Tuesday, August 14, 2012

ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావ్?


ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావ్?


రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికొచ్చాడు రమేష్. ఆ సమయానికి నిశ్శబ్దంగా ఉండే ఇల్లు గోలగోలగా ఉంది. పిల్లలు స్కూలు డ్రెస్‌లు కూడా విప్పకుండా హాల్లో టీవీ చూస్తున్నారు. పెద్దాడు టీవీలో క్రికెట్ చూస్తున్నాడు. చిన్నది కార్టూన్స్ చూస్తానంటూ వాడి చేతిలో రిమోట్ లాక్కోవాలని చూస్తోంది. స్కూలు బాగులు, బూట్లు, సాక్సులు అటూ, ఇటూ గిరాటేసి ఉన్నాయి.


‘రజనీ..’ అని భార్యను పిలుస్తూ కిచెన్‌లోకి వెళ్లాడు. కిచెన్ కూడా యుద్ధం జరిగినట్టుగా బీభత్సంగా ఉంది. పనిమనిషి కడిగి పెట్టిన గినె్నలు స్టాండులో అలాగే ఉన్నాయి. జంతికలు, కారప్పూస డబ్బాలు పొయ్యి పక్కన మూతలు తీసి ఉన్నాయి. కిచెన్ అరుగుమీదా, కిందా కొన్ని పడున్నాయి. అసలు ఇల్లంతా ఇలా ఎందుకుంది? అనుకుంటూ అయోమయంగా బెడ్‌రూంలోకి వెళ్ళాడు భార్యను పిలుస్తూ. అక్కడి దృశ్యం చూశాక అతనిలో కోపం పెరిగిపోయింది. మంచం మీద దుప్పట్లు మడత పెట్టకుండా అలాగే ఉన్నాయి. సైడ్ టేబుల్ దగ్గర తాగి పెట్టిన కాఫీ కప్పుమీద ఈగలు ముసిరి ఉన్నాయి. విడిచిన బట్టలు కుర్చీ మీద పడున్నాయి. ఒక్క క్షణం.. అసలిది రోజూ చూసే తనిల్లేనా? అని సందేహపడ్డాడు.


ఆఫీసు నుంచి వచ్చే సరికి అద్దంలా నీట్‌గా ఉండే ఇల్లు ఇవాళ ఇలా ఎందుకయ్యింది? రజనీ ఇంట్లో లేదా? ఇల్లు సర్దకుండా, పిల్లలను వదిలేసి ఎక్కడికి వెళ్లింది? అనుకుంటూ గట్టిగా అరిచాడు ‘రజనీ’ అంటూ.

పక్కనే బాల్కనీ నుండి వచ్చింది అతని భార్య ఏమిటీ అంటూ..

‘‘ఏంటి.. ఇది ఇల్లేనా? ఏం చేస్తున్నావ్?’’

‘‘మీరు రోజూ అంటారుగా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావని.. ఈ రోజు ఏమీ చేయలేదు’’ అంది ప్రశాంతంగా..
ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్..?- అంటూ మళ్లీ భర్త ఆగ్రహం

... ఇలాంటి మాటలు వినపడని ఇల్లు ఉండదేమో? ఆడవాళ్ళు అందునా ఉద్యోగం చేయని, ఇంట్లోనే ఉండే గృహిణులను ఉద్దేశించి ఈ మాట అలవాటైపోయింది. ఎంత అలవాటైనా కూడా ఒకోసారి కోపమొస్తుంది. అసలు ఇంట్లో ఉండే ఇల్లాల్లు చేసే పని ఒక రకానికి, ఒక నిర్ణీత సమయానికి పరిమితమై ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇరవై నాలుగ్గంటలూ అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి అన్నీ సమకూర్చాలి. ఐనా కూడా గృహిణుల శ్రమకు గుర్తింపు లేదనే చెప్పవచ్చు. అసలు ఇంట్లో ఇల్లాలు చేసే పని, చేస్తే చేసినట్టు కనిపించదు. చెయ్యకపోతే రోజు గడవదు. ఐనా కూడా గుర్తింపు ఉండదు. ఎవరూ అయ్యో అనరు. ఉద్యోగాలు చేసే ఆడవారికి తాము చేసే పని నిర్దిష్టమై ఉంటుంది. వాళ్లు అంతవరకే పని చేస్తారు. కానీ గృహిణులు మాత్రం లేని పనిని వెతుక్కుని మరీ పూర్తి చేస్తారు. ఇంకా సమయం మిగిలితే కుటు,్ల అల్లికలు వగైరా ఉండనే ఉన్నాయి. భర్త, పిల్లలు కూడా అనుకుంటారు. తాము వెళ్లిపోయాక ఆడాళ్లు ఇంట్లో ఉండి ఏం చేస్తారు? తొందరగా ఇల్లు సర్దేసి టీవీ చూడ్డమో, ఫోన్‌లో ముచ్చట్లు పెట్టడమో, పడుకోవడం చేస్తారు. వాళ్లకేం పనుంటుంది అని..! ఎంత పని మనిషి ఉన్నా కూడా ఇల్లాలు ఒక్క రోజు ఏమీ చేయకుండా ఉంటే పైన చెప్పినట్లుగా ఉంటుంది ఇల్లంతా.


పాత రోజుల్లోకంటే ఇప్పుడు ఉద్యోగాలు చేయని ఆడవాళ్లు చేసే పనులు చాలా పెరిగాయి. మగవాళ్లు చేసే పనులు కూడా వాళ్లే చేస్తున్నారు. కరెంట్, టెలిఫోన్, ఇంటర్‌నెట్ బిల్లులు కట్టడం, ఎప్పటికప్పుడు ఆస్తి పన్ను, బీమా చెల్లింపులు, పిల్లల స్కూలు విషయాలు మొత్తం చూసుకుంటారు. పొద్దునే్న పిల్లలను తయారుచేసి టిఫిన్ కట్టి స్కూలుకు పంపడం వరకే కాదు, వాళ్ళచేత హోం వర్క్ చేయించడం, క్లాస్ టీచర్‌తో మాట్లాడడం, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం మొదలైనవి సంతోషంగా చేస్తారు. పిల్లల చదువులోనే కాకుండా ఆటలు, కళలు కూడా నేర్చుకోవాలని వాళ్ల వెంట ఉండి స్విమ్మింగ్, సంగీతం, నాట్యం క్లాసులకు తీసుకెళ్తున్నారు. ఇక వారాంతం రాగానే ఉద్యోగాలు చేసే పిల్లలైనా, భరె్తైనా అలసిపోయాం.. రెస్ట్ కావాలి.. ఎంజాయ్‌మెంట్ కావాలంటారు. పండగలొచ్చినా ఆవిడకే పని పెరుగుతుంది. మగవాళ్ళకేంటి డబ్బులు పెట్టి సామాన్లన్నీ తెచ్చి ఇంట్లో పడేస్తారు. కాని అసలైన పని ఆ తర్వాతే ఉంటుంది. ఆ నెల సరుకులు జాగ్రత్తగా భద్రపరచాలి. చిరుతిళ్లు చేసినా అవి పాడవకుండా, పారేయకుండా చూసుకోవాలి. బెడ్‌షీట్లు, పరదాలు మార్చాలి, కొత్తవి కొనాలి. ఇంకా కాస్త టైమ్ ఉంటే తినడానికి ఏమైనా చేసి పెట్టాలి. అప్పుడప్పుడు వచ్చే చుట్టాలు, వాళ్లకు చేయాల్సిన మర్యాదలు.. ఇలా ఎన్నో పనులు ఉంటాయి. అలాగని ఇంట్లో ఉన్న ఆడవాళ్లందరూ ఇన్ని పనులు చేస్తున్నారని కాదు. మధ్యతరగతికి చెందిన ప్రతి ఇల్లాలి దినచర్య ఇలాగే ఉంటుంది.


ఇంతకుముందైతే- సంపాదన మగవాడి బాధ్యత. ఇంటిని, భర్త, పిల్లలు, చుట్టాలు అందరినీ చూసుకోవడం, ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకోవడం ఇల్లాలి బాధ్యతగా ఉండేది. కాని ఇప్పుడలా కాదు. ఇద్దరూ సంపాదించక తప్పదు. బయటకెళ్లి ఉద్యోగం చేసే వీలు లేనప్పుడు ఎందరో ఆడవాళ్ళు ఇంట్లో ఉండే చిన్న చిన్న వృత్తులు, హాబీలతో కుటుంబ నిర్వహణకు తమ వంతు సాయం చేస్తున్నారు. ఐనా కూడా అందరికీ చాలా సులువుగా వచ్చే మాట ‘‘ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్’’ అని. ఈ మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఉండే ఇల్లాలు ఒక్క రోజు ఏమీ చేయకుండా ఏలా ఉంటుందని..?

Thursday, August 2, 2012

మాలిక పత్రిక శ్రావణపౌర్ణమి సంచిక విడుదల

అందరికీ శ్రావణ (రాఖీ) పౌర్ణమి శుభాకాంక్షలు..

మాలిక పత్రిక శ్రావణపౌర్ణమి సంచిక విడుదలైంది.. http://patrika.maalika.org/  
మరో ముఖ్యమైన వార్త... మాలిక పత్రిక ఇక రెండు నెలలకోసారి పత్రిక విడుదల అవుతుంది. మాలిక పత్రిక టీమ్ లో మరో ఇద్దరు కొత్తసభ్యులు చేరుతున్నారు.. డా. రాజశేఖర్ ( ఏక్టర్ కాదులెండి.. ఈయన ఖరగ్ పూర్ IITలో ప్రొఫెసర్ ) మరియు రాజ్ కుమార్ ఆదూరి ( ఈయన చెన్నై లో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ).. స్వాగతం రాజశేఖర్, రాజ్ కుమార్ గార్లకు.. 
మాలిక పత్రికకు మీ రచనలు పంపవలసిన చిరునామా : editor@maalika.org


ఈ సంచికలోని అంశాలు:

0. సంపాదకీయం: అసలు తప్పెవరిది? 

1.  ప్రమోషన్లు… పరీక్షలు

2. ఔను ….నేను కూడా మామూలు మనిషినే

 3.  ద్వాదశాళ్వారులు…..

 4.  జ్యోతి..

 5. నిత్య సత్యాలు – ఆణి ముత్యాలు

 6.  ఊహకి వాస్తవానికి మధ్య పూల వంతెనలు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారి కధలు

 7.  సినీమా(ట)ల తూటాలు.

 8.  పదచంద్రిక – 7: రూ. 1000 బహుమతి

9.  భారత జాతీయ సైన్యం (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) ముస్లిం పోరాట యోధులు

10. మెడ పట్టినదీ – కనిపెట్టినదీ

11. వాసిష్ఠ చెప్పిన విచిత్ర కథలు – జనస్థానం

12. నాకు నచ్చిన పుస్తకం

13. రంగాజమ్మ…

 14. అమ్మ భాషలో వాదిస్తే గెలుపు ఖాయం

 15. జీవుడే దేవుడు

 16. అంచనా వెయ్యకు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008