Monday 4 May 2009

భలే మంచి రోజు...

భలే మంచి రోజు...
పసందైన రోజు...
May 18,, రోజు
సి.ఎం గా ప్రమాణం చేసే రోజు..

ఇదేంటి అని కంగారు పడుతున్నారా. ఇంకా ఓట్ల లెక్కింపు కాలేదు. ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో తెలిదు. ఎవరు గెలిచారో తెలిదు. అప్పుడే ప్రమాణస్వీకారానికి ముహూర్తం పెట్టేసారేంటి అంటారా?? .. పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టుకుందంట వెనకటికెవరో అమాయకపు అతివ.. ఇపుడు మన రాజకీయ నాయకుల పరిస్థితి, ప్రవర్తన అలాగే ఉంది..

నిన్న నవ్వుల రోజు అని తెలిసి, ఓహో అని ఊరుకున్నా. నవ్వు అనేది బలవంతంగా తెచ్చుకుంటే రాదు. దానికి ఏదో ఒక కారణం, సందర్భం ఉండాలి. మన మూడ్ బాగోకుంటే ఎంత మంచి విషయమైనా సరేలే అని ఊరుకుంటాం.లేదంటే ఒక చిన్న మందహాసం వదిలేస్తాం. ఈ మండే ఎండలు, రోజు వారి తలనొప్పులు , సాధకబాధకాలతో నవ్వులరోజు కదా అని నవ్వండి అంటే ఎలా?? అది అలా రమ్మంటే వస్తుందా.. మన మూడ్ బాగుంది. ఒక మంచి సంఘటన, చూసినా, ఏదైనా మంచి విషయం గుర్తొచ్చినా సంతోషం నవ్వు రూపంలో మనసునుండి అలలుగా కదులుతూ కళ్ళలోకి వస్తుంది. అక్కడినుండి పరవళ్ళు తొక్కుతూ బుగ్గల మీదుగా పెదవుల పైకి వస్తుంది. అది ఉధృతి పెరిగితే పెదవులను విడదీసి, పెద్దగా నవ్వుకునేలా చేస్తుంది. మనలోని మౌనాన్ని, బాధను పక్కకు గెంటి హాయిగా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది నవ్వు. అందుకే అన్నారు పెద్దలు నవ్వనివాడు రోగి , నవ్వేవాడు భోగి అని. నవ్వులను పంచేవాడు మహాయోగి.. ఎక్కడినుండి



ఎక్కడినుండి ఎక్కడికొచ్చాను అనుకుంటున్నారా?? ఆగండాగండి. ఈ ముందు మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. నిన్నంతా పని ఎక్కువై (ఆదివారం కదా), వేసవి వేడి, చికాకుగా ఉన్నాను. నవ్వులరోజు అని టీవీలో చూసి ఎంతో మంది విరగబడి నవ్వుతుంటే నాకీ ఆలోచన వచ్చింది. రాత్రి వార్తలలో (ఎ చానెల్ అని అడగవద్దు. ఎ చానెల్ చూసినా ఒకే వార్తా కదా. కాస్త అటు తిప్పి , ఇటు తిప్పి చూపిస్తారు) చూస్తుంటే మన ప్రియతమ నాయకులు ముగ్గురు అప్పుడే తమ పార్టీ గెలిచేసింది. ప్రమాణస్వీకారానికి మంచి ముహూర్తం కూడా నిర్ణయించేసుకున్నారు పండితులను సంప్రదించి. ఔరా!! ఎంత ధీమా!! ముగ్గురూ ప్రమాణస్వీకారం చేస్తా అంటే ఎలా మరి?? ఉన్నది ఒకే సి.ఎం కుర్చీ. ముగ్గురు పట్టరుగా?. ఆంతా వాళ్ళే నిర్ణయించేసుకుంటారా?? మరి ఓటేసిన వాళ్ల సంగతి ??? ఇది వినగానే నాకు పగలబడి నవ్వాలనిపించింది. కాని కాస్త చిన్నగానే నవ్వేసానులెండి.

అసలే ఆర్ధిక మాంద్యం. కాని ఈ నాయకులకు ప్రచారానికి కోట్లు ఎక్కడివి?? ఎక్కడో ఏదో ఆఫీసులో ...ఐదువేలు లంచం తీసుకున్నాడని పట్టుకున్నారోచ్ అని పేపర్లో వేస్తారు, టీవీలో చూపిస్తారు.మరి ఈ నాయకుల ఖర్చులకు లెక్కలు ఎవరు అడగాలి. ఒక్కో టిక్కెట్టు కోట్లకు అమ్ముకుంటున్నవారు, అమ్ముకున్నవారు ముందు ముందు ఎన్ని కోట్ల కోట్లకు ఎసరు పెట్టారు?? ఇపుడు ఖర్చుపెట్టారు, తెగ తిరిగారు, ఎండనకా, వాననకా కష్టపడ్డారు (పాపం ) . గెలుస్తామని ఎంతో ధీమాగా ఉన్నారు. ఎందుకు?? ఈసారి ముఖ్యంగా మహిళలను బుట్టలో వేయడానికి శాయశక్తులా ప్రయత్నం చేసారు..అందుకేనేమో? ఏమో? గుర్రం ఎగరావచ్చు. ఒకరేమో ఇళ్లిస్తాం, లక్షాధికారులను చేస్తాం అంటే, ఒకరు ఇంట్లో కూర్చుంటే పని చేయకున్నా నెలకు డబ్బులు మీ (ఆడాళ్ళ) అకౌంట్లో డబ్బులేస్తాం అన్నారు. అవి నిజంగా ఇస్తారా?? ఎందుకంటే ఇంతకుముందు గెలిస్తే విద్యుత్తు ఉచితం అన్నారు, మొదటి ఫైలు అదే సంతకం చేసారు . బాగు బాగు. కాని ఆ సంబడం ఒక బల్బు కరెంట్ కు మాత్రం అని తర్వాత అందరి ఫ్యూజు పోగొట్టేసింది. మరి ఇపుడు ఏమవుతుంది?? అన్ని వస్తువుల ధరలు ఎండలతో సమానంగా పేలిపోతున్నాయి. అవి ఎవ్వరికీ పట్టింపు లేదు. హాయిగా ఎపుడు గద్దేనేక్కుదామా అని లెక్కలేస్తున్నారు. అన్ని ఐపోయాయి. ఇపుడు జ్యోతిష పండితులకు భలే గిరాకీ ఉన్నట్టుండి చూడబోతే..:)..

ఇంతకీ ఓటర్లకు, ఒట్లడుక్కునే నాయకులకు ముంబాయి సంఘటనా గుర్తుందా ??.. మళ్ళీ ఇంకోటి జరుగుతుందని ఎదురుచూద్దామా.. ...

6 వ్యాఖ్యలు:

Hima bindu

:):)

పరిమళం

మరి ఓటేసిన వాళ్ల సంగతి ??? అధోగతి ! :) :)

asha

మే 15 వరకూ ఆగొచ్చు కదా.
అబ్బే! మాకిన్ని సీట్లు వస్తాయి...మాకిన్ని వస్తాయి అని వాళ్ళు చెప్పటం. చానెల్లన్నీ పనీపాటా లేనట్టు వాటి మీద ఇంటర్వ్యూలూ, కార్యక్రమాలూ...పైగా జ్యోతిష్యాలూ. మనందరమూ(అంటే రాష్ట్రమంతా) ఈ చానెల్స్ చూడకుండా స్ట్రైక్ చేస్తే బావుంటుందేమో....అప్పటికి గానీ వీళ్ళు మారేటట్లు లేరు.

rams

very nice... very good...

కొత్త పాళీ

అవును, ప్రజాస్వామ్యమూ, రాజకీయాలూ, వాటిని నడీపే రాజకీయులూ ఉన్నంత కాలమూ మనం నవ్వుకోడానికి ఏం ఢోకాలేదు.
ఒబామా అమెరికా అధ్యక్షపదవి గెలిచేశాడు అని తెలిశాక ఇద్దరు రాజకీయ కార్టూనిస్టులు మాట్లాడుకుంటున్నారు .. ఒకాయన ఆందోళన పడ్డాడు, చూడ్డానికి చక్కగా ఉండి, ఎక్కడా తొణాక్కుండా ఇంత తెలివిగా మాట్లాడే అధ్యక్షుడితో మనకేం పనుంటుంది అని. రెండో ఆయన అన్నాడు .. ఏం భయపడకండి. ఆ కుర్చీ అలాంటిది, అదెక్కంగానే చూడండి, మనకి చేతినిండా పని కల్పిస్తాడూ అని :)

జ్యోతి

భవానిగారు,

ఛానెల్ల సంగతి వదిలేయండి. ఈ నాయకులు ప్రవర్తించే తీరు, మాటలు వింటుంటే చిరాకేస్తుంది. ఎందుకంత అధికార దాహం?? లెక్కింపు అయ్యాక జనవాణి తెలుస్తుందిగా..

కొత్తపాళీగారు,

కోపం, చిరాకు, ఏవగింపు కూడా కలుగుతున్నాయి ఈ నాయకుల మాటలు వింటుంటే.. నిన్న చూడండి, ఎలాగూ గెలవము అనుకున్నారేమో.. ముఖ్యమైన ఫైళ్లు, కంప్యూటర్లు తగలబెట్టారు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008