Tuesday 30 March 2010

ఆముక్తమాల్యద ... అలంకారాలతో ఆరంభం






మనం చూసిన ఏ సంఘటన ఐనా, సన్నివేశం ఐనా అది ఇతరులతో పంచుకోవాలి అంటే దాన్ని సవివరంగా చెప్పాలి. ఆ దృశ్యాన్ని చూసి మనం పొందిన అనుభూతి ఆ వర్ణన విన్నవాళ్లు కూడా పొందాలి. అంటే మన మాట కాని, రచన కాని, పాట కాని, పద్యం కానీ ఒక చిత్రాన్ని విన్నవారి కళ్లముందు సాక్షాత్కరింప చేసినప్పుడే ఆ రచనలోని అసలు సారం అవతలివారికి అందుతుంది. మామూలుగా చెప్తే అనుకున్న ఫలితం దక్కదేమో అందుకే రచనలకు కొన్ని అలంకారాలు చేయాలి మరి.. ఇదే విధంగా పద్యాలకు వివిధ అలంకారాలతో మరిన్ని సొబగులద్ది అందించిన అద్భుతమైన కావ్యకన్నియ "ఆముక్త మాల్యద"

రాయలవారి పద్యాలలో ప్రస్ఫుటంగా కనిపించేవి ఉత్ప్రేక్షలు. (ఉత్ప్రేక్ష అంటే ఊహ. ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చడం ) రాయలు తన ప్రబంధంలో మొట్టమొదటి పద్యం శ్రీవేంకటేశ్వర స్వామి మీద చెప్పాడు. ఆంధ్రుల ఇలవేల్పైన వేంకటేశ్వరుని స్తుతితో మొదలుపెట్టబడిన మొట్టమొదటి తెలుగు కావ్యం.. ఆముక్తమాల్యద..

శ్రీ కమనీయ హారమణిఁ జెన్నుగఁ దానును, గౌస్తుభంబునం
దాకమలావధూటియు ను దారతఁ దోఁపఁ, బరస్పరాత్మలం
దాకలితంబు లైన తమ యాకృతు లచ్చతఁ బైకిఁ దోఁప, న
స్తోకత నందుఁ దోఁచె నన, శోభిలు వేంకటభర్తఁ గొల్చెదన్ ...


భార్యాభర్తలకు ఒకరిమీద ఒకరికి ఉన్న అత్యంత ప్రేమను, అనురాగాన్ని ఈ పద్యంలో చాలా అందంగా చెప్పారు రాయలవారు. లక్ష్మీదేవి ధరించిన అందమైన హారములోని మణియందు శ్రీనివాసుడు, ఆతని కౌస్తుభమునందు లక్ష్మీదేవి చక్కగా ప్రతిబింభిస్తున్నారు. ఒకరి మనస్సులో ఒకరు నిండి యున్న కారణంగా వాళ్ళ మనసుల స్వచ్ఛత వలన (అవి transparent అయి) ఆ లోపలున్న రూపాలు వారు ధరించిన హారములలోని మణులలో స్పష్టంగా బయటకి కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి అని భావం. ఈ విధముగా విలసిల్లుతున్న వేకటేశ్వరుని సేవిస్తాను అని ఉత్పలమాల(కలువపూలమాల) తో ఆముక్తమాల్యద (ధరించిన పూలమాలను సమర్పించినది) కావ్యాన్ని మొదలుపెట్టాడు కృష్ణదేవరాయలు. పైగా తిరుమల వేంకటేశ్వరుడు రాయవారి ఇష్టదైవం.. ఈ ప్రబంధాన్ని కూడా ఆ శ్రీనివాసుడికే అంకితం చేసాడు.




సీ. ఖ నట త్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు,
ధృత కులాయార్ధ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమ త్తరువరములు.
ఘన గుహా ఘటిత ఝూంకరణ లోకైక ద్వి దుందుభీకృత మేరు మందరములు
చటుల ఝుంపా తర స్స్వ నగరీ విపరీత పాతితాశాకోణ పరిబృఢములు,

తే. ప్రబల తర బాడబీక్రుతేరమ్మదములు,
భాస్వరేరమ్మదీకృత బాడబములు
పతగ సమ్రాత్పతత్త్ర ప్రభంజనములు
వృజిన తూలౌఘములఁ దూల విసరుఁ గాత.



ఆరంభం చేసాము కదా... ఆముక్తమాల్యద పీఠికలోని గరుత్మంతున్ని స్తుతించే పద్యం గురించి తెలుసుకుందాం. ఇది నారీకేళ పాకం లాంటిది, ఒక్కోసారి మరీ అతిశయం అనిపించవచ్చు. ముందుగా పద్యం చదువుతుంటే కఠినంగా , అర్ధం కాకుండా ఉంటాయి .. కాని లోతుగా అర్ధం తెలుసుకుంటూ వెళితే ఒక్కో పాదంలో ఉన్న వివిధ అలంకారాలు , వర్ణనలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి నారికేళపాకంలాంటిదే ఈ పద్యం.. గరుత్మంతుని రెక్కలయొక్క గాలివలన కలిగిన మార్పులు గురించి చెప్తున్నాడు కవి.. అసలు పద్యంలో మటుకు గరుత్మంతుడి రెక్కల గాలులు పాపాలనే దూదిపింజలను చెదరగొట్టుగాక అని స్తుతించబడింది.


ఖ నటత్ పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు

గరుత్మంతుడి రెక్కల గాలుల వల్ల సముద్రంలోని నీళ్లన్నీ ఆకాశానికి ఎగిసిపోయి పాతాళలోకం బట్టబయలై కనపడింది. అంత వేగంగా ఉన్నాయంట మరి. అప్పుడు పాతాళంలోనున్న పాములు తమ ఆజన్మశత్రువైన గరుత్మంతుని చూసి భయంతో గజగజ వణకుతూ ఒకదానికొకటి పట్టుకుని ముద్దలుగా కనిపిస్తున్నాయి.



ధృత కులాయార్ధ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్ తరువరములు
గరుత్మంతుడి రెక్కలగాలి ఎంత వేగంగా తీవ్రంగా ఉందంటే పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటివేళ్లతో సహా లేచిపోయి ఆతని కాళ్లకు తట్టుకున్నాయి. ఆతడు పక్షియగుట చేత.. తన గూటి కోసం కట్టెపుల్లలను తన కాలిగోళ్లతో తీసికెల్తున్నట్టుగా తోస్తున్నది.



ఘన గుహా ఘటిత ఝూంకరణ లోకైక ద్వి దుందుభీకృత మేరు మందరములు
ఆతని రెక్కల గాలులు పర్వతగుహలలో ప్రవేశించినప్పుడు ఎలా ఉంది అంటే .. మేరుపర్వతం, మంధరపర్వతం .. రెండూ ఏకమై భేరీ, దుందుభులుగా శబ్దం చేస్తున్నట్టుగా లోకాలన్నీ దద్దరిల్లుతున్నాయి ...




చటుల ఝుంపా తర స్స్వనగరీ విపరీత పాతితాశాకోణ పరిబృఢములు
గరుడుని రెక్కల గాలులు మిక్కిలి తీవ్రంగా ఉండుటచేత దిక్కులు,మూలలయందు ఉన్న పాలకులు (అష్టదిక్పాలకులు) నిలబడలేక వేఱు వేఱు దిక్కులకు విసిరివేయబడ్డారు.



ప్రబల తర బాడబీక్రుతేరమ్మదములు
భాస్వరేరమ్మదీకృత బాడబములు
పతగ సమ్రాట్పతత్త్ర ప్రభంజనములు
వృజిన తూలౌఘముల దూల విసరుగాత.


గరుత్మంతుడి రెక్కలగాలి వేగానికి ఆకాశంలోని మేఘములతోడి మెరుపులు సముద్రంలో పడి బడబాగ్నులు సృష్టిస్తున్నాయి. ఆ గాలి ఉధృతానికి బడబాగ్నులు మింటికెగసి మెరుపులుగా మారాయి. అట్టి ప్రచండమైన పక్షిరాజు రెక్కల గాలి పాపములనెడి దూదిపింజెల్లాటి మేఘములను చెదిరిపోయేలా చేయాలి అని గ్రంధకర్త ప్రార్ధన చేస్తున్నాడు.


గరికపాటివారి ఆముక్తమాల్యద వివరణ చదివి ఈ కావ్యమందు ఆసక్తి కలిగి వావిళ్ల రామశాస్త్రివారి పుస్తకం చదవడం మొదలుపెట్టాను. దానితో పాటు స్కూలులో చదివిన చందస్సుకూడ మళ్లీ తిరగేయక తప్పలేదు. తప్పులున్న మన్నించి సరిచేయగలరు. ముందు ముందు మరింత వివరంగా రాయడానికి ప్రయత్నిస్తాను.

10 వ్యాఖ్యలు:

Malakpet Rowdy

Good one - very informative!

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

మీ వివరణ బావుంది.ఆముక్తమాల్యద పుస్తకం ఇలా పద్యాలు,వాటి విశ్లేషణలతో దొరుకుతుందా.వివరాలు తెలుపగలరు

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

మీ వివరణ బావుంది.ఆముక్తమాల్యద పుస్తకం ఇలా పద్యాలు,వాటి విశ్లేషణలతో దొరుకుతుందా.వివరాలు తెలుపగలరు

భావన

బాగుంది జ్యోతి.

Unknown

తలఁబక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు కేదారంపు గుహ్యస్థలిన్...
అనే పద్యాన్ని, దానివివరణనీ చాలా సంవత్సరాల క్రితం కీ..శే .శ్రీ యమ్ వీ. యల్. నరసింహారావుగారి ముఖతా తణుకు నన్నయభట్టారక పీఠం వారు ఏర్పాటు చేసిన సభలో మెదటిసారి వినటం జరిగింది. తరువాత గరికపాటివారి ద్వారా వినటం జరిగింది.. ఆ పద్యమంటే నా కెంతో ఇష్టం. ఆ పద్యాన్ని కూడా పరిచయం చేయగలరు.

రవి

రాయల వారి పద్యం స్ఫూర్తితోనే నేనొక బ్లాగు ఇంద్రధనుస్సు ఆరంభించాను. అయితే ముందుకు సాగట్లేదు.

కామేశ్వరరావు

చాలా బాగుంది. ఆముక్తమాల్యద హవా ఏదో వీస్తున్నట్టుంది బ్లాగుల్లో! :-) గరికిపాటివారివే పాండురంగ మాహాత్మ్యము, కాళహిస్తిమాహాత్మ్యము కూడా సీడీలున్నాయి. వీలైతే అవికూడా కొన్నుక్కొని వినండి.

చిన్న సవరణలు రెండు. మొదటి పద్యం - వేంకటేశ్వరుడూ లక్ష్మీదేవీ ఒకరి మనసులో ఒకరు నిండి ఉన్నారు. వాళ్ళ మనసుల స్వచ్ఛత వలన (అవి transparent అయి) ఆ లోపలున్న రూపాలు బయటకి కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి అని భావం.

చటుల ఝుంపాతరః స్స్వ నగరీ - చటుల ఝుంపాతర స్స్వ నగరీ

విసర్గ ఉండదు. తరః + స్వ సంధి కలిసి తరస్స్వ అవుతుంది. సంధి జరిగాక విసర్గ ఉండదు.

అన్నట్టు, ఝంపా అంటే అచ్చంగా ఇంగ్లీషు "jump"!

జ్యోతి

భరద్వాజ్, భావన, సృజన .. ధన్యవాదాలు..

శ్రీకాంత్ గారు,

ఆముక్తమాల్యద పద్యాలతో అంటే ఎమెస్కో వాళ్లది ఉంది. పరిచయం అంటే సి.పి.బ్రౌన్ అకాడమీ మల్లాది హనుమంతరావుగారిది ఉంది.వాడుకభాషలో వివరణలతో టటిడివాళ్ల ప్రచురణ ఉంది. రెండు పుస్తకాలు వెయ్యి రూపాయలు మరి. వావిళ్ల రామశాస్త్రిగారిది టీకాతాత్పర్యములతో సవివరంగా ఉంది. ధర రెండువందల యాభై.. భాష కాస్త గ్రాంధికమైనా ప్రతి పదముయొక్క అర్ధం వివరించబడింది. మొదట్లో కష్టమైనా అలవాటుపడీతే సులువే.. ఇక ఆముక్తమాల్యదని అరటిపండులా ఒలిచి చేతిలో పెట్టాలంటే భక్తి టీవీవాళ్లు గరికపాటివారి కార్యక్రమం సిడిలు అమ్ముతున్నారు. రెండువేలనుకుంటా.. ఇక మీ ఇష్టం..

జ్యోతి

నరసింహరావుగారు,,

వేవిన, మేడపై వలభి వేణిక ,,,,
తలఁబక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు కేదారంపు గుహ్యస్థలిన్

ఈ రెండు పద్యాలు కూడా రాద్దామనుకున్నానండి. కాని టపా నిడీవి చాలా పెద్దగా అవుతుందని మరోసారికి అట్టేపెట్టాను. తప్పకుండా ఇస్తాను.

కామేశ్వరరావుగారు,
ధన్యవాదాలు మీరు చెప్పినవి సరిచేసాను. సిడీలు కాస్త ధర ఎక్కువగానే ఉన్నాయండి.. అందుకే సంశయిస్తున్నాను..

చింతా రామ కృష్ణా రావు.

అమ్మా! బాగుందిమీ ప్రయత్నం.
పాఠకులకు సాహిత్యాభిలాషను పెంచుతున్న మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008