Sunday, November 30, 2008

ఈ ప్రకృతి మన కోసమే

ఉదయాన్నే లేలేత భానుడి కిరణాల స్పర్శ తనువంతా ఎంత ఉత్తేజం నింపుతుందో కదా! అలసిన శరీరాన్ని, మనసుని నిన్నటి రేయి తన మాయాజాలంతో మటుమాయం చేస్తే.. కొంగొత్త ఉత్సాహం నరనరానా నిండేలా సూర్యోదయం అందించే అనుభూతిని వర్ణించడానికి మాటలు తమ వల్ల కాదంటూ చేతులెత్తేయవూ..? వెన్నెల రాత్రులూ స్పందించే హృదయాలను ఎంత మైమరిపింపజేస్తాయో కదా! కలత చెందిన మనసూ, అలా వెన్నెల వైపు చూస్తే క్షణాల్లో స్వాంతన లభించడం కొందరికి అనుభవైకవేద్యమే. అంతెందుకు పూలకుండీలో విచ్చుకున్న గులాబీ కూడా మనకోసమే ఎదురు చూస్తున్నట్లు చిరునవ్వుతో పలకరిస్తుంటే అదేమీ పట్టనట్లు సాగిపోతే ఆ బాధతో అది ముడుచుకుపోదూ..? గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని చూడండి... అవి ఏ రకంగానూ మనకు ఉపయోగపడకపోయినా తమ పచ్చదనంతో మనలో ఆశల్ని చిగురిస్తాయి. ప్రకృతి ఎప్పుడూ మనల్ని వెన్నంటే ఉంటోంది... కానీ దాన్ని ఆస్వాదించగలిగే రసహృదయమే మనిషిలో కొరవడుతోంది. జీవితంతో పోరాడడానికి మనసుని రాయిచేసుకుని సహజస్పందనలను నిర్ధాక్షిణ్యంగా తొక్కిపెట్టే మనకు ప్రకృతి గురించి ఆలోచించే తీరికెక్కడిది. మన బాధలను, బడలికలను ఉపశమింపజేయడానికి అది స్నేహహస్తం దాచినా అందుకునే మనసెక్కడుంది మనలో! ఇరుకు గదుల్లో, ఏసి చల్లదనానికి అలవాటు పడిన ప్రాణం శీతాకాలపు సహజసిద్ధమైన చల్లదనంలో ఉన్న స్వచ్ఛతని ఎక్కడ గుర్తించగలుగుతుంది? జీవించడానికి, జీవితంలో మన ఉనికిని నిలబెట్టుకోవడానికి పరిగెడుతున్నాం మనం! ఆ హడావుడిలో ప్రకృతిని ఆస్వాదించగలిగే తీరుబడి కూడానా! అలా కుండీ నుండి పరిమళాలను వెదజల్లే మల్లె వాసనల్ని ఆఘ్రాణించవచ్చునన్న ఆలోచనే మనకెప్పుడూ కలగదు. పచ్చదనాన్ని నింపుతూ అల్లుకున్న మనీప్లాంట్ ని చూడమంటే .. "ఇంకేం పనిలేదా" అని మొహం చిట్లించుకుని మన పనిలో పడిపోయే బాపతు మనం! ఇంకెక్కడి రసాస్వాదన? ఈ ప్రకృతి మన కోసమే, మనతో మమేకమై ఉంది. ఈ బిజీ జీవితాల్లో దాని విలువని మనం గుర్తించలేకపోతున్నాం. ఇంటి ముందు చిన్నపాటి గార్డెన్ ఉన్నా దాన్ని పెకలించి మరో గది వేసి ధనార్జన చేద్దామన్న స్వార్ధం మనల్ని కమ్ముకుంటోంది. మనకు ఆహ్లాదం పంచడానికే పచ్చదనాన్ని కప్పుకుని సింగారించుకునే మొక్కలే కాదు సూర్యోదయపు కిరణాల స్పర్శా, చంద్రుడి వెన్నెలా.. చల్లదనంతో గమ్మత్తైన అనుభూతిని కలిగించే మంచుబిందువులు, వర్షపు చినుకులూ.. కిలకిలమంటూ పలకరించే పిట్టలూ, ఏవీ మనల్ని కదిలించలేకపోతున్నాయి. మన చుట్టూ అదో ప్రపంచం ఉందన్న విషయమే ఎప్పుడో బాల్యంలోనే మర్చిపోయాం. మన పలకరింపు కోసం ఆర్తితో చూసే ప్రకృతిని ఆస్వాదిస్తే బాగుంటుంది కదా!!

మీ

నల్లమోతు శ్రీధర్.

Saturday, November 29, 2008

మీరు ఎ మాత్రం ఆనందంగా ఉన్నారు???


ఒక్కసారి ఆలోచించండి మీరెంత ఆనందంగా న్నారో???

అమరవీరులకు అశ్రునివాళి


సుమారు అరవై గంటల పాటు ఉగ్రవాదులతో జరిపిన పోరాటం ముగిసింది. రెండు రోజులుగా ఆ దృశ్యాలు చూస్తూ మనసు మొద్దుబారిపోయింది. ఎం మాట్లాడాలో. ఎలా స్పందించాలో అర్ధం కాలేదు. ఎంతో పటిష్టమైన ప్రణాళికతో , భారీ ఆయుధ సామగ్రితో వచ్చి దాడి చేసిన ముష్కరులను మన సైనికులు ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. వాళ్ళను చూస్తుంటే అనిపించింది... ఎంత ధైర్యంగా పోరాడుతున్నారు. రాత్రి లేదు, పగలు లేదు, చలి లేదు, ఆకలి గుర్తు రాదు. ఉగ్రవాదులను మట్టుపెట్టడమే తప్ప వేరే ఆలోచన లేదు. వాళ్లు రక్షించాల్సింది ఉత్తర భారతీయులా, దక్షిణ భారతీయులా, భారతీయులా, విదేశీయులా, తెలంగాణా, మాదిగా , అని అనుకోరు కదా. సినిమాలలో మాత్రమె చూడగలము అనుకున్న సన్నివేశాలెన్నో ప్రతినిమిషం కళ్ళముందు కనిపించాయి. బ్లాక్ క్యాట్ కమాండోలు, మార్కోలు, పోలీసులు అందరు కలిసి ,, తమ ప్రాణాలు, తమ కుటుంబాల గురించి కూడా లెక్క చేయకుండా ముందుకు సాగారు. ఆ పోరాటంలో అసువులు బాసిన వీరులకు కన్నీటి వీడ్కోలు. వీరందరికీ మనము రుణపడి ఉన్నాము కదా. వాళ్లు పోరాడింది ముంబై కోసము కాదు .. దేశం కోసం మాత్రమే. .. ఇలాంటి నిస్వార్ధ సైనికులను రాజకీయనాయకుల భద్రతకు నియమించడం అవసరమా... ఈ సైనికులకు, యువతకు మన దేశాన్ని, ప్రజల భద్రతను అప్పగించడం మేలేమో అనిపిస్తుంది. మన చేతిలో ఉన్నా ఆయుధం .. ఓటు.. అది కాస్త ఆలోచించి .. కనీసం ఇప్పుడైనా సరిగ్గా ఉపయోగించుకోవాలి . లేదా దేవుడా నీవే దిక్కు అని గాలిలో దీపం పెట్టాలేమో..

ఈ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించండి.. ఇక్కడ...

Thursday, November 27, 2008

భగవంతుడా!! నీవే దిక్కు!!!..

నిన్నటి అమావాస్య నిశీధిలో సుమారు పది చోట్ల ముంబైలో తీవ్రవాద దాడి జరిగింది. పెట్రోల్ బంకు పేల్చివేత, స్టార్ హోటళ్ల ఆక్రమణ, అమాయక ప్రజలపై కాల్పులు .. ఇవి చూస్తూ నోట మాట రావడంలేదు. దీనికి బాధ్యులు ఎవరు? బాధితులు చేసిన నేరమేమిటి?

దుండగులు ఎంచక్కా రబ్బర్ బోట్లలో వచ్చి భారీ పేలుళ్లు సృష్టంచారు.

మనకోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులకు పాదాభివందనం..

నాయకుల్లారా!! దయచేసి ఈ ఉదంతాన్ని రాజకీయం చేసి , మీ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించకండి...

Thursday, November 20, 2008

నవ్వుల పండగ - మధు (ది) రోపాఖ్యాయనం .

మగాడు - మగువ - మధిర - ఈ మూడింటికి ఒక అవినాభావ సంబంధముంది. ఈ బంధం ఈనాటిది కాదు. అలనాటి క్షీరసాగరకాలం నుండి ఉన్నదే. సాగరమధనంలో వచ్చిన హాలాహలాన్ని పాపం భోలాశంకరుడు సేవించి గొంతులో దాచుకున్నాడు. అమృతాన్ని మాత్రం మాకంటే మాకు అని సురాసురులు గొడవపడ్డారు. తప్పనిసరై శ్రీహరి మోహినిగా వచ్చి అందరి మతులు పోగొట్టి తెలివిగా అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా దేవతలకు మాత్రమే పంచేసాడు. అందుకే సురాపానం అంటారేమో. ఆ మందుకు ఎన్ని పేర్లో.. సుధ, మధువు, మదిర, అమృతం వగైరా.. పైగా ఇప్పుడదో స్టేటస్ సింబల్. తాగనివాడో వెర్రిమాలోకం అంటారు.


పొగతాగనివాడు దున్నపోతై పుట్టును అన్నడో మహాకవి. మరి మందు కొట్టనివాడు ఏమవుతాడు? అవునూ పొగ తాగడమేంటి? మందు కొట్టడమేంటి? సిగరెట్ పొగని పీలుస్తారు. మందును గ్లాసులో పోసుకుని తాగుతారు కదా? అదేంటో మరి. ఈ మందులో కూడా ఎన్ని రకాలో! చెట్టుమీది నుండి తీసిన తాటికల్లు నుండీ షివాస్ రీగల్ వరకు. మగాడి చేతిలో ఉన్న మందు విలువను బట్టి ఆ వ్యక్తి అంతస్థు, తాహత్తు అందరికి అర్ధమవుతుంది. పెగ్గులతో కొలుచుకుని మరీ తాగి ,ఎంచక్కా కారు నడుపుకుని వెళ్లేవాళ్లున్నారు. సీసాలతోనే లాగించి తూలుతూ, ఊగుతూ వెళ్లేవాళ్లున్నారు. నెల ఆరంభంలో ఫుల్ బాటిల్, నంజుకోవడానికి చికెన్ 65, నెల మధ్యలో హాఫ్ బాటిల్ - పక్కన మిక్చర్, ఇక నెలాఖరులో క్వార్టర్ కి జోడీగా ఆవకాయ బద్ద. ఇదీ మధ్య తరగతి మందు బాబుల ప్రోగ్రాం. ఎలా ఐనా హ్యాపీస్.

"మందు పార్టీ" .. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మందు తప్ప వేరే ఎటువంటి బేధభావాలు ఉండవు. రాజు, పేద, అగ్రవర్ణాలు, రంగుల గొడవ ఉండదు. నీటుగా తయారై చేతిలో మందు గ్లాసు ఉంటే చాలు ...అంతా సమానం. అసలు ఈ మందు పార్టీ అంటే ఒక విజ్ఞాన ఖజానా అని చెప్పవచ్చు. పెగ్గు పెగ్గుకు జ్ఞానం వరదలా పొంగుతుంది. అజ్ఞానం ఐసులా కరుగుతుంది. వివిధ రౌండ్ల వద్ద చాలా మందికి (ప్రతీరోజు) జ్ఞాననేత్రం వికసించి వేదసారాలు, జీవిత సత్యాలు బయటపడతాయి. అందరూ మాట్లాడేది తెలుగు ఐనా దానికి వ్యాకరణం గురించి ఆలోచించడానికి అస్సలు వీలు లేదు. ఎందుకంటే చాలా మంది తాగినప్పుడు నిజాలే మాట్లాడతారు. అవి వారి గుండె లోతుల్లోంచి లావాలా పెల్లుబికి అలా అలా పొంగుతూ ప్రవహిస్తుంటాయి. ఆ సమయంలో భావ వ్యక్తీకరణ మాత్రమే ముఖ్యం . భాషాదోషాలు కాదు. కాని అక్కడున్న వారికందరికి ఆ మాటలు పూర్తిగా అర్ధమైనా కూడా అర్ధం కానట్టే ఉంటాయి.

మందు బాబులు శాఖాహారమైనా, మాంసాహారమైనా ప్రాబ్లం లేదు. జస్ట్ మందులోకి మంచింగ్స్ మారతాయి. మంచూరియా, కబాబ్ లేక మిక్చర్ , జీడిపప్పు, వేయించిన వేరుశనగపప్పు అంతే. మందు కొట్టడం మొదలుపెట్టగానే బుద్ధి వికసిస్తుంది. దేశరాజకీయాలు, సినిమా తారలు, షేర్లు ఇలా మెల్లి మెల్లిగా చర్చ మొదలవుతుంది. ఆ చర్చకు ఆరంభం మాత్రమే ఉంటుంది కాని అంతం ఉండదు. అలా అని ఆ చర్చలలో టాపిక్కులు కూడా ఒకేలా ఉండవు. లెక్కలేనన్న్ని విషయాల మీద చాలా సీరియస్ చర్చలు జరుగుతాయి. ఈ శాస్త్ర విజ్ఞాన చర్చాలు చాలా సామరస్యంగానే నడుస్తాయి. ఖర్మగాలి ఎవడైనా ఏ చిన్న పాయింటైనా విభేదిస్తే మాత్రం దూర్వాసుడిలా కోపంతో రెచ్చిపోతారు. ఒకోసారి ఆ చర్చలు తీవ్రస్థాయికి చేరి తాగే సీసాలతోనే బుర్రలు బద్దలు కొట్టుకునే చాన్స్ లేకపోలేదు. కొందరు ఈ సమయంలో తమ టాలెంట్లను చూపించేస్తారు. ఫలించని ప్రేమ కవితలు, భార్యాబాధితులు, భావావేశాలు, సినిమా పాటలు, బాసుపై కోపంతొ అనర్ఘళంగా ఉపన్యాసాలు, ఆక్రోశం, కచ్చ అన్నీ గలగలా సెలయేరులా పారతాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సన్నివేశాలెన్నో ఈ మందుపార్టీలో చూడవచ్చు. ఇక చివరి రౌండ్ కొచ్చాక మాత్రం ఫింగర్ బౌల్‌లో నీళ్లు కూడా తాగి అందులోని నిమ్మడిప్పను చప్పరిస్తారు. కొందరు ప్రభుద్దులైతే కట్టుకున్న పంచెను విప్పు అదే దుప్పటీలా కప్పుకుని అలాగే నిద్దరోతారు. లేద వేదపారాయణం మొదలెడతారు. దీనికి సినిమా కవులు కూడా నగిషీలు చెక్కారు.

"తాగితే మరచిపోగలను, తాగనివ్వరు
మరచిపోతే తాగగలను మరువనివ్వరు.."
" కుడి ఎడమైతే పొరబాటు లేదోయీ..."
" కల కానిది విలువైనదీ..."


ప్రేమలో పడకముందు ఖుషీగా తాగుతూ నిషాలో "నేను పుట్టాను.. లోకం మెచ్చింది.. నేను నవ్వాను .. ఈ లోకం ఏడ్చింది.." అన్న ఏ.ఎన్.ఆర్ గారు ప్రేమ విఫలమై మానేసిన తాగుడు ఇంకా ఎక్కువై " ఎవరికోసం ఈ ప్రేమ మందిరం.. ఈ శూన్యమందిరం" అంటూ విషం కూడా తాగేసారు మరి.

ఇక మగాడు - మగువ - మగువ గురించి ఎటువంటి సంబంధం ఉందో చూద్దాం. చల్లని సాయంకాలం, నిశిరేయిలో ఏ మగాడికైనా గుర్తొచ్చేది మనసైన చెలి లేదా కవ్వించే మధిర. రెండూ అతనికి వేడిని, మత్తును, సంతోషాన్ని, సాంత్వనని ఇచ్చేవే. ఎవరున్నా లేకున్నా, ఆ వ్యక్తి బాధను, ఆనందాన్ని ఈ రెండింటిలో ఏదో ఒకదానితో పంచుకుని సేదతీరుతాడు. అలా కాకుండా ఏ కారణం లేకుండా తాగాలి అంటే తాగాల్సిందే అనుకునే ఘనులెందరో ఉన్నారులెండి. వీళ్లు తమ శారీరక , మానసిక శ్రమను, అలసటను కొద్దిసేపైనా మర్చిపోవడానికి ఎంచుకున్న ఏకైక మార్గం ఈ మధిరాపానం. చుక్కచుక్కగా ఇది గొంతులోంచి క్రిందకి పోతుంటే, లోపలున్న బాధ అలా బయటకు వెళ్లిపోతుంది అని ఫీల్ అవుతారు. ప్రేమ విఫలమైనా, భార్య బధించినా, బాసు వేధించినా, అప్పులోల్లు సతాయించినా, మందు ఒక్కటే సత్వర పరిష్కారంగా గుర్తొస్తుంది చాలా మందికి. తాగినప్పుడు పిల్లి లాంటి మగాడు పులిలా అవుతాడు. ఏ సమస్యలు అతడికి గుర్తుకు రావు. అందుకే ఎవరిమీదైనా చచ్చేంత కోపంగా, ద్వేషంగా ఉంటే (ముఖ్యంగా పెళ్లాం, అత్తమామలు, బామ్మర్ధులు సతాయిస్తుంటే) పుల్లుగా తాగేసి, వాళ్లను కసిదీరా తన్నొచ్చు. కేసు కూడా ఉండదు. పెట్టినా కూడా వాళ్లను అంత ధైర్యంగా తన్నానన్న సంతృప్తి ఉంటుంది కదా. అది తెలిసినవాళ్లు కూడా "అయ్యో పాపం! పిల్లాడు తాగేసి ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలీదు" అంటారు. అర్ధరాత్రి ఆడది నడిరోడ్డుపై తిరగగలిగినప్పుడే స్వాతాంత్ర్యం వచ్చినట్టు గాంధీగారు అన్నారు కదా. కాని ఈ రోజు ఎందరో ఆడవాళ్లు మేము మాత్రం తక్కువ తిన్నామా అని ధైర్యంగా షాపు కెళ్లి కొబ్బరినూనె కొన్నత ఈజీగా కొనుక్కుంటున్నారు. అలాగే తమ భర్తలతోపాటు షాపింగుకు వెళ్లినట్టు మందు షాపుకు వెళ్లి అతనికి మందు బాటిల్ ఇప్పించి బిల్లు కడుతున్నారు. వాహ్వా..

ఇక మందు పార్టీ చివర్లో భాషాప్రవాహం మందగిస్తుంది. పదాలు పూర్తిగా పలికే ఓపిక ఉండదు. సైగలు, పెదాల కదలిక బట్టి వాళ్లు ఏం చెబుతున్నారో అర్ధం చేసుకోవాలంతే. అప్పటికి అందరూ ఇంటికి వెళ్లిపోవాలని అర్ధమైపోతుంది. ఇక అక్కడ ఉండి చేయాల్సిన పని లేదు. ఇంటికెళ్లి తొంగోవాల్సిందే. మళ్లీ తెల్లారి కొలువుకు వెళ్లాలి కదా!

ఇది అందమైన మధి(ధు)రోపాఖ్యాయణం. ఇది సరదాకి రాసింది. ఎవరిని నొప్పించడానికి, ఎగతాళి చేయడానికి కాదు. కాని ఇందులో ప్రస్తావించిన కొన్ని విషయాలు నేను స్వయంగా విన్నవి , చూసినవి. G.R.Maharshi గారి వ్యాసం చదివిన స్పూర్థితో ఈ టపా.

మరో ముఖ్య విషయం. ఈ రోజు మన బ్లాగ్ ప్రముఖులు సత్యసాయికొవ్వలిగారు, రమణిగారు ఇద్దరూ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ టపాలో సారమంతా ఫ్రొఫెసర్‌గారికి, టపావల్ల వచ్చే దరహాసాలన్నీ రమణిగార్లకు పుట్టినరోజు కానుకలు.. మీకిద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

ప్రమదావనం తరఫు నుండి ..ఈరోజు బ్లాగ్లోకంలోని హాసాలు, మందహాసాలు, చిరుహాసాలు, దరహాసాలు, వికట్టాట్టహాసాలు అన్నీ సత్యసాయిగారు, రమణిగార్లకే..

Sunday, November 16, 2008

అబ్బో!! ఎన్ని ఆటలో!!!

ఆటలు మనిషికి ఉత్తేజాన్ని ఇస్తాయి. మానసికంగానూ, శారీరకంగానూ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కాని ఈ రోజుల్లో పిల్లలకు ఆటలకు అస్సలు టైం ఉంటుందా? పుట్టగానే స్కూల్లో రిజిస్టర్ చేయించాలి. రెండేళ్లు నిండగానే స్కూల్లో వేయాలి. ఇక చదువుల పరుగు మొదలు. మాటలు కూడా రాని పసివారు మార్కుల కోసం కష్టపడుతున్నారు. అన్ని స్కూళ్లలో ఆటలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, సదుపాయాలు ఉంటున్నాయో లేదో. ఈ రోజుల్లో ఎక్కువగా వినిపించేది,కనిపించేది క్రికెట్టు, ఆనంద్ గెలిస్తే చదరంగం, లేదా బ్యాడ్మింటన్. పిల్లలకైతే చిన్ని చిన్ని వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, లేదా మొబైల్ గేమ్స్. ఇవేనా ఆటలంటే. ఆఫీసు నుండి అలసి వచ్చిన మా అమ్మాయి అలసట తీరడానికి తన మొబైల్ లో ఏదో గేమ్ ఆడుతుంటే చూసి నాకు కలిగిన ఆలొచనలే ఈ టపా.

1. చిన్నగా ఉన్నప్పుడు తన పనిలో అడ్డం పడకుండా ఉండటానికి అమ్మ కాగితంతో బాల్ చేసి దానికి దారం చుట్టి ఇచ్చేది. నిజం బాల్ ఐతే దెబ్బలు తగులుతాయి. లేదా ఇంట్లో వస్తువులు పగలొచ్చు కదా. అప్పట్లో ఈ క్యారీబ్యాగులు గట్రా లేవు. దుకాణంలో ఏది కొన్నా పేపర్లో పొట్లం కట్టి దారం చుట్టి ఇచ్చేవారు. ఎక్కువ బరువు ఉంటే సంచీలు ఉండేవి లెండి. ఆ కాగితాలు, దారాలు ఇలా పనికొచ్చేవన్నమాట.

2. మా తమ్ముళ్లయితే బయట ఆడుకోవడానికి వెళ్లేవారు, నాకు అమ్మాయిలు ఎక్కువగా స్నేహితులు ఉండేవారు కాదు మొదటినుండీ. అంతలా ఐతే మా తమ్ముళ్లు, వాళ్ల స్నేహితులతోనే ఆడుకునేదాన్ని. ఒక్కదాన్ని ఉంటే ఎక్కువగా ఆడుకునేది గచ్చకాయలు. ఎక్కడ నున్నటి రాళ్లు కనపడినా ఎత్తుకొచ్చేయడమే నా పని. వాటిని నునుపు చేసి ఒకే సైజులో తయారు చేసుకుని గచ్చకాయలు ఆడుకునేదాన్ని. అప్పుడప్పుడు మా అమ్మ కూడా నాతో కలిసేది. లేదా ఎవరైనా చుట్టాల అమ్మాయిలు. అసలైతే గచ్చకాయలు చెట్టు మీది కాయలు. కాని అవి సిటీలో ఎక్కువగా దొరికేవి కాదు. అందుకే రాళ్లతో ఆడుకోవడం. ఈ గచ్చకాయలతో ఎన్నో రకాల ఆటలు మా అమ్మమ్మ నేర్పించింది.

3. ఇక స్కూళ్లో బోర్ కొడితేనో, టీచర్ రాకుంటేనో ఇద్దరు ముగ్గురు ... ఇంకా ఎక్కువమంది కూడా ఒక చోత చేరి ఆడుకునే ఆట Name, Place, Animal and Thing ఒకే అక్షరంతో అందరూ ఇవన్నీ రాయాలి. ఆటకు ఆట, చదువుకు చదువు అయ్యేది. కొత్త పదాలు కూడా తెలిసేవి. ఎవ్వరితో కలవని పదం రాస్తే ఐదు మార్కులు. ఇలా చివర్లో గెలిస్తే ఎంత ఆనందమో. కాని నోట్‌బుక్ లోని పేపర్లు చింపాల్సి వచ్చేది. తర్వాత ఎవ్వరికీ కనపడకూడదు కదా.

4. ఇది అందరికి తెలిసిన ఆటే మూడు నిలువు, అడ్డం గళ్లు గీసి చుక్కలు, నక్షత్రాలు పెట్టి ఆడుకునే ఆట. త్వరగా అవుతుంది. కాని తెలివి ఉపయోగించే ఆట. ఇలా పేజీ నిండా గీతలే..

5. ఇప్పుడు పిల్లలకు స్కూలు ఉన్నా లేకున్నా ఒకటే. ఆదివారాలు కూడా ఖాళీగ ఉండనివ్వకుండా చేస్తున్నాయి ఈనాటి చదువులు. శనివారం సగంపూట బడులు అయ్యాక పిల్లలకు ఆటవిడుపుగా ఉండేది. కాని ఆదివారం త్వరగా గడిచేది కాదు. స్కూలు వర్క్ అంతా శనివారం సాయంత్రమే ఐపోయేది. అప్పుడు టీవీలు లేవు, రేడియో వినడం అంత అలవాటు లేదు. చందమామ , కథల పుస్తకాలు గంటలో చదవడం ఐపోయేది. ఏం చేయాలో తోచక ఇంట్లో ఏదో ఒక ఖాళీ పూల కుండీ తీసుకుని మట్టి అంతా పెళ్లగించి అమ్మనడిగి త్వరగా మొలిచేది మెంతులు అని తెలుసుకుని అవి అందులో వేసి నీళ్లు పోసి మరుసటిరోజు నుండే చెట్లు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూడడం. కాని రెండోరోజు పొద్దున్న లేచి మొహం కూడా కడుక్కోకుండా వెళ్లి చూస్తే చిన్ని చిన్ని మొలకలు కనిపించేవి. అప్పుడెంత సంతోషమో. అవి చాలా త్వరగా పెద్దవవుతుంటే చూసి మురిసిపోవడం. అమ్మ కొనే ఆకుకూర మేము పెంచాము అని. చిన్ని కుండీలోని ఆ మెంతి చెట్లను చూస్తుంటే ఏదో పదెకరాలా వరితోట ఆసాముల్లా ఫీల్ అయ్యేవాళ్లం నేను, నా తమ్ముళ్లు. నాలుగో రోజు అవి పప్పులోకో, కూరలోకో వెళ్లిపోయేవి, కొత్తిమిర ఎలా వస్తుంది అని తెలుసుకుని ధనియాలు వేసేవాళ్లము అప్పుడప్పుడు. అవేమో తీరిగ్గా నిక్కుతూ నీలుగుతూ ఐదురోజుల తర్వాత కాని కనపడేవి కావి. విసుగొచ్చేది ఎదురుచూడలేక. అమ్మ చెప్పేది ధనియాలు చెప్పుతో రాసి మట్టిలో పాతితే కాని మొలకెత్తవు అని. నిజమే కామోసు అని నమ్మి అలాగే చేసేవాళ్లము..

6. కిరాణా దుకాణాల్లొ తూకం వేసే తక్కెడ అంటే మహా క్రేజ్ గా ఉండేది. అది కొనాలంటే బోలెడు ధర. కొనమందామంటే ఇంట్లో పనికొచ్చే వస్తువు కాదు. ఏం చేద్దామా అని ఆలోచించి. మా పిన్ని సలహాతో ఆమె దగ్గరున్న అమూల్ పాలడబ్బాల సత్తు మూతలు తీసుకుని వాటికి మూడు వైపులా రంధ్రాలు చేసి దారం కట్టి, ఆ రెండు మూతలను ఒక లావాటి చీపురు పుల్లకు కట్టి , మధ్యలో పట్టుకోవడానికి లావాటి దారం కట్టి తక్కెడ తయారు చేసుకునేవాళ్లం, ఇక మాకంటూ ఒక దుకాణం పెట్టుకునేవాళ్లం. వంటింట్లోంచి పప్పులు, శనగలు లాంటివి తెచ్చుకుని చిన్న చిన్న వెడల్పాటి రాళ్లను తూకం రాళ్లుగ వాడుకుని దుకాణం ఆట ఆడుకునేవాళ్లం . ఇక డబ్బులు అంటే కాగితం ముక్కలపై నంబర్లు వేసుకుని అవే రూపాయలు, పైసలు. భలే ఉండేది ఈ వ్యాపారం.

7. ఇక అమ్మమ్మ, నాన్నమ్మ వస్తే అష్టాచేమ్మా, పచ్చీస్ ఆడడం. అష్టాచెమ్మా అంటే ఒక బలపం తీసుకుని నేలపై గళ్లు గీసి , చింతగింజలను రెండు ముక్కలుగా చేసుకుని పావులుగా వాడుకునేవాళ్లం. పచ్చీస్ ఐతే ఎక్కువ గళ్లు ఉండేవి కాబట్టి నేలమీద గీసే చాన్స్ లేదు. దానికోసం ప్రత్యేకంగా బట్టపై కుట్టేవాళ్లు, లేదా పూసలతో అల్లేవాళ్లు, దానికోసం చెక్కపావులు, గవ్వలు ఉండేవి. వాటినన్నింటిని ఒక సంచీలో కాని , డిబ్బీలో కాని వేసి దాచేది అమ్మ. ఒక్క పావు పోయినా ఆట వీలు కాదుగా.

8. ఇంట్లోనే హాయిగా ఆడుకునే మరో ఆట కైలాసం. అంటే పరమపదసోపనం అని కూడా అంటారు. snakes and ladders అనేది అదే. కాని అందులో ఒక పెద్ద కాగితం ఉంటుంది. దానిపై నిచ్చెనలు, పాములు, మధ్య మధ్యలో ఏవో గ్రహాల పేర్లు అవి ఉండేవి. ఈ ఆటలో మోసం చేయ్యవద్దు అనేవారు. నిజాయితీగా ఆడకుంటే పాము మింగేస్తుంది అనే భయం పెట్టేవాళ్లు పెద్దవాళ్లు. ఆ కాగితాన్ని కూడా మామూలు కాగితంలా కాకుండా ఒక పవిత్రమైన వస్తువుగా జాగ్రత్తగా ఉంచేవాళ్లు. ఇందులో ఎంతమందైనా అడే వీలుండేది. తిరుపతి, కాలహస్తి, లేదా శ్రీశైలం వెళ్లినప్పుడల్లా ఈ ఆట కాగితాన్ని తప్పకుండా కొనేది అమ్మ.

9. ఇక ఆడపిల్లలకు చిన్నప్పటినుండే వంటపై మక్కువ ఉండేదేమో. తిరుపతి , అలమేలు మంగాపురం వెళ్లినప్పుడల్లా అమ్మ నా కోసం చెక్కతో చేసిన వంట సామాన్లు కొనేది. అవి ఒక అందమైన వెదురు బుట్టలో ఉండేవి. ఆడుకున్న తర్వాత అందులోనే దాచుకోవడం. అన్ని గిన్నెలు వరుసగా పెట్టుకుని అమ్మ చేసినట్టే పొయ్యి పై గిన్నెలు పెట్టి అన్నం పప్పు చేయడం. బాణలి పెట్టి పూరీలు, పెనం పెట్టి చపాతీలు చేయడం. ఇలా సాగేవి మా ఆటలు. మా తమ్ముళ్లేమో త్వరగా పెట్టు ఆకలవుతుంది అని సతాయించేవాళ్లు. ఇప్పటికీ యాత్రాస్థలాల్లో అరుదుగా కనిపించే ఈ బొమ్మలను చూస్తే అదో త్మధురమైన అనుభూతి కలుగుతుంది. మా అమ్మాయికి చిన్నప్పుడు కొనేదాన్ని. కాని అప్పటికే స్తీల్ వంట సామాన్లు వచ్చాయి.


11. ఆడుకోవడానికి పనికిరాని వస్తువేదాఇనా ఉందా ? ఇసుక కనిపిస్తే చాలు దానితో గూళ్లు కట్టడం, కాగితాలు , చెట్టుకొమ్మలు పట్టుకొచ్చి పెట్టడం, లేదా ఆ ఇసుకలో అగ్గిపుల్లలు పెట్టి వెతుక్కునే ఆట అందరికి తెలిసిందే కదా. మంచి టైంపాస్ అవుతుంది ఈ ఆటతో.

12. ఇక పెద్దా చిన్న అని తేడా లేకుండా వరుసగా కాళ్లు చాపుకుని కాళ్లాగజ్జె కంకాళమ్మా ఆడడం కూడా ఒక సరదా. ఈ పాటలో కూడా ఆరోగ్య రహస్యం ఉందంటారు పెద్దలు.

13. ఇంట్లోనే ఉండి ఆడుకునే మరో ఆట . గుజ్జనగుళ్లు. తెలంగాణాలో ఒనగండ్ల ఆట అంటారు. దీనికి ప్రత్యేకంగా తయారు చేసిన పీట ఉంటుంది. చెక్కతో కాని, స్టీలుతో కాని చేసి ఉంటుంది. రెండువైపులా ఎదురెదురుగా పదేసి గుండ్రటి గళ్లు ఉంటాయి. ఆటగాళ్లు ఎదురెదురుగా కూర్చోని చింతగింజలు, లేదా సీతాఫల గింజలు ఆ గళ్లలో వేసి గవ్వలు లేదా పావులతో ఆడతారు. ఇది తెలివిగా ఆడితే ఎదుటివారి గింజలన్నీ సంపాదించుకోవాలి. ఇందులో కూడా రెండు మూడు రకాల ఆటలు ఉన్నాయి. ఆడుతుంటె సమయమే తెలీదు. వేసవి సెలవుల్లో మంచి కాలక్షేపం.

14. ఇక అప్పట్లో పిల్లలు ఎక్కడికెళ్లినా ఏది కనపడినా ఆటాడుకోవడానికి పనికొచ్చేలా చేసుకునేవాళ్లు. అలాంటిదే స్తంభాలట. ఎక్కువగా గుడిలోనే కదా స్తంబాలు కనపడేది. ఒక్కోరు ఒక్కో స్తంభం ఎంచుకుని దొంగకు దొరకకుండా స్తంభాలు మారడం. మధ్యలొ దొరికిపోతే వాళ్లే దొంగలు మళ్లీ. స్తంభాలు పట్టుకుని అలా ఊగుతూ తిరగడం భలేగుండేది.

15. నాకు ఎక్కువగా ఇష్టమైన ఆటలు స్కూలులో ఐనా, బయట ఐనా. రింగ్, త్రోబాల్. రింగ్ ఐతే ఇంట్లో అమ్మతో ఎక్కువగా ఆడేదాన్ని. ఈ ఆటల వళ్ల మంచి వ్యాయామం అయ్యేది. ఆకలయ్యేది కూడా.

16. ఇక ఇద్దరమ్మాయిలు కలుసుకుంటె తప్పక ఆడేది ఒప్పుల కుప్ప ఆట. రెండుచేతులు పట్టుకుని గుండ్రంగా తిరగడం. ఈ ఆటలు చేతులు వదిళేస్తే దెబ్బలు తగలడం ఖాయం. అందుకే కాళ్లు నేలకు గట్టిగా పట్టి ఉంచే చేతులు విడిపోకుండా పట్టుకుని ఎంత స్పీడుగా తిరిగితే అంత మజా. అప్పుడప్పుడు ఒక చేయి వదిలేసి తిరగడం, లేదా కూర్చుని లేస్తూ తిరగడం. దీనికి ఎంతో చాకచక్యం, నేర్పు ఉండాల్సిందే.


18. మరో ముఖ్యమైన ఆట తాడాట. స్కిప్పింగ్. నా చిన్నప్పుడు రెండువైపులా రంగు రంగుల చెక్క హ్యాండిల్లతో చేసిన తాళ్లు దొరికేవి . ఇప్పటిసంగతి తెలీదు మరి. వయసు బట్టి తాడు సైజు వేరువేరుగా ఉండేది. దానితో కూడా ఎన్నో ఆటలు. ఒక్కరు , ఇద్దరు, లేదా గుంపులుగా రకరకాల ఆటలు . ఇప్పుడేమో బరువు తగ్గడానికే వాడుతున్నారు . చిన్నపిల్లలకు ఐతే చాలా మాందికి దీనిగురించి తెలుసో లేదో. తెలిసినా ఆడే టైం లేదు చదువుకోవాలి అంటారు.

19. ఇక చెమ్మచెక్క ఆట తెలియనిదెవ్వరికి. నిజంగా అప్పట్లో ఎటువంటి ఉపకరణాలు లేకుండా చేతులతో, దొరికిన వస్తువులతో ఎన్నో ఆటలు ఆడేవాళ్లు పిల్లలు.

20. ఈ ఆట గుర్తుందా ఎవరికైనా. రెండుచేతులను నేలపై బోర్లా పెట్టి , చిటికెన వేలునుండి abcd అని లెక్కపెట్టుకుంటూ ఆడేవాళ్లు. డి తర్వాతి వేలు లోపలికి మడిచేయాలి. చివరిదాకా ఎవరుంటారో వాల్లే విజేతలు. ఎటువంటి చప్పుడు లేకుండా ఆడుకోవచ్చు.

21. కాస్త పెద్దయ్యాక చదరంగం ఆడేవాళ్లం. దీనికోసం ఐతే చాలా సమయం పట్టేది. ఏదైనా ఆలోచించి ఎత్తు వేయాలి కదా. నేను మా చిన్నతమ్ముడు బానే ఆడేవాళ్లం . పెద్దతమ్ముడే , .. ఓడిపోతున్నానుకున్నప్పుడు బోర్డ్ ఎత్తేసేవాడు. ఇక ఇద్దరు తమ్ముళ్లు కొట్టుకోవడం. కంప్యూటర్లో కూడా చదరంగం ఆడొచ్చు కాని నాకు నచ్చదు.

22. నక్షత్ర ఆకారంలో ఉండే చైనీస్ చెక్కర్, పచ్చీస్ లాంటిదే లూడో ఆట, బ్యాంకులు, ఉత్తుత్తి నోట్లు, కొనుగోళ్లు , అమ్మకాలు నేర్పే బిజినెస్ ఆట. అలా ఎన్నో ఆటలు.

23. అమ్మ ఆడుకోవడానికి, చదువుకోవడానికి అన్నీ కొనిచ్చేది కాని పేకాట కార్డులు మాత్రం ముట్టుకోనిచ్చేది కాదు. కాని ఎప్పుడైనా ఆడేవాళ్లం . అదేంటో తెలుసా. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని, సగం సగం కార్డులు పంచుకుని , ఒక్కొక్కటి వేస్తు రెండింటి గుర్తులు కలిస్తే వాళ్లు ఆ కార్డులన్నీ తీసుకోవడం. ఇలా మొత్తం కార్డులన్నీ ఒకరి దగ్గర చేరేవరకు ఆట కొనసాగేది. అమ్మ చూసినా ఏమనేదికాదు. సో హ్యాపీ.

ఇలా అందమైన ప్రకృతిలో చిన్ని చిన్ని వస్తువులతోనే ఎన్నో ఆటలు ఆడేవాళ్లం. నిజంగా అదో మరపురాని కాలం. మళ్లీ ఆ రోజులు వస్తాయో లేవో. ఆటలు కూడా యాంత్రికమైపోయాయి. కొన్నైతే మరీ దారుణం. యుద్ధాలు, దయ్యాలు.. పిల్లల చదువులు చెడిపోతాయి. కంటి చూపు పాడవుతుంది. ఆలోచనాశక్తి కూడా మారుతుంది. ప్చ్.. ఏంటో మరి !!!!

Wednesday, November 12, 2008

కనపడుట లేదు....ఇందుమూలముగా అందరికి తెలియజేయడమేమనగా... గత చాలా కాలంగా క్రింది బ్లాగర్లు కనిపించుటలేదు. ఎవరైనా వారిని కలిసినచో, తెలిసినచో కాల్చేసి కాని, మేల్చేసి కాని చెప్పగలరు. ఎంత పని వత్తిడిలో ఉన్నా కూడా అప్పుడప్పుడు బ్లాగ్లోకానికి వచ్చి మనందరిని ముఖ్యంగా పాత మిత్రులను పలకరించవలసిందని. వారు మరిచిపోయినా మిగతావారు వారిని ఇంకా మరచిపోలేదు, గుర్తుచేసుకుని బాధపడుతున్నామని తెలియజేయగలరు.కల్హర - స్వాతి , నువ్వు ఎంత పర్సనల్ పనిలో బిజీగా ఉన్నావో తెలుసు కాని చాలా కాలంగా కల్హర మూగపోయి, వాడినట్టుగా ఉంది. కాస్త దాని సంగతి చూడమ్మా.


వెంకటరమణ - అబ్బాయ్! వెంకటరమణ. ఎంత ఆఫీసులో బిజీ ఐతే మటుకు బ్లాగును, బ్లాగు చదువరుల గురించి పట్టించుకోకుంటే ఎలా. బ్లాగర్ల సమావేశానికి కూడా రావట్లేదు.. ఏంటి సంగతి?


శోధన - సుధాకరా! ఏమైపోయావయ్యా! కాస్త నీ బ్లాగుల గురించి కూడా పట్టించుకో. అలా మర్చిపోతే ఎలా.. నెలకోసారైనా బ్లాగుల దుమ్ము దులపాలిగదా! నీ టపాల కోసం ఇక్కడ అందరూ వెయిటింగ్..


సాక్షి - మురళీకృష్ణగారు, ఏంటండి.. మీరు చాలా నెలలుగా బ్లాగు మొహమే చూడటంలేదు. దొరికిందే సందని చైనీయులు యదేచ్చగా మీ బ్లాగును తమ చెత్త, అర్ధం కాని కామెంట్లకు బాహటంగా ఉపయోగించుకుంటున్నారు. అలా అలా మిగతా బ్లాగులకు కూడా విస్తరిస్తుంటే చూడలేక నేనేమో జంధ్యాల మార్కు తిట్ల దండకం వాడాల్సి వచ్చింది. వారాంతంలోనైనా బ్లాగును గెలకండి. అలా గాలికి వదిలేస్తే ఎలాగండి??


అన్వేషి , జేప్స్, శ్రీరాం - ఎక్కడున్నారండి ? ఇక్కడ మీ పాత మిత్రులు మీకోసం వెతుకుతున్నారు? ఎక్కడున్నారు. ఒక్కసారి ఏసుకోండి?


ఆలోచనలు, అభిప్రాయాలు - భాస్కర్‌గారు, విదేశాలకు వెళ్లి తిరిగి రాలేదా? మీ ఫౌండేషన్ గురించి విశేషాలు చెప్పడానికైనా బ్లాగు తలుపులు తెరవండి.


ఓనమాలు - లలితా! నాకు తెలుసు మీరు పర్సనల్ పనులతో బిజీగా ఉన్నారని. తీరిక దొరికినప్పుడైనా మీ బ్లాగులో పలకరించండి. మీరు రాయనంత మాత్రానా, బ్లాగు మూసేసినా కూడా మేమందరం మిమ్మల్ని తరచూ గుర్తు చేసుకుని మిస్ అవుతున్నాము. త్వరగా రండి..


గోదావరి - విశ్వనాథ్‌గారు కనపట్టంలేదేంటి? మీ ఇంటాయన సతాయిస్తున్నాడా? వికీలోనే బిజీ ఐపోయి బ్లాగును మరిచారా? ఇది అన్యాయం కదా?


నేను సైతం - నేను సైతంగారు, ఎక్కడున్నా వెంటనే కనపడండి.


లలితగీతాలు - కామేష్ గారు, అలా మాయమైపోయారేంటండి. ఎలా ఉన్నారు? మీ పాటల ఖజానా మూగపోయింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది. మీకు వీలు చిక్కినప్పుడు బ్లాగు సంగతి చూడండి. చాలా మంది మిమ్మల్ని మిస్ అవుతున్నారండి.


మూడు బీర్ల తర్వాత - అక్కిరాజుగారు, మీరేంటండి. అలా మాయమైపోయారు? ఉద్యోగనిర్వహణ అనేది అందరికీ ఉంది. అలా అని బ్లాగును పట్టించుకోక, మీ స్నేహితులను మరచిపోవడం దారుణం కదా? మీ రచనలు మీ బ్లాగు ద్వారా ప్రచురించండి .


హృదయ బృందావని - రాధాకృష్ణగారు, మీరు లేక, కనపడక, మీ బృందావని బోసిపోయింది. ఎక్కడున్నారు. వెంటనే బ్లాగుముఖంగా పలకరించండి. కొత్త పాటలో కోసం ఎందరో ఎదురుచూపులు అలనాటి గోపికలలా..


అంతరంగం - తమ్మి ప్రసాదు! ఏంటి ఎంత ఉద్యోగంలో బిజీ ఐతే మాత్రం కంప్యూటర్ ఆన్ చేయడంలేదా? బ్లాగు గుర్తురావట్లేదా? మేమందరం ఉన్నాము, అప్పుడప్పుడు పలకరిద్దామని లేదా? హన్నా? మేమూ ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటాము. పనిలేక బ్లాగతున్నామా ఏంటి? అలా అర్ధాంతరంగా బ్లాగ్లోకాన్ని పట్టించుకోకుంటే ఎలా? నీ నుండి ఎన్నో టపాలు ఎదురుచూస్తున్నాము ఇక్కడ.. నెలకోసారైనా బ్లాగు దుమ్ము దులపాలి కదా.


నవీన్, గిరిచంద్ నువ్వుశెట్టి, నిర్మల కొండేపూడి, కల్పన రెంటాల, కరణి నారాయణరావుగారు, కేశవచార్య్, .. ఇంకా ఎందరో పాత మిత్రులు మీరందరు మీ వ్యక్తిగత బాధ్యతల ఒత్తిడిలో బిజీ అని తెలుసు ఐనా కూడావెంటనే మమ్మల్ని పలకరించి, బ్లాగులను పునరుద్దరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను , ఇది నా ఒక్కదాని విన్నపం కాదు. మిమ్మల్ని గౌరవించే, ప్రేమించే అందరు బ్లాగర్ల తరఫున ఒక ఆప్యాయమైన విన్నపం..Tuesday, November 4, 2008

ఏ హలా.. మానవా?
అనగనగా ఒక రాజు. .. ఇలా సాగిపోయే జానపద కథలు సినిమాలు నచ్చని తెలుగువారెందరు? ఈ జానపద కథలలోని మలుపులు, కథానాయకుడి వీరవిహారం, అందమైన నాయిక, దుష్టుడైన మాంత్రికుడు. ఇలా చూస్తుంటే ఎంత పెద్దవాళ్లైన మైమరచిపోతారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అలనాటి ఆ మధురమైన, మరపురాని జానపద చిత్రాలు ఇప్పటికీ అందరిని అలరిస్తాయి. అందునా విజయావారు తెలుగులో తీసిన జానపద చిత్రాలు ఒక దాని మించిన మరొక ఆణిముత్యాలు అని చెప్పవచ్చును. అందులో ముఖ్యమైనవి “జగదేకవీరుని కథ, పాతాళభైరవి, చందరహారం” . కె.వి.రెడ్డిగారు నిర్మాతగా, పెండ్యాల నాగేశ్వరరావుగారు సంగీత దర్శకునిగా పని చేసిన మొదటి చిత్రం “జగదేకవీరునికథ”.

మిగతా విశేషాలు "నవతరంగం"లో..!!

Sunday, November 2, 2008

వీకెండ్ మస్తీ ... ఇది అవసరమా???
వారానికి ఐదు రోజులు హైటేక్ గొడ్డు చాకిరి చేసేవారందరికి , కాలెజీ కుర్రకారుకి వారాంతం అంటే వీకెండ్ పండగలాంటిది. అదేంటో చాలా మంది ఈ వీకెండ్ అంటే ఒక కంపల్సరీ ఎంజాయ్‌మెంట్ అనుకుంటారు.ఈ రెండు రోజులు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తే తరువాతి వారానికి రీచార్జ్ ఐపోతారన్నమాట. కాని ఈ వీకెండ్ సెలవులు హాయిగా గడపాలంటే మార్గాలేంటి. సరదాగా అలా సినిమాకో, షికారుకో, తిరిగిరావడం. ఓకే. కాని ఇప్పుడు శనివారం రాగానే ప్రతి పబ్బులలో వీకెండ్ పార్టీలని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అది చాలా మంది యువతీ, యువకులకు తప్పనిసరి ఐపోయింది. అంటే వీళ్లకు ఆ పబ్బువాడు ఖరీదైన వినోదాన్ని ఆనందాన్ని ఇస్తున్నాడన్నమాట. (వాడి లాభం చూసుకునే) ఇక్కడికి వచ్చేవాళ్లు ఎక్కువగా పద్దెనిమిది నుండి పాతికేళ్లవారే ఉంటారు (నేను ఎన్నో టివి ప్రోగ్రాములలో చూసాను) ఇందులో వీరు చేసేది ఏంటంటే అమ్మాయిలు చాలీ చాలని బట్టలు (అదేమంటే లేటెస్ట్ ఫ్యాషన్) , అబ్బాయిలు నిండుగానే వేసుకుని, తాగుతూ పిచ్చెత్తినట్టుగా డాన్సులు చేయడం. ఇక్కడ ఆడేవాళ్లను చూస్తుంటే పోనీలే పిల్లలు అనిపించదు. ఇదేనా సంస్కృతి అనిపించదు. తమను తాము ఇంత నికృష్టంగా ఆనందింపచేసుకుంటున్నారు అని బాధ కలుగుతుంది. అందునా బోలెడు డబ్బు తగలేసి.

ఇక్కడ ఎక్కువమంది చదువుకునే పిల్లల్లా ఉంటారు. అందులో చాలా మంది తల్లితండ్రులు బాగా ధనవంతులై ఉంటారు కాబట్టి వాళ్లకు డబ్బుల ఇబ్బంది ఉండదు. కరెన్సీ నోట్లను పచ్చ కాగితాల్లా వాడుకుంటారు. ఈ విచ్చలవిడి నృత్యాలు, తాగుడు , హోరెత్తించే సంగీతం.... ఇదేనా ఈ యువతకు దొరికిన వినోదం, విలాసం. ఇటువంటి జల్సాలకోసం ఎందరో మధ్యతరగతి అమ్మాయిలు డబ్బున్న యువకులను ఆకర్షించి తమ అందాన్ని, శీలాన్ని తాకట్టు పెట్టి ఈ విలాసవంతమైన ఆనందాన్ని కొనుక్కుంటారు. కొందరు దాన్ని ప్రేమ అని భ్రమపడతారు కూడా. కాని అది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే, శరీరాన్ని ఉపయోగించుకుని తమకు కావల్సినవి పొందడమే తప్ప వేరే ఆలోచన ఉండదు. ఇలాంటి వాళ్లు ముందు ముందు ఎలా ఉంటారో అర్ధం కాదు. అనుబంధం, ఆత్మీయత, అనురాగం అనేది వీళ్లకు ఎప్పుడైనా దొరుకుతుందా. దొరికిందాన్ని వీళ్లు సరైన రీతిలో ఆస్వాదించగలరా? గత అనుభవాలు వాళ్లను వర్తమానం, భవిష్యత్తులో బాధించవా? కాని చాలా మంది యువతీ యువకులు ఇలాంటివన్ని పనికిరాని సెంటిమెంట్లు , అలా మాట్లాడేవాళ్లు ఫూల్స్ (పిచ్చోళ్లు) అంటారు. ఈ క్షణంలో అనుభవించేదే జీవితం అని నిర్ధారించుకుంటారు. నాకైతే ఇలాంటివాళ్లను చూస్తే కోపం రాదు, అసహ్యం వేయదు. బాధ, జాలి కలుగుతాయి. ఎందుకంటే వీళ్ల పరిస్థితికి కారణం ఎక్కువగా వాళ్ల తల్లితండ్రులు. తమ పిల్లలకు పెద్ద పేరున్న స్కూళ్లకు పంపించాము, డిజైనర్ దుస్తులు ఇప్పించాము, వాళ్లకిష్టమైన కార్లు, బైకులు కొనిచ్చాము అడిగినంత డబ్బు ఇచ్చాం. ఇంకా అంతకంటే ఏం చేయాలి. ఐనా వాళ్లు చిన్నపిల్లలా? వాళ్ల బాగు వాళ్లే చూసుకోగలరు. They are grown up అంటారు. ఇదేనా పిల్లలకు తల్లితండ్రులు సమకూర్చవలసింది. ఇంకేమీ లేదా??

Saturday, November 1, 2008

స్టీరియో్‌ఫోనిక్ జీవితాలు

టి.వి. స్క్రీన్‌పై మహోన్నత వ్యక్తి జీవిత విశేషాలు వ్యాఖ్యాత డ్రమెటిక్‌గా చెప్పుకుంటూ పోతుంటే.. "ఎంత గొప్పవారో కదా" అని మైమరిచిపోయి ఆస్వాదిస్తుంటాం. అలా చూస్తూనే అంతర్లీనంగా మన జీవితాన్ని తలుచుకుని కించిత్ బాధా పడిపోతాం. " స్థాయికి ఎదగాలంటే రాసి పెట్టి ఉండాలి.." అన్న భావము పెదాలను దాటకుండా మనసులో బందీగా ఆగిపోతుంది. మనమూ కష్టపడదాం, మనమెందుకు అలా పేరు తెచ్చుకోకూడదు" అని వైపు మనసు లాగుతున్నా.. "పేరు తెచ్చుకోవడం కోసం, గొప్పవారిమవడం కోసం అంత కష్టపడాలా" అంటూ తర్కం మరో వైపు తన బద్ధకపు నైజాన్ని బయట పెడుతుంటుంది. స్పూర్థిదాయకమైన వ్యక్తుల గురించి చూసేటప్పుడు, చదివేటప్పుడు, వినేటప్పుడు వారు ప్రస్తుతం ఉన్న స్థాయికి ఇచ్చినంత ప్రాముఖ్యత వారి జీవితంలోని ఎత్తు పల్లాలకు ఇవ్వం. ఒకవేళ ఇచ్చినా అన్ని ఎత్తుపల్లాలు దాటుకుని రావడం మనవల్లేం అవుతుంది అని ఢీలా పడిపోతాం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది సాక్షాత్కారం అవడానికి నెలలు పట్టవచ్చు. కొండొకచొ జీవితమే సరిపోకపోవచ్చు. లక్ష్యసాధన వైపు మనం సాగించే ప్రయాణాన్ని ప్రేమించాలి కాని,, లక్ష్యాన్ని పగటి కలలు కంటూ ప్రయాణాన్ని విస్మరించి "ఏం చేసినా కలిసి రావట్లేదు" అంటూ నిస్పృహలో కూరుకుపోకూడదు. "జీవితంలో మీ లక్ష్యమేమిటి?" అని ఎవర్ని ప్రశ్నించినా.. పని అయితే చాలు, పని అయితే చాలు అంటూ పిట్ట కోరికలు చెబుతుంటారు. అస్సలు అవి జీవితపు లక్ష్యాలేంటో అర్ధం కాదు. ఎవరినీ కించపరచడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. మనమేం కావాలనుకుంటున్నామో, ఏం సాధించాలనుకుంటున్నామో ఇలా చిన్న చిన్న బౌండరీలు గీసుకుని మనమే ఇరుకుల్లో మగ్గిపోతుంటే.. టి.వి ల్లో, పేపర్లలో కనిపించేటంత గొప్పవారిగా ఎప్పటికి అవుతాం? అస్సలు మనమెందుకు విస్తృతంగా ఆలోచించకూడదు? అందరూ చెప్పేదే అయినా మరోమారు నా మనసులో బలీయంగా ఉన్న ఫీలింగ్‌ని చెబుతున్నాను. గొప్పవారికి కొమ్ములు లేవు. వారేం దేవతాపుత్రులు కాదు. మనలాగే ఎన్నో కష్టాలను ఈదుకుంటూ వచ్చారు. ఈరోజు మనకు మీడియాలో వారి ముఖాలపై కనిపించే సంతృప్తి వెనుక ప్రలోభపెట్టే ఆనందాలను త్యజించి గడిచివచ్చిన జీవితపు గురుతులు దాగి ఉంటాయి. కానీ మనకు క్షణం మంచి తిండి, మంచి నిద్ర, సుఖాల వంటి లౌకిక విషయాల ద్వారా వచ్చే సంతృప్తి ముఖ్యమనుకుంటాం. ఏదైనా సాధించాలనుకునేవారు లక్ష్య సాధనలొ ఎదురయ్యే అనుభవాల నుండి సంతృప్తిని మూటగట్టుకుంటూ ప్రయాణం సాగిస్తుంటారు. రొటీన్ తిండి, నిద్ర, సుఖాలతో కొన్నాళ్లకు మనకు జీవితం బోర్ కొడుతుంది. నిరంతరం తమని తాము నగిషీలు చెక్కుకుంటూ ఉండడం వల్ల వారి జీవితం కొంగొత్త ఉత్సాహంతో తళతళలాడుతుంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే ప్రజ్ఞ మనం కలిగి ఉండడంతో పాటు ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మనదే. లేదంటే స్టీరియో్‌ఫోనిక్ జీవితాలే నలుదిక్కులా కనిపిస్తుంటాయి.


మీ

నల్లమోతు శ్రీధర్

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008