Thursday, September 14, 2017

11వ వార్షికోత్సవ శుభవేళ.. Happy Birthday "జ్యోతి" ....

అనగనగనగా .. అప్పుడెప్పుడో అని చెప్పడం మొదలెడితే అదో పెద్ద కథ లేదా నవల అవుతుంది.
ఇది సరదా లేదా సీరియస్ కథ కాదు. జీవితం. జీరోకంటే తక్కువ గుర్తింపు, టాలెంట్, నాలెడ్జ్ తో అంతర్జాలంలో అడుగుపెట్టాను. పిల్లలకోసం వచ్చినా పిల్లలతో, పిల్లల ఈడువాళ్లతో చదువూ సంధ్యా లేకున్నా సాంకేతికంగా ఎన్నో నేర్చుకున్నాను.. అంటే మరీ అంత అధ్వాన్నం కాదుగాని తెలుగు మాట్లాడ్డం, చదవడం, రాయడం వచ్చు. ఇంగ్లీషు కొంచెం కొంచెం మాట్లాడ్డం, చదవడం అవసరమైనంత రాయడం మాత్రం వచ్చు. పదిమందితో కలిసే గుణం మాత్రం లేదు. ఎందుకంటే నాలా, నాకు నచ్చినట్టుగా ఎవరుంటారో ఏమో అనుకుంటూ మౌనంగా ఓ మూల ఉండేదాన్ని. నాడు, నేడు కూడా పనికిరాని ముచ్చట్లు అస్సలే రావు.
ఈ నేర్చుకోవడమనే ఆకాంక్ష, శ్రమ, పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎదుగుతూ నాకైన ఓ ప్రత్యేకత, గుర్తింపు సంపాదించుకున్నాను. అంతర్జాలంలో పరిచయమైనా ఆత్మీయులుగా మారిన మిత్రుల సహకారం అప్పుడూ, ఇప్పుడూ కూడా తోడుండగా నాకేల చింత??

కొత్తలో ఉత్సాహంగా, గర్వంగా అనిపించిన విజయాలు, ప్రశంసలు, గుర్తింపులు రాన్రానూ కాస్త భయం కలిగించసాగాయి. ఒక పెద్ద విజయం ముందు నిలబడి ఉంటే గతంలోని అవమానాలు, హద్దులు, భయాలు, పోరాటాలు నేనున్నా అంటున్నాయి. ఒక ప్రశంసా పత్రం కాని మొమెంటో నా చేతిలో ఉంటే ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని. ఎంత భయస్తురాలిగా, బలహీన మనస్కురాలిగా ఉండేదాన్ని అని దిగులుగా ఉంటుంది.... గతకాలపు చేదు జ్ఞాపకాలు, పోరాటాలే నేటి అవార్డులు, రివార్డులకు మూలం కదా. వాటిని మరిస్తే ఎలా??
గతంలోని ఫాఠాలను అనుక్షణం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటేనే వర్తమానంలో మరింత ధైర్యంగా, పట్టుదలగా ముందుకు సాగగలము అనుకుంటున్నా..
నాకేమీ కాలేదండి బాబూ! బానే ఉన్నా. ఒక సంతోషకరమైన సంధర్భాన్ని కాస్త వెరయిటీగా గుర్తు చేసుకుంటున్నాను అంతే. అదే నా పునాది, నా మూలాన్ని.
11 ఏళ్ల క్రితం ఒక సాధారణ మహిళగా అంతర్జాలంలో బ్లాగు మొదలెట్టి ఇదిగో ఇప్పుడిలా ఉన్నాను.

Happy Birthday జ్యోతి 

నా బ్లాగు “ జ్యోతి” . నన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటానన్నమాట. ఈ ఫేస్బుక్ మూలంగా బ్లాగును నిర్లక్ష్యం చేస్తున్నానని నాకు తెలుసు. వాట్ టు డూ..

2 వ్యాఖ్యలు:

Zilebiఏమో నండి ! సంవత్సరానికో రిచ్యువల్ లా అయిపోయింది మీ టపా !

హా! ఆనాటి జ్యోతి ఫుల్ డేస్ ఎప్పుడొస్తాయో యేమో !

నో చీర్స్ సహిత
జిలేబి :)

Zilebiసంవత్సరమునకొక టప !
గంవరముగ బెట్టుటేల ! గంపెడు రాతల్
సంవాదములన్ జేసిరి
చంపాలువుతొనల ! నాటి చందంబెచటో !

జిలేబి

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008