Friday, August 14, 2015

నెయిల్‌ & త్రెడ్‌ వర్క్‌ - నవతెలంగాణ 
Nail and Thread Work

Fri 14 Aug 00:37:55.849872 2015

ఇల్లు చూడు, ఇంటి అందం చూడు అంటారు పెద్దలు. శుభ్రంగా అందంగా ఉన్న ఇల్లు , ఆ ఇంటి ఇల్లాలి పనితనాన్ని తెలియజేస్తుంది. ఇల్లు అందంగా ఉండాలంటే ఖరీదైన సామాన్లు, అలంకరణ వస్తువులే ఉండాలని లేదు. వందలు, వేలు పెట్టి మార్కెట్లో దొరికే ఖరీదైన అలంకరణ సామాన్లు కొనడం మధ్యతరగతివారికి కష్టమే మరి. కాస్త ఆసక్తి, సృజనాత్మకత ఉంటే చాలా తక్కువ ఖర్చుతో అందమైన కళాకృతులను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మార్కెట్లో ఓ అందమైన చిత్రం కాని, పెయింటింగ్‌ కాని, కళాకృతి కాని ఎన్ని వందలు, వేలు పెట్టి కొన్నా వాటికన్నా స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్న వస్తువులు ఎంతో విలువైనవి అంటే కాదని ఎవరైనా అనగలరా? మనం చేసిన వస్తువులను ఎవరైనా ప్రశంసిస్తే గర్వంగా, సంతృప్తిగా ఉంటుంది.

మన ఇంటి అలంకరణ కోసం ఓ అందమైన కళ గురించి తెలుసుకుందాం. తక్కువ వస్తువులు, తక్కువ ఖర్చుతో కళ్లు చెదిరే చిత్రాలను తయారు చేయవచ్చు. అదే నెయిల్‌ అండ్‌ త్రెడ్‌ వర్క్‌.
ఈ వర్క్‌ కోసం కావాల్సినవి.. మీకు నచ్చిన డిజైన్‌ వేసుకున్న చార్ట్‌ పేపర్‌, దానికి తగిన సైజులో కొంచం మందపాటి చెక్కముక్క(ప్లైవుడ్‌ అయితే మంచిది) , వెల్వెట్‌ క్లాత్‌, మేకులు, చిన్న సుత్తి, జరీ, రంగుల దారాలు. ఈ ఆర్ట్‌ వర్క్‌ను చూస్తే కష్టంగా అనిపిస్తుంది. కాని దాని పట్టు దొరికిందంటే అలా అల్లుకుపోతారు. ఈ నెయిల్‌ అండ్‌ త్రెడ్‌ ఆర్ట్‌ ప్రక్రియ వెనక అంతర్లీనంగా మనం స్కూలులో చదువుకున్న జామెట్రీ సూత్రాలు ఇమిడి ఉంటాయి. మేకుల మధ్య కోణం మారేకొద్ది మనం ఉపయోగించే రంగు దారాలు ఒంపులు తిరుగుతూ.. రూపురేఖలు మారుతూ ఉంటాయి. అదే అసలైన సూత్రం.

సరళరేఖల ఆధారంగా క్రమపద్ధతిలో చుక్కల మీద కొట్టిన మేకులను కలుపుతూ పోతుంటే అవి అక్కడక్కడ కలుసుకుని ఖండించుకున్నప్పుడు వంపులు ఏర్పడతాయి. నచ్చిన డిజైన్‌ మీద వరుసగా మేకలు సమానంగా కొట్టి ఒక క్రమపద్ధతిలో దారాన్ని చుట్టాలి. అది కూడా మరీ గట్టిగా లాగకుండా, మరీ వదులుగా ఉండకుండా చుట్టాలి. అలాగే మనం వేయదలుచుకున్న చిత్రంలో వేర్వేరు భాగాలకు అనువైన రంగుల దారాలను ఎంచుకుని అదే విధంగా చుట్టాలి. ముందుగా మీరు డిజైన్‌ను ఎంచుకోవాలి. అలాగే మనం ఎంచుకున్న డిజైన్‌కి తగిన రంగులో ఉన్న వెల్వెట్‌ క్లాత్‌ను తీసుకోవాలి. మొదట చిన్నచిన్న , సులువైన డిజైన్లను ప్రయత్నించండి. కాస్త అలవాటయ్యాక పెద్ద డిజైన్లు ప్రయత్నించవచ్చు. సూర్యోదయం చిత్రం చేయాలంటే మేకులన్నీ కొట్టిన తర్వాత మధ్యలో నుండి మొదలు పెట్టి ఎడమవైపు కిరణం నుంచి కుడివైపు కిరణం వరకు క్రమపద్ధతిలో పూర్తిగా దారంతో నింపాలి. ఈ అల్లిక ఎంత నీట్‌గా ఉంటే చిత్రం అంత అందంగా, అద్భుతంగా వస్తుంది. చిత్రం మొత్తం పూర్తయ్యాక మేకులకు దారంలో కలిసిపోయే రంగు పెయింట్‌ వేస్తే సరి. మేకులు తప్పుపట్టకుండా ఉంటాయి.

మీరు తయారు చేసిన బొమ్మను భద్రంగా ఉంచుకోవాలంటే ప్లైవుడ్‌పై అమర్చి.. గాజు ఫ్రేమ్‌ కట్టించండి.

Tuesday, August 11, 2015

పాశుపతం .. ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్

ఏకైక అగ్రదేశం అమెరికాను చక్రబంధంలో ఇరికించి, ప్రపంచశక్తిగా ఎదగాలని చైనా వేస్తున్న ఎత్తుగడలేంటి?
అమెరికాను దివాలా తీయించాలనుకుంటున్న దాని కొత్త ఫైనాన్సియల్ వెపన్ ఏంటీ?
ఆసియా, ఆఫ్రికా, యూరపులను ఏ రాజనీతితో ఎలా కలుపుతోంది? ఈ కొత్త ఎత్తుగడలకు అమెరికా దగ్గర ఉన్న సమాధానాలేంటి?
పనిలోపనిగా ఇండియా చుట్టూ చైనా జాగ్రత్తగా పేరుస్తున్న మిలిటరీ ట్రాప్ ఏంటి?
చిన్నా చితకా దేశాల్ని మిలిటరీ స్థావరాలుగా మార్చుకుంటున్న దాని స్ట్రాటజీ ఏంటి?
హిందూ మహాసముద్రం దాని యుద్ధవేదిక ఎలా కాబోతోంది?
ఈ చక్రవ్యూహాన్ని చేధించేందుకు ఇండియా రూపొందించుకున్న ఆయుధమేంటి?
రాజకీయ దిద్దుబాటు చర్యలేంటి?
ప్రధాని కాగానే నరేంధ్ర మోడి దేశాలన్నీ ఎందుకు చుట్టివస్తున్నారు?
చైనా, పాకిస్థాన్ గూఢచారులు హైదరాబాదులో ఎందుకు తిష్టవేశారు?
ఓ సాదాసీదా లేడీ డిటేక్టివ్ వాళ్లను ఎలా చిత్తు చేసింది?
................
అంతర్జాతీయ గూఢచర్యంపై వెలువడిన తొలి తెలుగు నవల ఇది.
కఠిన వాస్తవాలను వివరిస్తూ మిమ్మల్ని ఆలోచింపజేసే అసలైన స్పై థ్రిల్లర్ ఇది..

జె.వి.పబ్లికేషన్స్ నుండి వస్తున్న మరో ప్రచురణ... మంచాల శ్రీనివాసరావుగారు రచించిన “ పాశుపతం“.. త్వరలో మీముందుకు రాబోతోంది.


Saturday, August 8, 2015

మాలిక పత్రిక ఆగస్ట్ 2015 సంచిక విడుదల

Jyothivalaboju
Chief Editor and Content Head

కొత్త పాత మేలు కలయికలతో అందరినీ అలరించే విభిన్నమైన అంశాలతో, ప్రయోగాలతో ఆగస్టు మాలిక పత్రిక మీ ముందుకు వచ్చింది.
మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ సంచికలోని ముఖ్యాంశాలు:

01. మాలిక పదచంద్రిక 
02. రోషినీ శర్మ
03. స్వలింగ సంపర్కం
04. Rj వంశీతో అనగా అనగా
05. ఎంజాయ్ మెరిటల్ బ్లిస్
06. అత్తారిల్లు
07. సంప్రదాయపు తెరలో ఆధునికం
08. అల్విదా నేస్తం
09. ఏవగింపు
10. శుభోదయం 1
11. చిగురాకు రెపరెపలు 7
12. మాయానగరం 17
13. చేరేదెటకో తెలిసి 5
14. ఆరాధ్య  11
15. వేటూరి కథలు 2
16. అంతిమం 5
17. శోధన 5
18. మన వాగ్గేయకారులు 2
19. రాగమాలిక -ఆభేరి
20. దీపతోరణం - సమీక్ష
21. అవ్యక్త దీపం
22. రాఖీ స్పెషల్ కార్టూన్స్
23. Dead People Dont Speak 7
24. వెటకారియా రొంబ కామెడియా 12
25. రంగనాధ్ కవితలు
26. పద్యమాలిక జులై 2
27. పద్యమాలిక జులై 1

Wednesday, August 5, 2015

జె.వి.పబ్లికేషన్స్ నుండి నవ్వుల నజరానా “ ఫేస్‌బుక్ కార్టూన్లు”
అతివేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం  ప్రపంచంలోని నలుమూలలనున్న వారందరి మధ్య దూరాన్ని తగ్గించి ప్రతీక్షణం అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది అని అందరూ ఒప్పుకునే విషయమే.  అనుకున్న క్షణంలోనే వేలమైళ్ల దూరాన ఉన్నవారితో మాట్లాడవచ్చు. చూడవచ్చు, చర్చించవచ్చు. ఇలాటి దూరాన్ని మరింత దగ్గరగా చేసి, ఎందరినో కలిపిన ఒక అద్భుతమైన అంతర్జాల మాధ్యమం - ఫేస్‌బుక్.. ఈనాడు స్కూలు పిల్లలనడిగినా చెప్తారు ఫేస్‌బుక్ అంటే ఏంటో. అంతగా అలవాటుపడిపోయారందరూ. ఇప్పుడు కంప్యూటర్, లాప్టాప్ లో మాత్రమే కాకుండా మొబైల్, ఐపాడ్ వంటి చిన్న సాధనాలలో కూడా అంతర్జాలం ఉపయోగించుకోగలిగే సదుపాయం ఉండడంవల్ల  ఇంటి అడ్రస్ ,మెయిల్ అడ్రస్ లాగా ఫేస్‌బుక్ ఐడి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఆర్టిస్టులు, చిత్రకారులు, నటులు, కార్టూనిస్టులు, కళాకారులు... ఇలా అందరూ తమ తమ ఆసక్తి మేరకు ఫేస్‌బుక్ ని ఉపయోగించు కుంటున్నారు. సృజనాత్మకత ఉన్న కళాకారులకైతే  ఇది ఒక వరంలాంటిది అని చెప్పవచ్చును. తమ కళను తమదైన శైలిలో పదిమందితో పంచుకోవడం. వచ్చిన ప్రశంసలు, విమర్శలతో మరింత  మెరుగుపరచుకోవడం, కొత్త కొత్త ఆలోచనలు చేయడం జరుగుతోంది.

అలాటి కోవలోకి వస్తారు  ప్రముఖ కార్టూనిస్టులు రాజుగారు, లేపాక్షిగారు. ప్రముఖులు అంటే ప్రపంచమంతా తెలిసిన పెద్దవారు, గొప్పవారు, టీవీలు, పేపర్లలో కనిపించేవారు అని కాదు. వారి కార్టూన్ల ద్వారా ఫేస్‌బుక్ లో సంచలనం సృష్టిస్తూ ప్రతీరోజూ వారి కార్టూన్లకోసం ఎదురుచూసేలా చేస్తున్నవారు, అందరి అభిమానాన్ని పొందినవారు  ప్రముఖులే కదా.. కార్టూనిస్టులుగా  వీరిద్దరూ కేవలం అందరినీ  నవ్వించడానికి ఏదో ఒక పిచ్చి కార్టూన్లు వేయడం కాకుండా ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా విభిన్నమైన అంశాలమీద తమదైన శైలిలో కార్టూన్లు వేసి నవ్విస్తున్నారు, ఆలోచింపజేస్తున్నారు. ఈ కార్టూనిస్టులు, వారిని వారి బొమ్మలను ఇష్టపడే వారందరూ కలుసుకునే ఒకే వేదిక  ఫేస్‌బుక్. మరి అదే ఫేస్‌బుక్ మీద వేసిన కార్టూన్లు ఇంకెంత సంచలనాన్ని సృష్టించి ఉండాలంటారు.  ఫేస్‌బుక్ ఒక వ్యసనంగా మార్చుకున్న వారందరికోసం, వారందరిమీద వేసిన ఫేస్‌బుక్ కార్టూన్లను ఒక దగ్గర చదవడం అందరికీ ఇష్టమే. ఒకరైతే సరి ఒకరికి మరొకరు కలిస్తే ఏముంది. ఢమాల్..

ఈ కార్టూనిస్టుల గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పను. వారి బొమ్మలే వారిని పరిచయం చేస్తాయి. ఫేస్‌బుక్ మీద వారిద్దరూ వేసిన కార్టూన్లను ఒకే పుస్తకంగా చేసి అందరికీ నవ్వులు పంచాలనే ఆలోచన చేసింది జె.వి.పబ్లికేషన్స్. మా సంస్థ ద్వారా వస్తున్న మొదటి స్వంత పుస్తకం రాజు ఈఫూరిగారు, లేపాక్షి రెడ్డిగారు వేసిన ఫేస్‌బుక్ కార్టూన్ల పుస్తకం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది.
                     నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వలేకపోవడం ఒక రోగం..
                                                   ఇదే మా నవ్వుల నజరానా

అన్ని పుస్తకాలలాగా కాకుండా ఇద్దరు ఉద్ధంఢుల కార్టూన్లని ఒక వినూత్నమైన రీతిలో అందజేస్తున్నాం. Two in One అన్నట్టుగా ఒక వైపునుండి రాజుగారు, ఒక వైపునుండి లేపాక్షిగారు తమదైన కవర్, ప్రొఫైల్, కార్టూన్లతూ మిమ్మల్ని అలరించబోతున్నారు.. 

 నిన్ననే ప్రింటింగ్ కి వెళ్లిన ఫేస్‌బుక్ కార్టూన్ల పుస్తకానికి ఫేస్‌బుక్ మిత్రులకు  ముఖ్యంగా రాజుగారు, లేపాక్షిగారి మిత్రులందరికీ పబ్లిషర్ తరఫున నెలరోజులవరకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వబడుతోంది. ఈ కార్టూన్ల పుస్తకం ఖరీదు రూ.120. ప్రత్యేక ఆఫర్ గా  మీకు రూ 100 కే, పోస్టల్ చార్జెస్ లేకుండా మీ ఇంటికే పంపబడుతోంది... పుస్తకాలు కావలసినవాళ్లు ఎన్ని కాపీలు కావాలన్నది, మీ చిరునామా నా మెయిల్ అడ్రస్ కు పంపగలరు. పుస్తకం మార్కెట్లోకి రాకముందే మీ సొంతం చేసుకోండి మరి..
jyothivalaboju@gmail.com

జ్యోతి వలబోజు
CEO , జె.వి.పబ్లికేషన్స్

Sunday, August 2, 2015

కాదేదీ అసాధ్యం - మన తెలంగాణఒకానొక సమయంలో నేనేమిటో తెలియని శూన్యపు, అయోమయపు స్థితిలో, ఇల్లలుకుతూ తన పేరే మరచిపోయిన ఈగలా మారిన నన్ను, నా పరిస్థితిని అర్ధం చేసుకుని నాకు సులువుగా అర్ధమయ్యేలా చెప్పి, నన్ను చదవమని, చదివినదానిని గురించి రాయమని, ఆ రాతలను సరిదిద్ది, విశ్లేషించి నాలోని ఆలోచనలను, భావాలను, సంఘర్షణలను అన్నింటిని అక్షరాలుగా మార్చుకోమని, నాకంటూ ఒక కొత్త దారిని సృష్టించుకోమని దిశానిర్ధేశం చేసిన, గృహిణినుండి ఈనాడు ఇన్నిరకాల పాత్రలతో అందరి అభిమానం పొందడానికి మూలకారణమైన, ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ, విశ్లేషిస్తూ, తప్పులుంటే హెచ్చరిస్తూ, ఒక నేస్తంగా, గురువుగా, శ్రేయోభిలాషిగా, మార్గదర్శిగా తోడున్న ఫ్రియమైన వ్యక్తికి ఈ వ్యాసాన్ని అంకితం చేస్తున్నాను. రక్తసంబంధాలకంటే స్నేహబంధానికి ఎక్కువ విలువని, గౌరవాన్ని ఇచ్చే నేను ఈ స్నేహితులదినోత్సవంనాడు నా ఆత్మీయనేస్తానికి గురుదక్షిణగా ఇంతకంటే విలువైన బహుమతి ఏమివ్వగలను.

థాంక్ యూ ఫ్రెండ్...


http://www.manatelangana.org/jyothi-in-talks-for-wonder-woman/మన తెలంగాణ దినపత్రికలో నారి శీర్షికలో ఈ వ్యాసం..

 

 ఒక
సాధారణ గృహిణి జ్యోతి వలబోజు. భర్త గోవర్థన్ సివిల్ ఇంజనీర్. ఒక కొడుకు కృష్ణ చైతన్య, సివిల్ ఇంజనీర్ అయిన కూతురు దీప్తి. వాళ్లు కాలేజీలకు వెళ్లిపోతారు. ఇక అంతా ఖాళీ సమయమే.. ఏం చేయాలి..? కుట్లు అల్లికలు, సాఫ్ట్ టాయిస్ తయారు చేయడం, పెయింటింగ్స్ వేయడం చేస్తుండేవారు. కాని పిల్లలకు కంప్యూటర్ పైన చేస్తున్న పని చూశాక తనూ నేర్చుకుంటే..?అనే ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా కంప్యూటర్ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు జ్యోతి. .. కట్ చేస్తే .. నేడు ఆమె ఒక బ్లాగర్. తన బ్లాగు ద్వారా అనేక విషయాలు అంతర్జాలంలో వివరిస్తున్నారు రచయిత్రి, బ్లాగర్ జ్యోతి వలబోజు…. ‘మన తెలంగాణ’ ఆమెను కలిస్తే అనేక విషయాల గూర్చి ఇలా చెప్పారు…


పిల్లలు పెరిగే దాకా ఇంటిపని, వంట ఇలా సరిపోయేది. ఖాళీ సమయంలో కుట్లు, అల్లికలు చేసేదాన్ని. అప్పుడప్పుడు పెయింటింగ్స్ వేసేదాన్ని. ఇంకా ఏదైనా సమయం ఉంటే టీవీ చూసేదాన్ని. పిల్లల కోసం మెల్లగా కంప్యూటర్ నేర్చుకున్నాను. ఇంటర్నెట్‌ను కూడా తెలుసుకుంటుంటే ఇంకా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మొదలైంది. అలా అలా నేర్చుకుంటూ 2006లో తెలుగు టైపింగ్ నేర్చుకొని మిత్రుల సహాయంతో ఒక బ్లాగును మొదలు పెట్టాను. తెలుగు టైపింగ్ కొంచెం బాగా రాగానే నాఆలోచన్లకు ఒక రూపం ఇచ్చాను. ఒక్కో ఆలోచనకు ఒక్కో బ్లాగును తయారుచేశాను. అవి జ్యోతి, షడ్రుచులు.. చైత్రరథం.. ఆముక్తమాల్యద.. బ్లాగ్ గురువు.. విజయ విలాసము..గీతలహరి.. నైమిశారణ్యం.. అన్నపూర్ణ .. ఇలా నా బ్లాగులు ఉన్నాయి. ముఖ్యంగా నేను నేర్చుకున్నట్లే ఎవరైనా బ్లాగులను నేర్చుకోవాలని ఉంటే ఉపయోగపడేలా నా ‘బ్లాగు గురువు’ ను నేర్పుతున్నట్లే ఉంచాను. అలాగే మంచిమంచి తెలుగు పద్యాలను, ఆడియో రూపంగా నా ‘ఆముక్తమాల్యద’ బ్లాగులో ఉంచాను. నైమిశారణ్యం బ్లాగు పూర్తిగా ‘ఆధ్యాత్మికత’పైనే. తరువాత షడ్రుచులు అంటే తెలంగాణ వంటలు.
సరదాగా తెలుసుకుందామని మొదలుపెట్టిన ఈ బ్లాగుల ప్రయాణం సరదా..సరదాగా సాగుతూ ఎన్నో రాతలు, వంటలతో సాగింది. నేను పెద్దగా రాసేదాన్ని కాదు. కానీ ఆ రాతలూ, వంటలూ నన్ను ముందుకు తీసుకెళతాయని ఎప్పుడూ అనుకోలేదు.


aమన తెలుగు వంటకాలు తెలుగులోనే తెలుసుకుంటే…? ఎంత ఆనందం. మన భాషలో చదువుకోవడం.. తరువాత తయారు చేసుకోవడం చాలామంది మహిళలకు ఉపయోగపడేలా, అందరికీ అందుబాటులో ఉండేలా తెలుగు, ఇంగ్లీషు వెబ్‌సైట్‌లో ఉంచాను. తెలుగువారు ఎక్కడున్నా అంతర్జాలం(ఇంటర్నెట్)లో వెతికి పట్టుకుని ఆయా వంటను నేర్చుకుంటారు. ఇలా బ్లాగుల్లో రాసుకుంటూ నా రచనా వ్యాసంగాన్ని మెరుగు పరచుకున్నాను. ప్రముఖ పత్రికలలో నా వ్యాసాలు రావడం ప్రారంభమైంది. అలా ఒక ప్రముఖ వారపత్రికలో ‘రుచి’ శీర్షికతో నా రచనలు నాలుగు సంవత్సరాలు రెగ్యులర్‌గా నడిచాయి. ఈ మధ్యనే ‘నొవాటెల్’ హోటల్ వారు తెలంగాణ వంటల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తే దానికి నేనే ఫుడ్ కన్సల్టెంట్‌ని. ఈ ఫెస్టివల్‌లో మనం మరచిపోయిన మన తెలంగాణ వంటలకు అనూహ్యంగా స్పందన వచ్చింది. ఒకసారి ఒక రచయిత నాకు చిన్న సూచన చేశారు. అదేమిటంటే ‘మన తెలంగాణ వంటలు ఎవరూ పరిచయం చేయలేదు. మీరు తెలంగాణ వంటల మీద రాయండి’అని. ఆ తర్వాత ఆలోచించి మా పెద్దవాళ్లను, మా అమ్మను, మా అత్తమ్మను, ఇతర మిత్రులను అడిగి తెలంగాణ వంటలను ఒక సంవత్సరం పాటు సేకరించాను. మన పెద్దలు ఆనాడు చేసే వంటలు తిని ఎంత ఆరోగ్యంగా ఉండేవారో అని తెలుసుకుని ముందుగా అలా వచ్చిందే వెజ్ వంటలు. తరువాత దాని స్పందనను చూసి మాంసాహార వంటలు కూడా ప్రింట్ చేశాను. ఇవన్నీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచాను.
ఇక 2010వ సంవత్సరంలో నా సంపాదకత్వాన ‘మాలిక’ అనే ఆన్‌లైన్ మాసపత్రికను ప్రారంభించాను. దీన్లో కవితలు, పద్యాలు కథలు వస్తుండేవి. ఇలా వచ్చిన కథలలో 24 మంది రచయితలతో ఒక పుస్తకం అచ్చువేశాను. అదీ మా ‘జెవి పబ్లికేషన్స్’ తరుపున ప్రింట్ చేశాము. ఈ పబ్లికేషన్‌ను 2014లో స్టార్ట్ చేశాము. అలాగే ఉమెన్ రైటర్స్ గ్రూపును ఏర్పాటు చేసి ‘ప్రమదాక్షరి’కథామాలికను ప్రింటు చేశాము. దీనికీ చాలా బాగా స్పందన వచ్చింది.
ప్రమదాక్షరి, జెవి పబ్లికేషన్స్ కలిసి 2014 డిసెంబర్‌లో జరిగిన బుక్ ఫెస్టివల్‌లో మా పబ్లికేషన్ పుస్తకాలతో స్టాల్ నిర్వహించాము. రచయితలు, రచయిత్రులు కూడా ఈ స్టాల్ నిర్వహణలో పాలుపంచుకున్నారు. వాళ్లు సరాసరి పుస్తకప్రియులను, అభిమానులను కలుసుకోవడంతో చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు.
అంతర్జాలం చాలా మాయగా ఉంటుంది. ఏది నేర్చుకోవాలన్నా ఇంటర్నెట్‌లో చదువుతూ, ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవచ్చు. దీనికి ఉన్నత విద్య అంతగా అవసరం లేదు. నేర్చుకోవాలనే కోరిక, లక్షం ఉంటే తప్పనిసరిగా వస్తుంది. ఫేస్‌బుక్‌లో చాలా మంది స్నేహితులు కలుస్తారు. రకరకాల వాళ్లు పరిచయం అవుతారు. అయితే మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోనివి వస్తాయి. బాధిస్తాయి. నేనైతే నా ఆత్మీయ మిత్రుల ద్వారా చాలా నేర్చుకున్నాను. ఇక చివరగా మహిళలు టీవీ సీరియల్స్‌తో పొద్దుపుచ్చకుండా ఇంటర్నెట్ ద్వారా వాళ్లకు నచ్చిన అంశాలపై నేర్చుకోవచ్చు. అంతేకాక బిజినెస్ చేసుకోవచ్చు. అదీ ఇంట్లోనే ఉంటూ. ఎక్కడికీ వెళ్లకుండా ఆన్‌లైన్లోనే బుకింగ్, డిస్పాచ్ తదితర కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మనకు సంకల్పం ఉండాలేకానీ సాధించలేనిది ఏదీ లేదు అన్నారు జ్యోతి వలబోజు.
ఇంటర్వూ… దామర్ల విజయలక్ష్మి

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008