Monday, 25 April 2011

వేమన వీరబ్రహ్మం





















సమాజంలోని లోటుపాట్లు, తప్పులను ఎత్తిచూపుతూ నిరర్ధకమైన కార్యములను నిరసించి దివ్యప్రబోదాలు చేసిన ఇద్దరు మహనీయులు వేమన, వీరబ్రహ్మం గురించిన వ్యాసం మాలిక పత్రికలో

Saturday, 23 April 2011

తెలుగుకు పట్టిన తెగులు


ఈ ప్రకటన ఇక్కడ ఎందుకుంది అంటారా?? కాస్త పై చిత్రంలో తేడాగా ఏదైనా కనిపిస్తుందా చూడండి. ఎవరికైనా ఈ కంపెనీ వాడి మార్కెటింగ్ శాఖ నంబర్ ఉంటే మాట్లాడండి. లేదా కనుక్కోండి. వాడి సంగతి తేలుద్దాం. నాకైతే వాడిని తన్నాలనిపిస్తుంది. ఈ ప్రకటన ఎక్కడ కనిపించింది అంటారా??.. ఇది చూడండి.

హమ్మయ్యా! ఎలాగైతేనేమి ఈ ప్రకటనలో తెలుగును సరిదిద్దారు.. ఇక్కడ చూడండి..

Wednesday, 20 April 2011

పద్యం...




http://padyam.net


పద్యం...

పద్యాలనే గుఱ్ఱాలు పత్రికలలోనే కాక అంతర్జాలంలో కూడా వేగంగా పరుగులెత్తుతున్నాయి. అంతర్జాల పత్రికలలో పద్యాలకై ప్రత్యేక శీర్షికలు, పండగవేళల్లో భువనవిజయ సభలు ఎంతో ఆదరణ పొందుతున్నాయి. అదేవిధంగా పద్య సంబందిత బ్లాగులు కూడా వృద్ది చెందుతున్నాయి. పద్యాలు రాయడమే కాదు, ఔత్సాహికుల కోసం పద్యరచన గురించి సులభమైన రీతిలో వివరిస్తున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా అంతర్జాలంలో పద్యాలకై ఒక ప్రత్యెకమైన ఆవరణ ఎర్పాటు చేసారు. అదే "పద్యం".

అంతర్జాలానికి కొత్తగా వచ్చిన పద్యప్రియులకి, ఇక్కడున్న పద్యసంపద గురించి వీలైనంత సమగ్ర సమాచారం అందించడం.ఇప్పటికే అంతర్జాలంలో వివిధ రూపాల్లో ఉన్న పద్యసాహిత్యాన్ని యూనీకోడీకరించడం అనేది పద్యం వెబ్ సైటు ప్రధాన ఉద్ధేశ్యం. ప్రస్తుతానికి దీని పరిధి చాలా పరిమితం. అక్కడక్కడా పరచుకుని ఉన్న వివిధ వెబ్ సైట్లలో ఉన్న పద్యాలని, ఆయా ఓనర్ల అనుమతితో, యూనికోడులోకి తర్జుమా చెయ్యడమే ప్రస్తుతానికి వారు చేస్తున్న పని. అంతర్జాలంలో లేని, కాపీరైట్ల సమస్య లేని పద్యసాహిత్యాన్ని యూనీకోడులో ఇక్కడ భద్రపరచడం. కొత్తగా పద్యాలు రాసేవాళ్ళకి తగిన సూచనలిచ్చి ప్రోత్సహించడం అనే ఉద్ధేశ్యంతో ఈ వేదిక ప్రారభించబడి, విజయవంతంగా ముందుకు సాగిపోతుంది.


ప్రస్తుతానికి ఈ సైటులోని విభాగాలు ఇవి:


1. ఛందః మంజూష – ఇది ఛందస్సు గురించిన సమాచార సమాహారం. పైన చెప్పినట్లు, ప్రాథమిక సమాచారానికి ఇక్కడనుంచి వికీకి లంకెలుంటాయి. ఛందస్సు గురించిన ప్రత్యేక విషయాలేమైనా వ్యాసాల రూపంలో ఇక్కడుంటాయి.


2. పద్య మంజూష - పద్య సాహిత్య సమాహారం. కాపీరైటులేని ప్రాచీన ఆధునిక పద్య కవిత్వం ఇక్కడ చదవవచ్చు.


3. వ్యాస మంజూష - పద్య సాహిత్యం గురించిన పరిచయ, సమీక్ష, విమర్శ వ్యాసాల సమాహారం ఇది.


4. పద్యాలతో కసరత్తు – అంతర్జాలంలో పద్యకవులు పాల్గొనేలా రెండువారాల కొకసారి ఒక సమస్యాపూరణమో, దత్తపదో, వర్ణనో, అనువాదమో ఇవ్వబడుతుంది.


పైవన్నీ బ్లాగు టపాల రూపంలో ఉంటాయి. ఇవి కాక ఈ సైటులో ఉండే మరో రెండు అంశాలు:


1. బ్లాగు మంజూష – ఇది పద్య సంబంధి బ్లాగుల సమాహారం.


2. చర్చా వేదిక - ఈ సైటు గురించి కాని, ఛందస్సు గురించి కాని, పద్యాల గురించి కాని పాఠకులు చర్చించేందుకు ఇది వేదిక.


Wednesday, 13 April 2011

సాహితీ ప్రాంగణాలు



సాహితీ ప్రాంగణాలు


సమస్తం ఆంగ్లమయమైన ఈ రోజుల్లో తెలుగు నేర్చుకోవడానికి, చదవడానికి చాలామంది అనాసక్తిగా ఉన్నారు. అదేమంటే చదువు, ఉద్యోగాలకు సంబంధించిన సమస్త సమాచారం ఆంగ్లంలో ఉన్నప్పుడు తెలుగు మనని ఏవిధంగా ఉద్ధరిస్తుంది అంటారు. కాని సాంకేతికంగా శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో కొందరు తెలుగు భాషాభిమానులు ప్రాచీన సంస్కృతిని, విజ్ఞానాన్ని అంతర్జాలంలో పొందుపరుస్తున్నారు. కంప్యూటర్లో తెలుగు రాయడం, చదవడం చాలా సులువైన ఈ రోజుల్లో ఈ వెబ్ సైట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందుబాటులో ఉన్నాయి. తమకు తీరిన సమయంలో వీటిని ఉపయోగించుకోవచ్చు , తమ పిల్లలకు ఎన్నో విలువైన విషయాలను నేర్పవచ్చును కూడా. శతకాలు, జానపద పాటలు, మంగళహారతులు, డిక్షనరీలు, పద్యాలు, పుస్తకాలు మొదలైన అమూల్యమైన విజ్ఞానసంపదను ఈ సైట్లు నిక్షిప్తపరుస్తున్నాయి. అటువంటి ముఖ్యమైన వెబ్ సైట్లు కొన్ని పరిచయం చేసుకుందాం..


మాగంటి - http://maganti.org

నేటి బిజీ బిజీ జీవితాలలో పుస్తకపఠనం, సాహిత్యాభిలాష వగైరా చాలా వరకు తగ్గుతున్నాయి అనవచ్చు. కాని తమ తాతలు, తండ్రులు ఎంతో ఆసక్తిగా సేకరించి, భద్రపరుచుకున్న అపురూపమైన సాహిత్య సంపదను, నేటి, రాబోయే తరాలకు అందించాలనే మహోన్నతమైన అభిలాషతో , తమకు తెలిసిన విషయాలు ఇతరులతో పంచుకోవాలి, పెద్దవాళ్లు అందచేసిన పెన్నిధి దాచుకుని, తమతోనే అంతం కాకుండా తర్వాతి తరానికి అందచేయాలనే సదుద్ధేశ్యంతో మాగంటి అనే వెబ్ సైట్ ని ప్రారంభించారు శ్రీ మాగంటి వంశీ , అతని కుటుంబ సభ్యులు. తమకు వీలైనంత రీతిలో ఒక సాహిత్య భాండాగారంగా తయారుచేయాలనే ఉద్ధేశ్యంతో ఇందులో క్రమం తప్పకుండా కొత్త సమాచారం చేరుస్తున్నారు.

ఇకపోతే ఈ వెబ్ సైటులో ఏమేమి ఉన్నాయి అంటే చిన్న పిల్లలకోసం బోలెడు కథలు, పద్యాలు , వైజ్ఞానిక వ్యాసాలు, సాహితీవేత్తల, సంగీతకారుల వివరాలు, వారితో జరిపిన చర్చగోష్టీలు, జానపద కళల వీడియోలు, అవధానంలో సమస్యాపూరణ, చాటువులు వగైరా ఎన్నో ఎన్నెన్నో.. ఇంకా ఈ సైట్లో ఉన్న కళాఖండాలు ఒక్కసారి పరికిద్దాం. సాహిత్యం విభాగంలో వేదములు, ఉపనిషత్తులు, ఋత్త్వికులు , నారద సూత్రాలు... పిల్లల కోసం కూడా అరుదైన, అద్భుతమైన సమాచారం ఉంది. చిట్టి పొట్టి పద్యాలు, దీవెన పద్యాలు, జానపద కథలు, కోలాటం పాటలు వగైరా.. ఇక పురాణాల విషయానికి వస్తే పురాణాలు, అష్ట దిక్పాలకులు, శ్లోకాలు, అశ్వినీ దేవతలు, మన చక్రవర్తులు.. పొడుపు కథలు, కాలం, యుగాలు, దశవాయువులు , మహాకవులు, కవయిత్రులు, జేజిమామయ్య పాటలు.. అలాగే మహిళలకు ఎంతొ ముఖ్యమైన శ్రావణ, మంగళవార , శుక్రవార పాటలు, లాలిపాటలు, మంగళహారతి పాటలు ఎన్నో మధురమైన లలితగీతాలు కూడా పొందుపరచబడ్డాయి.


అసలు ఈ పాటలు ఉన్నాయి అని కూడా చాలామంది ఊహకు రావేమో.... టెంకిపాట - ఎంకిపాట, తిరుపతి వేంకటేశ్వర కవుల పకోడీ పద్యం, మల్లినాధసూరిగారి ఆవకాయ పాట, దోమ పద్యాలు, దేవులపల్లివారి పేరడీ పాట, పేకాట పాట.. ఇలా ఎన్నో అపురూపమైన పాటలు మీగడతరకలుగా ఈ సైట్ లో ఉన్నాయి. అంతేకాక చమత్కార చాటువులు, మేలుకొలుపులు, గాజులయ్య పాట, పెళ్లి పాట, రోకటిపాట, దంపుళ్ల పాట, గోంగూర పాటలూ ఉన్నాయి. మరుగునపడిపోతున్న ఎన్నో జానపదకళల వీడియోలు కూడ ఈ సైట్లో మనం వీక్షించవచ్చు. చెంచు నాటకం, కీలు గుర్రం, యక్షగానం, చెక్కబజన, పగటి వేషాలు, గంగిరెద్దుల పాటలు మొదలైనవి..



ఆంధ్రభారతి – http://andhrabharati.com


ప్రస్తుతం సాహిత్యాభిమానులకు , పురాణాలు చదవాలనే అభిలాష గలవారికి అనువైన గ్రంధాలు అందరికీ అందుబాటులో లేవు. ఉన్న కొద్దిపాటి గ్రంధాలు గ్రంధాలయాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అందరూ గ్రంధాలయానికి వెళ్లి చదవడానికి సమయం, ఓపిక ఉండదు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. పురాణాలు, శతకాలు వగైరా ఉత్తమ సాహిత్యాన్ని , అందరికీ అందుబాటులొ ఉంచడానికి జరిగిన విశేష కృషిఫలితమే "ఆంధ్రభారతీ” సైటు.


ఇది ఒక సైటు అనడంకంటే ఒక విజ్ఞానపుగని అనవచ్చు. భాషకు సంబంధించి వ్యాకరణం, చందస్సు, అలంకారాలు, జాతీయములు, పొడుపుకథలు...చరిత్రకు సంబంధించి పూర్వ, మధ్య, ఉత్తర మధ్య, ఆధునిక యుగ చరిత్రలు, పుణ్యక్షేత్రాలు, ఇతిహాసాలు,శతకాలు, కవితలు ..ఇలా చెప్పుకుంటూ పోతే తరగని నిధి మన కందుబాటులో ఉంటుంది. అలాగే ప్రసిద్ధమైన నాటకాలు, అలనాటి ప్రముఖుల గురించిన విశేషాలు ఈ వెబ్ సైటులొ పొందుపరచబడ్డాయి. కన్యాశుల్కం, చింతామణి వంటి నాటకాలు కూడా ఈ సైటులో లభ్యమవుతున్నాయి. మనం ఎన్ని పుస్తకాలు కొనడానికి ప్రయత్నించినా ఇక్కడ ఉన్న నిధిలో కొంతవరకైనా సమకూర్చుకోలేమేమో ? అనిపిస్తుంది. ఆంద్రభారతిలో కొత్తగా నిఘంటువు కూడా చేర్చబడింది. మనకు తెలియని పదాలు వాటి అర్ధాలను వివిధ శబ్దరత్నాకరాల నుండి సులువుగా వెతికే వీలు కల్పిస్తున్నారు..

Wednesday, 6 April 2011

అంతర్జాలంలో సగం... మనస్వి

అంతర్జాలంలో సగం..

మనసులోని భావాలను, ఆలోచనలను పంచుకొని వాటిని చర్చించుకోవడానికి అద్భుతమైన వేదిక బ్లాగు. ఇంటికో ఇంజనీరు తయారవుతున్న ఈ రోజుల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ వాడకం నిత్యావసరమైపోయింది. తెలుగులో రాయడం సులువు కావడంతో తెలుగుబ్లాగులు కూడా విస్తృతి చెందాయి. అన్నింట్లోనూ మేమున్నాం అంటూ మహిళలు కూడా తెలుగు బ్లాగులలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకొని బ్లాగును తమ ఆలోచనలకు వేదికగా చేసుకుని ఇంటిపనులు చేసినంత సులువుగా కంప్యూటర్‌ను కూడా అలవోకగా ఉపయోగిస్తున్నారు. వైవిధ్యమైన రాతలతో పాఠకులను అలరిస్తున్నారు. కథలు, హాస్యం, కవితలు, పాటలు, వంటలు, చలొక్తులు, చర్చనీయాంశాలు.. ఇలా కాదేదీ తమ రాతలకనర్హం అని నిరూపిస్తున్నారు. అందుకేనేమో వేలల్లో ఉన్న తెలుగు బ్లాగుల్లో పదుల్లో ఉన్న మహిళాబ్లాగులు రాశికంటే వాశి మిన్న అని నిరూపించాయి. తెలుగు భాష మీది అభిమానం, రాయాలి, తమలా ఆలోచించేవారితో పంచుకోవాలి, చర్చించాలి అనే తాపత్రయంతో ఎన్నో విభిన్నమైన సంఘటనలు, సమస్యలు తమదైన సైలిలో అందిస్తున్నారు. ఉద్యోగానుభవాలు, ఉద్వేగాలను హృద్యంగా వెల్లడి చేయడంలో మహిళలను మించినవారు లేరేమో? మహిళా బ్లాగర్లలో అందరూ సాంకేతిక నిపుణులు కారు. ఇందులో గృహిణులు, ఉద్యోగినులు, పత్రికా విలేఖర్లు, ప్రవాసాంధ్రులు, విద్యార్థినులు, ప్రముఖ రచయిత్రులు కూడా ఉన్నారు. వీరికి వయసు పరిమితి కూడా లేదు. పాతిక నుండి ముప్పాతిక ఏళ్లవరకు ఉన్న మహిలా బ్లాగర్లు ఎంతో ఉత్సాహంగా, హాస్యపూరకంగా, వ్యంగ్యంగా, సూటిగా, ఘాటుగా ఔరా అనిపిస్తూ తమ రాతలకు వన్నెలద్దుతున్నారు. వీరిలో సమయం కుదిరినప్పుడు రాసేవారు కొందరు, ఏదైనా విషయం తక్షణం పంచుకోవాలి అనుకున్నవెంటనే బ్లాగులొ రాసుకునేవారు కొందరు. తమ రాతల ద్వారా తమ భావాలను, ఆలోచనలను, ప్రతిభను ప్రదర్శిస్తూ, మెరుగు పెట్టుకుంటూనే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లవేళలా ఉత్సుకత చూస్తున్నారు మహిళలు. వీరందరూ తమ వృత్తితో పాటు బ్లాగింగును కూడా ఉపయుక్తమైన ప్రవృత్తిగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.



ఊరికే తమకు తోచినప్పుడు బ్లాగు రాయడమే కాక కొందరు ఔత్సాహికులైన మహిళా బ్లాగర్లు కలిసి తమకంటూ "ప్రమదావనం" అని ఆంతరంగిక గుంపు ఏర్పాటు చేసుకున్నారు. వివిధ దేశాల్లో ఉన్న మహిళా బ్లాగర్లు ఇక్కడ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, సాంకేతిక సలహాలు, సందేహాల నివృత్తి చేసుకుంటారు. అప్పుడప్పుడు ప్రత్యేకమైన రోజులలో సభ్యులందరూ కలిసి ఒకే అంశంపై ఒకే రోజు తమ బ్లాగులో టపాలు రాసి హడావిడి చేసేస్తారు. అవి తమకు నాకు నచ్చిన పాట కాని, చేట్టు కథ కాని, కృష్ణాష్టమి కాని, వాన గురించి కాని కావొచ్చు. ప్రమదావనం సభ్యులు బ్లాగులు రాసుకోవడం, కబుర్లాడుకోవడమేగాక సమాజానికి తమ వంతుగా ఏదైనా సాయం చేయాలనే సదుద్ధేశ్యంతో స్వచ్చందంగా ధనసేకరణ చేసి వీలైనప్పుడు సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. అనాధలైన ఆడపిల్లలకు దుస్తులు, పుస్తకాలు వగైరా, మానసిక వికలాంగులైన స్కూలు పిల్లలకు అవసరమైన కుర్చీలు, ఆహార వస్తువులు, వృద్ధాశ్రమాన్ని సందర్శించి వాళ్లకు నెలసరి భోజన సామగ్రి, దుస్తులు, చెప్పులు, కొన్ని నిత్యావసరమైన వస్తువులు ఇచ్చి వారితో కొన్నిగంటలు గడిపారు. అంతే కాక నిలువనీడలేక చలికి వణుకుతూ ఫుట్‌పాత్‌ల మీద పడుకునే పేదవారికి దుప్పట్లు అర్ధరాత్రివేళ వెళ్లి దుప్పట్లు కప్పడం, వరదబాధితులకు, అనాధపిల్లలకు ధనసహాయం వంటివి చేస్తున్నారు. ఈ సేవాకార్యక్రమాలతో మిగతావారికి స్ఫూర్తినిస్తున్నారు.



అంతర్జాలంలో మహిళా బ్లాగర్లు బ్లాగింగును చక్కని అభిరుచిగా పెంపొందించుకుంటున్నారు. కాని తమ బ్లాగు నిర్వహణతోపాటు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. తమ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, చిరునామాలు బ్లాగులో, అంతర్జాలంలో ఎక్కడా కూడా ఇవ్వకూడదు. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడమే మంచిది. తమ బ్లాగులో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. సాంకేతిక పరిజ్ఞానం చాలా ప్రయోజనకరమైనది. అలాగే కొద్దిగా అజాగ్రత్తగా, ఏమరుపాటుగా ఉంటే తీరని నష్టాన్ని, బాధను కూడా కలిగిస్తుంది. అందుకే వాస్తవ ప్రపంచమైనా, మిధ్యా (అంతర్జాల) ప్రపంచమైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. మనకు ఏది అవసరమో అదే తీసుకుంటే సరి.






మనస్వి... http://manasvi-jaya.blogspot.com/

“నేను ఇంక వంట చేయను గాక చేయను. రోజూ పొద్దున్నే గృహప్రవేశం లాగా టైంకి వంటింటి ప్రవేశం చేయాలి. ఇష్టం ఉన్నా లేకున్నా అలాగే వంట చేయాల్సిందే! అబ్బా, ఈ వంట ఎవరు కనిపెట్టారో కాని.... ఇళ్ళల్లో వంటిల్లు కట్టట్టం బాన్ చేస్తే బాగుండు. ఎన్నో ఆధునిక పరికరాలు కనుక్కుంటున్నారు. అన్ని పనులు చాలా సులభమయ్యేట్లుగా చూస్తున్నారు. వినాశన సాధనాలు ఎన్ని కనుక్కుంటున్నారో. ప్రపంచమే ఏ నిమిషంలో అయినా అంతమయ్యేంత పరిజ్ణానాన్ని పెంచేసుకుంటున్నారు. కాని, ఒక్కరంటే ఒక్కరన్నా...అలా సులభంగా కిచన్ లోంచి చక చకా ఫుల్ మీల్ ప్లేట్స్ బయటికి వచ్చేట్లు కనుక్కోలేదు. ఇలాంటి పనికొచ్చే విషయాలు మాత్రం కనుక్కోరు. ఎందుకో, నాకిప్పుడు బాగా అర్ధమయింది. అవన్నీ కనుక్కుంటున్నది ’మగబుద్ధి’ కదా!!! అందుకే ఆడవాళ్ళు ఎక్కడ సుఖపడిపోతారో అని ఇలాంటి సౌకర్యాలు మాత్రం కనుక్కోటం లేదు. ద్రౌపదికిచ్చిన అక్షయ పాత్ర నాక్కూడా, ఏమూలో, ఓ రోడ్డు మీదో దొరకచ్చు కదా...లేపోతే కళ్ళు మూసుకుని ఏదో ఒక మంత్రం చదివితేనో, మాయాబజార్ లో లాగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్ష్యమైతే ఎంత బావుండో కదా.....కనీసం ఓ కామధేనువన్నా నాకు దొరికితే బావుండు.”



అని తన బాధా సప్తశతిని వెల్లబోసుకున్నారు జయ. హైదరాబాదులోని ఒక మహిళాకాలేజీలో పనిచేస్తున్న జయ మనస్వి అనే బ్లాగులో తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనకు నచ్చిన, కలవరపెట్టిన, మనసును కదిలించిన సంఘటనలను చాలా హృద్యంగా బ్లాగులో రాస్తారు. అప్పుడప్పుడు తను చూసిన సినిమా అనుభవాలే కాక ఇదిగో తాను రెగ్యులర్ గా చీరలు తీసుకునే వ్యక్తి గురించి కూడా బ్లాగులో పరిచయం చేస్తారు. “ఎవరికైనా వెంకటగిరి చీరలు కావాలంటే చెప్పండి. ఈ చీరలు కట్టీ కట్టీ మా కొలీగ్స్ తో బాగా తిట్లు తింటున్నాను. ఈ చీరలకు నేను బ్రాండ్ అంబాసిడర్నట. నేనే ప్రమోట్ చేస్తున్నానట. అన్నీ అవే కడ్తున్నాను కాబట్టి నా పేరు వెంకటమ్మట. అబ్బో చాలా మాటలే పడ్తున్నానులెండి. ఎవ్వరూ నామీద కొంచమైనా జాలి చూపించట్లేదు.” ఇలా అసలు ఆడాళ్లకు మాట్లాడుకోవడానికి దొరకని పనికిరాని వస్తువు, విషయం కాని ఉందా అని అనిపించక మానదు జయ బ్లాగు చదువుతుంటే. మనస్వి బ్లాగులో ఆలొచన,ఆవేశం,ఆవేదన మాత్రమేకాక అందమైన కవితలు, చిత్రాలు కూడా ఎన్నొ ఉన్నాయి.

మనస్వి...వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం అంటూ ఆహ్వానిస్తున్నారు హైదరాబాదుకు చెందిన జయ..

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008