ఈ ఒక్క రోజు నన్ను వదిలేయండి ప్లీజ్....
 చాలాకాలంగా మిత్రులెందరో నన్ను కధలు రాయడం మొదలుపెట్టండి అంటూనే ఉన్నారు. కాని నాకే ధైర్యం చాలడం లేదు. వ్యాసాలు రాయడం ఐతే పట్టు దొరికింది కాని కధలు అంటే అమ్మో అనుకున్నా. అందుకే ముందు కధలు చదవడం మొదలుపెట్టాను. ఎలాగోలా ధైర్యం చేసి ఈ చిన్ని కధ (పేజీల లిమిట్ ఉండింది మరి) రాసా. బావున్నా, బాలేకున్నా చెప్పండి. సర్ధుకుని, మరింత ధైర్యం తెచ్చుకుని కధలు రాయడం కంటిన్యూ చేస్తాను. :)
ఆడవాళ్లు ఆదివారం సెలవు కావాలంటే వెక్కిరించారు. గేలి చేసారు. సినిమాలు తీసారు. ఐనా ఎవ్వరూ మారలేదు. అందుకే ఇలా చేస్తే బావుంటుందని నా ఆలోచన.. కాని ఎంతమంది ఇలా ధైర్యం చేసి తమగురించి తాము నిర్ణయం తీసుకోగలరు??
‘‘తిన్న తర్వాత అందరూ హాల్లో కూర్చోండి. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి’’ 
రాత్రి పది గంటలకు భర్త, పిల్లలిద్దరికి భోజనాలు పెడుతూ చెప్పింది ఇందిర.
‘‘ఇప్పుడే చెప్పొచ్చుగా మమ్మీ.. మళ్లీ హాల్లో కూర్చోవడం ఎందుకు?’’ అన్నాడు కొడుకు చైతన్య.
‘‘అబ్బా..! మమ్మీ రేపు ఆదివారం కదా. అందరూ ఇంట్లోనే ఉంటారు. నాకు పని ఉంది. రేపు మాట్లాడుకుందాంలే’’ అంది కూతురు సౌమ్య.
‘‘ఇందూ! అంత అర్జంట్‌గా మాట్లాడేది ఏముంటుంది? పిల్లలెందుకు? నాతో చెప్పొచ్చుగా?...’’ మొబైల్ మాట్లాడుతూ అన్నాడు భర్త రాజేష్.
‘‘నేను చెప్పే విషయం మీ ముగ్గురికీ సంబంధించిందే. తొందరగా తినండి.. మాట్లాడాక ఎవరి పనులు వాళ్లు చేసుకోండి’’ అంది ఇందిర.
అరగంట తర్వాత నలుగురూ హాల్లో కూర్చున్నారు. ఇందిర టీవీని కూడా ఆపేసింది. 
‘‘అబ్బా! మమ్మీ క్రికెట్ మాచ్ వస్తుంది. మాట్లాడుతూ టీవీ చూస్తే ఏమైంది? 
ఎందుకు ఆపేస్తావ్?’’ విసుక్కున్నాడు చైతన్య.
‘‘నోరు మూసుకో. ఎప్పుడూ మొబైల్‌లో ముచ్చట్లు, కంప్యూటర్ ముందు లేదా టీవీ ముందు తప్ప వేరే ఏవీ కనపడవు మీ ఇద్దరికీ’’.
‘‘తొందరగా చెప్పు మమ్మీ. ఈ సస్పెన్స్ ఏంటి?’’ అంది సౌమ్య.
రాజేశ్ మాత్రం ఎన్నడూ లేనిది ఇందిర ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా? అని 
ఆలోచిస్తున్నాడు. అతను కొద్ది రోజులుగా మౌనంగా, ఏదో ఆలోచనల్లో ఉంటున్నా 
గమనిస్తూనే ఉన్నాడు ఇందిరని. తాను బిజనెస్ పనులలో తలమునకలుగా ఉన్నందున 
ఆమెను- ‘ఏమైందని?’ అడగలేకపోయాడు. ఆరోగ్యంగా ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ 
ఉంది కదా! అని అంతగా పట్టించుకోలేదు. ఏమై ఉంటుందా? అని ఆలోచనలో పడ్డాడు 
రాజేశ్.
‘‘నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది 
తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు. మీ అందరితో చర్చించాల్సిన అవసరం కూడా 
కనపడలేదు నాకు. కొంతకాలంగా నాలో నేను మదనపడుతూ చివరికి ఈ నిర్ణయానికి 
వచ్చాను. ఇక నుండి ప్రతి ఆదివారం నేను ఇంట్లో ఉండను. ఈ ఒక్కరోజు నా కోసం 
నన్ను వదిలేయండి... నాకు ఇష్టమైన, నాకు సంతృప్తినిచ్చే పని చేయడానికి 
వెళ్తున్నా. ఇన్నేళ్లుగా భర్త, పిల్లలు, బంధువులు అంటూ అసలు నాకంటూ కోరికలు
 ఉన్నాయని కూడా మర్చిపోయాను. దానికి నేను బాధపడడం లేదు. ఇప్పుడు మీరు 
పెద్దవాళ్లయ్యారు. మీకు నా అవసరం అంతగా లేదు. నా మీద ఆధారపడి లేరు. మీకు 
ఇష్టమైన పనులు మీరు చేసుకోవాలనుకున్నప్పుడు నేనెందుకు నా ఇష్టాలను 
చంపుకోవాలి? మీ అవసరాలే నాకు ఇష్టాలా?’’ అడిగింది ఇందిర.
‘‘ఇందూ! ఇప్పుడింతగా ఎందుకు? నీకేం తక్కువైంది? డబ్బుకు ఎప్పుడూ కొదువ 
లేదు. టీవీ చూడు, పూజలు, వ్రతాలు చేసుకో లేదా కిట్టీ పార్టీలకు వెళ్లు. 
నాతో మీటింగులకు, పార్టీలకు రమ్మంటే రావు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటానంటావ్? 
నీకలా ఉండడమే ఇష్టం కదా! ఇప్పుడేమైంది మరి?’’ అడిగాడు రాజేశ్.
‘‘మమీ..! నీకు ఇష్టమైన చీరలు, నగలు కొంటానంటే డాడీ వద్దనరు కదా.. ఇంట్లో 
అన్నీ ఉన్నాయి. కారు ఉంది బయటకు వెళ్ళడానికి, ఫ్రెండ్స్ ఇంటికి 
వెళ్లడానికి. కానీ- నీకు ఉన్నది ఒకే ఫ్రెండు. ఇంట్లోనుండి బయటకు కదలవు. మా 
అందరి ఇష్టాలను తెలుసుకుని అన్నీ తీరుస్తున్నావు. మా సంతోషమే నీ సంతోషం 
కదా! ఇంకా ఇష్టాలు, కొత్త పని ఏంటి? అసలు నువ్వు పని చేయాల్సిన అవసరమేంటి? 
అదీ ఈ వయసులో? మరీ టూ మచ్’’ విసుక్కున్నాడు చైతన్య.
‘‘అసలు నాకు ఏమిష్టమో  మీకెవరికైనా తెలుసా? కడుపు నిండా తిండి, మంచి 
బట్టలు, నగలు, ఆర్థిక ఇబ్బంది అసలే లేని జీవితం. ఇవేనా..? మీరనుకునే నా 
ఇష్టాలు, కోరికలు. అంతకంటే వేరే ఏవీ ఉండవా? ఎప్పుడైనా నన్ను అడిగారా? నాకు 
ఇష్టమైన వస్తువులు, పని ఏంటి? మనస్ఫూర్తిగా నీకు ఏం కావాలి అని? మీ అందరి 
ఇష్టాలు, అభిరుచులను తీర్చడమో, తీర్చుకునేలా సహాయం చేయడమో చేసాను. ఇప్పుడు 
నా గురించి నేనే ఆలోచించుకోవాలనుకుంటున్నాను. నాకు ఏమవసరమో, ఇష్టమో నేనే 
తెలుసుకుని తెచ్చుకుంటాను. కనీసం ఇప్పుడైనా నాకంటూ కొంత సమయం 
కేటాయించుకోనివ్వండి..’’
‘‘ఓకే! ఏం చేయాలనుకుంటావ్ మమ్మీ?’’ అంతవరకు వౌనంగా ఉన్న సౌమ్య అడిగింది.
భర్త రాజేశ్, కొడుకు చైతన్య కూడా ఆసక్తిగా చూసారు. ఏం చెప్తుందో..? అని.
‘‘రేపటి నుండి నేను పొద్దున్నే ఎనిమిది గంటలకు వెళ్లిపోతాను. ఇల్లంతా మీరే 
చూసుకోవాలి. ప్రతి ఆదివారం మీకు సెలవు కావాలి, రెస్ట్ కావాలంటారు. ఇంట్లో 
ఉండి ఏ పనీ చేయకుండా అన్నీ స్పెషల్స్ చేయమంటారు. కూర్చున్న దగ్గరికే అన్నీ 
తెచ్చివ్వమంటారు. ఏమంటే? వారమంతా కష్టపడ్డాం కదా, రెస్ట్ కావాలి అని... మరి
 నాకు ఎప్పుడు రెస్ట్? అందుకే ఆ రెస్ట్,  నా సంతృప్తి కోసమే- ఒక రిటైర్డ్ 
లెక్చరర్ దగ్గర తెలుగు అనువాదాలు చేసి, తెలుగు టైపింగ్ చేయడానికి 
ఒప్పుకున్నాను... మధ్యాహ్నం సంగీతం, వీణ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. 
సాయంత్రం ఆరు గంటలకు తిరిగొస్తాను. అంతవరకు మీ పనులన్నీ మీరే చూసుకోండి.. 
చేసుకోండి..’’ అని కాస్త ఆగింది ఇందిర.
తల్లి అలా గట్టిగా చెప్పేసరికి పిల్లలిద్దరూ షాక్ అయ్యారు. ఏమనాలో 
తెలీలేదు. వద్దు అన్నా ఆగేట్టు లేదు అని అర్థమైపోతోంది. అసలు అమ్మ 
బయటకెళ్లాల్సి పనేంటి? ఇంట్లో ఉండొచ్చుగా? ఇప్పుడు సంగీతం, వీణ నేర్చుకుని 
ఏం చేస్తుంది? కచేరీలు ఇస్తుందా? ఈ వయసులో నేర్చుకుని ఏం చేయాలి? ఎవరిని 
ఉద్ధరించాలి? మరి రేపు మమ్మీ ఇంట్లో లేకుంటే ఎలా? ముఖ్యంగా భోజనం. హాయిగా 
సెలవు రోజున బ్రేక్‌ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు ఏదో ఒక స్పెషల్ చేస్తుంది. 
మరి సడెన్‌గా ఇప్పుడేమైంది? అని ఏమీ మాట్లాడకుండా లేచి తమ గదుల్లోకి 
వెళ్లిపోయారు. రాజేష్, ఇందిర వౌనంగా కూర్చున్నారు. ఇందిర మనసులో ఎటువంటి 
కల్లోలం లేదు- దృఢనిశ్చయం తప్ప. రాజేశ్ మాత్రం ఆమెను చూస్తూ ఆలోచనలో 
పడ్డాడు. ఇందిర వెళ్లి తలుపులన్నీ చెక్ చేసి పడుకుంది. రాజేశ్ ఎప్పుడు 
పడుకున్నాడో తనకే తెలీదు.
రోజులాగే తొందరగా నిద్ర లేచి స్నానం, పూజ చేసుకుని టీ చేసి తనకో కప్పు, 
భర్తకో కప్పు తీసుకుని బెడ్‌రూంలోకి వెళ్లింది. పేపర్ చదువుతున్న భర్తకు 
కప్పు ఇచ్చి తను కూడా టీ తాగింది. ‘‘నేను వెళ్తున్నా.. మీరు చూసుకుంటారు 
కదా..!’’ అని సందేహపడుతూనే అడిగింది.. తలెత్తిన రాజేశ్ ప్రశాంతంగా చూసి 
‘‘డోంట్ వర్రీ ఇందూ. నువ్వెళ్లు. నేను ఉంటాను.. వీలైతే మీ తమ్ముడింటికి 
వెళ్లు సాయంత్రం..’’
ఎనిమిదైనా ఇంకా అలాగే నిద్రపోతున్న పిల్లలను ఓసారి చూసి నిశ్చింతగా, ధైర్యంగా బయటకు నడిచింది ఇందిర.