Thursday, April 1, 2010

పద్యచిత్రాలు

ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక పాట, వర్ణన, పద్యం చెప్తే అసలు దృశ్యం కళ్లముందు సాక్షాత్కరించాలి. కొందరు మహాకవులు అందమైన అలంకారాలతో, పదాలతో ఆ దృశ్యాన్ని లేదా సంఘటనను మనకు కళ్లకు కట్టినట్టుగా వర్ణిస్తారు. ఈ పదవిన్యాసం రాయలవారి పద్యాలలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఉ. వేవిన, మేడఁపై వలభి వేణికఁ జంట వహించి విప్పఁగాఁ
బూవులు గోట మీటుతఱిఁ బోయెడు తేఁటుల మ్రోఁత కామి శం
కావహ మౌఁ గృతాభ్యసన లౌటను దంతపు మెట్ల వెంబడిం
జే వడి వీణ మీటుటయుఁ జిక్కెడలించుటయు న్సరింబడన్.


ప్రకృతికి ప్రతీక స్త్రీ. స్త్రీకి సంబంధించిన పనులన్నీ అందంగానే ఉంటాయి.. ఇక సరసులైన రాయలవారు మాత్రం తక్కువతిన్నారా?... మేడపై జడవిప్పుకుని పూలను తీసివేస్తున్న కాంతను ఎంత రమ్యమనోహరంగా వర్ణించాడో చూడండి... ప్రభాతవేళ మేడపై చూరుపక్కన నిలబడి తన జడను ముందుకువేసుకుని విప్పుకుంతుందంట ఓ వారకాంత. ఆ దృశ్యం చూడడానికి సర్వసాధారణంగానే ఉంటుంది. కాని కవికదా. సాధారణ విషయాన్ని మరింత అందంగా చెప్పాలిగా.. ఆ స్త్రీ తన జడవిప్పి అందులో చిక్కుకుని వాడిపోయిన పూలను గోటితో తీసివేస్తున్నది. పువ్వులున్నప్పుడు తుమ్మెదలు రాకుండా ఉంటాయా? ఆ ఇంతి పూవులు తీసేస్తుంటె తుమ్మెదలు చెదిరి ఝుమ్మని రొద చేస్తున్నాయంట. ఆ వీధిలో వెడుతున్నఒక కాముకుడు అది చూసి నిలబడిపోయాడు. అప్పటి కాంతలు వీణావిద్వాంసులు. తన జుట్టునుండి పూలను గోటీతో రాలుస్తుండగా ఆమె వీణవాయిస్తున్నట్టుగా అనిపించిందంట ఆ యువకుడికి. త్వరత్వరగా పూలను విదిలిస్తుంటే ఆమె నల్లని జుట్టు వీణియగాను, అందులో చిక్కుకున్న పూలు దంతపు మెట్లుగాను తోస్తున్నాయి మరి ఆ కాముకుడికి. అందునా తుమ్మెదల రొద కూడా వీణాగానంవలె నున్నది. ఎంత అందమైన భ్రాంతి కదా..
. తలఁ బక్షచ్చట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర
స్థలి నిద్రింపఁగఁ జూచి యూరెకు లుష స్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ జేర్పంగ రే
వుల డిగ్గ న్వెస బాఱువానిఁ నవ్వు న్శాలిగోప్యోఘముల్

విల్లిపుత్తూరులో వరిమళ్లకోసం తవ్విన పిల్ల కాలువలు ఉన్నాయి. ఆ పంటకాలువలలో బాతులు తమ స్వభావగుణముచేత తలలు రెక్కలలో దూర్చికొని నిద్రిస్తున్నాయి. అది చూసిన భటులు /కాపరులు ప్రాతఃకాలములో స్నానానికి వచ్చిన బ్రాహ్మణులు తమ ధోవతులను పిండి అక్కడే మరచిపోయినట్టున్నారు. వాటిని తీసికెళ్లి వారి ఇంటిలో అప్పగిద్దామని నీటిలోకి దిగారంట. ఆ అలికిడికి ఉలిక్కిపడ్డ బాతులు ఎగిరిపోయాయి. ఆ పక్కనే పొలాలను కాపలా కాసే యువతులు అది చూసి పక్కున నవ్విరంట. తెల్లని బాతులను చూసి బ్రాహ్మణుల పంచెలని భ్రమపడి భంగపడ్డారు ఆ భటులు..

2 వ్యాఖ్యలు:

శ్రీలలిత

పద్యం ఎంత అందంగా వుందో... కవులు మనకి దృశ్యాన్ని చూపించడమే కాకుండా ఎంతో అందమైన వర్ణనలతో పద్యాన్ని అలంకరించి మన మనసులని రంజింపచేస్తారు...

Unknown

న్వెసఁ బారు అని ఉండాలి. పోతే
విష్ణుచిత్తుని అతిథి మర్యాదల పద్యాలు ఆతని భార్య వివిధ కాలాల్లో అతిథులకు వంటలు చేసే విధానం గుఱించిన పద్యాలు-
వర్షాకాలంలో చేసే వంటలూ, అతిథి మర్యాదలు ఎలావుంటాయంటే కలమాన్నము, పప్పు, నాలుగు కూరలు, వడియాలు, వరుగులు, పెరుగులు, మంచి నెయ్యి
వీటితో కూడి ఉంటాయిట.
చ.
గగనము నీరుబుగ్గ కెనగా జడివట్టిననాళ్ళు భార్య కన్
పొగ సొరకుండ నారికెడపుంబొరియ ల్దవిలించి వండ న
య్యగపల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చినప్రప్పు నాలు గే
న్పొగపినకూరలు న్వడియము ల్వరుగు ల్పెరుఁగు న్ఘృతప్లుతిన్.
ఇక, వేసవిలో నులివెచ్చగా ఉండే ఆహారం, దియ్యనైన చారులు, తిమ్మనంబులున్( ? ), పల్చని అంబళ్ళు, చెఱుకుపాలు, ఎడనీళ్ళు, రసాలు, సుగంధిశీతజలము, వడపిందెలు, చల్లనీరు మొదలైన వేసవికుపయోగపడే పదార్థాలు ఉంటాయట. అతేకాదు, భోజనానికి ముందుగా శీతలంగా ఉండటానికి చందనాన్నిపుయ్యటం కూడా ఉంటుంది.
చ.
తెలినులివెచ్చయోగిరముఁ దియ్యని చారులుఁ దిమ్మనంబులున్
బలుచనియంబళు ల్చెఱుకుపా లెడనీళ్ళు రసావళు ల్ఫలం
బులును సుగంధిశీతజలము ల్వడపిందెలు నీరుఁజల్లయు
న్వెలయఁగఁ బెట్టు భోజనము వేసనిఁ జందనచర్చ మున్నుగన్.
ఇక శీతాకాలానికొస్తే వాసనకు పునుగు చేర్చిన ఆహారము, మిరియపు పొడులు, చట్టి చుయ్ మని అంటున్నప్పుడు వేడి వేడిగా చేసిన కూరలు, ముక్కుకు ఘాటుగా ఉండే ఆవ పెట్టిన ఇగుళ్ళు పచ్చళ్ళు, పాయసాన్నములు, ఊరగాయలు, చెయ్యి సురుక్కుమనేలా వేడి నెయ్యి, చిఱుపాలు వగైరాలతో.
మ.
పునుఁగుందావి నవౌదనంబు మిరియంపుం బొళ్ళతోఁ జట్టి చు
య్యను నా దాఱనికూరగుంపు, ముకుమందై యేర్చునావం జిగు
ర్కొను పచ్చళ్ళును, బాయసాన్నములు, నూరుంగాయలున్, జే సుఱు
క్కనునేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారం బిడు న్సీతునన్.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008