Sunday, September 15, 2013

అంచెలంచెలుగా -- సప్తపద సోపానం

"చదువు లేదూ సంధ్యా లేదూ ఎప్పుడూ చూసినా ఆ టీవీ ముందు సెటిల్ ఐపోవడమేనా. ఇంటిపనికి పనిమనిషి ఉంది. పిల్లలకు కావలసినవి చూసి, వంట చేయడం తప్పితే నీకు వేరే పనేం వచ్చు. పనికిరాని నవల్సు, మాగజీన్స్ చదవడం తప్ప లోకజ్ఞానం లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఆ చెత్త సీరియల్స్ చూస్తే ఏమొస్తుంది. ఆ డిస్కవరీ, నేషనల్ జగ్రాఫిక్ చానెల్ చూడు. పక్కింటివాళ్లతో, చుట్టాలతో ముచ్చట్లతో టైమ్ వేస్ట్ చేస్తున్నావ్. అవన్నీ మానేసి  పెళ్ళప్పుడు  ఆపేసిన చదువు కంటిన్యూ చేయి. ఏదైన పనికొచ్చే పని చేయి., అసలు నీలాంటి వాళ్ల కోసం ఆ టీవీ చానెల్స్‌లో చెత్త సీరియల్స్, ప్రోగ్రామ్స్ తయారు చేసేది. నీలాంటివాళ్లు ఉన్నారు కాబట్టే  ఆ ప్రోగ్రామ్స్ చేసేవాళ్లు బ్రతుకుతున్నారు. ఎన్ని చానల్స్ వస్తే అన్ని సీరియల్స్ చూడడమేనా. తెలుగు సరిపోదని  ఇంకా హిందీ , తమిల్ సీరియల్స్ కూడా చూడ్డమెందుకు. ఆ సీరియల్స్ లో చూపించినట్టు నిజంగా జరుగుతుందా? . ఒక్క దాంట్లోనైనా కామన్స్ సెన్స్ అనేది ఉందా ? కనీసం ఆ చానెల్స్ లో వంటల ప్రోగ్రామ్స్ చూసి నేర్చుకుని చేయి. ఆహా! అదీ చాతకాదు. బోలెడు వంటల పుస్తకాలు కొంటావు. అందులోనుండి చేస్తావా అంటే అధీ లేదు. ఏదో పదీ పదిహేను వంటలనే తిప్పుతుంటావు.  ఇవన్నీ కాకుంటే నిద్రపోవడం. వేరే పనే లేదు నీకు.. నిన్ను బాగుపరచడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. "

" మరేం చేయను. పిల్లలతోనే సరిపోయే. ఇంక నేనెప్పుడు చదివేది. ఐనా చదివి ఏం ఉద్ధరించాలంట. ఉద్యోగం చేసి సంపాదించే అవసరం లేదు. ఐనా ఇంట్లో పనంతా చేసుకుని అందరికీ అన్నీ చేసి పెట్టి నేను ఉద్యోగానికి వెళ్లాలా. అమ్మో నా వల్ల కాదు. ఇలాగే హాయిగా ఉంది. వంట చేసుకుని, ఇల్లు సర్దుకుని. అపుడపుడు ఏదో కుట్టుపని, అల్లికలు చేస్తూనే ఉన్నాగా. మిగిలిన ఖాళీ టైమంతా ఏం చేయాలి. టైంపాస్ అని టీవీ చూస్తున్నా. అంతే కదా. నాకు ఫ్రెండ్స్ లేరు కాబట్టి షాపింగులు, సినిమా ప్రోగ్రాములు అంటూ లేవు సంతోషించంఢి.. పుస్తకాలు అంటే నాకున్న తెలివికి ఈ వీక్లీస్, నవల్స్ మాత్రమే అర్ధమవుతాయి. ఇపుడు డిస్కవరీ  చానల్ చూసి నేనేమైనా నోట్స్ రాయాలా, ఆర్టికల్స్ రాయాలా. మరి అలాంటప్పుడు చూసి ఏం చేయాలి. సీరియల్స్ అంటే ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. అందుకే చూస్తుంటాను. తెలుగే చూడాలని రూలేమీ లేదుగా. హింది , తమిల్ అర్ధమవుతాయి. అందుకే చూస్తున్నా. వేరే పనికొచ్చే పని మీరే చెప్పండి చేస్తా.."

కొన్నేళ్ల క్రింద మా ఇంట్లో తరచూ జరిగే సంభాషణ అన్నమాట. కాని ఈరోజు పరిస్థితి తల్లకిందులైంది కదా అని తలుచుకుంటేనే నవ్వొస్తుంది. అప్పుడు బోలెడు తీరిక సమయం. చేయడానికి పనేమీ లేదు. కాని ఇప్పుడు అస్సలు తీరిక సమయం లేదు. తలకుమించిన పనులు.  దీనికి అసలు కారణం ఈ బ్లాగు  JYOTHI.. అప్పుడెలా ఉండేదాన్ని? ఇప్పుడెలా ఉన్నాను? అసలు నాకంటూ ఒక గుర్తింపు లేకుండా అందరిలా ఏ లక్ష్యమూ లేకుండా సాధారణ గృహిణిగా   కాలం గడిపేసేదాన్ని. అలా టీవీముందు సెటిల్ ఐపోయే నన్ను తీసుకొచ్చి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టారు మావారు. ఆయన మొదటినుండి అంతే. ఏ పనైనా రాదు అని ఎందుకు అనుకోవాలి. ఎందుకు రాదూ అని శోధించి. సాధించాలి అంటూ నన్నూ అలా తయారు చేసారు.  అంతర్జాలంలో ఇంగ్లీషులో సెర్చింగ్ చెస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి కాని నాకు తెలుగు మాత్రమే కావాలి. పిల్లల చదువులు, ఉద్యోగాల గురించి తెలుసుకుందామని మొదలెట్టిన నా శోధన తెలుగు దగ్గర ఆగిపోయింది. ఆ రోజుల్లో అంటే 2006 ప్రాంతంలో  ఇంటర్నెట్ వాడకం అంత మంచిది కాదు. అందునా ఆడవాళ్లకు అనేవారు. అలా నెట్లో ఆడవాళ్లు ఉన్నారంటే కూడా అదో రకంగా భావించేవారులెండి. అప్పట్లో తెలుగులో టైప్ చేయడానికి సులువైన మార్గాలు లేవు. నేను వచ్చిన కొత్తలోనే  లేఖిని మొదలైంది... తెలుగును ఇంత సులువుగా టైప్ చేయొచ్చు అని తెలిసాక ఎంత సంతోషమో..
టైంపాస్ కోసం మొదలెట్టిన బ్లాగు ప్రయాణం నా జీవితంలో ఇంత అనూహ్యమైన మార్పు తీసుకొస్తుందని ఆనాడు అస్సలనుకోలేదు. అసలు ఇంతకాలం నేను బ్లాగును కొనసాగిస్తున్నాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు నచ్చిన, ఇస్టమైన హాబీలను వేర్వేరు బ్లాగులుగా తయారు చేసుకున్నాను. కాని బ్లాగు వల్ల నాకంటే ఎక్కువ లాభపడింది ఎవరూ లేరేమో అనిపిస్తుంది. బ్లాగువల్ల ప్రపంచానికి నేను పరిచయమయ్యానో,  నాకు ప్రపంచమే పరిచయమైందో కాని ... ఈ బ్లాగువల్ల నాకు నేనే పరిచయమయ్యాను అని ఘంటాపధంగా చెప్పగలను. లేకపోతే పచారీ లిస్టు తప్ప వేరే రాసే అలవాటు లేని నేను ఇప్పుడు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అవుతానని,  విభిన్నమైన విషయాలమీద ఇన్ని వ్యాసాలు రాసానా? అని అప్పుడప్పుడు ముక్కున వేలేసుకుంటాను. కానీ నా మనసులోని భావాలు, స్పందనలు, ఆలోచనలు, సంతోషం, దుఖం.. ఏవైనా సరే అలా అక్షరాలలోకి మార్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. అవి నాతో పాటు మరి కొందరికి నచ్చుతున్నాయంటే ఇంకా హ్యాపీసు.. ఈ బ్లాగు నా రాతనే మార్చింది. మంచి శైలిని, భావవ్యక్తీకరణను, ప్రముఖుల పరిచయాలను, ఆత్మీయులుగా మారిన కొందరు స్నేహితులను, నన్ను తమ కుటుంబ సభ్యురాలిగా భావించి, గౌరవించే ఎందరో వ్యక్తుల పరిచయాలను, నాకు ఇష్టమైన తెలుగు పుస్తకాలకు సంబంధించిన ఉద్యోగం (ఇది కలలో కూడా ఊహించనిది. కారణం చెప్పాగా) ఇచ్చింది. అన్నింటికి మించి వెలకట్టలేని అభిమానాన్ని కూడా పొందగలిగాను. బ్లాగునుండి ప్రింట్ మీడియాకు వెళ్లినా మంచి ప్రోత్సాహం, గుర్తింపు లభించింది.  వీటన్నింటికంటే నాకు ఎంతో సంతృప్తిని, గౌరవాన్ని ఇచ్చింది మాలిక పత్రిక బాధ్యత. అసలు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నానో నాకే అర్ధం కావట్లేదు. అంతా ఆ పైవాడి లీల తప్ప..

ఈ సోదంతా ఎందుకంటే  తెలుగులో బ్లాగు మొదలెట్టి సరిగ్గా ఏడు సంవత్సరాలు పూర్తయ్యాయి..  ఈ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు కదిలాయి. అవి చెప్పుకుంటూ పోతే పేజీలు పేజీలే చెప్పొచ్చు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నా ఈ విజయ ప్రస్థానంలో మధ్యలో కలిసి విడిపోయిన, ఇంకా తోడున్నా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను నాకు పరిచయం చేసి, నా రాతను, వ్యక్తిత్వాన్ని, వ్యవహార శైలిని, ప్రపంచ జ్ఞానాన్ని, గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చిన నా బ్లాగు " JYOTHi " కి మరోసారి హ్యాపీ బర్త్‌డే.


త్వరలో ఒక విషయమై ప్రకటన చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నాను. అది పూర్తికాగానే అందరికీ చెబుతానుగా..


 అలాగే ఇంతకుముందటి వార్షికోత్సవ వివరాలు కూడా చదివేసేయండి మరి..పంచమ వార్షికోత్సవం Thursday, September 5, 2013

మాలిక మాసపత్రిక భాద్రపదమాస సంచిక విడుదల

 Jyothivalaboju

Chief Editor, Content Head.


వినూత్నమైన వ్యాసాలతో, సీరియల్స్ తో మాలిక పత్రిక  భాద్రపద మాస సంచిక విడుదలైంది.
గతనెలలో ప్రకటించిన ఉత్తమ బ్లాగు, వికి టపాలకు రూ. 116 విలువైన కినిగె గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. ఈ బహుమతులకు మీరు కూడా మీకు నచ్చిన టపాలను నామినేట్ చేయవచ్చు. మీరు రాసినదైనా సరే ...

మీ ఉత్తరాలను, రచనలను పంపవలసిన చిరునామా:  editor@maalika.org


ఉత్తమ బ్లాగు టపా:  ' ఔను! నేను బ్లాగ్ రాయడం మానేశాను'  ( పనిలేక)
ఈ టపాలో డాక్టర్ గారు చెప్పిన అనుభవాలు చాలామందికి కలిగి ఉండవచ్చు. మనమో పెద్ద బ్లాగర్. చాలా పేరుంది. బాగా రాస్తారని తెలుసు కాని అసలు బ్లాగు అంటే ఏంటి? దానివల్ల ఎంత రాబడి ఉంటుంది మొదలైన ప్రశ్నలు వేస్తుంటారు చాలామంది. అందుకే  ఇది ఈ నెల కోసం ఎంపిక చేయబడింది..

ఉత్తమ వికి వ్యాసం :  తెలుగు వికీపీడియాలో గతనెల అంటే ఆగస్టులో కొత్త వ్యాసాలేమున్నాయి అని చూస్తే ఎన్నో గ్రామాలగురించి కొత్త వ్యాసాలు ఉన్నాయి.  పైసా ఆదాయాన్నివ్వని ఈ పనిని ఒక బాధ్యతగా నిర్వహిస్తున్న YVS Reddyగారికి బహుమతి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.. మీరు కూడా మీ ఊరిగురించిన వింతలు విశేషాలు వికిలో చేర్చండి మరి..


మాలిక పదచంద్రిక - 11 .. ఈ ప్రహేళికకు ఒక్క సమాధానం కూడా రానందుకు చింతిస్తున్నాము. మరీ అంత కష్టంగా ఉందా ఈ పదచంద్రిక?? కాని ఈసారి పదచంద్రిక కాస్త సంగీతభరితంగా, రసవత్తరంగా ఉంటుంది..

ఇక ఈ నెలలోని వ్యాసాలు ఇలా ఉన్నాయి...

 0. పట్టిక
 1. సంపాదకీయం: మనమేం చేయగలం?
 2. అతడే ఆమె సైన్యం - 4 - యండమూరి వీరేంద్రనాధ్
 3. సంభవం - 4 - సూర్యదేవర రామ్మోహనరావు
 4.  కినిగె టాప్ టెన్ - ఆగస్టు 2013
 5. జయదేవ్ గీతపదులు - 2  - జయదేవ్
 6.  అక్షర పరిమళాల మమైకం -  శైలజామిత్ర
 7. బియాండ్ కాఫీ - కత్తి మహేష్ కుమార్
 8. అనగనగా బ్నిం కధలు -2 - బ్నిం
 9. వినిపించని రాగాలే .. పారశీక చందస్సు - 4
10. మాలిక పదచంద్రిక - 12 - సత్యసాయి కొవ్వలి
11. పంపనాచార్యుడు - చారిత్రక సాహిత్య కధామాలిక - 5
12. సాంబే పరబ్రహ్మణి - రసజ్ఞ
13. కాళిదాసు కవితా సౌందర్యం - అనిల్  మాడుగుల

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008