Saturday, June 16, 2012

పోయిందే... Its gone.. ................అమృతాంజనం
సుమారు పాతిక, ముప్పై, నలబై ఏళ్ల క్రింద ఇప్పట్లా వీధికో మందులషాపు,  బస్తీకో కార్పోరేట్ హాస్పిటల్, మనిషిలో ఉన్న , లేని, రాని, రాబోయే రోగాలన్నింటికి విడివిడిగా డాక్టర్లు లేరు.  బస్తీలో ఉండేవాళ్లందరికీ ఉండేది  ఓక్క డాక్టరు, కాంపౌండర్ మాత్రమే... డాక్టరు పేషంటును చూసి పేపర్ మీద ఏదో గెలికితే ( అది మనకు అర్ధం కాదు కదా) కాంపౌండర్ మనం తీసికెళ్లిన ఖాళీ క్వార్టర్ బాటిల్ లేదా పాత  టానిక్ సీసాలో రెండు లేదా మూడు రోజులకోసం ఎర్ర రంగు నీళ్లు పోసి పూటకు ఎంత తాగాలో గుర్తుగా ఓ కాగితం అంచులు కట్ చేసింది అంటించి ఇచ్చేవాడు. గుర్తుందా?? ఇంకా సీరియస్ అంటే సూదిమందు.. అసలు డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు ఇంట్లోనే ప్రాధమిక చికిత్స జరగడం మాత్రం తథ్యం.. దాదాపు ప్రతీ ఇంట్లో ఉండే సర్వరోగనివారిణి.. సారా కాదండోయ్.. అమృతాంజనం.. లేదా జిందా తిలిస్మాత్... ఈ రెండింటికి తోడుగా వాము.. అంతే.. అమ్మ కంటే ఎక్కువగా బామ్మ, అమ్మమ్మలు  ఈ మూడింటిని నమ్ముకుని అందరికీ వైద్యం చేసేవారు. ఐనా తగ్గకుంటే అప్పుడు డాక్టర్ దగ్గరకు  పరుగు..

బరువైన గాజు సీసా, పచ్చటి మూత తీస్తే పసుపురంగు ఘాటైన అంజనం.. అది పెట్టుకుంటే నొప్పి తగ్గినా పలుచగా అట్టలా పేరుకుపోతుంది ఐనా సరే అదే సర్వరోగనివారిణి.. అమృతంతో తయారు చేసిన అంజనం. మరి ఈ అమృతాంజనం ఎవరు తయారు చేసి అమ్మేవాళ్లో తెలుసా... దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు. వంటింట్లో, తలగడ క్రింద, పర్సులో తప్పకుండా ఉండే  ఈ పసుపు రంగు సీసా ఎంతమందికి గుర్తుంది???. అప్పటికీ ఇప్పటికీ ఇది అమృతాంజనమే.. రాన్రానూ రంగు లేని పలుచగా ఉండే బాములు ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. దానివల్ల అమృతాజనం పసుపు రంగుది అమ్మకాలు తగ్గాయని చెప్పవచ్చు. అందుకే వాళ్లు కూడా తెల్లని అమృతాంజనం తయారీ మొదలుపెట్టారు. ఇప్పటికీ ఎంతో మంది అమ్మలు, అత్తలు తలనొప్పైనా, కాలు నొప్పైనా, చేయి నొప్పైనా, మెడనొప్పైనా ఏదైనా సరే అమృతాంజనమే కావాలంటారు.

ఈ సందర్భంగా  గరిమెల్ల సత్యనారాయణగారు రచించిన అమృతాంజనం కవిత చూద్దాం. (మాగంటి వంశీగారి బ్లాగు నుండి ఎత్తుకొచ్చా) తప్పులేదులెండి. ఎంతైనా అమృతాంజనం మనది మనందరిదీ కదా..

ఎటు జూచిన అంజనముల వరదలె
ఎటు గాంచిన బాముల బురదలె
బాధా నిర్మూలనమను కళలో
అమృతాంజన సామ్యము లేదిలలో
పేరులు చూస్తే బారెడు పొడుగులు
మేరలు చూస్తే జానెడు గిడుగులు
బాములు క్యూర్లంజనములు టోనులు
ప్రజలను ఆకర్శించే బోనులు
అమృతాంజనము అనాది ప్రసిద్ధము
బాధావారణ కంకణబద్ధము
సకలవ్యాధుల సన్నాహమ్ముల
పెకలించును ఆ దేవతయమ్ములు
తలనొప్పికిని, కీళ్ల నొప్పికి
పడిసెంబు, రొంప దగ్గులకు
అమృతాంజన మర్ధన పరిచర్యయే
అది శీఘ్ర నివారణ సాధనము
చౌకకు చౌక, గుణమునకు గుణము
సరసను గల ప్రతి షాపున దొరకును
సులభంగా ఇంటికి విచ్చేసి
నెలకొనగల గృహ వైద్యుండీతడు
నామము చెవులకు రంజనమైతే
వారణ మేనికి రంజనము
బాధలకెల్లా భంజనము
వ్యాధుల పులి అమృతాంజనము..
8 వ్యాఖ్యలు:

Sai

అవునండీ అమృతాంజనం అమృతాంజనం మనందరిదే...
:)

జీవన పయనం - అనికేత్

enjoyed;-)

Anonymous

బాగుంది. చోళేగాచి!!! ఇప్పుడు సకృతుగా కనపడుతోందిలెండి.

శ్రీధర్

జ్యోతిగారూ , మంచి ఆర్టికల్ వ్రాసారు. దూరదర్శన్ నేషనల్ ఛేనల్ ఒక్కటే ఉన్న రోజుల్లో , మన తెలుగు మరియు వివిధ ప్రాంతీయ భాషా సినిమాలు నెలకి ఒకసారి చూపించేవారు ! ఆ రోజుల్లో ‘అమృతాంజన్ ’ ప్రాంతీయ భాషా చిత్రాలకి స్పాన్సర్ చేసేది ! దానిని చూసి హిందీ భాషాభిమానులు “చూసారా ఈ వివిధ భారతీయ సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది ! అందుకే ఈ అవకాశాన్ని అమృతాంజన్ స్పాన్సర్ చేయడం ద్వారా లాభం పొందుతూంది అని కామెంట్ చేసేవారు ! చమత్కారమే అయినా వినడానికి బాధగా ఉండేది. మీ ఆర్టికల్ చదివాక ఆ విషయం ఙ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది.ఏమైనా గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు !---ఎ.శ్రీధర్.

శ్రీ

కాశీ నాథుని వారి అమృతాంజనం...
మన తెలుగు వారి దివ్యాంజనం...
నొప్పులను తగ్గించే రామబాణం...
మీ వ్యాసం, కవిత బాగున్నాయి...:-)
@శ్రీ

సీత

:) :) భలే రాసారండి .......

kannaji e

బాగా చెప్పారు...ట్రూ కాపీ ని "జెరాక్స్: అని ఎలా అనేస్తున్నామో,అలా తలనొప్పి మందు అంటే అమృతాంజనం మాత్రం పేరు ఫేమస్ అయ్యింది.. .

హనుమంత రావు

అమృతకాలం నాటి అమృతాంజనం గురించి బాగా వ్రాసారు. ఆ అమృతాంజనం బాటిల్ మళ్లీ ఓ డబ్బాలో పెట్టి మరీ వచ్చేది. తలనొప్పి నిజం తలనొప్పి కాకుండా ఎవరైనా రాసుకుంటే గొప్పగా మండిపోయేది.. ఈ సందర్భంలో... ఆంధ్రపత్రిక దినపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావుగారు నడిపేవారు.. ఆ పేపరు మొదటి పేజీలో లెఫ్ట్ అప్పర్ కార్నర్ లో అమృతాంజనం అడ్వర్టైజ్ మెంట్.. (పేపరూ మందూ రెండూ స్వంతమేకదా). అలా పేపరు మొదటి పేజీలోనే ఎందుకు వేస్తారంటే... ఒకరి జవాబు: పేపరు చదివాక తలనొప్పి రావచ్చు.. అందుకని ఆ మందును వాడండి అని చెప్పడానికని.... (ఈ సంభాషణ ఎవరో లబ్ధప్రతిష్టులదే, నాకు గుర్తులేదు).... గుడ్ పోస్ట్ జ్యోతిగారూ....

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008