Sunday, May 31, 2009

ఎక్కడ ఈ అందాలు???


తిన్నామా.... పడుకున్నామా... తెల్లారిందా...

ఈనాడు ఇదే దినచర్య ఐపోయింది చాలామందికి. అది పల్లె అయినా, పట్టణమైనా... ఎక్కడ చూసినా బిజీ , బిజీ.. మూడేళ్ళ పిల్లాడికి కూడా పొద్దున్నే లేచి ఉరుకులు పరుగులతో తయారయ్యే గ్రహచారం పట్టింది. హాయిగా ఒక్కపనీ చేసుకోవడానికి లేదు. తినడం, పాడుకోవడం అన్నీ యాంత్రికమైపోతున్నాయి.. మరి పల్లెలలో ఎలా ఉందో??

తెల్లా వారక ముందే పల్లే లేచిందీ..
తన వారినందరినీ తట్టి లేపిందీ..
ఆదమరచి నిద్ర పోతున్న తొలికోడి..
అదిరి పడి మేల్కొంది అదే పనిగ కూసింది..తెల్లా వారక ముందేవెలుగు దుస్తులేసుకునీ సూరీడూ..
తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో..
పక్క దులుపు కుని ఒకే పరుగు తీసిందీ..
అది చూసీ.. లతలన్నీ.. ఫక్కున నవ్వాయి..
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి..తెల్లా వారక ముందేపాలావెల్లి లాంటి మనుషులు...
పండూ వెన్నెల వంటీ మనసులు
మల్లె పూల రాశి వంటి మమతలూ..
పల్లె సీమలో కోకొల్లలూ..
అనురాగం.. అభిమానం...
అనురాగం అభిమానం కవల పిల్లలూ..
ఆ పిల్లలకూ పల్లెటూళ్ళు కన్న తల్లులూ..తెల్లా వారక ముందే


ఇక్కడ వినండి.

మామూలుగా ఏదైనా పాట వింటే , సంగీతమో, సాహిత్యమో, లేదా ఆ పాట పాడినవారి స్వర మాధుర్యం మనను ఆకట్టుకుంటుంది. ఓహో అనుకుంటాము.. కాని కొన్ని పాటలు అందంగా ఉంటాయి. చాలా సులభమైన తెలుగు పదాలతో ఉంటాయి. ఆ పాట వింటుంటే ఒక అందమైన దృశ్యం మన కళ్లు ముందు కదలాడుతూ ఉంటుంది. అలాంటిదే ఈ పాట. ముత్యాల పల్లకి చిత్రంలో సుశీల పాడిన మల్లెమాల గీతం. నిజంగా ఈ పాట వింటుంటే ఒక అద్భుత దృశ్యం రూపకల్పన చేసుకుంటుంది. వ్యవసాయపు పనులకోసం సూర్యుడికంటే ముందే లేచి పొలాల వైపు అడుగులేస్తారు రైతన్నలు. సూరీడు తూరుపు తలుపు తీసుకుని కాక తోసుకుని వచ్చాడంట. మరి రోజూ చేసే పని తప్పదు కదా.. ఉద్యోగాలు, స్కూళ్ళు ఇలా మనం కూడా అన్ని పనులు టైం ప్రకారం తప్పనిసరై చేయాల్సి వస్తుంది కదా. నింపాదిగా చేస్తే ఎలా కుదురుతుంది. ప్రతి రోజు అలారం పెట్టుకుని అమ్మ లేచి , పిల్లలను లేపుతుంటే పిల్లలకు చిరాకు, స్కూలు బస్సు వెళ్ళిపోతుందని భయమేసి లేస్తారు .. మామూలుగా కాకుండా వెలుగు దుస్తులేసుకుని వచ్చిన సూరీడుని చూసి పాడు చీకటికి కూడా భయమేసి పక్క దులుపుకుని పరుగుతీసిందంట..

కొన్నేళ్ళ క్రిందట పల్లెటూళ్ళలో కుటుంబ సభ్యుల మధ్యే కాక ఊరంతా కూడా అభిమానంగా కలిసి మెలిసి ఉండేవారు. ఎవరింట్లో శుభకార్యమైనా ఊరంతా చుట్టాలే.. అనురాగం అభిమానం కవల పిల్లలూ.. .. ఎంత మంచి ఊహ కదా.. కాని నిజమైతే బాగుండు అనిపించక మానదు ఎవరికైనా..

Friday, May 29, 2009

బ్లాగర్లకు బ్లాగర్ల విజ్ఞప్తి


బ్లాగు మన ఆలోచనలు, భావవ్యక్తీకరణకు ఒక వేదిక. దానివలన మనలోని ఆలోచనాశక్తి, విశ్లేషణ, పరిశీలనాసక్తి పెరుగుతుంది. అలాగే రచనా శైలి మెరుగుపడి , ఏదైనా సంఘటనను, భావాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది అర్ధమవుతుంది. మన రచనలను ఇతరులతో పంచుకోవడం, చర్చించడం వల్ల తప్పు , ఒప్పులు తెలుస్తాయి, అలాగే మరి కొన్ని మనకు తెలీని విషయాలు కూడా అవగతమవుతాయి. మనం రాసిందే ఒప్పు కాదు. ఇతరులు చెప్పిందే తప్పు కాదు. తప్పులు, పొరపాట్లు ఎవరైనా చేస్తారు. అది సహజం. అది తెలుసుకుని తమని తాము దిద్దుకోవడంలో తప్పు లేదు. ఇలా చేయాలంటె మన రచన బాగుందా లేదా అని కాకుండా, అందులొ తప్పులు ఉన్నాయా, ఇంకా మెరుగుపరుచుకోగలమా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనమేం రచయితలం కావాలా. మన వృత్తి మనకు లేదా. ఎప్పుడూ ఈ బ్లాగుల్లొనే ఉంటామా అని అంటారా?? బ్లాగులు రాసేవాళ్లందరూ తమ తమ వృత్తి, ప్రవృత్తి, చదువులు వగైరా స్వంత పనులలో నిమగ్నమై కూడా తమలోని ఆలొచనలను, స్పందనలను తమలా ఆలోచించే వారితో పంచుకుని , చర్చించుకోవాలని బ్లాగులు రాస్తున్నారు. అది మన మాతృభాషలో ఉంది కాబట్టి ఇంకా సంతోషం కదా.ప్రతి ఒక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఎవరికి వారే గొప్పవారు. ఆ ప్రతిభ ఈ బ్లాగులలోని రచనల వల్ల తెలుస్తుంది. ఒక టపా రాసి అది అందరి మెప్పు పొందాలని దాదాపు ప్రతి బ్లాగరు అనుకుంటాడు. అది కామెంట్ల వల్ల తెలుస్తుంది. ప్రచార మాధ్యమాల మూలంగా ఈ మధ్యకాలంలో తెలుగు బ్లాగులు అభివృద్ధి చెందాయి. శుభం. ముందు చెప్పినట్టు అందరి దగ్గర ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. వాళ్లు చెప్పాలనుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. ఊరికే టపా రాసేసి కామెంట్లకు ఎదురుచూడ్డం. అంత కష్టపడి రాసిన టపాకి ఒక్క కామెంటు రాకపోవడంతో నిరాశ కలుగుతుంది. ముందు కెళ్లడానికి మనస్సంగీకరించదు. కామెంట్లు రాకుంటే పోనీ, అలాగే రాసుకుంటూ పోవచ్చు. కాని మనం రాసిన విషయం గురించి ఏదో ఒక స్పందన ఉండాలని అందరూ అనుకుంటారు కదా. ఆ స్పందన మనం ఎంచుకున్న విషయం, దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాము అనేది ముఖ్యం. కొత్తలో అందరికీ ఇది తెలీదు కదా. కాని అంతటితో నిరుత్సాహపడడం మంచిది కాదు. ఏది తనంతట తాను మన దగ్గరకు రాదు. శోధించి , సాధించాలి. అది ఖచ్చితంగా మన చేతిలొకి వస్తుంది. ఇది నిజం.ఈ మధ్య నేను గమనించిన లేదా నాకు కలిగిన ఇబ్బంది... ఏంటంటే కొన్ని బ్లాగులలో రోజు ఒకటికంటే ఎక్కువ టపాలు వస్తున్నాయి. అది తప్పు కాదు. కాని ఆ టపాలన్ని కూడలి లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నాయి. దీనివల్ల ఎన్నో మంచి టపాలు ఎకువమంది చూడకుండానే, అసలు అవి ఉన్నాయని తెలీకుండానే తొందరగా వెనక్కి వెళ్లిపోతున్నాయి .. ఆ ట్రాఫిక్ జాం లో ఏ బ్లాగు చదవాలో కూడా తెలీకుండా ఉంది. కామెంట్లు చూసి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల ఎన్నో కొత్త బ్లాగులకు చదువరులు రాకుండా పోతున్నారు. ఇలా ఎంతో మంది నిరాశ చెందుతున్నారు. కొందరికి కోపాలొస్తున్నాయి. కాని దీనికి పరిష్కారం కనుగొనాలి కదా. లేకపొతె పది నిమిషాల కంటే ఎక్కువసేపు కూడలిలో మన బ్లాగు టపా కనపడకుంటె రాసి వృధా కదా. అందుకే నాదో చిన్న మనవి. మీరు రాయాల్సిన విషయాలు ఎక్కువ ఉంటే రాయంది. ఒకే అంశం మీద ఉన్న వ్యాసాలు జాగ్రత్తగా సర్ది పెట్టి ఒకే టపాగా ప్రచురించండి. లేదా రోజొక టపా రాయండి. మీరెక్కడికీ పోరూ, చదివేవారెక్కడికీ పోరూ. అందరూ రోజూ కూడలికి వస్తారుగా.. ఒక్కశారి మీ బ్లాగు టపాల గురించి కాకుండా చదువరుల గురించి, దీనివలన ఇబ్బంది పడుతున్న మిగతా బ్లాగర్ల గురించి ఆలోచించండి. అలాగే రోజు మూడు నాలుగు టపాలు ప్రచురిస్తే అన్నింటికీ చదువరులు , కామెంట్లు ఉంటాయా. లేదనుకుంటా. ఏ టపా ఐనా కాస్త ఫేమస్ ఐంది అంటే దానిలోని కంటెంట్ బట్టి కాని రాసిన బ్లాగరు, అతడి ఆస్థిపాస్థులు, పేరుప్రఖ్యాతులు కావు. ఈ విషయంలో ఆగ్రిగేటర్ల నిర్వాహకులు ఏదైనా పరిష్కారం చూపగలరా??చాలా మంది బ్లాగ్లోకంలో గ్రూపులు ఉన్నాయి అనుకుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. ఒకే సమయంలో బ్లాగులు మొదలెట్టినవారు బహుశా ఒకే దగ్గర కనిపిస్తారేమో. లేదా వారి చొరవ బట్టి ఆయా బ్లాగులలో కామెంట్ల రూపంలో చర్చిస్తారేమో. మాకు అందులో చోటు ఉండదేమో అనుకోవద్దు. మీరు ఆ చర్చలో పాల్గొనండి. మీరు ఆ గుంపులో కలిసిపోండి. అదీ మీకు నచ్చితేనే.. కొత్త బ్లాగర్లు కాని, పాత బ్లాగర్లు కాని సీనియర్లు, జూనియర్లు అనేది బ్లాగ్ అనుభవం బట్టే ఉంటుంది. ఇప్పుడు జూనియర్లు , మూడు నెలల తర్వాత వచ్చేవారికి సీనియర్లే కదా. బ్లాగర్ల సహాయం కోసం బ్లాగ్ గుంపు ఉండనే ఉంది. అలాగే మహిళా బ్లాగర్ల కోసం ప్రమదావనం. సంకోచించకుండా, మొహమాటపడకుండా తెలీని విషయాలు అడగొచ్చు. అందరూ కాకున్నా కొందరైనా మీకు తప్పకుండా సహాయమందిస్తారు. ఎవరూ అన్ని నేర్చుకుని పుట్టలేదు కదా.కొత్త బ్లాగర్లకు కొన్ని సలహాలు , చిట్కాలు..కొత్తగా తెలుగులో బ్లాగు మొదలెట్టారు సంతోషం. మంచి పేరు సెలెక్ట్ చేసుకుని బ్లాగు మొదలెట్టాక కూడలి, జల్లెడలో చేర్చండి. ముందుగా మీరు ఏం రాయాలనుకున్నారో అది నిర్ధారించుకోండి. దాని మీద కాస్త హోం వర్క్ చేయండి. ఏదొ రాసి పడేసాం అన్నట్టు కాకుండా. బాగా రాసినట్టు ఉండాలి. తర్వాత దానిని పద్ధటి ప్రకారం, అంటే అర్ధం పర్ధం లేని నేటి సినిమా పాటల్లా కాకుండా సరియైన రీతిలొ introduction, main content, ending ఇలా ... మీ టపాకు తగిన చిత్రం గూగులమ్మని అడిగి చూడండి. అది కూడా పెడితే మీ టపాకి మరికాస్త అందమొస్తుంది. బరువు కూడా పెరుగుతుంది కూడా.. ఆ తర్వాత ముఖ్యమైన విషయం ... మీ బ్లాగులో అనవసర చెత్త చేరకుండా అనానిమస్ వ్యాఖ్యలు అనుమతించకండి. లేదా కామెంట్ మాడరేషన్ పెట్టుకోండి. తర్వాత కామెంట్ రాసినవారికి వచ్చే అడ్డంకి వర్డ్ వెరిఫికేషన్. అది తీసేయండి. లేదా తర్వాతి టపాలో మీ బ్లాగులో వ్యాఖ్య రాయడానికి అందరికీ చికాకే .. ఇక మీ బ్లాగులు గుర్తింపు రావాలి, అందరికీ తెలియాలి , అందరూ మీ బ్లాగుకు రావాలంటే ఎలా మరి. ఇక్కడ ప్రకటనలు గట్రా పనికిరావే.. ఈ పని మీ చేతిలోనే ఉంది. అన్ని బ్లాగులకు లేదా వీలైనన్ని ఎక్కువ బ్లాగులకు వెళ్లండి. చదవండి, మీ స్పందన తెలపండి. ఆ కామెంట్లతో ఎవరా ఈ వ్యక్తి అని కొందరైనా మీ బ్లాగులు తప్పకుండా వస్తారు. అంటే ముందు మీ గురించి అందరికి కాస్తో కూస్తొ పరిచయం చేయాలన్నమాట. తర్వాత వాళ్లే మీ బ్లాగుకు తప్పకుండా వచ్చి మీ టపా చదువుతారు.నచ్చిందంటే సరే లేకపోతే విమర్శించినా అంగీకరించండి. ఎందుకంటే విమర్శ అనేది ... వేషం మార్చుకుని వచ్చిన ప్రశంస లాంటిది.. వాటివల్లే మీలోని చిన్న చిన్న తప్పులు దిద్దుకొని మెరుగుపరుచుకునే వీలుంటుంది. ఏదో ఒక విషయం మీద రాయలనే అత్యుత్సాహం అందరికీ ఉంటుంది కాదనను. కాని కాస్త మీ బ్లాగు టపా చదివేవారి సంగతి కూడా కాస్త ఆలోచించండి. వారికి చదివి స్పందించడానికి టైమివ్వాలి కదా. రోజూ రాస్తున్నాం, రోజూ కామెంటండి అంటే కష్టమే మరి. ఎవరి పనులు వారికుంటాయి. కామెంట్లు మాకెందుకు అంటారా?? కనీసం టపా చదివే టైం కావాలా వద్దా?? ఒక రోజు మిస్ అయ్యామని వెనక్కి వెళ్లే ఓపిక ఎంతమందికుంటుంది. ఆలోచించండి. సో.. వారానికి మూడు లేదా నాలుగు టపాలు ఓకే.. ఇక కొన్ని బ్లాగులలో విపరీతమైన వాదనలు జరుగుతాయి. అవి అంతగా పట్టించుకోవద్దు. చర్చించుకోవడం మంచిదే. కాని అది వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒకరిని నిందిన్చనతవరకు , అభ్యంతరకరమైన రాతలు రాయనంతవరకు ఎవరి బ్లాగుకు వారే సుమన్, వారే దుష్మన్ కూడా.. మీకు ఇష్టమైనది రాసుకోవచ్చు. వేరే బ్లాగులో మీకు నచ్చింది ఉంటే చదవండి. కామెంటండి , నచ్చకుంటే వదిలేయండి. మళ్ళీ ఆ బ్లాగు తెరవొద్దు. ఇక్కడ ఎవరు ఎవరిని నిర్దేశించడం లేదు. ఎవరి రాతలు వారివే. ఎవరి కామెంట్లు వారివే. ఎవరి విజిటర్స్ వారివే.. అది గుర్తుంచుకుంటే చాలు. టెన్షన్ ఉండదు ఎవరికైనా..


ఇది నా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది..


Wednesday, May 27, 2009

సినిమా చూడవయా....ప్రతి మనిషికి అంతో ఇంతో వినోదం చాలా అవసరం. ఈ బిజీ బిజీ జీవితంలో పడి మునిగిపోకుండా ఉండడానికి అందరికీ వినోదం ఉండాలి..... అందులొ సామాన్య మానవుడి నుండి సంపన్నుడి వరకు ముఖ్యమైన వినోద వస్తువు సినిమా. టాకీ యుగం నుండి మూకీ, హైటెక్ యుగం వరకు ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. నలుపు, తెలుపైనా, రంగులైనా కూడా వివిధ కారణాల వల్ల సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కొన్ని ఏడిపిస్తె , కొన్ని నవ్వించాయి.మరి కొన్ని బాధించి పీడించి చంపేసాయి. తరాలు మారుతున్న కొలది సినిమా పోకడ కూడా మారుతూ వచ్చింది అని చెప్పవచ్చు. నరుడా ఏమి నీ కోరిక ? అన్నా, నిన్నొదల బొమ్మాలి అన్నా ప్రేక్షకులు అన్ని రకాల కథాంశాలు ఆదరించారు. ఏమాట కామాటే చెప్పుకోవాలి. అలనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో హీరో , హీరోయిన్ల అందం, చందం, ఈ నాటి కంప్యూటర్ గ్రాఫిక్స్ సినిమాలలో నటిస్తున్న లెక్కలేని ఎందరో హీరో, హీరోయిన్లలో లేదు అని ఘంటాపదంగా చెప్పవచ్చు. అందుకేనేమో ఈనాటి నటీనటులు ఐదారు సినిమాలకంటే ఎక్కువగా కనపడ్డం అరుదైపోయింది.

అప్పుడూ (కాస్త ఎక్కువ), ఇపుడూ (కాస్త తక్కువ) సినిమాలలో కొన్ని ఆణిముత్యాలున్నాయి. చెత్తరాజములు ఉన్నాయి.. కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అదే కొన్ని సినిమాలు ఎందుకొచ్చామురా అని విసుగొస్తుంది. మరికొన్ని ఐతే భరించలేక థియేటర్ నుండి వెళ్లిపోవాలనిపిస్తుంది మనం పెట్టిన డబ్బులు వృధా అనిపించినా కూడా ... కొన్ని సినిమాలైతే భయపెట్టేస్తాయి.. నాకు గుర్తున్నంతవరకు జానపద, పౌరాణిక సినిమాలు అంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం. అప్పుడైతే అర్ధరూపాయే టికెట్టు. అమ్మ కూడా నో అనేది కాదు. జానపద సినిమాలైతే కదలకుండా చూసేదాన్ని. ఇప్పటికి కూడా ఆ ఆత్రుత ఉంది. అప్పుడు తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్సుకత, ఇప్పుడేమో భలే ఉన్నాయే సినిమాలు అని.

ఇక శోభన్‌బాబు సినిమాలోకాన్ని రాజ్యమేలినప్పుడు ఆయన నటించిన ప్రతి సినిమా చూసేవాళ్లం. అర్ధమైనా కాకున్నా. మా నాన్నకు ( మాకు కూడా) ఆదివారం సెలవు కాబట్టి, ప్రతి శనివారం సెకండ్ షో తప్పనిసరిగా వెళ్లేవాళ్లం.. అప్పట్లో మార్నింగ్ షో కోసమైతే ఎన్ని తిప్పలో. వేసవి సెలవుల్లో అదే కాలక్షేపం మరి. అప్పుడు టీవీలు లేవుగా. 9 గంటలకు థియేటర్ వాడు గేట్ తీయగానే వెళ్లి లైన్లో నిలబడ్డం. ముందు పిల్లలంతా వెళ్ళి చెప్పులు లైన్లో పెడతారన్నమాట. మనిషికో చెప్పు గుర్తుగా, దూరం, దూరంగా పెట్టి, వాటిని గమనిస్తూనే (ఎవరూ దూరకుండా), పక్కన ఖాళీ స్థలంలో ఆడుకోవడం సరదాగా ఉండేది. టికెట్లు ఇవ్వడానికి సరిగ్గా పదిహేను నిమిషాల ముందు ఇంట్లో పనులన్నీ తీర్చుకుని పెద్దవాళ్లు వచ్చి పిలల్లతో పాటు చెప్పులు తీసి కాళ్ళకు తొడుక్కుని లైన్లో నిలబడతారు. ఇక కొందరు స్త్రీమూర్తులు ఉంటారు. యుద్ధం చేయడానికి వచ్చిన ఝాన్సి రాణీలే .. లైన్లో నిలబడకుండా మధ్యలో దూరిపోతారు. ఇక గొడవ , అరుపులు మొదలవుతాయి. ఒక్కోసారి జుట్లు పట్టుకుని కూడా కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మా ఇంటి దగ్గర థియేటర్లో ఒక సవరం ఎన్నొ నెలలు సైకిల్ స్టాండులో వేలాడదీసారు, సొంతదారులు వచ్చి తీసికెల్తారని. ఆ యుద్ధకాండ లో మనకు టికెట్ దొరికితే ఎంత సంతోషమో. అలా మార్నింగ్ షోలలోనే ఎన్నో మంచి సినిమాలు చూసాను. అప్పుడప్పుడు నేను, అమ్మ కలిసి హిందీ సినిమాలు చూసేవాళ్లం. ఎప్పుడైనా ఇంగ్లీషు సినిమాలు. సగం అర్ధమై , సగం అర్ధం కాకపోయేవి. చిన్న పిల్లలం కదా.

ఇక భయపెట్టిన సినిమాలంటే ముందు గుర్తొచ్చేది షోలే... రామక్రిష్ణా థియేటర్లో సెకండ్ షో. అసలే 70mm తెర.. నిజంగా ఆ సినిమా చూసి చలా భయపడ్డాను. గబ్బర్ సింగ్ అరుపులు. ఆ కొండలలో గుర్రాలు, దొంగలు, మ్యూజిక్. ఎన్నో నెలలు నా చెవుల్లో వినపడుతూనే ఉండేవి. ఎప్పుడైనా కార్లో దూరప్రయాణాలు చేస్తుంటే రాత్రి పూట కాని, నిర్మానుష్యంగా ఉన్నప్పుడు కాని, రోడ్డుకిరువైపులా ఉన్న కొండలు, చెట్ల వెనకాల నుండి గుర్రాల మీద దొంగలొస్తారేమో అని భయంతో వణికిపోయేదాన్ని. కళ్లు తెరిచి బయటకు చూస్తే ఒట్టు. ఊర్లొ కొచ్చి లైట్లు కనపడేవరకు బయటకు చూసేదాన్ని కాదు. ఇక పెద్దయ్యాక కూడా భయపెట్టింది అంటే Evil Dead ఇంగ్లీష్ సినిమా. అది కూడా ఇంట్లో చూస్తేనే. అరగంట చూడగానే వెళ్లిపోయి పడుకున్నా.. తెల్లారేవరకు నిద్రపడితే... మళ్లీ ఇంతవరకు ఆ సినిమా ఊసెత్తలేదు.

ఇక చూడ్డమే వేస్ట్ అనిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. మొదటిది అక్బర్ సలీం, అనార్కలి.. మ్యాటినీ షోకి మార్నింగ్ షో టైం కి వెళ్లి లైన్లో నిలబడి టికెట్లు తీసుకుని సినిమా చూస్తే పిచ్చెక్కింది. కొంచం తెలుగు, కొంచం ఉర్దూ, ఎంటేంటో గందరగోళంగా ఉండిండి ఆ సినిమా.. ఐనా భరించి మొత్తం చూసి వచ్చాం పిల్ల్లందరం. తర్వాత అంత విసుగొచ్చిన సినిమా "ఆహా" జగపతిబాబు నటించిన సినిమా. అరగంట సినిమా చూసాక ఒక్క ముక్కా అర్ధం కాలేదు, స్టోరీ ఏంటో, ఎందుకు పాటలు పాడుతున్నారో, ఏంటో ఆ డైలాగులు,, వెళ్లిపోదామని లేచాను కూడా, వెంట వచ్చినవాళ్లు బానే ఉంది కూర్చో అంటే తప్పనిసరై కూర్చుని నిద్రపోయా.. :)... అలాంటి అర్ధం కాని సినిమానే "జల్సా" అని మా అబ్బాయి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈ మధ్య టీవీలో వచ్చినప్పుడు కూడా నీకు దమ్ముంటే సినిమా చూసి నాకు కథ చెప్పు అన్నాడు. ఎందుకు రిస్క్ అని అటువైపు వెళ్లలేదు.. "అరుంధతి" కూడా బావుంది, చూడమని , టికెట్లు తెస్తానన్నా చూద్ధాంలే అని ఊరుకున్నా. వాడైతే తెగ భయపడ్డాడు ఆ అరుపులు, మ్యూజిక్ విని. నేను భయపడతానో లేదొ అని వాడి డౌట్. ఒకసారి సిడిలో చూద్దామని తీసుకొచ్చాదు. ఈ సినిమా గురించి అందరూ ఇంతలా చెప్తున్నారు. అసలు దీని కథేంటో చూద్దామని మొదలు, మధ్య, చివరలో పది నిమిషాలు చూసాను. చిరాకేసింది. అనూష్క నటన ఓకే. ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో వెగటు పుట్టింది. అంత భయంకరంగా చూపించాలా? గ్రాఫిక్స్ తో జనాలను భయపెట్టడమే ముఖ్య ఉద్ధేశ్యం అనిపించింది. వేస్ట్.. ... దశావతారం సగం సినిమా కమల్ హాసన్ ని వెతుక్కోవడమే సరిపొయింది. ఆ తర్వాత కథను, చివరలో అసలు సినిమా ఎందుకు తీసాడో అనే ఆలొచనతో బయటపడ్డాను.


కొన్ని సినిమాలు ఇంతకు ముందు చూసినా టీవీలో వచ్చినప్పుడల్లా కదలకుండా చూడాలనిపిస్తుంది. కొన్ని సంఘటనలు, పాటలు, కథాంశం చాలా బావుంటాయి. అస్సలు బోర్ కొట్టదు. అలాంటి కొన్ని సినిమాలు Mr. ఫెళ్లాం, సిరివెన్నెల, కొత్తది అంటే డీ మంచి కామెడీ ఉంది. , పాత సినిమాలు, వంశీ సినిమాలు ... ఇవి ఎప్పటికీ నిత్యనూతనాలే. మనస్సును ఆహ్లాదపరుస్తాయి. పెదవులపై మందహాసాన్ని చిగురింపజేసి ఉల్లాసపరుస్తాయి..

Thursday, May 21, 2009

పూర్ణిమకు పుట్టినరోజు శుభాకాంక్షలుతన ఊహలన్నీ ఊసులుగా మనకందించిన పుత్తడిబొమ్మ, పుస్తకాల పురుగు పూర్ణిమకు
                             పుట్టినరోజు శుభాకాంక్షలు.
We are missing you and your blog purnima. May God bless you... Keep smiling........

Sunday, May 17, 2009

ఒక ఆత్మీయ స్పర్శఅమ్మను మించి దైవమున్నదా... అందరిని కనేశక్తి అమ్మకొక్కటే ... అవతార పురుషుడైనా ఆ అమ్మకు కొడుకే..

ఇది సినిమా పాటలా ఉందా.. సినిమా పాటే... ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగుపెట్టి , అక్కడివారిని తనవారుగా చేసుకుని పిల్లలను కనిపెంచి పెద్దచేసిన అమ్మ అవసాన దశలో ఒంటరిదైతే.. పలకరించడానికి నా అంటూ ఎవరూ లేకపొతే .. ఎందుకు ఈ పిల్లలు , బంధాలు, అనుబంధాలు... ఈ పరిస్థితి అందరికీ రాదు కాని ఎవ్వరికీ రాదు అనలేము. తల్లితండ్రులను చివరివరకు దేవతల్లా చూసేవారున్నారు. తాము పెద్దవాళ్ళయ్యాక ఆ తల్లితండ్రులను పనికిరానివారిలా చూసేవారున్నారు, అలాగే చివరి దశలో ఉంది తమకు ఎటువంటి ఉపయోగం లేక అడ్డంకిగా ఉన్నా తల్లితండ్రులను వదిలేసే ప్రభుద్దులూ ఉన్నారు ఈ లోకంలో.. తమకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే ఆ తల్లితండ్రులు ముందే జాగ్రత్తపడేవారేమో.. కాని వారికి తమ పిల్లల మీద అలాంటి ఆలోచనే రాదు. ఇంటినుండి గెంతేసినా కూడా నా బిడ్డా అంటుంది తల్లి మనసు. ఇలాంటి కొందరు అనాధలైన అమ్మలకోసం ప్రమదావనం సభ్యులు తమ వంతుగా చిరు సాయం చేయడం జరిగింది.

నిన్న అంటే శనివారం 16-5-09 రోజు హైదరాబాదు BHEL నుండి పటాన్ చెరు వెళ్ళే మార్గంలో ఉన్నా బీరంగుడాలోని సాయి అనాధ ఆశ్రమానికి వెళ్ళాము. ఒక చిన్న ఇంట్లో నడుపబడుతున్న ఈ ఆశ్రమంలో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.అందరూ అరవైకి పైబడినవారే. అందరికంటే పెద్దావిడకి తొంభై రెండేళ్ళు ,కళ్లు కనపడవు. అందరికంటే చురుకుగా ఉంది నాకేమంత వయసైపోయింది, ఎనభై ఆరేల్లె కదా, ఇంకా చిన్నపిల్లనే అంటుంది ఓ అమ్మ. మాకోసం ఓ పాట కూడా పాడింది. వాళ్ల కోసం ఒక నెల భోజన సామగ్రి, బట్టలు, తువాళ్ళు, చెప్పులు, సబ్బులు ఇచ్చాము. అలాగే తాగడానికి కూల్ డ్రింకులు ఇస్తే చిన్న పిల్లల్లా సంతోషించారు. నిజంగా పెద్దవయసువారు, చిన్నపిల్లలది ఒకే మనస్తత్వం అన్నది అక్షర సత్యం. ఇంతమంది తమతో మాట్లాడ్డానికి ఎక్కడేక్కడినుందో వచ్చారు అని తెలియగానే మాట రాక ఒకటికి పదిసార్లు చేతులు జోడించి దండాలు పెట్టసాగారు. అలా దండం పెడితే మేము వెళ్లిపోతాము అని ప్రేమతో బెదిరిస్తే అలాగే వెళ్లొద్దు ఇలాకూర్చోండి అని తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు. మాకేం తెచ్చారు అంటే పళ్ళు, స్వీట్లు చాలా తెచ్చాము అంటే ఎంత మురిసిపోయారో.. ఆ ఆనందం ఎన్ని కొట్లిస్తే వస్తుంది.. ఎవరింటికి వెళ్ళినా అక్కడ చిన్నపిల్లలు ఉంటే ముందు మనం తినడానికి ఎం తెచ్చారా అని ఆత్రుతగా చూస్తారో, అలాగే ఈ వృద్ధ మహిళలు కూడా.. వాళ్లకు లంచ్ టైం అయినా కూడా మా అందరితో మాట్లాడాలి అని ఆకలిని కూడా పక్కనపెట్టారు. మేము తీసికెళ్ళిన వస్తువులు అందరికి సమానంగా ఇచ్చి , ఆ ఆశ్రమ నిర్వహణ ఎలా సాగుతుంది. ఏమేమి అవసరాలు ఉన్నాయో కనుక్కున్నాము.

అనాధలైన ఆ అమ్మలకు కావలసింది .. డబ్బులు కాదు.. అన్నిటికంటే వారు ఎదురు చూస్తున్నది ఒక ఆత్మీయమైన స్పర్శ కోసం. కొద్దిసేపు పక్కన కూర్చుని కబుర్లు చెప్తే చాలు. జీవితపు చరమాంకంలో వాళ్లకు అత్యవసరమైనది ఆత్మీయత. అది ఒక్కరోజైనా ఇవాలనే మా కోరిక నెరవేరింది. మళ్ళీ వస్తాము అని ప్రమాణం చేసి వచ్చాము. కాని అలా వెళుతున్నాము అని చెప్పగానే మా చేతులు పట్ట్టుకుని మంచిది బిడ్డా వెళుతున్నాము కాదు వెళ్లివస్తాము అనాలి అని కళ్ళలో నీరు తెచ్చుకున్నారు. ఒకావిడకు కళ్లు కనపడవు అయినా మా చేతులు పట్టుకుని తడిమి పరిచయం చేసుకుంది. నాకెవరూ లేరు బిడ్డా. కొడుకులు, అన్నలు, చెల్లెళ్ళు అందరూ పోయారు.నేను ఇలా ఉన్నాను.మళ్ళీ వస్తారుగా అని ఏడ్చేసింది. ఇక అక్కడి పసిపాప ఐతే మళ్ళీ వచ్చేటప్పుడు నాకేం తెస్తారు అని అడిగింది.. ఎం కావాలి పెద్దమ్మా అంటే .. కొంచం మిక్స్చర్ కావాలి అంది. సరే తప్పకుండా తీసుకోస్తాము . కాని నాకు అందరికంటే ఎక్కువ కావాలి అని మమ్మల్ని నవ్వించింది..సరే అని మాటిచ్చి .. మీరిక భోజనం చేయండి అని మేము తీసికెళ్ళిన పులిహోర, పెరుగన్నం ఇచ్చేసి , బరువెక్కిన మనసులతో తిరుగుప్రయాణం చేసాము.

ఇక తిరుగు ప్రయాణంలో మరో వృద్ధాశ్రమం సందర్శించాము. పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు నడిపించేది. అక్కడ కొద్దిసేపు గడిపి కొన్ని బట్టలు, మందులు కూడా ఇవ్వడం జరిగింది..


నా విజ్ఞప్తి..

ఈ యవ్వనం శాశ్వతం కాదు. ప్రతి వారు ముసలివారు కావాల్సిందే. తల్లితండ్రులైనా , ఎవరైనా వృద్దులైనవారిని ఆదరించండి. వారికి కావలసింది మీ ఆస్తిపాస్తులు కాదు. పట్టెడన్నం, పిడికెడు ప్రేమాభిమానాలు. అవసాన దశలో వారు ఎదురుచూసేది, అవసరమైనది, వారిని బ్రతికించేవి అవే.. మర్చిపోవద్దు..

Wednesday, May 13, 2009

అద్భుత స్వర సునామీ ...


శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానం రసం ఫణిః

గానానికి పులకరించని, పరవశించని ప్రాణి కలదే ఈ జగాన. గానం అనగానే ఎంతో విజ్ఞానం, స్వర మాధుర్యం, ప్రత్యేకమైన ప్రతిభ, పూర్వజన్మ సుకృతం ఉండాలి అనుకునేవారు ఎందరో . సంగీతాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే సంగీతం నేర్చుకుని ఉండాల్సిన పనిలేదు. ఏ భాష ఐనా సరే, స్వర మాధుర్యం, సంగీతం మనకు వీనుల విందు చేసి పరవశుల్ని చేస్తుంది. మధురమైన సంగీతానికి, లేదా పాటలకు మన మనస్సును ఆధీనంలోకి తీసుకుని బాధలను మరపింపచేసి ఓదార్చే గుణముంది. అది సినిమా సంగీతమైనా, వాద్య సంగీతమైనా, శాస్త్రీయ సంగీతమైనా సరే .. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సంగీతం నచ్చుతుంది. కాని అందరికి నచ్చేది అన్నమయ్య పదాలు లేదా పాటలు. అదేంటి కీర్తనలను పాటలు అంటున్నా అనుకుంటున్నారా.. కాదండి. కీర్తనలు అంటే శాస్త్రీయ సంగీతం తెలిసినవాళ్లే అర్ధం చేసుకోగలరు, పాడగలరు. కాని పాటలు భాష తెలిసిన ప్రతి ఒక్కరు పాడుకోగలిగే, అర్ధం చేసుకోగలిగే సులభమైన , అందమైన పదాలతో కూడి ఉంటాయి. కాదంటారా.. అలాటి అన్నమయ్య కీర్తనలను ఒకేచోత లక్ష గళాలలో ప్రతిద్వనించాలని సంకల్పం జరిగింది. దీనికి ముఖ్య సూత్రధారులు సిలికానాంధ్ర, టిటిడి, సాంకేతిక శాఖ. సంకల్పానికి తోడు ప్రతిస్పందన ఉందాలి. అది అద్భుతమైన, అద్వితీయమైన రీతిలో లభించింది.


ఇది ఒక రాయకీయ నాయకుడి సభ కాదు, సినిమా ఫంక్షన్ కాదు, సన్మాన సభ కాదు. జనాలను సమీకరించలేదు. డబ్బులిచ్చి లారీలలో తోలుకురాలేదు. ప్రతి ఒక్కరు స్వచ్చందంగా వచ్చారు. లక్ష మంది వస్తారో రారో అన్న సంశయం అందరికీ ఉండింది. కాని అది లక్షన్నర దాటింది. ఇది ఎలా లెక్కించారంటే ఆ సభా ప్రాంగణంలో వేసింది లక్ష కుర్చీలు . కాని అవన్నీ నిండిపొయి , ఇంకా ఎక్కువమంది అభిమానులు వచ్చారు. వీళ్లందరు ఒక రికార్డు సృష్టిద్దామని మాత్రమే రాలేదు. అన్నమయ్య పదాలతో ఆ వేంకటేశ్వరుని కీర్తించి ధన్యులమవుదాము అన్న కోరిక మాత్రమే అక్కది జనాలలో కనిపించింది. ఎందుకంటే ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్నవారు 3 ఏళ్ల నుండి 90 దాటినవారు కూడా ఉన్నారు. అందరూ గొంతు కలిపారు. ఇందులో సగం మంది కూడా శాస్త్రీయ పరిజ్ఞానం లేనివారే. సంగీతపరంగా సామాన్యులే అని అర్ధమైంది. వీరందిరికి స్వర సారధ్యం వహించింది శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. నాయకుడు అన్నప్పుడు వేదికపైనే ఉండాలి. అతని ముందు మైకు పెట్టారు కాబట్టి టీవీలలో ఆ గొంతే వినిపించింది. కాని పాడినవారి స్వరప్రభంజనం ఒక సునామీలా వెల్లువెత్తింది అని ప్రత్యక్షంగా పాల్గొన్నావారికే అనుభవం .. ఎక్కడో కొందరు మాత్రం దిక్కులు చూస్తూ ఉండిపోయారు.


నేను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంత ప్రయత్నించినా వీలుపడలేదు. బహుశా ఆ శ్రీనివాసుడి అనుమతి లేదేమో. కాని ఇంట్లో ఉండే ఆ మహాస్వర యాగంలో పరోక్షంగా పాల్గొన్నాను. అందరితో పాటు గొంతు కలిపాను.అది చాలు. నాకు పాడే అలవాటు లేదు. అన్నమయ్య కీర్తనలంటే చాలా ఇష్టం. అందుకే రాత్రి 7 నుండి 7.45 వరకు సాగిన ఈ లక్షగళ సంకీర్తనలో ఆ సప్త సంకీర్తనల భావ ప్రవాహంలో మునిగిపోయాను. నిజంగా ఆ సమయంలో ఒళ్లంతా విద్యుత్తు ప్రవహించినట్టుగా అనిపించింది. ఇంత అద్భుత గానం విని నా జన్మ ధన్యమైపోయింది. ఈ తృప్తి, ఆనందం తిరుపతిలో లో లక్షలు పెట్టి పూజలు, ఉత్సవాలు చేయించినా రాదు అని చెప్పగలను.


ఆరోజు ఆలాపించిన సప్త సంకీర్తనలు వరుసగా ఇదిగో...


భావములోనా బాహ్యమునందు
బ్రహ్మ కడిగిన పాదము
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన
పొడగంటి మయ్యా
కొండలలో నెలకొన్న
నారాయణతే నమో నమో
ముద్దుగారే యశోద

Sunday, May 10, 2009

అమ్మ


అమ్మ గురించి చెప్పదానికేముందు అదొక అద్భుతమైన వరం. అందరూ చెప్పారు . నేను మాత్రం ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను.

అమ్మల్లారా : పిల్లలను ప్రేమతో పెంచండి.. చదువు వగైరా అన్నీ చెప్పించండి. అలాగే చిన్నప్పటినుండే బాధ్యతలు కూడా నేర్పించండి. ఎప్పుడు చేయిపట్టుకుని చేయకుండా వాళ్లు సొంతంగా చేసుకునేలా తయారు చేయండి. అవసరమైనప్పుడే మీ చేయూతనివ్వండి. పెద్దయ్యాక కూడా ప్రతిదానికీ మీ మీద ఆధారపడనివ్వకండి.. ఆ తర్వాత మీరు వాళ్ల మీద ఆధార పడవద్దు. చదువు, ఉద్యోగం పెళ్లి అయ్యాక కొడుకులు , కూతుళ్ళ జీవితాల్లో మన ప్రమేయం ఉండకూడదు. వాళ్ల ఇష్టమొచ్చినట్టు చేసుకోనివ్వాలి. అసలు ఆ చింతే మనకు వద్దు. ఎవరి జీవితం వారిష్ట మొచ్చినట్టు ఉంటారు. అవసరమైనప్పుడే మనము ముందుకు రావాలి. ఒక బాధ్యత తీర్చుకున్నాక తప్పుకోవడమే మేలు. లేదంటే అనవసరంగా గొడవలు...మనస్పర్ధలు.. బాధలు ఎందుకు??? కొడుకులు మనము పున్నామ నరకం నుండి తప్పిస్తారనో, ముసలితనంలో చేరదీస్తారనో అసలు ఎదురు చూడొద్దు. ఆ ఆలోచనే మంచిది కాదు. దాని గురించి మనమే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. కోపం వద్దు అమ్మల్లారా.. మనమూ మారాలి..


పిల్లలారా : మీకు చిన్నప్పటినుండి అమ్మ కంటికి రెప్పలా చూసుకుని అన్ని దగ్గరుండి నేర్పిస్తుంది. పెద్దవాల్లయ్యాక అమ్మ కాని , నాన్న కాని ఏదైనా మాట అంటే మీకు నచ్చాడు. మీకేమీ తెలియదు, అనవసరంగా కలగచేసుకోవద్దు అంటారు. ఒకే .. కాని మీకు అవసరమొచ్చినప్పుడు , సేవలు చేయడానికి అదే అమ్మా ఎందుకు కావాలి? మీకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవాలంటే అక్కరలేని అమ్మా మీ భార్యా పిల్లలకు సేవలు చేయడానికి మాత్రం కావాలి. జీతం బత్తెం లేని నమ్మకమైన పనిమనిషి కావాలిగా.. అసలు అమ్మా పెళ్లి చేసుకుని వచ్చింది మీకు చచ్చేదాకా సేవలు చేయడానికి మాత్రమేనా. చిన్నపిల్లలు అని మీ అవసరాలు తెలుసుకుని అమర్చిపెడుతుంది. కాని మీ పనులు మీరు చేసుకోగలిగినపుడు కూడా అమ్మా ఎందుకు పని చేయాలి. నువ్వు కూర్చో మేము చేస్తాం అనే మాట వస్తుందా. కాస్త వయసు ముదిరితే తల్లితండ్రుల మాటలు అర్ధం లేనివిగా ఉంటాయి. వారితో గడిపే టైం ఉండదు. అందుకే ... బలవంతంగా అమ్మా నాన్నలను చూడాలి అనే ఆలోచన మానుకోండి.. మీ జీవితం మీరు చూసుకోండి.. వారి మానాన వారిని వదిలేయండి..

వింతగా ఉంది కదూ ఈ మాటలు. కాని ఈ రోజుల్లో అందరు అమ్మలు ఇలాగే ఆలోచించాలి. పిల్లలను చదివించి, పెళ్లి చేసి వదిలేయాలి. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో మన ప్రమేయం ఉండకూడదు.ఏమంటే మీకేమి తెలీదు అంటారు. ఎందుకు ? ఇవన్నీ అవసరమా?? అవసరమున్నప్పుడే మనం అడుగు ముందుకేయాలి. లేదంటే మన పని మనం చూసుకోవడం మేలు. ఇది బయటివాల్లతో కాదు.మన పిల్లలతో కూడా ఇదే విధంగా ఆలోచించాలి .. ఎన్నో కుటుంబాలలో చూసిన గొడవల మూలంగా నేను ఈ నిర్ణయానికొచ్చాను. ఏదో మీకు సలహా ఇస్తున్నాను. దీనికి పన్ను ఉండదు కదా. ఉచిత సలహా అన్నమాట .. అమ్మమాట..


ఈరోజు మరో ప్రత్యేకత ఉంది.. గత సంవత్సరం ఇదే మదర్స్ డే రోజు ప్రమదావనం మొదలైంది.. ఎక్కడో ఈ ఊరో తెలీకుండా బ్లాగుల్లో కామెంట్ల ద్వారా పరిచయాలు కలిగిన మహిళా బ్లాగర్లు ప్రమదావనం అనే వేదిక మీద ఒకేసారి కలవడం మొదలైంది. అది దినదినప్రవర్ధమానమై ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టింది. మరి కొన్ని చేయడానికి సర్వసన్నద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రమదావనం సభ్యులందరికీ శుభాకాంక్షలు..


ఈ రోజు మహిళా బ్లాగర్లు " అమ్మా" అనగానే కలిగే స్పందనను తమదైన విభిన్న శైలిలో మన కళ్ళ ముందుంచారు. అన్నీ ఒక్కచోట ఇదిగో..

సాహితి
సురుచి
అంతరంగ తరంగాలు
మకరందం
చైతన్యం
జాజిపూలు
పరిమళం
ప్రియదర్శిని
ఇట్లు నీ నేస్తం
రమ్యంగా కుటీరాన
జాహ్నవి
మధురవాణి

Monday, May 4, 2009

భలే మంచి రోజు...

భలే మంచి రోజు...
పసందైన రోజు...
May 18,, రోజు
సి.ఎం గా ప్రమాణం చేసే రోజు..

ఇదేంటి అని కంగారు పడుతున్నారా. ఇంకా ఓట్ల లెక్కింపు కాలేదు. ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో తెలిదు. ఎవరు గెలిచారో తెలిదు. అప్పుడే ప్రమాణస్వీకారానికి ముహూర్తం పెట్టేసారేంటి అంటారా?? .. పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టుకుందంట వెనకటికెవరో అమాయకపు అతివ.. ఇపుడు మన రాజకీయ నాయకుల పరిస్థితి, ప్రవర్తన అలాగే ఉంది..

నిన్న నవ్వుల రోజు అని తెలిసి, ఓహో అని ఊరుకున్నా. నవ్వు అనేది బలవంతంగా తెచ్చుకుంటే రాదు. దానికి ఏదో ఒక కారణం, సందర్భం ఉండాలి. మన మూడ్ బాగోకుంటే ఎంత మంచి విషయమైనా సరేలే అని ఊరుకుంటాం.లేదంటే ఒక చిన్న మందహాసం వదిలేస్తాం. ఈ మండే ఎండలు, రోజు వారి తలనొప్పులు , సాధకబాధకాలతో నవ్వులరోజు కదా అని నవ్వండి అంటే ఎలా?? అది అలా రమ్మంటే వస్తుందా.. మన మూడ్ బాగుంది. ఒక మంచి సంఘటన, చూసినా, ఏదైనా మంచి విషయం గుర్తొచ్చినా సంతోషం నవ్వు రూపంలో మనసునుండి అలలుగా కదులుతూ కళ్ళలోకి వస్తుంది. అక్కడినుండి పరవళ్ళు తొక్కుతూ బుగ్గల మీదుగా పెదవుల పైకి వస్తుంది. అది ఉధృతి పెరిగితే పెదవులను విడదీసి, పెద్దగా నవ్వుకునేలా చేస్తుంది. మనలోని మౌనాన్ని, బాధను పక్కకు గెంటి హాయిగా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది నవ్వు. అందుకే అన్నారు పెద్దలు నవ్వనివాడు రోగి , నవ్వేవాడు భోగి అని. నవ్వులను పంచేవాడు మహాయోగి.. ఎక్కడినుండిఎక్కడినుండి ఎక్కడికొచ్చాను అనుకుంటున్నారా?? ఆగండాగండి. ఈ ముందు మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. నిన్నంతా పని ఎక్కువై (ఆదివారం కదా), వేసవి వేడి, చికాకుగా ఉన్నాను. నవ్వులరోజు అని టీవీలో చూసి ఎంతో మంది విరగబడి నవ్వుతుంటే నాకీ ఆలోచన వచ్చింది. రాత్రి వార్తలలో (ఎ చానెల్ అని అడగవద్దు. ఎ చానెల్ చూసినా ఒకే వార్తా కదా. కాస్త అటు తిప్పి , ఇటు తిప్పి చూపిస్తారు) చూస్తుంటే మన ప్రియతమ నాయకులు ముగ్గురు అప్పుడే తమ పార్టీ గెలిచేసింది. ప్రమాణస్వీకారానికి మంచి ముహూర్తం కూడా నిర్ణయించేసుకున్నారు పండితులను సంప్రదించి. ఔరా!! ఎంత ధీమా!! ముగ్గురూ ప్రమాణస్వీకారం చేస్తా అంటే ఎలా మరి?? ఉన్నది ఒకే సి.ఎం కుర్చీ. ముగ్గురు పట్టరుగా?. ఆంతా వాళ్ళే నిర్ణయించేసుకుంటారా?? మరి ఓటేసిన వాళ్ల సంగతి ??? ఇది వినగానే నాకు పగలబడి నవ్వాలనిపించింది. కాని కాస్త చిన్నగానే నవ్వేసానులెండి.

అసలే ఆర్ధిక మాంద్యం. కాని ఈ నాయకులకు ప్రచారానికి కోట్లు ఎక్కడివి?? ఎక్కడో ఏదో ఆఫీసులో ...ఐదువేలు లంచం తీసుకున్నాడని పట్టుకున్నారోచ్ అని పేపర్లో వేస్తారు, టీవీలో చూపిస్తారు.మరి ఈ నాయకుల ఖర్చులకు లెక్కలు ఎవరు అడగాలి. ఒక్కో టిక్కెట్టు కోట్లకు అమ్ముకుంటున్నవారు, అమ్ముకున్నవారు ముందు ముందు ఎన్ని కోట్ల కోట్లకు ఎసరు పెట్టారు?? ఇపుడు ఖర్చుపెట్టారు, తెగ తిరిగారు, ఎండనకా, వాననకా కష్టపడ్డారు (పాపం ) . గెలుస్తామని ఎంతో ధీమాగా ఉన్నారు. ఎందుకు?? ఈసారి ముఖ్యంగా మహిళలను బుట్టలో వేయడానికి శాయశక్తులా ప్రయత్నం చేసారు..అందుకేనేమో? ఏమో? గుర్రం ఎగరావచ్చు. ఒకరేమో ఇళ్లిస్తాం, లక్షాధికారులను చేస్తాం అంటే, ఒకరు ఇంట్లో కూర్చుంటే పని చేయకున్నా నెలకు డబ్బులు మీ (ఆడాళ్ళ) అకౌంట్లో డబ్బులేస్తాం అన్నారు. అవి నిజంగా ఇస్తారా?? ఎందుకంటే ఇంతకుముందు గెలిస్తే విద్యుత్తు ఉచితం అన్నారు, మొదటి ఫైలు అదే సంతకం చేసారు . బాగు బాగు. కాని ఆ సంబడం ఒక బల్బు కరెంట్ కు మాత్రం అని తర్వాత అందరి ఫ్యూజు పోగొట్టేసింది. మరి ఇపుడు ఏమవుతుంది?? అన్ని వస్తువుల ధరలు ఎండలతో సమానంగా పేలిపోతున్నాయి. అవి ఎవ్వరికీ పట్టింపు లేదు. హాయిగా ఎపుడు గద్దేనేక్కుదామా అని లెక్కలేస్తున్నారు. అన్ని ఐపోయాయి. ఇపుడు జ్యోతిష పండితులకు భలే గిరాకీ ఉన్నట్టుండి చూడబోతే..:)..

ఇంతకీ ఓటర్లకు, ఒట్లడుక్కునే నాయకులకు ముంబాయి సంఘటనా గుర్తుందా ??.. మళ్ళీ ఇంకోటి జరుగుతుందని ఎదురుచూద్దామా.. ...

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008