ్నిహోత్రుడు తలవంచడమంటే ఇదే. అయోనిజ అయిన సీతమ్మ రాముని ఆదేశం మేరకు అగ్నిప్రవేశం చేసినా కూడాఎవరినీ నిందించక, తన గొప్పదనాన్ని నిరూపించుకుని అగ్నిపునీత అయ్యింది .. లంకాదహన సమయంలో ఎక్కడో ఉన్న హనుమంతుడి తోకని నిప్పు కాల్చకుండా చల్లగా ఉండేలా చేయగల శక్తిగల సీతమ్మ తల్లికి అగ్నిప్రవేశం ఓ లెక్కా? రాముడి మనసు సీతమ్మకు తెలుసు, సీతమ్మ శక్తి గురించి రాముడికి తెలుసు. లోకరక్షణకొరకు ఇద్దరూ సామాన్య మానవుల్లా ప్రవర్తించారు. ఈ రహస్యం తెలియని మూర్ఖులు వితండవాదం చేసి దుమ్మెత్తి పోస్తారు. ఈ సంఘటన ద్వారా సీతమ్మ తనకు తాను గొప్ప కీర్తిని తెచ్చుకున్నా రాముడు మాత్రం అనంతమైన అపకీర్తిని మూటకట్టుకున్నాడు.
సీతమ్మ ఇలా రామునికి మార్గదర్శకురాలు, సహనశీలి , రామునికంటే గొప్ప వ్యక్తిత్వం, శక్తి కలది కావుననే వాల్మీకి తన శ్రీమద్రామాయణానికి "సీతాయశ్చరితం మహత్"(గొప్పదైన సీతమ్మ చరిత్ర) అనే పేరుని పెట్టదలిచాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మానవులుగా అవతరించిన ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీమహాలక్ష్మీ ఇద్దరూ అన్యోన్యమైన, ఆదర్శమైన దాంపత్య జీవనానికి ప్రతిరూపాలు. మంచికి మారుపేరైన శ్రీరామునికి సీతమ్మ ప్రతి అడుగులో తోడూ , నీడా అయింది.

సర్వం రామమయం..సీతారామమయం..

మూలం.. డా.మైలవరపు శ్రీనివాసరావు...

ఇక కళ్యాణ వేడుకలు చూద్దామా.....

Saturday, March 20, 2010

అన్వర్ గారు థాంక్స్...


ఈరోజు సాక్షి ఫ్యామిలీ విభాగంలో వచ్చిన చిత్రరాజం..ప్రతీరోజు అన్వర్ గారు వేసే కార్టూన్లు భలే ఉంటాయి. కాని బ్లాగులను,కూడలిని, మహిళలను పరిచయం చేసి మరింత గుర్తింపు నిచ్చిన అన్వర్ గారికి బోలెడు థాంక్స్.

Tuesday, March 16, 2010

షడ్రుచుల సమ్మేళనం - ఉగాది
తెలుగు
బ్లాగర్లందరికీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. సందర్భంగా ముందుగా పిండి వంటలు. తర్వాత రాశిఫలాలు. పంచాంగ విశేషాలు..ఇక రాశిఫలాలు చూద్దామా :


మేషరాశి
అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం

ఆదాయం :8
వ్యయం : 14
రాజపూజ్యం : 4
అవమానం : ౩


వృషభ రాశి
కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు

ఆదాయం : 2
వ్యయం : 8
రాజపూజ్యం : 7
అవమానం : 3మిధున రాశి
మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు

ఆదాయం : 5
వ్యయం : 5
రాజపూజ్యం : 3
అవమానం : 6
కర్కాటక రాశి
పునర్వసు 4 వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు

ఆదాయం : 14
వ్యయం : 2
రాజపూజ్యం : 6
అవమానం : 6సింహ రాశి
మఖ 4 పదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం

ఆదాయం : 2
వ్యయం : 11
రాజపూజ్యం : 2
అవమానం : 2కన్యా రాశి
ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1,2 పాదాలు

ఆదాయం : 5
వ్యయం : 5
రాజపూజ్యం : 5
అవమానం : 2


తులా రాశి
చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు

ఆదాయం : 2
వ్యయం : 8
రాజపూజ్యం : 5
అవమానం : 2


వృశ్చిక రాశి
విశాఖ 4 వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ట 4 పాదాలు

ఆదాయం : 8
వ్యయం : 14
రాజపూజ్యం : 4
అవమానం : 5
ధనుస్సు రాశి
మూల 4 పాదాలు, పూర్వాషాడ 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం

ఆదాయం : 11
వ్యయం : 5
రాజపూజ్యం : 7
అవమానం : 5మకర రాశి
ఉత్తరాషాడ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1,2 పాదాలు

ఆదాయం : 14
వ్యయం : 14
రాజపూజ్యం : 3
అవమానం : 1


కుంభ రాశి
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆదాయం : 14
వ్యయం : 14
రాజపూజ్యం : 6
అవమానం : 1మీన రాశి
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు

ఆదాయం : 11
వ్యయం : 5
రాజపూజ్యం : 2
అవమానం : 4ఇక పంచాంగ విశేషాల కోసం కింద బొమ్మపై నొక్కండి..సర్వేజనా సుఖినోభవంతు ...

Monday, March 15, 2010

బ్లాగర్లందరికీ ముఖ్య గమనిక..

గత కొద్ది కాలంగా బ్లాగ్లోకంలో హేయమైన రాతలు, మహిళల మీద వ్యంగ్యంగా, అసభ్యంగా రాతలు, వ్యాఖ్యలు రాస్తున్న సంగతి తెలిసిందే. కాని ఇలా రాసి మహిళలను బ్లాగులు రాయకుండా ఆపగలరని అనుకుంటే అది పొరపాటే. పేరు లేకుండా సదరు బ్లాగరు పేరుతో నీచమైన కామెంట్లు పెట్టి తమకు తామే పైశాచికానందాన్ని పొందుతున్న మానసిక వికలాంగులు.. ఈ విషయం అందరికీ స్పష్టంగా అర్ధమవుతుంది. నిజ జీవితంలో ఉన్న మనుష్యులే కదా ఇక్కడా ఉన్నది. ఎపుడు ఆడవాళ్ళ మీద ఏడవడమే. ఇలా చేసేవాళ్ళు చదువురాని మూర్ఖులు కారు. బాగా చదువుకున్న హోదా ఉన్న పెద్దమనుష్యులే. కాని ఇలా ప్రవర్తించడం వాళ్ళ వ్యక్తిత్వమేమో మరి. ఇలాంటి సంస్కారం ఏ తల్లి నేర్పించదు. కాని ఇలాంటి వాళ్ళ గురించి , వాళ్ళ రాతల గురించి బాధపడ్డం అనవసరం. ఇదే మాట నేను మహిళా బ్లాగర్లందరికీ చెప్పదలుచుకున్నాను. పట్టించుకోకండి. పట్టపుటేనుగులా సాగిపొండి. మొరిగి మొరిగి వాళ్ళే పోతారు.

ఇదంతా చెప్పడానికి కారణమేంటి అంతే.. నా పేరుతో కొన్ని బ్లాగుల్లో చెత్త అనేకంటే చండాలమైన , అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. కామెంట్స్ ఆప్షన్స్ లో నా పేరు, బ్లాగు పేరు ఇస్తే అది చూసినవాళ్ళు నేనే రాసాను అనుకుంటారు. ఎందుకంటే ఆ పేరు క్లిక్ చేస్తే నా బ్లాగు తెరుచుకుంటుంది కాబట్టి. కాని ఇక్కడ కామెంట్ రాసింది సదరు బ్లాగరేనా కాదా అని తెలుసుకోండి. నిజంగా ఆ కామెంట్ ఆ బ్లాగర్ రాయాలి అంతే అతని జిమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి కామెంటాలి. అప్పుడు ఆ కామెంట్ పక్కన ఆ బ్లాగరు ప్రొఫైల్ లేదా ప్రవర లో ఉన్న చిత్రం కనిపిస్తుంది. ఇదే గుర్తు. కాని ఆ బ్లాగర్ పేరు, బ్లాగు అడ్రస్ తో కామెంట్ ఉంది కాని ప్రొఫైల్ చిత్రం లేదంటే అది నకిలీ కామెంట్ అని గమనించండి.


ఇకపోతే ఈ అంతర్జాలంలో నేను ఎక్కడ కామెంట్ పెట్టినా నా ప్రొఫైల్ చిత్రం ఇలా ఉంటుంది అది లేనపుడు పేరు కూడా చెప్పుకోలేని ధైర్యవంతుడు అని తెలుసుకుని నవ్వుకోండి.

ఈ అసభ్య రాతలు మహిళల మీదే కాకుండా మరికొందరు పురుష బ్లాగర్ల మీద కూడా జరుగుతుంది. అందరూ కలిసి దీనికో పరిష్కారం సూచించ పాటించమని మనవి..

Thursday, March 11, 2010

కాంతిగారికి అభినందనలు


కౌముది సహా సంపాదకురాలు శ్రీమతి కాంతికిరణ్ గారికి అభినందనలు. ఎందుకంటారా.. ఇదిగో ఇందుకే. చిత్రం మీద క్లిక్ చేసి చదువుకోండి. ఈ ఇంటర్వ్యూ చేసిన సుజాతగారికి కూడా ధన్యవాదాలు. మన(సు) సుజాతగారేనండి.

Monday, March 8, 2010

మరు జన్మంటూ ఉంటే !!


 
   మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


అసలు ఇలా మహిళలకు ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలా? అని అనుకుంటే?  అవసరమూ లేదు. దానివల్ల ఒరిగేదేమీ లేదు.. కాని   ప్రతి మహిళ ఇల్లు , పిల్లలు, కుటుంబం అనుకోకుండా తీరిగ్గా తన గురించి తాను ఆలోచించాలి. అలాగే సమాజంలో ఉన్న ఇతర మహిళలు, వాళ్లు చేసే కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. వారి పోరాట పటిమని గుర్తించి స్ఫూర్తి చెందాలి అని నా అభిప్రాయం. ఈ క్రమంలోనే నాలో చెలరేగిన కొన్ని ఆలోచనలు.


సృష్టిరచనలో, నిర్వహణలో స్త్రీ, పురుషుడు.... ఇద్దరి బాధ్యత సమానంగా ఉంటుంది. వీరిలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. కాని తరతరాలుగా పితృస్వామ్య సమాజమే కొనసాగుతుంది. స్త్రీ ఎంత విద్యావంతురాలైనా, ధైర్యవంతురాలైనా ఆమెని ఎప్పటికప్పుడు అణగదొక్కాలనే చూస్తారు. తమని దాటిపోతే తమని లెక్కచెయదేమో అనే అహంభావం. అందుకే మగవాళ్లకంటే ఆడవారు ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే ఉండాలి , తాము చెప్పినట్టు వినాలి , చెప్పింది నోరు మూసుకుని పాటించాలి అని సమాజమే నిర్ణయించేసింది.


పెళ్లికాకముందు ప్రతి ఆడపిల్లా ఏ చీకు చింతా లేకుండా పెరుగుతుంది. కాని పెళ్లి కాగానే ఆమే జీవితమే మారిపోతుంది. తనకోసం కాకుండా తన కుటుంబం, భర్త పిల్లల కోసం ఆలోచిస్తుంది. మగవాళ్ళు పెళ్ళి కాకముందు ఏ బాదరబందీ, ఆంక్షలు లేకుండా పెరుగుతారు, తిరుగుతారు. అందుకే పెళ్ళి కాగానే తమ స్వాతంత్ర్యం కోల్పోయామని ఫీలవుతారు. కాని ఆడపిల్లలకు అసలు స్వాతంత్ర్యమే ఉండదు.  పెళ్ళి  కాక ముందు తల్లితండ్రులు, పెళ్ళి అయ్యాక భర్త, వృదాప్యంలో పిల్లలు చెప్పినట్టు ఉండాల్సివస్తుంది. ఐనా వాళ్ళు అది సంతోషంగా నిర్వహిస్తారు. స్త్రీ జీవితంలో కూతురిగా, భార్యగా, తల్లిగా, అత్తగా ఇలా ఎన్నోపాత్రలు నిర్వహించాల్సి వస్తుంది. అటు పుట్టింటివారిని, అత్తింటివారిని మెప్పిస్తూఎవ్వరితోను మాటపడకుండా,తన సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది స్త్రీ.


ఒకప్పుడు స్త్రీకి చాకలి పద్దులు రాసేటంత చదువు వస్తే చాలు అనేవారు. కాని క్రమక్రమంగా ఎన్నో మార్పులు జరిగాయి,, జరుగుతున్నాయి. స్త్రీలు, పురుషులు, వీరందరితో కూడిన సమాజం కూడా మారింది. స్త్రీకి చదువు , ఉద్యోగం తప్పకుండా ఉండాల్సిందే, తన కాళ్ల మీద తాను నిలబడాలి, ఎవ్వరి మీదా ఆధారపడకూడదు అని ప్రతి తండ్రి తన కూతురిని, కొడుకులతో సమానంగా చదివిస్తున్నాడు. వంటింటికే పరిమితమైన ఇల్లాలిని భర్త ప్రోత్సహించి ఉద్యోగం చేయనిస్తున్నాడు. అదీ కాక కుటుంబ నిర్వహణకు, పిల్లల చదువుల కోసం భార్య కూడా ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం చేయడం తప్పనిసరైపోయింది.  తమకు అధిక శ్రమ ఐనా మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు ప్రతి రంగంలో తమ ప్రతిభని కనబరుస్తున్నారు.


స్త్రీ ఎన్నటికి అబల కాదు. ఆమెలో కూడా అనంతమైన శక్తి ఉంది. దాన్ని గుర్తించి వెలికితీయాలి. అది అంత కష్టమేమి కాదు. ఈరోజు ఎందరో మహిళలు ఉన్నతపదవులు అలంకరించడంలోను , వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంలో వారికి స్ఫూర్తి, ప్రోత్సాహం ఎవరిస్తున్నారు?  అని ఆలోచిస్తే ముందుగా ఆమెను ప్రోత్సహించి ముందుకు నడిపించేది భర్త, స్నేహితులు.. దానికి తోడుగా ఆమెలోని సంకల్పం, ఆత్మస్థైర్యం తప్పనిసరిగా ఉంటుంది. ఈనాడు మహిళలు రాణించని రంగం ఏదైనా ఉందా?. ఉద్యమాలైనా, రాజకీయాలైనా, పరిపాలనా బాధ్యతలైనా, అద్యాపక వృత్తి ఐనా, డాక్టరైనా, గాయని ఐనా, పోలీసైనా, మిలటరీ ఐనా  సరే తాను కూడా చేయగలను అని ముందుకొస్తుంది మహిళ.   ఉద్యోగాలు చేయకున్నా ఎందరో మహిళలు ఇంటినుండే తమకు తెలిసిన స్వయం ఉపాధి పధకాలు ప్రారంభిస్తున్నారు. మేమున్నది వంట చేయడానికి, ఇల్లు సర్దుకోవడానికి మాత్రమే కాదు. కుటుంబ నిర్వహణలో  భర్తకు  చేదోడువాదోడుగా నిలుస్తుంది.


నేను ఎప్పుడూ ఆడవారినే సమర్ధిస్తాను. వారి కష్టాలు మాత్రమే చెప్తూ మగవారినందరినీ ఒక గాటన కట్టి విమర్శిస్తాను . ఆడవారి కష్టాలకు కారణం మగాడు మాత్రమే అని చెప్తాను అని చాలా మంది అనుకుంటున్నారు కదా.. కాని నేను మగవారిని విమర్శించేది., తప్పులు ఎత్తి చూపేది ఆయా సంఘటనలను బట్టి మాత్రమే . ఆయా పరిస్థితుల్లో మగవాడిది తప్పు అంటాను తప్ప మగవాళ్లందరూ చెడ్డవాళ్లు అని నా ఉద్ధేశ్యం ఎప్పటికీ కాదు. పైగా ఒక మహిళ మరో మగాడి గురించి, మగవాళ్ల గురించి ప్రశంసిస్తూ రాస్తే దాన్ని నీచంగా వ్యాఖ్యానించేవాళ్లు ఎందరో ఉన్నారు ఈ బ్లాగ్లోకంలో...


అందుకే నా ఈ జీవనప్రయాణంలో నన్ను ప్రోత్సహించినవారిగురించి ఈరోజు గుర్తు చేసుకుని వారందరికీ మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.


ముందుగా నన్ను ఇంట్లోనే కూర్చోపెట్టకుండా ప్రతీ పనిలో తనతో తీసికెళ్లి ఏ పని ఎలా చేయాలి? ఏలా తెలుసుకోవాలి? అని నేర్పించింది మావారే. నేను ఇప్పుడు ఇలా సొంతంగా అన్ని విషయాలు నేర్చుకుంటున్నాను. మిగతావారికి చెప్పగలుగుతున్నాను అంటే ఆయన నాకు నేర్పిన మంత్రం " రాదు అంటే ఏది రాదు. ప్రతి దానికి ఏదో ఒక సమాధానం, పరిష్కారం ఉంటుంది. శోధన చేయి. తెలుసుకో. అదే వస్తుంది. అర్ధమవుతుంది "  అనేవారు.  ఇక ఈ బ్లాగ్లోకంలో నన్ను అడుగడుగునా ప్రోత్సహించివారు తోటి బ్లాగర్లే. వారందరూ మగవారే. సాంకేతికమైనా, టపాల రచనలోనైనా, ఎప్పుడు ఏ సందేహమొచ్చినా, సమస్య వచ్చినా నాకు ధైర్యం చెప్పి, ముందుకు నడిపించారు. నా ప్రతి సంతోష సమయంలో  వారికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటాను. కాని అపార్ధం చఏసుకున్నవాళ్లు మాత్రం ఆడవాళ్లే.  ఆడవాళ్లే ఆడవాళ్లను అర్ధం చేసుకుంటారు అనుకునేదాన్ని ఇంతవరకు. కాని ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు  అవుతారని ఈ బ్లాగ్లోకంలోనే నెత్తి మీద గంటతో కొట్టినట్టుగా అర్ధమైంది. కాని వారి మీద నాకు ద్వేషం మాత్రం లేదు. అంతా మాయ..


అందుకే స్త్రీకి  ఎన్నో కష్టాలున్నా, సమస్యలున్నా మరో జన్మంటూ ఉంటే నాకు ఇలాగే ఒక ఆడపిల్లగా మాత్రమే పుట్టాలనిఉంది. అందులో జ్యోతిలానే. ఇలాగే ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. స్త్రీ అంటే ప్రకృతి, రంగులు, సౌందర్యం, అందం మాత్రమే కాదు స్త్రీ అంటే బాధ్యత, కష్టం, దుఖం, సహనం, ఓర్పు, క్షమాగుణం కూడా..


గమనిక : ఈ మధ్య నా టపాల వల్ల ఎంతో మంది  మనోభావాలు దెబ్బ తింటున్నాయి, ఆవేశం పెంచుకుంటున్నారు అని అర్ధమైంది. అసలు నేను ఏ టపా రాసినా అది నా వ్యక్తిగత అనుభవంతో  ఎంతో మందితో చర్చించి రాసినవే. ఊరికే పుస్తకాలు చదివి, సినిమాలు చూసి రాసిన టపాలు కావు. ఇది గమనించ ప్రార్ధన.. 
                        

Thursday, March 4, 2010

పుస్తకాలు ఎందుకు చదవాలి???


ఖంగారు పడకండి క్లాసు పుస్తకాలు చదవమనట్లేదు. ఈరోజు స్కూలు, కాలేజీలలో పుస్తకాలు పరీక్షలు, ర్యాంకుల కోసమే చదువుతున్నారు. ఫలితాలు రాగానే పుస్తకాలతో పాటు అందులో చదివిన విషయాలు కూడా తూకంలో వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ కొత్తవి కొనాలిగా.. చదువులు ఐపోయాక, ఉద్యోగాలు , వృత్తులలో స్థిరపడ్డాక కొనే పుస్తకాలు మన అభిరుచి, ఆసక్తిని బట్టి ఉంటాయి. అసలు పుస్తకాలు ఎందుకు కొంటున్నాము. ఎటువంటివి కొంటున్నాము, అసలు మనకు ఏయే పుస్తకాలు నచ్చుతాయో మనకు తెలుసా ?.. ఎవరో చెప్పారని కొనేస్తున్నామా ? మనం చదివిన పుస్తకాలనుండి మనం నేర్చుకునేది కాకపోయినా తెలుసుకునే విజ్ఞానం, సమాచారం ఎంతవరకు ఉంటుంది??? ఇలా ఒక్కసారి తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తే...

వయసుతో పాటు అభిరుచి మారుతుందేమో . పుస్తకాల విషయంలో ఐతే తప్పక మారుతుంది అనుకుంటాను . నా పుస్తక పఠనం ఐతే చందమామతోనే మొదలైంది , ఆ తర్వాత పాకెట్ సైజ్ జానపద నవలలు అలా ఊదిపారేసేవాళ్ళం. అమర్ చిత్ర కథ కామిక్స్ ఎలాగూ ఉండేవి. మధ్యలో ఫాంటం , రిచీ రిచ్ .. టీవీలు లేని, సినిమాలు అంతగా చూడని ఆ కాలంలో పుస్తకాలు, ఆరుబయట ఆటలే పిల్లలకు కాలక్షేపం, వ్యాయామం కూడా. కాదంటారా?? ఎప్పుడు పుస్తక ప్రదర్శనలు జరిగినా నేను ఎక్కువగా కొనేది వంటలపుస్తకాలు, నవలలు.. అన్నీ తెలుగువే.. కథలు , నావల్ల విషయానికొస్తే ఒక ప్రత్యేకమైన రచయిత, రచయిత్రి అని కాదు. పుస్తకం పేజీలు తిప్పి రెండు మూడు సంభాషణలు చదివితే అది మనకు నచ్చుతుందో లేదో తెలిసిపోయేది. అది కొనడమే..ఇలా చూసి కొన్నవేవి నా అంచనా తప్పలేదు లెండి. నేను చదివింది కాలక్షేపానికి కాబట్టి ఎక్కువగా కుటుంబ కథలు, సస్పెన్స్ కథలు ఎక్కువగా ఉండేవి. ఒకసారో , రెండు సార్లో చదివడం . అంతవరకే. ఎప్పుడైనా పుస్తకప్రదర్శనలకు వెళితే నాది, మావారిది చెరో దారి. ఎవరికిష్టమైన పుస్తకాలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అయన బిల్ కట్టేవారు . ఈ పనికిమాలిన నవలలు ఏం చదువుతావ్. వేస్ట్ అనేవాళ్ళు. కాని మంచి పుస్తకాలేవో ఎవరు చెప్పాలి? . ఎలా తెలిసేది. సో నేను అలా డిసైడ్ ఐపోయా..

కాని బ్లాగుల్లో కొచ్చాక మాత్రం నాకు ఎన్నో విషయాలు, పుస్తకాల గురించి తెలిసింది. అపుడు కాని అసలు నాకు ఎటువంటి రచనలు ఇష్టమో తెలిసిరాలేదో. :).. అలాగని జాలంలో తెలిసిన పుస్తకాలన్నీ కొనడంలేదు. నా బుర్రకు అర్ధమయ్యేవి మాత్రమే అప్పుడపుడు కొంటున్నాను. నేను పుస్తకాలు ఎందుకు చదవాలి , ఎటువంటి పుస్తకాలు కొనాలి, ఎటువంటివి కొంటున్నాను అని ఒక్కసారి ఆలోచిస్తే.. నాకు నచ్చిన తెలుగు సాహిత్యంలోని విశేషాలు వివరణలు
తెలియచేసే పుస్తకాలు . అలాగే కొన్ని జీవిత పాఠాలు నేర్పించే కథలు... భక్తి, ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాలు. ఇక మరీ ఇష్తమైన హాస్యానికి సంబంచిన పుస్తకాలు కొంటాను. ఇవన్నీ నా అభిరుచికి తగినవి. నాకు ఇష్టమైనవి కాబట్టి కొంటున్నాను. వీటివల్ల నాకు ఏంటో ఉపయోగం కలిగింది. ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.. ఈ పుస్తకాల గురించి కొందరు మిత్రులతో కూడా మంచి చర్చలు జరుగుతుంటాయి. ఇక పుస్తకాలు కొనడం అనేది పరిమితి లేదు. తప్పనిసరిగా చదవాలనే తప్ప , ప్రతి నెల కొనాలనే నియమమూ పెట్టుకోలేదు. ఎప్పుడు వీలయితే అప్పుడు కోనేయడమే.. మరో ముఖ్య విషయం ఏంటంటే జాలంలో కథలు, వ్యాసాలూ చదవడమంటే చిరాకు. హాయిగా పుస్తకం చేతిలో పట్టుకుని చదివితే ఆ హాయి, సంతృప్తే వేరు..ఏమంటారు??


మరి మీరు పుస్తకాలు ఎందుకు , ఎలా, ఎన్ని కొంటారు?? వాటివల్ల మీకు కలిగిన లాభానష్టాలేంటి ?? కాస్త చెప్పండి..

Monday, March 1, 2010

ఎవరికోసం..? మార్చి 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్

మన నోటి నుండి ప్రవాహంలా జాలువారే మాటలు ఎన్నో హృదయాల్లో మనం కోరుకున్న భావాలను ప్రతిష్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటాయి. మన ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ, అనుభవాల్నీ, భావోద్వేగాల్నీ ఉన్న ఫళాన ఓ మనిషితో, మనసుతో పంచుకుంటే తప్ప స్థిమితం లభించదు. ఉవ్వెత్తున ఉబికే ఆనందమైనా, విచారమైనా మన అంతరంగంలో ఎంతటి అలజడి సృష్టిస్తోందో అదే స్థాయి తీవ్రతని బయటకు వ్యక్తపరచడానికి మాటల ఆసరా దొరక్కా, రాతలకు భావం అందిరాకా మనసు పడే ప్రసవవేదన అందరికీ స్వీయానుభవమే. మనల్ని మనం ఉన్నది ఉన్నట్లు ప్రకటింపజేసుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతుంటాం. ఈ ప్రయాస ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాల వ్యక్తీకరణతో సరిపెట్టుకోబడదు. సమాజమనే ఓ సమూహంలో మన ఉనికిని బలోపేతం చేసుకోవడానికీ ప్రయత్నాలు చేస్తుంటాం. మన సామాజిక గౌరవాలూ, మందీమార్భాలాల హంగులూ, ఆర్థిక సొబగులూ, మాటల స్వోత్కర్షలూ ఏవీ సమాజానికి పట్టవు. మనల్ని ప్రత్యేకవ్యక్తులుగా నిలబెట్టుకోవడానికి దివారాత్రాలు శ్రమించి పడిన కష్టమూ సమాజానికి పట్టనే పట్టదు. మన కోసం సమాజం లేదు. మనం సమాజంలో ఓ మూలన మిణుగురు పురుగుల్లా ప్రకాశించడానికి మన శక్తియుక్తులన్నింటినీ ధారపోస్తున్నాం. జీవితంలో ఈ సత్యాన్ని ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత పరిపక్వతని పొందగలుగుతాం. మన లక్ష్యం సమాజం కాదు.. మనల్ని మనం సంతృప్తిపరుచుకోవడమే అని గ్రహించగలిగినప్పుడు బయటి నుండి ఏమీ ఆశించము, ఎక్కడా అసంతృప్తి, నిరుత్సాహమూ ఎదురుకాదు. మాటలూ అంతే..!!


ఓ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం ద్వారా మనం ఎదుటి వ్యక్తి నుండి ఏ ప్రయోజనాన్నయితే ఆశిస్తున్నామో అది లభించకపోతే నిరుత్సాహమే మిగులుతుంది. ఓ బాధని పంచుకోవడం ద్వారా ఎటువంటి ఊరడింపునైతే పొందాలనుకుంటున్నామో అది లేశమాత్రమైనా దక్కకపోతే మనసు చివుక్కుమంటుంది. రాతలతో ఎదుటివారిని ప్రభావితం చేయగలమనుకునే రచయితల ఊహలూ నీటిమీద రాతలే! స్వతహాగా పరివర్తన లభిస్తే తప్ప ఎవరూ ఎవరిచే ప్రభావితం చెయ్యబడలేరు. మన మాటలు గానీ, చేతలు గానీ, రాతలు గానీ మన అంతరంగంలో ఉబికే ఉద్వేగాలను చల్లార్చుకోవడానికే తప్ప వాటికి ఏదో సామాజిక ప్రయోజనం ముడిపెట్టడం, లేదా సమూహం నుండి గుర్తింపుని ఆశించడం, ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయాలనుకోవడం వ్యర్థప్రయత్నాలే! మచ్చుకు ఈ సంపాదకీయాన్నే తీసుకుంటే నాలో రగిలే ఆలోచనలను వ్యక్తపరుచుకునే ప్రయత్నమే తప్ప దీని ద్వారా పాఠకుల్లో ఏదో మార్పుని ఆశిస్తే భంగపడక తప్పదు. మన వ్యక్తీకరణల గాఢతని మనమే ఒడిసి పట్టుకోలేం.. అలాంటిది ఎదుటి వ్యక్తులకు ఆ గాఢతను ఎంతవరకూ మాటలతో, చేతలతో, రాతలతో బదిలీ చెయ్యగలం? వారెంత వరకూ మనల్ని ఉన్నది ఉన్నట్లు గ్రహించి మనల్ని సంతుష్టులను చెయ్యగలరు?

- నల్లమోతు శ్రీధర్

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008