Showing posts with label కబుర్లు. Show all posts
Showing posts with label కబుర్లు. Show all posts

Friday, 9 September 2016

సావనీర్ స్పెషల్ వర్క్.. ATA, TCA...





అంతర్జాలంలో అడుగుపెట్టి దాదాపు పది సంవత్సరాలు కావస్తొంది. పిల్లల చదువులకోసం మొదలుపెట్టిన ఈ జాల ప్రయాణం. నాకు ఎన్నో అద్భుతాలను చూపించింది. నాచే ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయించింది. సాథారణ గృహిణి అనుకునే నన్ను ఈనాడు ఎన్నో పాత్రలు పోషింఫజేసిన ఈ అంతర్జాలం నాకు అందించిన మరో పురస్కారం .. ఒకటి కాదు రెండు .. అసలు ఇదంతా నేను చేయగలిగాను అంటే నమ్మలేకుండా ఉన్నాను. నేను అంత టాలెంటెడ్ ఆ? అయ్ బాబోయ్ అనుకుంటున్నాను.

కాని నా మీద నాకంటే నా మిత్రులు, శ్రేయోభిలాషులకు చాలా చాలా నమ్మకం సుమండీ.. నా మానాన నేను పని చేసుకుంటూ ఉంటానా? కొత్త పని అప్పచెబుతారు. అమ్మో నావల్ల కాదు. నేను చేయలేను అన్నా వినరు. ఇప్పటికీ నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉంది. కాని రంగంలోకి దిగాక మాత్రం అంతుచూడకుండా వదలను. నాకు బాధ్యత అప్పజెప్పినవాళ్లకు ఈ సంగతి తెలుసు కదా..

ఇంతకీ సంగతేంటంటే....

రెండు నెలల క్రితం ATA ( American Telugu Association) వారి 25వ వత్సరపు సంబరాల సందర్భంగా తయారుచేసిన సావనీర్ (ప్రత్యేక సంచిక)"సంస్కృతి" సంపాదకవర్గంలో చోటు దొరికింది.. ఆ క్రమంలో నాకు తెలిసిన పరిచయమున్న మిత్రుల నుండి వ్యాసాలను సేకరించి ప్రచురించడం జరిగింది. ఆ వెనువెంటనే TCA (Houston) వారి 40వ వార్షికోత్సవ సంబరాలకోసం సావనీర్ "మధురవాణి" పనులను చేపట్టడం జరిగింది. దీనికోసం పేజ్ డిజైనింగ్, కథల డిటిపి, ప్రూఫ్ వగైరా చేయించడం జరిగింది. ఇందుకు Ramakrishna Pukkallaగారు లేఅవుట్ డిజైనింగ్ వర్క్ చేసారు. రెండు సావనీర్లు కూడా మంచి ప్రశంసలు పొందాయని తెలిసింది..

నేను కూడా హ్యాపీస్ అన్నమాట..


నామీద మీకున్న నమ్మకానికి , మీరిచ్చిన ప్రోత్సాహానికి థాంక్ యూ Bhardwaj Velamakanni and Chitten Raju Vanguriగారు

Saturday, 7 February 2015

తెలుగు మహిళా బ్లాగర్లు - Tv9 నవీన





తలుచుకుంటే సాధించలేనిది లేదు ...

నేటి మహిళలు మారుతున్న సాంకేతిక విజ్ఞనాన్ని కూడా అందిపుచ్చుకుని తమ చదువుతో, వయసుతో నిమిత్తం లేకుండా పిల్లల సహాయం, తోడ్పాటుతో తమని తాము మెరుగుపరుచుకుంటూ, తమ ఆలోచనలను విస్తృత పరుచుకుని, అక్షరరూపమిచ్చికాగితం మీద కలాన్ని పరిగెత్తించినంత సులువుగా కీబోర్డ్ మీటలను టకటకలాడిస్తూ ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. 


అంతర్జాలం ద్వారా, బ్లాగుల ద్వారా ప్రపంచాన్ని పరిచయం చేసుకుని తమ ముంగిట్లో తీసుకురావడమే కాక తామే ప్రపంచానికి పరిచయమయ్యారు తెలుగు మహిళా బ్లాగర్లు. 


ప్రముఖ యాంకర్ ఝాన్సీ Tv9 చానెల్ లో నిర్వహిస్తున్న నవీన కార్యక్రమంలో తెలుగు మహిళా బ్లాగర్లతో చర్చా కార్యక్రమం షూటింగ్ 
జరిగింది.. — 

 Gouri Lakshmi Alluri, Kamala Paracha, Subba Lakshmi G, Uma Devi, Subhadra Vedula, Anchor Jhansi, Mani Kopalle, Psm Lakshmi and Renuka Ayola.

Wednesday, 24 July 2013

IndiBlogger Awards




 
బ్లాగు మిత్రులందరికీ ఒక విన్నపం:
నా బ్లాగు మిత్రులకు నా గురించి , నా బ్లాగు గురించి తెలుసు. ఐనా మరోసారి నా బ్లాగు గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా.. అసలు నా బ్లాగు "జ్యోతి" నన్ను నాకు పరిచయం చేసింది అని చెప్పవచ్చు. నాకు తెలీని నాలోని మరో జ్యోతిని వెలికితీసి నా హృదయభానుగా మారిపోయింది నా బ్లాగు. ఇందులో ఒక ప్రత్యేకమైన అంశమంటూ రాయలేదు. నాకు తోచిన, నచ్చిన అంశాలు, ఆలోచనలు. స్పందనలు, భావాలు అన్నీ దాచుకున్నాను. మిత్రులతో పంచుకున్నాను. తెలుగు రాయడం చాలా సులువని తెలిసిన మరుక్షణాన బ్లాగు ప్రారంభించి నాకు నచ్చిన వ్యాపకాలను విడివిడిగా బ్లాగుల రూపంలో మార్చుకున్నాను. కాని అన్నింటికి మూలస్ధానం. నన్ను నేను మళ్లీ మళ్లీ తరచి చూసుకునే ఒకే ప్రాంగణం నా బ్లాగు.. అందుకే నా జీవితంలో నా పుట్టినరోజుతో పాటు నా బ్లాగు పుట్టినరోజును కూడా సగర్వంగా, సంతోషంగా, ఏదో సాధించానన్న ఆత్మసంతృప్తితో జరుపుకుంటున్నాను. ఈ నా బ్లాగ్రయాణంలో నాకు మొదటినుండి తోడుగా ఉండి, ప్రోత్సహించి, సందేహాలు తీర్చిన మిత్రులకు సదా కృతజ్ఞురాలనై ఉంటాను.

అందుకే భారతీయ భాషలలోని బ్లాగులను నిక్షిప్తపరిచిన ఇండీబ్లాగర్ వాళ్లు నిర్వహిస్తున్న బ్లాగు పోటీలలో నా బ్లాగు " జ్యోతి " ని తెలుగు విభాగంలో నిలబెట్టాను. నన్ను, నా బ్లాగును ఆదరిస్తున్న మిత్రులకు ఒక విన్నపం. ఈ పోటీలో నన్ను, నా బ్లాగును గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇతర భాషలల్లో లాగే తెలుగు బ్లాగులు కూడా చాలా ప్రముఖంగా ఉన్నాయని తెలియజేయాలని చిన్ని కోరిక...
మీ వ్యాఖ్యలను ఇక్కడ రాయగలరు.. 
 http://www.indiblogger.in/iba/entry.php?edition=1&entry=11097
 
 

Saturday, 18 February 2012

బ్లాగ్ పుస్తక పరిచయ సభకు స్వాగతం

ఆఫీసుల్లో ఉండే కంప్యూటర్ ఇంటర్నెట్ ఈనాడు దాదాపు ప్రతీ ఇంటిలోకి వచ్చేసింది. సాంకేతిక నిపుణులే కాక ఉద్యోగాలు చేయని, కంప్యూటర్స్ గురించి తెలియనివారు, విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు అందరూ ఉపయోగిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉపయోగానికే కాక కంప్యూటర్ , నెట్ ని తమకు తెలిసిన ఆలోచనలనన్నింటికి అవలీలగా వాడుకుంటున్నారు. అందులో ఒక ప్రముఖమైన భాగం బ్లాగులు. అసలు రాయడానికి ఏముంటాయిలే. మాట్లాడమంటే మాట్లాడటం కాని రాయమంటే మావల్ల కాదు. మేమేమన్నా రచయితలమా.. అబ్బే..


సభాస్థలికి చేరు మార్గ వివరాలు...



ఇలా అనుకునేవారికి అసలు బ్లాగులంటే ఏంటి? ఎలా రాయాలి. ఎందుకు రాయాలి. దానివల్ల ఉపయోగాలేంటి? బ్లాగుకు హంగులు ఆర్భాటాలు ఎలా జత చేయాలి వగైరా విషయాలన్నింటిని సవివరంగా రాసి పుస్తకంలా అందిస్తున్నారు . "బ్లాగు పుస్తకం" ... ఈ పుస్తకాన్ని రాసినవారు సుజాత , రహ్మాన్.. రేపు ఆదివారం ఈ బ్లాగు పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ పుస్తకావిష్కరణకు తప్పకుండా విచ్చేయవలసిందిగా అంతర్జాలంలో తెలుగు, తెలుగు బ్లాగులను చదివేవారందరికీ ఆహ్వానం పలుకుతున్నారు నిర్వాహకులు..

Tuesday, 13 December 2011

పాఠకుడి దగ్గరకు పుస్తకం... సుపధ


సుపధ :


కొన్నేళ్లుగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెల రాగానే చదివే అలవాటు ఉన్నవారికి, హైదరాబాదులో ఉన్నవారికి గుర్తొచ్చేది, ఎదురు చూసేది ఏంటి? పుస్తకాల పండగ అదేనండి పుస్తక ప్రదర్శన..


పుస్తకాలు చదవడం అందరికీ ఇష్టమే. క్లాసు పుస్తకాలైతే ఎలాగూ తప్పవనుకోండి. చదువు, వృత్తికి సంబంధించిన పుస్తకాలే కాకుండా మనకు నచ్చిన అంశాల మీద మరింతగా తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. దానికోసం వీలైనన్ని పుస్తకాలు కొంటుంటాము. అవి సంగీతం, సాహిత్యం, పిల్లల కథలు, వంటలు, కుట్లు అల్లికలు, ఆరోగ్యం, ఆధ్యాత్మికం మొదలైనవెన్నో అంశాల మీద రాసిన పుస్తకాలు ఉంటాయి. వీటిని కొనుక్కోవడానికి పుస్తకాల షాపుకు వెళ్లాల్సిందే .. లేదా ఏడాదికోసారి ప్రముఖ పట్టణాలలో ఏర్పాటు చేసే పుస్తక ప్రదర్శనల్లో తమకు కావలసిన, నచ్చిన పుస్తకాలు దొరుకుతాయేమో అని వెతుక్కోవాలి. ప్రతీ నగరంలో కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ప్రతీ కాలనీలో, వీధిలో ఉంటారు . కాని ఆ పుస్తకాలు కొనడానికి దుకాణాలు మాత్రం కొన్ని చోట్లే ఉన్నాయి. ఉదా. దిల్‌షుక్ నగర్, లేదా BHEL, ECIL లో ఉన్నవారికి ఏదైన పుస్తకం కావాలంటే కోటీలోని విశాలాంధ్ర, లేదా నవయుగ, నవోదయకు రావాల్సిందే. మధ్యలో కొన్ని ఉంటాయి కాని అన్ని పుస్తకాలు దొరక్కపోవచ్చు. అడ్రస్ తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఎంత దూరమైనా వెళ్లక తప్పదు కదా. అప్పుడప్పుడు పావల కోడికి ముప్పావలా మసాలా అన్నట్టు అవుతుంది కూడా. అందుకని ఒకేసారి కనీసం పది పుస్తకాలైనా కొనేట్టుగా డబ్బులు జమచేసుకుని, సమయం చూసుకుని, ప్రయాణం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఆ పుస్తకం చదవాలనే కోరికను ఆపుకోవాల్సిందే.


ఈ మధ్య పుస్తకాలు చదివే అలవాటు చాలా తగ్గిపోయింది అంటున్నారు కాని అది తప్పేమో?... చదివేవాళ్లూ ఉన్నారు, రాసే వాళ్లూ ఉన్నారు. ప్రతీ దిన,వార, మాసపత్రికల్లో ఎన్నో కొత్త పుస్తకాల సమీక్షలు, పరిచయాలు వస్తూనే ఉన్నాయి కదా. అవి ఎంత వరకు అమ్ముడుపోతున్నాయో తెలీదు మరి. లక్షలు ఖర్చు పెట్టి తమ పుస్తకాలు అచ్చు వేయించుకున్నా కనీసం పెట్టిన ఖర్చైనా వస్తుందంటే డౌటే. చాలా వరకు స్నేహితులు, తెలిసినవాళ్లకు ఉచితంగానే ఇస్తారు రచయితలు. మిగిలినవి ఇంట్లో అట్టి పెట్టుకుంటారు. ఎవరో కొందరు పేరు పొందినవారి రచనలు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయనుకోండి. అది వేరే మాట. అచ్చైన పుస్తకాలన్నీ మనకు తెలివు. తెలిసినా కొనలేము. అన్నీ అన్ని చోట్లా దొరకవు. ప్రముఖ నగరాల్లో ఉన్నవారు ఉన్న కొద్ది షాపుల్లో గాని, పుస్తక ప్రదర్శనల్లో కాని కొనేసుకుంటారు. కాని వేరే ప్రాంతాల్లో , విదేశాల్లో ఉన్నవారి సంగతేంటి?? ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ebooks .. పుస్తకాలను పిడిఎఫ్ లా ebooks చేసి పంపిణీ చెస్తున్నారు. కాని అస్తమానం కంప్యూటర్ ముందు మంచి పుస్తకం చదవాలంటే ఎవరికైనా విసుగే కాని గత్యంతరం లేక చదివే అలవాటు వదులుకోలేక అలా సర్దుకుపోతుంటారు. Amazon, AVKF ద్వారా కూడా తెలుగు పుస్తకాల పంపిణీ జరుగుతుంది. అది కొంచం ఖరీదైన వ్యవహారం.. ఎమెస్కో వాళ్లు చాలా ఏళ్ళుగా ఇంటింటికి గ్రంధాలయం అనే పధకం నడిపేవారు. ఏమో మరి ఈ మధ్య ఆ పధకం ఆపేసారు. అందులో వాళ్లు ఆయా నెలలో ప్రచురించిన, వారి దగ్గర ఉన్న పుస్తకాలు మాత్రమే మనం ఇంటికి తెప్పించుకోగలం..


అలా కాకుండా మనకు నచ్చిన పుస్తకాన్ని ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసి ఎక్కువ ఖరీదు కట్టకుండానే ఇంటికి తెప్పించుకునే అవకాశం వస్తే ఎలాగుంటుంది??


ఈ సమస్యలకు తగిన పరిష్కారం లభించింది.


పల్లవి , తన్మయి అనే ఇద్దరమ్మాయిలు తమ ఉద్యోగాలతో విసిగిపోయి ఏదైన కొత్తగా చేయాలనుకుని సలహ కోసం తండ్రిని అడిగారు... అపుడు అయన చెప్పిన మాట ........... కోరుకున్న పుస్తకాన్ని కోరినవారి ఇంటికి చేర్చే పథకం ఆలోచించమన్నాను. తెలుగు పుస్తకాలు అమ్ముడుపోవు , పుస్తక ప్రచురణ ఆర్థికంగా గిట్టుబాటు కాదు అని నిర్ధారణకు వచ్చి రచయితలు , చిన్న పబ్లిషర్లు చాలామంది నిస్పృహ చెందుతున్న ఈ కాలంలో యువత ముందుకొచ్చి కొత్త ఆలోచనతో ,కొత్త మార్కెటింగ్ వ్యూహంతో ఏదైనా సీరియస్ గా చేపడితే తెలుగు సాహిత్యానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని చెప్పారు. ఆ ఆలోచన అమలు చేసిన ఆ అమ్మాయిలు మొదలుపెట్టిన కొత్త వెబ్ సైట్... సుపథ


ఈ సైట్ మొదలుపెట్టడానికి గల కారణాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం..


ఇది మామూలు పుస్తకాల దుకాణం కాదు.పెద్ద పబ్లిషర్లకు,పెద్ద బుక్ సెల్లర్లకు పుస్తకాలను అమ్మిపెట్టి లాభపడటానికి దీన్ని మొదలెట్టలేదు. ప్రతి పుస్తకాల అంగడిలో రివాజుగా ప్రదర్శించే పుస్తకాలన్నిటినీ ఇక్కడ కూడా ఎక్కించటం మా ధ్యేయం కాదు. తెలుగు పుస్తకప్రచురణ ఇప్పుడున్న స్థితిలో రచనా వ్యాసంగం ఆర్థికంగా గిట్టుబాటుకాక , ప్రాచుర్యం పెద్దగా లేక అవస్థ పడుతున్న ఎందరో రచయితల సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలన్న ఆలోచన ఈ ప్రయత్నానికి ప్రేరణ.



నేరుగా రచయితలనుంచి ,చిన్న పబ్లిషర్ల నుంచి పుస్తకాలను సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లోనూ ,ఇతర విధాలుగానూ విక్రయించి, క్రమప్రకారం రచయితలకు, లేదా వారికి సంబంధించిన పబ్లిషర్లకు చెల్లించాలని మా సంకల్పం. అలాగే లాభాపేక్ష లేక సేవాభావంతో మంచి పుస్తకాలను అతితక్కువ ధరకు అందిస్తున్నా, మార్కెటింగు మీద దృష్టి పెట్టే సావకాశంలేని పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు వీలైనమేరకు ఉపయోగపడాలని మా ఆశయం.ఒక్క మాటలో చెప్పాలంటే మంచి రచయితకు తోడ్పడి, మంచి పబ్లిషర్లకు సహాయపడి మంచి తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ధ్యేయంతో ఏర్పరచిన రచయితల సహకార వేదిక ఇది.


ఎన్ని వేల పుస్తకాలను నెట్లోకి ఎక్కించామన్నది కాదు..ఎన్ని మంచి పుస్తకాలకు ప్రపంచ ప్రాచుర్యం కల్పించగలిగామన్నదే మాకు ముఖ్యం.అవకాశం ఉన్న మేరకు రచయితలను, ప్రచురణకర్తలను సంప్రదించి,కలిసి వచ్చినవారికి వచ్చినట్లు ఇక్కడ స్థానంకల్పించాం. మిగతా రచయితలకూ, పబ్లిషర్లకూ ఇదే మా స్వాగతం.




ఏది పడితే అది కాకుండా పుస్తకాల ఎంపికలో కనీస ప్రమాణాలను పాటించ దలిచాం. ఉండకూడదని మీరు భావించిన పుస్తకాలేవైనా ఇక్కడ మీకు కనపడినా ,ఫలానా పుస్తకాలు ఇక్కడ ఉండదగినవని మీరు అనుకున్నా దయచేసి మాకు రాయండి.


మీరు ప్రత్యేకంగా ఏదైనా పుస్తకం కొనాలని అనుకుంటూంటే దాన్ని ఇక్కడ అమ్మకానికి పెట్టకపొయినా ,దయచేసి మాకు రాయండి ( info@supatha.in). మార్కెట్లో ఉన్నా లేకున్నా ఎలాగైనా దాన్ని సంపాదించి మీకు పంపడానికి ప్రయత్నిస్తాం.



ప్రధానంగా తెలుగు పుస్తకాలకోసమే దీన్ని ఉద్దేశించినా,ఇతర భాషా గ్రంథాలకు చోటు పెట్టరాదన్న నిషేధం లేదు.మంచి పుస్తకాలు ఏ భాషలో ఉన్నా ఆయా రచయితలు,పబ్లిషర్లు కోరితే ఇక్కడ పెడతాం.



ఇంకా చాలా ఆలోచనలున్నాయి.



మీరు కూడా ఈ సైట్ చూసి పుస్తకాలు ఇంటికే తెప్పించుకోండి మరి.. ఇది ఆన్లైన్ అమ్మకాలు మాత్రమే కాదు. ముందు ముందు మరింతగా విస్తృత పరుస్తామని నిర్వాహకులు తెలియచేసారు..

మెయిల్ ఐడి : sales@supatha.in
durgapublications@gmail.com

ఫోన్:
9441257961
9441257962
9441257963


20052824.

Tuesday, 6 December 2011

ఆదిలక్ష్మి గారు వస్తున్నారంట...

ఆ భగవంతుని దయ వల్ల అమ్మ ఒడి బ్లాగర్ ఆదిలక్ష్మిగారు కోలుకున్నారు. త్వరలో బ్లాగు కూడా రాయడం మొదలుపెడతారంట.చందమామ రాజుగారు ఇచ్చిన సమాచారం ఇది.. బ్లాగు మిత్రులు ఆవిడకు కాల్ చేసి మాట్లాడితే మనమంతా ఆమెకు తోడుగా ఉన్నామని సంతోషిస్తారు..

మనందరికీ మంచివార్త. అమ్మ ఒడి ఆదిలక్ష్మి గారు స్వస్థత పొంది మళ్లీ మనముందుకు రావాలనుకుంటున్నారు. ఇవ్వాళే ఈ విషయం తెలిసింది. ఇన్నాళ్లుగా ఆమె వివరాలకోసం ప్రయత్నించినా దొరకలేదు. ఆదిలక్ష్మి గారి రచనలను, వారి కుటుంబాన్ని బాగా అబిమానించే రేణు కుమార్ గారు ఆమె వివరాలను తెలిపారు. ఆమె ప్రస్తుతం వికారాబాద్ సమీపంలోని ఓ అనాధాశ్రమంలో 50 మంది పిల్లల మధ్య జీవితం గడుపుతున్నారు.

పాప, భర్త.. జీవితంలో అన్నీ కోల్పోయి కూడా తేరుకుని మళ్లీ తన బ్లాగ్ నిర్వహణకు, రచనల కొనసాగింపుకోసం పట్టుదలతో ఉన్నారు. కూడూ, గూడూ కూడా లేని స్థితిలో ఇప్పుడు జీవిస్తున్నానని తన కంటూ ఒక జీవితం, ఉపాధి కల్పించుకుని బ్లాగ్ నిర్వహణను క్రమం తప్పకుండా సాగించాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. ఇటీవలే సెవెన్స్ సెన్స్ సినిమా చూసి రీఛార్జ్ అయ్యానని ఆమె అన్నారు. తొమ్మిది రాజ్యాలు కలిసి ఒక రాజ్యం మీద దాడి చేయడం యుద్ధం అనిపించుకోదని అది ద్రోహం, కుట్రపూరితమేనని ఆమె అన్వయించుకుని చెప్పారు. తన బ్లాగులో వైఎస్ మరణం తర్వాత రాజకీయ కథనాలు ఎక్కువగా జోడించానని, ఇప్పడు తాను కోలుకున్న తర్వాత హైందవమతంపై ముప్పేట దాడుల పర్యవసానాల గురించి విస్తృత రచనలకోసం ప్రణాళిక ఊహించుకుంటున్నానని బ్లాగ్ మిత్రుల సహాయం తనకు చాలా అవసరమని ఆమె ఫీలవుతున్నారు. మీకు వీలయితే ఆమె కొత్త ఫోన్‌నంబర్‌కు ఒకసారి కాల్ చేసి మాట్లాడగలరు.

9603419294


జీవని ప్రసాద్ గారు , మీరు గతంలో జీవని వారి నుంచి ఆమెకు స్కూల్‌లో ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పినట్లు గుర్తు. పునరుజ్జీవితం పొందిన ఆదిలక్ష్మి గారికి మీరు ఈ రకమైన చేయూతను ఇప్పించగలిగితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.


తన రచనలు, టైపింగ్, టెక్నాలజీ వంటి విషయాల్లో ఆమె తన సహచరుడు లెనిన్ బాబు గారిపైనే పూర్తిగా ఆధారపడ్డారు కాబట్టి సెల్, కంప్యూటర్ టెక్నాలజీ రెండింటినీ తాను ఇప్పుడు ఓనమాల నుంచి నేర్చుకోవలసి ఉంటుందని ఆమె ఫీలింగ్. ఆమె గత కొన్నేళ్ళుగా అమ్మఒడి బ్లాగులో రాసిన వందలాది బృహత్ కథనాలను మొత్తంగా లెనిన్ బాబుగారే టైప్ చేశారట. ఇప్పుడు ఒంటరిగా మారడంతో అన్నీ ఈమె నే్ర్చుకోవలసి ఉంటుంది.

వీలైతే మీరు ఇవ్వాళే ఆమెకు కింది మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడగలరు. ఆమెతో, ఆమె రచనలతో పరిచయస్తులుగా మనం చేసే గడ్డిపరక సహాయం కూడా ఆమెకు కొండంత అండగా నిలబడుతుందని నా ప్రగాఢ నమ్మకం. ఆమె తన స్వంత కష్టంతో జీవించేలా ఏదయినా ఏర్పాటు చేయగలరేమో ఆలోచించండి. వెంటనే కాకపోయినా కాస్త ఆలస్యమయినా ఈ విషయంపై మీరు తప్పక ఆలోచించగలరు.

వీలైతే ఇవ్వాళే ఆదిలక్ష్మి గారితో కింది నెంబర్‌కు కాల్ చేసి మాట్లాడగలరు.
9603419294

వీలైతే ఈరోజు రాత్రిలోపు ఆమె క్షేమ సమాచారం గురించి నా బ్లాగు ద్వారా అందరికీ తెలియపర్చాలని ఉంది. ప్రయత్నిస్తాను.

తప్పకుండా మీరు ఈ విషయంలో సహాయహస్తం అందించగలరని ఆశిస్తూ..
రాజు.

Wednesday, 23 November 2011

కథ చెబుతారా??


మీకు కథలు చదవడం అలవాటే కదా. మరి ఎపుడైనా కథలు చెప్పారా?? చెప్పే ఉంటారు. ఆఫీసుకు ఆలస్యంగా వెళ్ళినా. ఇంటికి ఆలస్యంగా వచ్చినా. చెప్పిన పని టైం కి చేయకపోయినా అప్పటికపుడు కొత్త కథ క్రియేట్ చేసేసి చెప్పేస్తుంటారు. అప్పటికి ఆ గండం తీరిపోతుంది. అవతలి వాడు నమ్మేంతవరకు మన కథలు పని చేస్తాయి. లేదా నమ్మేట్టు చెప్పడం, నిజమని అనిపించేలా చెప్పడం అనేది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొందరు కథలు యిట్టె చెప్పేస్తారు. కొందరు ఎంత ప్రయత్నించినా చెప్పలేరు. అమాయకులు నిజం చెప్పేసి మాటలు పడతారన్నమాట. :) ఇక అసలు విషయానికి వస్తే.. మీకు ఒక సన్నివేశం చెప్తే దాని ఆధారంతో ఒక చిన్న లేదా పెద్ద కథ రాయగలరా.. నవల రాస్తా అంటారా.. మరీ మంచిది.. మీ ఇష్టం.

పొద్దు జాలపత్రికవాళ్ళు ఈ మధ్య కథ చెప్తారా అంటున్నారు. ఓస్ అదెంత పని . వాళ్ళు ఇచ్చిన సన్నివేశాన్ని జాగ్రత్తగా చదవండి. ఆలోచించండి. చించండి.. రాసేయండి. రాస్తూ పోతూ ఉంటే అది చిన్న కథ లేదా పెద్ద కథ ఏదైనా పర్లేదు. రాయడం అయ్యాక పొద్దు వాళ్ళకు పంపేయండి.. ఓ పనైపోతుంది.. మరిన్ని వివరాలకు ఇది చూడండి.. కథ చెబుతారా.. వాళ్లకు నచ్చితే పొద్దులో అచ్చేస్తారు. లేదంటే మీ బ్లాగులో పడేయండి. ఇలా తరచూ రాస్తుంటే మీకే బాగా రాయడం అలవాటవుతుంది. ఊరికే ఎదో ఒక విషయం మీద టపా రాయడం కన్నా ఇలా కొత్తగా కథలు రాయడం ఎలా అనేది తెలుస్తుంది.. అలవాటవుతుంది. అదన్నమాట సంగతి.. రాయండి రాసేవాళ్ళకు చెప్పండి.

Friday, 18 November 2011

కార్తీక వనభోజనాలు - ఎవరెవరు చేసారంటే

కార్తీక పున్నమి సందర్భంగా రెండేళ్ళ నుండి తెలుగు బ్లాగుల్లో కూడా వనభోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ వంతుగా ఎదో ఒక వంటకం తమ బ్లాగులో పెట్టేసి అందరిని పిలిచేస్తున్నారు. ఈసారి కూడా పున్నమి నాడు వనభోజనాలు తక్కువమంది పాల్గొన్న సూపర్ హిట్ అని చెప్పవచ్చు. మరి ఆ రోజు ఎవరెవరు పాల్గొన్నారో చూసి అందరినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అన్ని వంటకాలు ఒకేదగ్గర ఉంటే ఎప్పుడైనా కొత్త వంటకం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే సరి.. వనభోజనాల పిలుపును అందుకొని నడుం బిగించి వంటలు చేసేసి, రాసేసిన వారందరికీ బోల్డు బోల్డు థాంక్స్..

మౌళి
కృష్ణప్రియ
మాలకుమార్
శ్రీలలిత
లత
ఎన్నెల
పద్మార్పిత
జ్యోతిర్మయి
వరూధిని
జ్యోతి
జయ

Thursday, 10 November 2011

కార్తీక వనభోజనాలు -బొంబాయ్ హల్వా



ముంధుగా అందరికి కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. మరి ఈ రోజు బ్లాగ్ వనభోజనాలు అనుకున్నాం కదా. అఫ్పుడే హడావిడి మొదలైంది. నావంతుగా స్వీటు తెచ్చాను. అందునా నాకు చాలా చాలా ఇష్టమైంది..

స్వీట్లంటే నాకు మొదటినుండి ఇష్టమే కాని డబ్బా ఖాళీ చేసేంత ఇష్టం కాదులెండి. కాని అన్నింటికంటే చాలా చాలా ఇష్టమైంది రబ్బర్‌లా సాగే రంగు రంగుల బొంబాయి హల్వా, గట్టిగా రాయిలా ఉండే సోన్‌పట్టీ. ముఖ్యంగా పుల్లారెడ్డి, బొంబాయ్ హల్వా షాపులోవే బాగుంటాయి. ఇంక వేరేవ్వరూ అలా చేయలేరు కూడా. ఇప్పుడు బొంబే హల్వా దుకాణం ఎత్తేసారు. మిగిలింది పుల్లారెడ్డి.. చిన్నప్పటినుండి ఎవరు స్వీట్ డబ్బా తెచ్చినా అందరికంటే ముండు ఈ రెండు స్వీట్లు కనిపిస్తే ఎత్తేసేదాన్ని. వీటికోసం మా మరదలు. నా కొడుకు నాతో పోటీకొస్తారు... అందుకే ఈ స్వీట్లను జాగ్రత్తగా డబ్బాలో పెట్టి నా అల్మైరాలో దాచుకుంటాను. ఎప్పుడైనా తీరికగా ఉన్నప్పుడు ఓ పుస్తకం పట్టుకుని ఓ స్వీటు ముక్క కొంచం కొంచం తింటూ చదువుకోవడం చాలా ఇష్టమైన అలవాటు. అదేంటో ఇప్పుడు ఎవరూ స్వీట్ డబ్బాలు తేవట్లేదు. తెచ్చిన కూడా అందులో ఈ హల్వా ఉండదు. ఎంత ఇష్టమైనా ముందులా తినే వయసు కాదు. ప్చ్..

అసలు ఈ స్వీట్ ఇంట్లో కూడా చేయొచ్చు అనే విషయం అస్సలు తెలీదు. అది స్వీట్ షాపువాళ్లే చేయగలరు, మనం ఇంట్లో చేయలేం అనుకునేదాన్ని. లేకుంటే ఎప్పుడో చేసుకుని తినేదాన్ని కదా. ఈ మధ్యే ఒక ఇంగ్లీషు ఫుడ్ బ్లాగులో ఈ హల్వా చేసుకోవచ్చు అని తెలిసింది. అది కూడా చాలా ఈజీగా. మరి నేను ఊరుకుంటానా?? చేసి తినేసా. అందరికీ చెప్పుకున్నా బొంబాయ్ హల్వా చేసానోచ్ అని. మరి మావాళ్లు అందరికీ తెలుసు అదంటే నాకెంత ఇష్టమో?? కాని తెలిసినా అప్పుడప్పుడు తెచ్చివ్వాలని మాత్రం ఒక్కరూ అనుకోలేదు ఇంతవరకు..

ఇక ఈ హల్వా ఎలా చేయాలో చెప్పనా...

కార్న్ ఫ్లోర్ - 5 tbsp
పంచదార - 1 1/2 కప్పులు
నీళ్లు - 3 1/2 కప్పులు
గుమ్మడికాయ గింజలు లేదా కాజు, బాదాం, పిస్తా ముక్కలు - 1/4 కప్పు
నెయ్యి - 2 tbsp
ఇలాచి పొడి - 1/2 tsp
ఓరెంజ్ లేదా గ్రీన్ కలర్ - 3 - 4 చుక్కలు

మూడు కప్పుల నీళ్లు మరిగించి చక్కెర వేసి చిక్కబడి తీగపాకం వచ్చేవరకు మరిగించాలి. మరో పక్క ఒక ప్లేటుకు లోపలంతా నెయ్యి రాసి ఉంచుకోవాలి. మిగిలిన సగం కప్పు నీళ్లలో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్ని మరుగుతున్న చక్కెరపాకంలో వేసి ఉడికించాలి. ఇప్పుడు ఇది పాలల్లా తెల్లగా ఉంటుంది . క్రమేణా రంగు మారి పారదర్శకంగా గ్లాసులా అవుతుంది. ఇప్పుడు ఇలాచి పొడి, నెయ్యి, కలర్, చిన్న ముక్కలు చేసిన డ్రై్‌ఫ్రూట్స్ లేదా గుమ్మడి గింజలు వేసి కలపాలి. వెంటనే దింపేసి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి సమానంగా పరవాలి. గంట సేపు అలా వదిలేసి ముక్కలు కట్ చేసుకుంటే సరి.. ఈ స్వీటు చేసేటప్పుడు నిదానంగా చిన్న మంటపై చేయండి. వీలుంటే నాన్ స్టిక్ ప్యాన్ ఉపయోగించండి. లేకుండే మాడుతుంది.

ఇది చదివాక కూడా అర్ధం కాలేదంటే. ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూసేయండి.


Tuesday, 8 November 2011

కార్తీక వనభోజనాలకు ఆహ్వానం


కార్తీకమాసం వచ్చేసింది. ఈ సంవత్సరానికి పెద్ద పండుగలన్నీ ఐపోవచ్చాయి. చలిపులి మెల్లిగా ఒళ్లువిరుచుకుంటుంది. కార్తీకమాసం శివకేశవులిద్దరికి ప్రియమైనది.నదీ స్నానాలు, ఉపవాసాలు, దీపారాధన,పూజలతో అందరూ బిజిబిజిగా ఉన్నారు. ఈ మాసంలో మరో ముఖ్యమైనది కార్తీక వనభోజనాలు. తమ వృత్తి, ప్రవృత్తులతో ఎవరికి వారు బిజీ ఐపోతున్నారు. ఒకరినొకరు కలవడానికి వీల్లేకుండా మనుషులమా? యంత్రాలమా అన్నట్టు అయ్యారు అందరూ. ఏమంటే తీరికలేదు అంటారు. ఈ వనభోజనాల నెపంతో ఇంటినుండి, ఉద్యోగబాధ్యతనుండి ఒక్కరోజైనా దూరంగా బంధువులతో, స్నేహితులతో గడిపేస్తారు. మరి మన బ్లాగుల్లో రెంఢు సంవత్సరాలనుండి ఈ కార్తీక వనభోజనాల ఒరవడి మొదలైంది తెలుసు కదా... దేశవిదేశాల్లో ఉన్నవారందరూ ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. మరి ఈసారి మాత్రం వదిలేస్తామా? ఎల్లుండే కార్తీక పూర్ణిమ. అందరూ రెడీనా.. మీకు నచ్చిన, వచ్చిన వంటలతో వచ్చేయండి ఎల్లుండి గురువారం 10వ తేదీన బ్లాగ్ వనభోజనాలు.. బ్లాగులు, సంకలినులన్నీ ఘుమఘుమలాడిపోవాలి....

గమనిక : ఇది ఆడవారికే కాదు. నలభీముల వారసులైన మగమహారాజులకు కూడా..

గతంలో మనం జరుపుకున్న వనభోజనాల విశేషాలు:

2009

2010

Wednesday, 26 October 2011

మస్తీ , మజా, మ్యూజిక్ జోష్... రేడియో జోష్



http://radiojosh.com/

మధురమైన సంగీతాన్ని ఇష్టపడే వారందరికీ నమస్కారం.

రేడియో జోష్ తరఫున మీకందరికి స్వాగతం... సుస్వాగతం.. ఈసారి దీపావళి పండగ సందర్భంగా దివ్వెల వెలుగులు, టపాసుల సందడితో పాటు మీకోసం మరో ధమాకా రాబోతుంది. మీరంతా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మీ రేడియో జోష్ ఈ రోజు దీపావళినాడు సకల హంగులతో మీ ముందుకు రాబోతుంది. పండగ సంతోషంలో రేడియో జోష్ పాటలతో కూడా ఎంజాయ్ చేయండి. పాటలు వింటూ మీ పని చేసుకోండి.. జస్ట్ ఒక్క క్లిక్‌తో రేడియో జోష్‌ని ఆన్‌లైన్‌లో మీ ముందుకు తీసుకురావస్తున్నందుకు మేమెంతో గర్వపడుతున్నాము. ఇంతకు ముందు మీరెప్పుడూ కనీ, వినీ ఎరుగని అద్భుతమైన ఆకర్షణలతో మీ ముందుకు వస్తుంది రేడియో జోష్. దీనికోసం అన్ని సన్నాహాలు పూర్తి అయ్యాయి. పండగరోజు మిమ్మల్ని అలరించడానికి ఆనందంలో ముంచెత్తడానికి మా రేడియో జాకీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా రేడియో జోష్ వింటూ మా రేడియో జాకీలతో సరదాగా మాట్లాడుతూ , మా లైవ్ షోస్‌ల్ పాల్గొని చాటింగ్ చేస్తూ ఆనందపు అంచులు అందుకోండి. రేడియో జోష్ 100% సంగీతంతో మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం మాకు ఉంది.

ఇక మా రేడియో జాకీల గురించి కొన్ని మాటలు. అందరూ సరదాగా మీ పక్కింటి అబ్బాయి, అమ్మాయిలా ఉంటారు. వసపిట్టలా కబుర్లు చెప్తూ మిమ్మల్ని అలరిస్తారు. మీరు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీకు నచ్చినవారికోసం కూడా ఒక పాట కోరుకోండి. మా రేడియో జాకీలతో మనస్ఫూర్తిగా మాట్లాడండి, కబుర్లు చెప్పండి. అంతులేని ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి.

రేడియో జోష్‌లోని ప్రత్యేక ఆకర్షణలు మీకోసం...

ఈనాడు సెల్‌ఫోన్ కూడా కంప్యూటర్‌లా వాడుతున్నారు. అందుకే మీ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో నిరంతరాయంగా రేడియో జోష్ వింటూ చాటింగ్ చేసేందుకు అవసరమైన ఆపిల్ ఐ్‌ఫోన్ మరియు ఆండ్రాయిడ్ ఆప్స్ భారతదేశంలో మొదటిసారిగా మీకోసం తయారుచేసాం. ఇది మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే కాల్ చేసి మా రేడియో జాకీలతో పాటు సహ శ్రోతలతో కూడా మాట్లాడొచ్చండోయ్..

అమెరికా, యూరప్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలలో ఉన్నవారి కోసం కాల్ చేసి మా రేడియో జాకీలతో మాట్లాడదానికి ప్రత్యేకమైన ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసాం.

ఇంకో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే జోష్‌తో కూడిన లైవ్ చాట్.. మా రేడియో జాకీలతో నేరుగా మాట్లాడటానికి మా సైట్‌లో దానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకుని హాయిగా ఎప్పుడంటే అపుడు చాటింగ్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఉచితం. ఇంతేకాకుండా ముందు ముందు మరెన్నో ఆకర్షణలతో 24 గంటలూ మిమ్మల్ని ఆనందింపచేయడానికి రేడియో జోష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది.

మస్తీ, జోష్‌తో నిండిన సంగీతంతో మిమ్మల్ని అలరించడానికి రేడియో జోష్ వచ్చేస్తుంది. కౌంట్‌డౌన్ మొదలైంది. రేడియో జోష్ వింటూ ఉండండి.. మస్త్ మజా.. మస్త్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయండి. ఈ సంతోషకరమైన వార్తను మీ సంగీతప్రియులైన మీ స్నేహితులతో పంచుకోవడం మరచిపోకండి. ఈ రేడియో యువత కోసమే కాదు అందరి కోసం. పాత, కొత్త , హిందీ, తెలుగు, ఇంగ్లీషు పాటలతో మీరు కోరినట్టుగా అందించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాం.


ఈ రోజు ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభ కార్యక్రమానికి తెలుగు సినీ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయిక్, నటుడు కృష్ణుడు విచ్చేస్తున్నారు.

Date : Wednesday 26th

October 2011

Time : 11.00 Am

Venue: Hotel Kens ,

Near Ratnadeep Super Market,

Srinagar colony ,

Hyderabad

Thursday, 22 September 2011

పూవై విరిసిన పున్నమివేళ



మానవుడు రోదసిలోకి నిరంతర ప్రయాణం సాగించినా, అందాల చందమామను చేరి పరిశోధనలు జరిపినా ఇంకా ఎన్నో సృష్టిరహస్యాలు అర్ధం కాకుండా మిగిలిపోతున్నాయి. ప్రకృతిలోని కొన్ని వింతలు ఆశ్చర్యంలో పడేస్తే, కొన్ని ప్రశ్నార్ధకాలుగానే మిగిలిపోతున్నాయి. అలాటి ఒక అద్భుతం బ్రహ్మకమలం. కేదారేశ్వరుడికి ప్రీతికరమైన ఈ పుష్పాలు హిమాలయాల్లోనే ఎక్కువగ పూస్తాయని అంటారు కాని ఇపుడు దేశవ్యాప్తంగా కొందరి ఇళ్లల్లో విరబూస్తున్నాయి బ్రహ్మకమలాలు. ఇవి అసలైన బ్రహ్మకమలాలు అవునో కాదో కాని అరుదైన జాతికి చెందిన అద్భుతమైన పుష్పం అని చెప్పవచ్చు. ఈ పువ్వు సంవత్సరానికి ఒకేసారి పూస్తుంది. అది కూడా రాత్రి ఎనిమిది తర్వాత విచ్చుకోవడం మొదలై పన్నెండు వరకు పూర్తిగా విచ్చుకుని అందాలతో బాటు సుగంధాలు వెదజల్లుతుంది. కాని సూర్యోదయానికి ముందే అస్తమిస్తుంది. మామూలుగా ఇది ఒకే పువ్వు పూస్తుంది కాని కొందరి ఇళ్లల్లో మాత్రం 6 - 10 పూలు కూడా విరబూస్తాయి. ఆ రోజు వాళ్ల ఇంట్లో పండగ వాతావరణం.. చూసినవారికి అద్భుతమే..


ఈ మొక్కలోని చిన్న ఆకును తెచ్చి మట్టిలో పాతితే దానినుండి మరో మొక్క మొదలవుతుంది. క్రమంగా ఆకులు దళసరిగా మారి అందులోనుండే మరిన్ని ఆకులు పుట్టుకొస్తాయి. ఇంకా ఈ మొక్క నాటిన రెండేళ్ల తర్వాతే పూత మొదలవుతుంది. బలిష్టమైన అకుల మీదనుండే బ్రహ్మకమలం మొగ్గ వేస్తుంది. వారం రోజుల్లో పెరిగి పెద్దదై విరబూస్తుంది. సుమారు ఎనిమిది గంటలనుండి పువ్వు విచ్చుకోవడం మొదలవుతుంది. అర్ధరాత్రి పన్నెండు వరకు పూర్తిగా విచ్చుకుని అద్భుతమైన సువాసనను వ్యాపింపచేస్తుంది. తెల్లవారేసరికి పూర్తిగా ముడుచుకుపోతుంది. ఈ పువ్వు జీవితకాలం చాలా తక్కువ.. ఈ బ్రహ్మకమలం పువ్వులు ఎక్కువగా జూన్ నుండి ఆగస్ట్ వరకు విరబూస్తాయి. లేదా మరో నెల వరకు..

ఎడారిమొక్కగా పిలవబడే బ్రహ్మకమలం మొక్కను వృక్షశాస్త్రంలో కాక్టస్ జాతికి చెందినదని గుర్తించారు. ఈ పువ్వును తెలుగు, సంస్కృత బాషలో బ్రహ్మకమలమని, హిందీలో నిషాగంధి అని, ఇంగ్లీషులో క్వీన్ ఆఫ్ నైట్స్ అని వ్యవహరిస్తారు. బ్రహ్మకమలం పుష్పాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పంగా గుర్తించింది. 1982లో భారతీయ తపాలా శాఖ హిమాలయ పుష్పాల మీద విడుదల చేసిన స్టాంపులలో బ్రహ్మకమలాన్ని కూడా చేర్చింది. బ్రహ్మకమలం దేవతాపుష్పంగానే కాకుండా ఓషధీ మొక్కగా కూడా ఉపయోగిస్తున్నారు. దీని వేరును గాయాలు మానడానికి వాడతారు అలాగే పక్షవాతానికి కూడా ఇది మంచి మందు అంటారు వైద్యులు.

ఇంత అరుదైన, అద్భుతమైన పువ్వు మొన్న పున్నమి నాడు మా ఇంట్లో కూడా విరబూసింది. అసలు పువ్వులంటే మక్కువలేనివారు ఎవ్వరు ?? బజారులో కొన్న కిలోల పువ్వుల కన్నా మన ఇంట్లో పూసిన రెండు మూడు పువ్వులు మనకు అపూర్వమే కదా. అవి మొగ్గలా మొదలై పువ్వుగా మారడం చూస్తుంటే కలిగే ఆనందం అంతులేనిది. అలాంటిది ఒక అద్భుతమైన పువ్వు విరబూయబోతుంది అంటే ఎంత ఆత్రుత.. మూడేళ్ల క్రింద సత్యవతిగారిని అడిగితే ఈ మొక్క ఇచ్చారు. ఇక అప్పటినుండి ఎప్పుడు బ్రహ్మకమలాన్ని చూస్తానో అనుకుంటూ ఉండేదాన్ని. బ్లాగుల్లో , టీవీలో ఈ పువ్వులను చూస్తుంటే ఇంకా అత్రుత ఎక్కువైపోయేది. ఇన్నేళ్ళైనా ఇంకా పువ్వు రావడం లేదని నిరాశపడడం, మళ్లీ ఎదురుచూడం అలవాటైపోయింది. కాని మొన్న పున్నమికి వారంరోజుల ముందు మొగ్గ కనిపించగానే ఎంత ఆనందమో.
రోజూ పొద్దున్నే ఆ మొగ్గని చూడడం. ఎంత పెరిగిందా? ఎప్పుడు విచ్చుకుంటుందా? అని అనుకుంటూ ఫోటోలు తీసుకుని భద్రపరుచుకోవడం. ఇలా చివరికి పున్నమి రోజు విరబూస్తుంది అనుకునేంతగా ఎదిగింది ఆ మొగ్గ. ఆకుమీద పెరిగిన ఆ పువ్వు అడుగు పొడవున్న కాడతో ఉంది. ఎక్కడ బరువుకు పడిపోతుందో అని ఆ కాడను ఒక రాడ్ పెట్టి దారంతో కట్టాను. ఆరోజు విరబూస్తుందో మరునాడో అని రాత్రి ఏడుగంటలవరకు సందిగ్ధంగానే ఉండింది. మొదటిసారి కదా.. ఇక ఎనిమిది నుండి మెల్లిగా విచ్చుకుంటున్న పువ్వును చూస్తుంటే మాత్రం అద్భుతం అనిపించింది. పది నిమిషాలకోసారి ఇంటి వెనకాల కెళ్లి పువ్వును చూడడం. ఫోటో తీసుకోవడం. అప్పుడు ఎటువంటి వాసనలు రాలేదు. ఇదేంట్రా మంచి సువాసన వస్తుందని చెపారు కదా అనుకుంటుండగా. రాత్రి పదకొండు నుండి మెల్లిగా సువాసనలు మొదలయ్యాయి. ఆకాశాన నిండుగా వెలుగుతున్న ఆ పున్నమి చంద్రుడికి ధీటుగా స్వచ్చమైన తెలుపులో , ముట్టుకుంటే మాసిపోతాయేమో అన్నంత మృదువైన రెక్కలతో బ్రహ్మకమలం పూర్తిగా విరబూసింది. అరచేయి వెడల్పులో ఆ పువ్వును చూస్తుంటే చెప్పలేని ఆనందం. ఉద్వేగం.ఆ భావన మాటలలో చెప్పలేను. కవి హృదయం కావాల్సిందే ఆ అందాలు వర్ణించడానికి .. ఆ పువ్వు తెల్లవారేవరకు ఉండదని తెలుసు అందుకే దాన్ని ఫోటోలలో బంధించి ఉంచాను. రాత్రి పన్నెండున్నరకు పువ్వును కోసి దేవుడి దగ్గర పెట్టి పడుకున్నాం. పొద్దున్న చూస్తే ముదుచుకుపోయి వాలిపోయింది..

మళ్లీ వచ్చే ఏడాదే విరబూస్తుందని తెలిసినా ఇంకా ఆశతో రోజూ చూస్తున్నా ఇంకో మొగ్గ కనిపిస్తుందేమో అని...

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008