Friday 14 August 2015

నెయిల్‌ & త్రెడ్‌ వర్క్‌ - నవతెలంగాణ



 
Nail and Thread Work

Fri 14 Aug 00:37:55.849872 2015

ఇల్లు చూడు, ఇంటి అందం చూడు అంటారు పెద్దలు. శుభ్రంగా అందంగా ఉన్న ఇల్లు , ఆ ఇంటి ఇల్లాలి పనితనాన్ని తెలియజేస్తుంది. ఇల్లు అందంగా ఉండాలంటే ఖరీదైన సామాన్లు, అలంకరణ వస్తువులే ఉండాలని లేదు. వందలు, వేలు పెట్టి మార్కెట్లో దొరికే ఖరీదైన అలంకరణ సామాన్లు కొనడం మధ్యతరగతివారికి కష్టమే మరి. కాస్త ఆసక్తి, సృజనాత్మకత ఉంటే చాలా తక్కువ ఖర్చుతో అందమైన కళాకృతులను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మార్కెట్లో ఓ అందమైన చిత్రం కాని, పెయింటింగ్‌ కాని, కళాకృతి కాని ఎన్ని వందలు, వేలు పెట్టి కొన్నా వాటికన్నా స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్న వస్తువులు ఎంతో విలువైనవి అంటే కాదని ఎవరైనా అనగలరా? మనం చేసిన వస్తువులను ఎవరైనా ప్రశంసిస్తే గర్వంగా, సంతృప్తిగా ఉంటుంది.

మన ఇంటి అలంకరణ కోసం ఓ అందమైన కళ గురించి తెలుసుకుందాం. తక్కువ వస్తువులు, తక్కువ ఖర్చుతో కళ్లు చెదిరే చిత్రాలను తయారు చేయవచ్చు. అదే నెయిల్‌ అండ్‌ త్రెడ్‌ వర్క్‌.
ఈ వర్క్‌ కోసం కావాల్సినవి.. మీకు నచ్చిన డిజైన్‌ వేసుకున్న చార్ట్‌ పేపర్‌, దానికి తగిన సైజులో కొంచం మందపాటి చెక్కముక్క(ప్లైవుడ్‌ అయితే మంచిది) , వెల్వెట్‌ క్లాత్‌, మేకులు, చిన్న సుత్తి, జరీ, రంగుల దారాలు. ఈ ఆర్ట్‌ వర్క్‌ను చూస్తే కష్టంగా అనిపిస్తుంది. కాని దాని పట్టు దొరికిందంటే అలా అల్లుకుపోతారు. ఈ నెయిల్‌ అండ్‌ త్రెడ్‌ ఆర్ట్‌ ప్రక్రియ వెనక అంతర్లీనంగా మనం స్కూలులో చదువుకున్న జామెట్రీ సూత్రాలు ఇమిడి ఉంటాయి. మేకుల మధ్య కోణం మారేకొద్ది మనం ఉపయోగించే రంగు దారాలు ఒంపులు తిరుగుతూ.. రూపురేఖలు మారుతూ ఉంటాయి. అదే అసలైన సూత్రం.

సరళరేఖల ఆధారంగా క్రమపద్ధతిలో చుక్కల మీద కొట్టిన మేకులను కలుపుతూ పోతుంటే అవి అక్కడక్కడ కలుసుకుని ఖండించుకున్నప్పుడు వంపులు ఏర్పడతాయి. నచ్చిన డిజైన్‌ మీద వరుసగా మేకలు సమానంగా కొట్టి ఒక క్రమపద్ధతిలో దారాన్ని చుట్టాలి. అది కూడా మరీ గట్టిగా లాగకుండా, మరీ వదులుగా ఉండకుండా చుట్టాలి. అలాగే మనం వేయదలుచుకున్న చిత్రంలో వేర్వేరు భాగాలకు అనువైన రంగుల దారాలను ఎంచుకుని అదే విధంగా చుట్టాలి. ముందుగా మీరు డిజైన్‌ను ఎంచుకోవాలి. అలాగే మనం ఎంచుకున్న డిజైన్‌కి తగిన రంగులో ఉన్న వెల్వెట్‌ క్లాత్‌ను తీసుకోవాలి. మొదట చిన్నచిన్న , సులువైన డిజైన్లను ప్రయత్నించండి. కాస్త అలవాటయ్యాక పెద్ద డిజైన్లు ప్రయత్నించవచ్చు. సూర్యోదయం చిత్రం చేయాలంటే మేకులన్నీ కొట్టిన తర్వాత మధ్యలో నుండి మొదలు పెట్టి ఎడమవైపు కిరణం నుంచి కుడివైపు కిరణం వరకు క్రమపద్ధతిలో పూర్తిగా దారంతో నింపాలి. ఈ అల్లిక ఎంత నీట్‌గా ఉంటే చిత్రం అంత అందంగా, అద్భుతంగా వస్తుంది. చిత్రం మొత్తం పూర్తయ్యాక మేకులకు దారంలో కలిసిపోయే రంగు పెయింట్‌ వేస్తే సరి. మేకులు తప్పుపట్టకుండా ఉంటాయి.

మీరు తయారు చేసిన బొమ్మను భద్రంగా ఉంచుకోవాలంటే ప్లైవుడ్‌పై అమర్చి.. గాజు ఫ్రేమ్‌ కట్టించండి.

1 వ్యాఖ్యలు:

rajyalakshmi

ఎంతో ఉపయోగంగా ఉంది సులభంగా నేర్చు కోవచ్చు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008