సిరుల పొంగలి
అందరికీ సిరుల పండగ సంక్రాంతి శుభాకాంక్షలు..
అప్పుడేనా అంటారా.. పర్లేదు పండగ పనులు మొదలుపెట్టారు కదా. ఇదిగోండి నా వంతుగా ఈ రోజు సాక్షిలో ప్రచురించబడిన కొన్ని పొంగలి వంటకాలు మీకోసం..
అందరికీ సిరుల పండగ సంక్రాంతి శుభాకాంక్షలు..
అప్పుడేనా అంటారా.. పర్లేదు పండగ పనులు మొదలుపెట్టారు కదా. ఇదిగోండి నా వంతుగా ఈ రోజు సాక్షిలో ప్రచురించబడిన కొన్ని పొంగలి వంటకాలు మీకోసం..
రాసింది జ్యోతి at 06:26 11 వ్యాఖ్యలు
వర్గములు పత్రికా ప్రచురణలు, షడ్రుచులు
నాకేంటి చిక్కేంటి అనుకుంటున్నారా? నిజమండి. మరీ అంత పెద్ద చిక్కా? టపాయించేటంత పెద్ద చిక్కా అంటారా? అవునండి. కాస్త సాయం చేద్దురూ! ఎంతో ప్రయత్నించినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. కొంత కాలంగా నన్ను తెగ తిప్పలు పెట్టేస్తుంది. ఇంతకీ ఆ చిక్కేంటి అంటే ...
ఆగండాగండి.. రింగులు తిప్పుకుంటూ వెనక్కి వెళ్ళిపోకండి. ఇక్కడే ఉండండి. చెప్తున్నాగా...
చిన్నప్పటినుండి అమ్మ చేస్తుండగా చూసి నేర్చుకున్న వంట నాకు ఇప్పుడు పెద్ద తంటా అయ్యింది. నేను వంట నేర్చుకుంది ఏ సైటులోనో, బ్లాగులోనో కాదు. ఏ స్కూలుకు వెళ్ళలేదు, కొలత ప్రకారం ఏయే దినుసు ఎలా వేయాలో ఎవరూ చెప్పలేదు. కూరగాయలు కోసినా, ఉప్పూ కారాలు (అమ్మో! కారంలో మాత్రం చెంచా వేస్తాను. దాంట్లో చేతులు ఎలా పెడతాను ) , మసాలాలు వేసినా అన్ని చేత్తోనే. దానికి లెక్కా కొలతా లేదు. కంటిముందు కూరను చూసి దాని ప్రకారం అంచనాలు వేసుకుంటూ ఒక్కోటి అలా వేసుకుంటూ పోవడం. ఒకసారి పాడైతే తర్వాతి సారి జాగ్రత్తగా ఉండడం. అపుడు కుదిరితే, అందరూ నోరు మూసుకుని తింటే (బావుంటే నోరు మూసుకునే తింటారు. కొంచం తేడాగా ఉంటేనే కదా అరిచేది) ఓహో మన కొలతలు కరెక్టుగా ఉన్నాయి. అని ఆ కొలతలపై ఫిక్స్ అయిపోవడం. ఇలా నా వంటల ప్రహాసం జరుగుతూ వచ్చింది. హిట్లూ ఫట్లు ఎలాగూ ఉంటాయనుకోండి. సరే ఆంతా బానే ఉంది. మరి ఇప్పుడేంటి చిక్కు అని అడగబోతున్నారా.. వస్తున్నా..
ఇంట్లో అంటే అలా గడిచిపోయింది.. పోతుంది కూడా. ఇపుడు బ్లాగులో, సైటులో , పత్రికలలో , టీవీ షూటింగుల కోసం వంటలు రాసేటపుడు చెప్పేటప్పుడు ఆయా వంటకం కొలత పక్కాగా ఇవ్వాలి. లేకుంటే గొడవలైపోతాయి. వంట బాగా వచ్చినవాళ్లైతే పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటారు. నెట్ ఓపన్ చేసి వంటకం ముందు పెట్టుకుని వంట చేసేవాళ్ళు సరిగ్గా అదే కొలతల ప్రకారం చేస్తారు కదా. అది సరిగ్గా కుదిరితే వాళ్ళ గొప్ప. లేకుంటే నన్నే కదా తిట్టుకునేది. హమ్మయ్యా! మరి ఇపుడు అసలు సమస్య దరిదాపుల్లోకి వచ్చాము. నేను చేత్తో అలా ఆలవోకగా (సినిమా వీరోయిన్లా కాదులెండి) వేసే ఉప్పు కారాలు, మసాలాల గురించి కరెక్ట్ బరువు కొలతలు ఎలా ఇచ్చేది. ఓహో ఆ కూర చేసేటప్పుడు నా చేతి వేళ్ళ మధ్య ఉన్న ఉప్పు బరువు ఇంత ఉంటుంది. నేను వేసిన బెల్లం బరువు ఇంత ఉండి ఉండవచ్చు. ( ఎపుడూ నెలకోసారి సరుకులు తెచ్చుకుంటాం. అవసరమైనపుడు అలా తీసి వేసుకుంటాము కదా. ప్రతీ దాని బరువు ఎవరు చూడొచ్చారు. మరీ చోద్యం కాకపోతే ) ఇలా గాల్లో లెక్కలు వేస్తూ రాసుకుంటాను.
లేదా వంట చేసేటప్పుడే కొలత ప్రకారం చేస్తే పోలా ! అంటారా? అలా ఐతే గంటలో అయ్యే వంట నాలుగు గంటలు పడుతుంది. అలా కాదుగాని. ఏదైనా సులువైన ఉపాయం చెప్పండి. కిచన్ వేయింగ్ మెషీన్ కొనమని మాత్రం చెప్పొద్దూ. ఈ చెంచాల గోలేంటో, ఈ గ్రాముల గోలేంటో? మా కాలంలో ఈ లెక్కలు తెలీవమ్మా!!
ఇపుడు నానేటి సేసేది??
రాసింది జ్యోతి at 17:19 10 వ్యాఖ్యలు
వర్గములు సరదా
ఖంగారు పడకండి. నేను చెప్పబోయేది సత్యం సోదరుల గురించి కాదు. అలనాడు రాయలవారి ఆస్ధానంలో కొలువుదీరిన అష్టదిగ్గజాలలో ఒకరైన రామరాజభూషణుడు, తెనాలి రామలింగడికి ఒకసారి చిన్న చిచ్చు రగిలింది.దాని వివరాలలోకి వెళితే....
శ్రీకృష్ణదేవరాయలవారికి (అదేంటో రాయలవారు అనగానే ఎన్.టి.ఆర్ మాత్రమే కనిపిస్తాడు)తెనాలి రామలింగడి మీద అవ్యాజమైన ప్రేమాతిశయమున్నదని భట్టుమూర్తిగా పిలవబడే రామరాజభూషణుడికి ఆసూయ కలిగింది. ఎలాగైనా అతడిని పరిహసించాలని నిశ్చయించుకున్నాడు.ఒకరోజు సభలో భట్టుమూర్తి "కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ " అనే పద్యం చివరిపాదం ఇచ్చి భటుడి ద్వారా రామలింగడిని మొదటి మూడు పాదములు పూరించమన్నాడు. తనను అవమానించడానికే ఇలా అడిగాడని గ్రహించిన వికటకవి ఊరుకుంటాడా? ఆ సమస్యను ఈ విధంగా పూర్తి చేసాడు.
గంజాయి త్రాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా?
లంజలకొడకా యెక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్.
గంజాయి త్రాగి, తక్కువజాతి వాళ్లలో కలిసి కల్లు త్రాగి ఉన్నావా? లంజలకొడకా! ఎక్కడ ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరింది అంటూ భటుడిని తిట్టినట్టు పద్యం పూరించాడు.
ఎంతైనా రామలింగడికి చాలా ధైర్యం. తనను అవమానించదలచిన భట్టుమూర్తిని తిట్టినా తిట్టనట్టు వాతలు పెట్టాడు కదా. తరవాత రాయలవారు ఈ గొడవేదో శ్రుతిమించుతున్నట్టుగా ఉందని గ్రహించి ఆ చివరి పాదాన్ని నేనే ఇచ్చాననుకుని పూరించమన్నాడు రామలింగ కవిని. అప్పుడు ఆ పద్యం ఎత్తుగడ, ఇతివృత్తం అన్నీ మారిపోయి అందంగా అవతరించింది
రంజనచెడి పాండవు లరి
భంజనులై విరటుగొల్వఁ బాల్పడి రకటా
సంజయ! విధి నేమందును
కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్.
మహావీరులైన పాండవులు నిస్సహాయులై విరాటరాజు కొలువులో ఊడిగం చేసిన ఇతివృత్తం ఏనుగుల సమూహం దోమ గొంతులో చొరబడినట్టుగా అగుపిస్తుంది అని రామకృష్ణుడు చక్కగా చెప్పాడు.
కవులు ఎంతకైనా సమర్ధులే కదా!!!
రాసింది జ్యోతి at 14:56 9 వ్యాఖ్యలు
వర్గములు సాహిత్యం
పులిహోర అంటే తెలీని పిల్లలు, అమ్మలు ఉండరేమో? స్కూలు కెళ్ళే పిల్లల బాక్సులలో ఎప్పుడో అపుడు పులిహోర తప్పక ఉండాల్సిందే. అలాగే గుడికి వెళ్తే పులిహోర తప్పక తీసుకోవాల్సిందే. అదేంటో గుడిలో ఇచ్చే పులిహోర రుచి ఇంట్లో చేస్తే రాదు. ప్చ్.. ఈ పులిహోర ని పిల్లలు సరదాగా పులి ఆహారము లేదా టైగర్ రైస్ అంటారు. అన్నం పప్పు కలిపి పెడితే మధ్యాహ్నం వరకు అది ఎండిపోతుందని రకరకాల పులిహోరలు చేసి పెట్టడం నా అలవాటు. అందులో కొన్ని నా సొంత సృష్టే ఉండేవి. ఇక పిల్లలు పెద్దయ్యాక పులిహోర అలవాటు తప్పినట్టైంది. ఎప్పుడో పండగలకు తప్ప చేయడం లేదు. కానీ హృదయ స్పందనల చిరుసవ్వడి బ్లాగర్ భాస్కర్ ని అమ్మాయిలు పులిహోర అని ఏడిపించడం చూసి సరే దాని సంగతేంటో చూద్దామని ఈ ఉత్సవానికి నాంది పలికాను. కొద్ది రోజులుగా ఎన్ని రకాల పులిహోరలు ఉన్నాయి అని తెలుసుకుంటూ అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేస్తూ ఫోటోలు రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంతలో బ్లాగాడిస్తా రవి పులిహోర టపాతో బ్లాగులలో పులిహోర ఘుమఘుమలు మొదలయ్యాయి. ఎంతో మంది పులిహోర అనుభవాలు బయటకొచ్చాయి. సరే అని నేను రేపటినుండి షడ్రుచులు లో పులిహోర ఉత్సవం మొదలుపెడుతున్నాను. అందరికి ఇదే సాదర ఆహ్వానం.
భాస్కర్ నువ్వు ఇంట్లో ఎటువంటి పులిహోరలు కలుపుతావో నాకు తెలీదు కాని ఈ ఉత్సవం నీకోసమే.
రవి టపాలో భైరవభట్ల కామేశ్వరరావుగారు అడిగిన
చక్రపొంగలి (నేను ఇందులో పెసరపప్పు లేకుండా చేస్తాను మరి)
దద్దోజనం
ఇక మీ అందరిని ఊరించడానికి నేను ఇవ్వబోయే వివిధ రకాల పులిహోరలు ..
నిమ్మకాయ పులిహోర ( ఇది ఎపుడో ఇచ్చేశాను.)
మామిడి తురుము పులిహోర
కంచి పులిహోర
ఆవ పెట్టిన పులిహోర
నారింజ పులిహోర
దబ్బకాయ పులిహోర
సేమ్యా పులిహోర
నువ్వు పెట్టిన పులిహోర
చింతకాయ పులిహోర
ఉసిరికాయ పులిహోర
రవ్వ పులిహోర
రాసింది జ్యోతి at 13:21 10 వ్యాఖ్యలు

ఈ జీవితం పారే సెలయేరు లాంటిది. అది అలా సాగిపోతూనే ఉంటుంది. ఈరోజు కొత్త ఐనది కొద్ది కాలం తర్వాత పాతబడిపోతుంది. వచ్చే సంవత్సరం మీకందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మీకో చిన్ని కానుక. సృష్టిలో అందాన్నంతా తన మందహాసంలో దాచుకున్న ఆ శ్రీనివాసుడు మిమ్ములను కాపాడుగాక. ఈ చిత్రంపై క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. తిరుమల రాయడు అందనివాడైనా ఈ గోవిందుడిని మీ దగ్గరే బంధించుకోండి.
|
రాసింది జ్యోతి at 13:05 10 వ్యాఖ్యలు
వర్గములు శుభాకాంక్షలు
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008