Wednesday 30 November 2011

‘ఆరోజుల‘పై మహిళల్లో చైతన్యం



'ఆరోజుల'పై మహిళల్లో చైతన్యం..

భారతదేశం కర్మభూమి. 200 ఏళ్లు విదేశీయుల దాస్యంలో ఉండి ఎన్నో ఏళ్లు పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. క్రమక్రమంగా ఈనాడు భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించింది సామాజికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికపరంగానూ కూడా. ఒకవైపు అంబరాలను అందుకుంటున్న సాంకేతిక విజయాలు, మరోవైపు కనీసం తిండి, బట్టకు కూడా నోచుకోని దుర్భర జీవనం. పట్నాలలోని మురికివాడలు, మారుమూల పల్లెల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ దారిద్య్రంతోపాటు నీటి ఎద్దడి, అపరిశుభ్రతవల్ల ఎందరో మహిళలు తమకు నెల నెలా తప్పనిసరిగా అవసరమయ్యే బట్టముక్క కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.


మన భారతీయ సంస్కృతిలో స్ర్తి తన జీవితంలో 30-35 సంవత్సరాలలో ఎదుర్కొనే నెలసరి గురించి బహిరంగంగా మాట్లాడ్డం చాలా తప్పు, పాపం కూడా. అది ఒక నిషేధిత అంశం అని చెప్పవచ్చు. మనిషికి కావలసింది కూడు, గూడు, నీడ అని అందరూ అంటారు. ఎన్నో సంస్థలు వాటి గురించి ప్రచారం చేస్తాయి, సహాయం చేస్తాయి కాని మహిళలకు క్రమం తప్పకుండా అవసరమైన శుభ్రమైన బట్ట గురించి ఎవ్వరూ ఆలోచన కూడా చేయరు. అసలు కట్టుకోవడానికే గుడ్డలు లేవంటే ఇక దీని గురించి ఎవరు పట్టించుకుంటారు. అది అంత ముఖ్యమా? ఆడాళ్లు వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు అని వదిలేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ తప్పనిసరిగా అనుభవించే ప్రాకృతిక ధర్మం ఇది. దీని గురించి మాట్లాడటానికి నిరక్షరాస్యులైన గ్రామీణ మహిళలే కాదు చదువుకున్న పట్నంలోని స్ర్తిలు కూడా సిగ్గుపడతారు, ఇష్టపడరు. అసలు ఈ విషయం గురించి గట్టిగా అందరిలో మాట్లాడ్డం కూడా తప్పు అనేవారున్నారు. ముఖ్యంగా మగవారిముందు అస్సలు నోరు విప్పరు.


ఆకాశంలో సగం అని చెప్పుకునే మహిళలు ప్రపంచ జనాభాలో కూడా దాదాపు సగం ఉన్నారు. వ్యాపార ప్రకటనల్లో కూడా మహిళలే లక్ష్యంగా ఉన్నారు. కాని వారికి అవసరమైన సానిటరీ నాప్కిన్స్ గురించి ఆలోచించేది ఎంతమంది. ఇప్పుడిప్పుడు వీటి గురించి ప్రకటనలు విరివిగా వస్తున్నాయి. కాని అవి అందరికీ అందుబాటైన ధరలో ఉండవు. పట్టణాల సంగతి వదిలేస్తే గ్రామాల్లోకి వెళితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలామంది స్ర్తిలు, పురుషులు ఈ నెలసరి రక్తస్రావం అనేది ఒక పాపం, అపరిశుభ్రం, అంటరానితనంగా భావిస్తారు. ఈ సమయంలో నాలుగు రోజులు ఇంట్లోకి రాకుండా ఎవరినీ ముట్టుకోకుండా విడిగా ఉండే స్ర్తిలు ఇంకా ఉన్నారు. తమ అవసరానికి వారు అపరిశుభ్రమైన పాత బట్టలు ఉపయోగిస్తారు. అలా చేయటంవల్ల తెలియని వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ కలుగుతాయి అని వారికి తెలీదు. ఆ బట్టలను రోజూ ఉతుక్కుంటారు కాని వాటిని బహిరంగంగా ఆరవేయలేరు. కొన్నిచోట్ల ఉతుక్కోవడం కూడా కష్టమే. ప్రతీ ఇంటికి బావి, కుళాయి ఉండదు. వీధిలో ఉండే చేతి పంపులే వారికి దిక్కు. స్నానానికి నీళ్లు కరవైతే ఇక ఈ బట్టలుతకడానికి నీళ్లెక్కడినుండి తేగలరు? ఇక చాటు అనేది చాలా కష్టం. అందుకనే ఇంట్లో ఎవరికీ కనపడకుండా తలుపు వెనకాలో, గోడ పక్కనో ఆరేసుకుంటారు. అవి పూర్తిగా ఎండవు. తడితడిగా ఉంటాయి. అయినా వాటినే ఉపయోగించక తప్పని పరిస్థితులు. ఒకోసారి కొన్ని ఇళ్ళల్లో ఉండే ఇద్దరు ముగ్గురు స్ర్తిలు ఒకేబట్టను వాడుకుంటారు. ఇంకో దారుణమైన విషయమేమిటంటే కొందరు స్ర్తిలు ఒకే బట్టను సంవత్సరం పైగా ఉపయోగిస్తారు. అది గట్టిగా రాయిలా మారినా అదే దిక్కు. వారికి తప్పదు మరి. దారిద్య్రం మూలంగా వేరే బట్టలు లభించడానికి ఆస్కారం లేదు.


ఇంకా కొన్ని గ్రామాలలో మహిళలు బియ్యం సంచీ ముక్కలు, జనపనార గుడ్డలు, కాగితం, బియ్యం ఊక కూడా ఉపయోగించుకుంటారు. ఇలా చేయడంవల్ల వ్యాధులు సోకి ఆరోగ్యం చెడిపోయి గర్భసంచి కోల్పోయినవారు, ఒకోసారి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. అంతేకాదు మారుమూల గ్రామాలలో ఇప్పటికీ మరుగుదొడ్ల సమస్య కూడా ఉంది. ప్రతీ మనిషికి ఉదయం లేవగానే తీర్చుకోవాల్సిన కాలకృత్యాలు ఉన్నాయి. కాని స్ర్తిలకు ఉదయం వెలుగులో కాకుండా ఊరంతా సద్దుమణిగాక రాత్రివేళలో ఊరవతల తుప్పల్లో, పొదల్లో తమ కాలకృత్యాలు తీర్చుకోవాల్సివస్తుంది. అప్పుడప్పుడు ఆ చీకటిలో విషపురుగులు, పాములబారిన పడక తప్పదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక అపరిశుభ్రత, ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచిస్తారు.


కాని 2004 నుండి ఒక స్వచ్ఛందసంస్థ ‘గూంజ్’ ఈ విషయమై దేశంలోని గ్రామాలు, పట్టణాలలో పర్యటించి మహిళలను కలుసుకుని వారి అవసరాలు, సమస్యల గురించి తెలుసుకుని తమకు సాధ్యమైన సాయం చేస్తున్నారు. తమ సంస్థద్వారా నూలు బట్టలు సేకరించి వాటిని శుభ్రంగా ఉతికి సానిటరీ ప్యాడ్‌లుగా తయారుచేసి సరఫరా చేస్తున్నారు. వీరు నెలకు కనీసం 1,50,000 నుండి 2,00,000 వరకు తయారుచేస్తున్నారు. ఈ పర్యటనలో ఎంతోమంది మహిళలు ఒక పరిశుభ్రమైన బట్టకోసం వారు పడే తిప్పలు, ఈ విషయంలో సరియైన అవగాహన లేక అనారోగ్యం పాలవడం గురించి తెలుసుకుని నిర్ఘాంతపోయారు. సంస్థసభ్యులు ఊరూరా తిరిగి ఈ సానిటరీప్యాడ్స్ ఉపయోగం గురించి, వాటి తయారీ గురించి, ఆరోగ్య సమస్యలగురించి మహిళలకు వివరిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి పునాది వేసిన సంస్థ వ్యవస్థాపకుడు అంశు గుప్తా అంటారు... మహిళలకు ఒక శుభ్రమైన బట్ట అందుబాటులో వారు ఆమె నెలసరి ఒక బాధగా, పాపంగా కాకుండా తమకు మాత్రమే లభించిన ప్రత్యేకమైన ప్రాకృతిక ధర్మంగా భావిస్తారు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఈ సంస్థ వారు పట్టణాలనుండి బట్టలు, స్టేషనరీ గినె్నలు వగైరా వస్తువులను సేకరించి వాటిని గ్రామీణులకు ఉపయుక్తంగా మార్చి పంపిణీ చేస్తున్నారు. ఈనాడు గూంజ్ సంస్థ దేశంలో 21 రాష్ట్రాలలోని గ్రామాల ప్రజలకు 70 టన్నుల వస్తువులను సరఫరా చేస్తుంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను పొందింది. అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో తరచు వరదలు, ప్రకృతి బీభత్సాలు సంభవిస్తుంటాయి. ఇటువంటి సమయంలో బాధితులకు కనీస అవసర వస్తువులను అందరూ అందిస్తారు. కాని స్ర్తిలకు అవసరమైన బట్టను గురించి ఎవరూ ఆలోచించరు. ఛీ అనుకుంటారు కూడా. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎటువంటి చొరవ చూపడంలేదు అంటారు అంశుగుప్తా. ఇటీవల భారత ప్రభుత్వం సానిటరీ నాప్కిన్స్ సబ్సిడీ ధరలకు అందిస్తామని ప్రకటించింది. కాని అది ఎంతవరకు అమలవుతుందో తెలీదు. ఈ సంస్థకు సహాయం చేయదలచినవారు ఈ సైట్లో తగిన వివరాలు పరిశీలించగలరు..http://goonj.org/

Wednesday 23 November 2011

కథ చెబుతారా??


మీకు కథలు చదవడం అలవాటే కదా. మరి ఎపుడైనా కథలు చెప్పారా?? చెప్పే ఉంటారు. ఆఫీసుకు ఆలస్యంగా వెళ్ళినా. ఇంటికి ఆలస్యంగా వచ్చినా. చెప్పిన పని టైం కి చేయకపోయినా అప్పటికపుడు కొత్త కథ క్రియేట్ చేసేసి చెప్పేస్తుంటారు. అప్పటికి ఆ గండం తీరిపోతుంది. అవతలి వాడు నమ్మేంతవరకు మన కథలు పని చేస్తాయి. లేదా నమ్మేట్టు చెప్పడం, నిజమని అనిపించేలా చెప్పడం అనేది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొందరు కథలు యిట్టె చెప్పేస్తారు. కొందరు ఎంత ప్రయత్నించినా చెప్పలేరు. అమాయకులు నిజం చెప్పేసి మాటలు పడతారన్నమాట. :) ఇక అసలు విషయానికి వస్తే.. మీకు ఒక సన్నివేశం చెప్తే దాని ఆధారంతో ఒక చిన్న లేదా పెద్ద కథ రాయగలరా.. నవల రాస్తా అంటారా.. మరీ మంచిది.. మీ ఇష్టం.

పొద్దు జాలపత్రికవాళ్ళు ఈ మధ్య కథ చెప్తారా అంటున్నారు. ఓస్ అదెంత పని . వాళ్ళు ఇచ్చిన సన్నివేశాన్ని జాగ్రత్తగా చదవండి. ఆలోచించండి. చించండి.. రాసేయండి. రాస్తూ పోతూ ఉంటే అది చిన్న కథ లేదా పెద్ద కథ ఏదైనా పర్లేదు. రాయడం అయ్యాక పొద్దు వాళ్ళకు పంపేయండి.. ఓ పనైపోతుంది.. మరిన్ని వివరాలకు ఇది చూడండి.. కథ చెబుతారా.. వాళ్లకు నచ్చితే పొద్దులో అచ్చేస్తారు. లేదంటే మీ బ్లాగులో పడేయండి. ఇలా తరచూ రాస్తుంటే మీకే బాగా రాయడం అలవాటవుతుంది. ఊరికే ఎదో ఒక విషయం మీద టపా రాయడం కన్నా ఇలా కొత్తగా కథలు రాయడం ఎలా అనేది తెలుస్తుంది.. అలవాటవుతుంది. అదన్నమాట సంగతి.. రాయండి రాసేవాళ్ళకు చెప్పండి.

Friday 18 November 2011

కార్తీక వనభోజనాలు - ఎవరెవరు చేసారంటే

కార్తీక పున్నమి సందర్భంగా రెండేళ్ళ నుండి తెలుగు బ్లాగుల్లో కూడా వనభోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ వంతుగా ఎదో ఒక వంటకం తమ బ్లాగులో పెట్టేసి అందరిని పిలిచేస్తున్నారు. ఈసారి కూడా పున్నమి నాడు వనభోజనాలు తక్కువమంది పాల్గొన్న సూపర్ హిట్ అని చెప్పవచ్చు. మరి ఆ రోజు ఎవరెవరు పాల్గొన్నారో చూసి అందరినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అన్ని వంటకాలు ఒకేదగ్గర ఉంటే ఎప్పుడైనా కొత్త వంటకం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే సరి.. వనభోజనాల పిలుపును అందుకొని నడుం బిగించి వంటలు చేసేసి, రాసేసిన వారందరికీ బోల్డు బోల్డు థాంక్స్..

మౌళి
కృష్ణప్రియ
మాలకుమార్
శ్రీలలిత
లత
ఎన్నెల
పద్మార్పిత
జ్యోతిర్మయి
వరూధిని
జ్యోతి
జయ

Saturday 12 November 2011

హలో బ్లాగున్నారా??

ఆంధ్రభూమి దినపత్రిక వైజాగ్ ఎడిషన్లో ప్రతీ ఆదివారం హలో బ్లాగున్నారా ? అన్న శీర్షికను నిర్వహిస్తున్నారు జగతి జగద్ధాత్రి. శీర్షికలో గత జులైలో నా బ్లాగు కూడా చోటు చేసుకుంది. పేపర్ దొరకడానికి ఇన్ని రోజులు పట్టింది



నా గురించి ఇంత ఆత్మీయంగా రాసిన మాటలను నా బ్లాగులో నిక్షిప్త పరుచుకోవాలని ఈ కటింగ్స్ ఇక్కడ పెడుతున్నాను..




థాంక్ యూ జగతి.. లవ్ యూ..

Thursday 10 November 2011

కార్తీక వనభోజనాలు -బొంబాయ్ హల్వా



ముంధుగా అందరికి కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. మరి ఈ రోజు బ్లాగ్ వనభోజనాలు అనుకున్నాం కదా. అఫ్పుడే హడావిడి మొదలైంది. నావంతుగా స్వీటు తెచ్చాను. అందునా నాకు చాలా చాలా ఇష్టమైంది..

స్వీట్లంటే నాకు మొదటినుండి ఇష్టమే కాని డబ్బా ఖాళీ చేసేంత ఇష్టం కాదులెండి. కాని అన్నింటికంటే చాలా చాలా ఇష్టమైంది రబ్బర్‌లా సాగే రంగు రంగుల బొంబాయి హల్వా, గట్టిగా రాయిలా ఉండే సోన్‌పట్టీ. ముఖ్యంగా పుల్లారెడ్డి, బొంబాయ్ హల్వా షాపులోవే బాగుంటాయి. ఇంక వేరేవ్వరూ అలా చేయలేరు కూడా. ఇప్పుడు బొంబే హల్వా దుకాణం ఎత్తేసారు. మిగిలింది పుల్లారెడ్డి.. చిన్నప్పటినుండి ఎవరు స్వీట్ డబ్బా తెచ్చినా అందరికంటే ముండు ఈ రెండు స్వీట్లు కనిపిస్తే ఎత్తేసేదాన్ని. వీటికోసం మా మరదలు. నా కొడుకు నాతో పోటీకొస్తారు... అందుకే ఈ స్వీట్లను జాగ్రత్తగా డబ్బాలో పెట్టి నా అల్మైరాలో దాచుకుంటాను. ఎప్పుడైనా తీరికగా ఉన్నప్పుడు ఓ పుస్తకం పట్టుకుని ఓ స్వీటు ముక్క కొంచం కొంచం తింటూ చదువుకోవడం చాలా ఇష్టమైన అలవాటు. అదేంటో ఇప్పుడు ఎవరూ స్వీట్ డబ్బాలు తేవట్లేదు. తెచ్చిన కూడా అందులో ఈ హల్వా ఉండదు. ఎంత ఇష్టమైనా ముందులా తినే వయసు కాదు. ప్చ్..

అసలు ఈ స్వీట్ ఇంట్లో కూడా చేయొచ్చు అనే విషయం అస్సలు తెలీదు. అది స్వీట్ షాపువాళ్లే చేయగలరు, మనం ఇంట్లో చేయలేం అనుకునేదాన్ని. లేకుంటే ఎప్పుడో చేసుకుని తినేదాన్ని కదా. ఈ మధ్యే ఒక ఇంగ్లీషు ఫుడ్ బ్లాగులో ఈ హల్వా చేసుకోవచ్చు అని తెలిసింది. అది కూడా చాలా ఈజీగా. మరి నేను ఊరుకుంటానా?? చేసి తినేసా. అందరికీ చెప్పుకున్నా బొంబాయ్ హల్వా చేసానోచ్ అని. మరి మావాళ్లు అందరికీ తెలుసు అదంటే నాకెంత ఇష్టమో?? కాని తెలిసినా అప్పుడప్పుడు తెచ్చివ్వాలని మాత్రం ఒక్కరూ అనుకోలేదు ఇంతవరకు..

ఇక ఈ హల్వా ఎలా చేయాలో చెప్పనా...

కార్న్ ఫ్లోర్ - 5 tbsp
పంచదార - 1 1/2 కప్పులు
నీళ్లు - 3 1/2 కప్పులు
గుమ్మడికాయ గింజలు లేదా కాజు, బాదాం, పిస్తా ముక్కలు - 1/4 కప్పు
నెయ్యి - 2 tbsp
ఇలాచి పొడి - 1/2 tsp
ఓరెంజ్ లేదా గ్రీన్ కలర్ - 3 - 4 చుక్కలు

మూడు కప్పుల నీళ్లు మరిగించి చక్కెర వేసి చిక్కబడి తీగపాకం వచ్చేవరకు మరిగించాలి. మరో పక్క ఒక ప్లేటుకు లోపలంతా నెయ్యి రాసి ఉంచుకోవాలి. మిగిలిన సగం కప్పు నీళ్లలో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్ని మరుగుతున్న చక్కెరపాకంలో వేసి ఉడికించాలి. ఇప్పుడు ఇది పాలల్లా తెల్లగా ఉంటుంది . క్రమేణా రంగు మారి పారదర్శకంగా గ్లాసులా అవుతుంది. ఇప్పుడు ఇలాచి పొడి, నెయ్యి, కలర్, చిన్న ముక్కలు చేసిన డ్రై్‌ఫ్రూట్స్ లేదా గుమ్మడి గింజలు వేసి కలపాలి. వెంటనే దింపేసి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి సమానంగా పరవాలి. గంట సేపు అలా వదిలేసి ముక్కలు కట్ చేసుకుంటే సరి.. ఈ స్వీటు చేసేటప్పుడు నిదానంగా చిన్న మంటపై చేయండి. వీలుంటే నాన్ స్టిక్ ప్యాన్ ఉపయోగించండి. లేకుండే మాడుతుంది.

ఇది చదివాక కూడా అర్ధం కాలేదంటే. ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూసేయండి.


Tuesday 8 November 2011

కార్తీక వనభోజనాలకు ఆహ్వానం


కార్తీకమాసం వచ్చేసింది. ఈ సంవత్సరానికి పెద్ద పండుగలన్నీ ఐపోవచ్చాయి. చలిపులి మెల్లిగా ఒళ్లువిరుచుకుంటుంది. కార్తీకమాసం శివకేశవులిద్దరికి ప్రియమైనది.నదీ స్నానాలు, ఉపవాసాలు, దీపారాధన,పూజలతో అందరూ బిజిబిజిగా ఉన్నారు. ఈ మాసంలో మరో ముఖ్యమైనది కార్తీక వనభోజనాలు. తమ వృత్తి, ప్రవృత్తులతో ఎవరికి వారు బిజీ ఐపోతున్నారు. ఒకరినొకరు కలవడానికి వీల్లేకుండా మనుషులమా? యంత్రాలమా అన్నట్టు అయ్యారు అందరూ. ఏమంటే తీరికలేదు అంటారు. ఈ వనభోజనాల నెపంతో ఇంటినుండి, ఉద్యోగబాధ్యతనుండి ఒక్కరోజైనా దూరంగా బంధువులతో, స్నేహితులతో గడిపేస్తారు. మరి మన బ్లాగుల్లో రెంఢు సంవత్సరాలనుండి ఈ కార్తీక వనభోజనాల ఒరవడి మొదలైంది తెలుసు కదా... దేశవిదేశాల్లో ఉన్నవారందరూ ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. మరి ఈసారి మాత్రం వదిలేస్తామా? ఎల్లుండే కార్తీక పూర్ణిమ. అందరూ రెడీనా.. మీకు నచ్చిన, వచ్చిన వంటలతో వచ్చేయండి ఎల్లుండి గురువారం 10వ తేదీన బ్లాగ్ వనభోజనాలు.. బ్లాగులు, సంకలినులన్నీ ఘుమఘుమలాడిపోవాలి....

గమనిక : ఇది ఆడవారికే కాదు. నలభీముల వారసులైన మగమహారాజులకు కూడా..

గతంలో మనం జరుపుకున్న వనభోజనాల విశేషాలు:

2009

2010

Monday 7 November 2011

పుత్తడి లాంటి ఇత్తడి!





పుత్తడి లాంటి ఇత్తడి

అనాదిగా కాంతలకూ కనకానికీ అవినాభావ సంబంధముంది. బంగారం అంటే ఇష్టపడని అతివలు ఉండరేమో. అందానికే కాకుండా బంగారం మన భారతీయ సంప్రదాయానికీ, ఆచారాలకూ ప్రతీకగా నిలుస్తుంది. ఇంట్లో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఇక ఆడపిల్లలకు పుట్టినప్పటి నుండే బంగారం కొనడం ప్రారంభిస్తారు. పెరుగుతున్న కొద్దీ ఎన్నో రకాలైన ఆభరణాలు తయారుచేయిస్తారు. బంగారం అందానికే కాకుండా అవసరానికి కూడా ఆదుకుంటుందని అందరికీ తెలిసిందే. అందుకే చేతిలో కాస్త డబ్బున్నప్పుడల్లా బంగారాన్ని ఒక ఆస్థిగా కొని పెడుతుంటారు. ఒకప్పుడు విరివిగా కొనే బంగారం నేడు అందనంత ఎత్తుకు ఎగిరిపోతోంది. ఈ రోజు మధ్యతరగతి వారికి బంగారం కొనడానికి అందుబాటులో లేదనే చెప్పవచ్చు. అలా అని నగలు లేకుండా ఉంటారా ఆడవాళ్లు. ఉండగలరా? ఇలాటి వారి కోసమే మార్కెట్లోకి బంగారపు నగలకు ధీటుగా ఏ మాత్రం తీసిపోని రోల్డ్‌గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ నగలు విరివిగా లభిస్తున్నాయి. అవి కూడా అందరికీ అందుబాటైన ధరలో ఆకర్షణీయమైన డిజైన్లలో మగువలను ఆకట్టుకుంటున్నాయి.



పాపిట బిళ్ల నుండి కాలి పట్టీల వరకు వన్ గ్రామ్ నగలు లెక్కలేనన్ని డిజైన్లలో లభిస్తున్నాయి. ఒకప్పుడు మహిళలు బంగారం నగలు మాత్రమే ధరించేవారు. గిల్టు నగలు అంటే చాలా చిన్నచూపు ఉండేది. అవసరమా అనుకునేవారు. ఎంత తక్కువలో ఐనా మెడలో ఒక సన్న చైను, చేతులకు రెండు గాజులు, చెవులకు చిన్న దిద్దులు ఉంటే చాలు అమ్మాయికి. రోజూ వేసుకుంటుంది అనేవాళ్లు. కాని ఈ రోజు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా ఈ వన్‌గ్రాం గోల్డ్ నగలు మాత్రం రోజుకో డిజైన్‌వి వేసుకునేలా విరివిగా, అందుబాటైన ధరల్లో దొరుకుతున్నాయి. ఏదైనా పార్టీకి కాని పెళ్లికి కాని వెళ్లినప్పుడు అక్కడ మహిళలు ఒంటినిండా నగలతో కనిపిస్తే ఆశ్చర్యపోకండి. అందులో సగానికి పైగా ఈ వన్‌గ్రామ్ నగలే అయ్యుండవచ్చు. ఈ నగలు మధ్యతరగతి వారేకాక సంపన్న వర్గాల వారు కూడా నిస్సంకోచంగా ధరిస్తున్నారు. బంగారం కంటే ఈ నగలలోనే ఎక్కువ డిజైన్లు ఉన్నాయేమో అని ఆశ్చర్యపోక తప్పదు. అస్సలు తేడా కనిపెట్టలేము కూడా. వీసమెత్తు బంగారం లేకున్నా ఈ వన్‌గ్రామ్ నగలు వేసుకుని దర్జాగా తిరుగుతున్నారు స్ర్తిలు. వీరి అవసరానికి తగ్గట్టుగానే ఈ నగలమ్మే దుకాణాలు కోకొల్లలుగా ఉన్నాయి. పెళ్లికి కావలసిన దుస్తులు, ఇతర వస్తువులలాగే ఈ నగలను కూడా తమకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకునే అవకాశం కూడా ఉంది.



ఈ మధ్యే ప్రాచుర్యం పొందిన ఈ వన్‌గ్రామ్ గోల్డ్ నగలు హిందీ టీవీ సీరియళ్ల ద్వారా ఉత్తరాది నుండి మనకు పరిచయమయ్యాయి. ఇందులో ఉత్తరాది డిజైనే్ల కాక టెంపుల్ జ్యుయెలరీ, దక్షిణాది సంప్రదాయ డిజైన్లు కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఏది బంగారం నగో, ఏది వన్‌గ్రామ్ నగో తెలీనంతగా ఉంటున్నాయి. అది ఆ ఆభరణం తయారుచేయడంలోని నైపుణ్యమే అని ఒప్పుకోవాల్సిందే. వన్‌గ్రామ్ నగలు రూ.200 నుండి రూ.10 వేల వరకు ధర పలుకుతున్నాయి. అందులో వాడిన రాళ్లు, ముత్యాలు, పగడాలను బట్టి ధర పలుకుతుంది. ఈ నగలను రాగి లేదా వెండితో తయారుచేసే ఒక గ్రాం బంగారు పూత పూస్తారు. ఈ పూత 0.000007 అంగుళాల కన్నా తక్కువ పల్చగా ఉంటుంది. అందుకే నాణ్యతగా మన్నికగా ఉంటాయి.



ఈ మధ్య మీరు హిందీ, తెలుగు సినిమాల్లో గమనించే ఉంటారు. ముఖ్యంగా జోదా అక్బర్, అరుంధతి, నాగవల్లి మొదలైన సినిమాల్లో నటీమణులు చాలా భారీ నగలు ధరించి ఉంటారు. ఒక్కో నగ లక్షల్లో ఉంటుందని అనుకుంటాం. అంత అందమైన డిజైన్ల నగలు మనం కూడా కొనుక్కోవచ్చు అనే ఊహ చేయడానికి భయం వేస్తుంది. కాని అదే డిజైన్ నగలు వన్‌గ్రామ్ గోల్డ్‌లో చాలా తక్కువ అందుబాటైన ధరలో మార్కెట్లో లభిస్తుంది. ఉదా.రాళ్లు పొదిగిన బంగారు జడ రెండు నుండి నాలుగు లక్షలు ఉంటే వన్‌గ్రామ్‌లో రెండు వందల నుండి మూడు వేలల్లో దొరుకుతుంది. వడ్డాణాలు బంగారంతో చేసినవి రాళ్లు పొదిగిన లక్ష్మీదేవి బొమ్మ ఉన్నవి 3 లక్షల నుండి 6 లక్షల్లో ఉంటే వన్‌గ్రామ్ గోల్డ్‌లో అదై డిజైన్‌లో 400 వందల నుండి 1500 రూపాయల్లో లభిస్తుంది. ఇంకా పెళ్లికుమార్తె ధరించే ప్రత్యేకమైన నగల సెట్టు రూ.3వేల నుండి రూ.5 వేల వరకు పలుకుతుంది. తాము ధరించిన చీర, డ్రెస్సుకు మ్యాచింగ్ నగలు ధరించాలని దాదాపు ప్రతీ అమ్మాయికి ఉంటుంది. బంగారం ఎలాగూ అందుబాటులో లేదు. కాని ఈ రోజు కొత్త డ్రెస్సు, చీర కొనగానే దానికి తగిన నగలు కూడా కొనడం సర్వసాధారణమై పోయింది అమ్మాయిలకు. ధర కూడా అందుబాటులో ఉండడంతో ఎవరికీ అభ్యంతరం ఉండటం లేదు. ఈ వన్‌గ్రామ్ గోల్డ్ నగలను జాగ్రత్తగా వాడుకుని దాచుకుంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. దానికి కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు మరి. పార్టీ, పెళ్లికి వెళ్లి వచ్చాక వాటిని తీసి జాగ్రత్తగా భద్రపరచాలి. తేమ తగలకుండా చూసుకుంటే అవి మరింత కాలం మీకు అందాన్నిస్తాయి.

-జ్యోతి వలబోజు

Wednesday 2 November 2011

వనితలా? వినిమయ వస్తువులా?






వనితలా? వినిమయ వస్తువులా?
రాత్రి సమయం. కుటుంబ సభ్యులంతా హాల్లో కూర్చుని టీవీలో వస్తున్న సినిమా చూస్తున్నారు. మధ్యలో ప్రకటనలు మొదలయ్యాయి. కురచ దుస్తులు ధరించిన అమ్మాయిలు షాంపూ గురించి చెప్తున్నారు. తండ్రి, కూతురు, కోడలు, మరిది, మావగారు, పిల్లలు కూర్చుని చూస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు ఎంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఒక్కోసారి అసహ్యంగా కూడా ఉంటుంది. ఒక వస్తువు అమ్మడానికి ఆడవారిని అర్ధనగ్నంగా చూపడం అవసరమా? అలా చూపిస్తేనే ఆ వస్తువులు అమ్ముడవుతాయా? అసలు ఈ రోజు వివిధ టీవీ ఛానెళ్లలో, పత్రికలలో వచ్చే ప్రకటనలు నిజంగా వినియోగదారుడిని ఆకర్షించి ఆయా వస్తువులను వెంటనే కొనేలా చేస్తున్నాయా? లేక అమ్మాయిల అందాలు ఆరబోస్తున్నాయా? సకుటుంబంగా చూసి మళ్లీమళ్లీ గుర్తుంచుకుని బావున్నాయని మాట్లాడుకునేలా చేసే ప్రకటనలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చేమో.



ఈనాడు టీవీలేని ఇల్లుండదేమో! అది నిత్యావసరంగా మారి చాలా కాలమైంది. ప్రతీ ఇంట్లో నీళ్లు, కరెంటులా టీవీ, కేబుల్ కనెక్షన్ ఉండాల్సిందే. నెలకు 200 లోపు కడితే చాలు వందల చానెళ్లు చూడొచ్చు. అందులో న్యూస్, వినోదం, విజ్ఞానం, సంగీతం, ఆటలు, సినిమాలు మొదలైన చానల్స్ వందల్లో ఉన్నాయి. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి సీరియళ్లు, వినోద కార్యక్రమాలు తయారుచేసి సదరు చానెళ్లలో ప్రసారం చేస్తున్నారు. మనకు అంతగా భారమేమీ పడదు. మరి వాళ్లకు నష్టం కాదా అని ఆలోచిస్తే మనం నెలనెలా కట్టే డబ్బు కంటే ఈ చానెళ్లకు ఆదాయాన్నిచ్చేది ఈ ప్రకటనలే. అందుకే వాళ్లు ప్రకటనలలోని అసభ్యతను, అశ్లీలతను గురించి ఎక్కువగా పట్టించుకోరేమో?



భారతదేశంలో స్ర్తిని దేవతగా పూజించే పవిత్ర సంప్రదాయం ఉంది కాని ఈనాడు టీవీలో ప్రసారమవుతున్న 70 శాతం వ్యాపార ప్రకటనలలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. ఆ వస్తువులు మగవారు ఉపయోగించేవైనా, ప్రకటనలలో ఆడవాళ్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. నిజంగా మహిళలు ఈ ఉత్పత్తులను అమ్మడానికి ఒక వ్యక్తిగా పని చేస్తున్నారా లేక వినియోగదారులను ఆకర్షించడానికి ఆయా వస్తువులతోపాటు ఆ వనితలు కూడా ఒక వ్యాపార వస్తువుగా మారారా? ఇది సీరియస్‌గా ఆలోచించాల్సిన అంశమే.



పెద్దపెద్ద కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి ప్రకటనలు తయారుచేస్తాయి. వాటిని చూస్తుంటే ఆ వస్తువు గురించి చెప్తున్నారా లేక అమ్మాయిలను అసభ్యకరంగా చూపిస్తూ జనాలను మాయలో పడేసి మోసం చేస్తున్నారా? ఇక్కడ వినియోగదారులను ఆకర్షించేది సదరు వస్తువా లేక అమ్మాయి అందాల ఆరపోతా? ఈ మధ్య మగవాళ్లు ఉపయోగించే డియొడెరెంట్ ప్రకటన ఎలా ఉంటుంది అంటే అతను ఆ డియోను ఉపయోగించి రోడ్డు పైన వెళుతుంటే అమ్మాయిలంతా వెర్రివాళ్లలా అతన్ని అతుక్కుపోతారు. దీనివల్ల వినియోగదారులకు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు. నిజంగా అమ్మాయిలు అలా అతుక్కుపోతారనే పిచ్చి ఆశతో అబ్బాయిలు ఆ కంపెనీ డియోని కొనేస్తారా? దీనివల్ల సదరు కంపెనీ వాళ్లు చెప్పదలచుకున్నదేమిటో అర్థం కాదు. ఆడవాళ్లు అంత బలహీనులా? వాళ్లకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? మరీ ఇంత వెర్రిగా ప్రవర్తిస్తారా? అంతే కాదు పురుషులు ఉపయోగించే లోదుస్తులు, షేవింగ్ క్రీం, సూట్ బట్టలు, సిగరెట్లు, తలకు వాడే బిల్‌క్రీమ్, మోటార్ సైకిళ్లకు సంబంధించిన ప్రకటనల్లో కూడా అర్ధనగ్నంగా తయారైన అమ్మాయిలు తప్పనిసరిగా ఉండాల్సిందే.



ఇక్కడ ఆకర్షణీయంగా ప్రదర్శించేది ఆయా వస్తువులతోపాటు అమ్మాయిలను కూడా. అంటే వాళ్లు కూడా ఒక ప్రకటన వస్తువే కదా. ఇలా చూపించినప్పుడే ఆ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. అలా పెరిగాయి అని కంపెనీ వాళ్లు అన్నప్పుడు ఈ ప్రకటనలు అందమైన అమ్మాయిలను చూపించి మగవాళ్లలోని కాముకత్వాన్ని రెచ్చగొట్టాలనే దురుద్దేశంతో తయారవుతున్నాయి అని చెప్పవచ్చు. ఇలా చేయక తప్పదు అంటున్నారు కంపెనీ వాళ్లు. కాని ఇక్కడ ప్రకటనల్లో ఆకర్షణీయంగా చూపించేది అమ్మాయిలను కాదు వారి అందమైన శరీరాలను తమ ఉత్పత్తులను అమ్మడానికి ఉపయోగపడే వస్తువుగా మార్చేశారు. పురుషులను అందునా యువతను ఆకర్షించడానికి అమ్మాయిల గ్లామర్ అనే మసాలాను కలపక తప్పదంటున్నారు. పైగా పురుషులు ఈ వస్తువులన్నీ ఉపయోగించేది స్ర్తిలను ఆకర్షించడానికి కదా అంటారు.



ఆడవాళ్లు ఉపయోగించే ప్రకటనలు మరీ అర్థం పర్థం లేకుండా ఉంటున్నాయి. ఉదా.అమ్మాయిలు ఉపయోగించే క్రీం వల్ల వారంలో చర్మం రంగు మారి మరింత కాంతివంతంగా మారుతుందట. అలా మారితే మళ్లీ ఇంకో క్రీం అవసరం ఉంటుందా? జన్మతః వచ్చిన రంగు ఇలా క్రీములు, లోషన్లతో మారుతుందంటే నమ్మశక్యంగా ఉందా అసలు? ఇక జుట్టుకు ఉపయోగించే షాంపూ వల్ల జుట్టు పొడుగ్గా, మరింత దృఢంగా పెరగడం ఎంతవరకు సాధ్యం? ఇటీవల వచ్చిన ఒక షాంపూ ప్రకటన ఇలా ఉంటుంది. ఒక పది మంది మగవాళ్లు ఎంత ప్రయత్నించినా కదల్చలేని ఒక లారీని ఒక యువతి వచ్చి తన పొడుగాటి జుట్టును దానికి కట్టి సునాయాసంగా లాగుతుంది. ఆమె జుట్టు అంత అందంగా దృఢంగా ఉండటానికి గల కారణం ఫలానా షాంపూ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. చుట్టుపక్కలంతా పల్లెటూరిలా ఉంటే ఈ అమ్మాయి మాత్రం చాలా కురచ దుస్తులు ధరించి ఉంటుంది. జుట్టు గురించిన ప్రకటనలో అమ్మాయి శరీర ప్రదర్శన అవసరమా?



ఇలాంటి అర్థం పర్థం లేని, అశ్లీలకరమైన ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. అసలు ఇలాంటి ప్రకటనలు విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాల గురించి ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి. నిజంగా ఇలా అందాల ఆరపోతతో ఆయా ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతున్నాయా? లేదా ఇది కంపెనీల మాయాజాలమా? అందులో నటించే మోడల్స్‌ని విమర్శించి తప్పు పట్టలేం. డబ్బు కోసం తమ శరీరాలను, అందాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు మరి కొందరు. ఈ గ్లామర్ ప్రపంచపు మోజులో చేస్తున్నారు. అదే అవకాశంగా తీసుకుని ఈ విధమైన అభ్యంతరకరమైన ప్రకటనలు తయారు చేస్తున్నారు వివిధ ఉత్పత్తుల తయారీదారులు. ఈ ప్రకటనలు ఎంత వరకు సత్ఫలితాలనిస్తున్నాయి? చేరవలసిన వారికి ఈ ప్రకటనల సారాంశం చేరుతుందా? కుటుంబ సమేతంగా కూర్చుని చూసే విధంగా ఉన్నాయా ఈ ప్రకటనలు అంటే చాలా తక్కువే అని చెప్పొచ్చు. అసభ్యకరమైన ప్రకటనలను నియంత్రించగలిగేది ఎవరు? సదరు టీవీ చానళ్ల వారే ఈ క్రమంలో ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు, నియమాలు పాటిస్తే మంచిదేమో? కాని మాకు ఆదాయాన్నిచ్చే ప్రకటనలను మేమెందుకు వదులుకోవాలి అంటారు వాళ్లు. చివరకు ప్రేక్షకులే ముఖ్యంగా మహిళలు ఎదురుతిరిగి శరీర ప్రదర్శనకు ప్రాముఖ్యాన్ని ఇచ్చే ప్రకటనలను నిలువరించగలరు. లేదంటే ముందు ముందు ఇంకా ఎంతగా దిగజారుతాయో ఈ వ్యాపార ప్రకటనలు?

Tuesday 1 November 2011

వేగుచుక్కలు వేమన వీరబ్రహ్మాలు




మానవుడితోపాటు ప్రతీ జీవి సుఖాన్ని, భోగాన్ని కోరుకుంటుంది. సుఖసంతోషాలతో ఉండాలని, ఇహంతోపాటు పరాన్ని కూడా సాధించాలని అనుకుంటాడు ప్రతి మనిషీ. కాని మనం అనుభవించే సుఖం శాశ్వతం కాదనీ, చివరికి మిగిలేది దుఖఃమేననీ తేల్చేస్తారు వేదాంతులు. చరిత్రకారులు స్వర్ణయుగమని చెప్పుకునే విజయనగర చక్రవర్తుల తుది దిశలో సామాన్యుల బ్రతుకు కడగండ్ల పాలైంది. మండలాధీశుల భోగలాలసత్వం, అధికారుల దౌర్జన్యం, దోపిడీలు .. దానికితోడు జనులలో పేరుకుపోయిన అమాయకత్వం, అజ్ఞానం వారి జీవితాలను మరింత దుర్భరంగా చేసాయి. అర్ధం లేని ఆచారాలు, దురాచారాలు, అధికారబలం, దబాయింపులతో ప్రజలను మోసం చేసి అణచిపెట్టేవారు. భయపడి నీళ్లు నమిలేవాళ్లేగాని నిలదీసి అడిగే ధైర్యం , తాహత్తు కాని ఎవరికీ లేవు. చెదురుమదురుగా ఎదుర్కొన్నా చివరివరకూ ఎవరూ నిబ్బరంగా నిలబడలేదు.

అటువంటి చిమ్మ చీకటి తెరలను చీల్చుకుని వెలిగిన వేగు చుక్కలు యోగి వేమన, పోతులూరి వీరబ్రహ్మము. (1608 – 1693). ఇద్దరూ సమకాలీకులైనా, ఒకరికొకరు ముఖపరిచయం లేకున్నా ఒకే ఆశయంతో తమ ఉద్యమాలను నడిపించి సంచలనం సృష్టించారు. ఇరువురూ సంస్కర్తలే, సత్కవులే. తమ అనుభవాలను తత్వదృష్టితో , కవితారూపంగా, పద్యాలు, పాటలు పాడి సామాన్యజనాన్ని మేల్కొలిపారు. ఇక్కడ మరో విషయం గమనించదగ్గది. ఈ విశాల ప్రపంచంలోకి ఎందరో మత ప్రవక్తలు, సంస్కర్తలు పశుపాలకవర్గం నుండి వచ్చినట్టుగా తెలుస్తుంది. శ్రీకృష్ణుడు గోపాలకుడు, ఏసుక్రీస్తు గొడ్లచావిడిలో పుట్టాడు. ఇస్లాం మతప్రవక్త మొహమ్మద్ ఒంటెల వ్యాపారి కాగా వేమన, వీరబ్రహ్మం కూడా గొర్రెకాపరులే.




ఈ సృష్టికి మూలమైన శక్తి ఒకటి ఉందని వేమన, వీరబ్రహ్మం ఇద్దరూ అంగీకరించారు. అతి సామాన్యమైన తెలుగు పలుకులతో సూటిగా, సులభంగా అర్ధమయ్యే విధంగా , అందరికి సన్నిహితమైన ఉపమానాలతో తమ వాణిని వినిపించారు. “పెక్కు చదువులేల? చిక్కు వివాదములేల? అని ప్రశ్నించి, “వేనవేలు చేరి వెర్రి కుక్కలవలె అర్ధహీన వేదమరచుచుంద్రు, కంఠశోషకంటె కలిగెడి ఫలమేమి? అని పండితులను నిగ్గదీసిచావు తెలియలేని చదువేటి చదువురా?” అని చదువు పేర, శాస్త్రాల పేరిట గొప్పలు చెప్పుకునే పుస్తకాల పురుగులపై అక్షింటలు చల్లాడు వేమన. పుస్తకాలు వల్లించినంత మాత్రాన పుణ్యం దొరకదని, అత్తెసరు చదువుల అయ్యల ఆర్భాటాలు అద్రాటపు నీటిమూటలని బ్రహ్మం చెప్పాడు ..



ఒక మతం మీదకాని, శాఖ మీద కాని, తెగమీద కాని వీరిద్దరికీ ప్రత్యేకాభిమానం అంటూ లేదు. తప్పు ఎక్కడున్నా తప్పే అంటారు. ఏ మతములోనున్న తప్పులనైనా నిష్కర్షగా, నిర్భయంగా ఎత్తి చూపారు. జాతి, వర్ణ, ఆశ్రమ, కుల, గోత్ర రూపాలన్నవి వట్టి భ్రమలు. కాని లోకంలో వాటికి చాలా బలం ఉంది. అందుకేకులము గోరువాడు గుణహీనుడగునుఅని నిరూపించి, “ఎరుక గలవాడె ఎచ్చైన కులజుడు.” అని ఎలుగెత్తి చాటాడు. “కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్యచేత విఱ్ఱవీగువారు పసిడికలుగువాని బానిస కొడుకులుఅని కులగోత్రాల గురించి స్పష్టం చేసాడు వేమన.”కులము గోత్రమనుచు కూసేటి మలపలదగుల్బాజీ తనాన్ని తూర్పారబట్టాడు వీరబ్రహ్మం. “కులము కులమటంచు గొణిగెడి పెద్దలు చూడరైరి తొల్లి జాడలెల్ల, మునుల పుట్టువులకు మూలంబు లేదండ్రుఅని నిక్కచ్చిగా చెప్పాడు బ్రహ్మం. కులము కంటే గుణము గొప్పదని నమ్మారు వీరిద్దరూ. “ఉర్వివారికెలనొక్క కంచము బెట్టి పొత్తు గుడిపి కులము పొలియజేసి తలను చెయిబెట్టి తగనమ్మ జెప్పరాఅన్నాడు వేమన. అంతేగాకఅంద రొకట గలియ అన్నదమ్ములె కదాఅన్న సమైక్యభావన వేమన చూపగా, ” ఏ జాతియైన సద్గురుసేవన్ , బ్రతికిన బ్రాహ్మణ వరుడగుఅనీ, ” అన్ని కులములు ఏకమయ్యీనయాఅని బ్రహ్మం మాటలలో కనిపిస్తుంది.



చిత్తశుద్ధిలేని భక్తిని, చిత్తములేని విగ్రహపూజను కూడా వీరు తీవ్రంగా నిరసించారు. “శిలను ప్రతిమను చేసి చీకటిలో బెట్టి మ్రొక్కవలవ దికను మూఢులారఅని కోప్పడి, “నిగిడి శిలను మ్రొక్క నిర్జీవులగుదురుఅని భయపెట్టాడు వేమన. “నల్లఱాళ్లు దెచ్చి గుళ్లు కట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కపడగబోదు”, “చెట్టుపుట్టలకును చేయెత్తి మ్రొక్కుచు వట్టి మూటలిట్లు వదరనేలఅని ప్రశ్నిస్తూ, “చిలిపిరాళ్ల పూజ చేయబోకఅని చిత్తశుద్ధిలేని పూజలను బ్రహ్మం ఎన్నో మార్లు ఈసడించుకున్నారు. చిల్లర ఱాళ్లకు మొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే.. చిత్తము నందలి చిన్మయజ్యోతిని చూచుచునుండుట సరే సరే.. అని చిత్తములేని విగ్రహారాధనను వీరబ్రహ్మం ఆక్షేపించాడు.



నిరర్ధకమైన కర్మకాండను ఈ ఇద్దరూ నిరసించారు. ఆత్మజ్ఞానం లేకుండా చేసే స్నానాలు ఉపవాసాలు నిరర్ధకమని హేళన చేశారిద్దరూ. “నీళ్ల మునుగనేల నిధుల మెట్టగనేల.. కపట కల్మషములు కడుపులో నుండగాఅని వేమన నిలదీస్తేనీటను మునిగి గొణుగుచునుంటే నిలకడ చెడునుర ఒరే ఒరేఅని బ్రహ్మం కూడా ఆ మాటనే చెప్పారు. “కూడు పెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు సేయు కుక్షిమలము, కూడు విడిచి మలము గుడుచురా యుపవాసిఅని వేమన ఉపవాసవ్రతాన్ని ఆక్షేపించాడు. ఒకసారి ఒళ్లు మండిఒక్కపొద్దులున్న ఊరబందై పుట్టుఅని కసితీరా తిట్టాడు. “ఒక్కప్రొద్దులని ఎండుచునుంటే ఒనరగ చెడుదువు ఒరే ఒరే! అని బ్రహ్మం కూడా బూటకపు ఉపవాస వ్రతాలవల్ల లాభంలేదని స్పష్టం చేశాడు.



నియమనిష్ట లేని తీర్థయాత్రలు, క్షేత్ర నివాసాలు దండగమారి పనులని, ముక్తి సాధనాలు కావనిఆసనాది విధుల నధమ యోగంబురాఅని వేమన చాలా చోట్ల ప్రకటించాడు. “ఆఁకులెల్ల దిని మేఁకపోఁతుల కేల కాకపోయెనయ్య కాయసిద్ధిఅని గాలి, ఆకులు తినే యోగులను వేమన సవాలు చేస్తేఆకులు తిన్నందుచేత నడవిని తిరిగే మేఁకలకెల్లను మోక్షము రాకేలను పోయెనయ్యఅని వీరబ్రహ్మం కూడా ప్రశ్నించాడు.

అదే విధంగా బారెడేసి జడలూ, బుజాల ముద్రలూ, బూడిదపూతలూ, బోడితలలూ వగైరా బాహ్య చిహ్నాలు మోక్షసాధనాలు కావని, ఆత్మశుద్ధిలేని వేషధారిని విశ్వసించగూడదని ఇద్దరూ హెచ్చరించారు. “పొడుగు గలుగు జడలు పులితోలు భూతియు కక్షపాలలు పదిలక్షలైన మోత చేటెకాని మోక్షంబు లేదయాఅని మాయవేషాలు వేసుకుని ప్రజలను మోసగించేవారిని వెక్కిరించారు.


కొండగుహలనున్నా, కోవెలలందున్నా మెండుగాను బూది మెత్తియున్నా దుష్టబుద్ధులకును దుర్భుద్ధి మానునాఅని అమాయకులను పీడించి, తమ స్వలాభము చూసుకునే తాంత్రిక, మాంత్రికులనూ తూర్పారబట్టారు.

నాస్తి తత్వం గురోః పరంఅని పూర్వులు భావించినట్టుగానే గురువులేనిదే సాధకునకు దీక్ష కుదరదని , ముక్తి లభించదని ఇద్దరూ స్పష్టం చేశారు. “గొప్పగురుని వలన కోవిదుడగు”, “గురువు లేక విద్య గుఱుతుగా దొరకదు”, గురువుదెలియనట్టి గుఱుతేమి గుఱుతయా”, గురుని గూడ ముక్తి కరతలామలకమౌఅన్న వేమన పలుకులు ప్రతి ఒక్కరికి శిరోధార్యము. ఆచరణీయము. ” గురుమూర్తియే సమర్ధుడనీ, గురుడే తల్లియు తండ్రియు గురుడే బ్రహ్మంబుఅని , పరమార్ధ నిరూపణకు గురువచనమూ, స్వానుభవమూ తప్పనిసరి అని బ్రహ్మం కూడా నిరూపించాడు. సాధకుడు తన అస్థిరమైన శరీరాన్నే ఆధారంగా చేసుకొని, చెట్టుకొమ్మలు ఆధారంగా వేలాడుతూ కోతి కొండకోనల్లో తిరిగినట్లు తమ అంతశ్శక్తిని, జ్ఞానజ్యోతిని వీక్షించాలి అని ఇద్దరూ ప్రకటించారు. బ్రహ్మజ్ఞానం కంటె మిన్నయైనది వేరొకటి లేదని వేమన , వీరబ్రహ్మం ఇద్దరూ ఎలుగెత్తి చాటారు.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008