Tuesday, March 31, 2009

లాభమేమిటి ???

ద్వేషం,... మనిషిని అధఃపాతాళానికి తీసుకెళ్లే భాయంకరమైన గుణం ఇది. మనుషుల మధ్య బంధాలు పలుచనవుతూ ఆర్ధిక, సామాజికపరమైన అగాధాలు పెరుగుతున్న తరుణంలో ప్రేమ స్థానంలో ద్వేషం మనల్ని నిలువునా దహించివేస్తుంది. నిన్న మొన్నటి వరకూ అరమరికలు లేకుండా కలిసి గడిపిన వ్యక్తులు, కుటుంబాలు వృత్తి వ్యాపారాల్లో తలమునకలై సామాజికంగా కొంత దూరం అవగానే వారి ఆర్ధికపరమైన హోదాలు, స్థితిగతులు ఒక్కొక్కరి మనసుల్ని తొలవడం సర్వసాధారణమైపోయింది. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంతెత్తు ఎదిగిపోతున్నారు అన్నదే ప్రధానమైపోతుంది. అంతకాలం మనిషిని అభిమానించిన మనసు కాస్తా డబ్బు పొడ చూపగానే ద్వేషించడం మొదలెడుతుంది. "అందరికన్నా ఎక్కువ సంపాదించాలి. అందరికన్నా వీలుపడకపోయినా ఫలానా వారి కన్నా ఉన్నతంగా ఉండాలి".. ఇదే యావ ఎక్కడ చూసినా మనుషుల్లో ! అయిన వారిని, కావలసిన వారిని ఆర్ధికంగా కొలవడమేమిటో?..!! ఎంత గొప్ప అనుబంధాలు ఈ అనారోగ్యకరమైన పోటీకి పుటుక్కున తెగిపోతున్నాయి? నువ్వు సంపాదించుకో బాగుండు.. ఎవరూ కాదనరు. కాని నిన్నటి వరకు ప్రాణానికి ప్రాణమైన వ్యక్తులతో, కుటుంబాలతో నీకు పోటీ ఏమిటీ? నీకన్నా వారు నాలుగురాళ్లు ఎక్కువ సంపాదిస్తే జీవితం మొత్తం కోల్పోయినంత అసంతృప్తి ఎందుకు?అస్సలు కావలసిన మనిషిని ఎందుకు ద్వేషించాలి? ఎందుకంటే... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం కోసం మనం మనుషుల్ని, మనసుల్ని పోగొట్టుకుంటూ సంపాదనలోనే ముఖాన్ని విప్పార్చుకుంటున్నాం. ఒకప్పుడు ఓ వారం రోజులు కన్పించకపోతే బెంగపడిపోయిన మిత్రుడు ఈరోజు ఆర్నెల్ల తర్వాత ఆత్మీయంగా పలకరిద్దామని వస్తే... "ఇప్పుడు వీడెక్కడ తగిలాడురా దేవుడా.. టైమ్ వేస్ట్" అనుకుంటూ చిటపటలాడే మొహంపై చిరునవ్వులు పులుముకుని ఏడవలేక నవ్వుతున్నాం. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప. ఆ గొప్ప మనకే చెందాలి. మనకన్నా ఎక్కువ సంపాదించి ఇంకెవరూ, చివరకు మనవాళ్లయినా ఎదిగిపోకూడదు. అలా జరిగితే వెంటనే ద్వేషం తన్నుకొస్తుంది. ఎదిగిపోతున్నాం.. చితికి సరిపడా నోట్ల కట్టలను పేర్చుకోగలిగేటంతగా!! చితికిపోతున్నాం.. ఒక్కటంటే ఒక్కటన్నా మనసైన బంధాన్ని మిగుల్చుకోలేక!! ఈ నెగిటివ్ ఎమోషన్స్ మనల్ని ఆవహించి నిరంతరం అసంతృప్తికి లోనుచేస్తూ అర్ధం పర్ధంలేని అపార్థాలతో మనుషుల్ని దూరం చేస్తున్నాయి. ఎవరితో ఎలా ఉంటే ఎంత లాభమా అని దేబిరించుకుని లెక్కలు కట్టుకుంటున్నాం. లాభం లేనిదే ఏ పనీ చెయ్యం. లోపల మాత్రం ద్వేషం మనసుని కుళ్లబెట్టి చెయ్యవలసిన నష్టం చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆ ఇనపచట్రంలో నుండి బయటకొచ్చి బంధాలను పెనవేసుకుంటే ఆ ఊహే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా!!!

మీ నల్లమోతు శ్రీధర్

11 వ్యాఖ్యలు:

శ్రీనివాస్

నిజమే .... ఆర్ధిక కొలమానాలు ఎక్కువ అయ్యాయి ...

ఒకప్పుడు ఓ వారం రోజులు కన్పించకపోతే బెంగపడిపోయిన మిత్రుడు ఈరోజు ఆర్నెల్ల తర్వాత ఆత్మీయంగా పలకరిద్దామని వస్తే... "ఇప్పుడు వీడెక్కడ తగిలాడురా దేవుడా.. టైమ్ వేస్ట్" అనుకుంటూ చిటపటలాడే మొహంపై చిరునవ్వులు పులుముకుని ఏడవలేక నవ్వుతున్నాం

పై మాట అక్షర సత్యం .... నా మిత్రులు క్షమించాలి .. మీ అందరి లో ఈ మార్పూ నేను చూసాను ......


ఒక్కసారి ఆ ఇనపచట్రంలో నుండి బయటకొచ్చి బంధాలను పెనవేసుకుంటే ఆ ఊహే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా!!!


కదా ఆలోచించండి ...ఇలాంటి టపాలు ఇంకా ఇంకా రావాలి ... స్నేహ కుసుమాలు విరబూయాలి

Vinay Chakravarthi.Gogineni

entandi...vedantam looki digaaru.........goodone...........

Anonymous

ఏం చేస్తాం చెప్పండి .బ్రతుకు పరుగుపందెం అయిపోయింది. బాధపడటం వేస్ట్
ఇవి చదవండి.

ఎందుకా ఏడుపు
ఎవడు పొయాడట
పక్కింటివాడు .....
ఎదిగిపొయాడట

ఇల్లు మారాకా
మనశ్శాంతిగా ఉంది
.............
ఇప్పుడు
పక్కింటావిడ కంటే
మా ఆవిడ బాగుంది...

ఏదీ కాస్త నవ్వండి
అవునూ మీ మనసును మూసేసారేం? అదేనండీ మీ బ్లాగును !

Unknown

@ శ్రీనివాస్ గారు, మనతోపాటు మిళితమై ఉన్న సమాజంలోని రిలేషన్స్ ని ఓ పక్కన నిలబడి ప్రేక్షకుల్లా గమనిస్తుంటే కలిగే బాధ మనందరిలోనూ ఒకేలా ఉంటూంది. ధన్యవాదాలు.
@ వినయ్ చక్రవర్తి గారు :)
@ నాలుగు మాటల్లో భలే చెప్పేశారు. :) సమయాభావం వల్ల "మనసులో" ఎప్పటికప్పుడు ఒక్క పోస్ట్ అయినా రాద్దామనుకుంటూ వాయిదా పడుతూ వస్తోంది. అంతలో ఎటూ మేగజైన్ కోసం టెక్నికల్ గిరిని దాటి ఈ ఎడిటోరియల్ రాసేశాను కదా.

Anonymous

good one !

పరిమళం

శ్రీధర్ గారూ ! ఇనుప చట్రాలని మీరే అన్నారుగా ! కాని బయటికి వస్తే కలిగే ఆహ్లాదం అనుభావించాకే తెలుస్తూంది .బావుందండీ మీ టపా....ఆర్ధిక పరిస్థితులు స్నేహాన్ని ఎలా మార్చేస్తాయో రెండో పేరా స్పష్టం చేస్తుంది .

@ లలితా గారూ ! :) :)

Unknown

@a2dreams గారు, థాంక్యూ.
@పరిమళం గారు, ధన్యవాదాలండీ.

విశ్వక్శేనుడు

ఇది తూచ్ అండి బాబూ, నా మనుసులొ వున్న అలొచనలు నేను రయకుండానే మీరు కాపీ కొట్టేసారు. నేను ఒప్పుకోను.

ఆయ్యయ్యొ ఊరికే తమాషాగా రసాను. మొదటిసారిగ రాస్తున్నాను. ఎలా రాయాలో తెలియక ఇలా రాసేసాను. తప్పైతే క్షమించండి.

Unknown

@ maddy గారు, :)

Suresh

అందరికీ నమస్తే,

"ఆ గొప్ప మనకే చెందాలి. మనకన్నా ఎక్కువ సంపాదించి ఇంకెవరూ, చివరకు మనవాళ్లయినా ఎదిగిపోకూడదు. అలా జరిగితే వెంటనే ద్వేషం తన్నుకొస్తుంది. ఎదిగిపోతున్నాం.. చితికి సరిపడా నోట్ల కట్టలను పేర్చుకోగలిగేటంతగా!! చితికిపోతున్నాం.."

పైన ఉన్న ఈ మాటలు నా జీవితానికి చాలా దగ్గిరగా ఉన్నాయండి, ఎందుకంటే మనమే ఎదగాలనే స్వార్థంతో నా అన్న వాళ్ళే చేసిన మోసానికి "మనవాళ్ళే కదా అనే గుడ్డి నమ్మకంతో నా పూజ్యనీయులైన తల్లిదండ్రులు ఉన్న మొత్తాన్నీ పొగొట్టుకున్నారు" ఆ దెబ్బ నుంచి తేరుకునేందుకు చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించిన నాకు చాలా సమయం పట్టింది.దేవుడి దయ వల్లనో మరియు దానికి తోడు మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్లనో ఇప్పటికి పరిస్తితులు చక్కబడ్డాయి.

**********కానీ ఈ సంఘటన వల్ల 22 ఏళ్ళ వయసులోనే నేను రాటుదేలి పోయాను ఇలాంటి మోసాలను తిప్పికొట్టడంలో... కానీ చిన్నతనంలో ఉన్న అధరామృతాన్ని ఆస్వాదించలేక పోయాననే చిన్న బాద మాత్రం వెంటాడుతూనే ఉంది, ఇప్పటికీ / ఎప్పటికీ....*******


మనిషికి ఎంత స్వార్థమో కదా??? కానీ ఇలాంటి పరిస్తితులలోనూ "శ్రీ శ్రీధర్ గారి" గురించి తలుచుకుంటే ఇంకా మన మద్య ఎటువంటి స్వార్థం లేకుండా నలుగురికీ సహాయపడే వాళ్ళు ఉన్నారన్న ధైర్యం వస్తుంది. శ్రీధార్ గారు..మీకు హ్యట్సాఫ్.........

రమణ

చాలా బాగా వ్రాస్తున్నారు. ఈ సంపాదకీయాలను మాకు అందించినందుకు ధన్యవాదాలు జ్యోతి గారు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008