Sunday, 6 September 2009

షడ్రుచులు - కొన్ని వంటల పోటీలు

వంటల మీద ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన బ్లాగులు ఎన్నో ఉన్నాయి.అందులో భారతీయుల బ్లాగులు లెక్కలేనన్ని. నా షడ్రుచులు బ్లాగు తెలుగు, ఇంగ్లీషు రెండు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. మీకుతెలుసా మన కూడాలి లాగా ఆహార బ్లాగులకోసం ఒక అగ్రిగేటర్ ఉంది. మీరూ ఓ లుక్కేసుకోండి.. పనికొస్తుంది..

గత నెలలో చాలా బిజీ బిజీగా గడిచిపోయింది. పండగ హడావిడి. వంటకాల పోటీలలో పాల్గోవడం. ఇదే మొదటిసారి అయినా సాహసం చేయవే డింభకి అని రంగంలోకి దూకేసాను. ఒకదానికొకటి సంబంధం లేని పోటీ. వాటి వివరాలు మీకోసం. అప్పుడప్పుడు అందరికీ సహాయకరంగా ఉంటుందని ఇక్కడ ఇస్తున్నాను.. అందులో నా వంటలేవో మీరే కనుక్కోండి..

Zaiqa - రంజాన్ సందర్భంగా నా వంతు వంటకాలు ఇక్కడ


WYF Breakfast event : ఇక్కడ మీకు బోలెడన్ని టిఫిన్ల గురించి తెలుస్తుంది.

గణేష్ చతుర్ధి

APPYAYAN - ఇక మాంసాహారులకు, జలపుష్ప ప్రేమికులకు కూడా ఒక పోటీ జరిగింది..

FIC-ZODIAC SIGNS మన రాశి యొక్క రంగును ప్రతిబింబించే వంటకాలు చేసే పోటీ కూడా జరిగింది. నా రాశి ప్రకారం నేను చేసింది.. మరి కొన్ని ఇక్కడ చూడండి.

Microwave Potluck party - నా స్నేహితురాలు ఉమ సాయంతో ఈ పోటీలో నా కప్ కేక్ పంపించాను. మైక్రోవేవ్ వాడేవాళ్లకోసం ఎన్నో వంటకాలు చూడండి..

Indian Cooking Challenge : చివరిగా వినాయక చవితి సందర్భంగా ఇతర రాష్ట్ర వంటకాలు నేర్చుకునే అవకాశం కూడా కలిగింది ఈ పోటీ వలన కలిగింది. మీరు కూడా ప్రయత్నించండి..

కనీసం ఇలాగైనా వేర్వేరు ప్రాంతాలు, రుచుల గురించి తెలుసుకోవచ్చని ఇక్కడ ఆ వివరాలు పొందు పరుస్తున్నాను.

Tuesday, 1 September 2009

మనల్ని మనం ప్రేమించుకుందాం..

తల్లిదండ్రులన్నా, బిడ్డలన్నా, తోబుట్టువులన్నా, మనకు ఎనలేని ప్రేమ, అభిమానం! రక్తసంబంధాలే కాదు స్నేహితుల్లో, బంధువుల్లో ఏ ఒక్క కోణం నచ్చినా కల్లాకపటం లేకుండా మానసికంగా దగ్గరైపోతాం. మనిషి జన్మతఃనైజం ప్రేమించడం! ప్రేమతో ఆత్మీయుల మనసుల్లోకి ఒదిగిపోయి నప్పుడు మనల్ని మనం మైమరిచిపోతాం. కేవలం మనుషుల్నే కాదు మనలోని సున్నితత్వాన్ని తట్టిలేపే మొక్కల్నీ, ప్రేమతో పంచనచేరే జంతువుల్నీ అన్నింటినీ ప్రేమిస్తాం. అవును నిజ్జంగా మనకు విశ్వజనీయమైన ప్రేమను అందించే, ప్రేమని ఆస్వాదించే గొప్ప మనసు ఉంది. అంత గొప్ప మనసు ఉండీ ఆ మనసు ఎప్పుడూ ఒంటరిదే! అందర్నీ అక్కున చేర్చుకుంటాం కానీ మనకి మనం ఎప్పుడూ మిగలం. ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారూ అంటే తమనితాము ప్రేమించుకునేవారే! నిరంతరం ఇతరుల సంతోషంలో మనం ఆనందాన్ని వెదుక్కుంటాం. వారి మొహంలో ఆశించిన భావం ప్రతిఫలించకపోయినా, వారి మాటల్లో మనం కోరుకున్న భావోద్వేగం ఉట్టిపడకపోయినా మన మనసు నీరుకారిపోతుంది. తల్లి, బిడ్డ, భార్యా, భర్తా, సహోదరులు.. ఇలా మనం ఎవరైతే మన వాళ్లు అనుకుంటామో వారి ప్రతీ కదలికలోనూ అంతరార్థాన్ని ఒడిసిపట్టి విశ్లేషించి మనం అనుకున్న ఫలితం వస్తే సంతృప్తితో కడుపు నింపుకుంటాం. ఇలా ఆత్మీయుల కళ్లల్లో మెరుపుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి చివరకు మనం సాధించేది ఏమిటీ అంటే నిస్పృహ. ఇంతగా ప్రపంచాన్ని ప్రేమించే మనం, ఇంతగా ఎదుటి వ్యక్తి శ్రేయస్కుని కోరుకునే మనం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మన కోసం మన ఆనందం కోసం ఒంటరిగా గడుపుతామా? చుట్టూ మనుషులు లేకపోతే జీవితాన్ని కోల్పోయిన భావన కలుగుతుంది.



ఎంత కావలసిన వారైనా మాట పట్టింపు వచ్చి అరక్షణం పలక్కపోతే ఆ మౌనం భరించరానిదౌతుంది. మనవాళ్లనుకుని ప్రేమని పంచిన వారి నుండి మన ప్రేమకు కనీస గుర్తింపు అయినా దక్కకపోతే మనసు చివుక్కుమంటుంది. ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వచ్చాం. ఒంటరిగానే పోతాం. మధ్యలో ఏర్పడే ఈ అనుబంధాల చిక్కుముళ్లపై అపేక్ష పెంచుకుని మనసుని మనల్ని మనం గాయపరుచుకుంటూ మనకంటూ మనం మిగల్లేక జీవశ్చవాల్లా ఒంటరి తనం అనుభవించడం ఎంత వరకూ సబబు? మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్న వారందరూ మనల్నీ అంతే అభిమానిస్తున్నారు అని భ్రమపడతాం. డబ్బు, హోదా, ధైర్యం, ఆరోగ్యం వంటివి ఉన్నంత వరకే మనకి దక్కే గౌరవాలు, ప్రేమలు అన్నీ! ఏ క్షణమైతే ఏ కారణం చేతైనా మనం భౌతిక బలాలను కోల్పోతాయో ఆ క్షణం మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారు ఎవరూ ఉండరు. అందుకే మనల్ని మనం ప్రేమించడం అలవర్చుకోవాలి. మనకు మనమే ఉన్నాం. ఎవరూ లేకపోయినా ఈ ప్రపంచంలోకి మనం ఏం చెయ్యడానికి వచ్చామో మన ధర్మాన్ని మనం నిర్వర్తించి వెళ్లగలిగేలా ఒంటరి పోరాటాన్ని సాగించే ధీర్వతం చాలా ముఖ్యమైనది. ప్రపంచాన్ని ప్రేమిద్దాం అంతకన్నా ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుందాం.



మీ
నల్లమోతు శ్రీధర్


"కంప్యూటర్ ఎరా" తెలుగు మాసపత్రిక సెప్టెంబర్ 2009 సంచిక సంపాదకీయం ఇది.

Monday, 31 August 2009

కాదనలేని సత్యాలు

ఆకాశంలో సగమైనా, అంతరిక్షంలోకి దూసుకెల్లినా మన దేశంలో ఇంకా ఎందరో ఆడపిల్లలను భారంగానే భావిస్తున్నారు. పుట్టకముందు,పుట్టాక ఆడపిల్ల అని చంపేస్తున్న కసాయివాల్లెందరో ఈ సమాజంలో ఉన్నారు. ఈ వాస్తవ సత్యాలను నమ్మక తప్పదు.

ఆడపిల్లనమ్మా..




నేను బోను అత్తగారింటికి..





అమ్మా నన్ను అమ్మకే...

Tuesday, 25 August 2009

భాగవతం లోని అద్భుత పద్యాలు.



తెలుగు సాహిత్యంలోని అందాన్ని ఆస్వాదించాలంటే పండితుడే కానక్కరలేదు . పురాణ గ్రంధాలైన రామాయణ , మహాభారత, భాగవతాలనుండి ఎన్నో పద్యాలు సామాన్య జన జీవనంలో విరివిగా వాడబడ్డాయి. ఆ మహాకావ్యాలలో ప్రస్తావించబడిన ఎన్నో పద్యాలు ఇప్పటికీ మన నిత్య జీవతంలో అన్వయించుకుంటాము కూడా. పోతన కవిత్వం మాధుర్యానికి పెట్టింది పేరు. భాగవతంలో ఎన్నో పద్యాలు తెలుగునాట ప్రతినోటా నానాయి. అలాంటి కొన్ని భాగవత పద్యాలు చూద్దాం. ఇందులో ఎన్నో పద్యాలు స్కూలులో చదివినవే .ఇవి చదువుతుంటే నా స్కూలు రోజులు గుర్తొచ్చాయి. ప్రతి పరీక్షలో ముందు రాయాల్సిన ప్రతిపదార్ధం . అది మొత్తం కరెక్టుగా రాస్తే వచ్చే ఫుల్ మార్కులు.. ఆ తెలుగు టీచర్. ఆవిడని విసిగించిన సంఘటనలు..


మన సారధి ,మన సచివుడు
మన వియ్యము, మన సఖుండు,మన బాంధవుఁడున్
మన విభుడు, గురువు, దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా.



తమ నేస్తం, సారధి, మంత్రి లా సలహాలు ఇచ్చినవాడు, వియ్యంకుడు, బందువు ఐన శ్రీకృష్ణుడు అస్తమించిన పిమ్మట అర్జునుడు సర్వం కోల్పోయినవాడై దిగులుగా అన్నతో చెప్పిన మాటలివి. మనకు బాగా కావలసిన వాడు, మిత్రుడు , బంధువు చనిపోయినప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా. మనకు సర్వస్వం ఐన వ్యక్తి దూరమైనపుడు సర్వం శూన్యంగా అనిపిస్తుంది.



ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్


గజేంద్ర మోక్షంలోని ఈ పద్యం తెలుగువారికి చిరపరిచితమే. మొసలి నోట చిక్కిన గజేంద్రుడు ఆ సర్వేశ్వరుడిని శరణు వేడిన విధంబిది. అసలు భగవంతుడు ఎవ్వడు అనే ప్రశ్నకు సమాధానం ఈ పద్యంలో లభించవచ్చు. ఈ జగత్తు ఉద్భవించడానికి కారణం అతడే, జగం అతనిలో ఉంది. అతనితో ముగుస్తుంది. మొదలు, తుది ..సర్వమూ తానే ఐన ఆ భగవంతుడు తనంతట తానుగా జన్మించినవాడు. సృష్టికి మూలకారణము అని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన నిజము. అప్పుడు కాని మనిషిలోని గర్వం అణిగి, తానే గొప్ప అని విర్రవీగడు


వారిజాక్షులందు, వైవాహికములందు
బ్రాణ విత్త మాన భంగములందుఁ
జకితగోకులా గ్రజన్మరక్షణమందు
బొంకవచ్చు, నఘము రాదధిప!


వామనావతార ఘట్టములో దానమడగడానికి వచ్చిన బాలుడు మహావిష్ణువు అని తెలుసుకున్న దానవ గురువు శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో ఇలా అన్నాడంట. స్త్రీల విషయములో, వివాహ విషయములో, ప్రాణానికి , సంపదకు, మానమునకు హాని కలిగే సందర్భంలో, గోవులను, బ్రాహ్మణులను రక్షించు సమయములో అబద్ధము ఆడ వచ్చును.అందుకే బలిచక్రవర్తిని ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని తన ప్రాణాలు కాపాడుకోమని అద్భుతమైన సలహా ఇచ్చాడు ఆ గురువు. పైగా అది తప్పు కాదంట.. కాని ఇపుడు అవసరానికి అలవోకగా అబద్దాలాడేస్తుంటారు చాలా మంది.



ఊరక రారు మహాత్ములు
వా రధముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు . నిజము మహాత్మా !


శ్రీకృష్ణుడి కుశలము తెలుసుకుని రమ్మని వసుదేవుడు తన పూరోహితుడిని పంపిస్తాడు. అతనికి అతిథి సత్కారాలు చేసి నందుడన్న మాటలివి. ఇప్పటికీ మనం ఎవరైన గొప్పవాళ్లు మన ఇంటికి వస్తే ఊరకరారు మహాత్ములు. మాలాంటి సామాన్యులు, పేదవారింటికి మీలాంటి పెద్దలు రావడం శుభకరం అని అంటారు. ఇందులో అవతలి వ్యక్తి సంపూర్ణ గౌరవంతో అన్నాడా? , వెటకారంగా అన్నాడా అన్నది తెలియడం అవసరం. అది అతని ఉచ్చారణలో తెలిసిపోతుంది. ఏమంటారు.. నిజమేకదా..


ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!


బలి చక్రవర్తి వద్ద మూడడుగులు దానంగా స్వీకరించాక పొట్టి వడుగు వామనుడు భూమిని, ఆకాశాన్ని,మబ్బులను, సూర్యచంద్రులను, ధృవుని, మహాలోకాలన్నింటినీ దాటిపోతూ పెరిగిపోయాడు. ఆ చిన్ని వడుగు ముల్లోకాలన్నీ ఆక్రమించేటంతగా ఎదిగిపోయాడు. "ఇంతింతై వటుడింతై" అనే పదం నానుడిగా మారిపోయింది. ఒక వ్యక్తి క్రమంగా ఎదుగుతూ వృద్ధి చెందినప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిపోయాడు అని అనడం సర్వ సాధారణం. చిన్ని బాలుడైనా కృషితో వామనుడిలా విశ్వరూపం దాల్చవచ్చు , ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని భావం.

Monday, 17 August 2009

కృష్ణప్రేమ ..





అప్పుడప్పుడు సామూహిక టపాలు రాయడం మహిళా బ్లాగర్లకు అలవాటైన విషయం. అదే క్రమంలో కృష్ణాష్టమి కూడా మన బ్లాగుల్లో జరుపుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి మహిళా బ్లాగర్ విశిష్టమైన రీతిలో స్పందించారు. ఒక్కొక్కరిది ఒక్కో వ్యక్తీకరణ.. ఆ ప్రత్యేకమైన టపాలన్నీ ఒక్కచోట సమీకరించడం జరిగింది. నేనూ రాస్తాను అని గీతాచార్య గారు పండగయ్యాక ప్రచురించారు.. కాని అది సృజన టపాకు ముందు భాగమని తెలిసింది.

నేస్తం - అసలు కృష్ణాష్టమి అంటే

శ్రీలలిత - కృష్ణాష్టమి శుబాకాంక్షలు

జ్యోతి - కృష్ణం వందే జగద్గురుం.

మాల - ఉగ్గు వెట్టరే వోయమ్మా

భావన - కృష్ణయ్య పుట్టినరోజు పండగ

పి.ఎస్.ఎం.లక్ష్మి- కృష్ణాష్టమి

పరిమళం - కృష్ణప్రేమ

సుభద్ర - జో అచ్యుతానంద

గీతాచార్య - చిన్ని కృష్ణుని అలక

సృజన రామానుజన్ -దారి తప్పిన కథ

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008