Friday, 29 April 2011

మనల్ని మనం అర్పించుకుందాం - కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ మే 2011 ఎడిటోరియల్

అణుకువగా ఒదిగి ఉండడంలో ఉన్నంత సంతృప్తి మరెక్కడా కానరాదు.. ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రేమ ముందూ, మానవత్వం నరనరానా తొణికిసలాడే మనుషుల ముందూ ప్రణమిల్లాలన్పిస్తుంది తప్ప దర్పం ఒలకబోయబుద్ధి కాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా మన శ్రేయస్సుకై తపనపడే ఆత్మీయుల రుణం ఏ విధంగా తీర్చుకోగలం.. మనల్ని మనం మానసికంగా అర్పించుకోవడం తప్ప? మన మొహంలో వెలుగుని చూసి సంబరపడిపోయే ఆత్మీయమూర్తుల్ని ఏమని విశ్లేషించగలం.. విశ్లేషణని కట్టిపెట్టి మనసుతో స్పృశించకుండా! మనకు తెలియకుండానే మనం సురక్షితమైన హస్తాల్లో రక్షించబడి ఉంటున్నాం. ఎందరో బంధువులూ, స్నేహితులూ మన శ్రేయస్సుని మనసారా కాంక్షిస్తున్నారు కాబట్టే మనం దిగ్విజయంగా జీవించగలుగుతున్నాం. ఏవో ఉరుకులు పరుగుల్లో క్షణం కూడా ఆలోచించే తీరిక లేకపోవడం వల్ల మన చుట్టూ పెనవేసుకుపోయిన అద్భుతమైన అనుబంధాలను మనం గ్రహించలేకపోతున్నాం. కొండొకచో గ్రహించగలిగినా మనం ఆదరణని కోరుకునేది కొందరి వద్దయితే.. ఆ ఆదరణ లభించేది మరికొందరి వద్ద కావడం వల్ల మనసారా స్వీకరించలేక ఆదరించే వారినే చిన్నచూపు చూస్తున్నాం.

ప్రేమ, ఆదరణ విశ్వజనీయమైనవి. మనం అందమైన రూపాల్లోనో, వ్యాపారాత్మక బంధాల్లోనో వాటిని వెదుక్కునంత కాలం నిరుత్సాహమే మిగులుతుంది. బోసి నవ్వుతో మనసారా పలకరించే ముసలవ్వని అరక్షణం తీక్షణంగా గమనిస్తే ఎంతటి ఆత్మీయత ఆ నవ్వులో ఉట్టిపడుతోందో అర్థమవ్వదూ..? ఎందరో మనపై దిగుళ్లు పెట్టుకుంటూ ఉంటారు.. దిగులుపడడం వారి తప్పన్నట్లు కసురుకుని చిన్నబుచ్చుతాం గానీ మన గురించి అంతగా ఆలోచించే మనుషులు ఉన్నందుకు ఒక్క క్షణమైనా వారిని హృదయానికి హత్తుకోగలుగుతున్నామా? ప్రతీ మనిషిలోనూ భగవంతుడు సున్నితత్వాన్నీ మేళవించాడు. మనం భ్రమిస్తున్నట్లు ప్రపంచం మొత్తం అన్యాయాలూ, అక్రమాలూ, ద్వేషాలూ, పగలూ, ఈర్ష్యాసూయలు నిండిపోలేదు. మనుషులం మనమే సమాజంలోని సుగుణాల్ని చెప్పుకుంటూ సంతోషంగా బ్రతకడం మానేసి ఏ మూలనో ఇరుక్కుని బ్రతికేలా అభద్రతను మూటగట్టుకుంటున్నాం. పక్క మనిషి యొక్క స్వచ్ఛమైన నవ్వుని ఆస్వాదించలేకపోతున్నామంటే.. ఇంకా మనుషులు మన హృదయాలకు చేరువయ్యేదెప్పుడు? నిశితంగా గమనిస్తే ప్రతీ క్షణమూ మనకు అద్భుతంగా మలచబడి ఉంటుంది.. ఆ క్షణాన్ని సదా మన శ్రేయస్సుని కాంక్షించే ఆత్మీయుల మనోఃబలంతో ఆస్వాదించగలుగుతున్నామా లేక మనల్ని ఒక్కర్నే ప్రపంచంలో ఒంటరిని చేసుకుని ఏకాకిగా ఎదుర్కోవడానికి పోరాడుతున్నామా అన్న దాని మీదే మనం అనుభవాలు ఆధారపడి ఉంటాయి. ఒక్కటి మాత్రం నిజం.. తమకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా.. మనల్ని మనగా అభిమానిస్తూ తమ ఆశీర్వచనాలు నిరంతరం అందజేసే దైవస్వరూపులైన ఆత్మీయులు మనతో ఉన్నంతకాలం, వారికి మనం మనసారా అర్పించుకోగలిగినంత కాలం మనం చాలా సురక్షితంగా ఉంటాం. మనం చేయవలసిందల్లా అటువంటి ఆత్మీయుల్ని మనసుకి దగ్గరగా తీసుకోవడమే!

మీ
నల్లమోతు శ్రీధర్

Wednesday, 27 April 2011

కంప్యూటర్లో చందమామ



కంప్యూటర్లో చందమామ


తోకచుక్క, మకర దేవత, ముగ్గురు మాంత్రికులు, విచిత్ర కవలలు, రూపధరుడి యాత్రలు, రాకాసి లోయ, పాతాళ దుర్గం, రాతి రథం, యక్ష పర్వతం .. ఈ పేర్లు చూస్తుంటే మీకేమైనా గుర్తొస్తుందా?? అందమైన చిత్రాలతో, ఆసక్తికరమైన కథనంతో, సరళమైన బాషతో చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతీ నెలా ఎదురుచూసేలా చేసే చందమామ కథలు ఇవి. మన తెలుగుబాషలోనే కాక భారతదేశంలోని పద్నాలుగు భాషలలో ప్రచురింపబడుతున్న చందమామ పత్రిక ఎంతోమంది బాల్యస్మృతులలో నేటికి సజీవంగా ఉంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆరు దశాబ్దాల క్రితం పిల్లల పత్రికగా మొదలైన చందమామను ప్రస్తుతం 70, 80 ఏళ్ల పైబడిన వారు ఇప్పటికీ కొని చదువుతూ తమ మనవళ్లు, మనవరాళ్లకు వాటిని చదివి వినిపిస్తున్నారు. ఈరోజు పిల్లలను రాముడు, శూర్పణఖ, భేతాలుడు ఎవరు అని అడిగితే తెల్లమొహం వేస్తారు. అదే స్పైడర్ మాన్, పవర్ రేంజర్స్, బ్యాట్ మాన్ , హ్యారి పోటర్ గురించి అడిగితే ఒక్క లైన్ పొల్లుపోకుండా చెప్పేస్తారు.అవే వింతలు, అద్భుతాలు, మనమూ చిన్నప్పుడే చదివేసాం అంటే నమ్ముతారా?? నమ్మరు.కాని చందమామ పత్రికలో మనం నేర్చుకున్న కథలు, పురాణాలు, జాతక కథలు మర్చిపోగలమా? పుస్తకం రాగానే ఇంట్లో ఎవరు ముందు చేజిక్కించుకుంటారా అని గొడవ జరగని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో? కాని ఇప్పటి తరానికి తమ చదువులకే సమయం సరిపోవడం లేదు. ఇక చందమామలాంటి పత్రికలు ఎప్పుడు కొని చదువుతారు? కాని కంప్యూటర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ చందమామ పత్రిక కూడా చాలా సులువుగా చదువుకోవచ్చు. అలనాటి కథలు , సీరియల్లు కూడా చదవడానికి అందుబాటులో ఉంచారు కొందరు చందమామ ప్రియులు. చంపి (ఎంపి కి పోటీగా, అంతకన్నా ఇంకా గౌరవప్రదంగా పేరు వెనుక తగిలించుకోదగిన బిరుదు) చంపి అంటే చందమామ పిచ్చోళ్లు అని తమకు తామే గర్వంగా చెప్పుకుంటున్నారు.



క్రమంలోనే చందమామ కోసం ఒక వెబ్ సైట్ (http://www.chandamama.com/) కూడా నిర్వహించబడుతుంది. అందులో చందమామ పత్రికకు సంబంధించిన వ్యక్తుల అనుభవాలు, అప్పటి రాతలు, చిత్రాలు, చందమామ పాఠకులు తమ జీవితంతో పెనవేసుకున్న పత్రిక ముచ్చట్లను కూడా పంచుకుంటున్నారు. పాత చందమామ పత్రికలు, ధారావాహికలను ఎవరైనా సులువుగా డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచారు. 1947 నుంచీ 2006 దాకా చందమామలు అన్నీ ఇంటర్నెట్ లైబ్రరీ లో ఉన్నాయి. చిన్నప్పుడు ఎన్నోసార్లు చదివిన పుస్తకాలు, బొమ్మలు, అడ్వర్టయిజ్మెంట్లతో సహా ఇప్పటికీ చాలామంది కళ్ళముందు ఉన్నాయి. అవే పుస్తకాలు మళ్ళీ ఇప్పుడు నెట్‌లో చూసుకుంటుంటే ఒక నోస్టాల్జియాతప్పకుండా ఆవహిస్తుంది. మరికొన్ని పాత చందమామ కథలు. సీరియళ్లను శివరామప్రసాద్ గారు ఇక్కడ తన బ్లాగులో కూడా అందిస్తున్నారు.. http://saahitya-abhimaani.blogspot.com/

Monday, 25 April 2011

వేమన వీరబ్రహ్మం





















సమాజంలోని లోటుపాట్లు, తప్పులను ఎత్తిచూపుతూ నిరర్ధకమైన కార్యములను నిరసించి దివ్యప్రబోదాలు చేసిన ఇద్దరు మహనీయులు వేమన, వీరబ్రహ్మం గురించిన వ్యాసం మాలిక పత్రికలో

Saturday, 23 April 2011

తెలుగుకు పట్టిన తెగులు


ఈ ప్రకటన ఇక్కడ ఎందుకుంది అంటారా?? కాస్త పై చిత్రంలో తేడాగా ఏదైనా కనిపిస్తుందా చూడండి. ఎవరికైనా ఈ కంపెనీ వాడి మార్కెటింగ్ శాఖ నంబర్ ఉంటే మాట్లాడండి. లేదా కనుక్కోండి. వాడి సంగతి తేలుద్దాం. నాకైతే వాడిని తన్నాలనిపిస్తుంది. ఈ ప్రకటన ఎక్కడ కనిపించింది అంటారా??.. ఇది చూడండి.

హమ్మయ్యా! ఎలాగైతేనేమి ఈ ప్రకటనలో తెలుగును సరిదిద్దారు.. ఇక్కడ చూడండి..

Wednesday, 20 April 2011

పద్యం...




http://padyam.net


పద్యం...

పద్యాలనే గుఱ్ఱాలు పత్రికలలోనే కాక అంతర్జాలంలో కూడా వేగంగా పరుగులెత్తుతున్నాయి. అంతర్జాల పత్రికలలో పద్యాలకై ప్రత్యేక శీర్షికలు, పండగవేళల్లో భువనవిజయ సభలు ఎంతో ఆదరణ పొందుతున్నాయి. అదేవిధంగా పద్య సంబందిత బ్లాగులు కూడా వృద్ది చెందుతున్నాయి. పద్యాలు రాయడమే కాదు, ఔత్సాహికుల కోసం పద్యరచన గురించి సులభమైన రీతిలో వివరిస్తున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా అంతర్జాలంలో పద్యాలకై ఒక ప్రత్యెకమైన ఆవరణ ఎర్పాటు చేసారు. అదే "పద్యం".

అంతర్జాలానికి కొత్తగా వచ్చిన పద్యప్రియులకి, ఇక్కడున్న పద్యసంపద గురించి వీలైనంత సమగ్ర సమాచారం అందించడం.ఇప్పటికే అంతర్జాలంలో వివిధ రూపాల్లో ఉన్న పద్యసాహిత్యాన్ని యూనీకోడీకరించడం అనేది పద్యం వెబ్ సైటు ప్రధాన ఉద్ధేశ్యం. ప్రస్తుతానికి దీని పరిధి చాలా పరిమితం. అక్కడక్కడా పరచుకుని ఉన్న వివిధ వెబ్ సైట్లలో ఉన్న పద్యాలని, ఆయా ఓనర్ల అనుమతితో, యూనికోడులోకి తర్జుమా చెయ్యడమే ప్రస్తుతానికి వారు చేస్తున్న పని. అంతర్జాలంలో లేని, కాపీరైట్ల సమస్య లేని పద్యసాహిత్యాన్ని యూనీకోడులో ఇక్కడ భద్రపరచడం. కొత్తగా పద్యాలు రాసేవాళ్ళకి తగిన సూచనలిచ్చి ప్రోత్సహించడం అనే ఉద్ధేశ్యంతో ఈ వేదిక ప్రారభించబడి, విజయవంతంగా ముందుకు సాగిపోతుంది.


ప్రస్తుతానికి ఈ సైటులోని విభాగాలు ఇవి:


1. ఛందః మంజూష ఇది ఛందస్సు గురించిన సమాచార సమాహారం. పైన చెప్పినట్లు, ప్రాథమిక సమాచారానికి ఇక్కడనుంచి వికీకి లంకెలుంటాయి. ఛందస్సు గురించిన ప్రత్యేక విషయాలేమైనా వ్యాసాల రూపంలో ఇక్కడుంటాయి.


2. పద్య మంజూష - పద్య సాహిత్య సమాహారం. కాపీరైటులేని ప్రాచీన ఆధునిక పద్య కవిత్వం ఇక్కడ చదవవచ్చు.


3. వ్యాస మంజూష - పద్య సాహిత్యం గురించిన పరిచయ, సమీక్ష, విమర్శ వ్యాసాల సమాహారం ఇది.


4. పద్యాలతో కసరత్తు అంతర్జాలంలో పద్యకవులు పాల్గొనేలా రెండువారాల కొకసారి ఒక సమస్యాపూరణమో, దత్తపదో, వర్ణనో, అనువాదమో ఇవ్వబడుతుంది.


పైవన్నీ బ్లాగు టపాల రూపంలో ఉంటాయి. ఇవి కాక ఈ సైటులో ఉండే మరో రెండు అంశాలు:


1. బ్లాగు మంజూష ఇది పద్య సంబంధి బ్లాగుల సమాహారం.


2. చర్చా వేదిక - ఈ సైటు గురించి కాని, ఛందస్సు గురించి కాని, పద్యాల గురించి కాని పాఠకులు చర్చించేందుకు ఇది వేదిక.


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008