Thursday, March 4, 2010

పుస్తకాలు ఎందుకు చదవాలి???


ఖంగారు పడకండి క్లాసు పుస్తకాలు చదవమనట్లేదు. ఈరోజు స్కూలు, కాలేజీలలో పుస్తకాలు పరీక్షలు, ర్యాంకుల కోసమే చదువుతున్నారు. ఫలితాలు రాగానే పుస్తకాలతో పాటు అందులో చదివిన విషయాలు కూడా తూకంలో వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ కొత్తవి కొనాలిగా.. చదువులు ఐపోయాక, ఉద్యోగాలు , వృత్తులలో స్థిరపడ్డాక కొనే పుస్తకాలు మన అభిరుచి, ఆసక్తిని బట్టి ఉంటాయి. అసలు పుస్తకాలు ఎందుకు కొంటున్నాము. ఎటువంటివి కొంటున్నాము, అసలు మనకు ఏయే పుస్తకాలు నచ్చుతాయో మనకు తెలుసా ?.. ఎవరో చెప్పారని కొనేస్తున్నామా ? మనం చదివిన పుస్తకాలనుండి మనం నేర్చుకునేది కాకపోయినా తెలుసుకునే విజ్ఞానం, సమాచారం ఎంతవరకు ఉంటుంది??? ఇలా ఒక్కసారి తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తే...

వయసుతో పాటు అభిరుచి మారుతుందేమో . పుస్తకాల విషయంలో ఐతే తప్పక మారుతుంది అనుకుంటాను . నా పుస్తక పఠనం ఐతే చందమామతోనే మొదలైంది , ఆ తర్వాత పాకెట్ సైజ్ జానపద నవలలు అలా ఊదిపారేసేవాళ్ళం. అమర్ చిత్ర కథ కామిక్స్ ఎలాగూ ఉండేవి. మధ్యలో ఫాంటం , రిచీ రిచ్ .. టీవీలు లేని, సినిమాలు అంతగా చూడని ఆ కాలంలో పుస్తకాలు, ఆరుబయట ఆటలే పిల్లలకు కాలక్షేపం, వ్యాయామం కూడా. కాదంటారా?? ఎప్పుడు పుస్తక ప్రదర్శనలు జరిగినా నేను ఎక్కువగా కొనేది వంటలపుస్తకాలు, నవలలు.. అన్నీ తెలుగువే.. కథలు , నావల్ల విషయానికొస్తే ఒక ప్రత్యేకమైన రచయిత, రచయిత్రి అని కాదు. పుస్తకం పేజీలు తిప్పి రెండు మూడు సంభాషణలు చదివితే అది మనకు నచ్చుతుందో లేదో తెలిసిపోయేది. అది కొనడమే..ఇలా చూసి కొన్నవేవి నా అంచనా తప్పలేదు లెండి. నేను చదివింది కాలక్షేపానికి కాబట్టి ఎక్కువగా కుటుంబ కథలు, సస్పెన్స్ కథలు ఎక్కువగా ఉండేవి. ఒకసారో , రెండు సార్లో చదివడం . అంతవరకే. ఎప్పుడైనా పుస్తకప్రదర్శనలకు వెళితే నాది, మావారిది చెరో దారి. ఎవరికిష్టమైన పుస్తకాలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అయన బిల్ కట్టేవారు . ఈ పనికిమాలిన నవలలు ఏం చదువుతావ్. వేస్ట్ అనేవాళ్ళు. కాని మంచి పుస్తకాలేవో ఎవరు చెప్పాలి? . ఎలా తెలిసేది. సో నేను అలా డిసైడ్ ఐపోయా..

కాని బ్లాగుల్లో కొచ్చాక మాత్రం నాకు ఎన్నో విషయాలు, పుస్తకాల గురించి తెలిసింది. అపుడు కాని అసలు నాకు ఎటువంటి రచనలు ఇష్టమో తెలిసిరాలేదో. :).. అలాగని జాలంలో తెలిసిన పుస్తకాలన్నీ కొనడంలేదు. నా బుర్రకు అర్ధమయ్యేవి మాత్రమే అప్పుడపుడు కొంటున్నాను. నేను పుస్తకాలు ఎందుకు చదవాలి , ఎటువంటి పుస్తకాలు కొనాలి, ఎటువంటివి కొంటున్నాను అని ఒక్కసారి ఆలోచిస్తే.. నాకు నచ్చిన తెలుగు సాహిత్యంలోని విశేషాలు వివరణలు
తెలియచేసే పుస్తకాలు . అలాగే కొన్ని జీవిత పాఠాలు నేర్పించే కథలు... భక్తి, ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాలు. ఇక మరీ ఇష్తమైన హాస్యానికి సంబంచిన పుస్తకాలు కొంటాను. ఇవన్నీ నా అభిరుచికి తగినవి. నాకు ఇష్టమైనవి కాబట్టి కొంటున్నాను. వీటివల్ల నాకు ఏంటో ఉపయోగం కలిగింది. ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.. ఈ పుస్తకాల గురించి కొందరు మిత్రులతో కూడా మంచి చర్చలు జరుగుతుంటాయి. ఇక పుస్తకాలు కొనడం అనేది పరిమితి లేదు. తప్పనిసరిగా చదవాలనే తప్ప , ప్రతి నెల కొనాలనే నియమమూ పెట్టుకోలేదు. ఎప్పుడు వీలయితే అప్పుడు కోనేయడమే.. మరో ముఖ్య విషయం ఏంటంటే జాలంలో కథలు, వ్యాసాలూ చదవడమంటే చిరాకు. హాయిగా పుస్తకం చేతిలో పట్టుకుని చదివితే ఆ హాయి, సంతృప్తే వేరు..ఏమంటారు??


మరి మీరు పుస్తకాలు ఎందుకు , ఎలా, ఎన్ని కొంటారు?? వాటివల్ల మీకు కలిగిన లాభానష్టాలేంటి ?? కాస్త చెప్పండి..

2 వ్యాఖ్యలు:

నిరంజన్

పుస్తకాలు వాటి యెక్క ఉపయొగం గురుంచి తెలపమన్నరు.నా యెక్క బ్లాగులో "విజయానికి ఐదు మెట్లు మరియు నేను" అనే ఈ బ్లాగు చదవగలరు. http://sreeniran.blogspot.com

Anonymous

పుస్తకాలు కొనే చదవాలనే నియమం నాకు లేదండోయ్ !
సాధారణంగా నాదగ్గర డబ్బులున్నప్పుడు పుస్తకాలు కొనే అవకాశం రాదు. ఎదురుగా పుస్తకాలు నోరూరిస్తూ కనిపించినప్పుడు పర్సులో సరిపడా డబ్బులుండవూ ( రోసయ్య పరిస్తితే నాదినూ .)
అయినా మాంచి మాంచి పుస్తకాలు తెగ చదివేస్తాను ఎలా ?????( అమ్మో ఆన్నీ ఇక్కడే చెప్పెసే బదులు నా బ్లాగులో ఓ టపా వేసుకోవచ్చుకదా!) అదండీ సంగతి.
మీకు హాస్య కధలంటే ఇష్టమన్నారుకదా " వంకర టింకర ఓ " చదవండి మీకు నచ్చుతుంది .

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008