Wednesday 2 June 2010

నన్ను దోచుకుందువటే



అందమైన వాతావరణం. చల్లని పిల్ల గాలులు గిలిగింతలు పెడుతున్నాయి. కొత్తగా పెళ్లైన జంట. తొలిరాత్రి. ఇద్దరి మనసుల్లో ఉప్పొంగే సంతోషం, ప్రేమ..ఆ ఆనందం వారి వదనాలపై స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. సర్వాలంకార భూషితురాలైన నాయిక అందంతో ఆమె నగలు, పువ్వులు, ప్రకృతి కూడా పోటీపడుతుంటే , వలచి, వలపించుకున్నవాడు, అందగాడు, వీరుడు తనను చేపట్టినవాడు అనే ఆనందం ఆమె పెదవులపై చెరగని చిరుదరహాసమై వెలుగులు చిమ్ముతుంది. ఇక నాయకుడు కన్నియను వలచి, దక్కించుకున్నానన్న విజయగర్వం, సంతోషం తన హావభావాల్లో , మాటల్లో చెప్పకనే చెప్తున్నాడు. అన్నింటిని మించి అతని నుదుటిపై ఉన్న అర్ధ చంద్రిక. కోర మీసం, పెదవి వొంపులలొ దాగిన చిరునవ్వు మనను కట్టిపడేస్తుంది. అందగాడంటే ఇలాగే ఉండాలి అనిపించే ఆ మహ నటుడు గుర్తొచ్చాడా?? ఆ అందం, అభినయం, సంగీతం, సాహిత్యం, స్వర మాధుర్యం వెరసి ఒక అత్యద్భుతమైన పాటని మనకందించాయి.. "అదే నన్ను దోచుకుందువటే" .... ఎంతమంది కలిసి పని చేస్తే ఇంత మనోహరమైన సినీగీతం మనకు దక్కింది. గులేబకావలి చిత్రంలోని ఈ పాటతోనే సి.నారాయణరెడ్డి సినీరంగ ప్రవేశం చేసారు.

నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి

నన్ను దోచుకుందువటే

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు

నన్ను దొచుకొందువటే

నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలో
కలసి పోదు నీలో ..
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం

నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటే.

భార్యాభర్తలై ఒకరికొకరు జీవితం పంచుకునే తరుణంలో వారి మనోభావాలు ఈ పాటలో స్పష్టంగా చిత్రించారు సినారె గారు. దానికి సంగీతం మరిన్ని మెరుగులు దిద్దింది. ఇక నాయికా నాయికల సంగతి చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు, జమున ఒకరిని మించి ఒకరు తమ అందంతో, హావభావాలతో మనను అలరించారు. (ఇది మేకప్పు మహిమైనా) భార్యాభర్తలు ఒకరినొకరు దోచుకుంటూ, ఒకరి మనసుల్లో ఒకరిని దాచుకుంటూ , ఒకరికొకరై ఉండే జీవితకాలపు అనుబంధానికి దాసులై ప్రేమలో కరిగిపోవాలని ఎంత అందంగా చెప్పారో??

8 వ్యాఖ్యలు:

Dr.Tekumalla Venkatappaiah

జ్యోతి గారూ...
మీరు ఒక పాట గురించి రాసినా, ఒక మాట రాసినా, కొత్త అర్ధాలూ, కొంగ్రొత్త విశేషాలూ, గొచరిస్తూనే ఉంటాయి. దాదాపు 45 సంవత్సరాల క్రితం వచ్చిన పాట. మనసులుని తాకుతుంది. ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం.
ఆనాటి పాటల్లో సంగీతమూ, కలగలపు గా సాగేది. సాహిత్యం అందరికీ అర్ధమయ్యేది. మరి ఈనాటి
సంగీతం లో డబ డబ మోతలు తప్ప సాహిత్యం కానరాక కనుమరుగైంది. చాల బాగా ఉంది. చిన్నతనం లోకి వెళ్ళిపోయాను.

తారక

మేకప్ మహిమైనా ఇది లెకుండా వుంటె ఇంకా బాగుంటుందేమో.

అది, నా ఈ కామెంట్ రెండూ తీసేస్తె టపాకి ఇంక అందమొస్తుందేమో

తెలుగుకళ

తక్కువ మాటలు , ఎక్కువ భావనలు. ఒక్కపాటతో మనసును విహారం చెయ్యించారు. పాటంతా చదువుతూ పాడుకుంటు చక్కని ప్రశాంత భావనని పొందగలం.
గ్రేట్ సాంగ్

భావన

హుం మంచి పాట. ఎక్కడీకో తీసుకెళ్ళేవు.

రాజేశ్వరి నేదునూరి

చక్కని పాట కొన్ని ఏళ్ళు వెనక్కి పంపారు. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు హేట్సాఫ్

కంది శంకరయ్య

జ్యోతి గారూ, ఇది సినారె గారు సినిమా కోసం రాసిన మొట్టమొదటి పాట. సినీ పరిశ్రమకు రాకముందు రామప్ప అనే నాటకంలో "శిలలపై శిల్పాలు చెక్కినారు" పాటను రాసారు. ఆయన సినిమా పాటలు రాయడం మొదలుపెట్టిన చాలా కాలానికి అమరశిల్పి జక్కన చిత్రంలో ఈ పాటను పెట్టారు.

ప్రణీత స్వాతి

"కల ల అల ల పై తేలెను మనసు మల్లె పూవై..." అనే పాట కూడా చాలా బాగుంటుందండీ.

KC Chekuri
This comment has been removed by the author.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008