Showing posts with label శుభాకాంక్షలు. Show all posts
Showing posts with label శుభాకాంక్షలు. Show all posts

Friday, 22 December 2017

Happy Birthday ... జన్మకు సార్ధకత

అసలు నాకంటూ ఏ గుర్తింపూ ఉంటుందనీ, నేను కూడా ఏదైనా చేయగలను అని కొన్నేళ్ల క్రితం అస్సలనుకోలేదు. కాని ఆ పైవాడి లీలలు మనకు అర్ధం కావు కదా. అంతర్జాల ప్రయాణం మొదలుపెట్టి పదకొండేళ్లు దాటిన సమయంలో నాకు లభించిన కొన్ని గుర్తింపులు, పురస్కారాలు, అభినందనలు నా పుట్టినరోజు సందర్భంగా బ్లాగు మిత్రులతో పంచుకుంటున్నాను. నన్ను జీరో స్థాయినుండి చూసింది మీరే  కదా.

ఇప్పుడైనా నా మాటకు అవునంటారా? ఈ అంతర్జాలం, తెలుగు బ్లాగుల ద్వారా నాకంటే ఎక్కువ ఉపయోగపడ్డవారు లేరని..

మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.





Thursday, 14 September 2017

11వ వార్షికోత్సవ శుభవేళ.. Happy Birthday "జ్యోతి" ....





అనగనగనగా .. అప్పుడెప్పుడో అని చెప్పడం మొదలెడితే అదో పెద్ద కథ లేదా నవల అవుతుంది.
ఇది సరదా లేదా సీరియస్ కథ కాదు. జీవితం. జీరోకంటే తక్కువ గుర్తింపు, టాలెంట్, నాలెడ్జ్ తో అంతర్జాలంలో అడుగుపెట్టాను. పిల్లలకోసం వచ్చినా పిల్లలతో, పిల్లల ఈడువాళ్లతో చదువూ సంధ్యా లేకున్నా సాంకేతికంగా ఎన్నో నేర్చుకున్నాను.. అంటే మరీ అంత అధ్వాన్నం కాదుగాని తెలుగు మాట్లాడ్డం, చదవడం, రాయడం వచ్చు. ఇంగ్లీషు కొంచెం కొంచెం మాట్లాడ్డం, చదవడం అవసరమైనంత రాయడం మాత్రం వచ్చు. పదిమందితో కలిసే గుణం మాత్రం లేదు. ఎందుకంటే నాలా, నాకు నచ్చినట్టుగా ఎవరుంటారో ఏమో అనుకుంటూ మౌనంగా ఓ మూల ఉండేదాన్ని. నాడు, నేడు కూడా పనికిరాని ముచ్చట్లు అస్సలే రావు.
ఈ నేర్చుకోవడమనే ఆకాంక్ష, శ్రమ, పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎదుగుతూ నాకైన ఓ ప్రత్యేకత, గుర్తింపు సంపాదించుకున్నాను. అంతర్జాలంలో పరిచయమైనా ఆత్మీయులుగా మారిన మిత్రుల సహకారం అప్పుడూ, ఇప్పుడూ కూడా తోడుండగా నాకేల చింత??

కొత్తలో ఉత్సాహంగా, గర్వంగా అనిపించిన విజయాలు, ప్రశంసలు, గుర్తింపులు రాన్రానూ కాస్త భయం కలిగించసాగాయి. ఒక పెద్ద విజయం ముందు నిలబడి ఉంటే గతంలోని అవమానాలు, హద్దులు, భయాలు, పోరాటాలు నేనున్నా అంటున్నాయి. ఒక ప్రశంసా పత్రం కాని మొమెంటో నా చేతిలో ఉంటే ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని. ఎంత భయస్తురాలిగా, బలహీన మనస్కురాలిగా ఉండేదాన్ని అని దిగులుగా ఉంటుంది.... గతకాలపు చేదు జ్ఞాపకాలు, పోరాటాలే నేటి అవార్డులు, రివార్డులకు మూలం కదా. వాటిని మరిస్తే ఎలా??
గతంలోని ఫాఠాలను అనుక్షణం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటేనే వర్తమానంలో మరింత ధైర్యంగా, పట్టుదలగా ముందుకు సాగగలము అనుకుంటున్నా..
నాకేమీ కాలేదండి బాబూ! బానే ఉన్నా. ఒక సంతోషకరమైన సంధర్భాన్ని కాస్త వెరయిటీగా గుర్తు చేసుకుంటున్నాను అంతే. అదే నా పునాది, నా మూలాన్ని.
11 ఏళ్ల క్రితం ఒక సాధారణ మహిళగా అంతర్జాలంలో బ్లాగు మొదలెట్టి ఇదిగో ఇప్పుడిలా ఉన్నాను.

Happy Birthday జ్యోతి 

నా బ్లాగు “ జ్యోతి” . నన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటానన్నమాట. ఈ ఫేస్బుక్ మూలంగా బ్లాగును నిర్లక్ష్యం చేస్తున్నానని నాకు తెలుసు. వాట్ టు డూ..

Thursday, 22 December 2016

A Proud Day to Celebrate.. Happy Birthday


మనిషి పుట్టుకకు ఒక గుర్తింపు, ఒక సార్ధకత ఉండాలంటారు. మనం పోయాక కూడా పదిమంది తలుచుకునేలా మంచిని పంచుతూ, పెంచుతూ ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు.

పదేళ్ల క్రితం నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపులేకుండా టైమ్ పాస్ కోసం జాలంలోకి అడుగుపెట్టి, బ్లాగు మొదలెట్టి మీ అందరి అభిమానం, ప్రోత్సాహం, గైడెన్స్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ బ్లాగరుగా, ఫుడ్ కాలమ్నిస్టుగా, రైటర్ గా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, పత్రిక సంపాదకురాలిగా, పబ్లిషర్ గా ఒక్కో విషయం నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది.. ఇక చాలు అని అనుకోలేను. గత మూడు సంవత్సరాలుగా నా  పుట్టినరోజును నా కిష్టమైన పుస్తకాలు, అందునా తెలుగు పుస్తకాలు, రచయిత్రుల సమక్షంలో బుక్ ఫెయిర్ స్టాలులో ఘనంగా, సంతోషంగా జరుపుకుంటున్నాను. పుస్తకాల మధ్య గడపడం కంటే  ఘనంగా జరిగే ఉత్సవాలు ఉంటాయా? అందుకే నాకు నేను సంతోషంగా, గర్వంగా చెప్పుకుంటున్నా....

హ్యాపీ బర్త్ డే జ్యోతివలబోజు.. 

Many Happy Returns of the Day

Wednesday, 12 October 2016

బ్లాగర్ నుండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా....




Feeling Happy and Proud today . Received the membership card from Hyderabad Press Club as a Freelance Journalist and Web Magazine Editor....

Thanks to the Friend who has encouraged, supported and guided me through this process...


విజయదశమి సందర్భంగా లభించిన మరో విజయం.. కలలో కూడా ఊహించనిది.. ఇంకా నమ్మశక్యం కాకుండా ఉన్నది.


నాకు నచ్చిన అంశాలమీద గత పదేళ్లుగా వివిధ పత్రికల్లో రాసాను, రాస్తూ ఉన్నాను. నచ్చి, మెచ్చినవారు మరింత ప్రోత్సహించారు. నేను రాయగలను అన్న నమ్మకంతో వాళ్లే మాకు ఇది కావాలని నాచే రాయించారు ...
ఒక వృత్తి ... ఒక ప్రవృత్తి...... ఉద్యోగంలా కాకుండా ఫ్రీలాన్సింగ్ గా(దీనికి తెలుగు పదం అడక్కండి) రాస్తున్న నాకు నువ్వు నిజంగా జర్నలిస్టువే అన్నారు. ఇవాళ ఆ మాటకు ఒక గుర్తింపు కార్డును కూడా ఇచ్చారు.


స్టోరీ సోదిలా ఉందా... అర్ధం కావట్లేదు.. సరే కట్టె, కొట్టే పద్ధతిలో చెప్పేస్తా.. (కాస్త బిల్డప్ ఇవ్వొద్దేంటి?)


ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కాక మాలిక వెబ్ పత్రిక సంపాదకురాలిగా హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో మెంబర్ షిప్ కార్డును ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రాజమౌళిచారిగారినుండి అందుకున్న శుభవేళ... ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, రాయాలన్నమాట.. ...


ఇక నేను బండి కొనుక్కుని ప్రెస్ అన్న స్టిక్కర్ పెట్టుకోవచ్చు.. . కార్ ఉందిగాని అది నాది కాదుగా... కాని ముందుగా ఒక స్టిక్కర్, హెల్మెట్ కొనేసుకుంటా. వాటిని చూస్తూ ఉంటే బండి కొనాలన్న సంకల్పం నీరుకారిపోకుండా ఇంకా ధృడంగా మారాలన్నమాట.. :)


బ్లాగర్ గా, ఎడిటర్ గా, రైటర్ గా, కుకరీ కన్సల్టెంటుగా, కాలమ్నిస్టుగా.. ఇలా ఎన్నో పాత్రలు ధరించి విజయం సాధించినా. అన్నింటికన్నా ప్రియమైనది, అందమైనది.....

అమ్మమ్మ పాత్ర..

Wednesday, 14 September 2016

అప్పుడే పదేళ్లయిందా?? Congratulations and Celebrations JYOTHI…







మీకో సంగతి చెప్పనా? నాకు ప్రతీ సంవత్సరం అన్ని పండగలకంటే డిసెంబర్, సెప్టెంబర్ నెలలంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటారా? డిసెంబర్ లో నా పుట్టినరోజు. సెప్టెంబర్ లో నా JYOTHI 10 పుట్టినరోజు. 


అదేంటి డిసెంబర్ పుట్టినరోజు సంగతి తెలుసు మరి ఈ JYOTHI ఎవరూ అనుకుంటున్నారా.. ఒకటి నేను ప్రాణం పోసుకుని ఈ లోకంలోకి వచ్చినరోజు.. ఇంకోటి నాలోని భావాలు, ఆలోచనలు, సంఘర్షణలు అన్నీ అక్షరరూపంగా దాచుకోవడం మొదలుపెట్టి, నేర్చుకుంటూ, నేర్చుకుంటూ, ఇంకా నేర్చుకుంటూనే ఉన్న నా బ్లాగు పుట్టినరోజు. ఓసోస్ బ్లాగు పుట్టినరోజుకే ఇంత సీన్ , సినిమా ఉందా అంటారా?? చాలా ఉంది.  సాధారణ గృహిణిగా ( ఈ మాటంటే కోప్పడతారు మా మిత్రులు నారాయణస్వామిగారు) జాలప్రవేశం చేసి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గొప్ప కాదేంటి.. అంతేకాక వ్యక్తిగతంగా కూడా చాలా నేర్చుకుని, మారాను.. ఒకప్పుడు ఎంతో బేలగా, ప్రతీదానికి భయపడుతూ ఉండేదాన్ని. కాని ఇప్పుడు ఒక రాక్షసిలా మారా..  పని రాక్షసి అని పేరు తెచ్చుకున్నా. నాకు చాలా ఇష్టమైన గుర్తింపు ఇది..


కష్టాలు -  సుఖాలు, సంతోషం – దుఃఖం, పోరాటాలు – ఆరాటాలు, ఓటమి – గెలుపు  ప్రతీ మనిషికి అనుభవమే. విజయాలెప్పుడూ కొందరి సొంతం కాదు. నిజాయితీగా కష్టపడితే విజయం ముంగిట వాలుతుంది. కాని మనం అనుకున్నప్పుడే రాదు. కష్టాల ఆటుపోట్లతో రాటుదేలి మొండిగా తిరగబడి పనిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. కష్టం విలువ తెలిస్తేనే కదా సుఖం యొక్క ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతాం.. 
ఈ సంతోష సమయంలో ఈ మెట్టవేదాంతం ఎందుకు అనుకుంటున్నారా? పదేళ్ల క్రితం జ్యోతికి ఇప్పటి జ్యోతివలబోజుకు అస్సలు పోలిక లేదు. అప్పుడు తను ఒకరి కూతురు, ఒకరి భార్య, ఒకరి అమ్మగానే అందరికీ తెలుసు కాని ఇప్పుడు ??? పిల్లలకోసం అంతర్జాలాన్ని పరిచయం చేసుకుని , నాకిష్టమైన సంగీతం, సాహిత్యం అన్నింటికి మించి వంటలగురించి తెలియని విశేషాలు తెలుసుకుంటూ సాగిన పయనం నేటికి పది వత్సరాలు పూర్తి చేసుకుంది. నిజంగా నేను అంతర్జాలానికి ఎందుకు వచ్చానో కాని ఇలా కలలో కూడా ఆలోచించడానికి సాహసం చేయని సంఘటనలు, పరిచయాలు కలుగుతున్నాయి. చెప్పాలంటే నా గురించి చెప్పుకుంటే ఏమీ లేదు .. జీరో... చదువు లేదు, డబ్బు లేదు, ఫ్రెండ్స్ లేరు, సోషల్ సర్కిల్ లేదు. ఏధైనా చేయడానికి టాలెంట్ లేదు వంట కూడా సరిగా రాదు (ఇప్పటికీ మావారి అభిప్రాయం ఇదే). నాకున్న ప్రపంచం నాలుగుగోడల ఇల్లు, భర్త, పిల్లలు, వాళ్ల బాధ్యత మాత్రమే. అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేనుగాక చేయలేను అని నిర్ణయించేసుకున్నాన్నమాట. వార పత్రికలు, సీరియళ్లు, కుట్లు అల్లికలు, ఇంతే జీవితం. కొన్నేళ్లైతే పిల్లలు, వాళ్లు పిల్లలను చూసుకోవడం తప్ప ఇంకేమీ లేదు అనుకునేదాన్ని. 


కాని ఆ  పైవాడు అలా అనుకోలేదు. నాకంటూ ఒక రాత రాసిపెట్టాడు. దానికంటే ముందు కొన్ని కాదు చాలా పరీక్షలు పెట్టాడు. చావు తప్ప గత్యంతరం లేదు అన్న స్టేజ్ కు తీసుకువెళ్లాడు. ఆ తర్వాతే నా పయనాన్ని మార్చాడు.  ఒకప్పుడు అసాధ్యం, అసంభవం అనుకున్నవి ఒకటొకటి నాకు సుసాధ్యం చేసాడు. నిజంగా ఇది నా నమ్మకం.. ఆనాటి జ్యోతికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాని ఈనాటి జ్యోతి వలబోజుకు చెప్పడానికి ఒక పదం సరిపోవడం లేదు. ఇది అతిశయోక్తి, సొంతడబ్బా కాదండి. ఈ మధ్య కొందరు మిత్రులు మీరేం చేస్తారు, మీ పేరు పక్కన ఏమని రాయాలి? బ్లాగర్, రైటర్, ఫుడ్ కాలమ్నిస్ట్, ఎడిటర్, కుక్ బుక్ ఆథర్, పబ్లిషర్ .. ఏదని రాయము అన్నారు. జస్ట్ జ్యోతి వలబోజు చాలని చెప్తున్నాను.. 


ఎన్నో చెప్పాలని ఉంది. అదేంటోగాని నాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువే అనుకుంటా. చాలా విషయాలు ఎప్పటికీ గుర్తుంటాయి.. ఇక నా జీవితం గురించి చేసిన ఈ  పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలు అస్సలంటే అస్సలు మర్చిపోలేదు.  అవన్నీ రాయాలంటే ఓ నవల తయారవుతుంది. ఆ సోదంతా వద్దుగాని..  


 నేను నాటినుండి నేటివరకు ఇన్నివిధాలుగా ఎదగడానికి నన్ను ప్రోత్సహించి, సహాయపడిన ఎందరో మహానుభావులకు మనఃపూర్వక వందనాలు. బ్లాగుల్లో, ఫేస్ బుక్కులో , మీడియాలో, పబ్లిషింగ్ రంగంలో ఎంతో తోడ్పాటునిచ్చినవారందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అలాగే నా మీద ఈర్ష్య, కోపంతో విమర్శించినవాళ్లకు కూడా థాంక్స్.. తాత్కాలికంగా బాధ కలిగిన మరింత కసిగా ముందుకు సాగడానికి దోహదపడ్డారు కదా... ఈ పబ్లిషింగ్ వల్ల కూడా మంచి పేరు లభించింది... గొప్పగొప్పవాళ్ల  పరిచయాలు కలిగాయి.. మంచి పుస్తకాల ప్రచురణ చేయడం చాలా సంతృప్తిగా ఉంది.. ఎంతోమంది ప్రముఖ రచయితల పుస్తకాలు అచ్చువేయడం. వంగూరి వారి ప్రచురణల బాధ్యత, వంశీ ఇంటర్నేషనల్ కోసం కూడా వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 


ఏ సమయమైనా నేను పిలవగానే, అడగగానే సలహాలిచ్చి, సాంత్వననిచ్చే ఆత్మీయ మిత్రులు నాకు అంతర్జాలం ద్వారానే లభించడం ఒక వరం.. 


ఎన్ని విజయాలు, అభినందనలు వచ్చినా నన్ను నన్నుగా నిలబెట్టిన నా బ్లాగు జ్యోతి ఎప్పటికీ ఋణపడి ఉంటాను. నా పుట్టినరోజుతో పాటు నా బ్లాగు పుట్టినరోజు కూడా నాకు చాలా ముఖ్యమైనది... నా బ్లాగు సుందరి జ్యోతినన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది. పద్యాల ఆటలాడింది. బొమ్మలతో మాటలాడింది. భక్తిసాగరంలో ఓలలాడించింది.. నాకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులేసేలా చేసింది నా బ్లాగు.. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటాను....


Happy 10th Anniversary JYOTHI…. 


మరో ముఖ్య విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దాదాపు పది సంవత్సరాలుగా వివిధ  పత్రికల్లో(వార్త, చినుకు తప్ప) వ్యాసాలు, వంటలు, కవర్ స్టోరీలు  రాస్తూ ఉన్నాను. అంతేకాక అంతర్జాల పత్రిక సంపాదకురాలిగా  ప్రెస్ క్లబ్ అప్ హైదరాబాదులో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా మెంబర్ షిప్ వచ్చింది..(అంటే నాకంటూ ఒక బండి కొనుక్కుంటే PRESS అన్న స్టిక్కర్ పెట్టుకోవచ్చన్నమాట..భలే ఉంటుంది కదా )


మరో అద్భుతాన్ని త్వరలో పంచుకుంటాను..




Thursday, 29 October 2015

Happy Birthday My Friend....



May the sunshine of happiness always shine above you.
May the dove of peace rest over you and live in your home.
May the dense forest of love surround you all year round.
Best wishes to my beloved friend for an amazing year ahead…
Happy Birthday Friend….

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక? అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, మామ ... ఇలా మన జీవితంలోని ఎన్నో అనుబంధాలను ఆ దేవుడు మనకిచ్చాడు. కాని మనకు మాత్రమే సొంతం పరిమితమైన స్నేహితులను మాత్రం ఎంచుకునే హక్కు మనకే వదిలిపెట్టాడు. మీ బాగోగులు చూసి మిమ్మల్ని ఎల్లప్పుడు వెన్నుతట్టి నడిపే స్నేహితుడిని నువ్వే వెతికి పట్టుకో.పదిలంగా చూసుకో అని మనకు ఒక మహత్తరమైన అవకాశం ఇచ్చాడు ఆ దేవదేవుడు. అదీకాక నీ స్నేహితులను గురించి చెప్పు , నీ గురించి సమస్తం నేను చెప్తాను అని ఎవరో మహానుబావుడు అన్నాడు కూడా. చాలా వరకు బంధాలు, బంధుత్వాలు ఏదో ఒక కారణం, ప్రతిఫలం లేకుండా కొనసాగదు. ఆ బంధం ఎల్లకాలం కొనసాగుతుంది అని చెప్పలేము. ఆ బంధాలను మనం భద్రంగా చూసుకోలేమో కూడా. కాని ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి ప్రతిఫలం లేకుండా , ఆడా - మగా, పేదా గొప్ప అనే తారతమ్యాలు ఉండవు.
మనం జీవితప్రయాణంలో కలిసిన ప్రతివారిని ,లేదా పలకరించి కొన్ని సార్లు ముచ్చట పెట్టిన ప్రతీవాళ్లని అంత తేలికగా స్నేహితులుగా చేసుకోలేము కదా. "మై ఫ్రెండ్" అని కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను మాత్రమే పేర్కొంటాము. నిజమైన స్నేహితులు అంటే మనలోని బాధను మనం చెప్పకుండానే గుర్తుపట్టి దానిని పారద్రోలడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అంతవరకు మనని వదలరు. నేను ఎప్పుడు నీ వెంట ఉన్నాను అనే మనోధైర్యాన్ని ఇచ్చేది స్నేహితుడే.  నిజంగా ఎటువంటి ప్రతిఫలం లేకుండా స్నేహం చేసి మన మంచిని మాత్రమే కోరుకునే ఆ స్పెషల్ ఫ్రెండ్స్ మనకే తెలీని, మనలోదాగి ఉన్న ప్రతిభని గుర్తించి , దానిని బయటకు తీస్తారు. అలాగే ఎప్పటికప్పుడు మనని ఓ కంట కనిపెడుతూ ఎక్కడైనా తప్పటడుగు పడితే వెంటనే హెచ్చరించి సరిచేస్తారు.  దిగులుగా ఉంటే డిస్టర్బ్ చేసి మూడ్ మారుస్తారు.. మార్చుకునేలా చేస్తారు. అంతటి అద్భుతమైన స్నేహితులను పొందడం నిజంగా మన అదృష్టం.
జీవితపు ప్రయాణంలో మనకు లక్షలు, కోట్ల కన్నా ఆత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని పొందడం ,దాన్ని పదిలంగా భద్రపరుచుకోవం చాలా ముఖ్యం. లేకపోతే జీవితం అంటే జస్ట్  బ్రతకడానికే తప్ప మనఃస్పూర్థిగా, అన్ని ఆనందాలను అనుభవిస్తూ సంతోషంగా జీవించడం కాదు అని నా అభిప్రాయం..
ఒక గురువులా, శ్రేయోభిలాషిగా, మార్గదర్శిగా  అవసరమైన వేళ నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చే, సరైన దారిని వెతుక్కునేలా చేసే ఒక స్పెషల్ ఫ్రెండ్ పుట్టినరోజు సంధర్భంగా మనఃపూర్వక శుభాకాంక్షలు..
హ్యాపీ బర్త్ డే మిత్రమా...

Sunday, 13 September 2015

నవమ వార్షికోత్సవ శుభవేళ...




అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు. ఎవరో పాప నీళ్లలో పడిందంట .. అందరూ నీళ్లలోకి తొంగి చూస్తూ ఆదుర్దాగా, కంగారుగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఎవరో దూకిన చప్పుడైంది. ఆ  దూకిన వ్యక్తి ఆ పాపను  పైకి తీసుకువచ్చాడు. అందరూ అభినందించారు. ప్రాణాలకు తెగించి పాపను కాపాడావు. గొప్పవాడివి అంటూ పొగిడేసారు. కాని ఆ వ్యక్తి చిరాకుపడుతూ ఎవడ్రా తొంగిచూస్తున్న నన్ను నీళ్లలోకి తోసింది. అసలే నాకు ఈత రాదు. ఐనా ప్రాణభయంతో ఈదుతూ పాపను కూడా లాక్కొచ్చాను అని కోపంగా అరుస్తూ వెళ్లిపోయాడు..

ఇలాగే టైమ్ పాస్ కోసం అంతర్జాలానికి వచ్చిన నన్ను బ్లాగుల్లోకి తోసేసినవాళ్లందరిమీద చాలా కోపంగా ఉంది. ముఖ్యంగా ఒక ఫ్రెండ్  టీవీ సీరియళ్లు, నవళ్లు, సస్పెన్స్ సీరియల్స్ తప్ప వేరే తెలుగు సాహిత్యమంటే తెలీని నన్ను నువ్వు రాయగలవు, రాయి, ఆలోచించు. రాయి అంటూ  నాచేత అక్షరయజ్ఞం మొదలెట్టించారు. నా ఆలోచనలు చాలావాటిని మెరుగుదిద్ది రాసేలా చేసారు. అలా అలా సాగిపోతుంది. ఇప్పుడు కాస్సేపు టీవీ చూద్దామన్నా, పడుకుందామన్నా తీరిక దొరకడంలేదు. వందిళ్ల పూజారి అన్నట్టు  ఒకటి కాగానే ఇంకో పని...ఇష్టమైన పనే కాని అప్పుడప్పుడు విసుగు రాదేంటి ఎవరికైనా..  అందుకే ఒక్కోసారి ఆ వ్యక్తి మీద చాలా కోపమొస్తుంది. తిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలా రాయడం అలవాటు కాకుంటే ఎంచక్కా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సీరియల్స్ అన్నీ చూస్తూ హాయిగా ఉండేదాన్ని. ఏ టెన్షనూ లేకుండా టీవీ చూస్తూ, అఫ్పుడప్పుడు ఊరిమీద పడి తిరుగుతూ, కావలసినప్పుడల్లా నిద్రపోతూ ఉండేదాన్ని. ఎంత ఖాళీ సమయముండేది.. ఇప్పుడవన్నీ కుదరడం లేదు కదా.. కోపం రాదేంటి మరి..

సెప్టెంబరు నెల వస్తుందనగానే ప్రతీ సంవత్సరం నాలోని ఆలోచనలు,
జ్ఞాపకాలు  రింగులు.. రింగులు చుట్టుకుంటూ గిర్రున వెనక్కి వెళ్లిపోతుంటాయి. ఎందుకంటే నా జీవితంలో ఊహించని మలుపు తిప్పిన తెలుగు బ్లాగు ప్రయాణం ప్రారంభమైంది  ఇదే సెప్టెంబరు 14, 2006లో కాబట్టి. అసలైతే ఏదో ఏడాది లేదా రెండు లేదా మూడేళ్లకు బ్లాగు రాయడం ఆపేసేదాన్ని. కాని దిగినకొద్దీ నేర్చుకోవడానికి ఎన్నో నిధినిక్షేపాలు దొరుకుతుంటే ఎవరు మాత్రం వెనక్కు తిరుగుతారు. కంప్యూటర్ అంటే ఒక డబ్బా టీవీ, టైప్ రైటర్ అని తప్ప వేరే తెలీని నాకు ఓపికగా ఎన్నో సాంకేతిక విషయాలను, ఎప్పటికప్పుడు, అడిగినప్పుడల్లా వివరంగా నేర్పించిన వారెందరో.. నా పిచ్చి రాతలను రచనలుగా చేసుకోవడంలో ప్రోత్సహించి, తప్పులను ఎత్తి చూపి సరిదిద్దుకునేలా చేసిన సాహిత్య గురువు ... మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా మిత్రుల సాయంతో నా బ్లాగ్ ప్రయాణం ఆపకుండా కొనసాగించాను..  ఒకానొక సమయంలో నేనేంటి? నా జీవితం ఇలాగే గడిచిపోవాలా? పిల్లలు ఉద్యోగాల్లో చేరి, పెళ్లిల్లయ్యాక వాళ్లకు, వాళ్ల పిల్లలకు సేవలు చేయడం, టీవీ చూడడం, అందరి బాగోగులు చూడడమేనా నా పని? వేరే ఏమీ చేయలేనా? నా గుర్తింపు ఏంటి? అసలు నేనేమి చేయగలను? ఉద్యోగం చేయాలంటే పెద్ద చదువులు లేవు. పాండిత్యము లేదు. ఇప్పుడు చదువుకుని మాత్రం ఏం చేయాలి ?? చదివినదంతా టైమ్ పాస్ పుస్తకాలే. సస్పెన్స్ నవళ్లు, వార పత్రికలు .. పుట్టింటివైపు, అత్తింటివైపు పండితులనదగ్గవారు లేరు. తెలుగు  పాండిత్యం కాస్తైనా నాకు ఉందేమో అనుకోవడానికి. నేను ఎప్పటికీ ఫలానా వారి కూతురు, భార్య, తల్లి అని అనిపించుకోవాలా? ఎప్పుడు వారి మీద ఆధారపడాలా?? థూ!! యెదవ జన్మ.... నా బతుకింతే... ఇలా సమాధానం లేని ప్రశ్నలెన్నో ?? కాని వీటన్నింటికి సమాధానాలు కనుక్కొని నా ప్రస్థానాన్ని ప్రింట్ మీడియాకు, పత్రికా నిర్వహణకు, చివరకు పబ్లిషింగ్ రంగంలోకి మారడం వరకు మూలకారణమైన నా బ్లాగు నాకు ఎప్పటికీ అపురూపమే. ఎప్పుడే ఆలోచన వచ్చినా బ్లాగులో రాసేసేదాన్ని కాని  ఇప్పుడు ఆ ఆలోచనలు  కొన్ని పత్రికలకు మరికొన్ని ఫేస్బుక్ గోడమీదకు చేరిపోతున్నాయి. అందుకే బ్లాగుల్లో ముందులా రాయలేకపోతున్నానే అని దిగులుగా ఉంటుంది. రోజుకు మరో నాలుగు .. కనీసం రెంఢుగంటలైనా ఎక్కువుంటే బావుండు. ఎవరైనా అరువిస్తే బావుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో... 


జీవితపు రెండవ భాగంలో మొదలెట్టిన ఈ జాలప్రయాణంలో మొదట ఒడిదుడుకులైనా ధైర్యంగా నిలదొక్కుకోవడం వల్ల అంతా విజయమే.. బ్లాగులు (Jyothi, జ్యోతి, షడ్రుచులు, బ్లాగ్ గురువు, పొద్దు గడి, చిత్రమాల, గీతలహరి, నైమిశారణ్యం, ఆముక్తమాల్యద, విజయవిలాసం) అన్నీ కలిపి  ఇంతవరకు సందర్శించిన ఆత్మీయబందువులు సుమారు 7 లక్షలవరకు ఉన్నారు) ఈ ప్రేమ, అభిమానమంతా నా స్వార్జితం .. నా సొంతం మరి... 


తొమ్మిదేళ్ల నా బ్లాగు సుందరి జ్యోతి నన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది.  పద్యాల ఆటలాడింది. బొమ్మలతో మాటలాడింది.  భక్తిసాగరంలో ఓలలాడించింది.. నాకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులేసేలా చేసింది నా బ్లాగు.. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటాను.... నా బ్లాగు నా హృదయభాను అన్నమాట. అందుకే ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను.. తెలుగు బ్లాగులవల్ల నాకంటే ఎక్కువగా లాభపడింది ఎవరూ లేరు అని. J ఆ మాత్రం గొప్ప చెప్పుకుంటే తప్పేంటంట.. 


నా పుట్టినరోజుతో పాటు నాకు పునర్జన్మని, మహత్తరమైన గుర్తింపునిచ్చిన నా బ్లాగు జ్యోతి కి తొమ్మిదవ హ్యాపీ హ్యాపీ బర్త్ డే  అన్నమాట..... ఈ సందర్భంగా నాకు తోడున్న, ప్రోత్సహించిన, అభినందించిన, సంతోషించిన ఆత్మీయ మిత్రులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు..

శుభం భూయాత్......

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008