Thursday 25 August 2011

వంట చేసే విధంబు తెలియండి....

(ఈ టపాకు నెట్ నుండి ఎందుకు బొమ్మ తేవడం అని పాతది నా ఫొటోనే పెట్టేస్తున్నా)



పదకొండు కావొస్తుంది. భర్త పిల్లలు వెళ్లిపోయారు, ఇల్లంతా సర్దడం ఐపోయింది. పని మనిషి కూడా వచ్చి వెళ్లిపోయింది. ఇక ఇంట్లో ఉండే గృహిణులకు బోలెడు తీరిక. మరి ఈ సమయంలో ఏం చేయాలి. హాయిగా కునుకు తీయడమో, ఏదైనా కుట్టుకోవడమో, స్నేహితులతో కాని ఇరుగమ్మ పొరుగమ్మతో ముచ్చట్లేసుకోవడం చేయాలి. కాని అలా వాళ్లు అలా చేయట్లేదే?? మరి మధ్యాహ్నం పదకొండు నుండి మూడింటివరకు లేడీస్ ఇల్లు కదలకుండా ఏం చేస్తున్నారబ్బా?? ఏది తప్పినా సాపాటు తప్పదు. కోటి విద్యలు కూటి కొరకే అని పెద్దలెప్పుడో చెప్పారు కదా!! . చెప్తూనే ఉన్నారు .మరి వంటింటి మహారాజ్ఞి ఐన గృహిణికి ఇష్టమైనది రకరకాల వంటకాల గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఇంట్లో చేసేయడం. అన్నింటికి హోటల్ కి వెళ్లి తినాలంటే మధ్యతరగతి వాళ్లకి కుదరదు కదా. అలాంటప్పుడు వాటిని ఎలా నేర్చుకోవడం?? ఈనాడు ఆ లోటు కూడా తీరిపోయింది. ఇంట్లోనే ఉండి వివిధ ప్రాంతాల వంటకాల తయారీ విధానాలు నేర్పిస్తున్నాయి మన టీవీ చానెళ్లు. పన్నెండు అయిందంటే చాలు పలు చానెల్స్ వంటల ప్రోగ్రామ్స్ తో ఘుమఘుమలాడి పోతుంటాయి. ఇది మంచి విషయమే. తమకు తెలిసిన వంటలు చేసి చూపించి బహుమతులు కూడా అందుకుంటున్నారు ఆ ప్రోగ్రాములలో పాల్గొనే మహిళలు.. ఈ కార్యక్రమాల వల్ల పుస్తకాలు, క్లాసులు మొదలైనవి లేకుండానే ఎన్నో వంటకాలు నేర్చుకోవచ్చు. అందుకే ఈనాడు ఈ వంటల కార్యక్రమాలు చాల ప్రాచుర్యం పొందాయి. కొన్ని చానెళ్లలో ఈ వంటల కార్యక్రమాలలో పోటీలు కూడా పెడుతున్నారు. ఈ మధ్యే ఒక హిందీ చానెల్ లో ఒక మహిళ ఈ వంటల పోటీలో గెలిచి కోటి రూపాయల బహుమతి సంపాదించింది. అంత పాపులారిటీ ఉంటుంది.


అంతా బానే ఉంది. కాని ఈ కార్యక్రమాలలో కొన్ని విషయాలు పంటికింద రాయిలా తగులుతుంటాయి. అవి తీసి పారేసేట్టు ఉంటే బాగుండు కాని అవి చిరాకుతో పాటు కొన్ని సార్లు చీదర పుట్టిస్తాయి. చాలా చానెల్స్ లో గమనిస్తుంటాం . ఈ వంటల ప్రోగ్రాములో పాల్గొనేవాళ్ల అర్హత , వేషభాషలు ఎలా ఉండాలయ్యా అంటే కొత్త పట్టు లేదా హెవీ వర్క్ చీరలు, మెడలో నగలు, చేతి నిండా గాజులు, గోరింటాకు తప్పనిసరిగా ఉండాలి అనిపిస్తుంది. మరి టీవీలో వంట చేయడంతోపాటు అందంగా కనిపించకూడదేంటి?? కొందరైతే వెండిగిన్నెల్లో వంటకు కావలసిన దినుసులు పెట్టుకుంటారు. వాళ్లకు ఉన్నాయి పెట్టుకున్నారు . తప్పేంటి అంటారా?? రోజువారీ వంటలు చేసేటప్పుడు వాళ్లు అలాగే ఉంటారా అని?? అసలు నిజంగా వంట చేసేటప్పుడు సగటు ఇల్లాలు ఎలా ఉంటుంది ఎవరికి తెలీదు. అతిగా ఉంటే వెగటుగా ఉంటుంది ఎవరికైనా. మరో ముఖ్య విషయం ఈ లంగరమ్మలు..అదేనండి యాంకర్లు. వీళ్ళు మాట్లాడేటప్పుడు ఎందుకలా మెలికలు తిరిగిపోతారో అస్సలు అర్ధం కాదు?. మాట్లాడినా కూడా హొయలు.. ఈ లంగరమ్మలు అంతా తెలుగువారే. ఐనా కూడా తమ వ్యాఖ్యానాలలో తెలుగు తక్కువ ఇంగ్లీషు ఎక్కువ ఉపయోగిస్తుంటారు. వాడుక భాషలో పదాలను కూడా ఇంగ్లీషులోనే చెప్పాలా? ఇక్కడ ప్రోగ్రాం చేసే ప్రొడ్యూసరు, డైరెక్టరు , యాంకరు, చూసేవాళ్లు , ఆ చానెల్ కూడా తెలుగే. మరి ఈ ఇంగిలిపీసు అవసరమా?? నూనె, ఉప్పు, చక్కెర ను కూడా ఇంగ్లీషులోనే పలుకుతారు. మనం వాటిని ఆయిల్, సాల్ట్ , షుగర్ అని అనము కదా. మరి ఉప్పు కారం మధ్య ఈ పదాలు వింటుంటే చిరాకేయదా?? ఇంకో విషయం ఇందులో పాల్గొన్న మహిళలు మాట్లాడేది తక్కువ ఈ యాంకరమ్మల గోల ఎక్కువగా ఉంటుంది. వాళ్లు చెప్పింది ప్రేక్షకులకు ఎక్కడ అర్ధం కాదని అనుకుంటారో ఏమో వీళ్లు వెంటనే మళ్లీ చెప్తుంటారు. ఇక కొందరైతే మాష్ కి స్మాష్ కి తేడా తెలీని ముద్దుగుమ్మలుంటారు. అదేనండి ఉడికించిన బంగాళదుంపలను చిదిమి వాడతాము కదా. ఒక్కోసారి మాష్ అంటారు, ఒక్కోసారి అది బాంబు అనుకుని స్మాష్ అంటారు. ఖర్మరా బాబు..


మీరు చెప్పాల్సింది ఉందా?? మొదలెట్టండి మరి..

Wednesday 24 August 2011

మాలిక శ్రావణ పౌర్ణమి సంచికకు స్వాగతం

మాలిక మూడవ సంచికకు స్వాగతం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ప్రత్యేక సంచిక ఎన్నో వ్యాసాలు, కథలతో, పోటీలతో ముస్తాబై వచ్చింది. వాస్తవానికి ఇది మూడవ సంచిక ఐనా మాలిక మొదటి సంచికగానే భావించాము. ఇంతకు ముందు విడుదల ఐన సంచికలు పత్రికా నిర్వహణ, రచనల ఎంపిక, లోటుపాట్లు తెలుసుకుని మెరుగుపర్చుకోవడం కోసం ఒక ప్రయోగంగా భావించాము. ఈ సంచికలో జగద్ధాత్రి, డా. తాడేపల్లి పతంజలి, యక్కలూరి శ్రీరాములు, మన్నే సత్యనారాయణ లాంటి ప్రముఖుల రచనలు, బ్లాగర్లు ఇచ్చిన అద్భుతమైన కథలు, వ్యాసాలు, అసలు బ్లాగులంటేనే తెలీనివారి రచనలు కూడా ఈ పత్రికలో పొందుపరిచాము. అవి మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాము. మీ విమర్శలు, సలహాలు మాకు సదా శిరోధార్యం.



అనివార్య కారణాల వల్ల రావు బాలసరస్వతిగారి ఇంటర్వ్యూ ప్రచురించడంలేదు.. అది దీపావళి సంచికలొ చూడవచ్చు. చదవవచ్చు. మాలిక పత్రికలో మరో విశేషం..ఈ సంచికనుండి రెండు పోటీలు నిర్వహిస్తున్నాము. రెండింటికి నగదు బహుమతి ఉంటుంది. పదచంద్రికను తప్పులు లేకుండా పూరించినవారికి నగదు బహుమతి వెయ్యి రూపాయలు. మరో పోటీ ఏంటంటే.. ఈ సంచికలో ఒకే రచయిత రాసిన రచనలు ఒకటికంటే ఎక్కువ ఉన్నాయి. ఆ శైలిని మీరు గుర్తుపట్టగలరేమో చూడండి. రచయితను గుర్తించండి. బహుమతి తీసుకోండి.. వచ్చే నెల సెప్టెంబర్ 21 న గురజాడ నూట యాభయ్యవ జయంతి జరుపుకోబోయే సందర్భంగా గురజాడివారి రచనలపై విశ్లేషణతొ కూడిన రచనలు రెండు సమర్పిస్తున్నాం. చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.



మాలిక పత్రికలో మరో నలుగురు కొత్త సభ్యులు చేరారు. సుజాత , కల్లూరి శైలబాల, కుమార్, ఎన్. కౌటిల్య.



వచ్చే సంచిక కోసం మీ రచనలు ఈ చిరునామాకు పంపగలరు editor@maalika.org .. మా ఈ పత్రికకు తమ రచనలు పంపినవారందరికీ ధన్యవాదాలు. మీ నుండి మరిన్ని అమూల్యమైన రచనల కోసం మాలిక పత్రిక సదా ఆహ్వానం పలుకుతుంది. ఎదురుచూస్తూ ఉంటుంది.



ధన్యవాదాలు.

http://magazine.maalika.org/

Sunday 21 August 2011

నా చరణం –మీ పల్లవి (పరిమళించిన వేళ)



ఒకనాటి చల్లని సాయంకాల వేళలో మార్కెట్లో నడిచి వెళ్తున్న రామకృష్ణకు అటుగా వెళ్తున్న ఆటోలోనుండి అలనాటి మధురమైన పాట చరణం ఒకటి వినిపించింది. అతనికి వెంటనే కాలేజీ రోజులలో విన్న, ఎన్నోసార్లు పాడుకున్న ఆ పాట మదిలో కదిలింది. ఆ పాట గుర్తు చేసుకుని మళ్లీ పాడుకుందామంటే పల్లవి ఎంతకూ గుర్తు రాలేదు. ఇద్దరు ముగ్గురు స్నేహితులను అడిగినా తెలీదన్నారు. కంప్యూటర్లో పని చేసుకుంటూ నెట్‌లో కూడా వెతికాడు. ఉహూ! దొరకలేదని నిరాశపడకుండా ప్రయత్నించాడు. ఫేస్‌బుక్‌లో ఒక గ్రూపు మొదలుపెట్టి దానికి నా చరణం మీ పల్లవి అని నామకరణం చేసాడు. తనకు తెలిసిన కొద్ది మంది స్నేహితులను చేర్చి, తను విన్న చరణాన్ని పోస్ట్ చేసి ఎవరికైనా పల్లవి తెలిస్తే చెప్పండి అని అడిగాడు. వెంటనే ఒకావిడ పల్లవి చెప్పేసింది . దానికి ఎంతో సంతొషించాడాయన. ఆ పాత పాట గురించి మళ్లీ గుర్తు చేసుకోవడం వల్ల తనకు కలిగిన ఆనందాన్ని పెంచుకోవాలని ఆ గ్రూపును అలాగే కంటిన్యూ చేసాడు. అలా మొదలైన గుంపు మొదట్లో నిశ్శబ్ధంగా ఉన్నా ఒక్కరొక్కరుగా చేరుతూ నాలుగు నెలలలో వంద సభ్యులను, పదివేల పోస్టులను దాటింది. ఇందులో ఉన్నవారంతా తెలుగు పాటల అభిమానులే. సంగీత ప్రియులే అని చెప్పవచ్చు. వాళ్లు ఒక వయసుకే పరిమితం కాలేదు. కాలేజీ అమ్మాయినుండి కాలేజీ లెక్చరర్ , రచయిత్రులు, బ్లాగర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు, ఉద్యోగులు , వ్యాపారస్తులు ఉన్నారు. అనుకోకుండా కలిసిన వీరు రోజూ పాటలతో శుభోదయం చెప్పుకుని రాత్రి పన్నెండు తర్వాత గుడ్‌నైట్ అనుకుని పడుకోవడం అలవాటైంది. ఇది ఒక అందమైన , విడువలేని వ్యసనంగా తయారైంది అందరికీ. తమ ఉద్యోగ, వ్యాపారాలతో పాటు గుంపులో పాల్గోవడం అందరికీ ఒక సరదా ఉంటుంది....


ఈ చరణాలు చూసి పల్లవులను గుర్తు చేసుకోవడం, వెతకడం, దొరకకుంటే క్లూలు అడగడం.. కష్టపడి ఆ పాటను పట్టుకుని .. ఆ పాటకు సంబంధించిన తమ అనుభవాలను,అనుభూతులను పంచుకోవడం వల్ల తమ నిత్యకృత్యములలోని అలసటను, టెన్షన్‌ను మరచిపోతున్నారు. ఆనాటి మధురమైన పాటలు గుర్తు చేసుకున్నప్పుడల్లా గతంలోకి వెళ్లిపోవడం అందరికీ అనుభవమే.. ఆనాటి కాలేజీ రోజులు, బస్ స్టాపులు, స్నేహితులతో వేసుకున్న పిచ్చాపాటి... తళుక్కున మెరిసి మాయమవుతాయి... ఈ గుంపులో ఎప్పుడూ చరణాలు పల్లవులు అనే కాకుండా వారంలో ఒక రోజు అతిథి ఉంటారు.. అది ఒక నాయకుడు, నాయిక, గాయకుడు, గాయని, రచయిత, సంగీత దర్శకుడు ఎవరైనా కావొచ్చు. ఇక ఆ రోజంతా ఆ అతిథికి సంబంధించిన పాటలే మార్మోగుతాయి. మరో రోజు ఒక థీమ్ ఉంటుంది. మనసు, చందమామ, మల్లె, రామ .. ఇలా .. ఆ రోజంతా ఆ థీమ్ మీదే పాటలు ఉంటాయి. అప్పుడప్పుడు ఒక చిత్రం ఇచ్చి దానికి సంబంధించిన పాట చెప్పాలి. ఈ చిత్రాలు తయారుచేయడంలో ఎంతొ సృజనాత్మకత కనిపిస్తుంది. అది చూడగానే టక్కున ఆ పాట పల్లవి గుర్తు రావాల్సిందే. దీనికొసం ఒకే బొమ్మ కాకుండా రెండు మూడు బొమ్మలు కలిపి ఒకే చిత్రంగా తయారు చేస్తారు .. మరోసారి ఒక పదం మాత్రమే ఇస్తే దానికి సంబంధించిన పాటలు టకటకా అలా చెప్పేస్తారు. అంత వేగంగా సమాధానాలు వచ్చేస్తాయి.


అలా హాయిగా, ఉల్లాసంగా గడిచిపోతుండగా మనం కలిస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన ఆలొచన నిన్న శనివారం కార్యరూపం దాల్చింది. ఒక ఈవెంట్ అనుకున్నప్పుడు మేనేజర్ ఉండాలిగా. దానికోసం కల్యాణ్ నియమించబడ్డాడు. రెండు రోజుల ముందునుండే ఎప్పుడెప్పుడు ఈ మీటింగ్ అవుతుందా . కలుద్దామా. ఎంజాయ్ చేద్దామా అని అందరిలో ఆత్రుత. కలిసినప్పుడు మాత్రం ఎంతో ఆనందం. చిరుజల్లులు కురుస్తుండగా మద్యాహ్నం ఒకటిన్నరకల్లా అందరూ చిక్కడపల్లిలోని కళా సుబ్బారావు వేదికకు చేరుకున్నారు. ఓహ్! మీరు ప్రభాకర్ కదా? మీరు Rsn Murthy కదా?. మీరు వెంకట్.. నీ పేరేంటమ్మా? వందనా లేదా రమ్యా ?? కొందరిని ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో చూడడం వల్ల గుర్తుపట్టడం అంత కష్టమేమి కాలేదు. హైదరాబాదులో ఉన్నవారు ఇలా కలుస్తున్నారని రాలేకపోయిన సభ్యులు ఎంతో నిరాశపడ్డారు. వైజాగ్ చెందిన కవయిత్రి జగద్ధాత్రి రాసిన ఈ కవిత చూడండి..


గళం గళం కలిపి కలసి పాడుకుందాం


కలం మనం విప్పి మంచి పంచుకుందాం


పాటకు కరగని హృది ఉండదని


మాటకు మెరవని మది ఉండదని


దూరలేన్నైనా అడ్డం లేదు అనీ


చాటుదాం ఈ -లోకానికి


పల్లవులై పల్లవించి


చరణాలుగా పరవశించి


మానవులై పరిమళించి


మనమంతా ఒకటేనని


స్వర తపస్వులమనీ


సంగీత జగతికి


మనమంతా కనుపాపలమని


నా చరణం మీ పల్లవి


సమూహంగా పాడుదాం


సరదాగా పాడుదాం......

ప్రేమతో...జగతి




టీ తాగుతూ పరిచయాలు చేసుకున్నారందరూ. అర్రే! మనం రోజూ గుంపులో చూసే వ్యక్తి మనకెదురుగా ఉన్నారే అన్న ఆనందం అందరిలోనూ కనిపించినంది. కార్యక్రమం ప్రారంభించేముందు గుంపులోని సభ్యులందరికీ మాతాశ్రీ ఐన జగతికి వైజాగ్ ఫోన్ చేసి అందరం గట్టిగా హాయ్ చెప్పాము. ఫొన్‌ని మైక్ ముందు పెట్టి ఆవిడ మాటలు, ఆశీస్సులు అందరం విన్నాం. మనుష్యులు శారీరకంగా దూరంగా ఉన్నా మనసులను, మాటలను దరి చేరకుండా ఎవరాపగలరు.. అలాగే దీపిక కూడా హాయ్ చెప్పింది. తను పాల్గొనలేకపోయినందుకు ఎంతో బాధపడింది కూడా.


ముందుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. అనంతరం ఉష ప్రార్ధనా గీతంతో కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమ నిర్వాహకుడు, ఈవెంట్ మేనేజర్ కల్యాణ్ కొందరు పెద్దలను స్టేజీ మీదకు ఆహ్వానించి గౌరవించాడు. మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టేముందు NCMP గ్రూపులో సభ్యుడు డా. భార్గవ మృతికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించారందరూ. తర్వాత రామకృష్ణ పుక్కల్లగారు ఈ గుంపు మొదలుపెట్టడానికి గల కారణాలు, దానివలన పొందిన లాభం, సంతోషం గురించి వివరించారు. ఆ తర్వాత వందన, సాయికమల, రోసీ గౌడ్, శ్రీనివాస్ మౌళి తమ అభిప్రాయాలను , అనుభవాలను వెలిబుచ్చారు. నేనున్నాంటూ ఓ పక్కన కూర్చుని చూస్తున్న కేకును తెచ్చి ఈ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న సభ్యులతో కేక్ కట్ చేయించి, అందరికీ అల్పాహారంతో సహా ఇవ్వడం జరిగింది. ఆ అల్పాహారాలు ఏమిటేమిటీ అంటే ..... ఆ ఒక్కటి అడగొద్దు. ఫుల్లుగా తిన్నాం. వేడి వేడిగా, చల్ల చల్లగా, హాటు హాటుగా, స్వీటు స్వీటుగా....




ఇక మిగిలింది పాటలే కదా. రెండు గుంపులుగా విడిపోయి ఒకరు చరణాలు ఇస్తే మరో గుంపు పల్లవి పాడడం. రోజూ గ్రూపులో ఇచ్చే ఒక్కలైన్ కాకుండా రాగయుక్తంగా చరణం ఇస్తుండగానే ఆ పల్లవి తెలిసిపోయేది. ఈ పాటల హడావిడిలో ప్రభాకర్‌గారు, సాయిగారు, ఉష గారు ఒకవైపు, కల్యాణ్, వెంకట్, శ్రీనివాస్ ఆనంద్, మూర్తి మరోవైపు ఎంత బాగా పాడారో. మొత్తం పాటలు పాడిస్తే బావుండేది అనిపించింది నాకైతే.. ఒకసారి వచ్చిన " ఓ చిన్నదానా !" అనే కృష్ణపాటకు మాత్రం వెంకట్, కల్యాణ్ అచ్చంగా కృష్ణలాగే వేసిన స్టెప్పులు మాత్రం అదుర్స్... కొద్దిసేపయ్యాక రామకృష్ణగారు ఇచ్చిన థీమ్ మనసు మీద కొన్ని పాటలు. ఇలా ఒకటే గోల గోలగా ఉండింది. ఆ తర్వాత చిట్టీలు, ... చివరలో ఉమ దుర్గా ప్రసాద్ వచ్చి కలిసింది. ఇంత ఉత్సాహంగా గడిచిన ఈ సమయంలో చిందులు లేకుంటే ఎలా? ఆ లోటు కల్యాణ్, వెంకట్, రోసీ తీర్చేసారు. థాంక్స్ టూ యూ అబ్బాయిలూ.. చివర్లో పాటలతో తయారు చేసిన పరీక్షా పత్రం పూర్తి చేసారు అక్కడున్న వారు. దాని ఫలితాలు ఇంకా చెప్పలేదు. RKగారు వచ్చి చెప్తారంట.. నేను తప్ప అందరూ హుషారుగా పాటలు పాడారు, నేను మాత్రం అవి వింటూ ఎంజాయ్ చేసాను. ఎందుకు పాడడమనే భయంకరమైన ప్రయోగం చేసి అందరిని బెదరగొట్టడమని సైలెంటుగా ఉన్నాను..





అవునూ! ఇంతకూ ఈ సమావేశానికి ఎవరెవరు వచ్చారో చెప్పలేదు కదా.. కల్యాణ్ కోటంరాజు, రామకృష్ణ పుక్కల్ల, ఉష, జ్యోతి రెడ్డి, Rsn మూర్తి, నేను, శ్రీనివాస్ ఆనంద్, వెంకట్, ప్రభాకర్, సాయి ప్రసాద్ నల్లూరి, వందన, రమ్య, స్వాతీ శ్రీపాద, రోసీ గౌడ్, సాయి కమల, శ్రీనివాస్ మంచికంటి, ఉమ, శ్రీనివాస్ మౌళి, స్వరూప్ మంచికంటి ... జగతి, దీపిక, జ్యోతిర్మయి మల్లా ఫోన్‌లో పలకరించారు. నేను అందరికీ బోలెడు తెలుగుపాటలు, కొన్ని కిషోర్, రఫీ పాటలు ఉన్న డివిడిలు ఇచ్చాను. శ్రీనివాస్ ఆనంద్ తను చేసి జీడిపప్పు చాక్లెట్లను తలా ఒక పాకెట్ ఇచ్చారు. శ్రీనివాస్ మంచికంటిగారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదం, ఒక అందమైన బహుమతి, లెటర్ ప్యాడ్, పెన్ను ఇచ్చారు. ప్రభాకర్ గారు ఖరీదైన పార్కర్ పెన్ ఇచ్చారు . రమ్య తను పాస్ అయ్యానని స్వీట్ ఇచ్చింది. స్వాతీ శ్రీపాద గారు తను రాసిన పుస్తకాలు కొన్ని వైజాగ్ కి పంపించారు , మాకు తర్వాత పంపిస్తామన్నారు. చివరలో "నా చరణం - మీ పల్లవి " గుంపును ప్రారంభించి ఇంతమంది సంగీత ప్రేమికులను,తెలుగు పాపి( పాటల పిచ్చోళ్లు) లను కలిపిన రామకృష్ణ పుక్కల్లగారికి చిరు సత్కారం జరిగింది. బయట వాన జోరు..లోపల పాటల హోరు అన్న రీతిగా జరిగిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పాల్గొన్నవాళ్లందరికీ మరచిపోలేని , మధురమైన అనుభూతిని కలిగించింది. రానివాళ్లకు మాత్రం నిరాశా మిగిలింది. పాపం..

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008